వినే వ్యక్తిని నేనెలా కనుగొనగలను?
1 ఫిలిప్పీ అనే నగరంలో ‘లూదియ అనే . . . ఒక స్త్రీ వింటూ ఉండేది. ఆమె ఊదారంగు పొడిని అమ్మే తుయతైర పట్టణస్థురాలు. పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచడానికి యెహోవా ఆమె హృదయాన్ని తెరిచాడు.’ (అపొ. 16:14) ఈ వృత్తాంతం మనకేమి బోధిస్తుంది? వినడం ఒక వ్యక్తి సత్యాన్ని నేర్చుకునేందుకు మార్గాన్ని తెరుస్తుంది. రాజ్య వర్తమానాన్ని పంచుకోవడంలో మన సాఫల్యమనేది ముఖ్యంగా గృహస్థుడు వినడానికి చూపించే సుముఖతపై ఆధారపడి ఉంటుంది. మనకొకసారి వినే వ్యక్తి దొరికితే, మన వర్తమానాన్ని అందించడం చాలా సులభంగా ఉంటుంది. కాని వినే వ్యక్తి దొరకడం ఒక సవాలు కాగలదు. మనమేమి చేయగలం?
2 సేవలో పాల్గొనకముందు, మనం కనిపించే తీరుకు, మనం ఉపయోగించబోయే ఉపకరణాలు ఎలా ఉన్నాయి అనేదానికి మనం శ్రద్ధనివ్వాలి. ఎందుకని? హుందాగా కనిపించేవారు చెప్పేది వినడానికి ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతారు. అభిరుచికి తగ్గట్లు, తగిన విధంగా వస్త్రాలను ధరిస్తున్నారా? అశ్రద్ధతోకూడిన వస్త్రధారణ లోకంలో ప్రసిద్ధమైనప్పటికీ, మనం దేవుని రాజ్యానికి ప్రాతినిధ్యం వహించే పరిచారకులం గనుక మనమలా నిర్లక్ష్యంగా ఉండము. మనం ప్రకటించే రాజ్య వర్తమానానికి మనం శుభ్రంగా చక్కగా కనబడడం అనుకూలమైన సాక్ష్యాన్ని జతచేస్తుంది.
3 స్నేహపూర్వకంగాను, మర్యాదగాను ఉండండి: మారుతున్న నేటి దృక్పథాలకు బదులుగా చాలా మంది ప్రజలకు బైబిలు అంటే గౌరవం ఉంది, బైబిలులోని విషయాలను గూర్చిన గౌరవపూర్వకమైన, స్నేహపూర్వకమైన సంభాషణకు వారు అనుకూలంగా ప్రతిస్పందించవచ్చు. ఆప్యాయతతో కూడిన యథార్థమైన నవ్వు గృహస్థున్ని నెమ్మదిపరచి, ఆహ్లాదకరమైన చర్చకు మార్గాన్ని తెరవగలదు. మన నిజాయితీ మరియు మంచి ప్రవర్తన మన మాటలోను ప్రవర్తనలోను ప్రస్ఫుటమవ్వాలి, అందులో గృహస్థుని అభిప్రాయాలను వినయంగా వినడం కూడా ఇమిడి ఉంది.
4 బైబిలు నిరీక్షణను ఇతరులతో పంచుకోవడమన్నదే మన లక్ష్యం. దీనిని మనస్సులో ఉంచుకొని, మన సంభాషణ శత్రుత్వాన్ని కలిగించేవిధంగా, లేదా సవాలు చేసే విధంగా కాక, ఆకర్షణీయంగా మరియు లౌక్యంగా ఉండేలా జాగ్రత్తపడాలి. స్పష్టంగా వ్యతిరేకిస్తున్న ఒకవ్యక్తితో వాదిస్తూ సమయాన్ని వృథా చేయనవసరం లేదు. వాదనలను జయించాలన్నది లేదా మన పనిని ఇష్టపడని ప్రజలపై మన నమ్మకాలను రుద్దాలన్నది కాదు మన లక్ష్యం. (2 తిమో. 2:23-25) మన రాజ్య పరిచర్యలోను మరియు తర్కించుట (ఆంగ్లం) అనే పుస్తకంలోను మనకోసం ఇవ్వబడిన ప్రోత్సాహాన్నిచ్చే అనేక రకాల సమయోచిత అందింపుల నుండి మనం ఎన్నిక చేసుకోవచ్చు. నిజమే, మనం ఉత్సాహంగా ఒప్పించే విధంగా మాట్లాడగల్గేందుకు మనం వీటిని బాగా సిద్ధపడవలసిన అవసరం ఉంది.—1 పేతు. 3:15.
5 మన మొదటి సందర్శన తరువాత, మనం చెప్పినదేమిటో గృహస్థులందరూ కచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోలేరు. అయినప్పటికీ, వారందరూ అది ఏ విధంగా చెప్పబడింది అనే దానిని గుర్తుంచుకుంటారు. మంచితనం మరియు దయ అనే వాటి యొక్క శక్తిని మనమెన్నడూ తక్కువ అంచనా వేయకూడదు. మొదటి శతాబ్దంలోని లూదియ వలె సత్యాన్ని వినేందుకు చెవినిచ్చే గొర్రెవంటి ప్రజలు చాలామంది మన ప్రాంతంలో తప్పకుండా ఉంటారు. మనం కనిపించే తీరుకు, మనం మాట్లాడే విధానానికి జాగ్రత్తగా శ్రద్ధనివ్వడం యథార్థతగల ప్రజలు దేవుని వాక్యాన్ని వినడానికి దానిని ఆనందంగా అంగీకరించడానికి ప్రోత్సాహాన్నివ్వగలవు.—మార్కు 4:20.