అధ్యాయం పదమూడు
యెహోవా సింహాసనము ఎదుట ఒక గొప్ప సమూహం
1. (ఎ) క్రీస్తుకు పూర్వం జీవించిన దేవుని సేవకులు లేదా 1,44,000 మంది తమ ప్రతిఫలం పొందడానికి ముందు ఏమి అనుభవించాలి? (బి) ఈ కాలంలో జీవిస్తున్న ‘గొప్ప సమూహానికి’ ఎలాంటి అవకాశముంది?
హేబెలు మొదలుకొని బాప్తిస్మమిచ్చే యోహాను వరకు దేవుని నమ్మకమైన సేవకులందరు తమ జీవితాల్లో దేవుని చిత్తం చేయడానికి ప్రథమ స్థానం ఇచ్చారు. అయినా వాళ్ళందరు మరణించారు, దేవుని నూతనలోకంలో భూమిపై జీవించేలా పునరుత్థానం కోసం వారు ఎదురుచూస్తున్నారు. దేవుని పరలోక రాజ్యంలో క్రీస్తుతోపాటు పరిపాలించే 1,44,000 మంది కూడా తమ ప్రతిఫలం పొందే ముందు మరణించాలి. అయితే ఈ అంత్యదినాల్లో అన్ని జనాంగాల నుండి వచ్చిన “ఒక గొప్పసమూహము” మరణం చవిచూడకుండానే భూమిపై నిరంతరం జీవించే ఉత్తరాపేక్ష కలిగివుంటుందని ప్రకటన 7:9 చూపిస్తోంది. వారిలో మీరు కూడా ఉన్నారా?
గొప్పసమూహాన్ని గుర్తించడం
2. ప్రకటన 7:9 లోని గొప్పసమూహం గుర్తింపు విషయంలో క్రమేపి ఎలాంటి స్పష్టమైన అవగాహన కలిగింది?
2 మత్తయి 25:31-46 లో వ్రాయబడిన యేసు ఉపమానంలోని “గొఱ్ఱెలు,” యోహాను 10:16 లో ఆయన ప్రస్తావించిన “వేరే గొఱ్ఱెలు” ఈ భూమిపై నిరంతరం జీవించే అవకాశమున్న ప్రజలని యెహోవాసాక్షులు 1923వ సంవత్సరంలో గ్రహించారు. యెహెజ్కేలు 9:1-11 లో లలాటములపై గుర్తువేయబడిన వారిగా వర్ణించబడినవారు కూడా భూనిరీక్షణగలవారేనని 1931 లో గ్రహించబడింది. యేసు మాట్లాడిన వేరే గొఱ్ఱెల తరగతిలో గొప్పసమూహం ఒక భాగమని 1935 లో తెలుసుకోవడం జరిగింది. ఆదరించబడిన ఈ గొప్పసమూహం నేడు లక్షల్లో ఉన్నారు.
3. ‘సింహాసనము ఎదుట నిలబడడం’ అనే పదబంధం పరలోక తరగతిని సూచించడం లేదని ఎందుకు చెప్పవచ్చు?
3 ప్రకటన 7:9 లో గొప్పసమూహం పరలోకంలో ఉన్నట్లు చెప్పబడలేదు. వారు దేవుని ‘సింహాసనము ఎదుట నిలబడడానికి’ పరలోకంలోనే ఉండవలసిన అవసరం లేదు. వారు కేవలం దేవుని కనుదృష్టిలో ఉన్నారు. (కీర్తన 11: 4) “యెవడును లెక్కింపజాలని” ఈ గొప్పసమూహం పరలోక తరగతి కాదనే వాస్తవం, దాని అనిర్దిష్ట సంఖ్యను ప్రకటన 7:4-8 లో, ప్రకటన 14:1-4 లో వ్రాయబడిన విషయాలతో పోల్చడంతో స్పష్టమౌతుంది. అక్కడ భూమినుండి పరలోకానికి తీసుకువెళ్ళబడేవారి సంఖ్య 1,44,000 అని వెల్లడి చేయబడింది.
