కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 1/8 పేజీలు 22-25
  • లూయీ పాశ్చర్‌ అతని పరిశోధన రుజువు చేసిన విషయం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • లూయీ పాశ్చర్‌ అతని పరిశోధన రుజువు చేసిన విషయం
  • తేజరిల్లు!—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • తొలి పరిశోధన
  • పాశ్చరీకరణం
  • జీవం నుండే జీవం వస్తుంది
  • అంటువ్యాధులకు విరుద్ధంగా పోరాటం
  • విలువైన పరిశోధన
  • బైబిలు అసంగతమైనదా?
    తేజరిల్లు!—1994
  • ఆధునిక వైద్యం—ఎంత ఎత్తుకి చేరుకోగలదు?
    తేజరిల్లు!—2001
  • అనారోగ్యాన్ని గురించిన మర్మం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
తేజరిల్లు!—1997
g97 1/8 పేజీలు 22-25

లూయీ పాశ్చర్‌ అతని పరిశోధన రుజువు చేసిన విషయం

ఫ్రాన్స్‌లోని తేజరిల్లు! విలేఖరి ద్వారా

జీవమనేది స్వయంభువ జీవ జననం మూలంగా రాగలదా? 19వ శతాబ్దంలో, కొంతమంది శాస్త్రజ్ఞులు ఆ విధంగా తలంచారు. సృష్టికర్త ప్రమేయం లేకుండానే నిర్జీవ పదార్థాలనుండి జీవం దానంతటదే ఉద్భవించగలదని వారు భావించారు.

అయితే, 1864లో ఏప్రిల్‌ మాసంలోని ఒక వసంతకాలపు సాయంకాల సమయంలో పారిస్‌లోని సార్బోని విశ్వవిద్యాలయమందున్న ఓ సమావేశమందిరంలో హాజరైన ప్రేక్షకులు ఎంతో భిన్నమైన విషయాన్ని విన్నారు. వైజ్ఞానికుల సమావేశం ఎదుట ఒక నైపుణ్యవంతమైన ప్రసంగంలో, లూయీ పాశ్చర్‌ స్వయంభువ జీవ జనన సిద్ధాంతంలో ఒక్కొక్క అంశాన్నీ చర్చించి దాన్ని విజయవంతంగా త్రిప్పికొట్టాడు.

ఈ ప్రసంగం మరియు తర్వాతి పరిశోధనలు అతన్ని “ప్రపంచంలోని అతి గొప్ప వైజ్ఞానికుల్లో ఒకన్ని” చేశాయని ది వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపేడియా చెప్పింది. అయితే ఈ వ్యక్తి తన కాలంలోని వారిపై అలాంటి ప్రభావాన్ని ఎందుకు చూపాడు మరియు అతను ప్రపంచవ్యాప్తంగా ఎలా ప్రసిద్ధికెక్కాడు? అతని పరిశోధనల్లో కొన్నిటి ద్వారా మనం ఇప్పుడు ఏ విధంగా ప్రయోజనం పొందుతాము?

తొలి పరిశోధన

లూయీ పాశ్చర్‌ 1822లో, ఫ్రాన్స్‌ తూర్పు భాగంలో ఉన్న డోల్‌ అనే చిన్న పట్టణంలో జన్మించాడు. చర్మకారుడైన అతని తండ్రి తన కుమారుని విషయమై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కళ ఎడల ఆసక్తి కలిగి ఉన్నప్పటికీ వాస్తవమైన కళా నిపుణత అతనిలో ఉన్నప్పటికీ లూయీ విజ్ఞాన శాస్త్ర అధ్యయనాన్ని చేపట్టాడు. అతను 25 ఏళ్ల వయస్సులోనే విజ్ఞాన శాస్త్రంలో డాక్టరేట్‌ పట్టాను అందుకున్నాడు.

అతని తొలి పరిశోధన టార్టారిక్‌ ఆమ్లాన్ని గురించినది, ఆ ఆమ్లం ద్రాక్షాసారాయి బానల్లో అడుగున మిగిలిన మడ్డిలో ఉండే ఒక మిశ్రమ పదార్థము. ఆ పరిశోధనా ఫలితాలను, ఆధునిక జీవరసాయన శాస్త్రానికి పునాదులు వేసేందుకు కొన్ని సంవత్సరాల తర్వాత ఇతర పరిశోధకులు ఉపయోగించుకున్నారు. తర్వాత పాశ్చర్‌ పులియజేసే వాటిని గురించిన అధ్యయనం వైపు తన అవధానాన్ని మళ్లించాడు.

