కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • be అధ్యాయం 48 పేజీ 251-పేజీ 254 పేరా 2
  • తర్కించే విధానం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తర్కించే విధానం
  • దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • గొప్ప బోధకుడ్ని అనుకరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • సహేతుకతను అలవర్చుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • యెహోవాలా సహేతుకత చూపించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • ప్రశ్నలను సమర్థవంతంగా ఉపయోగించడం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
మరిన్ని
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
be అధ్యాయం 48 పేజీ 251-పేజీ 254 పేరా 2

48

తర్కించే విధానం

మీరు ఏమి చెయ్యాలి?

సహేతుకమైన విధానంలో, ప్రజలు వినేలా ఆలోచించేలా ప్రోత్సహించే విధానంలో లేఖనాలను, ఉపమానాలను, ప్రశ్నలను ఉపయోగించండి.

ఎందుకు ప్రాముఖ్యం?

తెగేసినట్లు చెప్పడం, పిడివాదం చేయడం వంటివి ప్రజల మనస్సుల, హృదయాల తలుపులను మూసేస్తాయి. తార్కిక విధానం చర్చను ప్రోత్సహిస్తుంది, అటు తర్వాత ఆలోచించడానికి మెదడుకి మేతనిస్తుంది, భవిష్యత్తులో సంభాషణలకు మార్గాన్ని తెరుస్తుంది. అది ఒప్పించడానికి శక్తివంతమైన పద్ధతి.

దేవుని వాక్యం మన జీవితాల్లో తీసుకువచ్చిన మార్పుల విషయమై మనం ఎంతో కృతజ్ఞులమై ఉన్నాం, అందుకే ఇతరులు కూడా ప్రయోజనం పొందాలని మనం కోరుకుంటాము. అంతేగాక, సువార్తకు ప్రజలెలా ప్రతిస్పందిస్తారన్నది వారి భవిష్యత్‌ నిరీక్షణలను ప్రభావితం చేయగలదని మనం గుర్తిస్తాము. (మత్త. 7:13,14; యోహా. 12:48) వారు సత్యాన్ని స్వీకరించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అయితే, అత్యంత మేలును చేకూర్చాలంటే మన గట్టి నమ్మకాలు మనలోని అత్యంతాసక్తులకు తోడు వివేచన కూడా ఉండాల్సిన అవసరం ఉంది.

అవతలి వ్యక్తి ఎంతోకాలంగా అపురూపంగా ఎంచుతూ వచ్చిన ఒక నమ్మకం తప్పని బహిర్గతం చేసే ఒక సత్యాన్ని మీరు తెగేసినట్లు చెబితే, దానికి మద్దతుగా లేఖనాల పొడవాటి లిస్టు అప్పజెప్పినా ఆ వ్యక్తి సాధారణంగా దాన్ని స్వీకరించడు. ఉదాహరణకు, ప్రజలందరు చేసుకునే ఒకానొక పండుగలోని ఆచారాలు నిజానికి అన్యమతాల్లో ప్రారంభమయ్యాయని ఆక్షేపించి ఊరుకుంటే, వాటి గురించి ప్రజలు ఎలా భావిస్తారన్నదాన్ని అది మార్చకపోవచ్చు. సాధారణంగా తార్కిక విధానంతో ఎక్కువ విజయం లభిస్తుంది. తార్కికంగా ఉండడం అంటే ఏమిటి?

“పైనుండివచ్చు జ్ఞానము . . . సమాధానకరమైనది, మృదువైనది, [“సహేతుకమైనది,” NW]” అని లేఖనాలు మనకు చెబుతున్నాయి. (యాకో. 3:17) ఇక్కడ “సహేతుకమైనది” అని అనువదించబడిన గ్రీకు పదానికి అక్షరార్థంగా “లోబడు” అని అర్థం. కొన్ని అనువాదాలు దాన్ని “పరిగణచూపే,” “సాధుగుణం,” లేదా “ఓర్పుగా భరించు” అని అనువదించాయి. సహేతుకత సమాధానంగా ఉండడంతో కూడా జోడించబడిందని గమనించండి. తీతు 3:1,2, NWలో అది సాత్వికముతో జతచేయబడింది, జగడమాడడానికి భిన్నంగా చూపించబడింది. ఫిలిప్పీయులు 4:5, NW, మన “సహేతుకత”కు పేరుగాంచమని మనల్ని ఉద్బోధిస్తోంది. సహేతుకమైన వ్యక్తి నేపథ్యాన్ని, పరిస్థితులను, తను మాట్లాడుతున్న వ్యక్తి భావాలను పరిగణలోకి తీసుకుంటాడు. యుక్తమైనప్పుడు లోబడడానికి సిద్ధంగా ఉంటాడు. ఇతరులతో ఆ విధంగా వ్యవహరించడం ద్వారా మూసుకున్న వారి మనస్సులు హృదయాలు తెరిచేందుకు సాధ్యమవుతుంది, తద్వారా వారు మనం లేఖనాల నుండి తర్కించేటప్పుడు మన వ్యాఖ్యానాలను మరింత సులభంగా స్వీకరిస్తారు.

ఎక్కడ మొదలుపెట్టాలి? అపొస్తలుడైన పౌలు థెస్సలొనీకలో ఉన్నప్పుడు లేఖనాలను ఉపయోగిస్తూ “క్రీస్తు శ్రమపడి మృతులలోనుండి లేచుట ఆవశ్యకమని . . . దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు”న్నాడని చరిత్రకారుడైన లూకా నివేదిస్తున్నాడు. (అపొ. 17:2, 3) పౌలు ఇలా ఒక యూదుల సమాజమందిరములో చేశాడన్నది గమనార్హం. తను మాట్లాడే వ్యక్తులు హీబ్రూ లేఖనాలను అధికారమూలంగా దృష్టించారు. వారు స్వీకరించిన విషయాలతో ప్రారంభించడం సముచితంగా ఉంది.

పౌలు ఏథెన్సులోని అరేయొపగువద్ద గ్రీకులతో మాట్లాడేటప్పుడు ఆయన లేఖనాలను ఎత్తిచెబుతూ తన మాటలు ప్రారంభించలేదు. బదులుగా వారికి తెలిసిన, వారు ఏకీభవించిన విషయాలతో ప్రారంభించాడు. ఆయన ఆ విషయాలను ఉపయోగించుకొని వారు సృష్టికర్త గురించి ఆయన సంకల్పాల గురించి పరిశీలించేలా వారిని నడిపించాడు.—అపొ. 17:22-31.

ఈ ఆధునిక కాలాల్లో, బైబిలును తమ జీవితాల్లో అధికారమూలంగా గుర్తించని ప్రజలు కోట్లాదిమంది ఉన్నారు. కానీ దాదాపు ప్రతి వ్యక్తి జీవితమూ ప్రస్తుత విధానంలోని కఠినమైన పరిస్థితుల మూలంగా ప్రభావితమై ఉంది. ప్రజలు మరింత శ్రేష్ఠమైన విధానం కోసం పరితపిస్తున్నారు. వారిని కలతపరుస్తున్నదాని పట్ల మీరు మొదట శ్రద్ధ చూపించి, ఆ తర్వాత బైబిలు ఆ కలతపరిచే విషయాన్ని ఎలా వివరిస్తోందో చూపించినప్పుడు, మీరు అవలంబించిన ఈ సహేతుకమైన విధానం మూలంగా వారు మానవజాతి పట్ల దేవుని సంకల్పం గురించి బైబిలు ఏమి చెబుతోందో వినేందుకు కదిలించబడవచ్చు.

ఒక బైబిలు విద్యార్థికి తన తల్లిదండ్రుల నుండి కొన్ని మతపరమైన నమ్మకాలు ఆచారాలు వారసత్వంగా వచ్చివుండవచ్చు. కానీ ఆ నమ్మకాలు ఆచారాలు దేవుణ్ణి ప్రీతిపరచవని ఆ విద్యార్థి తెలుసుకొని, బైబిలు బోధించేవాటిని స్వీకరించి, వాటిని తృణీకరిస్తాడు. ఇప్పుడు ఆ విద్యార్థి తన తల్లిదండ్రులకు ఆ నిర్ణయాన్ని ఎలా వివరించవచ్చు? తాము ఆయనకిచ్చిన మత వారసత్వాన్ని తృణీకరించడం ద్వారా ఆయన తమనే తృణీకరిస్తున్నాడని వారు భావించే అవకాశం ఉంది. తన నిర్ణయానికి ఆధారంగా బైబిలును ఉపయోగించి వివరించడానికి ప్రయత్నించే ముందు, తన తల్లిదండ్రుల పట్ల తనకున్న ప్రేమను గౌరవాన్ని ప్రదర్శిస్తూ అవి లేవేమోనన్న భయాలను తొలగించాలని బైబిలు విద్యార్థి నిర్ధారించుకోవచ్చు.

ఎప్పుడు విడిచిపెట్టాలి? శాసించే పూర్తి అధికారం ఉన్నప్పటికీ యెహోవా కూడా అత్యుత్కృష్టమైన రీతిలో సహేతుకతను ప్రదర్శిస్తాడు. లోతును ఆయన కుటుంబాన్ని సొదొమ నుండి విడిపించేటప్పుడు యెహోవా దూతలు, “నీవు నశించి పోకుండ ఆ పర్వతమునకు పారిపొమ్మని” ఉద్బోధించారు. అయినా లోతు, “ప్రభువా ఆలాగు కాదు” అని విజ్ఞప్తిచేసుకున్నాడు. సోయరుకి పారిపోవడానికి ఆయన అనుమతి కోరాడు. ఆయనలా వెళ్ళడానికి అనుమతించడం ద్వారా యెహోవా ఆయనపట్ల దయను ప్రదర్శించాడు; అందుకే ఇతర ఊళ్ళు నాశనమైనప్పుడు సోయరు నాశనం కాలేదు. అయితే ఆ తర్వాత, లోతు యెహోవా మొదట్లో ఇచ్చిన నిర్దేశకాన్ని అనుసరించి పర్వత ప్రాంతానికి తరలిపోయాడు. (ఆది. 19:17-30) తన మార్గం సరైనదని యెహోవాకు తెలుసు కానీ లోతు దానిని అర్థం చేసుకునేంతవరకు ఆయన ఓపికగా దయను కనపరిచాడు.

ఇతరులతో మనం విజయవంతంగా వ్యవహరించాలంటే మనం కూడా సహేతుకంగా ఉండాలి. అవతలి వ్యక్తి తప్పని మనకు పూర్తి నమ్మకం ఉండవచ్చు, తప్పని నిరూపించడానికి మన మనస్సులో గట్టి వాదనలూ ఉండవచ్చు. కానీ కొన్నిసార్లు మరీ పట్టుబట్టకూడదు. సహేతుకత అంటే యెహోవా ప్రమాణాల విషయంలో రాజీపడడం అని అర్థం కాదు. అవతలి వ్యక్తి తన అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపితే సరిపోతుంది లేదా కొన్ని తప్పు వ్యాఖ్యానాలకు జవాబివ్వకుండానే వదిలేస్తే సరిపోతుంది, అలా చేసినప్పుడు మీరు మరింత మేలు చేకూర్చే వేరే విషయంపై చర్చను కేంద్రీకరించగలరు. మీ నమ్మకాలను ఆ వ్యక్తి అధిక్షేపించినా మీరు తీవ్రంగా ప్రతిస్పందించవద్దు. ఆయనెందుకలా భావిస్తున్నాడో మీరు అడగవచ్చు. ఆయన జవాబు జాగ్రత్తగా వినండి. అలా మీరు ఆయన ఆలోచనలపై అంతర్దృష్టిని పొందుతారు. భవిష్యత్తులో నిర్మాణాత్మకంగా మాట్లాడడానికి ఇది కొంత పునాదిని కూడా వేయవచ్చు.—సామె. 16:23; 19:11.

యెహోవా మానవులకు ఎంపికలు చేసుకునే సామర్థ్యమిచ్చాడు. ఆ సామర్థ్యాన్ని వారు జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోకపోయినా దాన్ని ఉపయోగించుకోవడానికి ఆయన అనుమతిస్తున్నాడు. యెహోవా వాగ్దూతగా యెహోషువ, ఇశ్రాయేలుతో యెహోవా వ్యవహరించిన వివరాలను చెప్పాడు. కానీ ఆ తర్వాత ఆయనిలా అన్నాడు: “యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినయెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి; మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము.” (యెహో. 24:15) నేడు మన నియామకం ‘సాక్ష్యం’ ఇవ్వడమే; మనం పూర్తి నిశ్చయతతో మాట్లాడతాము, కానీ ఇతరులు నమ్మేలా బలవంతం మాత్రం చేయము. (మత్త. 24:14) ఎంపిక వారిదే, వారికున్న ఆ హక్కును మనం కాలరాయము.

ప్రశ్నలు అడగండి. ప్రజలతో తర్కించడంలో యేసు అత్యద్భుతమైన మాదిరిని ఉంచాడు. ఆయన వారి నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకొని వారు వెంటనే అంగీకరించే ఉపమానాలను ఉపయోగించాడు. ఆయన ప్రశ్నలు కూడా చాలా సమర్థవంతంగా ఉపయోగించాడు. ఇది ఇతరులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి అవకాశాన్నిచ్చింది, అలా వారి హృదయాల్లో ఏముందో వెల్లడయింది. అది చర్చించబడుతున్న విషయంపై తర్కించడానికి కూడా వారిని ప్రోత్సహించింది.

ధర్మశాస్త్రోపదేశకుడు ఒకాయన, “బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలె[ను]” అని యేసును అడిగాడు. యేసు ఆయనకు వెంటనే జవాబును ఇవ్వగలిగేవాడే. కానీ ఆ వ్యక్తి తన అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు అవకాశమిచ్చాడు. ‘ధర్మశాస్త్రమందేమి వ్రాయబడియున్నది? నీవు ఏమి చదువుచున్నావు?’ అని ఆ వ్యక్తిని అడిగాడు. ఆ వ్యక్తి సరిగ్గానే జవాబిచ్చాడు. సరైన జవాబు ఆ చర్చను ముగించిందా? ఎంతమాత్రము కాదు. ఆ వ్యక్తిని యేసు ఇంకా మాట్లాడనిచ్చాడు; ఆ వ్యక్తి అడిగిన మరో ప్రశ్న, ఆయన తనను తాను నీతిమంతుడని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని చూపించింది. “అవునుగాని నా పొరుగువాడెవ[డు]” అని ఆయన అడిగాడు. దానికి ఒక నిర్వచనం ఇవ్వడానికి బదులుగా యేసు ఒక ఉపమానం అధారంగా తర్కించేందుకు అవకాశమిచ్చాడు, యేసు ఒక నిర్వచనం ఇచ్చివుంటే ఆ వ్యక్తి అన్యుల పట్ల సమరయుల పట్ల యూదులకు సర్వసాధారణంగా ఉన్న ఒక వైఖరి మూలంగా దాన్ని ఖండించివుండేవాడే. యేసు ఇచ్చిన ఉపమానంలో, దొంగలు ఒక యాత్రికుణ్ణి దోచుకొని కొట్టి వదిలేసిన తర్వాత ఒక యాజకుడు ఒక లేవీయుడు పట్టించుకోకపోయినా స్నేహశీలియైన ఒక సమరయుడు సహాయం చేస్తాడు. ఆ వ్యక్తి అసలు విషయాన్ని అర్థంచేసుకున్నాడని యేసు ఒక చిన్న ప్రశ్న అడిగి రూఢిపరచుకున్నాడు. యేసు తర్కించిన విధానం, ఆ వ్యక్తి మునుపెన్నడూ గ్రహించని విధంగా “పొరుగువాడు” అన్న పదం క్రొత్త అర్థాన్ని సంతరించుకునేలా చేసింది. (లూకా 10:25-37) మనం అనుకరించడానికి ఎంత చక్కని మాదిరి! అంతా మీరు మాట్లాడేసి, ఒక విధంగా చెప్పాలంటే మీ గృహస్థుడి బదులు ఆయన కోసం మీరే ఆలోచించడానికి బదులుగా ఆయనే ఆలోచించేలా ప్రోత్సహించే ఔచిత్యంతో కూడిన ప్రశ్నలు ఉపమానాలు ఉపయోగించడం నేర్చుకోండి.

కారణాలు ఇవ్వండి. అపొస్తలుడైన పౌలు థెస్సలొనీకలోని సమాజమందిరములో మాట్లాడినప్పుడు ఆయన కేవలం తన ప్రేక్షకులు స్వీకరించిన ఒక అధికార మూలం నుండి చదివి ఊరుకోలేదు. పౌలు దాన్ని వివరించి రుజువుచేసి, తాను చదివినదాని అన్వయింపు కూడా చెప్పాడని లూకా నివేదిస్తున్నాడు. తత్ఫలితంగా ‘అనేకులు ఒప్పుకొని పౌలుతోను సీలతోను కలిసికొనిరి.’—అపొ. 17:1-4.

మీ ప్రేక్షకులు ఎవరైనప్పటికీ అలాంటి తార్కిక విధానం ప్రయోజనకరంగా ఉండగలదు. మీరు బంధువులకు సాక్ష్యమిచ్చేటప్పుడు, సహోద్యోగులతోను లేదా తోటి విద్యార్థులతోను, బహిరంగ సాక్ష్యపు పనిలో అపరిచితులతోను మాట్లాడేటప్పుడు, బైబిలు అధ్యయనం నిర్వహించేటప్పుడు, లేదా సంఘంలో ప్రసంగం ఇచ్చేటప్పుడు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరొక లేఖనాన్ని చదివినప్పుడు దాని అర్థం మీకు స్పష్టంగా ఉండవచ్చు, కానీ మరొకరికి స్పష్టంగా ఉండకపోవచ్చు. మీరిచ్చే వివరణ లేదా మీరిచ్చే అన్వయింపు పిడివాదం చేస్తున్నట్లు ధ్వనించవచ్చు. లేఖనంలోని కొన్ని కీలకమైన పదాలను ఎంపిక చేసుకొని వాటిని వివరించడం వల్ల ఫలితం ఉంటుందా? దానికి మద్దతుగా, ఆ లేఖనం ఉన్న సందర్భం నుండి గానీ ఆ విషయం గురించి చర్చించే మరితర లేఖనం నుండి గానీ రుజువులను చూపించగలరా? మీరు చెబుతున్న విషయం ఎంత సహేతుకమో ఒక ఉపమానం చూపించగలదా? మీ ప్రేక్షకులు ఆ విషయం గురించి తర్కించుకోవడానికి ప్రశ్నలు వేయడం సహాయకరంగా ఉండగలదా? ఇలాంటి తార్కిక విధానం ఒక మంచి అభిప్రాయాన్ని కలుగజేసి, ఇతరులు ఆలోచించడానికి మెదడుకు మేతనిస్తుంది.

ఎలా చెయ్యాలి?

  • మీ చర్చను ఎలా ప్రారంభించాలో నిర్ణయించుకునేటప్పుడు మీ శ్రోతల నేపథ్యాన్ని వారి వైఖరిని పరిగణలోకి తీసుకోండి.

  • వారు చేసే ప్రతి తప్పు వ్యాఖ్యానాన్ని సవాలుచేయకండి.

  • నిశ్చయతతో మాట్లాడండి, కానీ మీలాగే ఇతరులకు కూడా తామేం నమ్ముతామన్నది ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉందని గుర్తించండి.

  • ప్రశ్నలకు వెంటనే జవాబివ్వడానికి బదులుగా, ప్రశ్నించిన వ్యక్తి ఆ విషయంపై తర్కించుకోవడంలో సహాయం చేయడానికి ఇతర ప్రశ్నలను లేదా ఉపమానాలను ఉపయోగించండి.

  • కీలకమైన పదాలను వివరించడం ద్వారా, ఆ లేఖనం సందర్భము లేదా మరితర లేఖనాలు దాని అర్థాన్ని ఎలా స్పష్టం చేస్తాయో చూపించడం ద్వారా, లేదా ఆ లేఖనం అన్వయింపును చూపించడానికి ఒక ఉదాహరణనివ్వడం ద్వారా తర్కించే అలవాటును పెంపొందించుకోండి.

అభ్యాసాలు: (1) బలమైన అభిప్రాయాలు కలిగివున్న వ్యక్తికి సాక్ష్యమిచ్చిన తర్వాత మీరు ఆ చర్చను నడిపించిన విధానాన్ని ఒకసారి విశ్లేషించుకోండి. మీరు ఎలాంటి సాక్ష్యాధారాల్ని చూపించారు? ఏ ఉపమానాన్ని చేర్చారు? ఎలాంటి ప్రశ్నలు ఉపయోగించారు? ఆయన నేపథ్యాన్ని లేదా ఆయన భావాలను మీరు ఎలా పరిగణలోకి తీసుకున్నారు? క్షేత్ర సేవలో ఇలా చేయలేకపోతే, మరో ప్రచారకుడితో/రాలితో కాస్త ప్రాక్టీసు చేసి చూడండి. (2) తప్పుడు పని చేయాలని యోచిస్తున్న ఒక స్నేహితుడితో లేదా ఒక పిల్లవాడితో మీరెలా తర్కిస్తారో అభ్యాసం చేయండి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి