ఇతరులకు ఘనతను చూపించండి
“ఘనతవిషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి.”—రోమీయులు 12:10.
1, 2. (ఎ) మనకున్న వినయమనస్సును చూపించేందుకు మనం దేన్ని అభ్యసించాలి? (బి) ‘ఘనత’ లేక ‘సన్మానం’ అన్న పదాన్ని బైబిలు తరచూ ఎలా ఉపయోగిస్తుంది, ఘనతను చూపించడం సులభమైనదిగా ఉన్నట్టు ఎవరు కనుగొంటారు?
దీనికి ముందున్న శీర్షిక దేవుని వాక్యమిచ్చిన ఈ సలహాను నొక్కిచెప్పింది: “మీరందరు ఎదుటివానియెడల దీనమనస్సు అను [“వినయమనే,” పరిశుద్ధ బైబల్] వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు [“వినయంతో ఉన్నవాళ్లకు,” పరిశుద్ధ బైబల్] కృప అనుగ్రహించును.” (1 పేతురు 5:5) వినయమనస్సును మనం ధరించుకునేందుకు మనకున్న ఒక మార్గం ఏమిటంటే, ఇతరులకు ఘనతను చూపించడాన్ని అభ్యసించడమే.
2 ‘ఘనత’ లేక ‘సన్మానం’ అనే పదం, మనం ఇతరులకు చూపించాల్సిన గౌరవం, గొప్పతనం, శ్రద్ధలను సూచించేందుకు బైబిల్లో తరచుగా ఉపయోగించబడింది. ఇతరులపట్ల దయగా ఉండటం, వారి వ్యక్తిత్వాన్ని గౌరవించడం, వాళ్ల దృక్పథాన్ని వినడం, మనలను చేయమని కోరిన సహేతుకమైన విన్నపాల్ని నెరవేర్చేందుకు సంసిద్ధంగా ఉండటం ద్వారా ఇతరులకు మనం ఘనతను చూపిస్తాం. అలా చేయడం కష్టతరమైన విషయమని వినయమనస్కులైన వ్యక్తులు సాధారణంగా భావించరు. అయినా, గర్వహృదయులకు నిజమైన ఘనతను చూపించడం కష్టంగా ఉండవచ్చు. వాళ్లు నిజమైన ఘనతను చూపించడానికి బదులు, కపటంతో కూడిన ముఖస్తుతులు చేయడం ద్వారా అనుగ్రహాన్నీ, లాభాల్నీ పొందడానికి ప్రయత్నించవచ్చు.
యెహోవా మానవులకు ఘనతను చూపిస్తాడు
3, 4. యెహోవా అబ్రాహాముకు ఘనతను ఎలా చూపించాడు, ఎందుకు?
3 ఘనతను చూపించడంలో యెహోవాయే మాదిరిని ఉంచుతున్నాడు. ఆయన మానవులను స్వేచ్ఛాచిత్తంతో సృష్టించాడు, వారిని కేవలం రోబోట్లలా పరిగణించడు. (1 పేతురు 2:16) ఉదాహరణకు, సొదొమ దుష్టత్వం బహు భారమైనది గనుక ఆ పట్టణాన్ని నాశనం చేయాల్సి ఉందని అబ్రాహాముతో చెప్పినప్పుడు, అబ్రాహాము ఇలా అడిగాడు: “దుష్టులతోకూడ నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒక వేళ ఏబదిమంది నీతిమంతులుండినయెడల దానితోనున్న యేబదిమంది నీతిమంతులనిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా?” ఆ పట్టణములో ఏబదిమంది నీతిమంతులుంటే వారినిబట్టి దాన్ని నాశనంచేయకుండా విడిచిపెడతానని యెహోవా జవాబిచ్చాడు. అయినా అబ్రాహాము విడువకుండా వినమ్రంగా అర్థిస్తూనే ఉన్నాడు. ఆ పట్టణంలో 45మంది ఉంటే, 40మంది ఉంటే, 30మంది ఉంటే, 20మంది ఉంటే, 10మంది ఉంటే అప్పుడేమిటి? కేవలం పదిమంది నీతిమంతులున్నా వారినిబట్టి సొదొమను నాశనంచేయనని యెహోవా అబ్రాహాముకు అభయమిచ్చాడు.—ఆదికాండము 18:20-33.
4 సొదొమలో పదిమంది నీతిమంతులు లేరన్న సంగతి యెహోవాకు తెలిసినా, అబ్రాహాము దృక్పథాన్ని విని, అతనితో గౌరవప్రదంగా వ్యవహరించడం ద్వారా ఆయన అతనికి ఘనతనిచ్చాడు. ఎందుకు? ఎందుకంటే, అబ్రాహాము “యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.” అబ్రాహాము “దేవుని స్నేహితుడని” పిలువబడ్డాడు. (ఆదికాండము 15:6; యాకోబు 2:23) అంతేగాక, అబ్రాహాము ఇతరులకు ఘనతనివ్వడాన్ని యెహోవా చూశాడు. తన పశువుల కాపరులకూ, తన సోదరుని కుమారుడైన లోతు పశువుల కాపరులకూ మధ్య వివాదం తలెత్తినప్పుడు, అబ్రాహాము లోతుకు నచ్చిన ప్రదేశాన్ని మొదట ఎంచుకోమని అతనితో చెప్పడం ద్వారా అతనికి ఘనతనిచ్చాడు. లోతు, చాలా మంచి స్థలమని తాను పరిగణించిన ప్రదేశాన్ని ఎంపికచేసుకొన్నాడు, అబ్రాహాము మరో ప్రదేశానికి తరలివెళ్లాడు.—ఆదికాండము 13:5-11.
5. యెహోవా లోతుకు ఎలా ఘనతనిచ్చాడు?
5 అదేవిధంగా యెహోవా నీతిమంతుడైన లోతుకు ఘనతను చూపించాడు. సొదొమ పట్టణం నాశనంకావడానికి ముందు ఆయన, పర్వతప్రాంతానికి వెళ్లిపొమ్మని లోతుతో చెప్పాడు. అయినా, లోతు తాను అక్కడికి పోలేనని చెప్పాడు; సోయరు అనే ఊరు నాశనం చేయబడాల్సిన ప్రాంతంలో ఉన్నప్పటికీ, సమీపంగా ఉన్న ఆ పట్టణానికి వెళ్లడానికే అతడు ఎంచుకున్నాడు. యెహోవా లోతుతో ఇలా అన్నాడు: “ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. ఈ విషయములో నీ మనవి అంగీకరించితిని.” విశ్వాసియైన లోతు అడిగినదాన్ని చేయడం ద్వారా యెహోవా అతనికి ఘనతనిచ్చాడు.—ఆదికాండము 19:15-22; 2 పేతురు 2:6-9.
6. యెహోవా మోషేకు ఎలా ఘనతనిచ్చాడు?
6 దాస్యంలో మ్రగ్గిపోతున్న తన ప్రజలను నడిపించడానికీ, వారిని ఐగుప్తును విడిచి వెళ్లనివ్వమని ఫరోతో మాట్లాడేందుకూ యెహోవా మోషేను వెనక్కి ఐగుప్తుకి పంపించినప్పుడు, మోషే “ప్రభువా, . . . నేను మాట నేర్పరినికాను” అని ప్రతిస్పందించాడు. యెహోవా “నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలకవలసినది నీకు బోధించెదను” అని మోషేకు అభయమిచ్చాడు. అయినా మోషే తటపటాయించాడు. అప్పుడు యెహోవా మోషేకు మరలా అభయాన్నిచ్చి, అతని సోదరుడైన అహరోనును వాగ్దూతగా అతనితోపాటు పంపడానికి ఏర్పాటుచేశాడు.—నిర్గమకాండము 4:10-16.
7. ఇతరులను ఘనపర్చేందుకు యెహోవా ఎందుకు సుముఖత చూపించాడు?
