బేతేలు సేవ—మరెక్కువ మంది స్వచ్ఛంద సేవకుల అవసరం ఉంది
1 ఈ అంత్య దినాల్లో యెహోవా చేస్తున్న గొప్ప పనిని చూసి మనం పులకించిపోతున్నాము. ఈ సమయంలో రాజ్య సేవలో చురుకైన పాత్రను వహించే సంసిద్ధతే దేవుని ప్రజల చెప్పుకోదగ్గ గుణమై ఉంటుందని కీర్తన 110:3 సూచిస్తుంది. భూమ్యంతటా రాజ్య సువార్త ప్రకటించబడేందుకు యెహోవా ప్రజలు తమను తాము అర్పించుకుంటున్నారు. ప్రచారకులు (ఆంగ్లం) అనే పుస్తకంలో 295వ పేజీ ఈ విధంగా చెబుతుంది: “భూగోళవ్యాప్త బేతేలు కుటుంబ సభ్యులుగా కొందరు సేవ చేస్తారు. బైబిలు సాహిత్యాల తయారీ మరియు ప్రచురణలో, కార్యాలయం పనిలో అవసరమైన శ్రద్ధ తీసుకోవడంలో, అలాంటి పనులకు మద్దతునిచ్చే సేవలను ఏర్పాటు చేయడంలో తమకు నియమించబడిన ఏ పనినైనా చేయడానికి స్వచ్ఛందంగా వచ్చే పూర్తికాల పరిచారకుల సిబ్బంది ఇది. వ్యక్తిగత ప్రాముఖ్యతను లేదా వస్తు సంపదలను సంపాదించుకునే పని కాదిది. యెహోవాను మహిమపరచాలన్నదే వారి కోరిక, మరి వారు ఆహారం, వసతి, మరియు వ్యక్తిగత ఖర్చుల కొరకైన కొద్దిపాటి మారుచెల్లింపుల కొరకైన ఏర్పాట్లతో సంతృప్తినొందుతారు.” మీరు బేతేలును సందర్శించినట్లయితే, అక్కడ జరుగుతున్న పని మీకిదివరకే కొంతమేరకు తెలిసి ఉండవచ్చు. అయినప్పటికీ, ఈ అసమానమైన సేవాధిక్యతల ఎడల మీ మెప్పును పెంచేందుకు మరి కొంత సమాచారాన్నివ్వాలని, సొసైటీ అవసరాలను గూర్చి మీకు తెలపాలని మేము ఆశిస్తున్నాము.
2 బేతేలు సేవ ప్రాముఖ్యతను, దాని శ్రేష్ఠమైన వారసత్వాన్ని వాస్తవికంగా దృష్టించేందుకు, యెహోవా సంస్థ యొక్క కొంత ప్రాచీన చరిత్రను, మరికొంత ఆధునిక చరిత్రను మనం పునఃసమీక్షిద్దాం. వాచ్‌టవర్ సొసైటీకి 56-60 ఆర్క్ స్ట్రీట్, అలిగేనీ, పెన్సిల్వేనియా నందు నాలుగు అంతస్థుల ఇటుకల భవనం దాదాపు 19 సంవత్సరాలపాటు ప్రధాన కార్యాలయంగా ఉండేది. అది బైబిల్ హౌస్ అని పిలువబడేది. అయితే, 1908 నాటికి, బైబిలు హౌస్ కుటుంబం లేదా సొసైటీ ప్రధాన కార్యాలయ సిబ్బంది 30 కన్నా ఎక్కువమంది సభ్యులుగా మారింది. అది విస్తరించబడవలసిన సమయం. దైవిక నడిపింపు కొరకు ప్రయత్నించిన తరువాత, పని కేంద్రానికి బ్రూక్లిన్ తగిన స్థలమని సహోదరులు తీర్మానించారు. కనుక బ్రూక్లిన్‌లోని 13-17 హిక్ స్ట్రీట్‌లోని ఒక భవనం సొసైటీ కార్యాలయ వసతికి, ఆడిటోరియమ్ కొరకు కొనుగోలు చేయబడింది. ఈ కార్యాలయాలు జనవరి 31, 1909 నాటికి తెరవబడ్డాయి, కాని ఈ హిక్స్ స్ట్రీట్ బిల్డింగ్ భాగంగా గృహ వసతులేమీ ఉండేవి కావు. గృహ వసతులను అద్దెకు తీసుకోవచ్చని మొదట తలంచబడింది. అయితే, బ్రూక్లిన్ హైట్స్ ప్రాంతంలోని నివాసాలేవీ కూడా అద్దెకు లభించలేదు. పరిస్థితులన్నీ మారగా, హెన్రీ వార్డ్ బ్రీచర్ ఇంతకు ముందు నివసించిన 124 కొలంబియా హైట్స్‌లో నాలుగు అంతస్థుల ఎరుపు గోధుమ వన్నెలోని భవనాన్ని సహోదరులు “బేరమాడి” కొనగల్గడం వారికి ఆశ్చర్యాన్ని మరియు సంతోషాన్ని కలిగించింది. అలాగే, దానితో కలిసి ఉన్న 126 కొలంబియా హైట్స్ కూడా లభించింది. మార్చి 1, 1909 కావలికోట (ఆంగ్లం) ఎంతో ఆనందంతో ఇలా ప్రకటించింది: పిట్స్బర్గ్ పదమైన “బైబిల్ హౌస్”కు బదులుగా “క్రొత్త ఇంటిని మనం బేతేలు అని పిలుస్తాము.” అలా 1909 ఏప్రిల్‌లో, బేతేలు పనిచేయనారంభించింది, కుటుంబమంతా క్రొత్త ఇంట్లోకి వచ్చేసింది. బ్రూక్లిన్ బేతేలు 86 సంవత్సరాలుగా ఈ స్థలంలోనే ఉంటుంది.
3 బేతేలు అనేది సొసైటీ ప్రధాన కార్యాలయానికి తగిన పేరేనా? బైబిలులోని ఆ పేరు ఆరంభం మరియు దాని సంబంధాలను గూర్చి పరిశీలించండి. 3,700 కన్నా ఎక్కువ సంవత్సరాల వెనక్కు వెళ్తే, ఆదికాండము 28వ అధ్యాయం 77 ఏండ్ల అవివాహితుడైన యాకోబు అనుభవాన్ని గూర్చి చెబుతుంది. యాకోబు పరిశుద్ధ విషయాల ఎడల మెప్పు కలిగి ఉండేవాడు, కాని అతని కవల సహోదరుడైన ఏశావు అతనిని ద్వేషించాడు. తన తండ్రియైన ఇస్సాకు నడిపింపులో యాకోబు బెయేర్షెబా నుండి పారిపోయి, అబ్రాహాము బంధువుల ఊరుకు, ఉత్తరం వైపుకు వెళ్ళిపోయాడు, వారి నుండే యాకోబు ఒక భార్యను కనుగొనాలనుకున్నాడు. దాదాపు 62 మైళ్ళు ప్రయాణం చేసిన తరువాత, యూదా కొండల్లో లూజు అనే ప్రాంతంలో విశ్రాంతి తీసుకోవడానికని యాకోబు ఆగాడు. ఆదికాండము 28:10-19 నందు దైవిక మద్దతు గురించి యెహోవా యాకోబుకిచ్చిన పూర్తి హామీని గూర్చిన ఆసక్తికరమైన వివరాలను మనం చదువుతాం. స్వప్నమందు, భూమి నుండి ఆకాశమంత ఎత్తున ఉన్న నిచ్చెనను యాకోబు చూశాడు. దేవ దూతలు నిచ్చెనను అవిరామంగా ఎక్కుతూ దిగుతూ ఉన్నారు, యెహోవా దాని పైన ఉన్నాడు. అప్పుడు అబ్రాహాముకు సంతానాన్ని గూర్చి ఇచ్చిన వాగ్దానం యాకోబుకు ఇవ్వబడిందని యెహోవా ఆయనను ఎడబాయడని రూఢిపరుస్తూ యెహోవా మాట్లాడాడు. ఆత్మీయ మనస్సు గల యాకోబుకు అది ఎంత భీతిని గొలిపే అనుభవమో కదా! ఆయన దృష్టిలో ఈ స్థలం ప్రత్యేకం కావడంలో ఏమైనా ఆశ్చర్యముందా? అతని దృష్టిలో అది “దేవుని మందిరము” లేదా హెబ్రీ భాషలో బేత్-ఏల్, బేత్ అంటే “మందిరము” ఏల్ అంటే “దేవుడు.”—ఆదికాండము 28:19, అథఃస్సూచి.
4 బేతేలు అనే పదానికి ఒక గొప్ప పూర్వచరిత్ర ఉంది, యెహోవా ప్రజల ప్రపంచ ప్రధాన కార్యాలయానికి ఇది తగిన పేరు. నేడు దేవుని సేవకులకు దైవ ప్రేరేపిత కలలు రావు. బేతేలు నుండి పరలోకానికి దేవదూతలు నిచ్చెన ఎక్కుతూ దిగుతూ కనిపించడం లేదు. సహోదరులు దర్శనాలను చూడడం లేదు లేక దేవుని స్వరాన్ని నేరుగా వినడం లేదు. అయినప్పటికీ, గడిచిన ఈ 86 సంవత్సరాల్లో అంటే, సహోదరుడు రస్సెల్ కాలం మొదలుకొని ఇప్పటి వరకు బేతేలులో జరిగిన విషయాలనన్నింటినీ తలపోసినప్పుడు, బేతేలులోని అబ్రాహాము యొక్క ఆత్మీయ సంతానం యొక్క భాగమైన తన అభిషక్త సేవకులకు తోడుగా యెహోవా హస్తం ఉందనడంలో సందేహమే లేదు. కనుక యెహోవా యొక్క ఆధునిక సాక్షుల చరిత్రలోని అనేక ముఖ్యమైన సంఘటనలు బ్రూక్లిన్ బేతేలుతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాయి! కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలించండి:
◼ అక్టోబరు 2, 1914న సహోదరుడు రస్సెల్ బేతేలు భోజన గదిలో అడుగుపెట్టగానే, కచ్చితంగా ఇలా ప్రకటించాడు: “అన్యజనముల కాలములు ముగిశాయి; వారి రాజులకివ్వబడిన కాలము ముగిసింది.”
◼ 1920ల తొలి భాగంలో ఉదయ కాల ఆరాధనలో సొసైటీ సంపాదకీయ సిబ్బంది సభ్యుడు “దేవుని సంస్థ“ అనే పదాన్ని ఉపయోగించాడు. ఇది సహోదరులను ఎంతగా ప్రేరేపించిందంటే రెండు భిన్నమైన వ్యతిరేకమైన సంస్థలు అంటే యెహోవాది మరియు సాతానుది ఉన్నాయని వాళ్ళు 1925 నాటికి గ్రహించారు.—w85 3/15 పే. 10.
◼ 1931లో ఒక రోజు ఉదయం పెందలకడనే, కొలంబస్ ఓహాయోలోని సమావేశానికి కొద్ది ముందు సొసైటీ అధ్యక్షుడైన సహోదరుడు రూదర్ఫర్డ్ యెహోవాసాక్షులనే పేరు దేవుని ప్రజలను గూర్చి, అప్పటికే వారు చేస్తున్న పనిని గూర్చి వర్ణిస్తుందని, వారు ఆయన సాక్షులుగా గుర్తింపబడాలని గ్రహించారు.—yb75 పే. 151.
◼ 1935 తొలి భాగంలో “గొప్ప సమూహం” లేదా “గొప్ప జనసమూహం” ఎవరు అనే దానిని గూర్చి ప్రశ్నలు లేవదీయబడ్డాయి. (ప్రక. 7:9; KJ) తమను తాము వెలిబుచ్చుకున్నవారిలో కొందరు తాము భూ సంబంధమైన తరగతివారని చెప్పుకున్నారు. మే 31, 1935న వాషింగ్టన్ డి.సి. నందలి సమావేశంలో సంతృప్తికరమైన ఓ వివరణ ఇవ్వబడింది.—jv పే. 166.
5 ఈ కొన్ని ఉదాహరణలు యెహోవా తన పరిశుద్ధాత్మ ద్వారా బేతేలులోని తన నమ్మకస్థులైన అభిషక్త సేవకులకు నడిపింపును మద్దతును ఎలా ఇచ్చాడో ఉదాహరిస్తున్నాయి. మరి దూతలను గూర్చి ఏమిటి? మన శత్రువుల నుండి విపరీతమైన వ్యతిరేకతను గూర్చి, వనరులు తక్కువగా ఉన్నప్పటి క్లిష్టమైన సంవత్సరాలను గూర్చి ఆలోచించినప్పుడు, దూతల సంరక్షణ, సహాయం లేకుండా బేతేలు ఈ సంవత్సరాలన్నింటిలో చెప్పుకోదగినంతగా పని చేసి ఉండేది కాదనడానికి సందేహం లేదు.
6 అమెరికాలోని ప్రధానకార్యాలయ సిబ్బందే కాకుండా, లోనావ్లాలోని ఒక బ్రాంచ్లోలాగే లోకమంతటా ఉన్న 100 బ్రాంచుల్లోనూ బేతేలు కుటుంబాలున్నాయి. మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరింపబడియున్నాము అనే పుస్తకం పేజీ 116 ఈ విధంగా చెబుతుంది: “బేతేలు అనే పేరు . . . దైవకార్యములకు కేంద్రములైన వీటికి నిశ్చయంగా తగియున్నది.” బేతేలు స్వచ్ఛంద సేవకులు ఎలాంటి పనులను చేయడానికి నియమించబడతారు?
7 వైవిధ్యమైన పని: బేతేలు కుటుంబ సభ్యులకు ఇవ్వబడే పని నియామకాలు విభిన్నంగా ఉంటాయి. బ్రూక్లిన్లోను, ఇండియాతో సహా మిగిలిన అనేక బ్రాంచ్లలోను కొందరు సహోదరులు ప్రపంచవ్యాప్త పంపకాని కొరకు పుస్తకాలను, (కొన్ని బ్రాచ్లలో బైబిళ్లను,) పత్రికలను, బ్రోషూర్లను మరియు కరపత్రాలను ముద్రించే ముద్రణాలయాల్లోను పని చేస్తున్నారు. మిగిలినవారు బైబిళ్ళను, పుస్తకాలను బైండ్ చేయడంలో పాల్గొంటుండగా, మరి కొందరి పనిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలకు ప్రచురణలను పంపించడం ఇమిడి ఉంది. అనేక మంది సభ్యులు పరికరాలను, భవనాలను పరిరక్షించేందుకు నియమించబడుతున్నారు. బేతేలు గృహంలోని కుటుంబ సంరక్షణ విషయంలో చాలా పని ఇమిడి ఉంది. ఉదాహరణకు, బ్రూక్లిన్ బేతేలులో 12 భోజన గదుల్లో దాదాపు 3,700 మందికి 20 నిమిషాల్లో ఉదయకాల అల్పాహారం అందించబడుతుంది. బట్టలుతికే స్థలంలో సహోదర సహోదరీలు ప్రతివారం 13,000 చొక్కాలతో సహా 16,000 కిలోల వస్త్రాలను ఉతుకుతారు. అంతే కాక, హౌస్కీపర్లు బ్రూక్లిన్‌లోని 21 నివాస భవనాలను ఉన్నత స్థాయిలో శుభ్రంగా ఉంచుతారు, అలాగే వేరే అనేక పనులను కూడా చేస్తారు. ఇండియాలోని బేతేలులోను 230 మంది సభ్యులకు కూడా అదే వసతులు ఇవ్వబడుతున్నాయి.
8 యోగ్యతలు మరియు అవసరతలు: దాదాపు వీటిలో ఎక్కువ పనులకు శారీరక శక్తి మరియు బలం అవసరం గనుక, ప్రస్తుతం ఆరోగ్యవంతులైన అవివాహితులైన యువకుల అవసరముంది. బేతేలు సేవ కొరకు దరఖాస్తు పెట్టేందుకు, ఒక యువకుడు సమర్పించుకుని బాప్తిస్మం పొంది కనీసం ఒక్క సంవత్సరమైనా గడిచి ఉండాలి. అతడు సమర్పించుకున్న, ఆత్మీయ వ్యక్తియై ఉండాలి. అలాగే, కష్టపడి పని చేసేందుకు సంసిద్ధుడై ఉండాలి. నేటి లోకంలో కష్టపడి పనిచేయడాన్ని తప్పించుకోవలసినదానిగా దృష్టిస్తారు. కనుక బేతేలు సేవకు దరఖాస్తు పెట్టుకునే యువకులు కష్టపడి పని చేయడానికి, తన చేతులతో మంచి పని చేయడానికి కోరుకునేంతగా క్రొత్త వ్యక్తిత్వాన్ని ధరించవలసిన అవసరం ఉంది. (ఎఫెస్సీయులు 4:28 పోల్చండి.) వ్యక్తిగత సంతోషాలు, ఉల్లాసాలు, వినోదాల వెంబడిపడే మనస్సు కలవాడు కాకుండా ఉండాలి అని దాని భావం. బేతేలు సేవను గూర్చి ఆలోచించినప్పుడు, ఆయన అప్పటికే అలాంటి యౌవన లక్షణాలను వదిలిపెట్టాలి. 1 కొరింథీయులు 13:11 నందలి పౌలు మాటలు బాగా అన్వయిస్తాయి: “నేను పిల్లవాడనై యున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని.”
