ఇతరులకు బోధించేందుకు అర్హులుగానూ సంసిద్ధులుగానూ తయారవ్వడం
1 మోషే యెహోవాకు ప్రతినిధిగా నియమితుడైనప్పుడు, దేవుని వాక్యాన్ని ఫరోకు ప్రకటించేందుకు తాను అర్హుడను కానని భావించాడు. (నిర్గ. 4:10; 6:12) ఎలా మాట్లాడాలో తెలియదని యెహోవాకు చెబుతూ దేవుని ప్రవక్తగా సేవచేయగలడనే ఆత్మవిశ్వాసం తనకు లేదని యిర్మీయా వ్యక్తం చేశాడు. (యిర్మీ. 1:6) ప్రారంభంలో వారికి ఆత్మవిశ్వాసం లేకపోయినప్పటికీ ఆ ఇద్దరు ప్రవక్తలూ యెహోవాను గూర్చి నిర్భయమైన సాక్ష్యాన్నిచ్చిన వారిగా నిరూపించుకున్నారు. వారికి అవసరమైనంత సహాయం దేవుని నుండి లభించింది.
2 నేడు, ఆత్మవిశ్వాసంతో మన పరిచర్యను మనం నెరవేర్చేందుకు అవసరమైనవి మనకున్నందుకు యెహోవాకు కృతజ్ఞులం. (2 కొరిం. 3:4, 5; 2 తిమో. 3:17) ఉపకరణాలన్నీ ఉన్న అర్హుడైన ఓ మెకానిక్లా, మనకు నియమించిన పరిచర్యను నైపుణ్యవంతంగా నెరవేర్చేందుకు మనం తగిన విధంగా సంసిద్ధులంగా ఉన్నాము. జనవరి నెలలో ప్రత్యేక ధరకు అందించగల 192 పేజీల పాత పుస్తకాల్లో దేనినైనా మనం అందిస్తాము. ఈ ఆత్మీయ పరికరాలు క్రొత్తవి కాకపోయినప్పటికీ, వాటి ఆత్మీయ అంశాలు ఇంకా తాజాగానే ఉన్నాయి అంతేకాకుండా ఈ పుస్తకాలు ప్రజలు సత్యాన్ని నేర్చుకునేందుకు సహాయపడతాయి. క్రింద ఇవ్వబడిన ఈ అందింపులు మీరు అందించే ఏ పుస్తకానికైనా సరిపోవచ్చు.
3 దేవుని వాక్యంలో ఆసక్తిని కలిగించేందుకు విద్యాభ్యాసం అనే విషయాన్ని ఉపయోగించవచ్చు. అనువైన చోట చొరవ తీసుకుని సంభాషణను ఇలా ప్రారంభించవచ్చు:
◼ “మంచి విద్య అవసరమని ఈ రోజుల్లో ఎక్కువగా అంటున్నారు. మీ ఉద్దేశంలో, జీవితంలో అమితానందాన్ని పొంది విజయాన్ని సాధించేందుకు ఎలాంటి విద్యనార్జించాలంటారు? [ప్రతిస్పందించనివ్వండి.] దేవుని జ్ఞానాన్ని తీసుకునేవాళ్లు శాశ్వత ప్రయోజనాలను పొందుతారు. [సామెతలు 9:10, 11 చదవండి.] ఈ పుస్తకం [మీరు ఇచ్చే పుస్తకం పేరు చెప్పండి] బైబిలుపై ఆధారపడి ఉంటుందన్నమాట. నిత్యజీవానికి నడిపించగల మహత్తర జ్ఞానానికి మూలం బైబిలని ఈ పుస్తకం వివరిస్తుంది.” ఈ పుస్తకంలోని నిర్దిష్టమైన ఉదాహరణను చూపించండి. నిజమైన ఆసక్తి ఉన్నట్లైతే, ఆ పుస్తకాన్ని ఇచ్చి పునర్దర్శనానికి ఏర్పాటు చేయండి.
4 బైబిలు విద్యాభ్యాస ప్రాముఖ్యతను గూర్చి మీరు చర్చించిన గృహస్థునివద్దకు మీరు మరలా వెళ్లినట్లైతే మీరు ఇలా చెప్పవచ్చు:
◼ “నేను క్రితం సారి వచ్చినప్పుడు, మన నిరంతర భవిష్యత్తునిచ్చే విద్యను బైబిలే ఇస్తుందని మనం చర్చించుకున్నాం. లేఖనాలనుండి మనం తెలుసుకోవల్సినదాని గూర్చి నేర్చుకునేందుకు కృషి అవసరమేననుకోండి. [సామెతలు 2:1-5 చదవండి.] బైబిలులోని కొన్ని భాగాలను అర్థం చేసుకోవడం కష్టమని చాలామంది భావిస్తారు. బైబిలులోని ప్రాథమిక బోధలను గూర్చి ప్రజలు ఇంకా ఎక్కువగా తెలుసుకునేందుకు మేము ఎంతో విరివిగా ఉపయోగించిన ఓ పద్ధతిని మీకు క్లుప్తంగా చూపించాలనుకుంటున్నాను.” క్రితంసారి వారికిచ్చిన పుస్తకాన్ని ఉపయోగిస్తూ సరైన పేజీకి దాన్ని తెరిచి బైబిలు పఠనాన్ని క్లుప్తంగా చూపించండి. గృహస్థుడు క్రమంగా పఠించాలని ఇష్టపడినట్లైతే, పఠన సహాయకమైన నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకాన్ని తీసుకుని మరలా వస్తానని చెప్పండి.
5 లోకంలోని లక్షలాదిమంది పిల్లల బాధలను చూసి అనేకమంది కలత చెందుతున్నారు. ఈ వేదనను దేవుడు ఎలా దృష్టిస్తున్నాడో గ్రహించేందుకు సహాయపడడానికి గృహస్థునికి మీరు ఇలా చెప్పవచ్చు:
◼ “భూవ్యాప్తంగా ఆకలికీ రోగాలకు గురైన వదిలేయబడిన పిల్లలను గూర్చిన వార్తానివేదికలను మీరు చూసేవుంటారు. వీటికి సంబంధించిన సంస్థలు ఈ పరిస్థితిని ఎందుకు మెరుగుపర్చలేకపోయాయి? [ప్రతిస్పందించనివ్వండి.] మానవులకు శ్రేష్ఠమైన దాన్ని మాత్రమే ఇవ్వాలన్నది దేవుని కోరిక. బైబిలులో రాసినట్లుగా పిల్లల కొరకు పెద్దల కొరకు ఆయన ఎమి వాగ్దానం చేస్తున్నాడో గమనించండి. [ప్రకటన 21:4 చదవండి.] ఈ పుస్తకం [దాని పేరును చెప్పండి], దేవుడు తయారుచేసే బాధలేని లోకాన్ని గూర్చి మరిన్ని వివరాలనిస్తుందండి.” వీలైతే, పరదైసును చూపించే ఓ చిత్రాన్ని తీసి చూపించి దాన్ని చర్చించండి. ఆ పుస్తకాన్నిచ్చి మరో పునర్దర్శనానికి ఏర్పాట్లు చేయండి.
6 మొదటిసారి పిల్లల బాధలను గూర్చి మీరు మాట్లాడినట్లైతే, తర్వాతి సందర్శనంలో ఇలా చెబుతూ మీరు మీ చర్చను కొనసాగించవచ్చు:
◼ “మొన్న నేను మీ ఇంటికి వచ్చినప్పుడు, కుటుంబాలు విడిపోవడమూ కరువులూ రోగాలూ హింస మూలంగా పిల్లలు బాధననుభవించడం వంటి విషయాల్లో మీరు మీ బాధను వ్యక్తంచేశారు కదండి. అటు పిల్లలు గానీ ఇటు పెద్దలు గానీ రోగాలనూ నొప్పినీ మరణాన్నీ అనుభవించని లోకాన్ని గూర్చి బైబిలులో చదవడం ఎంతో ఓదార్పునిస్తుంది. యెషయాలోని ఓ ప్రవచనం భూమ్మీదికి రాబోయే మంచి జీవితాన్ని వర్ణిస్తోంది.” యెషయా 65:20-25 చదివి చర్చించండి. జ్ఞానము పుస్తకంలో బైబిలు పఠనాన్ని ప్రారంభించేంతవరకు కొనసాగించండి.
7 ప్రార్థనచేయడం మతాసక్తిగల ప్రజలకు సాధారణమే కనుక, ఇలా చెప్పడం ద్వారా ఈ విషయంపై మీరు సంభాషణను ప్రారంభించవచ్చు:
◼ “మన జీవితంలో ఎప్పుడోకప్పుడు మనలో అనేకులం సమస్యలను ఎదుర్కొన్నాం. అవి, మనం సహాయం కొరకు దేవునికి ప్రార్థించేలా చేశాయి. అయితే, తమ ప్రార్థనలకు జవాబులు రావడం లేదని ఎందరో భావిస్తున్నారు. శాంతి కొరకు ప్రార్థించే మతనాయకుల బహిరంగ ప్రార్థనలను కూడా వినటంలేదని అనిపిస్తుంది. ఇలా ఎందుకంటామంటే యుద్ధం దౌర్జన్యం మానవాళిని దుఃఖంలో ముంచుతూనేవున్నాయి. దేవుడు నిజంగా మన ప్రార్థనలను వింటాడా? అలాగైతే మరి, ఇంతమంది ప్రార్థనలకు ఎందుకు జవాబు దొరకడంలేదు? [ప్రతిస్పందించనివ్వండి.] మన ప్రార్థనలకు జవాబులు దొరకాలంటే ఏమి అవసరమో కీర్తన 145:18 వివరిస్తోంది. [లేఖనాన్ని చదవండి.] ఒక విషయమేంటంటే, దేవునికి చేసే ప్రార్థనలు యథార్థంగా ఉండాలి, అంతేకాకుండా అవి ఆయన వాక్యంలో ఉన్న సత్యానికి అనుగుణంగా ఉండాలి.” మీరు ఇచ్చే పుస్తకాన్ని చూపించి, ప్రార్థన విలువను గూర్చి అది ఏమి చెబుతుందో సూచించండి.
8 ప్రార్థనను గూర్చి మీరు చర్చించిన వారిని పునర్దర్శిస్తున్నట్లైతే, మీరు ఇలా మాట్లాడి చూడండి:
◼ “ప్రార్థన విషయంపై మనం చేసిన చర్చ నాకు చాలా నచ్చింది. వేటిని గూర్చి ప్రార్థించాలనే విషయంలో యేసు అభిప్రాయాలు సహాయకరమైన నడిపింపునిస్తాయని మీరు తప్పకుండా చూస్తారు.” మత్తయి 6:9, 10 చదివి, మాదిరి ప్రార్థనలో యేసు ఎత్తి చూపిన ముఖ్యమైన విషయాలను సూచించండి. జ్ఞానము పుస్తకంలో “మీరెలా దేవునికి సన్నిహితులుకాగలరు” అనే 16వ అధ్యాయాన్ని చూపించి, ఆ సమాచారాన్ని ఎలా పఠించవచ్చో చూపించమంటారా అని అడగండి.
9 దేవుని జ్ఞానాన్ని ఇతరులతో పంచుకునే విషయానికొస్తే, “ఈ పనులకు తగిన అర్హతగల వారెవరు?” అని మనం ప్రశ్నించవచ్చు. అందుకు “మనమే” అని లేఖనాలు జవాబిస్తున్నాయి.—2 కొరిం. 2:16, 17, NW.