7 ఇలాంటి సందర్భాలన్నింటిలో యెహోవా, ఇతరులకు ఘనతను చూపించడంలో, మరి ముఖ్యంగా తన సేవచేసేవారికి ఘనతనివ్వడంలో తన సుముఖతను చూపించాడు. వాళ్లు అడిగింది యెహోవా మొదట ఉద్దేశించినదానికి భిన్నమైనదైనప్పటికీ, వారి విన్నపాల్ని పరిగణనలోనికి తీసుకున్నాడు, అవి తన సంకల్పాన్ని ఉల్లంఘించనంతవరకూ ఆ విన్నపాల్ని అనుమతించాడు.
యేసు ఇతరులను ఘనపర్చాడు
8. తీవ్రమైన రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీకి యేసు ఎలా ఘనతనిచ్చాడు?
8 ఇతరులకు ఘనతనివ్వడంలో యేసు యెహోవాను అనుకరించాడు. ఒక సందర్భంలో, రక్తస్రావరోగంతో 12 ఏళ్లనుండి బాధపడుతున్న ఒక స్త్రీ ఒక గుంపులో ఉంది. ఆమె రోగాన్ని వైద్యులు బాగుచేయలేకపోయారు. మోషే ధర్మశాస్త్రం క్రింద ఆమె ఆచారరీత్యా చూస్తే అపవిత్రురాలిగా పరిగణించబడుతుంది, ఆమె ఆ గుంపు మధ్య ఉండకూడదు. ఆమె యేసు వెనుక నిలబడి, ఆయన వస్త్రాన్ని ముట్టుకొని స్వస్థత పొందింది. యేసు ఆమె చేసినదాన్ని బట్టి ఆమెను గద్దిస్తూ ధర్మశాస్త్ర సంబంధమైన సాంకేతిక విషయాల గురించి మొండి పట్టుపట్టలేదు. బదులుగా, పరిస్థితుల్ని తెలుసుకొని ఆయన ఇలా అంటూ, ఆమెకు ఘనతనిచ్చాడు, “కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక.”—మార్కు 5:25-34; లేవీయకాండము 15:25-27.
9. యేసు ఒక అన్యస్త్రీకి ఎలా ఘనతనిచ్చాడు?
9 మరొక సందర్భంలో, ఒక కనాను స్త్రీ యేసుతో “ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపట్టి, బహు బాధపడుచున్నదని” అన్నది. యేసు తాను అన్యుల దగ్గరకుకాదుగానీ ఇశ్రాయేలు జనాంగం దగ్గరకి మాత్రమే పంపించబడ్డానని ఎరిగినవాడై, ఆమెతో “పిల్లల [ఇశ్రాయేలీయుల] రొట్టె తీసికొని కుక్కపిల్లలకు [అన్యులకు] వేయుట యుక్తము కాదని” చెప్పెను. అందుకు ఆ స్త్రీ “కుక్కపిల్లలుకూడ తమ యజమానుల బల్లమీదనుండి పడు ముక్కలు తినును గదా” అని ఆ స్త్రీ జవాబిచ్చింది. అప్పుడు యేసు ఇలా అన్నాడు: “అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక.” ఆమె కుమార్తె స్వస్థపర్చబడింది. ఆ అన్యస్త్రీ విశ్వాసాన్నిబట్టి యేసు ఆమెకు ఘనతనిచ్చాడు. అడవి కుక్కలు అనిగాక “కుక్కపిల్లలు” అని ఆయన ఉపయోగించడం కూడా, విషయాన్ని నిమ్మళపర్చి, ఆయన కనికరాన్ని చూపించింది.—మత్తయి 15:21-28.
10. యేసు తన శిష్యులకు ఏ శక్తివంతమైన గుణపాఠాన్ని నేర్పించాడు, అది ఎందుకు అవసరమైంది?
