ఎల్లప్పుడు యెహోవాను స్తుతించుడి
1 మన అవధానాన్ని ఎల్లప్పుడు పొందదగినంత ప్రాముఖ్యమైన కార్యాలు కొన్ని ఉన్నాయి. వాటిలో తినడాన్ని, శ్వాసించడాన్ని, నిద్రించడాన్ని మనం చేరుస్తాము. మనల్ని మనం శారీరకంగా బలపర్చుకోవాలంటే ఇవి అత్యవసరం. “మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము” అని అపొస్తలుడైన పౌలు కోరినప్పుడు ఆయన సువార్త ప్రకటించడాన్ని ఆ వర్గంలోకే చేర్చాడు. (హెబ్రీ. 13:15, ఐటాలిక్కులు మావి.) కాబట్టి, యెహోవాను స్తుతించడం కూడా ఎల్లప్పుడు మన అవధానాన్ని పొందదగినదే. ఎల్లప్పుడు మన పరలోక తండ్రిని స్తుతించడమన్నది మనం ప్రతి రోజు చేయడానికి ప్రయత్నించవలసినది.
2 ఇతరులు యేసు అవధానాన్ని మరో వైపుకు మళ్లించాలని ప్రయత్నించినప్పుడు, ఆయన ఇలా ప్రతిస్పందించాడు: ‘నేను దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను.’ (లూకా 4:43) తన మూడున్నర సంవత్సరాల పరిచర్య కాలంలో, ఆయన ప్రతిరోజు చేసిన ప్రతిదీ ఏదోవిధంగా దేవున్ని మహిమపర్చడంతో సూటిగా సంబంధం కలిగివుండింది. “నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ” అని 1 కొరింథీయులు 9:16 నందు పౌలు వ్యక్తపర్చిన తలంపు దృష్ట్యా, ఆయన ఆ విధంగానే భావించాడని మనకు తెలుసు. ఇతర నమ్మకమైన క్రైస్తవులు తమ నిరీక్షణను గూర్చి ఇతరుల ఎదుట సమాధానం చెప్పేందుకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలని ప్రోత్సహించబడ్డారు. (1 పేతు. 3:15) అలాంటి మంచి ఉదాహరణలను అనుకరించడానికి నేడు ఆసక్తిగల లక్షలాదిమంది పయినీర్లు, లక్షలాదిమంది సంఘ ప్రచారకులు ప్రయాసపడుతున్నారు.
3 మన మాదిరికర్తయైన యేసుక్రీస్తు ప్రదర్శించిన హృదయపూర్వక ఆసక్తి గురించి మనం తలంచినప్పుడు, ఆయన అడుగుజాడలను సన్నిహితంగా అనుసరించేందుకు మనం పురికొల్పబడతాము. (1 పేతు. 2:21) అనుదిన జీవిత సమస్యలను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం నిరుత్సాహపడవచ్చు. మనం పూర్తికాల ఉద్యోగం చేస్తూ, యెహోవాను స్తుతించేందుకు గల అవకాశాలను ప్రతిదినం ఎలా సద్వినియోగం చేసుకోగలం? మన సమయాన్ని ఎంతగానో వెచ్చించవలసిన అవసరంగల కుటుంబ బాధ్యతలను మనం విడిచిపెట్టలేము. అనేకమంది యౌవనులు అవసరమైన ప్రతిదిన పాఠశాల పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రతి దినం యెహోవాను బహిరంగంగా స్తుతించడం సాధ్యం కాదని కొందరు భావించవచ్చు. కొందరు కొన్నిసార్లు, ఏదో విధంగానైనా సువార్తను పంచుకోకుండా మొత్తం నెల గడిచిపోనిస్తారు.
4 యిర్మీయా సువార్త ప్రకటించకుండా ఉండలేకపోయాడు. కొంతకాలం యెహోవా నామమున మాట్లాడడానికి విఫలమైనప్పుడు, ఆయన తనలో భరించరాని అగ్ని మండుతున్నట్లు భావించాడు. (యిర్మీ. 20:9) లొంగదీసుకుంటున్నట్లనిపించే కష్టాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, యెహోవా వర్తమానాన్ని గూర్చి ఇతరులతో మాట్లాడడానికి యిర్మీయా ఎల్లప్పుడు ఏదొక మార్గాన్ని కనుగొనేవాడు. ధైర్యాన్ని గూర్చిన ఆయన మాదిరిని అనుకరిస్తూ, సృష్టికర్తను ప్రతిదినం స్తుతించడానికిగల అవకాశాలను వెదకడంలో మనం పట్టుదల కలిగి ఉండగలమా?
5 మనం యెహోవా గురించి మాట్లాడడమన్నది, ఇతర ప్రచారకులతో కలిసి సంఘ ప్రాంతంలో సాక్ష్యమిచ్చేందుకు ముందే ఏర్పాటు చేయబడిన సమయాల్లో నియతంగా మాట్లాడడానికి మాత్రమే పరిమితమై ఉండకూడదు. మనకు కావలసిందల్లా వినే వాళ్లే. మనం ప్రతి దినం ప్రజలను ఎల్లప్పుడూ కలుస్తూనే ఉంటాము—వాళ్లు మన ఇంటికి వస్తారు, ఉద్యోగ స్థలంలో మనం వారితో కలిసి పనిచేస్తాము, దుకాణాల్లో మనం వారి ప్రక్కన నిలబడతాము, లేదా బస్సులో మనం వారితో కలిసి ప్రయాణిస్తాము. అవసరమైనవేమిటంటే, స్నేహపూర్వకమైన అభివాదం, సంభాషణను ప్రారంభించగల ఆలోచన-రేకెత్తించేలాంటి ప్రశ్న లేదా వ్యాఖ్యానం. ఇది తమకు అత్యంత ఫలవంతమైన సాక్ష్యమిచ్చే విధానంగా ఉన్నట్లు అనేకులు కనుగొన్నారు. సువార్త గురించి ఇతరులతో మాట్లాడడానికి మనకు అనేక అవకాశాలు ఉన్నప్పుడు, రాజ్య సాక్ష్యం ఇవ్వకుండానే ఒక నెల మొత్తం గడిచిపోనివ్వడం మనకు ఊహించలేనిదిగా ఉండగలదు.
6 యెహోవాను స్తుతించే ఆధిక్యత ఎన్నడూ నిలిచిపోదు. కీర్తనల రచయిత సూచించినట్లుగా, సకలప్రాణులు యెహోవాను స్తుతించాలి, అందులో చేరివుండాలని మనం కూడా తప్పకుండా కోరుకుంటాము. (కీర్త. 150:6) ఎల్లప్పుడు అలా చేయడానికి మన హృదయం మనల్ని పురికొల్పితే, యెహోవా గురించి, ఆయన వాక్యం గురించి మాట్లాడడానికి గల అవకాశాలను మనం ప్రతిరోజు సద్వినియోగపర్చుకుంటాము.