జీవిత కథ
ఆర్కిటిక్ వలయం సమీపంలో యాభై ఏళ్ల పూర్తికాల సేవ
“పయినీరు సేవ చేయడం నీకు చాలా సులువు. మీ అమ్మానాన్నలు సత్యంలో ఉన్నారు కాబట్టి వాళ్ల సహాయం నీకెలాగూ ఉంటుంది!” అని పూర్తికాల సేవలో ఉన్న మా స్నేహితురాలితో మేము అన్నాం. అందుకు ఆమె, “వినండి! మనందరికీ ఒకే తండ్రి ఉన్నాడు” అని బదులిచ్చింది. ఆమె చెప్పిన మాటల్లో ఓ ప్రాముఖ్యమైన పాఠం ఉంది: మన పరలోక తండ్రి తన సేవకుల బాగోగులు చూసుకుంటాడు, వాళ్లను బలపరుస్తాడు. నిజం చెప్పాలంటే, మా జీవితంలో మేము దాన్ని రుచి చూశాం.
మేమిద్దరం ఫిన్లాండ్లోని ఉత్తర ఆస్ట్రోబోత్నియాలో ఓ రైతు కుటుంబంలో పుట్టాం. మేము మొత్తం పదిమంది పిల్లలం. రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా మా బాల్యంలో విషాదం అలుముకుంది. యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి మేము వందల మైళ్ల దూరంలో ఉన్నా, దానివల్ల పుట్టిన భయం తాలూకు ఛాయలు మా మనసుల్లో అలాగే మిగిలిపోయాయి. సమీప పట్టణాలైన ఊలూ, కాలాజోకీ మీద బాంబు దాడి జరిగిన రాత్రి పైకి ఎగసిన ఎర్రని మంటల్ని మేము చూశాం. మా ఇంటి మీదుగా యుద్ధ విమానాలు వెళ్లడం కనిపించిన వెంటనే మా అమ్మానాన్నలు మమ్మల్ని దాక్కోమన్నారు. మా పెద్దన్నయ్య టావునో, అన్యాయమే ఉండని పరదైసు భూమి గురించి చెప్పినప్పుడు, అది మా మనసుల్ని స్పృశించింది.
టావునో 14 ఏళ్ల వయసులో బైబిలు విద్యార్థుల ప్రచురణలు చదివి ఎన్నో సత్యాలు తెలుసుకున్నాడు. రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు తన బైబిలు శిక్షిత మనస్సాక్షిని బట్టి యుద్ధంలో చేరడానికి నిరాకరించినందుకు అన్నయ్యను జైళ్లో వేసి చిత్రహింసలు పెట్టారు. కానీ అవన్నీ యెహోవా సేవచేయాలనే తన దృఢ నిశ్చయాన్ని బలపర్చాయి. కాబట్టి విడుదలైన వెంటనే మా అన్నయ్య ముందుకన్నా ఎక్కువ ఉత్సాహంగా పరిచర్య చేయసాగాడు. అన్నయ్య ఆదర్శాన్ని చూసి, అప్పటికే పక్క ఊళ్లో జరుగుతున్న సాక్షుల కూటాలకు హాజరుకావాలని మాకు అనిపించింది. మేము సమావేశాలకు కూడా హాజరయ్యాం. అందుకు సరిపడా డబ్బును కూడబెట్టడం కోసం మేము ఎంతో ప్రయాసపడాల్సి వచ్చేది. మేము ఉల్లిపాయల్ని పండించేవాళ్లం, బెర్రీ పళ్లను ఏరి అమ్మేవాళ్లం, బట్టలు కుట్టేవాళ్లం. పొలం పనుల వల్ల, అందరం కలిసి సమావేశాలకు హాజరవ్వడం కుదిరేది కాదు. అందుకే, మేము వంతులు వేసుకొని వెళ్లేవాళ్లం.
ఎడమ నుండి: 1935లో మాట్టీ (నాన్న), టావునో, సైమీ, మారియా ఎమీల్యా (అమ్మ), వాయినో (చంటిబిడ్డ), ఐలీ, ఆన్నిక్కీ
యెహోవా గురించి, ఆయన ఉద్దేశాల గురించి నేర్చుకున్న సత్యాల వల్ల ఆయన మీద మా ప్రేమ పెరిగింది. దాంతో మేము మా జీవితాల్ని ఆయనకు సమర్పించుకోవాలని నిర్ణయించుకున్నాం. 1947లో మేమిద్దరం [అప్పుడు ఆన్నిక్కీకి 15 ఏళ్లు, ఐలీకి 17 ఏళ్లు] బాప్తిస్మం తీసుకున్నాం. మా అక్క సైమీ కూడా అదే సంవత్సరంలో బాప్తిస్మం తీసుకుంది. అప్పటికే పెళ్లయిపోయిన మా అక్క లిన్నెయాతో కూడా మేము బైబిలు అధ్యయనం చేశాం. ఆమె కుటుంబమంతా యెహోవా సాక్షులయ్యారు. బాప్తిస్మం తర్వాత మేము పయినీరు సేవ చేయాలనే లక్ష్యంతో అప్పడప్పుడు సహాయ పయినీరు సేవ చేసేవాళ్లం.
పూర్తికాల సేవలో అడుగుపెట్టాం
ఎడమ నుండి: 1949లో ఈవా కల్లియో, సైమీ మాట్టీలా సిర్జాలా, ఐలీ, ఆన్నిక్కీ, శారా నొపోనెన్
1955లో మేము, ఉత్తరాన కాస్త దూరంలో ఉన్న కెమి నగరానికి మారాం. అప్పటికే మేమిద్దరం ఉద్యోగాలు చేస్తున్నా, పయినీరు సేవ చేయాలనే కోరిక మాత్రం ఉండేది. కానీ, మా ఖర్చుల్ని చూసుకోగలమో లేదో అని భయపడేవాళ్లం. కాబట్టి, ముందుగా ప్రతీ నెల కొంత డబ్బును పొదుపు చేయాలనుకున్నాం. సరిగ్గా ఆ సమయంలోనే, ఈ ఆర్టికల్ ఆరంభంలో ప్రస్తావించిన పయినీరు సహోదరితో సంభాషణ జరిగింది. పూర్తికాల సేవ చేయడం అనేది కేవలం మన సొంత వనరుల మీదో, అమ్మానాన్నలు అందించే సాయం మీదో ఆధారపడి ఉండదని ఆ సంభాషణ వల్ల మేము గుర్తించాం. మనం ముఖ్యంగా ఆధారపడాల్సింది మన పరలోక తండ్రి మీదే.
1952లో సమావేశం కోసం క్వోపీయోకు వెళ్లాం. ఎడమ నుండి: ఆన్నిక్కీ, ఐలీ, ఈవా కల్లియో
ఆ సమయంకల్లా మేము రెండు నెలలకు సరిపడా డబ్బును పొదుపు చేయగలిగాం. దాంతో 1957 మే నెలలో, కాస్త భయపడుతూనే ఆర్కిటిక్ వలయానికి పైన ఉన్న లాప్లాండ్లోని పెల్లో పురపాలక ప్రాంతంలో రెండు నెలలపాటు పయినీరు సేవచేయడానికి దరఖాస్తు చేసుకున్నాం. ఆ రెండు నెలలు గడిచాక కూడా మేము దాచుకున్న డబ్బు ఖర్చుకాకపోవడంతో మేము మరో రెండు నెలలు పయినీరు సేవ చేసేందుకు దరఖాస్తు పెట్టుకున్నాం. అలా పొడిగించుకున్న ఆ రెండు నెలల తర్వాత కూడా మేము దాచుకున్న డబ్బు తరగకపోవడంతో యెహోవా తప్పక మా అవసరాలు తీరుస్తాడనే నమ్మకం కుదిరింది. 50 ఏళ్ల పయినీరు సేవ చేసిన తర్వాత కూడా మేము పొదుపు చేసిన డబ్బు ఇంకా అలాగే ఉంది. ఒక్కసారి గతాన్ని చూసుకుంటే, యెహోవా మా చెయ్యి పట్టుకొని, “భయపడకుము, నేను నీకు సహాయము చేసెదను” అని మాతో చెప్పినట్లుగా అనిపిస్తోంది.—యెష. 41:13.
50 ఏళ్ల పయినీరు సేవ చేసిన తర్వాత కూడా మేము పొదుపు చేసిన డబ్బు ఇంకా అలాగే ఉంది!
పరిచర్య చేస్తున్న కైసూ రీక్కో, ఐలీ
లాప్లాండ్లోని సోడాన్క్యూలా పట్టణంలో ప్రత్యేక పయినీర్లుగా సేవచేయమని 1958లో మా ప్రాంతీయ పర్యవేక్షకుడు సలహా ఇచ్చాడు. అప్పుడు అక్కడ కేవలం ఒకే ఒక్క సహోదరి ఉండేది. ఆమె సత్యం నేర్చుకున్న తీరు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ల అబ్బాయి ఒకసారి వాళ్ల క్లాస్‌మేట్స్‌తో కలిసి ఫిన్లాండ్ రాజధానియైన హెల్సింకీకి విహార యాత్రకు వెళ్లాడు. పట్టణ వీధుల గుండా పిల్లలంతా ఓ లైన్లో నడుస్తున్నప్పుడు వాళ్ల అబ్బాయి చిట్టచివరన ఉన్నాడు. ఆ సమయంలో ఓ వృద్ధ సహోదరి ఆ బాబుకు కావలికోట పత్రిక ఇచ్చి ‘దీన్ని మీ అమ్మకు ఇవ్వు’ అని చెప్పింది. అబ్బాయి ఆ సహోదరి చెప్పినట్లే చేశాడు. అది చదివిన వెంటనే వాళ్ల అమ్మ తనకు సత్యం దొరికిందని గ్రహించింది.
మేము సోడాన్క్యూలాలో దుంగలను కోసే ఓ దుకాణం మీది గదిని అద్దెకు తీసుకున్నాం. అక్కడ కూటాలు జరుపుకున్నాం. మొదట్లో కూటాల్లో మాతోపాటు, పైన పేర్కొన్న స్థానిక సహోదరి, వాళ్ల అమ్మాయి మాత్రమే ఉండేవాళ్లు. మేమంతా కలిసి ప్రచురణల్లోని సమాచారాన్ని చదివి చర్చించుకునేవాళ్లం. ఇలా ఉండగా, అంతకుముందు సాక్షులతో బైబిలు అధ్యయనం చేసిన ఓ వ్యక్తి ఆ దుకాణంలో పనిచేయడానికి వచ్చాడు. ఆయన తన కుటుంబంతో కలిసి మేము జరుపుకుంటున్న కూటాలకు హాజరవ్వడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి ఆయన, వాళ్ల ఆవిడ బాప్తిస్మం తీసుకున్నారు. అప్పటినుండి కూటాల్ని ఆ సహోదరుడే నిర్వహించేవాడు. కొన్నిరోజులకు, ఆ దుకాణంలో పనిచేస్తున్న మరికొంతమంది కూటాలకు హాజరవ్వడం మొదలుపెట్టి సత్యాన్ని స్వీకరించారు. కొన్నేళ్ల తర్వాత మా చిన్ని గుంపు పెద్దదవ్వడంతో ఓ సంఘం ఏర్పడింది.
క్లిష్టమైన పరిస్థితులు
ప్రకటనా పని చేయడానికి మేము దూరదూరాలకు వెళ్లాల్సి వచ్చేది కాబట్టి కాస్త కష్టంగా ఉండేది. వేసవిలో ప్రకటనా పనిచేసేందుకు మేము కొన్నిసార్లు కాలినడకన, మరికొన్నిసార్లు సైకిల్ మీద, ఇంకొన్నిసార్లు చిన్న పడవ నడుపుకుంటూ వెళ్లేవాళ్లం. ముఖ్యంగా మా సైకిళ్లు బాగా ఉపయోగపడేవి. సమావేశాలకు వెళ్లేందుకు అలాగే, వందల మైళ్ల దూరంలో ఉన్న మా అమ్మానాన్నలను చూసి వచ్చేందుకు మేము మా సైకిళ్లనే వాడేవాళ్లం. చలికాలంలో ఓ గ్రామీణ ప్రాంతంలో ప్రకటించడానికి మేము తెల్లవారు జామునే బస్సు పట్టుకొని వెళ్లేవాళ్లం. అలా ఒక పల్లెలో ఇంటింటా ప్రకటించడం అయిపోగానే మరో పల్లెకు నడిచి వెళ్లేవాళ్లం. రోడ్లన్నీ మంచుతో నిండిపోయి ఉండేవి. చాలాసార్లు, ఆ రోడ్ల మీద పేరుకున్న మంచును తొలగించేవాళ్లు కాదు. మేము తరచూ గుర్రాలు ఈడ్చుకెళ్లే బగ్గీల వల్ల ఏర్పడిన జాడలు చూసుకుని, వాటిలో నడిచేవాళ్లం. కొన్నిసార్లు ఆ జాడలను కూడా మంచు కప్పేసేది. పైగా వసంత కాలం ఆరంభమైనప్పుడు మంచు ఎంత మెత్తగా ఉండేదంటే మా కాళ్లు అందులో దిగబడేవి. దాంతో మేము అడుగు తీసి అడుగు వేయడానికి ఎంతో ప్రయాసపడాల్సి వచ్చేది.
శీతాకాలంలో బాగా చలిగా ఉన్న ఓ రోజున పరిచర్య చేస్తూ
మంచు కురుస్తూ గడ్డ కట్టేంత చలి ఉండేది కాబట్టి మేము వెచ్చదనాన్నిచ్చే దుస్తులు ధరించేవాళ్లం. ఉన్ని వస్త్రాలు వేసుకొని, రెండుమూడు జతల సాక్సులు తొడుక్కొని, మోకాళ్ల వరకు ఉండే బూట్లు వేసుకునేవాళ్లం. అయినా, మా బూట్లు మంచుతో నిండిపోయేవి. ఏదైనా ఓ ఇంటి మెట్లు ఎక్కుతున్నప్పుడు మా బూట్లు తీసి మంచు దులుపుకునేవాళ్లం. అంతేకాదు, మంచులో నడుస్తున్నప్పుడు మేము వేసుకున్న చలికోటు అంచులు మంచుకు తడిసిపోయేవి. శీతల వాతావరణం పెరిగే కొద్దీ ఆ అంచులు గడ్డకట్టి రేకు ముక్కల్లా తయారయ్యేవి. ఓ ఇంటావిడ ఇలా అంది: “ఇలాంటి వాతావరణంలో సాహసం చేసి మీ అంతట మీరే ఇక్కడి వరకు వచ్చారంటే మీకు నిజమైన విశ్వాసం ఉండివుండాలి.” ఆ ఇంటికి చేరుకోవడానికి మేము 11 కి.మీ. కన్నా ఎక్కువే నడిచాం.
ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి చేరుకోవడానికి ఎంతో దూరం వెళ్లాల్సి వచ్చేది కాబట్టి రాత్రుళ్లు మేము తరచూ స్థానికుల ఇళ్లలో బస చేసేవాళ్లం. చీకటి పడుతుండగానే, మేము తలదాచుకోవడానికి చోటు కోసం అడగడం మొదలుపెట్టేవాళ్లం. అక్కడి ఇళ్లలో పెద్దగా సదుపాయాలేవీ లేకపోయినా, ప్రజలు మాత్రం మంచి అతిథిప్రియులు, స్నేహశీలురు. అందుకే వాళ్లు మాకు బస కల్పించడమే కాక భోజనం కూడా పెట్టేవాళ్లు. మేము తరచూ ఓ జింక తోలునో, ఎలుగుబంటి తోలునో నేలమీద పరచుకొని పడుకునేవాళ్లం. అప్పుడప్పుడు కొన్ని సౌకర్యాలను కూడా ఆస్వాదించాం. ఉదాహరణకు, ఒకసారి మేము ఓ గొప్ప భవంతికి వెళ్లాం. ఆ ఇంటావిడ సాదరంగా మమ్మల్ని ఆహ్వానించి, పై అంతస్తులో అతిథుల కోసం ఉంచిన గదికి తీసుకెళ్లింది. ఆ గదిలో శుభ్రమైన తెల్లని బెడ్షీట్లతో అందంగా సర్దిన పడక ఉంది. ఆరోజు మేము అక్కడే విడిది చేశాం. మేము బస చేసే ఇంటివాళ్లతో బైబిలు చర్చలు ఎంత బాగా సాగేవంటే, చాలాసార్లు చీకటిపడినా తెలిసేది కాదు. మరో ఇంట్లో, మా బస ఏర్పాట్లు ఎలా ఉండేవంటే, ఒకే గదిలో ఒక మూలన ఆ ఇంట్లో నివసిస్తున్న జంట పడుకుంటే, మరో మూలన మేము పడుకునేవాళ్లం. వాళ్ల ఇంట్లోనైతే తెల్లవారుజాము వరకు లేఖన చర్చలు సాగేవి. ఆ భార్యాభర్తలిద్దరూ ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నల వర్షం కురిపించేవాళ్లు.
మా పరిచర్య ఫలవంతంగా సాగింది
లాప్లాండ్ బంజరు భూమే అయినా అందమైన ప్రదేశం. ఆయా రుతువుల్లో దాని అందచందాలు మారుతుంటాయి. అయితే, మా దృష్టిలో మాత్రం యెహోవా గురించి నేర్చుకోవడానికి ఆసక్తి చూపించిన ప్రజలే ఎక్కువ అందమైన వాళ్లు. మేము సాక్ష్యమిచ్చిన వాళ్లలో లాప్లాండ్కు వచ్చి కర్రలు నిలువచేసే చోట పనిచేసే కలప కార్మికులు కూడా ఉండేవాళ్లు. కొన్నిసార్లు ఒక్కో కుటీరంలో గుంపుల కొద్దీ మగవాళ్లు ఉండేవాళ్లు. మేము ప్రకటించడానికి వెళ్లినప్పుడు దేహదారుఢ్యంగల ఆ వ్యక్తుల ముందు మేము కూనల్లా కనిపించేవాళ్లం. కానీ వాళ్లు మేము చెప్పే బైబిలు సందేశాన్ని విని, సంతోషంగా ప్రచురణలు తీసుకునేవాళ్లు.
మాకు ఎన్నో ఉత్తేజకరమైన అనుభవాలు ఎదురయ్యాయి. ఒకరోజు, బస్-స్టాండులోని గడియారం ఐదు నిమిషాలు ముందు నడవడం వల్ల మేము వెళ్లేసరికే బస్సు వెళ్లిపోయింది. దాంతో, మేము వేరే బస్సు ఎక్కి ఇంకో గ్రామానికి వెళ్లాం. ఆ గ్రామంలో మేము ఇంతకుముందెన్నడూ ప్రకటించలేదు. మొదటి ఇంట్లో మేము కలిసిన ఓ యౌవన స్త్రీ ఇలా అంది: “ఓహ్, వచ్చేశారా! నేను మీ గురించే చూస్తున్నా.” అప్పటికే మేము వీళ్ల అక్కతో బైబిలు అధ్యయనం చేస్తున్నాం. మమ్మల్ని తన ఇంటికి పంపించమని ఈవిడ తన అక్కను అడిగిన సంగతి మాకు తెలియదు. సరిగ్గా ఈమె రమ్మన్న రోజే మేము అనుకోకుండా వీళ్లింటికి వచ్చాం. మేము ఈమెతో, పొరుగింట్లో ఉంటున్న ఈమె బంధువులతో బైబిలు అధ్యయనం మొదలుపెట్టాం. కొంతకాలానికే ఈ అధ్యయనాలను ఒకే అధ్యయనంగా మార్చడంతో ఓ పన్నెండు మంది వరకు కూర్చునేవాళ్లు. ఆ తర్వాత ఆ కుటుంబంలో, వాళ్ల బంధువుల్లో చాలామంది యెహోవాసాక్షులయ్యారు.
1965లో మమ్మల్ని ఆర్కిటిక్ వలయం కింద ఉన్న కూసామో ప్రాంతానికి నియమించారు. మేము ఇప్పటికీ ఈ ప్రాంతంలోనే సేవ చేస్తున్నాం. అప్పట్లో ఇక్కడ కొద్దిమంది ప్రచారకులే ఉండేవాళ్లు. మొదట్లో ఈ కొత్త క్షేత్రం కాస్త కష్టంగా అనిపించేది. మతం విషయంలో బలమైన అభిప్రాయాలు గల ప్రజలు మమ్మల్ని ద్వేషించేవాళ్లు. అయినా, చాలామందికి బైబిలంటే గౌరవం ఉండడంవల్ల వాళ్లతో సంభాషణను ఇట్టే మొదలుపెట్టగలిగేవాళ్లం. అలా మెల్లమెల్లగా ప్రజల్ని తెలుసుకోవడానికి ప్రయత్నించి రెండేళ్లు గడిచేసరికి బైబిలు అధ్యయనాలు ఆరంభించగలిగాం.
ఇప్పటికీ చురుగ్గానే పరిచర్య చేస్తున్నాం
మేము సత్యం నేర్పించిన కొంతమంది
క్షేత్ర సేవలో రోజంతా గడిపే శక్తి ఇప్పుడు మాకు లేకపోయినా, దాదాపు ప్రతీరోజు ప్రకటనా పని చేయడానికి వెళ్తాం. మా మేనల్లుడి ప్రోత్సాహంతో ఐలీ, 56 ఏళ్ల వయసులో డ్రైవింగ్ నేర్చుకొని 1987లో లైసెన్స్ పొందింది. చేతిలో కారు ఉండడం వల్ల మేము ఈ పెద్ద క్షేత్రంలో రాజ్య సువార్తను వ్యాప్తి చేయడం సులభమైంది. ఇక్కడ కొత్త రాజ్యమందిరం కట్టినప్పుడు మాకు మరో సహాయం అందింది. అదేంటంటే, రాజ్యమందిర ఆవరణలోనే కట్టిన చిన్న ఇంట్లో మాకు నివాసం దొరికింది.
మా కళ్ల ముందు జరిగిన అభివృద్ధిని చూస్తుంటే మాకు ఎనలేని సంతోషం కలుగుతోంది. ఉత్తర ఫిన్లాండ్లో పూర్తికాల సేవ మొదలుపెట్టినప్పుడు ఈ పెద్ద క్షేత్రంలో అక్కడక్కడ నివసిస్తున్న ప్రచారకులు కేవలం కొద్దిమంది మాత్రమే ఉండేవాళ్లు. ఇప్పుడు ఎన్నో సంఘాలతో కూడిన ఓ సర్క్యూటే ఉంది. సమావేశాల్లో చాలాసార్లు ఎవరో ఒకరు వచ్చి, తమను తాము పరిచయం చేసుకొని, ‘నన్ను గుర్తుపట్టారా?’ అని అడిగేవాళ్లు. కొన్ని సందర్భాల్లో ఎలాంటి వ్యక్తులు తారసపడ్డారంటే, వాళ్ల బాల్యంలో మేము వాళ్ల కుటుంబంతో బైబిలు అధ్యయనం చేసేవాళ్లం. ఎన్నో ఏళ్ల కింద లేదా దశాబ్దాల కింద విత్తిన విత్తనాలు మొలకెత్తి ఫలించాయి!—1 కొరిం. 3:6.
వర్షం పడే రోజుల్లో కూడా మేము సంతోషంగా పరిచర్య చేస్తాం
2008 నాటికి, మేము ప్రత్యేక పయినీరు సేవలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాం. ఈ అమూల్యమైన సేవలో నిలిచి ఉండేలా ఒకరినొకరం ప్రోత్సహించుకోగలిగినందుకు మేమిద్దరం యెహోవాకు కృతజ్ఞులం! మా జీవితం చాలా నిరాడంబరంగా సాగినా, ఎన్నడూ ఏదీ కొదువ కాలేదు. (కీర్త. 23:1) మొదట్లో మేము పయినీరు సేవలో అడుగుపెట్టడానికి అనవసరంగా సంకోచించామని అనిపిస్తుంది. సంతోషకరంగా, ఈ సంవత్సరాలన్నిటిలో యెషయా 41:9, 10లోని మాటలకు అనుగుణంగా యెహోవా మమ్మల్ని బలపర్చాడు. ఆ లేఖనంలో ఇలా ఉంది: “నేను నిన్ను బలపరతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.”