పాశ్చర్‌ యొక్క పరిశోధనకు ముందు, ఈస్ట్‌ వంటి పులియజేసే పదార్థాల ఉనికి గురించి తెలుసు. కానీ అవి పులియబెట్టడం వలన వచ్చిన ఫలితమని భావించబడింది. అయితే, పులియజేసే ఈ పదార్థాలు పులియబెట్టడం మూలంగా వచ్చినవి కాక పులియజేసేందుకు అవే అసలు కారకములని పాశ్చర్‌ నిరూపించాడు. పులియజేసే ఒక్కో విధమైన పదార్థం, ఒక్కో విధంగా పులియజేస్తుందని అతను చూపించాడు. ఈ విషయాన్ని గురించి అతను 1857లో ప్రచురించిన నివేదిక నేడు “సూక్ష్మజీవశాస్త్రం యొక్క జన్మ పత్రంగా” దృష్టించబడుతుంది.

అప్పటి నుండి, అతని పనులు మరియు పరిశోధనలు ఎక్కువవ్వడం ప్రారంభించాయి. అతని పేరు ప్రతిష్ఠల కారణంగా, ఆర్‌లేన్స్‌లోని వినిగర్‌ ఉత్పాదకులు తమ అనేక సాంకేతిక సమస్యల పరిష్కారం కొరకు అతన్ని దర్శించేవారు. వైన్‌ వినిగర్‌గా మారేందుకు, ద్రవం యొక్క ఉపరితలంపై ఉండే ఒక ఏజెంటు మూల కారణమని పాశ్చర్‌ రుజువుచేశాడు. అది ఇప్పుడు ఒక సూక్ష్మజీవి అని పిలువబడుతుంది. అతని పరిశోధన చివరిలో, పట్టణం యొక్క వినిగర్‌ ఉత్పాదకులు మరియు ప్రముఖుల ఎదుట తన ప్రఖ్యాత “వైన్‌ వినిగర్‌లపై పాఠం”ను అతను సమర్పించాడు.

పాశ్చరీకరణం

పులిసిపోవడాన్ని గురించిన పాశ్చర్‌ పరిశోధన, ఆహారపరిశ్రమలో తలెత్తే ఆహారం పాడయ్యే అనేక సమస్యల్లో అనేకం మైక్రోబ్‌ల మూలంగానేనని తేల్చి చెప్పేందుకు అతనికి వీలు కలిగించింది. మైక్రోబ్‌లు గాలిలో లేక సరిగ్గా కడగని పాత్రల్లో ఉంటాయి. పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చడం ద్వారా ఆహార ఉత్పాదకాలు బ్యాక్టీరియా ద్వారా పాడవ్వడాన్ని నివారించవచ్చని మరియు కొన్ని నిమిషాలపాటు ఉష్ణోగ్రతను 50 నుండి 60 డిగ్రీల సెల్సియస్‌ మధ్యన ఉంచడం ద్వారా ద్రవాలు పాడవ్వడాన్ని నివారించవచ్చని పాశ్చర్‌ సూచించాడు. విపరీతంగా పులిసిపోకుండా ఎలా నివారించాలో చూసేందుకు మొదట ఈ పద్ధతిని వైన్‌పై ఉపయోగించారు. రుచిలో లేక దాని సహజ సువాసనలో ఎక్కువ తేడా లేకుండా ముఖ్యమైన మైక్రోబ్‌లు చంపబడ్డాయి.

పాశ్చర్‌ విశిష్టాధికారపత్రం పొందిన, పాశ్చరీకరణం అని పిలువబడే ఈ ప్రక్రియ ఆహార పరిశ్రమలో సంచలనాన్ని సృష్టించింది. వైన్‌ను తయారు చేసేందుకు నేడు ఈ ప్రక్రియ ఉపయోగించబడనప్పటికీ పాలు మరియు పళ్ళ రసాలవంటి ఇతర అనేక ఉత్పాదకాల విషయంలో అది ఎంతో ఉపయుక్తంగా ఉంది. అయితే, అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలో స్టెరిలైజ్‌ చేయడం వంటి ఇతర పద్ధతులను కూడా ఉపయోగించవచ్చు.

