సహేతుకతను అలవర్చుకోండి
“మీ సహనమును (సహేతుకతను, NW) సకల జనులకు తెలియబడనియ్యుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు.”—ఫిలిప్పీయులు 4:5.
1. నేటి ప్రపంచంలో సహేతుకతను కలిగి ఉండడం ఎందుకు సవాలుతో కూడినది?
“సహేతుకమైన వ్యక్తి నిజానికి ఒక్కడు కూడా లేడని ఆంగ్ల పత్రికా విలేఖరి అయిన సర్ అలెన్ పాట్రిక్ హెర్‌బెర్ట్ భావించాడు. నిజమే, కలహాలతో నిండివున్న ఈ లోకంలో సహేతుకమైన వ్యక్తులు అసలు లేనేలేరని కొన్నిసార్లు అనిపించవచ్చు. ఈ అపాయకరమైన “అంత్యదినాల్లో” ప్రజలు “అతిద్వేషులు,” “క్రూరులు,” “మూర్ఖులు” అయివుంటారని, మరో మాటలో చెప్పాలంటే, ఎంతమాత్రం సహేతుకమైనవారిగా ఉండరని బైబిలు ప్రవచించింది. (2 తిమోతి 3:1-5) అయినప్పటికీ, నిజక్రైస్తవులు సహేతుకత దైవిక జ్ఞానానికి చిహ్నమని తెలుసుకొని దాన్ని ఉన్నతంగా భావిస్తారు. (యాకోబు 3:17) నిర్హేతుకమైన లోకంలో సహేతుకతను కలిగి ఉండడం అసాధ్యమని మనం భావించము. బదులుగా, “మీ సహనమును (సహేతుకతను NW) సకల జనులకు తెలియబడనియ్యుడి” అనివున్న ఫిలిప్పీయులు 4:5 నందలి అపొస్తలుడైన పౌలు యొక్క ప్రేరేపిత సలహాలోని సవాలును మనం కచ్చితంగా అంగీకరిస్తాము.
2. మనం సహేతుకంగా ఉన్నామో లేదో పరిశీలించుకోడానికి ఫిలిప్పీయులు 4:5 నందలి అపొస్తలుడైన పౌలు మాటలు మనకు ఎలా సహాయం చేస్తాయి?
2 మనం సహేతుకంగా ఉన్నామో లేదో పరీక్షించుకోడానికి పౌలు మాటలు మనకెలా సహాయం చేస్తాయో గమనించండి. మనల్ని మనం ఎలా దృష్టించుకుంటున్నామన్నది పెద్ద ప్రశ్నకాదు; ఇతరులు మనల్ని ఎలా చూస్తున్నారు, మన గుర్తింపు ఏమిటి అన్నదే ప్రశ్న. ఫిలిప్స్ తర్జుమా ఈ వచనాన్ని ఇలా అనువదించింది: “సహేతుకమైనవారిగా ఉన్నారనే పేరుపొందండి.” మనలో ప్రతి ఒక్కరం ఇలా ప్రశ్నించుకోవాలి, ‘నేనెలాంటి వాడినని లోకానికి తెలుసు? నాకు సహేతుకమైన, సమ్మతించే, మృదువైన వ్యక్తి అనే పేరుందా? లేక నేను కఠినమైన, క్రూరమైన, లేక తలబిరుసు గల వ్యక్తిగా పేరుపొందానా?’
3. (ఎ) “సహేతుకమైన” అని అనువదించబడిన గ్రీకు పదం యొక్క భావమేమిటి, ఈ లక్షణం ఎందుకు ప్రీతిపాత్రమైంది? (బి) మరింత సహేతుకంగా ఉండడాన్ని ఒక క్రైస్తవుడు ఎలా నేర్చుకోవచ్చు?
3 ఈ విషయంలో మనకున్న పేరు మనం యేసుక్రీస్తును ఎంతమేరకు అనుకరిస్తున్నామనే దానిని నిరూపిస్తుంది. (1 కొరింథీయులు 11:1) యేసు భూమిమీద ఉన్నప్పుడు సహేతుకత విషయంలో తన తండ్రి యొక్క సర్వోన్నత మాదిరిని పరిపూర్ణంగా ప్రతిబింబించాడు. (యోహాను 14:9) వాస్తవానికి, పౌలు “క్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును” గూర్చి వ్రాసినప్పుడు, మృదుత్వానికి ఆయన వాడిన గ్రీకు పదం (ఎపికియాస్) అంటే “సహేతుకత” లేక, అక్షరార్థంగా “లోబడు” అనే భావము కూడా వుంది. (2 కొరింథీయులు 10:1) ది ఎక్స్‌పోసిటర్స్ బైబిల్ కామెంటరీ దీన్ని “కొత్త నిబంధనలో గుణాన్ని వర్ణించిన గొప్ప పదాల్లో ఒకటని” పిలుస్తున్నది. ఇది ఎంత ప్రీతిపాత్రమైన గుణాన్ని వర్ణిస్తుందంటే, ఆ పదాన్ని ఒక విద్వాంసుడు “సుమధురమైన సహేతుకత” అని అనువదించాడు. కాబట్టి మనం, తన తండ్రియైన యెహోవా వలెనే యేసు సహేతుకతను చూపించిన మూడు మార్గాలను గూర్చి చర్చిద్దాము. అలా మనకై మనం మరింత సహేతుకమైన వారిగా ఎలా తయారు కావచ్చో నేర్చుకోవచ్చును.—1 పేతురు 2:21.
“క్షమించడానికి సిద్ధమైన మనస్సు”
4. “క్షమించడానికి సిద్ధమైన మనస్సు” కలిగివున్నట్లు యేసు తనను తాను ఎలా చూపించుకున్నాడు?
4 తన తండ్రివలె, యేసు పదే పదే “క్షమించడానికి సిద్ధమైన మనస్సు” కలిగివుండడం ద్వారా సహేతుకతను చూపించాడు. (కీర్తన 86:5) యేసును బంధించి, తీర్పుకు తీసుకువెళ్లిన రాత్రి మూడుసార్లు యేసు ఎవరో తెలియదని ఆయన సన్నిహిత సహచరుడైన పేతురు బొంకిన సమయాన్ని గురించి ఆలోచించండి. మునుపు యేసు తానే ఇలా చెప్పాడు: “మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును ఎరుగనందును.” (మత్తయి 10:33) యేసు కఠినంగా, కనికరం లేకుండా పేతురుకు ఈ నియమాన్ని అన్వయించాడా? లేదు; నిస్సందేహంగా, పశ్చాత్తాపం పొందిన, విరిగిన మనస్సుగల అపొస్తలుని ఓదార్చి, ఉపశమనం కలుగజేయడానికి పునరుత్థానం తర్వాత యేసు పేతురును వ్యక్తిగతంగా దర్శించాడు. (లూకా 24:34; 1 కొరింథీయులు 15:5) దాని తర్వాత కొంతకాలానికి, పేతురు గొప్ప బాధ్యతను కలిగివుండడానికి యేసు అనుమతించాడు. (అపొస్తలుల కార్యములు 2:1-41) ఇక్కడ సుమధురమైన సహేతుకత అత్యున్నతంగా ప్రదర్శించబడింది! మానవజాతంతటిపై యేసును న్యాయాధిపతిగా యెహోవా నియమించాడని తలంచడం ఓదార్పుకరంగా లేదా?—యెషయా 11:1-4; యోహాను 5:22.
5. (ఎ) మంద మధ్యన పెద్దలకు ఎలాంటి పేరు ఉండాలి? (బి) న్యాయపరమైన విషయాలను నిర్వహించే ముందు పెద్దలు ఏ సమాచారాన్ని పునఃపరిశీలించవచ్చు, ఎందుకు?
5 సంఘంలోని పెద్దలు న్యాయాధిపతులుగా పనిచేసేటప్పుడు, వారు యేసు యొక్క సహేతుకమైన మాదిరిని అనుసరించుటకు ప్రయత్నిస్తారు. శిక్షించేవారైనట్లు వారిని చూసి గొర్రెలు భయపడాలని వారు కోరుకొనరు. బదులుగా, గొర్రెలు ప్రేమగల కాపరుల వద్ద ఉన్నప్పుడు సురక్షితంగా ఉన్నట్లు భావించేలా వారు యేసు మాదిరిని అనుకరిస్తారు. న్యాయసంబంధ విషయాల్లో, సహేతుకంగా ఉండడానికి, క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగి ఉండడానికి వారు ఎంతగానో ప్రయత్నిస్తారు. అలాంటి విషయాన్ని నిర్వహించేముందు, కొంతమంది పెద్దలు అక్టోబరు 1, 1992 కావలికోటలోని “యెహోవా, నిష్పక్షపాతియైన ‘సర్వలోక’ న్యాయాధిపతి,” “పెద్దలు నీతి ననుసరించి తీర్పుతీర్చుదురు” వంటి శీర్షికలను పునఃపరిశీలించడం సహాయకరంగా ఉంటుందని తెలుసుకున్నారు. వారు తీర్పు తీర్చడంలో “అవసరమైన చోట కఠినత్వం, వీలైనచోట కనికరం” అనే యెహోవా విధానాన్ని మనస్సులో ఉంచుకుంటారు. సహేతుకమైనప్పుడు, తీర్పులో కనికరం చూపించడానికి మొగ్గు చూపడం తప్పుకాదు. (మత్తయి 12:7) క్రూరంగా లేక కనికరం లేకుండా ఉండడమే పెద్ద తప్పు. (యెహెజ్కేలు 34:4) న్యాయపరిధిలోనే అత్యంత ప్రేమగల, కనికరంతో కూడిన విధానాన్ని గైకొనడానికి చురుకుగా ప్రయత్నించడం ద్వారా పెద్దలు తప్పు చేయకుండా తప్పించుకుంటారు.—మత్తయి 23:23; యాకోబు 2:13 పోల్చండి.
మారుతున్న పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు తదనుగుణంగా మారడం
6. దయ్యము పట్టిన కుమార్తె గల అన్యురాలైన తల్లితో వ్యవహరించేటప్పుడు యేసు సహేతుకతను ఎలా ప్రదర్శించాడు?
6 యెహోవా వలెనే యేసు, ఉత్పన్నమైన కొత్త పరిస్థితులకు అనువుగా మలుచుకోవడం లేక విధానాన్ని మార్చుకోవడంలో ఆతురత కలిగివున్నట్లు తనను తాను నిరూపించుకున్నాడు. దయ్యము పట్టిన తన కుమార్తెను బాగుచేయమని ఒకసారి ఒక అన్యురాలైన స్త్రీ ఆయనను వేడుకుంది. మూడు వేరు వేరు విధాలుగా, తాను ఆమెకు సహాయం చేయనని యేసు ప్రథమంగా సూచించాడు—మొదట, ఆమెకు సమధానమిచ్చుటకు వెనుదీయడం ద్వారా; రెండవదిగా, తాను పంపబడింది అన్యుల కొరకు కాదుగాని యూదుల కొరకని సూటిగా చెప్పడం ద్వారా; మూడవదిగా అదే విషయాన్ని దయగా తెలియజేసిన ఉపమానాన్ని చెప్పడం ద్వారా సూచించాడు. అయితే, ఆ స్త్రీ అసాధారణమైన విశ్వాసానికి నిదర్శనాన్ని చూపిస్తూ, తన విన్నపాన్ని విడువక కొనసాగించింది. ఈ ప్రత్యేకమైన పరిస్థితులను దృష్టిలోకి తీసుకుని ఒక సాధారణ నిబంధనను అమలు పరచుటకు ఇది సమయం కాదని యేసు తెలుసుకున్నాడు; అది ఉన్నత సూత్రాలకు అనుగుణంగా మలుచుకోడానికి సమయము.a అలా, తాను చేయనని మూడుసార్లు చెప్పినదాన్నే యేసు కచ్చితంగా చేశాడు. ఆ స్త్రీ కుమార్తెను ఆయన స్వస్థపర్చాడు!—మత్తయి 15:21-28.
7. తల్లిదండ్రులు ఏయే విధాలుగా సహేతుకతను చూపించవచ్చు, ఎందుకు?
7 మనం కూడా అలాగే, తగిన సమయంలో మారడానికి యిష్టపడేవారమనే పేరు కలిగి ఉన్నామా? తల్లిదండ్రులు తరచూ అలాంటి సహేతుకతను చూపించవలసిన అవసరత ఉంది. ప్రతి బాలుడు ప్రత్యేకమైనవాడు గనుక, ఒకరికి పనికొచ్చే విధానాలు మరొకరికి తగిన విధంగా ఉండకపోవచ్చు. అంతేగాక, పిల్లలు పెరుగుతుండగా, వారి అవసరాలు కూడా మారతాయి. వారు ఇంటికి ఎప్పుడు రావాలి అనే సమయంపై విధించబడిన పరిమితిని సర్దుబాటు చేయవచ్చా? కుటుంబ పఠనం మరింత సజీవమైనదిగా తీర్చిదిద్దబడుట మూలంగా ప్రయోజనం పొందవచ్చా? ఏదైనా ఒక చిన్న తప్పుకు తల్లి లేదా తండ్రి అతిగా ప్రతిస్పందించినప్పుడు, అతడు లేక ఆమె దీనత్వం కలిగి ఉండి పరిస్థితులను సరిచేయడానికి సుముఖత కలిగి ఉన్నారా? అలాంటి విధానాల్లో తమను తగ్గించుకొనే తల్లిదండ్రులు తమ పిల్లలను అనవసరంగా చికాకుపర్చడం, యెహోవా నుండి వారిని దూరం చేయడం వంటివాటిని నివారించగలరు.—ఎఫెసీయులు 6:4.
8. వారు ప్రకటించు ప్రాంత అవసరతలకు అనుగుణంగా మారడంలో సంఘ పెద్దలు ఎలా నాయకత్వం వహించవచ్చు?
8 పెద్దలు కూడా నిర్దిష్టమైన దేవుని శాసనాలతో ఎన్నడూ రాజీపడకుండా, కొత్త పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు వాటికి తగినట్లు మారాలి. ప్రకటించే పనిని పర్యవేక్షిస్తున్నప్పుడు, ప్రకటించు ప్రాంతంలో వచ్చే మార్పులను మీరు గమనిస్తున్నారా? మీ ఇరుగుపొరుగున జీవన పరిస్థితులు మారినప్పుడు, బహుశా సాయంకాల సాక్ష్యం, వీధి సాక్ష్యం లేక టెలిపోను సాక్ష్యం వంటివాటిని ప్రోత్సహించాలి. అలాంటి మార్గాలను చేపట్టడం మనం మన పరిచర్య పనిని మరింత ప్రభావవంతంగా నెరవేర్చడానికి సహాయపడుతుంది. (మత్తయి 28:19, 20; 1 కొరింథీయులు 9:26) పౌలు కూడా అలాగే తన పరిచర్యలో అన్నిరకాల ప్రజలకు తగిన విధంగా మలచుకోడానికి నేర్చుకున్నాడు. ఉదాహరణకు, మనం కూడా ప్రజలకు సహాయ పడగలిగేలా స్థానిక మతాలు, సంస్కృతుల గురించి తగినంత తెలుసుకోవడం ద్వారా అలాగే చేస్తామా?—1 కొరింథీయులు 9:19-23.
9. ఒక పెద్ద సమస్యలను ఎప్పుడూ తాను మునుపు పరిష్కరించినట్లే పరిష్కరించాలని ఎందుకు ప్రయత్నించకూడదు?
9 ఈ అంత్యదినాలు మరింత కష్టతరమగుచుండగా, కాపరులు కూడా తమ మందకు ఇప్పుడు ఎదురౌతున్న కొన్ని సమస్యల మూలంగా కల్గే చిక్కులు అనంగీకార పరిస్థితులకు తగినట్లు మారవలసి ఉంటుంది. (2 తిమోతి 3:1) పెద్దలారా, కఠినంగా ఉండడానికి ఇది సమయం కాదు! ఒక పెద్ద గతంలో ఉపయోగించిన విధానాలు ప్రభావహీనం అయినా, లేక “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” అలాంటి అంశాలపై కొత్త సమాచారాన్ని ముద్రించడం యుక్తమని భావిస్తే, కచ్చితంగా ఒక పెద్ద తాను సమస్యలతో గతంలో వ్యవహరించినట్లే ఇప్పుడు కూడా వ్యవహరిస్తానని పట్టుబట్టడు. (మత్తయి 24:45; ప్రసంగి 7:10; 1 కొరింథీయులు 7:31 పోల్చండి.) ఒక నమ్మకమైన పెద్ద, బాగా వినేవారు కావాలని కోరుకొనే ఒక కృంగిన సహోదరికి సహాయం చేయడానికి యథార్థంగా ప్రయత్నించాడు. ఆమెకున్న బాధ అంత తీవ్రమైనది కాదని తలంచి ఆమెకు సామాన్యమైన పరిష్కారమార్గాలను చూపించాడు. వాచ్‌టవర్ సంస్థ ఆమె సమస్యకు సంబంధించి బైబిలు ఆధారిత సమాచారాన్ని ప్రచురించింది. ఆ పెద్ద ఈసారి కొత్త సమాచారాన్ని అన్వయిస్తూ, ఆమె బాధ యెడల సానుభూతి చూపిస్తూ మళ్లీ ఆమెతో మాట్లాడాడు. (1 థెస్సలొనీకయులు 5:14, 15 పోల్చండి.) సహేతుకతకు ఎంత చక్కని మాదిరి!
10. (ఎ) పెద్దలు ఒకరి యెడల ఒకరు అలాగే పెద్దల సభ యెడల ఎలా మంచి దృక్పథాన్ని కనపర్చాలి? (బి) నిర్హేతుకతను ప్రదర్శించే వారిని పెద్దల సభ ఎలా దృష్టించాలి?
10 పెద్దలు కూడా ఒకరి యెడల ఒకరు సమ్మతించే (లోబడియుండే) దృక్పథాన్ని కలిగి ఉండవలసిన అవసరత ఉంది. పెద్దల సభ సమావేశమైనప్పుడు, ఏ ఒక్క పెద్ద కార్యక్రమంలో ఆధిపత్యం చలాయించకుండా ఉండడం ఎంత ప్రాముఖ్యము! (లూకా 9:48) అధ్యక్షత వహిస్తున్న వ్యక్తి ప్రాముఖ్యంగా ఈ విషయంలో నిగ్రహాన్ని కలిగి ఉండాలి. పెద్దల సభ చేసిన నిర్ణయంతో ఏ ఒక్క పెద్ద లేక ఇద్దరు పెద్దలు సమ్మతించనప్పుడు, తామనుకున్న రీతిలోనే పనులు జరగాలని వారు పట్టుబట్టరు. బదులుగా, లేఖన సంబంధ సూత్రాన్ని మీరనంత వరకు, పెద్దలు సహేతుకతను కలిగివుండాలన్నది జ్ఞాపకముంచుకొని, వారు సమ్మతిస్తారు. (1 తిమోతి 3:2, 3) మరో వైపు, తమను తాము “మిక్కిలి శ్రేష్ఠులైన అపొస్తలులుగా” చెప్పుకున్న ‘అవివేకులను సహిస్తున్నందుకు’ పౌలు కొరింథు సంఘాన్ని శిక్షించాడని పెద్దల సంఘము గుర్తుంచుకోవాలి. (2 కొరింథీయులు 11:5, 19, 20) మూర్ఖంగా, నిర్హేతుకమైన విధంగా ప్రవర్తించే తోటి పెద్దకు హెచ్చరిక ఇవ్వడానికి సుముఖత కలిగివుండాలి, కాని అలా చేయడంలో వారు సాత్వికంగా, దయ కలిగి ఉండాలి.—గలతీయులు 6:1.
అధికారాన్ని ఉపయోగించే విషయంలో సహేతుకత
11. యేసు కాలంనాటి యూదా మత నాయకులు అధికారాన్ని చూపించడానికి, యేసు అధికారాన్ని చూపించడానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి?
11 యేసు భూమిపై జీవించిన కాలంలో, ఆయనకు దేవుడిచ్చిన అధికారాన్ని ఉపయోగించడం విషయంలో ఆయన సహేతుకత నిజంగా బయల్పర్చబడింది. ఆయన కాలంనాటి మతనాయకుల నుండి ఆయన ఎంత వేరుగా ఉన్నాడు! ఒక ఉదాహరణను పరిశీలించండి. సబ్బాతు దినాన ఏపనైనా, చివరికి కర్రలు ఏరుకునే పని కూడా చేయకూడదని దేవుని ధర్మశాస్త్రం ఆజ్ఞాపించింది. (నిర్గమకాండము 20:10; సంఖ్యాకాండము 15:32-36) ఆ ఆజ్ఞను ప్రజలు అన్వయించే విషయంలో తమ అదుపును ప్రయోగించాలని మత నాయకులు తలంచారు. కాబట్టి సబ్బాతు దినాన వారు కచ్చితంగా ఏది ఎత్త వచ్చు ననేది నిర్ణయించడం తమ బాధ్యతగా తీసుకున్నారు. వారు ఇలా ఆజ్ఞ జారీ చేశారు: రెండు ఎండు అంజూరపు పండ్ల కంటే బరువైనదేదీ ఎత్తకూడదు. మేకుల యొక్క అదనపు బరువును ఎత్తడం కూడా పని చేయడం అవుతుందని మేకులు గల జోళ్లను ఎత్తడాన్ని కూడా వాళ్లు నిషేధించారు! సబ్బాతును గూర్చిన దేవుని ధర్మశాస్త్రానికి వారు మొత్తం 39 కట్టడలను జోడించి, వాటికి లెక్కలేనన్ని అదనపు సూత్రాలను జతచేశారని చెప్పబడుతుంది. మరో ప్రక్కన యేసు, మితిలేనన్ని నిర్దేశాలను లేక కఠినమైన, చేరుకోలేని ప్రమాణాలను వారిపై ఉంచి, అవమానం ద్వారా ప్రజలను అదుపు చేయాలని ప్రయత్నించలేదు.—మత్తయి 23:2-4; యోహాను 7:47-49.
12. యెహోవా నీతియుక్త కట్టడల విషయంలో యేసు సడలింపు చేయలేదని మనమెందుకు చెప్పవచ్చు?
12 అట్లయితే, దేవుని నీతియుక్తమైన కట్టడలను యేసు దృఢంగా ఉన్నతపర్చలేదని మనం భావించాలా? ఆయన కచ్చితంగా ఉన్నతపర్చాడు! ఆ ఆజ్ఞల వెనుకనున్న సూత్రాలను ప్రజలు హృదయానికి తీసుకున్నప్పుడు అవి ప్రభావవంతమైనవని ఆయన అర్థం చేసుకున్నాడు. పరిసయ్యులు ప్రజలను లెక్కలేనన్ని కట్టడలతో అదుపు చేయాలని ప్రయత్నిస్తుంటే, యేసు వారి హృదయాలను చేరటానికి ప్రయత్నించాడు. ఉదాహరణకు, “వ్యభిచారం నుండి పారిపొండి” అని దైవిక శాసనం చెప్పినప్పుడు దానికి మార్పులేదని ఆయనకు బాగా తెలుసు. (1 కొరింథీయులు 6:18) అందుకే యేసు అవినీతికి దారి తీసే తలంపులను గూర్చి కూడా హెచ్చరించాడు. (మత్తయి 5:28) అలాంటి బోధ కొరకు కేవలం కఠినమైన, సూత్రబద్ధమైన నిబంధనల కంటే మరెంతో ఎక్కువైన జ్ఞానం, వివేచన అవసరమయ్యాయి.
13. (ఎ) పెద్దలు మృదుత్వం లేని చట్టాలను, నిబంధనలను సృష్టించడం ఎందుకు విడనాడాలి? (బి) వ్యక్తి యొక్క మనస్సాక్షిని గౌరవించవలసిన ప్రాముఖ్యత గల కొన్ని సందర్భాలు ఏవి?
13 బాధ్యతాయుతమైన సహోదరులు కూడా హృదయాలను చేరడంలో నేడు అంతే ఆసక్తి కలిగివున్నారు. అలా, వారు నిర్హేతుకమైన, కఠినమైన నిబంధనలను లేక వారి వ్యక్తిగత దృక్పథాలను, అభిప్రాయాలను చట్టాలుగా మార్చడం వంటివి చేయరు. (దానియేలు 6:7-16 పోల్చండి.) వస్త్రాలు, తలదువ్వుకోవడం వంటి విషయాలపై దయాపూర్వకంగా ఇచ్చే జ్ఞాపికలు తగినట్లు, సమయోచితంగా ఉండవచ్చు, కాని ఒక పెద్ద అలాంటి వాటిపైనే తదేకంగా గుచ్చిగుచ్చి మాట్లాడితే లేక తన స్వంత అభిరుచులను వారిపై మోపడానికి ప్రయత్నిస్తే ఆయన సహేతుకమైన వ్యక్తిగా తన పేరును చెడగొట్టుకుంటాడు. నిజంగా, సంఘంలోని అందరూ ఇతరులను అదుపు చేయడం నివారించాలి.—2 కొరింథీయులు 1:24; ఫిలిప్పీయులు 2:12 పోల్చండి.
14. ఇతరుల నుండి ఆశించేదాని విషయంలో తాను సహేతుకతను కలిగివున్నట్లు యేసు ఎలా చూపించాడు?
14 మరో విషయంలో కూడా పెద్దలు తమను తాము పరీక్షించుకోవాలి. ‘ఇతరుల నుండి నేను కోరేవాటి విషయంలో నేను సహేతుకంగా ఉన్నానా?’ యేసు కచ్చితంగా అలాగే ఉన్నాడు. పూర్ణాత్మతో చేసే ప్రయత్నాల కంటే మరెక్కువ వారి నుండి కోరడం లేదని, దాన్ని తాను ఎంతో విలువైనదిగా భావిస్తానని ఆయన తన అనుచరులకు తదేకంగా చూపించాడు. తక్కువ విలువ గల నాణాలు ఇచ్చినందుకు ఆయన బీద విధవరాలిని మెచ్చుకున్నాడు. (మార్కు 12:42, 43) మరియ ఖరీదైన దాన్ని అర్పించుటనుబట్టి ఆయన శిష్యులు ఆమెను విమర్శించినప్పుడు, ఆయన “ఈమె జోలికి పోకుడి; . . . ఈమె తన శక్తికొలది చేసినది” అని వారిని గద్దించాడు. (మార్కు 14:6, 8) ఆయన అనుచరులు ఆయనను నిరాశ పర్చినప్పుడు కూడా ఆయన సహేతుకంగా ఉన్నాడు. ఉదాహరణకు, తాను నిర్భందించబడబోయే రాత్రి తన ముగ్గురు సన్నిహిత అపొస్తలులను తనతోపాటు మేల్కొని ఉండి, జాగరూకులై ఉండమన్నప్పుడు, వారు పదేపదే నిద్రపోవడం ద్వారా ఆయనను నిరాశ పర్చారు. అయినా, ఆయన సానుభూతితో “ఆత్మ సిద్ధమేగాని శరీరము బలహీనమని” అన్నాడు.—మార్కు 14:34-38.
15, 16. (ఎ) మందపై ఒత్తిడి తేవడం లేక వారిని ఎత్తిపొడవడం చేయకుండా పెద్దలు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? (బి) తాను ఇతరుల నుండి ఆశించేదాని విషయంలో ఒక సహోదరి తనను తాను ఎలా మార్చుకున్నది?
15 నిజమే యేసు తన అనుచరులను ‘పోరాడుడి’ అని ప్రోత్సహించాడు. (లూకా 13:24) కాని అలా చేయమని ఆయన వారిని ఎన్నడు ఒత్తిడి చేయలేదు! ఆయన వారిని ప్రేరేపించి, వారికి మాదిరి ఉంచి, నాయకత్వం వహించి, వారి హృదయాలను చేరడానికి ప్రయత్నించాడు. మిగిలినపని చేయడానికి యెహోవా యొక్క పరిశుద్ధాత్మ శక్తియందు ఆయన నమ్మకముంచాడు. నేడు పెద్దలు కూడా అలాగే, మంద యెహోవాను పూర్ణహృదయంతో సేవించేలా ప్రోత్సహించాలి కాని వారు ప్రస్తుతం యెహోవా సేవలో చేస్తున్నది చాలదని లేక అంగీకృతం కాదని చెబుతూ, వారికి అపరాధ భావం లేక అవమానం కలిగేలా వారిని ఎత్తిపొడవకూడదు. “ఇంకా చేయండి, ఇంకా చేయండి, ఇంకా చేయండి!” అని కఠినంగా చెప్పడం, తాము చేయగలిగినదంతా చేస్తున్నవారి మనస్సును బాధించవచ్చు. ఒక పెద్ద ‘ఎంతకు సంతోషపడని వానిగా’ పేరు పొందితే ఎంత విచారకరం—సహేతుకత్వానికి అది సుదూరమైంది.—1 పేతురు 2:18.
16 ఇతరుల నుండి మనం కోరేదానిలో మనమందరం సహేతుకంగా ఉండాలి! ఒక సహోదరి అనారోగ్యంతో ఉన్న తమ తల్లిని చూసుకోడానికి తాను, తన భర్త మిషనరీ సేవను విడిచిపెట్టిన తర్వాత ఇలా వ్రాసింది: “సంఘాలలో ఉన్న ప్రచారకులమైన మాకు ఈ సమయాలు నిజంగా కష్టమైనవి. సర్క్యూట్, జిల్లా పనిలో ఉండడం వల్ల, అలాంటి అనేక ఒత్తిడులకు దూరంగా ఉన్న మేము హఠాత్తుగా, బాధాకరంగా వీటిని గురించి తెలుసుకోవల్సి వచ్చింది. ఉదాహరణకు, నాకు నేను ఇలా అనుకునేదాన్ని ‘ఆ సహోదరి ఈ నెలలో అందించాల్సిన సాహిత్యాన్ని ఎందుకు అందించదు? ఆమె రాజ్య పరిచర్యను చదవదా?’ అలా ఎందుకో నాకిప్పుడు తెలుసు. కొంతమందికి తాము [పరిచర్యలో] పాల్గొనడానికి రావడమే గగనము.” సహోదరులను వారు చేయని దానిని బట్టి వారికి తీర్పుతీర్చే బదులు వారు చేసేదాన్ని బట్టి వారిని మెచ్చుకోవడం ఎంత మంచిది!
17. సహేతుకత విషయంలో యేసు మనకు ఎలా మాదిరి నుంచాడు?
17 యేసు తన అధికారాన్ని సహేతుకమైన రీతిలో ఎలా ప్రదర్శిస్తాడో ఒక చివరి మాదిరిని పరిశీలిద్దాము. తన తండ్రి వలెనే యేసు ఆసక్తితో తన అధికారాన్ని అట్టిపెట్టుకోలేదు. ఇక్కడ భూమిపై “తన యావదాస్తి మీద” నమ్మకమైన దాసుని తరగతిని నియమించి నందున ఆయన కూడా పని అప్పగించడంలో నిపుణుడే. (మత్తయి 24:45-47) ఇతరుల ఆలోచనలను వినడానికి ఆయన భయపడలేదు. ఆయన తరచూ తన శ్రోతలను ఇలా అడిగేవాడు: “నీకేమి తోచుచున్నది?” (మత్తయి 17:25; 18:12; 21:28; 22:42) ఈనాడు క్రీస్తు అనుచరులందరి విషయం కూడా అదే అయివుండాలి. వారికి ఎంత అధికారం ఉన్నప్పటికీ అది వారు వినకుండా ఉండేలా చేయకూడదు. తల్లిదండ్రులారా, వినండి! భర్తలారా, వినండి! పెద్దలారా, వినండి!
18. (ఎ) మనం సహేతుకత గలవారమనే పేరును కలిగివున్నామో లేదో మనమెలా తెలుసుకోవచ్చు? (బి) ఏమి చేయడానికి మనమందరం తీర్మానించుకోవచ్చు?
18 నిశ్చయంగా, మనలో ప్రతి ఒక్కరమూ “సహేతుకత గలవారమను పేరు పొందుటకు” యిష్టపడతాము. (ఫిలిప్పీయులు 4:5, ఫిలిప్స్) మనకు అలాంటి పేరు ఉందని మనకెలా తెలుస్తుంది? ప్రజలు తనను గురించి ఏమని అనుకుంటున్నారోనని యేసు తెలుసుకొన గోరినప్పుడు ఆయన తన నమ్మకమైన సహచరులను అడిగాడు. (మత్తయి 16:13) ఆయన మాదిరిని ఎందుకు అనుసరించ కూడదు? వారు నిష్కపటమైన వారని మీరు నమ్మగల వారినెవరినైనా, మీకు సహేతుకమైనవారని, వినే వ్యక్తియని మంచి పేరు గలదా అని అడగవచ్చు. సహేతుకత విషయంలో యేసు ఉంచిన పరిపూర్ణ మాదిరిని ఇంకా ఎక్కువ నిశితంగా అనుసరించడానికి, మనమందరము కూడా ఎంతో ఎక్కువ చేయవలసి ఉంది! ప్రాముఖ్యంగా మనం ఇతరులపై కొంత అధికారం కలిగి ఉంటే, మనం యెహోవా, యేసు ఉంచిన మాదిరిని అనుసరించి, సహేతుకమైన పద్ధతిలో ప్రవర్తిస్తూ, ఎల్లప్పుడూ క్షమించడానికి సిద్ధంగావుండి, యుక్తమైతే లొంగుటకు లేక సమ్మతించుటకు ఎప్పుడూ సిద్ధంగా ఉందాము. వాస్తవానికి, మనమందరమూ ‘సహేతుకమైన వారిగా’ ఉండడానికి కృషి చేద్దాము!—తీతు 3:2.
[అధస్సూచీలు]
a న్యూ టెస్ట్‌మెంట్ వర్డ్స్ అనే పుస్తకం ఇలా వ్యాఖ్యానించింది: “ఎపికేస్ [సహేతుకత] గల వ్యక్తి, ఒక విషయం చట్టపరంగా పూర్తిగా న్యాయమైనదే అయినప్పటికీ, నైతికంగా పూర్తిగా తప్పయ్యే సమయాలు ఉంటాయని తెలుసుకుంటాడు. చట్టం కంటే ఉన్నతమైనది, గొప్పది అయిన తప్పనిసరి పరిస్థితుల క్రింద చట్టాన్ని ఎప్పుడు సడలించవచ్చో ఎపికేస్ గల వ్యక్తికి తెలుసు.”
మీరెలా సమాధానమిస్తారు?
◻ క్రైస్తవులు ఎందుకు సహేతుకంగా ఉండుటకు యిష్టపడాలి?
◻ క్షమించడానికి సంసిద్ధత కలిగి ఉండడంలో పెద్దలు ఎలా యేసును అనుకరించవచ్చు?
◻ యేసు వలె మనం మృదుత్వంతో ఉండుటకు ఎందుకు పోరాడాలి?
◻ అధికారాన్ని ఉపయోగించే విధానంలో మనమెలా సహేతుకతను చూపించగలము?
◻ మనం నిజంగా సహేతుకంగా ఉన్నామో లేదో మనల్ని మనమెలా పరీక్షించుకోవచ్చు?
[15వ పేజీలోని చిత్రం]
పశ్చాత్తాపపడిన పేతురును యేసు వెంటనే క్షమించాడు
[16వ పేజీలోని చిత్రం]
ఒక స్త్రీ విశేషమైన విశ్వాసాన్ని చూపించినప్పుడు, ఒక సాధారణ నియమాన్ని అమలుపర్చడానికది సమయం కాదని యేసు గ్రహించాడు
[18వ పేజీలోని చిత్రం]
తలిదండ్రులారా వినండి!
[18వ పేజీలోని చిత్రం]
భర్తలారా వినండి!
[18వ పేజీలోని చిత్రం]
పెద్దలారా వినండి!