యెహెజ్కేలు
36 “మానవ కుమారుడా, నువ్వు ఇశ్రాయేలు పర్వతాల గురించి ఇలా ప్రవచించు, ‘ఇశ్రాయేలు పర్వతాల్లారా, యెహోవా చెప్పేది వినండి. 2 సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “శత్రువు మీ గురించి, ‘ఆహా! ప్రాచీన ఉన్నత స్థలాలు కూడా మా సొంతమయ్యాయి!’ అని అన్నాడు.” ’+
3 “కాబట్టి నువ్వు ప్రవచించి ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “వాళ్లు మిమ్మల్ని నిర్జనంగా చేసి, అన్నివైపుల నుండి మీ మీద దాడిచేసి, జనాల్లో మిగిలినవాళ్లు మిమ్మల్ని స్వాధీనం చేసుకునేలా, ప్రజలు మీ గురించి లేనిపోనివి చెప్పుకునేలా చేశారు కాబట్టి,+ 4 ఇశ్రాయేలు పర్వతాల్లారా, సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్పేది వినండి! పర్వతాలతో, కొండలతో, వాగులతో, లోయలతో, నిర్జనంగా పడివున్న శిథిలాలతో,+ దోచుకోబడి చుట్టుపక్కల జనాల్లో మిగిలినవాళ్ల చేత ఎగతాళి చేయబడిన పాడైన నగరాలతో+ సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు; 5 సర్వోన్నత ప్రభువైన యెహోవా వాటితో ఏమంటున్నాడంటే: ‘నేను రోషాగ్నితో+ జనాల్లో మిగిలినవాళ్లకు, ఎదోము వాళ్లందరికి వ్యతిరేకంగా మాట్లాడతాను; నా దేశంలోని పచ్చికబయళ్లు ఆక్రమించుకోవాలని, దేశాన్ని దోచుకోవాలని వాళ్లు ఎంతో సంతోషంతో, విపరీతమైన ద్వేషంతో+ దాన్ని తమ సొత్తు అని చెప్పుకున్నారు.’ ” ’+
6 “కాబట్టి ఇశ్రాయేలు దేశం గురించి ప్రవచిస్తూ పర్వతాలతో, కొండలతో, వాగులతో, లోయలతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “మీరు జనాల అవమానాన్ని భరించారు కాబట్టి,+ ఇదిగో! నేను రోషంతో, కోపంతో మాట్లాడతాను.” ’
7 “కాబట్టి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘చుట్టుపక్కల జనాలు కూడా తమ అవమానాన్ని భరిస్తాయని+ నేను చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను. 8 అయితే ఇశ్రాయేలు పర్వతాల్లారా, మీరు నా ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం కొమ్మలు వేసి ఫలాలు ఇస్తారు;+ ఎందుకంటే వాళ్లు త్వరలోనే తిరిగొస్తారు. 9 నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీ వైపుకు తిరుగుతాను, మీరు సాగుచేయబడతారు, మీలో విత్తనాలు విత్తుతారు. 10 నేను మీ ప్రజల్ని అంటే ఇశ్రాయేలు ఇంటివాళ్లందర్నీ వృద్ధి చేస్తాను; నగరాల్లో మళ్లీ ప్రజలు నివసిస్తారు,+ శిథిలాలు మళ్లీ కట్టబడతాయి.+ 11 అవును, నేను మీ ప్రజల్ని, పశువుల్ని వృద్ధి చేస్తాను;+ వాళ్ల సంఖ్య, వాటి సంఖ్య ఎక్కువయ్యేలా చేస్తాను. ముందులాగే మళ్లీ మీలో ప్రజలు నివసించేలా,+ మీరు గతంలో కన్నా ఎక్కువగా వృద్ధి అయ్యేలా చేస్తాను;+ అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.+ 12 మళ్లీ మీ మీద ప్రజలు అంటే నా ప్రజలైన ఇశ్రాయేలీయులు నడిచేలా చేస్తాను, వాళ్లు మిమ్మల్ని స్వాధీనం చేసుకుంటారు.+ మీరు వాళ్ల సొత్తు అవుతారు, మీరు ఇంకెప్పుడూ వాళ్లను పిల్లలు లేనివాళ్లుగా చేయరు.’ ”+
13 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘వాళ్లు మీతో, “నువ్వు ప్రజల్ని మింగేసే, నీ జనాల్ని పిల్లలు లేకుండా చేసే దేశానివి” అని అంటున్నారు కాబట్టి’ 14 సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు, ‘నువ్వు ఇక ప్రజల్ని మింగేయవు, నీ జనాల్ని పిల్లలు లేనివాళ్లుగా చేయవు. 15 నేను నిన్ను ఇక జనాల చేతిలో అవమానాలపాలు చేయను, ప్రజల నిందల్ని భరించేలా చేయను,+ నువ్వు ఇక నీ జనాల్ని తడబడేలా చేయవు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.”