పాశ్చర్‌ యొక్క పరిశోధన ద్వారా ప్రయోజనం పొందగల మరొక పెద్ద పరిశ్రమ సారాయి పరిశ్రమ. ఆ కాలంలో ఫ్రెంచి వారికి అనేక ఉత్పాదక సమస్యలు ఉండేవి, జర్మన్‌ వారినుండి గట్టి పోటీ ఉండేది. పాశ్చర్‌ వీటికి ప్రాధాన్యతనిచ్చి సారాయి పరిశ్రమలకు ఎన్నో సలహాలనిచ్చాడు. సారాయి కాసే ద్రవంపట్ల అలాగే ఆ చుట్టు ప్రక్కల గాలి మామూలుగా స్వచ్ఛంగా ఉండటంపట్ల వారు శ్రద్ధ వహించాలని అతను సలహా ఇచ్చాడు. వారు సత్వర విజయాన్ని సాధించారు, మరి అతనికి అప్పటినుండి అనేక విశిష్టాధికార పత్రాలు లభించాయి.

జీవం నుండే జీవం వస్తుంది

అనాది కాలంనుండి, పాడైపోతున్న పదార్థంలో కీటకాలు, పురుగులు లేక ఇతర జీవులు కనిపించడాన్ని గురించి వివరించేందుకు అత్యంత తమాషా తలంపులు ప్రతిపాదించబడ్డాయి. ఉదాహరణకు, గోధుమల జార్‌లో ఒక మాసిన చొక్కాను పెట్టడం ద్వారా తాను ఎలుకలు పుట్టేలా చేశానని 17వ శతాబ్దంలో బెల్జియమ్‌కు చెందిన ఓ మందుల వ్యాపారి ప్రగల్భాలు పలికాడు.

పాశ్చర్‌ కాలంలో వైజ్ఞానికుల సమాజంలో దానికి సంబంధించిన వాదన తీవ్రంగా చెలరేగింది. స్వయంభువ జీవ జనన సిద్ధాంతాన్ని సమర్థించే వారిని ఎదుర్కొనడం వాస్తవంగా ఒక సవాలులా ఉండేది. అయితే పులియబెట్టడాన్ని గురించిన తన పరిశోధనలో తాను నేర్చుకున్న వాటి ఫలితంగా, పాశ్చర్‌కు దృఢ నమ్మకం ఉంది. కాబట్టి స్వయంభువ జీవ జనన సిద్ధాంతానికి శాశ్వతంగా స్వస్తి చెప్పాలన్న సంకల్పంతో అతను ప్రయోగాలు జరిపాడు.

హంసమెడ ఆకారమున్న మూతిగల ఫ్లాస్కును ఉపయోగించి అతను చేసిన ప్రయోగం అతని ప్రయోగాల్లో ఎంతో ప్రఖ్యాతి గాంచినది. తెరచి ఉండే మూతిగల ఫ్లాస్కులో వదిలేయబడిన ద్రవ పదార్థం క్రిముల ద్వారా చాలా త్వరగా కలుషితమౌతుంది. అయితే, హంసమెడ ఆకారమున్న మూతిగల ఫ్లాస్కులో భద్రపర్చబడినప్పుడు, అదే ద్రవ పదార్థం కలుషితం కాకుండా ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుంది?

పాశ్చర్‌ వివరణ సరళమైంది: గాలిలోని బ్యాక్టీరియా హంస మెడవంటి ఆకారంగుండా ప్రవేశించేటప్పుడు, గాజు ఉపరితలంపై పేరుకుపోతుంది, అలా ఆ గాలి ద్రవాన్ని చేరేసరికల్లా వంధ్యమౌతుంది. తెరిచి ఉండే మూతిగల ఫ్లాస్కులో వృద్ధి చెందే క్రిములు ద్రవ పదార్థం ద్వారా వాటంతటవే ఉత్పత్తి కావు గానీ గాలిలో రవాణా చేయబడతాయి.

