మా పాఠకుల నుండి
ద్వంద్వ జీవితం “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . ద్వంద్వ జీవితము—ఎవరికి తెలుసు?” (జనవరి 8, 1994) అనే శీర్షికను గూర్చి నేను మీకు కృతజ్ఞతలు తెల్పాలనుకుంటున్నాను. నాకు 16 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, మా తలిదండ్రులకు చాటుగా నేను మద్యం త్రాగడం, పొగత్రాగడం, మరియు డేటింగ్ చేసేదాన్ని. నిజంగా దేవుని జాగరూకతగల దృష్టి నుండి ఏది కూడా మరుగు చేయబడదని తెలుసుకోడానికి యీ శీర్షికలు నాకు సహాయపడ్డాయి.
టి. టి., ఫిజి
మనీ చేజ్ “ది మనీ చేజ్—వేర్ విల్ ఇట్ ఎండ్?” (మార్చి 22, 1994) అనే పరంపరలను నేను యిప్పుడే చదివాను. ఆ శీర్షిక అంశాన్ని అమోఘంగా పరిశీలించింది. ప్రవాసులుగా వెళ్లిన పనివారు, వారి కుటుంబాలు అలాంటి చెడు పరిస్థితుల్లోనే యింకా ఉన్నారని నాకు తెలియదు. వారిని గురించి నా హృదయం ద్రవిస్తుంది.
జి. ఎమ్., అమెరికా
క్షీణించిన కార్మిక పరిస్థితులు మరియు తక్కువ వేతనాలను గూర్చి మీరు వివరించిన తీరు కచ్చితమైనది. కొంతమంది యీ పనివారిని మనలాంటి భావాలను కలిగున్న మానవులుగా దృష్టించకపోవడం ఎంతో విషాదకరమైన విషయం. అవును, “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు”!—ప్రసంగి 8:9.
కె. వి., అమెరికా
రొమ్ము క్యాన్సర్ “రొమ్ము క్యాన్సర్—ప్రతి స్త్రీకివున్న భయము” (ఏప్రిల్ 8, 1994) అనే మీ పరంపరలో, తల్లి పాలివ్వడం రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుందని సూచించే అధ్యయనాలను గురించి మీరు ఎక్కడా చెప్పలేదు.
బి. జె. ఎమ్., జర్మనీ
దాన్ని మర్చిపోయినందుకు మేము చింతిస్తున్నాము. అయినప్పటికీ, మా జనవరి 8, 1994, సంచికలో వచ్చిన “తల్లిపాలకు అనుకూలమైన సాక్ష్యం,” అనే శీర్షికలో ఆ విషయం చెప్పబడింది.—ఎడిటర్.
తన రొమ్మును తీయించుకున్న ఒక క్రైస్తవ సహోదరితో నేను కొద్ది సమయాన్ని గడిపాను. ఆమె 62 సంవత్సరాల వయస్సుగలది, ఆమె ఎంతో క్రుంగిపోయి ఉన్నది. ఓదార్పుకరంగా ఎలా మాట్లాడాలో నాకు తోచలేదు. మీ శీర్షికలో సూచింపబడిన వ్యాఖ్యానాలకు కృతజ్ఞతలు, నేనిప్పుడు ఆమెకు అవసరమైన ఓదార్పునివ్వగలను.
డి. హెచ్., అమెరికా
సుమారు రెండు సంవత్సరాల క్రితం, నాకు రొమ్ము క్యాన్సర్ విషయమై శస్త్రచికిత్స జరిగింది. ఆ విషయాన్ని గూర్చి సమాచారాన్ని తెలుసుకోడానికి, నేను ఒక వైద్య సంబంధ సర్వసంగ్రహ నిఘంటును కొన్నాను, కాని నేనందులో నుండి ఎక్కువగా తెలుసుకోలేక పోయాను. అయితే మీ శీర్షిక మాత్రం నా ప్రశ్నలకు జవాబులిచ్చింది. అది నన్ను నిజంగా ఓదార్చింది.
ఎమ్. జి., ఇటలీ
తొమ్మిది సంవత్సరాల క్రితం నా తల్లి రొమ్ము క్యాన్సర్‌తో మరణించింది. ఆ సమయంలో నేను కేవలం తొమ్మిది సంవత్సరాల వయస్సుగలదాన్ని, మరి ఆమె ఎలా సహించిందో నేను ఎప్పుడూ గ్రహించలేదు. నేను ఆ శీర్షికలను చదువుతూ, ఆమెను గురించి తలంచినప్పుడు నేను ఏడవకుండా ఉండలేకపోయాను. ఆమె జీవితంలోని కొన్ని చివరి సంవత్సరాలను గురించి మీరు అందించిన జ్ఞానాన్నిబట్టి నేనెప్పుడూ కూడా మీకు తగినంతగా కృతజ్ఞతలు తెల్పలేను.
కె. ఎఫ్., అమెరికా
ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులు “హెల్పింగ్ దోజ్ విత్ ఎయిడ్స్” (మార్చి 22, 1994) అనే మీ శీర్షికను నేను చదివాను. నాకు హెచ్‌ఐవి పాసిటివ్ ఉంది మరి ఆ శీర్షికను అంగీకరించడం కష్టంగా భావించాను. నా కుటుంబీకులు ఆ బాధ మరియు నిరాదరణా భావాలను బట్టి ఏడ్చారు.
బి. జె., అమెరికా
మన మధ్యనున్న అటువంటి బాధితులందరి గూర్చి మనం సహానుభూతిగా భావిస్తాము. మా శీర్షికలు వారి అవసరతలతో, అత్యధికుల చింతలను సమతూకపర్చడానికి ప్రయత్నిస్తాయి. జనాంగమంతటి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం తీవ్రమైన చర్యలు గైకొన్నది గనుక, సహేతుకమైన ఆరోగ్య సంబంధ జాగ్రత్తలను సిఫారసు చేయడం సముచితంగా ఉంటుందని మేము భావించాము. (లేవీయకాండము 13:21, 33 పోల్చండి.) “ఎయిడ్స్‌గల ప్రజల మధ్య ఉండడానికి అమితంగా భయపడనవసరంలేదని,” మేము గుర్తించాము. వైద్యులు హామీ యిచ్చినప్పటికీ అనేకమంది భయపడుతూనే ఉన్నారు. కాబట్టి, భౌతికంగా అనురాగాన్ని కనపర్చడాన్ని అసౌకర్యంగా భావించేవారి భావాలను గౌరవించాలని మేము ఎయిడ్స్ బాధితులను ప్రోత్సహించాము. ఈ విషయంలో వ్యాధి సంక్రమించనివారు ఏమి చేయాలని అనుకునేది వారి వ్యక్తిగత నిర్ణయం. ఏది ఏమైనప్పటికీ, బాధితులకు దయను, కనికరాన్ని చూపించాలని క్రైస్తవులందరూ మనఃపూర్వక కోరికను కలిగుండాలి.—ఎడిటర్.
కనికరంతో, ఎంతో చక్కగా వ్రాయబడిన అలాంటి శీర్షిక అందించబడినందుకు నేనెంతో ప్రోత్సహించబడ్డాను. మనం “విశ్వవ్యాప్త జాగ్రత్తలు” తీసుకుంటున్నా, మనం కనికరాన్ని, సహానుభూతితో కూడిన సహాయాన్ని అందించాలన్న సలహాలను నేను ప్రత్యేకంగా మెచ్చుకున్నాను.
ఎమ్. హెచ్., అమెరికా