16 తర్వాత యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 17 “మానవ కుమారుడా, ఇశ్రాయేలు ఇంటివాళ్లు తమ దేశంలో నివసించినప్పుడు వాళ్లు తమ మార్గాలతో, పనులతో దాన్ని అపవిత్రం చేశారు.+ వాళ్ల మార్గాలు నా దృష్టిలో రుతుస్రావ అపవిత్రతలా ఉన్నాయి.+ 18 వాళ్లు దేశంలో రక్తం చిందించారు, తమ అసహ్యమైన విగ్రహాలతో* దేశాన్ని అపవిత్రం చేశారు+ కాబట్టి నేను వాళ్లమీద నా ఉగ్రతను కుమ్మరించాను.+ 19 వాళ్లను జనాల మధ్యకు, దేశాల మధ్యకు చెదరగొట్టాను;+ వాళ్ల మార్గాల్ని బట్టి, పనుల్ని బట్టి వాళ్లకు తీర్పు తీర్చాను. 20 అయితే వాళ్లు ఆ జనాల్లోకి వెళ్లినప్పుడు, ప్రజలు వాళ్ల గురించి, ‘వీళ్లు యెహోవా ప్రజలు, కానీ ఆయన తన దేశం నుండి వీళ్లను చెదరగొట్టాడు’ అని అంటూ నా పవిత్రమైన పేరును అపవిత్రపర్చారు.+ 21 కాబట్టి ఇశ్రాయేలు ఇంటివాళ్లు తాము వెళ్లిన జనాల మధ్య అపవిత్రపర్చిన నా పవిత్రమైన పేరు కోసం నేను చర్య తీసుకుంటాను.”+
22 “కాబట్టి ఇశ్రాయేలు ఇంటివాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, మీ కోసం కాదు, మీరు వెళ్లిన జనాల మధ్య మీరు అపవిత్రపర్చిన నా పవిత్రమైన పేరు కోసం నేను చర్య తీసుకుంటున్నాను.” ’+ 23 ‘జనాల మధ్య అపవిత్రపర్చబడిన, వాళ్ల మధ్య మీరు అపవిత్రపర్చిన నా గొప్ప పేరును నేను ఖచ్చితంగా పవిత్రపర్చుకుంటాను;+ నేను వాళ్ల కళ్లముందు మీ మధ్య పవిత్రపర్చబడినప్పుడు, నేను యెహోవానని ఆ జనాలు తెలుసుకుంటాయి’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు. 24 ‘నేను ఆ జనాల్లో నుండి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను, ఆ దేశాలన్నిటి నుండి మిమ్మల్ని సమకూర్చి మీ దేశానికి తీసుకొస్తాను.+ 25 నేను మీ మీద శుద్ధీకరించే నీళ్లు చల్లుతాను, మీరు శుద్ధి అవుతారు;+ మీ అపవిత్రత అంతటి నుండి, మీ అసహ్యమైన విగ్రహాలన్నిటి+ నుండి నేను మిమ్మల్ని పవిత్రపరుస్తాను.+ 26 నేను మీకు ఒక కొత్త హృదయాన్ని,+ కొత్త మనోవైఖరిని ఇస్తాను.+ మీ శరీరాల్లో నుండి రాతి గుండె+ తీసేసి మీకు మాంసం గుండె* ఇస్తాను. 27 నా పవిత్రశక్తిని* మీలో ఉంచి, మీరు నా నియమాల ప్రకారం నడుచుకునేలా చేస్తాను,+ మీరు నా న్యాయనిర్ణయాల్ని పాటిస్తూ, వాటి ప్రకారం జీవిస్తారు. 28 నేను మీ పూర్వీకులకు ఇచ్చిన దేశంలో మీరు నివసిస్తారు, మీరు నా ప్రజలుగా ఉంటారు, నేను మీ దేవుడిగా ఉంటాను.’+