10 యేసు శిష్యుల్లో నేనే ముందు అన్న సమస్య ఇంకా నిలిచివున్నందున వాళ్లకు, వినయమనస్కులుగా ఉండే అవసరాన్ని గురించీ, ఇతరులకు ఘనతనివ్వాల్సిన అవసరాన్ని గురించీ బోధిస్తూ ఉండేవాడు. ఒకప్పుడు వాళ్లమధ్య వాగ్వివాదం జరిగిన తర్వాత, యేసు “మీరు ఒకరితో ఒకరు దేనినిగూర్చి వాదించుచుంటిరని” వారిని అడిగాడు. వాళ్లు మాట్లాడక ఊరకున్నారు, ఎందుకంటే వాళ్లు తమలో “ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదిం[చుకున్నారు].” (మార్కు 9:33-35) యేసు తాను మరణించడానికి ముందు రాత్రి కూడా, “తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పు[ట్టింది].” (లూకా 22:24) పస్కా భోజన సమయంలో యేసు “పళ్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుట . . . మొదలుపెట్టెను.” ఎంత శక్తివంతమైన గుణపాఠమో గదా! యేసు దేవుని కుమారుడు, విశ్వమంతటిలో యెహోవా తర్వాత రెండవ స్థానంలో ఉన్నవాడు. అయినప్పటికీ, తన శిష్యుల పాదాల్ని కడగడం ద్వారా యేసు వారికి ఒక గౌరవప్రదమైన పాఠాన్ని నేర్పించాడు. ఆయన ఇలా అన్నాడు: “నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని.”—యోహాను 13:5-15.
పౌలు ఘనతను చూపించాడు
11, 12. పౌలు ఒక క్రైస్తవుడైన తర్వాత, అతడు ఏం నేర్చుకున్నాడు, ఆయన ఆ గుణపాఠాన్ని ఫిలేమోనుకు సంబంధించి ఎలా అన్వయించాడు?
11 క్రీస్తును అనుకరించువానిగా, అపొస్తలుడైన పౌలు ఇతరులకు ఘనతను చూపించాడు. (1 కొరింథీయులు 11:1) ఆయనిలా అన్నాడు: “మనుష్యులవలన కలుగు ఘనతను మేము కోరలేదు. అయతే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా, మేము మీ మధ్యను సాధువులమై యుంటిమి.” (1 థెస్సలొనీకయులు 2:6, 7) స్తన్యమిచ్చు తల్లి తన చిన్న బిడ్డలపట్ల శ్రద్ధచూపిస్తుంది. పౌలు క్రైస్తవుడైన తర్వాత, వినయమనస్కుడై ఉండడాన్ని నేర్చుకున్నాడు, తన తోటి క్రైస్తవులతో మృదువుగా వ్యవహరించడం ద్వారా వారిపట్ల ఘనతను చూపించాడు. అలా చేయడంలో, రోములో ఆయన ఖైదీగా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన ద్వారా చూపించబడినట్లుగా ఆయన తన తోటి క్రైస్తవుల స్వేచ్ఛాచిత్తాన్ని గౌరవించాడు.
12 తప్పించుకొని పారిపోయిన ఒనేసిము అను పేరుగల ఒక దాసుడు, పౌలు బోధను విన్నాడు. అతడు ఒక క్రైస్తవుడయ్యాడు, అలాగే పౌలుకు స్నేహితుడయ్యాడు. ఆ దాసుని యజమాని ఫిలేమోను. అతడు కూడా క్రైస్తవుడే, ఆసియా మైనరులో నివసించేవాడు. ఫిలేమోనుకు సంబోధించబడిన ఒక లేఖలో పౌలు ఒనేసిము “నుంచుకొనవలెనని యుంటిని” అని చెబుతూ, అతడు తనకు ఎంత ప్రయోజనకరంగా ఉన్నాడో అన్న విషయాన్ని రాశాడు. అయినప్పటికీ, పౌలు ఒనేసిమును ఫిలేమోను దగ్గరకు తిరిగి పంపించివేశాడు, ఎందుకంటే ఆయనిలా రాశాడు: “నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని, నీ సమ్మతిలేక యేమియు చేయుటకు నాకిష్టములేదు.” తానొక అపొస్తలుడిని అన్న వాస్తవం నుండి ప్రయోజనం పొందాలనుకోలేదు గానీ, రోములో తనతోపాటు ఒనేసిమును ఉంచమని అడగకుండా ఉండటం ద్వారా పౌలు ఫిలేమోనుకు ఘనతనిచ్చాడు. అంతేగాక, “దాసునికంటె ఎక్కువవాడుగాను, ప్రియ సహోదరుడుగాను” ఒనేసిముతో వ్యవహరిస్తూ, అతనిని ఘనపర్చమని పౌలు ఫిలేమోనుకు ఉద్బోధించాడు.—ఫిలేమోను 13-16.
