యెహోవాసాక్షులు—నిజమైన సువార్తికులు
1 రాజ్య సువార్తను ప్రకటించమని యేసుక్రీస్తు తన శిష్యులను ప్రత్యేకంగా నిర్దేశిస్తూ, సువార్తను బోధించే బాధ్యతను వాళ్లందరిపైనా ఉంచాడు. (మత్త. 24:14; అపొ. 10:42) ఆయన తొలి శిష్యులు ఆరాధనా స్థలాల్లోనేగాక వాళ్లు ప్రజలను కలుసుకునే ప్రతీచోటా అంటే బహిరంగంగానూ, ఇంటింటనూ రాజ్యాన్ని గూర్చి మానక మాట్లాడేవారు, ఆ విధంగా వాళ్లు ఈ విషయంలో మాదిరినుంచారు. (అపొ. 5:42; 20:20) యెహోవాసాక్షులముగా నేడు మనం, 232 దేశాల్లో రాజ్య సందేశాన్ని ప్రకటిస్తూ, గత మూడేళ్లలోనే 10 లక్షలకన్నా ఎక్కువమంది క్రొత్త శిష్యులకు బాప్తిస్మమిచ్చి, నిజమైన క్రైస్తవ సువార్తికులమని రుజువు పర్చుకున్నాం! సువార్త బోధించే మన పని ఎందుకంతగా సఫలీకృతమైంది?
2 సువార్త మనల్ని ఉత్తేజపూరితుల్ని చేస్తుంది: సువార్తికులంటే సువార్త బోధకులు లేక సువార్త సందేశకులు. అలాంటి వారిగా, యెహోవా రాజ్యాన్ని ప్రకటించే ఆధిక్యత, అంటే దురవస్థలో ఉన్న మానవాళికి తెలపగల ఏకైక నిజమైన సువార్తను ప్రకటించే ఉత్తేజపూరిత ఆధిక్యత మనకుంది. రాబోవు పరదైసులో విశ్వాసులైన మానవులతో రూపొందించబడే క్రొత్త భూమిని నీతియుక్తంగా ఏలబోయే క్రొత్త ఆకాశములను గూర్చి మనం ముందుగా సంపాదించుకున్న జ్ఞానం గురించి మనం ఉత్సాహంగా ఉన్నాం. (2 పేతు. 3:13, 17) ఈ నిరీక్షణను హత్తుకొన్నది మనం మాత్రమే. దాన్ని ఇతరులతో పంచుకునేందుకు మనం ఆతురత కలిగి ఉన్నాం.
3 నిజమైన ప్రేమ మనల్ని ప్రేరేపిస్తుంది: వార్తను బోధించడమనేది జీవాన్ని రక్షించే పని. (రోమా. 1:16) అందుకే, రాజ్య సందేశాన్ని వ్యాపింపచేయడంలో మనం గొప్ప ఆనందాన్ని పొందుతాం. నిజమైన సువార్తికులముగా, మనం ప్రజల్ని ప్రేమిస్తాం, మరి అది వారితో సువార్తను పంచుకొనేలా అంటే మన కుటుంబాలతో, పొరుగువారితో, పరిచయస్థులతో, ఎంతమందితో సాధ్యమైతే అంతమందితో సువార్తను పంచుకొనేలా మనల్ని ప్రేరేపిస్తుంది. ఈ పనిని పూర్ణ హృదయంతో చేయడమనేది ఇతరుల ఎడల మనకుగల నిజమైన ప్రేమను వ్యక్తపర్చగలిగే అతి శ్రేష్ఠమైన వ్యక్తీకరణల్లో ఒకటి.—1 థెస్స. 2:8.
4 దేవుని ఆత్మ మనకు సహాయపడుతోంది: రాజ్య విత్తనాన్ని నాటి, నీరుపోసే పనిని మనం చేసినప్పుడు, ‘వృద్ధి కలుగజేసేవాడు’ యెహోవాయేనని దేవుని వాక్యం మనకు అభయమిస్తోంది. నేడు మన సంస్థలో కచ్చితంగా అదే జరుగుతుండడాన్ని మనం చూస్తున్నాం. (1 కొరిం. 3:5-7) సువార్త బోధించే మన పనిలో దేవుని ఆత్మే మనకు సహాయపడి, మనల్ని మరింత సఫలీకృతుల్ని చేస్తోంది.—యోవే. 2:28, 29.
5 “సువార్తికుని పనిచేయుము” అని 2 తిమోతి 4:5 వచనం ప్రోత్సహిస్తున్న దృష్ట్యా, మరియు సర్వ మానవాళి ఎడల మనకుగల ప్రేమ మూలంగా, మన పనిని యెహోవా ఎడతెగక ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో, ప్రతి అవకాశమందూ ఉత్సాహభరితమైన రాజ్య సువార్తను పంచుకునేందుకు మనం ప్రేరేపించబడుదుము గాక.