29 “ ‘మీ అపవిత్రత అంతటి నుండి నేను మిమ్మల్ని రక్షిస్తాను, సమృద్ధిగా పండమని మీ ధాన్యానికి ఆజ్ఞాపిస్తాను, నేను మీ మీదికి కరువును రప్పించను.+ 30 చెట్లు ఎక్కువ పండ్లను, భూమి సమృద్ధిగా పంటను ఇచ్చేలా చేస్తాను, మీరు ఇంకెప్పుడూ కరువువల్ల జనాల మధ్య అవమానాలపాలు అవ్వరు.+ 31 అప్పుడు మీరు మీ చెడ్డమార్గాల్ని, చెడ్డపనుల్ని గుర్తుచేసుకుంటారు; మీ దోషాన్ని బట్టి, మీ హేయమైన పనుల్ని బట్టి మీ మీద మీకే అసహ్యం వేస్తుంది.+ 32 అయితే ఈ విషయం తెలుసుకోండి: నేను ఇదంతా చేసేది మీ కోసం కాదు’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు. ‘ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, మీ మార్గాల్ని బట్టి సిగ్గుపడండి, అవమానంతో బాధపడండి.’
33 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను మీ దోషమంతటి నుండి మిమ్మల్ని శుద్ధి చేసే రోజున, మీ నగరాల్లో మళ్లీ ప్రజలు నివసించేలా,+ శిథిలాలు మళ్లీ కట్టబడేలా చేస్తాను.+ 34 దారిన పోయే వాళ్లందరి కళ్లముందు నిర్జనంగా పడివున్న దేశం మళ్లీ సాగుచేయబడుతుంది. 35 అప్పుడు ప్రజలు ఇలా అంటారు: “నిర్జనంగా ఉన్న దేశం ఏదెను తోటలా+ తయారైంది; పడగొట్టబడి నిర్జనంగా, శిథిలాలుగా ఉన్న నగరాల్లో మళ్లీ ప్రజలు నివసిస్తున్నారు, వాటి చుట్టూ ప్రాకారాలు ఉన్నాయి.”+ 36 అప్పుడు మీ చుట్టుపక్కల మిగిలిన జనాలు, యెహోవానైన నేనే పడగొట్టబడినదాన్ని తిరిగి కట్టానని, నిర్జనంగా ఉన్నదానిలో చెట్లు నాటానని తెలుసుకుంటాయి. యెహోవానైన నేనే ఈ మాట చెప్పాను, దాన్ని నెరవేర్చాను.’+
37 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘అంతేకాదు ఇశ్రాయేలు ఇంటివాళ్లు, తమను గొర్రెల మందలా వృద్ధి చేయమని నన్ను వేడుకోనిస్తాను. 38 శిథిలాలుగా మారిన నగరాలు పవిత్రుల సమూహంలా, యెరూషలేము పండుగ సమయాల్లో+ దాని గొర్రెల మందలా* ప్రజలతో నిండిపోతాయి;+ అప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.’ ”