4. (ఎ) గొప్పసమూహం తప్పించుకొనే ‘మహాశ్రమలు’ ఏమిటి? (బి) ప్రకటన 7:11, 12 లో చెప్పబడినట్లు, గొప్పసమూహాన్ని ఎవరు గమనిస్తారు, వారితోపాటు ఆరాధనలో ఎవరు పాల్గొంటారు?
4 గొప్పసమూహం గురించి ప్రకటన 7: 14 ఇలా చెబుతోంది: “వీరు మహాశ్రమలనుండి వచ్చినవారు.” మానవ చరిత్రలో ఇంతవరకు సంభవించనంతటి ఘోర శ్రమనుండి వారు తప్పించుకుంటారు. (మత్తయి 24:21) వారు కృతజ్ఞతతో తమ రక్షణను దేవునికి, క్రీస్తుకు ఆపాదించినప్పుడు, పరలోకంలోని నమ్మకమైన ప్రాణులందరు వారితోపాటు ఏకమై ఇలా అంటారు: “ఆమేన్; యుగయుగములవరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక . . . ఆమేన్.”—ప్రకటన 7:11, 12.
అర్హులుగా నిరూపించుకోవడం
5. గొప్పసమూహంలో భాగంగా ఉండేందుకు ఏమి చెయ్యాలో మనమెలా నిర్ధారించుకోగలము?
5 గొప్పసమూహం మహాశ్రమల నుండి కాపాడబడడమనేది యెహోవా నీతి ప్రమాణాలకు అనుగుణంగా జరుగుతుంది. విడుదల చేయబడే ప్రజల గుర్తింపు లక్షణాలు బైబిలులో స్పష్టంగా చర్చించబడ్డాయి. ఆ విధంగా, నీతిని ప్రేమించేవారు తాము రక్షించబడేందుకు అర్హులమని నిరూపించుకునే ఉద్దేశంతో ఇప్పుడే చర్య తీసుకునే అవకాశం ఉంది. వారేమి చెయ్యాలి?
6. గొప్పసమూహాన్ని గొఱ్ఱెలతో పోల్చడం ఎందుకు సరైనదే?
6 గొఱ్ఱెలు మృదుస్వభావంగలవి, లోబడివుంటాయి. కాబట్టి పరలోక తరగతికి చెందని వేరే గొఱ్ఱెలు తనకు ఉన్నాయని యేసు చెప్పినప్పుడు, భూమిపై నిరంతరం జీవించాలని కోరుకోవడమే కాక తన బోధలకు విధేయులై ఉండే ప్రజలను సూచించాడు. “నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును” అని ఆయన చెప్పాడు. (యోహాను 10:16, 27) ఈ ప్రజలు యేసు శిష్యులై ఆయన చెప్పినవి నిజంగా విని, ఆయన చెప్పినట్లు విధేయతగా నడుచుకొంటారు.
7. యేసు అనుచరులు ఎలాంటి లక్షణాలు వృద్ధి చేసుకోవాలి?
7 యేసు అనుచరుల్లోని ప్రతి ఒక్కరు ఎలాంటి ఇతర లక్షణాలు వృద్ధి చేసుకోవాలి? దేవుని వాక్యం ఇలా సమాధానమిస్తోంది: “మునుపటి ప్రవర్తన విషయములోనైతే, . . . మీ ప్రాచీనస్వభావమును వదలుకొని మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై, నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను.” (ఎఫెసీయులు 4:22-24) దేవుని సేవకుల ఐక్యతను ఇనుమడింపచేసే లక్షణాలైన “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము”లను వారు వృద్ధి చేసుకుంటారు.—గలతీయులు 5:22.
8. శేషించబడినవారికి మద్దతునిస్తుండగా గొప్పసమూహం ఏమి ఎదుర్కొంటుంది?