మైక్రోబ్‌లను రవాణా చేసే దానిగా గాలి యొక్క ప్రాముఖ్యతను చూపేందుకు, ఫ్రెంచ్‌ ఆల్ప్స్‌లోని మెర్‌ డ గ్లాస్‌ అనే ఒక మంచుశిఖరంపైకి పాశ్చర్‌ వెళ్లాడు. 1800 మీటర్ల ఎత్తులో, మూత బిగించి ఉన్న తన ఫ్లాస్కులను అతడు తెరిచి వాటిని గాలికి ఎక్స్‌పోజ్‌ చేశాడు. ఉన్న 20 ఫ్లాస్కుల్లోనూ కేవలం ఒకటే కలుషితమైంది. ఆ తర్వాత అతడు జూరా పర్వతాల పీఠభూమి వద్దకు వెళ్లి అదే ప్రయోగాన్ని మళ్లీ చేశాడు. ఇక్కడ ఎత్తు చాలా తక్కువ ఉన్నందున, ఎనిమిది ఫ్లాస్కులు కలుషితమయ్యాయి. ఎక్కువ ఎత్తులో ఉన్న స్వచ్ఛమైన గాలి మూలంగా కలుషితమయ్యే సాధ్యత తక్కువ ఉందని అతను అలా రుజువు చేశాడు.

జీవం అనేది అంతకు ముందు ఉన్న జీవం నుండే ఉద్భవిస్తుందని అలాంటి ప్రయోగాల ద్వారా పాశ్చర్‌ ఒప్పించే విధంగా ప్రదర్శించాడు. జీవమనేది తనంతట తానే, ఉన్నట్టుండి ఎన్నడూ ఉద్భవించదు.

అంటువ్యాధులకు విరుద్ధంగా పోరాటం

పులియబెట్టడానికి మైక్రోబ్‌లు ఉండటం అవసరం గనుక, అంటు వ్యాధుల విషయంలో కూడా అదే వాస్తవమని పాశ్చర్‌ తర్కించాడు. ఫ్రాన్స్‌కు దక్షిణాన ఉన్న పట్టు ఉత్పత్తిదారులకు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని కలిగించే పట్టు పురుగు వ్యాధికి సంబంధించిన అతని దర్యాప్తులు, అతని తర్కం సరైనదని రుజువు చేశాయి. కేవలం కొన్ని నెలలకే, రెండు వ్యాధులకు కారణాలను అతను కనుగొని, ఆరోగ్యకరమైన పట్టుపురుగులను ఎన్నుకునేందుకు కట్టుదిట్టమైన పద్ధతులను సూచించాడు. ఇది అంటు వ్యాధిని నివారించగలదు.

పక్షులకు సోకే కలరాను గురించి అధ్యయనం చేసేటప్పుడు, కేవలం కొన్ని నెలల వయస్సుగల క్రిమి కల్చర్‌ కోళ్లకు వ్యాధి కలిగించలేదు బదులుగా వాటిని వ్యాధినుండి కాపాడిందని పాశ్చర్‌ గమనించాడు. వాస్తవానికి, పలచని లేక బలహీనమైన రూపంలోని క్రిమి ద్వారా తాను కోళ్లకు వ్యాధి నిరోధక శక్తినివ్వగలడని అతను కనుగొన్నాడు.

టీకాలను ఉపయోగించిన వారిలో పాశ్చర్‌ మొదటివాడేమీ కాదు. ఎడ్వర్డ్‌ జెన్నర్‌ అనే ఆంగ్లేయుడు అతని కంటే ముందు వాటిని ఉపయోగించాడు. అయితే, సంబంధిత మైక్రోబ్‌ను ఉపయోగించే బదులు పల్చని రూపంలో అసలైన వ్యాధి ఏజెంట్‌ను ఉపయోగించడంలో పాశ్చర్‌ మొట్ట మొదటివాడు. గేదెలు మరియు గొర్రెల వంటి, వేడిరక్తంగల జంతువులకు సోకే వ్యాధియైన ఆంథరాక్స్‌కు విరుద్ధంగా తయారు చేయబడిన టీకాల విషయంలో కూడా అతను విజయవంతుడయ్యాడు.