మన దినాల్లో ఘనతను చూపించడం
13. రోమీయులు 12:10 ఏమి చేయమని మనకు చెబుతోంది?
13 దేవుని వాక్యమిలా సలహా ఇస్తోంది: “ఒకనికొకరు ఘనతను చూపించుకోవడం విషయములో ముందుండండి.” (రోమీయులు 12:10, NW) ఇతరులు మనకు మొదట ఘనతను చూపించేంతవరకూ మనం వేచివుండక, మనమే చొరవ తీసుకోవాలని దాని భావం. “ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను.” (1 కొరింథీయులు 10:24; 1 పేతురు 3:8, 9) ఆ విధంగా, కుటుంబ సభ్యులకూ, సంఘంలోని తోటి క్రైస్తవులకూ, సంఘానికి వెలుపల ఉన్నవారికీ ఘనతను చూపించేందుకు యెహోవా సేవకులు అవకాశాల కోసం ఎదురుచూస్తారు.
14. భార్యా భర్తలమధ్య ఘనత ఎలా చూపించబడుతుంది?
14 “ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు” బైబిలు తెలియజేస్తోంది. (1 కొరింథీయులు 11:3) క్రీస్తు సంఘంతో వ్యవహరించినట్టుగానే పురుషుడు తన భార్యతో వ్యవహరించేలా యెహోవా అతడ్ని బద్ధుడిని చేస్తున్నాడు. “యెక్కువ బలహీనమైన ఘట”ముగా తన భార్యను ‘సన్మానించాలని’ 1 పేతురు 3:7లో భర్తకు నడిపింపు ఇవ్వబడింది. దానిని ఆయన, తన భార్య చెపుతున్న వాటిని వినడానికి యథార్థమైన సుముఖతను చూపించడం ద్వారా, ఆమె సలహాలను పరిగణనలోనికి తీసుకోవడం ద్వారా చేయగలడు. (ఆదికాండము 21:12) బైబిలు సూత్రాలేవీ ఉల్లంఘించబడనంత వరకూ ఆయన, ఆమె సలహాలను పాటించడానికే మొదటి అవకాశం ఇవ్వవచ్చు, ఆయన ఆమెకు సహాయకారిగా ఉంటాడు, ఆమెతో దయగా వ్యవహరిస్తాడు. అలాగే, “భార్యయైతే తన భర్తయందు భయము [“ప్రగాఢమైన గౌరవం,” NW] కలిగియుండునట్లు చూచుకొనవలెను.” (ఎఫెసీయులు 5:33) ఆమె ఆయన చెబుతున్న వాటిని వింటుంది, ఎప్పుడూ తాను చెప్పిందే జరగాలని పట్టుపట్టదు, ఆయనను చిన్నచూపుచూడదు లేక కించపర్చదు. తనకు కొన్ని రంగాల్లో ఉన్నతమైన సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా ఆమె తన భర్తపై పెత్తనం చేయడానికి ప్రయత్నించకుండా ఉండటం ద్వారా వినయమనస్సును చూపిస్తుంది.
15. వృద్ధులపట్ల ఏ శ్రద్ధ చూపించబడింది, వారెలా ప్రతిస్పందించాలి?