8 ప్రకటనా పనిలో నాయకత్వం వహించే పరలోక నిరీక్షణగల ఆ కొద్దిమందికి గొప్పసమూహం మద్దతిస్తుంది. (మత్తయి 24:14; 25:40) తమకు వ్యతిరేకత ఎదురవుతుందని గొప్పసమూహానికి తెలిసినా ఆ మద్దతు ఇస్తుంది, వారికి వ్యతిరేకత ఎదురవడానికి కారణమేమిటంటే అంత్యదినాల ఆరంభంలో క్రీస్తు యేసు, ఆయన దేవదూతలు కలిసి సాతానును అతని దయ్యాలను పరలోకం నుండి పడద్రోశారు. అలా పడద్రోయబడడం అంటే ‘భూమికి శ్రమ; ఎందుకంటే అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధముతో దిగివచ్చాడు.’ (ప్రకటన 12:7-12) ఆ కారణంగా, ఈ విధానాంతం దగ్గరవుతున్న కొద్దీ సాతాను దేవుని సేవకులపై వ్యతిరేకతను అధికం చేస్తాడు.
9. దేవుని సేవకులు ఎంత విజయవంతంగా సువార్త ప్రకటిస్తున్నారు, ఎందుకు?
9 క్రూరమైన హింస ఎదురవుతున్నా ప్రకటనా పని నిరాటంకంగా కొనసాగుతోంది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసేసరికి కేవలం కొన్ని వేలల్లోనే ఉన్న రాజ్య ప్రచారకులు ఇప్పుడు లక్షల్లో ఉన్నారు, ఎందుకంటే యెహోవా ఇలా వాగ్దానం చేశాడు: “నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు.” (యెషయా 54:17) దేవుని కార్యాన్ని భంగపరచడం అసంభవమని యూదా మత ఉన్నత న్యాయస్థాన సభ్యుడు సహితం గుర్తించాడు. ఆయన మొదటి శతాబ్దంలోని పరిసయ్యులకు శిష్యుల గురించి ఇలా చెప్పాడు: “ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనయైనను ఈ కార్యమైనను మనుష్యులవలన కలిగినదాయెనా అది వ్యర్థమగును. దేవునివలన కలిగినదాయెనా మీరు వారిని వ్యర్థపరచలేరు; మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ.”—అపొస్తలుల కార్యములు 5:38, 39.
10. (ఎ) గొప్పసమూహంలో భాగమైన వారికి ఉన్న “గురుతు” భావమేమిటి? (బి) ‘పరలోకము నుండి వినిపించే స్వరం’ చెప్పినదానికి దేవుని సేవకులు ఎలా విధేయత చూపిస్తారు?
10 గొప్పసమూహంలో భాగమైనవారు రక్షించబడేందుకు గుర్తించబడినవారిగా చిత్రీకరించబడ్డారు. (యెహెజ్కేలు 9:4-6) ఆ “గురుతు,” వారు యెహోవాకు సమర్పించుకున్నారని, యేసు శిష్యులుగా బాప్తిస్మం పొందారని, క్రీస్తులాంటి వ్యక్తిత్వం వృద్ధిచేసుకోవడానికి కృషి చేస్తున్నారనడానికి రుజువు. వారు ‘పరలోకము నుండి వినిపించే స్వరానికి’ లోబడతారు, ఆ స్వరం సాతానుకు సంబంధించిన ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యం గురించి ఇలా చెబుతోంది: “నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారుకాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి.”—ప్రకటన 18:1-5.
11. గొప్పసమూహంలోని వారు తాము యెహోవా సేవకులమని ప్రాముఖ్యంగా ఏ రీతిలో చూపిస్తారు?
11 అంతేకాక యేసు తన అనుచరులతో, “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు” అని చెప్పాడు. (యోహాను 13:35) దానికి భిన్నంగా ఈ లోకంలోని మతాల సభ్యులు, తమ స్వంత మతసభ్యులు కేవలం వేరే దేశస్థులైన కారణంగా వారిని యుద్ధాల్లో చంపుతారు! దేవుని వాక్యం ఇలా చెబుతోంది: “దీనినిబట్టి దేవుని పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. మనమొకని నొకడు ప్రేమింపవలెను . . . మనము కయీను వంటి వారమై యుండరాదు. వాడు దుష్టుని సంబంధియై తన సహోదరుని చంపెను.”—1 యోహాను 3:10-12.