దీని తర్వాత, అతను తన చివరి పోరాటాన్ని సాగించాడు, అది రాబీస్‌కు విరుద్ధంగా అతడు సాగించిన అత్యంత ప్రాధాన్యమైన పోరాటం. అతను దాన్ని తుదముట్టించలేకపోయినప్పటికీ, పాశ్చర్‌ రాబీస్‌ని ఎదుర్కొనేటప్పుడు, బ్యాక్టీరియాకు ఎంతో భిన్నమైన ప్రపంచాన్ని, తనకు తెలియకుండానే ఎదుర్కొన్నాడు. ఇప్పుడు అతను వైరస్‌లతో వ్యవహరిస్తున్నాడు, అది సూక్ష్మదర్శిని ద్వారా అతను చూడలేనటువంటిది.

1885 జూలై 6న, ఒక తల్లి తన తొమ్మిది సంవత్సరాల పిల్లవాన్ని పాశ్చర్‌ లాబొరేటరీకి తెచ్చింది. ఆ పిల్లవాన్ని ఒక పిచ్చి కుక్క అప్పుడే కరిచింది. ఆ తల్లి ఎంత వేడుకున్నప్పటికీ, పాశ్చర్‌ ఆ పిల్లవానికి సహాయం చేసేందుకు సుముఖత చూపలేదు. అతను వైద్యుడు కాదు, చట్టవిరుద్ధంగా వైద్య వృత్తి చేశాడన్న నిందపాలయ్యే ముప్పు తెచ్చుకున్నాడు. అంతేకాక, అతను తన పద్ధతిని మానవులపై ఇంకా ప్రయత్నించలేదు. అయినప్పటికీ, ఆ పిల్లవానికి టీకా ఇవ్వమని పరిశోధనాశాలలో తనతోపాటు వున్న డా. గ్రాన్‌ఛేకు చెప్పాడు. అతడు అలాగే చేశాడు, చక్కని ఫలితం వచ్చింది. ఒక సంవత్సరంకంటే తక్కువ కాలంలో చికిత్స చేయబడిన 350 మంది ప్రజల్లో, కేవలం ఒక వ్యక్తి మాత్రమే చనిపోయాడు, అందున మరీ ఆలస్యంగా తీసుకువచ్చినందు వలన అతడు చనిపోయాడు.

ఈ మధ్యలో, పాశ్చర్‌ ఆసుపత్రి శుభ్రత గురించి ఆలోచిస్తున్నాడు. పారిస్‌నందలి ప్రసూతి ఆసుపత్రిలో ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యల్లో స్త్రీల మరణానికి ప్యురపరల్‌ జ్వరం కారణమౌతుంది. అసెప్టిక్‌ పద్ధతుల గురించి మరియు విశేషంగా చేతుల పారిశుద్ధ్యాన్ని గురించి సలహాలిచ్చాడు. తర్వాత, ఇంగ్లీషు వాడైన జోసఫ్‌ లిస్టర్‌ అనే సర్జన్‌ మరితరులు చేసిన దర్యాప్తులు పాశ్చర్‌ అభిప్రాయాల కచ్చితత్వాన్ని రుజువుచేశాయి.

విలువైన పరిశోధన

పాశ్చర్‌ 1895లో మరణించాడు. అయితే అతని పరిశోధన ఎంతో విలువైనది, దానిలోని కొన్ని అంశాలనుబట్టి మనం నేడు కూడా ప్రయోజనం పొందుతాము. అందుకనే అతను “మానవజాతికి ప్రయోజనం కలిగించినవాడు” అని పిలువబడ్డాడు. అతడు కనిపెట్టాడని సాధారణంగా చెప్పబడుతున్న టీకాలు మరియు ప్రక్రియలతో అతని పేరు ఇంకా ముడిపడివుంది.

రాబీస్‌ చికిత్స కొరకు, పాశ్చర్‌ జీవించి ఉన్నప్పుడే పారిస్‌లో స్థాపించబడిన లాన్‌స్టీట్యూట్‌ పాశ్చర్‌ అంటు వ్యాధుల అధ్యయనం విషయమై నేడు ఎంతో ప్రఖ్యాతి గాంచిన కేంద్రంగా తయారయ్యింది. టీకాలు మరియు మందుల సంబంధంగా దాని పని విషయమై అది విశేషంగా ప్రఖ్యాతి గాంచింది, ప్రొఫెసర్‌ లూక్‌ మాన్‌టాన్‌యే నాయకత్వంలో వైజ్ఞానికుల బృందం 1983లో ఎయిడ్స్‌ వైరస్‌ను మొదటిసారి గుర్తించినప్పటి నుండి అది మరింత పేరు పొందింది.