15 క్రైస్తవ సంఘంలోపల, వృద్ధ సహోదర సహోదరీలు వంటి వ్యక్తులు విశేషంగా ఘనతకు యోగ్యులై ఉన్నారు. “తల నెరసినవానియెదుట లేచి ముసలివాని [వృద్ధుని లేక వృద్ధురాలి] ముఖమును ఘనపర[చవలెను].” (లేవీయకాండము 19:32) “నెరసిన వెంట్రుకలు తలకు అందమైన కిరీటంలాంటివి. అవి న్యాయపథంలో నడిచేవారికి కలుగుతాయి” గనుక అనేక సంవత్సరాలుగా యెహోవాను నమ్మకంగా సేవ చేస్తున్న వారి విషయంలో విశేషంగా పరిస్థితి అదైవుంది. (సామెతలు 16:31, IBL) పై విచారణకర్తలు తమకన్నా వయస్సులో పెద్దవారైన తోటి క్రైస్తవులకు తగిన గౌరవాన్ని చూపించడం ద్వారా ఆ విషయంలో మాదిరిని ఉంచాలి. నిజమే, యౌవనస్థుల పట్ల, మరి ముఖ్యంగా మందను కాయడంలో బాధ్యతను పంచుకుంటున్న యౌవనస్థుల పట్ల వృద్ధులు ఒక గౌరవపూర్వకమైన వైఖరిని ప్రదర్శించాల్సిన అవసరం కూడా ఉంది.—1 పేతురు 5:2, 3.
16. తల్లిదండ్రులూ, పిల్లలూ ఒకరికొకరు ఎలా ఘనతనిచ్చుకుంటారు?
16 పిల్లలు తమ తల్లిదండ్రులకు ఘనతను చూపించాలి: “పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడవగుదువు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది.” అలాగే, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఘనతనివ్వాలి, ఎందుకంటే “మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి” అని వారికి చెప్పబడింది.—ఎఫెసీయులు 6:1-4; నిర్గమకాండము 20:12.
17. “రెట్టింపు సన్మానము” పొందడానికి ఎవరు యోగ్యులై ఉన్నారు?
17 సంఘానికి సేవ చేయడంలో కష్టించి పనిచేస్తున్న వారికి కూడా ఘనతను చూపించాలి: “బాగుగా పాలనచేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడువారిని, రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను.” (1 తిమోతి 5:17) ఆ ఘనతను వారికి మనం చూపించగల్గే ఒక మార్గమేమిటంటే, హెబ్రీయులు 13:17లో చెప్పబడిన దాన్ని చేయడమే, అక్కడిలా ఉంది: “మీపైని నాయకులుగా ఉన్నవా[రి] . . . మాట విని, వారికి లోబడియుండుడి.”
18. సంఘానికి వెలుపలి వారిపట్ల మనమేం చేయాలి?
18 సంఘానికి వెలుపలి వారికి కూడా మనం ఘనతను చూపించాలా? చూపించాలి. ఉదాహరణకు, “ప్రతివాడును పై అధికారులకు లోబడియుండ వలెను” అని మనకు ఉపదేశించబడింది. (రోమీయులు 13:1) ఆ పై అధికారులు, లౌకిక పాలకులై ఉన్నారు. వారి స్థానంలో తన రాజ్యాన్ని తీసుకొచ్చేంతవరకూ అధికారాన్ని నిర్వహించడానికి యెహోవా వాళ్లను అనుమతించాడు. (దానియేలు 2:44) కాబట్టి మనం ‘యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లిస్తాం. ఎవనియెడల భయముండ వలెనో వానియెడల భయమును, ఎవనియెడల సన్మానముండవలెనో వానియెడల సన్మానమును కలిగి ఉంటాం. అందరికిని వారి వారి ఋణములను తీరుస్తాం.’ (రోమీయులు 13:7) మనం ‘[స్త్రీలనైనా, పురుషులనైనా సరే] అందరిని సన్మానించాలి.’—1 పేతురు 2:17.
19. ఇతరులకు ‘మేలైనదానిని’ మనమెలా చేయగలం, వారికి ఘనతను ఎలా చూపించగలం?