12. మహాశ్రమల్లో, పనికిమాలిన ఫలాలిచ్చే మతసంబంధ ‘చెట్లను’ యెహోవా ఏమి చేస్తాడు?
12 యేసు ఇలా ప్రకటించాడు: “ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కానిఫలములు ఫలించును. మంచి చెట్టు కానిఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు.” (మత్తయి 7:17-20) ఈ లోకపు మతాల ఫలాలు వాటిని కుళ్ళిన ‘చెట్లుగా’ గుర్తిస్తున్నాయి, యెహోవా వాటిని త్వరలోనే మహాశ్రమల్లో నాశనం చేస్తాడు.—ప్రకటన 17:16.
13. గొప్పసమూహానికి చెందినవారు ఐక్యంగా దేవుని ‘సింహాసనము ఎదుట నిలబడి’ ఉన్నారని ఎలా నిరూపించుకుంటారు?
13 ప్రకటన 7:9-15 వచనాలు, గొప్పసమూహం రక్షించబడడానికి నడిపే అంశాలవైపు అవధానం మళ్ళిస్తున్నాయి. గొప్పసమూహానికి చెందినవారు యెహోవా విశ్వ సర్వాధిపత్యాన్ని సమర్థిస్తూ ఐక్యంగా ఆయన ‘సింహాసనము ఎదుట నిలబడి’ ఉన్నట్లు చూపించబడ్డారు. యేసు బలికి ఉన్న పాపపరిహారార్థ విలువను గుర్తించామని చూపిస్తూ వారు ‘గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొన్నారు.’ (యోహాను 1:29) తమను దేవునికి సమర్పించుకొని దానికి సూచనగా వారు నీటి బాప్తిస్మం పొందారు. అందువల్ల, తెల్లని వస్త్రములు సూచించినట్లు దేవుని ఎదుట స్వచ్ఛమైన స్థానంకలిగి “రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను” సేవిస్తారు. ఇక్కడ వర్ణించబడిన ప్రకారం మీ జీవితాన్ని మరింత సంపూర్ణంగా మలుచుకొనే మార్గాలేమైనా ఉన్నాయా?
ఇప్పటి ప్రయోజనాలు
14. యెహోవా సేవకులు ఇప్పుడు కూడా అనుభవించే కొన్ని విశేష ప్రయోజనాలు ఏవి?
14 యెహోవాను సేవించేవారు ఇప్పుడు కూడా అనుభవించే విశేష ప్రయోజనాలను బహుశా మీరు గమనించే ఉంటారు. ఉదాహరణకు మీరు యెహోవా నీతియుక్త సంకల్పాల గురించి నేర్చుకున్నప్పుడు, భవిష్యత్ నిరీక్షణ ఉజ్వలంగా ఉందని గ్రహించారు. కాబట్టి ఇప్పుడు మీ జీవితంలో ఒక నిజ సంకల్పం అంటే పరదైసు భూమిపై నిరంతరం జీవించే ఆనందభరితమైన ఉత్తరాపేక్షతో సత్య దేవుణ్ణి ఆరాధించే సంకల్పం ఉంది. అవును రాజైన యేసుక్రీస్తు “జీవజలముల బుగ్గలయొద్దకును వారిని [గొప్పసమూహాన్ని] నడిపించును.”—ప్రకటన 7:17.
15. యెహోవాసాక్షులు రాజకీయ, నైతిక విషయాలకు సంబంధించి బైబిలు సూత్రాలను హత్తుకొని ఉండడం ద్వారా ఎలా ప్రయోజనం పొందుతున్నారు?