పాశ్చర్‌ పాల్గొని విజయవంతుడై వచ్చిన, జీవం యొక్క స్వయంభువ జీవ జననను గురించిన వాదన, విజ్ఞాన సంబంధ కలహం మాత్రమే కాదు. కొంతమంది వైజ్ఞానికులు లేక విద్వాంసులు తమ మధ్య చర్చించుకునేందుకు అది వారికి ఆసక్తికరమైన అంశం కన్నా మిన్నగా వుంది. దానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడింది, దేవుని ఉనికికి సంబంధించిన రుజువు అందులో ఇమిడివుంది.

పాశ్చర్‌ “విరోధులు, వస్తు సంపదలపై ఆసక్తిగల వారును నాస్తికులునైయున్నవారు, విచ్ఛేదం చెందబోతున్న అణువుల నుండి బహుకణ జీవి ఉద్భవించగలదని తాము రుజువు చేయగలమని భావించారు. అలా వారు సృష్టికర్త అయిన దేవుడు లేడనేందుకు వీలైంది. అయితే, పాశ్చర్‌కు సంబంధించినంత మేరకు, మరణం నుండి జీవం వచ్చే మార్గమే లేదు” అని విజ్ఞాన శాస్త్రంలో ప్రత్యేక శిక్షణ పొందుతున్న ఒక ఫ్రెంచి తాత్వికుడైన ఫ్రాన్స్‌వా డాగాన్‌యే పేర్కొంటున్నాడు.

ప్రయోగాలు, చరిత్ర, జీవశాస్త్రం, పురావస్తు శాస్త్రం మరియు మానవశాస్త్రం నుండి లభించిన రుజువులు, జీవమనేది ఇదివరకే ఉన్న జీవం నుండి వస్తుంది కానీ నిర్జీవ పదార్థం నుండి రాదని పాశ్చర్‌ ప్రదర్శించిన వాటికి మద్దతునిస్తూనే ఉన్నాయి. ఆదికాండములోని బైబిలు వృత్తాంతం చెబుతున్న విధంగా, జీవము “తమ తమ జాతి ప్రకారము” ఉత్పత్తి చెందుతుందని రుజువులు స్పష్టంగా చూపుతున్నాయి. ఉత్పత్తి చేయబడినది తరచూ తనను ఉత్పత్తి చేసిన దాని “జాతి”కి లేక వర్గానికి చెందినదై ఉంటుంది.—ఆదికాండము 1:11, 12, 20-25.

అలా తెలిసో తెలియకో, తన పరిశోధన ద్వారా లూయీ పాశ్చర్‌, జీవం ఈ భూమిపై అవతరించేందుకు సృష్టికర్త తప్పనిసరిగా అవసరమనే విషయానికి మరియు పరిణామ సిద్ధాంతానికి విరుద్ధంగా శక్తివంతమైన రుజువులను మరియు సాక్ష్యాధారాన్ని అందించాడు. దీనుడైన కీర్తనల గ్రంథకర్త అంగీకరించిన దాన్ని అతని పరిశోధన ప్రతిబింబించింది: “యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము.”—కీర్తన 100:3.

[23వ పేజీలోని చిత్రాలు]

పైనున్న పరికరము అనవసరమైన మైక్రోబ్‌లను చంపుతూ, వైన్‌ను పాశ్చరీకరణం చేసేందుకు ఉపయోగింపబడింది; అది క్రిందున్న డ్రాయింగ్‌లో స్పష్టంగా చూపబడింది

[24వ పేజీలోని చిత్రం]

పాశ్చర్‌ ప్రయోగాలు స్వయంభువ జీవ జనన సిద్ధాంతం తప్పని రుజువు చేశాయి

[22వ పేజీలోని చిత్రసౌజన్యం]

24-6 పేజీల్లోని ఛాయచిత్రాలన్నీ: © Institut Pasteur

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి