‘ఇది కేవలం తాత్కాలికమే!’—మూత్రపిండాల వ్యాధితో నా జీవితం
అది నిన్నటి దినమే అన్నట్లుగా 1980 జనవరి తొలిభాగంలోని ఆ దినం నాకింకా గుర్తుంది. మా అమ్మ నన్ను బ్రెడ్డు కొనుక్కు రావడానికి దుకాణానికి వెళ్లమని అడిగింది, కానీ నేను ఇల్లు విడిచిపెడ్తుండగా ఫోను మ్రోగింది. ఆయన మా వైద్యుడు, నా ల్యాబ్ పరీక్షల ఫలితాలను తెల్పడానికి ఫోను చేశాడు. అకస్మాత్తుగా మా అమ్మ కన్నీళ్లలో కూరుకుపోయింది. వెక్కిళ్ల మధ్య ఆమె నాకు దుర్వార్త అందించింది. నా మూత్రపిండాలు క్షీణిస్తున్నాయి. నా మూత్రపిండాలు పనిచేసేది ఒక్క సంవత్సరం అంతకు కాకపోతే రెండు సంవత్సరాలు మాత్రమే. వైద్యుడు చెప్పింది నిజమే—ఒక సంవత్సరం తరువాత నేను డయాలసిస్ చికిత్స పొందడం ప్రారంభించాను.
నేను ఆరుగురు పిల్లల్లో మొదటివాన్ని. 1961, మే 21న పుట్టాను. నేను ఆరు నెలల ప్రాయంలో ఉన్నప్పుడు నేను బట్టల్లో పోసిన మూత్రంలో రక్తం ఉండడాన్ని మా అమ్మ గమనించింది. విస్తృతమైన పరీక్షల తరువాత నా పరిస్థితి అరుదుగా పుట్టుకతో వచ్చే లోపం అయిన అల్పోర్ట్ సిండ్రోమ్ అని వ్యాధినిర్ధారణ చేశారు. కారణాలు తెలియవు గాని, ఈ వ్యాధితోనున్న మగవారి మూత్రపిండాలు తరచూ కొంతకాలానికి క్షీణిస్తాయి. నా తలిదండ్రులకు, నాకు దీన్ని గూర్చి చెప్పబడలేదు. కాబట్టి నేను మూత్రపిండాల వ్యాధి గురించి చింతించలేదు.
తరువాత, 1979 వేసవిలో ఒక ఉదయాన నేను నా శ్వాసలో అమ్మోనియా వంటి వాసనను గమనించాను. నేను నిజంగా దానికి అంతగా అవధానాన్నివ్వలేదు, కాని తరువాత నేను అలసిపోవడం మొదలెట్టాను. నాకు కేవలం వంట్లో బాగుండలేదని అనుకున్నాను, అందుకని దాన్ని పట్టించుకోలేదు. డిశంబరులో నా వార్షిక చెకప్ చేయించుకున్నాను, జనవరిలో పైన పేర్కొన్న టెలిఫోన్ కాల్ అందుకున్నాను.
మా అమ్మకి బ్రెడ్డు ఇప్పటికీ అవసరమేగా, అందుకని నేను దుకాణానికి కారులో వెళ్తుండగా నేను నిర్ఘాంతపోయాను. ఇది నాకు సంభవిస్తుందన్న విషయం నేను నమ్మలేకపోయాను. “నాకు కేవలం 18 సంవత్సరాలే!” అంటూ నేను ఏడ్చాను. నేను కారుని ప్రక్కకి తీసుకెళ్లి ఆపాను. నాకు సంభవిస్తున్న విపరీతమైన విషయాన్ని నేను జీర్ణించుకోనారంభించాను.
“నాకే ఎందుకు?”
నేను అక్కడ రోడ్డు ప్రక్కన కూర్చుని ఏడవనారంభించాను. నా బుగ్గల మీదుగా కన్నీరు కారుతుండగా, నేను “నాకే ఎందుకు దేవా? నాకే ఎందుకు? దయచేసి నా మూత్రపిండాలు క్షీణించనివ్వకు!” అంటూ నా ఆవేదనను వెళ్లగ్రక్కాను.
1980లో నెలలు గతించిపోతుండగా నేను మరింత అస్వస్థతను అనుభవించాను; నా ప్రార్థనలు మరింత గంభీరంగాను, అశ్రువులతో కూడినవిగాను అయ్యాయి. సంవత్సరాంతమయ్యేసరికి, నేను స్పృహ తప్పడం జరుగుతుండేది, క్షీణిస్తున్న నా మూత్రపిండాలు వ్యర్థమైన విష పదార్థాలను వడగట్టకపోవడం వలన అవి నా రక్తంలో పేరుకుపోవడంతో తరచుగా వాంతులు అయ్యేవి. నవంబరులో నేను నా స్నేహితులతో కలిసి ఆఖరి క్యాంపుకి వెళ్లాను. కానీ నాకు ఎంత అస్వస్థతగా ఉందంటే నేను ఆ వారాంతమంతా వణుకుతూ కారులో కూర్చున్నాను. ఏమి చేసినా నేను వెచ్చగా ఉండలేకపోతున్నాను. చివరికి, 1981 జనవరిలో అనివార్యమైన సంఘటన సంభవించింది—నా మూత్రపిండాలు పూర్తిగా క్షీణించిపోయాయి. ఇక డయాలసిస్ మొదలుపెట్టడమో లేక చనిపోవడమో జరగాలి.
డయాలసిస్‌తో జీవితం
కొద్ది నెలల ముందు మా ఫ్యామిలీ వైద్యుడు సూదులను ఉపయోగించకుండా శరీరం లోపలే రక్తాన్ని శుభ్రం చేసే క్రొత్త రకమైన డయాలసిస్ గురించి నాతో చెప్పాడు. ఈ ప్రక్రియ పెరిటోనియల్ డయాలసిస్ (PD) అని పిలువబడుతుంది. ఇది నాకు వెంటనే నచ్చింది, ఎందుకంటే నాకు సూదులంటే ఏమాత్రం ఇష్టం లేదు. కొంతమంది డయాలసిస్ రోగులకు ఈ ప్రక్రియ సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా తయారయ్యింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కృత్రిమ మూత్రపిండంగా పనిచేసే ఒక పొర మన శరీరంలో ఉంటుంది. అదే పెరిటోనియమ్—నున్నగాను, పారదర్శకంగాను ఉండి జీర్ణాశయ అవయవాల చుట్టూ ఒక సంచిలా తయారయ్యే ఒక పొర అది—అది రక్తాన్ని శుభ్రం చేయడానికి వడగట్టే సాధనంగా ఉపయోగించబడగలదు. ఈ పొర లోపలి భాగంలో పెరిటోనియల్ కుహరము అని పిలువబడే ఒక ఖాళీ స్థలం ఉంటుంది. పెరిటోనియమ్ గాలి తీసివేయబడిన ఒక సంచిలా పొత్తికడుపులోని అవయవాల మధ్య ఉంటుంది.
PD పనిచేసే విధానం ఇలా ఉంటుంది: పొత్తి కడుపు క్రింది భాగంలో శస్త్రచికిత్స ద్వారా అమర్చబడిన మూత్రనాళిక (గొట్టం) ద్వారా ఒక ప్రత్యేక డయాలసిస్ ద్రవం పెరిటోనియల్ కుహరంలోనికి పంపబడుతుంది. ఈ ద్రవంలో డెక్స్ట్రోస్ ఉంటుంది, ద్రవాభిసృతి ప్రక్రియ ద్వారా వ్యర్థ పదార్థాలు మరియు రక్తంలో నుండి అదనపు ద్రవం పెరిటోనియమ్ ద్వారా పెరిటోనియల్ కుహరంలోనే ఉన్న డయాలసిస్ ద్రవంలోనికి లాగివేయబడుతుంది. సాధారణంగా మూత్రంగా తీసివేయబడే వ్యర్థ పదార్థాలు ఇప్పుడు డయాలసిస్ ద్రవంలో ఉన్నాయి. రోజుకి నాలుగుసార్లు మీరు ఈ మార్పిడిని చేయాల్సివుంటుంది—ఉపయోగించబడిన ద్రవాన్ని లాగివేసిన తరువాత కుహరాన్ని తాజా ద్రవంతో నింపాలి. ఒక్కసారి మార్పిడి పూర్తవ్వడానికి దాదాపు 45 నిమిషాలు పడుతుంది. అది ఆయిల్‌ను మార్చడం వంటిది—మీ మైలేజిని పెంచడానికి, మీ శరీరం సాఫీగా పనిచేయడానికి పాత ఆయిల్‌ను లాగివేయాలి తరువాత క్రొత్త ఆయిల్‌ను నింపాలి!
జనవరి 1981 ప్రారంభంలో నా కుడివైపు క్రింది భాగంలో నాకు ఆవశ్యకమైన మూత్రనాళికను అమర్చారు. తరువాత, ఈ ప్రక్రియలో రెండు వారాల శిక్షణకు హాజరయ్యాను. ఈ ప్రక్రియ సరైన విధంగా, రక్తం చెడిపోకుండా ఉండే మెలకువలను ఉపయోగించి చేయకపోతే ఒక వ్యక్తికి పెరిటోనైటిస్ అనబడే తీవ్రమైన, ప్రాణాంతకం కాగల పెరిటోనియమ్ ఇన్ఫెక్షన్ రావచ్చు.
నేను PD మొదలుపెట్టి సుమారు ఆరు నెలలైన తరువాత, 1981 వేసవిలో, నా జీవితంపై గట్టి ప్రభావం చూపించబోయే ఇంకొక ఫోన్ కాల్ నా తలిదండ్రులకు వచ్చింది.
ఒక క్రొత్త మూత్రపిండం కొరకు వెతుకులాట
జనవరి 1981 మొదలుకొని మూత్రపిండాల మార్పిడి కొరకైన జాతీయ పట్టికలో నేను ఉన్నాను.a మార్పిడితో నా జీవితం ఇంతకుమునుపు ఉన్నట్లుగానే ఉంటుందని నేను ఆశించాను. మున్ముందు ఏమి జరుగనైయున్నదో నాకేమీ తెలియదు!
ఆగస్టు మధ్యలో ఒక ఫోన్ కాల్ ఒక దాత లభించాడని మాకు సమాచారమందించింది. నేను దాదాపు రాత్రి 10 గంటలకు ఆసుపత్రికి వెళ్లినప్పుడు మార్పిడికి నేను సరిపడతానో లేదో నిశ్చయపర్చుకోవడానికి రక్త శాంపిల్స్ తీసుకొన్నారు. ఆ రోజే అంతకు ముందు ఒక ప్రమాదంలో చనిపోయిన ఒక యౌవనస్థుడి కుటుంబం వారు మూత్రపిండాన్ని లభ్యం చేశారు.
శస్త్రచికిత్స మరునాటి ఉదయం జరగాలని నిర్ణయం చేశారు. నేను యెహోవాసాక్షులలో ఒకడిని గనుక శస్త్రచికిత్సను నిర్వహించడానికి ముందు వ్యవహరించవలసిన ఒక పెద్ద వివాదాంశం ఉంది. నా బైబిలు శిక్షిత మనస్సాక్షి నన్ను రక్త మార్పిడికి అనుమతించదు. (అపొస్తలుల కార్యములు 15:28, 29) ఆ మొదటి రాత్రి అనస్తీషియాలజిస్టు నన్ను చూడడానికి వచ్చాడు. ఆయన నన్ను శస్త్రచికిత్సా గదిలో ముందు జాగ్రత్త చర్యగా రక్తం అందుబాటులో ఉంచుకునేందుకు అంగీకరించమని ప్రోత్సహించాడు. నేను వద్దన్నాను.
“ఏదైనా పొరపాటు జరిగితే నేనేమి చేయాలి? నిన్ను చనిపోనివ్వాలా?” ఆయన అడిగాడు.
“మీరు చేయవలసినదేదైనా చేయండి, కానీ రక్తాన్ని మాత్రం నాకు ఎక్కించకూడదు, ఏదేమైనప్పటికీ.”
ఆయన వెళ్లిపోయిన తరువాత సర్జన్లు లోపలికి వచ్చారు. నేను అదే విషయాన్ని వారితో చర్చించాను. నాకు ఎంతో ఉపశమనం కలిగే రీతిలో వారు రక్తం లేకుండానే శస్త్రచికిత్స చేయడానికి అంగీకరించారు.
మూడున్నర గంటలపాటు శస్త్రచికిత్స సాఫీగా సాగిపోయింది. సర్జన్ నేను చాలా తక్కువ రక్తాన్ని కోల్పోయానని చెప్పాడు. నేను రికవరీ గదిలో కళ్లు తెరిచినప్పుడు, మూడు విషయాలు నా ఇంద్రియాలను స్పర్శించాయి—మొదట ఆకలి, దాహం, తరువాత నొప్పి! కానీ నేను పసుపు పచ్చ రంగులోని ద్రవంతో నిండివున్న ఒక సంచి నేలపై ఉండడాన్ని చూసినప్పుడు అవన్నీ తెరమరుగయ్యాయి. అది నా క్రొత్త మూత్రపిండంలో నుండి వచ్చిన మూత్రం. నేను చివరికి మూత్రాన్ని విసర్జించగలుగుతున్నాను! నా మూత్రాశయం నుండి మూత్రనాళం తీసివేయబడి, నేను ఇతరులకు వలెనే మూత్రం పోయగలుగుతున్నప్పుడు నేను చాలా సంతోషించాను.
అయితే నా ఆనందం స్వల్పకాలికమైంది. రెండు రోజుల తర్వాత క్రుంగదీసే వార్త నాకందింది—నా క్రొత్త మూత్రపిండం పనిచేయడం లేదు. నా క్రొత్త మూత్రపిండం పని చేయడం మొదలుపెట్టేందుకు సమయాన్ని అనుమతిస్తుందనే ఆశతో నేను మరల డయాలసిస్‌ను చేపట్టాలి. నేను కొన్ని వారాల వరకు డయాలసిస్‌ను కొనసాగించాను.
ఇప్పుడు సెప్టెంబరు మధ్య భాగం, నేనిప్పటికే ఆసుపత్రిలో దాదాపు ఒక నెలపాటు ఉన్నాను. ఆసుపత్రి ఇంటి నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది, అందుకని నా క్రైస్తవ సహోదరీ సహోదరులకు నన్ను సందర్శించడం కష్టంగా ఉంది. నేను నా సంఘానికి దూరంగా ఉన్నందుకు ఎంతో బాధగా ఉంది. నేను సంఘ కూటాల టేప్ రికార్డింగులు పొందాను, కానీ నేను వాటిని విన్నప్పుడు నా గొంతు పూడుకుపోయింది. సహిస్తూ ఉండడానికి శక్తినివ్వమని యెహోవా దేవునితో నేను ప్రార్థనలో మాట్లాడుతూ అనేకమైన ఒంటరి ఘడియలను గడిపాను. నాకప్పుడు తెలియలేదు, కాని అంతకంటే ఎక్కువ కఠినమైన పరీక్షలు ముందున్నాయి.
చనిపోవడానికి భయం లేదు
మార్పిడి తరువాత సుదీర్ఘమైన ఆరు వారాలు గడిచాయి, నా శరీరం మూత్రపిండాన్ని తిరస్కరించిందన్నది ఇప్పటికే బాధాకరంగానే స్పష్టమైపోయింది. నా పొత్తికడుపు భయంకరంగా వాచింది; తిరస్కరించబడిన మూత్రపిండాన్ని తీసివేయాల్సిందేనని వైద్యులు నాతో అన్నారు. రక్తం గురించిన వివాదాశం మళ్లీ ఉద్భవించింది. ఈసారి శస్త్రచికిత్స మరింత గంభీరంగా ఉంటుందని వైద్యులు వివరించారు, ఎందుకంటే నా బ్లడ్ కవుంట్ చాలా తక్కువగా ఉంది. నేను ఓర్పుతో, అయితే స్థిరంగా నా బైబిలు ఆధారిత స్థానాన్ని గురించి వివరించాను, వారు చివరికి రక్తం లేకుండానే శస్త్రచికిత్స చేయడానికి అంగీకరించారు.b
సర్జరీ తరువాత, శరవేగంతో పరిస్థితులు క్షీణించాయి. నేను రికవరీ గదిలో ఉండగనే నా ఊపిరితిత్తులు ద్రవంతో నిండిపోనారంభించాయి. రాత్రంతా అత్యధికమైన డయాలసిస్ చేసిన తరువాత నేను కాస్త బాగున్నాను. కానీ రెండు రోజుల తర్వాత నా ఊపిరితిత్తులు మరల నిండిపోయాయి. డయాలసిస్‌తో కూడిన మరో రాత్రి గడిచింది. నాకు ఆ రాత్రి గురించి ఎక్కువగా జ్ఞాపకం లేదు, కానీ నా తండ్రి నా ప్రక్కనుండి “లీ, ఒక్కసారి శ్వాస తీసుకో! దయచేసి, నీవు చేయగలవు! ఇంకొక్కసారి. అదీ, అలాగే శ్వాస తీసుకుంటూ ఉండు!” అని అనడం నాకు గుర్తుంది. నేను చాలా అలసిపోయాను, ఇంతకు మునుపెన్నటికన్నా ఎక్కువగా అలసిపోయాను. అది గతించిపోవాలని, దేవుని నూతన లోకంలో తిరిగి లేవాలని నేను కోరుకున్నాను. నేను చనిపోవడానికి భయపడడం లేదు.—ప్రకటన 21:3, 4.
మరుసటి ఉదయం నా పరిస్థితి గంభీరంగా ఉంది. ప్రవహిస్తున్న రక్తంలోని ఎర్ర రక్త కణాల సంఖ్య అయిన హెమటోక్రిట్ 7.3కి తగ్గింది—మామూలుగా ఉండాల్సిన సంఖ్య 40కి ఎక్కువే! వైద్యులు నా పరిస్థితి గురించి ఆశావాదంతో లేరు. నేను రక్త మార్పిడికి అంగీకరించేలా చేయడానికి వారు మళ్లీ మళ్లీ ప్రయత్నించారు, నేను కోలుకోవడానికి అది చాలా కీలకమని వారు అన్నారు.
నన్ను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించారు, తరువాత హెమటోక్రిట్ 6.9కి పడిపోయింది. కానీ మా అమ్మ సాయంతో నా హెమటోక్రిట్ నెమ్మదిగా పెరగనారంభించింది. ఇంట్లో చేసిన ఒక మిశ్రమంలో ఆమె ఇనుము ఎక్కువగా ఉండే ఆహారం నుండి పానీయాలు తయారు చేసి, వాటిని నాకొరకు తెచ్చింది. నన్ను ప్రోత్సహించడానికి ఆమె వాటిని నాతోపాటు త్రాగింది కూడాను. తన పిల్లల కొరకైన ఒక తల్లి ప్రేమ ఒక అద్భుతమైన విషయం.
నేను నవంబరు మధ్యలో ఆసుపత్రి నుండి బయటికి వచ్చినప్పుడు నా హెమటోక్రిట్ సంఖ్య 11గా ఉంది. 1987 తొలిభాగంలో నేను EPO (ఎరిత్రోపాయ్టీన్) తీసుకోనారంభించాను, అది తాజా ఎర్ర రక్త కణాలను రక్త ప్రవాహంలోనికి పంపించడానికి మూలుగును ప్రేరేపించే సంయోగిక హార్మోను. ఇప్పుడు నా హెమటోక్రిట్ దాదాపు 33.c
‘లీ, ఇది కేవలం తాత్కాలికమే!’
నాకు 1984, 1988, 1990, 1993, 1995, 1996 సంవత్సరాలలో ఇతర మేజర్ సర్జరీలు చేయబడ్డాయి—ఇవన్నీ విఫలమైన నా మూత్రపిండాల ఫలితమే. మూత్రపిండాల వ్యాధితో ఇన్ని సంవత్సరాల జీవితం తరువాత నాకు మద్దతునివ్వడానికి సహాయపడ్డ ఒక ఆలోచన ఏమిటంటే, ‘ఇది కేవలం తాత్కాలికమే.’ మన సమస్యలు భౌతికమైనవైనా లేక ఏ ఇతర రకమైనవైనప్పటికీ అవి రాబోయే నూతన లోకంలో దేవుని రాజ్యం క్రింద సరిదిద్దబడతాయి. (మత్తయి 6:9, 10) నేను క్రొత్త సవాలునెదుర్కొని, క్రుంగిపోయినప్పుడల్లా నాకై నేను కేవలం ‘లీ, ఇది కేవలం తాత్కాలికమే!’ అని చెప్పుకుంటాను. మరి అది విషయాలను సరైన దృక్కోణంలో తిరిగి ఉంచేందుకు నాకు సహాయం చేస్తుంది.—2 కొరింథీయులు 4:17, 18 పోల్చండి.
నాకు 1986వ సంవత్సరం ఆశ్చర్యం కలిగించే అత్యంత పెద్ద సంఘటన తెచ్చిపెట్టింది—నేను పెళ్లి చేసుకున్నాను. నాకు అసలు పెళ్లవదని నేను అనుకున్నాను. ‘అసలు నన్నెవరు పెళ్లి చేసుకుంటారు?’ నేననుకున్నాను. కానీ కిమ్‌బర్లీ నా జీవితంలోకి ప్రవేశించింది. ఆమె చూసింది నేను అంతరంగమందు ఎటువంటి వ్యక్తినైవున్నానన్న విషయాన్నేగానీ బాహ్యంగా కృశించిపోతున్న వ్యక్తిని కాదు. నా పరిస్థితి కేవలం తాత్కాలికమే అని కూడా ఆమె గమనించింది.
నేను, కిమ్‌బర్లీ 1986, జూన్ 21న కాలిఫోర్నియాలో, ప్లజెంటన్ నందున్న మా స్థానిక రాజ్యమందిరంలో వివాహం చేసుకున్నాము. నా వ్యాధి వంశాగతం కాబట్టి మేము పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకున్నాము. కానీ ఇది కూడా బహుశ తాత్కాలికమే. దేవుని నూతన లోకంలో ఒకవేళ అది యెహోవా చిత్తమైతే మేము పిల్లల్ని కనాలనుకుంటున్నాము.
కాలిఫోర్నియానందలి హైలాండ్ ఓక్స్ సంఘంలో ఒక పెద్దగా సేవ చేసే ఆధిక్యతను కలిగివున్నాను, కిమ్‌బర్లీ పూర్తి-కాల సువార్తికురాలిగా సేవ చేస్తుంది. 1981లోని చేదైన అనుభవం నా శరీరాన్ని బాగా ధ్వంసం చేసి, నాలోని శక్తిని హరించివేసింది. అప్పటి నుండి, నా సహోదరి అల్పోర్ట్ సిండ్రోమ్ యొక్క కొంత ప్రభావాన్ని అనుభవించింది, ఆ వ్యాధి ఉన్న నా ఇద్దరు సహోదరులకు మూత్రపిండాలు క్షీణించాయి ఇప్పుడు డయాలసిస్ మీద ఉన్నారు. మిగతా ఇద్దరు సహోదరులు చాలా ఆరోగ్యంగా ఉన్నారు.
నేను పెరిటోనియల్ డయాలసిస్‌ను కొనసాగిస్తున్నాను, అది నేను స్వేచ్ఛగా కదలడాన్ని అనుమతిస్తుంది గనుక నేను కృతజ్ఞున్ని. నేను నిరీక్షణతోను, నమ్మకంతోను నేను భవిష్యత్తులోనికి చూస్తాను, ఎంతైనా నేటి సమస్యలు—మూత్రపిండాల వ్యాధి కూడా—కేవలం తాత్కాలికమే.—ఈ శీర్షిక ముద్రించబడడానికి ముందు మరణించిన లీ కార్డవే చెప్పినది.
వైద్య చికిత్స కొరకైన ఏ ప్రత్యేక పద్ధతిని తేజరిల్లు! సిఫారసు చేయదు. హెమోడయాలసిస్ వంటి ఇతర రకాల చికిత్సలను నిరుత్సాహపర్చాలన్నది ఈ శీర్షిక ఉద్దేశం కాదు. ప్రతి పద్ధతికి లాభాలు, నష్టాలు ఉన్నాయి, ఏ పద్ధతిని అనుసరించాలన్న దాని గురించి ఒక వ్యక్తి తన స్వంత మనస్సాక్షిపూర్వకమైన నిర్ణయం తీసుకోవాలి.
[అధస్సూచీలు]
a ఒక క్రైస్తవుడు మార్పిడిని స్వీకరించడమా వద్దా అన్నది వ్యక్తిగత నిర్ణయం.—కావలికోట (ఆంగ్లం) మార్చి 15, 1980, పేజీ 31 చూడండి.
b రక్తం లేకుండా మేజర్ సర్జరీ చేసే విషయంలో సమాచారం కొరకు వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన రక్తము నీ జీవమును ఎట్లు కాపాడగలదు అనే ప్రచురణలోని 16, 17 పేజీలు చూడండి.
c ఒక క్రైస్తవుడు EPO స్వీకరిస్తాడో లేదో అది వ్యక్తిగతమైన విషయం.—కావలికోట 1994, అక్టోబరు 1, పేజీ 31 చూడండి.
[11వ పేజీలోని చిత్రం]
నా భార్య కిమ్బర్లీతో
[12వ పేజీలోని చిత్రం]
పెరిటోనియల్ డయాలసిస్ పనిచేసే విధానం
కాలేయం
చిన్న ప్రేవుల వలయాలు
మూత్రనాళం (శుద్ధమైన ద్రవాన్ని తీసుకుంటుంది; పాత ద్రవాన్ని వదిలిపెడుతుంది)
పెరిటోనియమ్
పెరిటోనియల్ కుహరం
మూత్రాశయం