15 గొప్పసమూహం అనుభవించే ఓ అద్భుతమైన ప్రయోజనం, భూవ్యాప్తంగా యెహోవా సేవకుల మధ్య కనిపించే ప్రేమ, ఐక్యత, సామరస్యం. మనందరం ఒకే విధమైన ఆధ్యాత్మిక ఆహారం ద్వారా పోషించబడుతున్నాము కాబట్టి, మనందరం దేవుని వాక్యంలో ఉండే ఒకే విధమైన నియమాలకు, సూత్రాలకు లోబడతాము. అందుకే మనం రాజకీయ లేదా జాతీయ సిద్ధాంతాల చేత విభజించబడలేదు. అంతేకాక, దేవుడు తన ప్రజల నుండి అపేక్షించే ఉన్నత నైతిక ప్రమాణాలను కూడా మనం పాటిస్తాము. (1 కొరింథీయులు 6:9-11) తత్ఫలితంగా ఈ లోకంలో ప్రబలమైన వైషమ్యం, అనైక్యత, అనైతికతలు చవిచూసే బదులు యెహోవా ప్రజలు ఆధ్యాత్మిక పరదైసు అని పిలువబడే ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అది యెషయా 65:13, 14 లో ఎలా వర్ణించబడిందో చూడండి.
16. జీవితంలో సాధారణ సమస్యలున్నా గొప్పసమూహానికి ఎలాంటి నిరీక్షణ ఉంది?
16 యెహోవాను సేవించే మానవులు పరిపూర్ణులేమీ కాదు. ఈ లోకంలోని ప్రజల జీవితాల్లో సాధారణంగా ఎదురయ్యే సమస్యలకు అంటే, కష్టాలపాలు కావడం లేదా దేశాల మధ్య జరిగే యుద్ధాలకు అన్యాయంగా బలికావడం వంటి వాటికి వారు గురవుతారు. వారు అనారోగ్యం, బాధలు, మరణం సహితం అనుభవిస్తారు. కాని నూతనలోకంలో దేవుడు “వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు” అని వారు విశ్వసిస్తారు.—ప్రకటన 21: 4.
17. మనకు ఇప్పుడు ఏమి సంభవించినా, సత్య దేవుణ్ణి ఆరాధించేవారికి ఎలాంటి అద్భుతమైన భవిష్యత్తు ఉంది?
17 వృద్ధాప్యం, అనారోగ్యం, ప్రమాదం లేదా హింస కారణంగా మీరిప్పుడు మరణించినా పరదైసులో జీవించేందుకు యెహోవా మిమ్మల్ని పునరుత్థానం చేస్తాడు. (అపొస్తలుల కార్యములు 24:14, 15) అప్పుడు క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో మీరు ఆధ్యాత్మిక విందులో ఆనందిస్తూ ఉంటారు. దేవుని సంకల్పాలు అద్భుత రీతిలో నిజమవడం చూస్తున్న కొద్దీ ఆయనపట్ల మీ ప్రేమ ప్రగాఢమవుతుంది. అప్పుడు యెహోవా అనుగ్రహించే భౌతిక ఆశీర్వాదాలు ఆయనపట్ల మీ ప్రేమను మరింత అధికం చేస్తాయి. (యెషయా 25:6-9) దేవుని ప్రజలకు ఎంత అద్భుతమైన భవిష్యత్తు ఉందో కదా!
పునఃసమీక్షా చర్చ
• బైబిలు గొప్పసమూహాన్ని ఏ అసాధారణ సంఘటనతో జతకలిపి చెబుతోంది?
• దైవానుగ్రహం పొందిన ఆ గొప్పసమూహంలో భాగమై ఉండాలని మనం నిజంగా కోరుకుంటే, ఇప్పుడు మనమేమి చెయ్యాలి?
• గొప్పసమూహం ఇప్పుడు అనుభవిస్తున్న, దేవుని నూతనలోకంలో అనుభవించనున్న ఆశీర్వాదాలు మీకు ఎంత ప్రాముఖ్యమైనవి?
[123వ పేజీలోని చిత్రం]
గొప్పసమూహానికి చెందిన లక్షలాదిమంది సత్య దేవుణ్ణి ఐక్యంగా ఆరాధిస్తున్నారు