19 సంఘానికి వెలుపలి వారికి కూడా మనం ఘనతను చూపించాలన్న విషయం వాస్తవమే అయినప్పటికీ, దేవుని వాక్యం నొక్కి చెపుతున్నదాన్ని గమనించండి: “మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము.” (గలతీయులు 6:10) నిజమే, ఇతరులకు ‘మేలైనదానిని’ మనం చేయగలిగే శ్రేష్ఠమైన మార్గం ఏమిటంటే, వాళ్ల ఆధ్యాత్మిక అవసరాల్ని పెంపొందించి, తృప్తిపర్చడమే. (మత్తయి 5:3) అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఈ జ్ఞాపికను లక్ష్యపెట్టడం ద్వారా దాన్ని మనం చేయగలం: “దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్తపడుము. అయతే నీవు అన్నివిషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము.” ‘మన పరిచర్యను సంపూర్ణముగా జరిగించేలా’ సాక్ష్యమివ్వడానికి ఉన్న ప్రతీ అవకాశాన్ని మనం యుక్తిగా ఉపయోగిస్తున్నప్పుడు, మనం అందరియెడల మేలు చేయడం మాత్రమే కాదుగానీ, వారికి ఘనతను చూపిస్తున్నాం కూడా.—2 తిమోతి 2:15; 4:5.
యెహోవాను ఘనపర్చడం
20. ఫరోకూ, అతని సైన్యానికీ ఏం జరిగింది, ఎందుకు?
20 యెహోవా తన సృష్టి ప్రాణులకు ఘనతనిస్తున్నాడు. మనం కూడా ఆయనకు తిరిగి ఘనతను చూపించాలన్న విషయం సహేతుకమైనది. (సామెతలు 3:9; ప్రకటన 4:11) యెహోవా వాక్యం కూడా ఇలా తెలియజేస్తోంది: “నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును. నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు.” (1 సమూయేలు 2:30) ఐగుప్తు అధినేతయైన ఫరోని దేవుని ప్రజలను పంపించమని అడిగినప్పుడు, అతడు అహంకారంతో ఇలా జవాబిచ్చాడు: “నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు?” (నిర్గమకాండము 5:2) ఇశ్రాయేలీయులను నాశనంచేయడానికి ఫరో తన సైన్యాల్ని పంపించినప్పుడు, యెహోవా ఇశ్రాయేలీయుల కోసం ఎఱ్ఱ సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు. అయితే ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల్ని వెంటాడినప్పుడు, యెహోవా తిరిగి ఆ రెండు పాయల్ని ఏకం చేశాడు. “ఆయన [యెహోవా] ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను.” (నిర్గమకాండము 14:26-28; 15:4) యెహోవాను ఘనపర్చడాన్ని గర్వాంధుడై ఫరో తిరస్కరించడం, అతడు దుర్మరణంపాలవ్వడానికి నడిపించింది.—కీర్తన 136:15.
21. యెహోవా బెల్షస్సరుకు ఎందుకు వ్యతిరేకి అయ్యాడు, ఫలితమేమిటి?
21 బబులోను రాజైన బెల్షస్సరు యెహోవాను ఘనపర్చడాన్ని తిరస్కరించాడు. త్రాగుబోతుల విందులో, అతడు యెహోవా ఆలయంలో నుండి తీసుకొచ్చిన పవిత్రమైన వెండి బంగారు పాత్రల్లో మద్యాన్ని త్రాగడం ద్వారా యెహోవాను అపహసించాడు. అతడు అలా తాగుతూ, తన అన్య దేవతల్ని స్తుతించాడు. అయితే యెహోవా సేవకుడైన దానియేలు అతనితో ఇలా చెప్పాడు: “నీ మనస్సును అణచుకొనక, పరలోకమందున్న ప్రభువుమీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి.” అదే రాత్రి బెల్షస్సరు చంపబడ్డాడు, అతని రాజ్యం అతని దగ్గర నుండి తీసివేయబడింది.—దానియేలు 5:22-31.
22. (ఎ) యెహోవా ఉగ్రత ఇశ్రాయేలు నాయకులపైకీ, వారి ప్రజలపైకీ ఎందుకు వచ్చింది? (బి) యెహోవా ఎవరిని అనుగ్రహించాడు, ఏ ఫలితంతో?
22 సా.శ. మొదటి శతాబ్దంలో, హేరోదు రాజు ప్రజలకు ఉపన్యసిస్తున్నాడు, ఆ ప్రజలు “ఇది దైవస్వరమేకాని మానవస్వరముకాదని” కేకలు వేశారు. నిష్ప్రయోజకుడైన ఆ రాజు దాన్ని తిరస్కరించక మహిమను కోరుకున్నాడు. అప్పుడు, “దేవుని మహిమపరచనందున . . . ప్రభువు దూత అతని మొత్తెను.” (అపొస్తలుల కార్యములు 12:21-23) హేరోదు యెహోవానుగాక తననుతానే ఘనపర్చుకున్నాడు, మరణించేలా మొత్తబడ్డాడు. ఆ కాలంనాటి మతనాయకులు, దేవుని కుమారుడైన యేసును చంపడానికి కుట్ర పన్నడం ద్వారా దేవునిని అగౌరవపరిచారు. యేసు సత్యాన్నే బోధించాడన్న విషయం కొంతమంది అధికారులకు తెలిసినా, వాళ్లు “మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించి”నందున ఆయనను అనుసరించలేదు. (యోహాను 11:47-53; 12:42, 43) మొత్తంమీద చూస్తే ఆ జనాంగం, యెహోవాను ఘనపర్చలేదు లేక ఆయన నియమిత ప్రతినిధియైన యేసును ఘనపర్చలేదు. తత్ఫలితంగా, యెహోవా వారిని ఘనపర్చక, వారినీ వారి ఆలయాన్నీ నాశనానికి విడిచిపెట్టాడు. తననూ, తన కుమారుడ్నీ ఘనపర్చిన వ్యక్తుల్ని సజీవులుగా భద్రపర్చాడు.—మత్తయి 23:38; లూకా 21:20-22.
23. దేవుని క్రొత్త లోకంలో జీవించాలంటే మనమేం చేయాలి? (కీర్తన 37:9-11; మత్తయి 5:5)
23 ప్రస్తుత విధానం నాశనమైన తర్వాత దేవుని క్రొత్త లోకంలో జీవించాలని కోరుకునే వారంతా, దేవునినీ, ఆయన కుమారుడైన క్రీస్తు యేసునీ ఘనపర్చాలి, వారికి విధేయత చూపించాలి. (యోహాను 5:22, 23; ఫిలిప్పీయులు 2:9-11) అలాంటి ఘనతను చూపించని వాళ్లు “దేశములో (భూమిపై) నుండకుండ నిర్మూలమగుదురు.” మరోవైపున, దేవునినీ, క్రీస్తునీ ఘనపర్చి విధేయత చూపించే “యథార్థవంతులు దేశమందు (భూమిపై) నివసించుదురు.”—సామెతలు 2:21, 22.
పునఃసమీక్షగా
◻ ఇతరులకు ఘనతనివ్వడం అంటే ఏమిటి, యెహోవా దీనిని ఎలా చేశాడు?
◻ యేసు, పౌలులు ఇతరులకు ఎలా ఘనతను చూపించారు?
◻ మన కాలంలో ఘనతకు యోగ్యులైన వారు ఎవరు?
◻ యెహోవానూ, యేసునూ మనమెందుకు ఘనపర్చాలి?
[17వ పేజీలోని చిత్రం]
యెహోవా అబ్రాహాము చేసిన విన్నపాల్ని పరిగణనలోనికి తీసుకోవడం ద్వారా అతనిని ఘనపర్చాడు
[18వ పేజీలోని చిత్రం]
విజయవంతమైన వివాహాల్లో, భార్యభర్తలు ఇరువురు పరస్పరం ఘనతను చూపించుకుంటారు