మానవ చరిత్రలో అతి ప్రాముఖ్యమైన సంఘటన
1 మనలను నిత్యజీవానికి నడిపించే సత్యానికి సాక్ష్యమిచ్చేందుకు యేసు తన తండ్రి నడిపింపుతో భూమిమీదకు వచ్చాడు. (యోహా. 18:37) మరణం వరకు ఆయన చూపిన నమ్మకం యెహోవాను ఘనపరచింది, దేవుని నామాన్ని పవిత్రపరచింది, క్రయధనాన్నిచ్చింది. (యోహా. 17:4, 6) ఇదే యేసు మరణాన్ని మానవ చరిత్రంతటిలో అతి ప్రాముఖ్యమైన సంఘటనగా చేసింది.
2 ఆదాము సృష్టించబడినప్పటి నుండి ఈ భూమిపై జీవించినవారిలో ఇద్దరు మాత్రమే పరిపూర్ణులైన పురుషులు. ఆదాము తనకు జన్మించని సంతతికి అద్భుతమైన ఆశీర్వాదాలను తెచ్చే స్థితిలో ఉండేవాడు. బదులుగా, మరణంతో ముగిసే దుఃఖకరమైన స్థితిలోనికి వారిని పడవేస్తూ, అతడు స్వార్థంతో ఎదురు తిరిగాడు. యేసు వచ్చినప్పుడు, ఆయన సంపూర్ణమైన యథార్థతను, విధేయతను ప్రదర్శించి, విశ్వసించే అందరికీ నిత్యము జీవించే అవకాశాన్ని కలిగించాడు.—యోహా. 3:16; రోమా. 5:12.
3 మరే సంఘటనను యేసు బలి మరణంతో పోల్చ శక్యం కాదు. అది మానవ చరిత్ర గమనాన్నే మార్చివేసింది. అది మరణం నుండి కోట్లకొలది ప్రజలు పునరుత్థానమవ్వడానికి ఆధారాన్నిచ్చింది. దుష్టత్వాన్ని అంతం చేసి భూమిని పరదైసుగా చేసే నిత్యము నిలిచే రాజ్యానికి అది పునాది వేసింది. అది చివరికి మానవజాతినంతటిని ప్రతివిధమైన హింస నుండి, బానిసత్వం నుండి విడుదల చేస్తుంది.—కీర్త. 37:11; అపొ. 24:15; రోమా. 8:21, 22.
4 ప్రతి సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణతో తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోమని యేసు తన శిష్యులకు ఎందుకు ఆజ్ఞాపించాడో గుణగ్రహించడానికి ఇదంతా మనకు సహాయం చేస్తుంది. (లూకా 22:19) దాని ప్రాముఖ్యతను గుణగ్రహిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షుల సంఘాలతోపాటు మనం కూడా శుక్రవారము, ఏప్రిల్ 14న సూర్యాస్తమయం తర్వాత కూడుకోవాలని ఎదురు చూస్తాం. దానికి ముందు, భూమిపైని యేసు చివరి రోజులను గూర్చి మరియు సత్యం కొరకు ఆయన ధైర్యంగా నిలబడడాన్ని గూర్చిన బైబిలు వృత్తాంతాలను కుటుంబమంతా కలిసి చదవడం మంచిది. (మన 1995 క్యాలెండరులో ఏప్రిల్ 9-14వరకు సిఫారసు చేయబడిన వాక్యాలు ఇవ్వబడ్డాయి.) మన సృష్టికర్తయెడల చూపించవలసిన భక్తి విషయంలో ఆయన మనకు మంచి మాదిరిని ఉంచాడు. (1 పేతు. 2:21) ఈ ప్రాముఖ్యమైన కూటానికి మన స్నేహితులను మరియు కుటుంబాన్ని, అలాగే బైబిలు విద్యార్థులను మరియు ఆసక్తిగల ఇతరులను ఆహ్వానించడానికి మనకు సాధ్యమైనదంతా చేద్దాం. ఏమి జరుగుతుంది మరియు చిహ్నాల అర్థమేమిటి అన్నవి ముందే వివరించండి.—1 కొరిం. 11:23-26.
5 రాజ్యమందిరం చక్కగాను శుభ్రంగాను ఉందని రూఢి చేసుకునేందుకు పెద్దలు ఎంతో ముందుగానే పథకం వేసుకోవాలి. చిహ్నాలను సిద్ధం చేయడానికి ముందుగానే ఎవరినైనా ఏర్పాటు చేయాలి. చిహ్నాలను అందించడమనేది సరైన విధంగా సంస్థీకరించబడాలి. ప్రభువు రాత్రి భోజనము యెడల ఎలా గౌరవాన్ని చూపాలి అనే దాని గూర్చిన సహాయకరమైన సలహాలు కావలికోట (ఆంగ్లం) ఫిబ్రవరి 15, 1985, పుట 19లో ఇవ్వబడ్డాయి. ఆచరణకు అనేక రోజులు ముందు అలాగే దాని తర్వాత కూడా కొన్ని రోజులు సంఘం కొరకు విస్తృతమైన ప్రాంతీయ సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం యుక్తము.
6 గత సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాముఖ్యమైన సంఘటనను జ్ఞాపకం చేసుకోడానికి మొత్తం 1,22,88,917 మంది హాజరయ్యారు. ఇది మన క్యాలెండరులో అతి ప్రాముఖ్యమైన దినం గనుక, మనం అందరం తప్పక హాజరు కావాలి.