కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • cl అధ్యా. 17 పేజీలు 169-178
  • ‘ఆహా! దేవుని తెలివి ఎంత లోతైనది!’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘ఆహా! దేవుని తెలివి ఎంత లోతైనది!’
  • యెహోవాకు దగ్గరవ్వండి
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని తెలివి అంటే ఏంటి?
  • సృష్టి యెహోవా తెలివికి ఒక రుజువు
  • నింగిలో దేవుని తెలివి
  • యెహోవా “మాత్రమే అత్యంత తెలివిగలవాడు”
  • “జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • నిజమైన తెలివి కేకలు వేస్తోంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • “పరలోకం నుండి వచ్చే తెలివి” మీ జీవితంలో పనిచేస్తుందా?
    యెహోవాకు దగ్గరవ్వండి
  • నమ్మువారిని రక్షించుటకు యెహోవా “వెఱ్ఱితనమును” ఉపయోగించుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
మరిన్ని
యెహోవాకు దగ్గరవ్వండి
cl అధ్యా. 17 పేజీలు 169-178
గుంపుగా ఎగురుతున్న బాతులు.

అధ్యాయం 17

‘ఆహా! దేవుని తెలివి ఎంత లోతైనది!’

1, 2. ఏడో రోజు గురించి యెహోవా ఏమనుకున్నాడు? ఆ రోజు మొదట్లోనే, ఆయన తెలివికి ఏ పరీక్ష ఎదురైంది?

సర్వనాశనం అయిపోయింది! ఆరో సృష్టి రోజుకే అందం తెచ్చిన మనుషుల ఘనత చిటికెలో కిందికి పడిపోయింది. మనుషులతో సహా “తాను చేసిన ప్రతీదాన్ని చూసి,” దేవుడు “అది చాలా బాగుంది” అని అన్నాడు. (ఆదికాండం 1:31) కానీ ఏడో రోజు మొదట్లోనే, ఆదాముహవ్వలు సాతాను మాటల్ని నమ్మి దేవునికి ఎదురుతిరిగారు. అలా వాళ్లు పాపం, అపరిపూర్ణత, మరణం అనే ఊబిలో పడిపోయారు.

2 చూడ్డానికి, ఏడో రోజు విషయంలో యెహోవా సంకల్పం గాడి తప్పిందేమో అనిపించవచ్చు. మిగతా ఆరు రోజుల్లాగే ఇది కూడా వేల సంవత్సరాల పాటు ఉంటుంది. యెహోవా ఆ రోజును పవిత్రమైనది అని ప్రకటించేశాడు. అలాగే ఆ రోజు చివరికల్లా, పరిపూర్ణ మనుషులు ఈ భూమంతటిని నింపి పరదైసులా మారుస్తారని కూడా చెప్పాడు. (ఆదికాండం 1:28; 2:3) మరి, ఇంత పెద్ద తిరుగుబాటు జరిగిన తర్వాత ఆయన అనుకున్నది ఎలా నిజమౌతుంది? ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? యెహోవా తెలివికి ఇది పెద్ద పరీక్ష.

3, 4. (ఎ) ఏదెనులో జరిగిన తిరుగుబాటుకు యెహోవా ఆలోచించిన పరిష్కారం, ఆయన తెలివికి ఎలా అద్దం పడుతుంది? (బి) యెహోవా తెలివి గురించి నేర్చుకుంటున్నప్పుడు మనం వినయంగా ఏ నిజాన్ని మనసులో ఉంచుకోవాలి?

3 యెహోవా టక్కున పరిష్కారం చెప్పేశాడు. ఆయన ఒకే సమయంలో తిరుగుబాటు చేసినవాళ్లకు శిక్షను, వాళ్లు చిమ్మిన విషానికి విరుగుడుగా ఒక తీపి కబురును చెప్పాడు. (ఆదికాండం 3:15) ఆ పరిష్కారం ఏదెను తోట వరకే ఆగిపోయేది కాదు, అది వేల సంవత్సరాల మనుషుల చరిత్రను కూడా దాటి, భవిష్యత్తు వరకు సాగుతుంది. అది సింపులే, కానీ దాంట్లో ఎంత తెలివి ఉందంటే మనం దాన్ని చదివి ధ్యానించుకుంటూ హాయిగా ఒక జీవితకాలం గడిపేయవచ్చు. దానికితోడు, ఆ పరిష్కారం ఆరు నూరైనా జరిగి తీరుతుంది. చెడుతనం మొత్తానికి, పాపానికి, మరణానికి యెహోవా చెక్‌ పెట్టేస్తాడు. ఆయన నమ్మకమైన మనుషుల్ని పరిపూర్ణతకు తీసుకొస్తాడు. ఇదంతా ఏడో రోజు అయిపోక ముందే జరిగిపోతుంది. ఏం జరిగినా భూమి విషయంలో, మనుషుల విషయంలో అనుకున్నది అనుకున్నట్టు, అనుకున్న సమయానికి యెహోవా చేసి తీరతాడు!

4 ఆయన తెలివి చూస్తుంటే మతిపోతుంది కదా? అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: ‘ఆహా! దేవుని తెలివి ఎంత లోతైనది!’ (రోమీయులు 11:33) ఆ లక్షణం గురించి ఎక్కువ నేర్చుకుంటుండగా, మనం వినయంగా ఒక నిజాన్ని మనసులో ఉంచుకోవాలి. అదేంటంటే, ఆయన తెలివి గురించి మనం ఎంత తెలుసుకున్నా, మహా అయితే సముద్రంలో నీటి బొట్టు అంత తెలుసుకుంటామేమో అంతే. (యోబు 26:14) ముందుగా, మతిపోగొట్టే ఈ లక్షణానికి అర్థమేంటో చూద్దాం.

దేవుని తెలివి అంటే ఏంటి?

5, 6. జ్ఞానానికి, తెలివికి ఉన్న సంబంధం ఏంటి? యెహోవాకు ఎంత అపారమైన జ్ఞానం ఉంది?

5 తెలివి, జ్ఞానం ఒకటి కాదు. కంప్యూటర్లకు చాలా జ్ఞానం ఉంటుంది, అంతమాత్రాన కంప్యూటర్లు చాలా తెలివైనవి అని ఎవరైనా అంటారా? అనరు కదా! అలాగని జ్ఞానానికి, తెలివికి అసలు ఏ సంబంధం లేదని అనుకోకండి. (సామెతలు 10:14) ఉదాహరణకు మీకే ఒంట్లో బాగోక డాక్టర్‌ని కలవాలనుకుంటే, అరకొర జ్ఞానం ఉన్న వ్యక్తినో, అసలు వైద్యం గురించి ఏ మాత్రం జ్ఞానంలేని వ్యక్తినో కలుస్తారా? లేదు కదా! కాబట్టి నిజమైన తెలివికి, ఖచ్చితమైన జ్ఞానం కావాలి.

6 యెహోవా జ్ఞానం ఒక తరగని గని. ‘యుగయుగాలకు రాజుగా’ ఆయన మాత్రమే శాశ్వత కాలం నుండి ఉన్నాడు. (ప్రకటన 15:3) ఆ సంవత్సరాలు, తరాలు, యుగాలు అన్నిటిలో జరిగిన ప్రతీదీ ఆయనకు తెలుసు. బైబిలు ఇలా చెప్తుంది: “ఈ సృష్టిలో దేవునికి కనిపించనిదంటూ ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పజెప్పాలో ఆ దేవుని కళ్లకు అన్నీ స్పష్టంగా, తేటతెల్లంగా కనిపిస్తున్నాయి.” (హెబ్రీయులు 4:13; సామెతలు 15:3) సృష్టికర్తగా, యెహోవాకు తాను చేసిన ప్రతీదాని గురించి పూర్తి అవగాహన ఉంది. ఇంకా ఆయన మనుషుల పనులన్నీ మొదటి నుండి చూస్తూనే ఉన్నాడు. ఆయన ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా ప్రతీ మనిషి హృదయాన్ని చూస్తాడు. (1 దినవృత్తాంతాలు 28:9) యెహోవా మనకు స్వేచ్ఛను ఇచ్చాడు, కాబట్టి మనం దాన్ని ఉపయోగించి తెలివైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఆయన “ప్రార్థనలు వినే” దేవుడు కాబట్టి, కోట్లమంది ఒకేసారి ప్రార్థన చేసినా ఆయన వినగలడు! (కీర్తన 65:2) ఇంక యెహోవాకున్న సాటిలేని జ్ఞాపకశక్తి గురించి వేరే చెప్పాలా?

7, 8. అవగాహనను, వివేచనను, తెలివిని యెహోవా ఎలా చూపిస్తాడు?

7 యెహోవాకు జ్ఞానం కంటే ఎక్కువే ఉంది. ఆయన వాస్తవాలు ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో చూస్తాడు, అలాగే చిన్నచిన్న వివరాలన్నిటినీ కలిపి పూర్తి చిత్రాన్ని చూస్తాడు. ఆయన ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది అవసరమో, ఏది అనవసరమో అంచనా వేస్తాడు. అలాగే, యెహోవా పైపైన కాదుగానీ హృదయ లోతుల్లోకి చూస్తాడు. (1 సమూయేలు 16:7) కాబట్టి యెహోవాకు జ్ఞానానికి మించి అవగాహన, వివేచన ఉన్నాయి. కానీ తెలివి వాటికన్నా గొప్పది.

8 జ్ఞానాన్ని, వివేచనను, అవగాహనను కలిపి వాడడమే తెలివి. బైబిల్లో కొన్నిచోట్ల తెలివిని “ఆచరణాత్మక తెలివి,” “ఇంగిత జ్ఞానం” అని అనువదించారు. కాబట్టి యెహోవా దగ్గర తెలివి ఉండడమే కాదు, దాన్ని ఆయన ఆచరణలో పెడతాడు కూడా, అంటే అది ఆయన పనుల్లో కనిపిస్తుంది. యెహోవా తనకున్న అపారమైన జ్ఞానాన్ని, లోతైన అవగాహనను వాడి ఎప్పుడూ బెస్ట్‌ నిర్ణయాలే తీసుకుంటాడు, వాటిని బెస్ట్‌ పద్ధతిలో అమలుచేస్తాడు. అదే నిజమైన తెలివి! యేసు ఇలా అన్నాడు: “ఒక వ్యక్తి చేసే నీతి పనులే అతను తెలివిగలవాడని చూపిస్తాయి.” యెహోవా విషయంలో ఇది అక్షరాలా నిజం. (మత్తయి 11:19) ఈ విశ్వంలో యెహోవా చేసిన ప్రతీ పని, ఆయన తెలివిగలవాడని గొంతు చించుకుని చెప్తుంది.

సృష్టి యెహోవా తెలివికి ఒక రుజువు

9, 10. (ఎ) యెహోవాకు ఎంత తెలివి ఉంది? ఆయన దాన్ని ఎలా చూపించాడు? (బి) కణం యెహోవా తెలివి గురించి ఏం రుజువు చేస్తుంది?

9 ఒకతను తన నైపుణ్యం అంతా పెట్టి ఒక అందమైన వస్తువును తయారు చేశాడనుకోండి. అది బాగా పని చేయడం చూసి మీకు ఆశ్చర్యమేసిందా? ఖచ్చితంగా, అతని తెలివి మిమ్మల్ని ఆకట్టుకొని ఉంటుంది. (నిర్గమకాండం 31:1-3) అయితే, దానికంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువ తెలివి యెహోవా దగ్గర ఉంది. దానికి చిరునామా ఆయనే. దావీదు రాజు యెహోవా గురించి ఇలా అన్నాడు: “నేను నిన్ను స్తుతిస్తున్నాను, ఎందుకంటే సంభ్రమాశ్చర్యాలు పుట్టించే రీతిలో నేను అద్భుతంగా చేయబడ్డాను. నీ పనులు అద్భుతమైనవి, ఈ విషయం నాకు చాలా బాగా తెలుసు.” (కీర్తన 139:14) అవును, మనిషి శరీరం గురించి నేర్చుకునే కొద్దీ, మనం యెహోవా తెలివికి అంతకంతకూ ఫిదా అయిపోతాం.

10 ఉదాహరణకు, మీ జీవితం ఒక్క కణంతో మొదలైంది. మీ అమ్మ అండం, మీ నాన్న వీర్యకణం కలిసి ఫలదీకరణం చెంది, ఒక కణం ఏర్పడింది. వెంటనే, ఆ కణం విభజన చెందడం మొదలుపెట్టింది. అలా విభజనలు జరిగీ జరిగీ 100 లక్షల కోట్ల కణాలున్న శరీరంగా ఎదిగింది. ఆ కణాలు ఎంత చిన్నగా ఉంటాయంటే, సూది మొన మీద దాదాపు 10,000 కణాలు పడతాయి. అందులో ప్రతీ కణం ఓ అద్భుతం. ఒక కణం, మనుషులు చేసిన ఏ యంత్రం లేదా ఫ్యాక్టరీ కన్నా అంతుచిక్కని అద్భుతమైన నిర్మాణంతో ఉంటుంది. సైంటిస్టులు కణాన్ని, ప్రాకారం ఉన్న నగరంతో పోలుస్తారు. ఎందుకంటే దాని లోపలికి వెళ్లాలన్నా, బయటికి రావాలన్నా నిఘా ఉంటుంది. పదార్థాల్ని రవాణా చేసే ఒక వ్యవస్థ, సంప్రదించుకోవడానికి ఒక నెట్‌వర్క్‌, శక్తిని తయారుచేసే ఫ్యాక్టరీలు, చెత్తని పడేయడానికి-రీసైక్లింగ్‌ చేయడానికి ఏర్పాట్లు, అలాగే రక్షణ వ్యవస్థ ఉంటాయి. దాని కేంద్రకంలో (nucleus), ఒక రకంగా కేంద్ర ప్రభుత్వమే ఉంటుంది. అంతేకాదు, ఒక కణం కొన్ని గంటల్లోనే అచ్చం దానిలాంటి ఇంకో కణాన్ని పుట్టించగలదు!

11, 12. (ఎ) ఎదుగుతున్న పిండంలోని కణాలు వేర్వేరు కణాలుగా మారడానికి సమాచారం ఎక్కడి నుండి వస్తుంది? ఇది కీర్తన 139:16 లో ఉన్న మాటలకు ఎలా సరిపోతుంది? (బి) మనం ‘అద్భుతంగా చేయబడ్డామని’ మనిషి మెదడు ఎలా రుజువు చేస్తుంది?

11 నిజమే, అన్ని కణాలూ ఒకేలా ఉండవు. పిండంలోని కణాలు విభజించబడుతున్న కొద్దీ, వేర్వేరు కణాలుగా మారతాయి. అంటే కొన్ని నాడీ కణాలుగా, ఇంకొన్ని ఎముక, కండరం, రక్తం, లేదా కంటికి సంబంధించిన కణాలుగా మారతాయి. అవి ఎలా మారాలనే సమాచారమంతా, ఆ కణంలో ఉండే డి.ఎన్‌.ఎ.లో ఉంటుంది. దాన్ని జన్యువుల నమూనా (బ్లూ ప్రింట్‌) ఉండే గ్రంథాలయం లేదా లైబ్రరీ అని పిలవవచ్చు. ఆసక్తికరంగా, పవిత్రశక్తి ప్రేరణ వల్ల దావీదు యెహోవాతో ఇలా అన్నాడు: ‘నేను పిండంగా ఉన్నప్పుడే నీ కళ్లు నన్ను చూశాయి; దాని భాగాలన్నీ నీ గ్రంథంలో రాయబడ్డాయి.’—కీర్తన 139:16.

12 కొన్ని శరీర అవయవాల నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. ఉదాహరణకు, మనిషి మెదడునే తీసుకోండి. ఈ విశ్వంలో ఇప్పటివరకు కనిపెట్టిన వాటన్నిటిలో అంతుచిక్కనిది ఏదైనా ఉంది అంటే అది ఇదే అని కొంతమంది అంటారు. దాంట్లో దాదాపు 10,000 కోట్ల నాడీ కణాలు ఉంటాయి. అంటే ఇంచుమించు మన నక్షత్రవీధిలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయో అన్ని అన్నమాట. వాటిలో ప్రతీ నాడీ కణం కొమ్మలుగా విడిపోయి, వేరే నాడీ కణాలతో వేల లింక్‌లు ఏర్పర్చుకుంటుంది. ఈ ప్రపంచంలో ఎన్ని లైబ్రరీలు ఉంటే అన్ని లైబ్రరీల్లో ఉన్న సమాచారమంతటినీ మనిషి మెదడు దాచుకోగలదని, అది ఇంకా ఎంత దాచుకోగలదో కనిపెట్టడం కష్టమని సైంటిస్టులు చెప్తున్నారు. దేవుడు “అద్భుతంగా” సృష్టించిన ఈ అవయవం గురించి వాళ్లు చాలా సంవత్సరాల పాటు అధ్యయనం చేశారు. అయినా, దాని పనితీరు గురించి ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేం అని వాళ్లు ఒప్పుకుంటున్నారు.

13, 14. (ఎ) చీమలు, వేరే జీవులు “స్వాభావికంగా తెలివిగలవి” అని ఎలా చెప్పవచ్చు? అవి సృష్టికర్త గురించి ఏం చెప్తున్నాయి? (బి) సాలెగూడు లాంటి వాటిలో దేవుని “తెలివి” ఎలా కనిపిస్తుంది?

13 అయితే, యెహోవా ఎంతో తెలివితో చేసిన సృష్టిలో, మనిషి ఒక ఉదాహరణ మాత్రమే. కీర్తన 104:24 లో ఇలా ఉంది: “యెహోవా, నీ పనులు అసంఖ్యాకం! తెలివితో నువ్వు వాటన్నిటినీ చేశావు. నువ్వు చేసినవాటితో భూమి నిండిపోయింది.” మనచుట్టూ ఉన్న సృష్టిలో ఎక్కడ చూసినా, అందులో యెహోవా తెలివి కనిపిస్తుంది. ఉదాహరణకు, చీమలు “స్వాభావికంగా తెలివిగలవి.” (సామెతలు 30:24) చీమల కాలనీలు (నివాసాలు) ఒక పద్ధతి ప్రకారం ఉంటాయి. కొన్ని చీమలు వాటి పుట్టల్లో అఫిడ్స్‌ అనే కీటకాలకు ఆశ్రయమిచ్చి, వాటిని పెంచుకుంటాయి, వాటి నుండి వచ్చే ద్రవాన్ని ఆహారంగా తీసుకుంటాయి. ఇంకొన్ని చీమలు రైతుల్లా వ్యవసాయం చేస్తూ, ఫంగస్‌ అనే పంటను సాగుచేసి పండిస్తాయి. ఇంకా చాలా జీవులు స్వాభావికంగా అద్భుతమైన పనులు చేసేలా యెహోవా సృష్టించాడు. మనం రోజూ చూసే ఈగ గాలిలో ఎన్ని విన్యాసాలు చేస్తుందంటే, మనుషులు కనిపెట్టిన కొత్తకొత్త విమానాలు కూడా అన్ని విన్యాసాలు చేయలేవు. వలస పక్షులు నక్షత్రాల సహాయంతో, వాటి శరీరంలో ఉన్న ఒకలాంటి మ్యాప్‌ సహాయంతో దూరదూరాలకు వెళ్తాయి. జీవుల్లో ఉన్న ఈ అద్భుతమైన సామర్థ్యాల్ని తెలుసుకోవడానికి సైంటిస్టులు ఏళ్ల తరబడి అధ్యయనం చేస్తున్నారు. వాటికే అంత తెలివి ఉంటే, ఈ సామర్థ్యాలన్నీ ఇచ్చిన దేవునికి ఇంకెంత తెలివి ఉండాలి!

14 సృష్టిలో ఉన్న దేవుని తెలివిని చూసి సైంటిస్టులు చాలా విషయాలు నేర్చుకున్నారు. ఇంజినీరింగ్‌లో, ఏకంగా దీనికి ఒక బ్రాంచే ఉంది. దాన్ని బయోమిమెటిక్స్‌ అంటారు. వాళ్లు సృష్టిలో ఉన్న వాటిని చూసి వస్తువుల్ని తయారు చేస్తారు. ఉదాహరణకు, మీరు ఒక సాలెగూడును చూసినప్పుడు భలే ఉందే అనుకుంటారు. కానీ ఇంజినీర్లు మాత్రం దాని డిజైన్‌ చూసి ఆశ్చర్యపోతారు. ఊదితే రాలిపోయేంత సున్నితంగా కనిపించే సాలెగూడు తీగలు స్టీల్‌ కన్నా బలంగా, బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌లో ఉన్న పోగుల కన్నా దృఢంగా ఉంటాయి. అవి ఎంత బలంగా ఉంటాయో తెలుసా? ఒక సాలెగూడును చేపలు పట్టే వల అంత సైజుకి, అంత మందానికి సాగదీస్తే, అది గాల్లో ఎగురుతున్న పెద్ద విమానాన్ని కూడా ఒక ఈగను పట్టుకున్నట్టు పట్టుకోగలదు! యెహోవా వీటన్నిటినీ ఎంత “తెలివితో” చేశాడో కదా.

చిత్రాలు: సృష్టిలో కనిపిస్తున్న యెహోవా తెలివి. 1. ఒక సాలెగూడు. 2. ఒక వరుసలో ఆకుల్ని మోసుకెళ్తున్న చీమలు. 3. గుంపుగా ఎగురుతున్న బాతులు.

వీటికి ఇంత అద్భుతమైన “తెలివి” ఎవరు ఇచ్చారు?

నింగిలో దేవుని తెలివి

15, 16. (ఎ) ఆకాశంలో పరుచుకున్న తారలు యెహోవా తెలివి గురించి ఏం చెప్తున్నాయి? (బి) యెహోవా కోటానుకోట్ల దేవదూతలకు అధిపతిగా ఉండడంలో ఆయన తెలివి ఎలా కనిపిస్తుంది?

15 భూమ్మీదే కాదు, ఈ విశ్వం మొత్తంలో యెహోవా తెలివి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పుస్తకంలోని 5వ అధ్యాయంలో, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు చిందరవందరగా లేవని మనం నేర్చుకున్నాం. యెహోవా తెలివిగా పెట్టిన “ఆకాశ నియమాల” వల్ల అవన్నీ ఒక పద్ధతి ప్రకారం నక్షత్ర వీధులుగా, ఆ నక్షత్ర వీధులు గుత్తులుగా, ఆ గుత్తులు మహా గుత్తులుగా అందంగా ఏర్పడ్డాయి. (యోబు 38:33) యెహోవా వాటిని “సైన్యం” అని అనడంలో ఆశ్చర్యం లేదు! (యెషయా 40:26) అయితే, ఇంకొక సైన్యం కూడా ఉంది. అది యెహోవా తెలివిని ఇంకా స్పష్టంగా చూపిస్తుంది.

16 మనం 4వ అధ్యాయంలో చూసినట్టు, యెహోవాకు “సైన్యాలకు అధిపతి” అనే పేరు ఉంది. ఎందుకంటే, ఆయన కోటానుకోట్ల దేవదూతల సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. ‘ఇందులో యెహోవా శక్తే కనిపిస్తుంది, తెలివి ఎక్కడ ఉంది?’ అని మీరు అనుకోవచ్చు. కానీ ఆలోచించండి: యెహోవా, యేసు ఎప్పుడూ ఖాళీగా ఉండరు. (యోహాను 5:17) కాబట్టి ఆ సర్వోన్నతుడి కింద పరిచారకులుగా ఉన్న దేవదూతలు కూడా ఎప్పుడూ బిజీగానే ఉంటారు. పైగా గుర్తుంచుకోండి వాళ్లు తెలివిలో, శక్తిలో మనుషుల కన్నా దిట్ట. (హెబ్రీయులు 1:7; 2:7) అయినాసరే, యెహోవా దేవదూతలందర్నీ బిజీగా ఉంచుతూ, వాళ్లు హాయిగా చేసుకోవడానికి చేతినిండా పని ఇచ్చాడు. అదేంటంటే ‘ఆయన మాటను, ఇష్టాన్ని నేరవేర్చడం.’ దాన్ని వాళ్లు కోట్ల సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు. (కీర్తన 103:20, 21) ఇంతమంది శక్తిమంతులకు పని ఇవ్వాలంటే, ఆయనకు ఎంత తెలివి ఉండాలో కదా!

యెహోవా “మాత్రమే అత్యంత తెలివిగలవాడు”

17, 18. యెహోవా “మాత్రమే అత్యంత తెలివిగలవాడు” అని బైబిలు ఎందుకు చెప్తుంది? ఆయన తెలివి గురించి ఆలోచించినప్పుడు మనం ఎందుకు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడతాం?

17 ఇన్ని రుజువులు చూసిన తర్వాత, బైబిలు యెహోవాకున్న గొప్ప తెలివిని ఎందుకు పొగుడుతుందో అర్థమౌతుంది. ఉదాహరణకు, యెహోవా “మాత్రమే అత్యంత తెలివిగలవాడు” అని బైబిలు చెప్తుంది. (రోమీయులు 16:27) యెహోవాకు మాత్రమే పూర్తిస్థాయిలో తెలివి ఉంది. నిజమైన తెలివి అంతటికీ మూలం ఆయనే. (సామెతలు 2:6) అందుకే, దేవుని సృష్టిలో అత్యంత తెలివిగలవాడైన యేసు కూడా తన సొంత తెలివి మీద ఆధారపడలేదు గానీ, తండ్రి ఏం చెప్తే అదే మాట్లాడాడు.—యోహాను 12:48-50.

18 యెహోవాకున్న సాటిలేని తెలివి గురించి అపొస్తలుడైన పౌలు ఏమన్నాడో చూడండి: “ఆహా! దేవుని ఔదార్యం, తెలివి, జ్ఞానం ఎంత లోతైనవి! ఆయన నిర్ణయాల్ని పరిశోధించడం, ఆయన మార్గాల్ని కనుక్కోవడం అసాధ్యం!” (రోమీయులు 11:33) పౌలు తన మాటల్ని “ఆహా” అనే పదంతో మొదలుపెట్టడం వల్ల, ఆయన ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడని అర్థమౌతుంది. “లోతైనవి” అని చెప్పడానికి పౌలు ఉపయోగించిన గ్రీకు పదానికి, “అగాధం” అని అర్థమిచ్చే పదంతో సంబంధం ఉంది. అగాధం అని వినగానే మన మనసులో వెంటనే ఏ చిత్రం వస్తుంది? అడుగు భాగమే లేని ఒక పొడవైన గుంటలోకి తొంగి చూస్తున్నట్టు అనిపిస్తుంది కదా. అదేవిధంగా, యెహోవాకు ఎంత అపరిమితమైన తెలివి ఉందంటే, దాని లోతును కొలవడం అసాధ్యం. యెహోవాకు తెలిసినంత మనకు ఎప్పటికీ తెలీదు. (కీర్తన 92:5) దాని గురించి ఆలోచిస్తుంటే, ఆయన ముందు మనం ఎంత తక్కువో అర్థమౌతుంది కదా.

19, 20. (ఎ) దేవుని తెలివికి గుర్తుగా గద్దను ఉపయోగించడం ఎందుకు సరైనది? (బి) యెహోవా భవిష్యత్తును చూడగలడని చెప్పడానికి బైబిల్లో ఎలాంటి రుజువులున్నాయి?

19 యెహోవా “మాత్రమే అత్యంత తెలివిగలవాడు” అని చెప్పడానికి ఇంకో కారణం ఏంటంటే, ఆయన మాత్రమే భవిష్యత్తును తొంగి చూడగలడు. యెహోవా తన తెలివికి గుర్తుగా, దూరదృష్టి ఉన్న గద్దను ఉపయోగించాడని గుర్తుచేసుకోండి. గోల్డెన్‌ ఈగల్‌ అనే గద్ద ఐదు కేజీలో ఏమో బరువు ఉంటుంది అంతే, కానీ దాని కళ్లు పూర్తిగా ఎదిగిన మనిషి కళ్ల కంటే పెద్దగా ఉంటాయి. దాని కంటిచూపుకు అసలు తిరుగులేదు. అది ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్నా, కిందున్న అతిచిన్న ఎరను కూడా పసిగట్టగలదు. యెహోవాయే స్వయంగా గద్ద గురించి ఒకసారి ఇలా అన్నాడు: “దాని కళ్లు చాలా దూరం చూస్తాయి.” (యోబు 39:29) అదేవిధంగా యెహోవా కూడా “చాలా దూరం” అంటే భవిష్యత్తును చూడగలడు!

20 ఆ మాటలు నిజమని చెప్పడానికి, బైబిలు నిండా చాలా రుజువులు ఉన్నాయి. బైబిల్లో వందల ప్రవచనాలు ఉన్నాయి. చరిత్రను, అది జరగడానికి ముందే రాసేశారా అన్నట్టుగా ఆ ప్రవచనాలు ఉంటాయి. ఫలానా యుద్ధంలో ఎవరు గెలుస్తారు, ఏ ప్రపంచాధిపత్యం లేస్తుంది-ఏది పడిపోతుంది, సైనిక అధికారులు ఏ ఎత్తుగడలు వేసి యుద్ధంలో గెలుస్తారు అనే వివరాలు కూడా బైబిల్లో ఉన్నాయి. కొన్నిసార్లయితే, వందల సంవత్సరాల ముందే బైబిలు అవన్నీ చెప్పింది.—యెషయా 44:25–45:4; దానియేలు 8:2-8, 20-22.

21, 22. (ఎ) మీరు చేయబోయే ప్రతీది యెహోవాకు ముందే తెలుసని నమ్మడం ఎందుకు తప్పు? ఉదాహరణ చెప్పండి. (బి) యెహోవా ఏ ఫీలింగ్స్‌ లేకుండా తన తెలివిని ఉపయోగించడని ఎలా చెప్పవచ్చు?

21 అంటే, మీరు మీ జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో దేవుడు ముందే చూసేస్తాడని దాని అర్థమా? విధి, తలరాత లాంటివి నమ్మేవాళ్లు అవును అనే వాదిస్తారు. అదే నిజమైతే, దేవునికి భవిష్యత్తును చూసే తన సామర్థ్యాన్ని అదుపు చేసుకునే తెలివితేటలు లేనట్టు అవుతుంది. ఈ ఉదాహరణ గమనించండి: మీకు పాటలు బాగా పాడే సామర్థ్యం ఉందనుకోండి. పాడడం వచ్చు కదా అని 24 గంటలూ పాడుతూ ఉంటారా? కాదు కదా! అలాగే, యెహోవాకు భవిష్యత్తును చూసే సామర్థ్యం ఉంది, అలాగని ఆయన 24 గంటలూ అదే చేస్తూ కూర్చోడు. ఒకవేళ అలా చేస్తే, ఆయన మనకు ఇచ్చిన స్వేచ్ఛ అనే విలువైన బహుమతిని లాగేసుకున్నట్టే. ఆయన ఎప్పటికీ అలా చేయడు.—ద్వితీయోపదేశకాండం 30:19, 20.

22 ఘోరమైన విషయం ఏంటంటే, తలరాతను నమ్మేవాళ్లు వాళ్ల జీవితంలో ఏ చెడు జరిగినా దేవుణ్ణి తిట్టుకుంటారు, ఆయన ఏ ఫీలింగ్స్‌, ప్రేమ, కనికరం లేకుండా తెలివిని వాడుతున్నాడని అనుకుంటారు. కానీ అది నిజం కాదు! యెహోవా “హృదయంలో తెలివిగలవాడు” అని బైబిలు చెప్తుంది. (యోబు 9:4, అధస్సూచి) బైబిలు “హృదయం” అని అంటున్నప్పుడు, ఒక వ్యక్తి లోపలి స్వభావం అంటే ఆలోచనలు, ఉద్దేశాలు, ప్రేమ వంటి ఫీలింగ్స్‌ అన్నీ వస్తాయి. కాబట్టి, తన మిగతా లక్షణాల్లాగే తెలివిని చూపించడానికి కూడా యెహోవాను కదిలించేది ప్రేమే.—1 యోహాను 4:8.

23. మనం యెహోవా తెలివిని ఎందుకు నమ్మవచ్చు? అలా నమ్ముతున్నామని ఎలా చూపించవచ్చు?

23 యెహోవా తెలివిని మనం కళ్లు మూసుకుని నమ్మవచ్చు, దాంట్లో ఏ సందేహం అక్కర్లేదు. ఆయన తెలివి ముందు, మన తెలివి చాలా చిన్నది. అందుకే బైబిలు ప్రేమగా మనల్ని ఇలా చేయమని చెప్తుంది: “నీ నిండు హృదయంతో యెహోవా మీద నమ్మకం ఉంచు, నీ సొంత అవగాహన మీద ఆధారపడకు. నీ మార్గాలన్నిట్లో ఆయన్ని పరిగణనలోకి తీసుకో, అప్పుడు ఆయన నీ జీవితాన్ని సఫలం చేస్తాడు.” (సామెతలు 3:5, 6) తర్వాతి అధ్యాయాల్లో మనం దేవుని తెలివి గురించి లోతుగా పరిశీలిస్తూ, ఎంతో తెలివైన యెహోవాకు దగ్గరౌదాం.

ధ్యానించడానికి ప్రశ్నలు

  • యోబు 28:11-28 యెహోవా తెలివి ఎంత విలువైనది? ఆ తెలివి గురించి ఆలోచించడం వల్ల ఏ ప్రయోజనం ఉంటుంది?

  • కీర్తన 104:1-25 సృష్టిలో యెహోవా తెలివి ఎలా కనిపిస్తుంది? అది చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది?

  • సామెతలు 3:19-26 మనం యెహోవా తెలివి గురించి ఆలోచించి దాన్ని పాటించినప్పుడు, మన జీవితం ఎలా ఉంటుంది?

  • దానియేలు 2:19-28 యెహోవాను రహస్యాల్ని వెల్లడిచేసే దేవుడు అని బైబిలు ఎందుకు పిలుస్తుంది? ప్రవచనాల్లో ఉన్న యెహోవా తెలివిని విలువైనదిగా చూస్తే మనం ఏం చేస్తాం?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి