పత్రిక ముఖ్యాంశం
లోకాంతం దగ్గర్లో ఉందా?
మనుషులు ఒకరి మీద ఒకరు అధికారం చెలాయించుకుంటూ, భవిష్యత్తును చీకటిమయం చేసుకుంటుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? లేదు. మనం ఇంతకుముందు చూసినట్లు, దేవుడు జోక్యం చేసుకుని తరతరాలుగా కొనసాగుతున్న బాధను, అణచివేతను తీసేస్తాడు. అందుకు సమయం దగ్గరపడిందని ఈ భూమిని, మానవుల్ని చేసిన దేవుడు మనకు చెప్తున్నాడు. ఎలా?
దీని గురించి ఆలోచించండి: మీరు కొత్త ఊరికి ప్రయాణం చేయాల్సివస్తే మీరు వెళ్లాల్సిన చోటుకు ఏ బస్సు ఎక్కాలో ఎవరినైనా అడుగుతారు. ఆ బస్సు ఎక్కడ ఎక్కాలి, మీరు వెళ్లాల్సిన దారిలోనే వెళ్తున్నారా లేదా తెలుసుకోవడానికి దారి మధ్యలో కనపడే కొన్ని గుర్తులు, వివరాలు కూడా ముందే కనుక్కుంటారు. ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు చెప్పిన గుర్తులన్నీ కనిపిస్తే మీరు సరైన దారిలోనే వెళ్తున్నారనే నమ్మకం మీకు వస్తుంది. అదే విధంగా, అంతం వచ్చేముందు లోకంలో స్పష్టంగా కనపడే కొన్ని విషయాలను దేవుడు తన వాక్యంలో వివరించాడు. అవన్నీ జరగడం చూసినప్పుడు మనం అంతానికి చాలా దగ్గర్లో ఉన్నామని నమ్మకం కుదురుతుంది.
ప్రపంచం ముందెన్నడూ లేని, అత్యంత కీలకమైన దశకు చేరుకుంటోంది, అప్పుడు ఆ సమయంలో అంతం వస్తుందని దేవుని వాక్యం వివరిస్తుంది. మానవ చరిత్రలో అప్పటివరకు జరగని సంఘటనలు, పరిస్థితులు ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయి. వాటిల్లో కొన్ని ఇప్పుడు చూద్దాం.
1.ప్రపంచమంతటా అలజడులు మత్తయి పుస్తకం 24వ అధ్యాయం కొన్ని సంఘటనల గురించి చెప్తుంది. అవన్నీ కలిపి ఒకే సూచన. ఈ సూచన “యుగసమాప్తికి” గుర్తుగా ఉంటుంది, ఆ తర్వాత “అంతము” వస్తుంది. (3, 14 వచనాలు) పెద్దపెద్ద యుద్ధాలు, కరువులు, అక్కడక్కడ భూకంపాలు, అక్రమాలు పెరిగిపోవడం, మనుషుల మధ్య ప్రేమ లేకపోవడం, మతనాయకులు కుయుక్తిగా మనుషులను మోసం చేయడం వంటివి ఈ సూచనలో భాగం. (6-26 వచనాలు) నిజమే, వందల ఏళ్లుగా ఇవన్నీ కనిపించినా, అంతం దగ్గరపడినప్పుడు, ఈ విషయాలన్నీ ఈ కష్టకాలంలోనే జరుగుతాయి. ఈ సూచనతోపాటు ఇంకో మూడు కూడా జరుగుతాయి. వాటిని కూడా చూద్దాం.
2.మనుషుల ప్రవర్తన, ఆలోచన తీరు “అంత్యదినము లలో” అంటే అంతానికి ముందున్న సమయంలో మనుషుల ప్రవర్తన, ఆలోచనలు చెడిపోతాయని దేవుని వాక్యంలో ఉంది. “ఈ సంగతి తెలుసుకో – చివరిరోజులలో మహాకష్టమైన సమయాలు వస్తాయి. ఎందుకంటే, మనుషులు ఇలా ఉంటారు: స్వార్థప్రియులు, డబ్బంటే ప్రేమ గలవారు, బడాయికోరులు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, ప్రేమ లేనివారు, తీరని పగ గలవారు, అపనిందలు ప్రచారం చేసేవారు, తమను అదుపులో పెట్టుకోనివారు, క్రూరులు, మంచి అంటే గిట్టనివారు, ద్రోహులు, జాగ్రత్త లేని మూర్ఖులు, గర్విష్ఠులు, దేవునికి బదులు సుఖాన్నే ప్రేమించేవారు.” (2 తిమోతి 3:1-4, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) నిజమే, సాటి మనుషులను గౌరవించకపోవడం కొత్తేమీ కాదు, కాని “చివరిరోజులలో” మాత్రం ఇలాంటివన్నీ విపరీతంగా పెరిగిపోతాయి. అందుకే అది “మహాకష్టమైన” సమయం. అసహ్యం పుట్టించే ఈ లక్షణాలను మనుషుల్లో మీరు గమనించే ఉంటారు.
3.భూమిని మనుషులు పాడుచేస్తున్నారు “భూమిని నశింపజేయువారిని” దేవుడు నాశనం చేస్తాడని ఆయన వాక్యంలో ఉంది. (ప్రకటన 11:18) మనుషులు భూమిని ఏయే విధాలుగా నాశనం చేస్తున్నారు? నోవహు జీవించిన కాలం గురించి ఇలా ఉంది: “భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి యుండెను.” అప్పటి చెడిపోయిన సమాజం గురించి దేవుడు ఇలా చెప్పాడు: “వారిని . . . నాశనము చేయుదును.” (ఆదికాండము 6:11-13) రోజురోజుకి భూమ్మీద హింస పెరిగిపోతుంది అనడానికి రుజువులు మీరు కూడా గమనించే ఉంటారు. అంతేకాదు, చరిత్రలో మొదటిసారిగా మొత్తం మానవజాతినే లేకుండా చేసి, భూమిని నాశనం చేసే శక్తి ఇప్పుడు మనిషి చేతిలో ఉంది. అలా చేయడానికి కావాల్సిన ఆయుధాలు ఉన్నాయి. భూమి మరో విధంగా కూడా పాడౌతుంది. భూమ్మీద జీవానికి కావాల్సినవి అంటే మనం పీల్చుకునే గాలి, జంతు, వృక్ష సంపద, సముద్రాలు వంటివన్నీ మనుషుల నిర్లక్ష్యంవల్ల అస్తవ్యస్తం అయిపోతున్నాయి.
ఒకసారి ఆలోచించండి, ఒక వందేళ్ల క్రితం మొత్తం మానవ జాతిని నాశనం చేసే శక్తి మనిషికి ఉందా? కానీ ఇప్పుడు ఆ శక్తితో భయంకరమైన ఆయుధాలను సమకూర్చుకుంటున్నాడు, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాడు. ఇప్పుడు టెక్నాలజీ ఎంతో వేగంగా పరుగులు తీస్తోంది కానీ టెక్నాలజీ వల్ల వచ్చే సమస్యలను, వాటిని అరికట్టే విధానాలను మనిషి అంత వేగంగా కనుక్కోలేకపోతున్నాడు. నిజానికి ఈ భూమి భవిష్యత్తు మనిషి చేతుల్లో లేదు. భూమ్మీద ప్రాణులు లేకుండాపోయే కాలం రాకముందే, భూమిని నాశనం చేసేవాళ్లను నాశనం చేస్తానని దేవుడు మాటిస్తున్నాడు.
4.ప్రపంచవ్యాప్త ప్రకటనా పని అంతానికి ముందు కనపడే సూచనలో భాగంగా ముందెప్పుడూ జరగని ఒక పెద్ద పని జరుగుతుంది. “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” (మత్తయి 24:14) తరతరాలుగా మతాలు చేస్తున్న ప్రచారానికి ఈ పనికి చాలా తేడా ఉంది. అంత్యదినాల్లో, ఒక విషయాన్ని ఎక్కువగా చెప్తారు అదే “ఈ రాజ్య సువార్త.” ఈ వార్తను ఎక్కువగా చెప్తున్నది ఎవరో మీకు తెలుసా? కొందరు ఇలా చెప్తున్నట్టు అనిపించినా, కేవలం వాళ్లున్న ప్రాంతాల్లోనే ఈ పని చేస్తున్నారా లేదా “సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతట” ఈ వార్తను వ్యాప్తి చేస్తున్నారా?