9 మీరు 19 నుండి 35 ఏండ్ల మధ్య వయస్సులో ఉన్నారా? మీరు శారీరకంగాను భావోద్రేకపరంగాను మంచి ఆరోగ్యంతో ఉన్నారా? మీరు ఎంతో కొంత ఆంగ్లం మాట్లాడగలుగుతారా? మీరు యెహోవా ఎడల ఆయన సంస్థ ఎడల ప్రగాఢమైన ప్రేమ గల ఆత్మీయ వ్యక్తేనా? బేతేలుకు పిలువబడితే, ఇవ్వబడే ఏ పనినైనా చేస్తూ కనీసం ఒక సంవత్సరమైనా సేవలో నమ్మకంగా ఉంటారా? మీరు ఈ ప్రశ్నలకు అవును అని జవాబు చెప్పగల్గేటట్లయితే, మీరు ఈ అసమానమైన బేతేలు సేవను గూర్చి బాగా ఆలోచించగలరు. ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉంటాయి.
10 బేతేలు సేవ వలన కలిగే ఆశీర్వాదాలు: జూన్ 15, 1994 సంచికలోని “‘దేవుని మందిరము’ను మెప్పుతో చూచుట” అనే శీర్షిక ఈ విధంగా పేర్కొన్నది: “ఒక సమావేశానికి హాజరౌతున్నప్పుడు, యెహోవా యొక్క సంతోషకరమైన ఆరాధికులు నా చుట్టూ ఉన్నారనే లోతైన సంతృప్తిని మీరు పొందుతారా? ఒకసారి ఊహించండి, ఒక బేతేలు పనివానికి ప్రతిరోజు ఒక సహోదరుల గుంపు మధ్య యెహోవాను సేవించే ఆధిక్యత ఉంటుంది! (కీర్తన 26:12) అది ఆత్మీయాభివృద్ధికి ఎంతటి అద్భుతమైన అవకాశాలనిస్తుంది! తన వ్యక్తిత్వాన్ని రూపొందించుకోడానికి తాను మూడు సంవత్సరాల్లో వేరేచోట నేర్చుకున్న దాని కంటే బేతేలు నందు కేవలం ఒక సంవత్సరంలోనే ఎంతో ఎక్కువ నేర్చుకున్నానని ఒక సహోదరుడు గుర్తించాడు. ఎందుకు? ఎందుకంటే అంతమంది పరిపక్వత చెందిన క్రైస్తవ వ్యక్తిత్వాల విశ్వాసాన్ని గమనించి, అనుకరించే అవకాశం మరెక్కడా ఆయనకు లేదు.” (సామెతలు 13:20) నిజానికి ఇది బేతేలు సేవలోని అసమానమైన ఆశీర్వాదాల్లో ఒకటి.
11 బేతేలునందు, స్వచ్ఛంద సేవకులు బ్రాంచ్ కమిటీ సభ్యులతోను అలాగే ఎంతో కాలంగా నమ్మకంగా ఉన్న సహోదరులతోను సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటారు. ఒకరికి ఏ పని నియామకమున్నప్పటికీ, అలాంటి నమ్మకమైన, యథార్థపరులైన సహవాసులతో కలిసి పని చేయడం ఒక ఆశీర్వాదం. ఈ ప్రశస్తమైన సేవాధిక్యతలో భాగం వహించినవారి భావాలను ప్రతిబింబించే బ్రూక్లిన్ బేతేలు కుటుంబ సభ్యుల వ్యాఖ్యానాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
◼ సంవత్సరాలుగా విభిన్న నియామకాల్లో పని చేస్తూ 62 సంవత్సరాలుగా బేతేలు సేవలో ఉన్న ఒక సహోదరుడు బేతేలులో ఉండే స్ఫూర్తిని గూర్చి ఈ విధంగా వ్యాఖ్యానించాడు: “మనమంతా ఒక కుటుంబం; మనమందరం సహోదరులం. మనం కలిసి పనిచేస్తాం. మనకందరికి మన స్వంత నియామకాలున్నాయి. సహోదరులు కష్టపడి పనిచేయడాన్ని చూడడం ఎంతో అద్భుతంగా ఉంటుంది; వారు చేసే కృషిని మీరు చూడవచ్చు. మన సహోదరులు నేలను శుభ్రం చేస్తారు. మీరు పరిసరాలను శుభ్రంగా ఉంచినప్పుడు, కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచినవారౌతారు. మీరు కుటుంబాన్ని ఆరోగ్యవంతంగా ఉంచినప్పుడు, కుటుంబం ఫలవంతంగా ఉంటుంది. ఇది ఆవశ్యకం. కార్యాలయంలో పనిచేయడానికి మనుష్యులు ఉండడం ప్రాముఖ్యం. మనమందరం కలిసి ప్రపంచవ్యాప్త రాజ్య సాక్ష్యం అనే ఫలాన్ని ఫలిస్తాం. యెహోవాను సేవించడాన్ని ఒక వృత్తిగా చేసుకునేందుకు శ్రేష్ఠమైన స్థలమిదే. మీరు పూర్తికాల సేవలో ఉండాలనుకుంటే, మరింత శ్రేష్ఠంగా మీరు ఇక్కడే చేయగలరు. మీకు అన్నీ లభ్యమే. మనకిక్కడ అదనపు విషయాలు లభ్యం. మీరు లోకం నలు మూలల నుండి వినగలుగుతారు గనుక మీరు సంస్థను గూర్చి అర్థం చేసుకునేలా అది చేస్తుంది.”