ప్రపంచవ్యాప్తంగా వందల భాషల్లో దేవుని రాజ్యం గురించి చెప్తున్నారు
www.pr2711.com వెబ్‌సైట్ “ఈ రాజ్య సువార్త” గురించే ఎక్కువగా చెప్తుంది. ఈ వెబ్‌సైట్‌లో 700కన్నా ఎక్కువ భాషల్లో రాజ్య వార్తకు సంబంధించిన సమాచారం చూడవచ్చు. రాజ్య సువార్త ప్రపంచంలో అందరికి తెలిసేలా చేస్తున్న వేరే ఏదైనా కార్యక్రమం మీకు తెలుసా? ఇంటర్నెట్ రావడానికి చాలా కాలం ముందునుండే దేవుని రాజ్యం గురించిన వార్తను అందరికీ చెప్పడానికి యెహోవాసాక్షులు చాలా కృషి చేశారు. ఈ విషయంలో వాళ్లు మంచి పేరు సంపాదించుకున్నారు. 1939 నుండి వచ్చిన ప్రతీ కావలికోట పత్రిక ముందు పేజీలో “యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది” అనే పదాలు కనిపిస్తాయి. మతాల గురించిన ఒక పుస్తకం యెహోవాసాక్షులు చేసిన ప్రకటన పని గురించి “ఇంత ఎక్కువగా, ఇంత విస్తృతంగా ఇంక ఎవ్వరూ చేయలేదు” అని చెప్పింది. “అంతము” దేవుని రాజ్యం ద్వారా వస్తుంది అనే మంచివార్తను ఈ ప్రకటనా పని ముఖ్యంగా చెప్తుంది.
మానవ చరిత్రలో అత్యంత కీలకమైన సమయం
దేవుని వాక్యం చెప్పిన సూచనలన్నీ మీ జీవితకాలంలోనే జరుగుతున్నాయని మీరు గమనించారా? ఈ పత్రిక వందేళ్లకు పైగా, లోక సంఘటనల గురించి చెప్తూ, అంతం చాలా దగ్గర్లో ఉందనే రుజువులు సొంతగా తెలుసుకోవడానికి పాఠకులకు సహాయం చేసింది. అయితే వాస్తవాలు, గణాంకాలు పరిస్థితులు మారినప్పుడు మారతాయని లేదా మనుషులు వాటిని మార్చవచ్చని ఇలాంటి రుజువులను కొందరు కొట్టిపారేస్తారు. ముందులా కాకుండా ఇప్పుడు టెక్నాలజీ వల్ల లోకంలో జరిగేవన్నీ మనకు తెలిసిపోతున్నాయి. కాబట్టి పరిస్థితులు అంతకంతకు చెడిపోతున్నట్టు మనకు అనిపిస్తుందని వాళ్లంటారు. అయితే, మానవ చరిత్రలో ఒక కీలకమైన ఘట్టం ముగింపులో మనం ఇప్పుడు ఉన్నామని చెప్పడానికి ఎన్నో రుజువులు ఉన్నాయి.
ఈ భూమ్మీద పెద్దపెద్ద మార్పులు జరగబోతున్నాయని కొంతమంది నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు, మానవజాతినే లేకుండా చేసే కొన్ని ప్రమాదాల గురించిన హెచ్చరికల్ని 2014లో బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్స్ అనే పత్రిక ఐక్య రాజ్య సమితి భద్రతా మండలికి చెప్పింది. ఆ విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఇలా అన్నారు: “ఈ ప్రమాదాలన్నిటిని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు టెక్నాలజీ వల్ల మానవజాతి లేకుండాపోయే అవకాశం చాలాచాలా ఎక్కువగా ఉందని తెలుస్తుంది.” మానవ చరిత్రలో కీలకమైన దశకు చేరుకున్నామని చాలామంది గట్టిగా నమ్ముతున్నారు. ఆ దశే ఈ లోకానికి చివరి రోజులని, అంతం దగ్గర్లో ఉందనే విషయంలో ఈ పత్రిక ప్రచురణకర్తలకు, పాఠకులకు ఏ సందేహం లేదు. కాని భవిష్యత్తు గురించి భయపడే బదులు జరగబోయేవాటి గురించి మీరు సంతోషించవచ్చు. ఎందుకు? ఎందుకంటే, మీరు అంతాన్ని తప్పించుకోవచ్చు! (w15-E 05/01)