◼ దాదాపు 48 సంవత్సరాల క్రితం పుస్తకాలను బైండ్ చేయడం మొదటి నియామకంగా లభించిన 75 ఏండ్ల అభిషక్త సహోదరుడు ఈ విధంగా అభిప్రాయపడ్డాడు: “సమర్పించుకొని, బాప్తిస్మం పొందిన యెహోవా సేవకుల మధ్య జీవించడం ఎంత చక్కని అనుభవం. ఒక యువకుడు బేతేలుకు వచ్చినప్పుడు, ఆ మనిషి ఇక్కడ బేతేలులో సంతోషకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నాడు గనుక, యెహోవా ఎడల కృతజ్ఞతా భావంతో నా హృదయం ఉప్పొంగిపోతుంది.” బేతేలును గురించి తన జ్ఞాపకాల నిధిలో ఉన్నవాటిని గూర్చి ఆయనింకా ఇలా చెప్పాడు: “నేను ఇందులోని ప్రజలను ప్రేమిస్తాను. వారు చక్కనివారని నేను తలస్తాను. అనేక సంవత్సరాలుగా బేతేలులో ఉంటున్న సహోదరులలో ఉన్నటువంటి ఒకటి భూమిపై ఉన్న మరే ప్రాంతంలోనూ కనిపించదు. అక్కడ గ్రహించలేనంతటి వాత్సల్యం, అవగాహన, ఐక్యత ఉన్నాయి.”
◼ 62 సంవత్సరాలకు పైగా బేతేలు సేవలో ఉన్న మరొక సహోదరుడు తాను పొందిన మరి కొన్ని ప్రయోజనాలను గూర్చి ఈ విధంగా వ్యాఖ్యానించారు: “బేతేలుకు రావడం ప్రచురణ రంగంలో మీరు ప్రత్యేక విద్యనభ్యసించడాన్ని సాధ్యపరుస్తుంది . . . ముఖ్యంగా ప్రపంచంలో మిమ్మల్ని ఎక్కడికి పంపించినప్పటికీ, మీరు యెహోవా దేవుని సరైన ప్రతినిధిగా ఉండేందుకు బైబిలు విద్యాభ్యాసం మిమ్మల్ని సన్నద్ధులను చేస్తుంది.”
◼ ఇప్పుడు 92 ఏండ్లున్న పరిపాలక సభ్యుడు బేతేలులో 58 సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు. బేతేలు సేవ గురించి ఆయన ఏమనుకుంటున్నారు? “ఇక్కడ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బేతేలు కుటుంబం సమర్పించుకున్న ప్రజల అద్భుతమైన ఏర్పాటు.”
◼ పరిపాలక సభలోని ఒక సభ్యుడు 98 ఏండ్ల వయస్సులో తన నియామకమందు నమ్మకస్థునిగా మరణించక మునుపు కొన్ని నెలల క్రితం ఆయన తన గురించి ఈ విధంగా చెప్పుకున్నారు: “నేను బేతేలులో సేవించడానికి ఇష్టపడతాను. ఇది సూర్యుని క్రింద అతి శ్రేష్ఠమైన స్థలం.”
◼ బేతేలు సేవను గూర్చిన ఒక యువకుని అభిప్రాయమేంటి? యువకుడైన ఒక సహోదరుడు ఇటీవల ఈ విధంగా వ్రాశారు: “యేసు చెప్పినట్లు ‘పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము’ గనుక, నేను ముందున్న మరే స్థలంకన్నా బేతేలు ఎక్కువ సంతోషం గల స్థలం.” ఇవ్వడం అనే బేతేలు స్ఫూర్తిని అతడు పొందాడు.
◼ 51 ఏండ్లు పూర్తికాల సేవ చేసిన ఒక సహోదరుడు విషయాలను చక్కగా క్లుప్తీకరించి ఈ విధంగా చెప్పారు: “బేతేలు సేవ నిజంగా అసమానమైనది. భూమిపై యెహోవా సంకల్పం నెరవేరడానికి అది ముఖ్యమైన భాగం. బేతేలులో సేవ చేసే ఆధిక్యత గల ఎవరైనా దానిని ఎంతో ఉన్నతంగా ఎంచాలి. నిజంగా దైవిక భక్తిగల జీవితాన్ని పూర్తిగా వ్యక్తపరచడాన్ని బేతేలు సాధ్యపరుస్తుంది.”
12 దిన చర్య: బేతేలు కుటుంబ సభ్యుని దినచర్య అతనిని రాజ్య పరిచర్యలో పూర్తిగా ముంచేస్తుంది. సోమవారం నుండి శనివారం వరకున్న రోజుల్లో ఉదయం 7 గంటలకు మన భోజన గదుల్లో ఉదయ కాల ఆరాధన మొదలౌతుంది. ఆ దినవచనం ఆధారంగా కుటుంబ సభ్యులు వ్యాఖ్యానాలను చేస్తారు, తరువాత బ్రాంచ్ కమిటీ సభ్యుడు లేదా అనేక సంవత్సరాలుగా పూర్తికాల సేవ చేస్తున్న మరో సహోదరుడు సంగ్రహాన్ని చెబుతారు, దాని తరువాత ఉదయకాల ప్రార్థన జరుగుతుంది. ఈ కార్యక్రమం కుటుంబాన్ని ఆ నాటి పనులకు ఆత్మీయంగా బలపరుస్తుంది. అది ఆ రోజు యొక్క ముఖ్య విషయం అని బేతేలు కుటుంబ సభ్యులు మీకు చెబుతారు. చక్కని అల్పాహారం తరువాత, బేతేలు కుటుంబ సభ్యులు తమ విభిన్నమైన పని నియామకాలకు ఆతురతగా వెళ్తారు. పనిరోజు సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 8 గంటల నుండి సాయంకాల 5 గంటల 10 నిమిషాల వరకు ఉంటుంది, మధ్యాహ్నం భోజనానికి ఒక గంట విరామం ఉంటుంది. శనివారంనాడు కూడా పని ఉదయం 8 గంటలనుండి 11 గంటల 55 నిమిషాల వరకు ఉంటుంది. సాయంకాలాల్లో, శనివారం మధ్యాహ్నాల్లో, ఆదివారాల్లో, బేతేలు సేవకులు తమ సంఘ కూటాలకు వెళ్తారు, ఇంటింటి సేవలో లేదా బైబిలు పఠన కార్యక్రమంలో పాల్గొంటారు లేదా వ్యక్తిగత బాధ్యతలను చూసుకుంటారు. వారు బేతేలు గ్రంథాలయ సౌకర్యాలను వ్యక్తిగత పఠనానికి లేదా కూటాలకు సిద్ధపడడానికి ఉపయోగించుకోవచ్చు. అవును, కావలసినంత విశ్రాంతి మరియు విశ్రమానికి కూడా సమయం ఉంటుంది. (మార్కు 6:31, 34) ఈ క్లుప్త వివరణ నుండి, ఈ పాత విధానపు ధ్యానభంగాలు లేకుండా ప్రతి రోజు పరిశుద్ధ సేవకు ఎక్కువ సమయాన్ని అర్పించడానికి బేతేలు సేవ ఒక వ్యక్తిని సులభంగా అనుమతిస్తుందని సులభంగా అర్థం చేసుకోవచ్చు.
13 సంఘ కార్యక్రమాలు: బ్రూక్లిన్ బేతేలు కుటుంబ సభ్యులు న్యూయార్క్ నగర ప్రాంతంలోని 350 కన్నా ఎక్కువ సంఘాలకు నియమించబడినట్లే, లోనావ్లాలోని బేతేలు కుటుంబ సభ్యులు మూడు సంఘాలకు నియమించబడ్డారు. తమ ఆత్మీయతను కాపాడుకోవడంలో స్థానిక సంఘాల పాత్ర విలువైనదిగా వారు ఎంచుతారు. అలా వారు ఐదు కూటాలకు హాజరౌతూ, ప్రాంతీయ పరిచర్యలో తమ సహోదరులతో క్రమంగా పాల్గొంటూ తమ సంఘాలతో చురుగ్గా ఉంటారు. సంఘ కూటాలే కాకుండా, బేతేలు కుటుంబానికి సోమవారం సాయంకాలాన తన స్వంత కావలికోట పఠనం ఉంది; అందరి ప్రయోజనార్థమై వ్యాఖ్యానాలు చేయడంలో బేతేలు సేవకులు వంతుల వారీగా నియమించబడతారు. బేతేలు పట్టిక ఆత్మీయ విషయాలకు ప్రాముఖ్యతనిస్తుంది గనుక యెహోవా సేవలో ఆనందకరమైన సంతోషకరమైన జీవితానికి అది కారణమౌతుంది.—1 కొరిం. 15:58.
14 బేతేలు సేవకు సిద్ధపడడం: బేతేలు సేవకొరకు సిద్ధపడడానికి తాము ఏమి చేయాలని యువకులు తరచూ అడుగుతూ ఉంటారు. సిబ్బంది వ్యవహార కమిటీలో సేవ చేస్తున్న పరిపాలక సభలోని ఒక సభ్యుడు ఈ విధంగా చెప్పారు: “మీరు బేతేలుకు వచ్చినప్పుడు, సేవించబడడానికి కాదు గాని, సేవ చేయడానికే రండి. మీరెంత ఎక్కువగా సేవ చేయడం నేర్చుకుంటారో, మీ సంతోషం అంత అధికంగా ఉంటుంది. తీసుకోవడం కాదు గాని ఇవ్వడమే నేర్చుకోండి. నమ్రతతోను మరియు వినయంగాను ఉండండి. ఆత్మ ఫలాల్లోనే నిజమైన క్రైస్తవత్వం ఉంది.” అవును, బేతేలులో విజయవంతంగా ఉండడానికి మీ ఆత్మీయతను యెహోవాతో మీ సన్నిహిత సంబంధాన్ని మెరుగుపరచుకోవడమే కీలకం. అందుకే బేతేలుకు క్రొత్త స్వచ్ఛంద సేవకులను ఎన్నిక చేసినప్పుడు తరచూ పయినీర్లనే తీసుకుంటారు. కొద్ది కాలంగా నెలలో 90 గంటలు ప్రకటన, బోధన మరియు ఇతరులకు ఇవ్వడం వంటి వాటితో గడిపినప్పుడు అలాగే తనను తాను పోషించుకోవడానికి ఒక వ్యక్తి తనను తాను క్రమ శిక్షణలో పెట్టుకున్నప్పుడు అతడు బేతేలు సేవకు, దాని క్రమమైన జీవిత విధానానికి ఒక మంచి ఆత్మీయ పునాదిని వేసుకున్నాడన్నమాట. అయితే, బేతేలు సేవ పయినీరింగ్ చేసే వారికి మాత్రమే పరిమితం కాదని దయచేసి గమనించండి. ప్రాథమిక అర్హతలను చేరుకున్నవారెవరైనా దరఖాస్తు పెట్టుకోవచ్చు.
15 అంతేకాకుండా, తమ చేతులతో ఎలా పని చేయాలో యువకులు నేర్చుకోవడం మంచిది. ఈ పాత విధానంలో కష్టించి పని చేయడం ప్రశంసాపూర్వకంగా చూడబడడం లేదు. ఎక్కువ ప్రయత్నం అవసరం లేని పనిని చేయడానికి లేదా బాహ్యమైన పరపతిని చూపించే పనిని కోరుకునే విధంగా స్వప్రేమ చాలామంది ప్రజలను పురికొల్పుతుంది. అయినప్పటికీ, విభిన్న పరికరాలను మరియు పద్ధతులను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం చాలా ఆచరణయోగ్యమైనది మరియు ఉపయోగకరమైనది. (సామె. 22:29) తరచూ, తమ తలిదండ్రుల నుండి లేదా రాజ్యమందిరం కొరకైన పథకాల్లో పనిచేసేందుకు అనుభవజ్ఞులైన పెద్దవారైన పురుషులకు సహాయపడడం ద్వారా లేదా పెద్దవారికి తమ ఇండ్లను బాగు చేసే పనిలో సహాయపడడం ద్వారా యువకులు శారీరకంగా కష్టపడవలసిన పనిని నేర్చుకుంటారు.
16 కొన్నిసార్లు యువకులు ఈ విధంగా అడుగవచ్చు: “నేను బేతేలు సేవకు యోగ్యతను పొందేందుకు అదనంగా లౌకిక తర్ఫీదును ఏమైనా పొందాలా?” లౌకిక తర్ఫీదు మాత్రమే ఒక వ్యక్తిని బేతేలు సేవకు యోగ్యునిగా చేయదు. ఆత్మీయ గుణాలు మరింత ప్రాముఖ్యమైనవి, ఆహ్వానించబడిన వారికందరికీ అవి ముఖ్యం. కావలికోట (ఆంగ్లం) నవంబరు 1, 1992 సంచికలోని 15 నుండి 21 వరకున్న పేజీల్లో చెప్పబడిన లౌకిక విద్యాభ్యాసాన్ని గూర్చిన సంతులిత దృష్టిని జాగ్రత్తగా పరిగణించమని ఇప్పటికీ పాఠశాలలో చదువుకునే వయస్సులో ఉన్న పిల్లలను, వారి తలిదండ్రులను మేము ప్రోత్సహిస్తున్నాము. లౌకిక విద్యాభ్యాసాన్ని గూర్చిన తీర్మానం అనేది వ్యక్తిగతమైన విషయం. ఒక వ్యక్తి ఏది తీర్మానించుకున్నా, సత్యానికి సాక్ష్యం ఇవ్వడమనే యెహోవా ప్రజల ముఖ్యమైన పనిపై తాను శ్రద్ధను నిలపడం ద్వారా తన ఆత్మీయ పురోగతిని తాను కాపాడుకోగలుగుతాడని అతడు నిశ్చయపరచుకోవలసి ఉంది.
17 ఒకరు ఏ రకమైన లౌకిక తర్ఫీదును పొందినప్పటికీ, ఎలా ఆలోచించాలి అని నేర్చుకోవడం చాలా విలువైనది. ఆలోచనా సామర్థ్యాన్ని, ఆచరణాత్మక బుద్ధిని బైబిలు మెచ్చుకుంటుంది. (సామె. 1:4; 3:21) ఎలా ఆలోచించాలన్నది నేర్చుకోవడం, సమాచారాన్ని గుర్తుంచుకోవడం మీకు మరియు ప్రపంచవ్యాప్త యెహోవా సంస్థకు ఉపయోగకరంగా ఉండే జ్ఞానాన్ని మరియు సామర్థ్యాలను సంపాదించడాన్ని మీకు సాధ్యం చేస్తుంది. చివరికి, ఒకరికి ఏ నైపుణ్యాలున్నా, ఇతరులతో సర్దుకుపోగలగడం చాలా ప్రాముఖ్యం. పనిని పూర్తి చేయడానికి బేతేలు స్వచ్ఛంద సేవకులు ఒక జట్టుగా సన్నిహితంగా కలిసి చేయవలసి ఉంది. అలా, స్వాతంత్ర్య స్ఫూర్తికి, పోటీపడే స్ఫూర్తికి బదులుగా సహకరించే, ప్రేమపూర్వకమైన గుణం మరియు దైవపరిపాలనా నడిపింపుకు లోబడే సంసిద్ధత రావాలి.—ఎఫెసీయులు 4:16 పోల్చండి.
18 పైన పేర్కొన్న సామర్థ్యాలను మెరుగుపరచుకోవడానికి కృషి చేసేందుకు యెహోవా సంస్థలోని యౌవనస్థులకు అద్భుతమైన అవకాశం ఉంది. అయితే, బేతేలులో సేవచేయడానికి ఆహ్వానించబడినట్లయితే, తరువాయి బాధ్యతలను వహించేందుకు వారు యెహోవా సంస్థ ద్వారా తర్ఫీదు పొందే మంచి స్థితిలో ఉంటారు. క్రైస్తవ తలిదండ్రులు, పెద్దలు ఈ విషయాన్ని పిన్నల ముందు ఉంచుతూనే ఉండాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. అనేక మంది తలిదండ్రులు తమ పిల్లలను బేతేలు పర్యటనకు క్రమంగా తీసుకువస్తారు, అలా ఇక్కడ చేయబడే వాటితో వారు పరిచయాన్ని పొందుతారు. తమ విద్యాభ్యాసం ముగిసిన తరువాత బేతేలుకు రావడానికి అనేకులను ఇది నడిపింది.
19 అనుభవజ్ఞులైనవారు: బేతేలులో అవసరమైన తర్ఫీదు మరియు సామర్థ్యాలున్న 35 కన్నా కొంచెం ఎక్కువ వయస్సున్న సహోదరునికి లేదా సహోదరికి ఒక్కొక్కసారి అవకాశముంటుంది. సొసైటీ ప్రస్తుతం ఇమిడి ఉన్న అనేక పనులకు తర్ఫీదు పొందగల సమర్థతగల సామర్థ్యము గల పురుషులతోపాటు అనుభవజ్ఞులైనవారి అవసరం అంటే ‘శిష్యునితోపాటు గురువు’ అవసరం.—1 దిన. 25:8.
20 నేడు పెరుగుతున్న పనికి ఎలక్ట్రానిక్స్ తెలిసినవారి లేదా కంప్యూటర్ ప్రోగ్రామ్‌లో అనుభవం గలవారి అవసరం ఉంది. సొసైటీకి ఫోటోకాపీ యంత్రాలు, లేసర్ ప్రింటర్లు, పర్సనల్ కంప్యూటర్లు చాలా ఉన్నాయి, వాటన్నింటికి మరమ్మతు అవసరం ఉంది. ఇంజనీరింగ్, ప్లమింగ్, ఎలక్ట్రికల్, మరియు ఎయిర్-కండీషనింగ్ వంటి వివిధ నిర్మాణ పనుల్లో సామర్థ్యమున్నవారిని ఉపయోగించుకోవచ్చు. అకౌంటింగ్ నిపుణత గల పరిపక్వత గల సహోదరులు, ముఖ్యంగా సర్టిఫికెట్ గలవారు సహాయకరంగా ఉంటారు. ఖర్చులను తగ్గించేందుకు, సొసైటీ రవాణా సౌకర్యాల కొరకు, సాహిత్యాలను రవాణా చేసేందుకు స్వంతంగా అనేక వాహనాలను ఉపయోగిస్తుంది. కనుక అనుభవజ్ఞులైన డ్రైవర్లు మరియు మెకానిక్‌ల అవసరముంది.
21 సమర్పించుకున్న అవివాహితులైన సహోదరుల మరియు ప్రత్యేక సామర్థ్యము గల సహోదరుల అవసరతే చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్రత్యేక సామర్థ్యము గలవారిలో కొందరు వివాహితులు కావచ్చు. జిల్లా సమావేశంలో జరిగే బేతేలు సేవలో ఆసక్తి ఉన్నవారి కొరకైన ప్రత్యేక కూటంలో మీరు బేతేలు దరఖాస్తులను పొందవచ్చు లేదా మీరు Watch Tower Society, Post Bag 10, Lonavla, MAH 410 401కి వ్రాయవచ్చు. మీరు వివాహితులైతే, మీ జత కూడా ఆత్మీయంగా, భావోద్రేకంగా, మరియు శారీరకంగా బేతేలు సేవకు యోగ్యతగల వ్యక్తియై ఉండాలని గుర్తుంచుకోండి. ముందు పేర్కొనబడిన రంగాల్లో ఏదైన ఒక దానిలో మీకు తర్ఫీదు మరియు అనుభవం ఉన్నట్లయితే, దయచేసి, మీ వృత్తిని గూర్చిన వివరాలను క్లుప్తంగా వ్రాసి మీ బేతేలు దరఖాస్తుకు దానిని జోడించండి.
22 వెంటనే పిలిస్తే మీరు ప్రతిస్పందించగలరా? బేతేలు స్వచ్ఛంద సేవకుల అత్యవసరముంది. మీరు బేతేలు సేవ కొరకైన యోగ్యతలను చేరుకున్నట్లయితే, ఈ అగత్య పిలుపుకు జవాబుగా మీరు బేతేలు దరఖాస్తును ఇవ్వండి. మీరు వెంటనే ఆహ్వానించబడకపోతే నిరుత్సాహం చెందకండి. మీరు మీ దరఖాస్తును ప్రతి సంవత్సరం పునరుద్ధరించుకోవచ్చు. మీరు అందుబాటులో ఉన్నారనే ప్రస్తుత సమాచారాన్ని అది మాకిస్తుంది.
23 యెషయా వింటుండగా యెహోవా “నేను ఎవని పంపెదను మా నిమిత్తము ఎవడు పోవునని” అడిగాడు. ఏమాత్రం సందేహించకుండా “చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమ”ని యెషయా ప్రతిస్పందించాడు. అలా, యెషయా యెహోవా ప్రవక్తగా ఓ అసాధారణమైన వృత్తిలో ప్రవేశించాడు. “చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమ”ని మీరనగలరా? “దేవుని మందిరమైన” బేతేలులో సేవ చేయడానికి మీరు ఆహ్వానించబడితే, మీ కొరకు ఎన్నో ఆశీర్వాదాలు వేచి ఉన్నాయి.—యెష. 6:8.