కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • cl అధ్యా. 22 పేజీలు 219-228
  • “పరలోకం నుండి వచ్చే తెలివి” మీ జీవితంలో పనిచేస్తుందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “పరలోకం నుండి వచ్చే తెలివి” మీ జీవితంలో పనిచేస్తుందా?
  • యెహోవాకు దగ్గరవ్వండి
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘తెలివిని సంపాదించండి’—అదెలా?
  • “స్వచ్ఛమైనది, తర్వాత శాంతికరమైనది”
  • “పట్టుబట్టే స్వభావం లేనిది, లోబడడానికి సిద్ధంగా ఉండేది”
  • “కరుణతో, మంచి ఫలాలతో నిండివున్నది”
  • “పక్షపాతం గానీ వేషధారణ గానీ లేనిది”
  • “తెలివిని . . . భద్రంగా కాపాడుకో”
  • దేవుడిచ్చే తెలివిని చూపించండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • నిజమైన తెలివి కేకలు వేస్తోంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • “జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • ‘ఆహా! దేవుని తెలివి ఎంత లోతైనది!’
    యెహోవాకు దగ్గరవ్వండి
మరిన్ని
యెహోవాకు దగ్గరవ్వండి
cl అధ్యా. 22 పేజీలు 219-228
బైబిల్ని, బైబిలు ఆధారిత ప్రచురణల్ని చదువుతున్న ఓ సహోదరి.

అధ్యాయం 22

“పరలోకం నుండి వచ్చే తెలివి” మీ జీవితంలో పనిచేస్తుందా?

1-3. (ఎ) ఇద్దరు ఆడవాళ్ల మధ్య గొడవను సొలొమోను ఎలా తెలివిగా పరిష్కరించాడు? (బి) యెహోవా మనకు ఏం ఇస్తానని మాటిచ్చాడు? ఇప్పుడు మనం ఏ ప్రశ్నలకు జవాబులు చూస్తాం?

ఒకరోజు ఒక కష్టమైన కేసు వచ్చింది. ఇద్దరు ఆడవాళ్లు ఒక బిడ్డను తీసుకుని, ఆ బిడ్డ నాదంటే నాదని పోట్లాడుకుంటున్నారు. ఆ ఇద్దరు ఆడవాళ్లు ఒకే ఇంట్లో ఉంటారు. కొద్ది రోజుల తేడాతో వాళ్లిద్దరూ చెరొక బాబును కన్నారు. ఆ ఇద్దరు బాబుల్లో ఒక బాబు చనిపోయాడు, ఇంకో బాబు బ్రతికున్నాడు. ఇప్పుడు ఆ బ్రతికున్న బాబుకి తల్లి నేనంటే నేనని ఇద్దరూ వాదులాడుకుంటున్నారు.a జరిగింది ఏంటో చెప్పడానికి, దాన్ని చూసినవాళ్లు ఎవరైనా ఉన్నారా అంటే అదీ లేదు. బహుశా ఆ కేసు కింది కోర్టుకు వెళ్లి ఉంటుంది, కానీ అక్కడ ఏదీ తేలకపోయే సరికి, మొత్తానికి ఆ గొడవ ఇశ్రాయేలు రాజైన సొలొమోను దగ్గరికి చేరింది. మరి ఇప్పుడు ఆయన నిజాన్ని కనిపెట్టగలడా?

2 ఆ ఇద్దరి ఆడవాళ్ల వాదనలు విన్న తర్వాత, సొలొమోను ఒక కత్తి తెమ్మని అడిగాడు. తర్వాత ఆయన ఆ బిడ్డను రెండు సగాల కింద చీల్చి, ఆ ఇద్దరికి చెరో సగం ఇవ్వమని ఆజ్ఞాపించాడు. ఒక్కసారిగా, అసలు తల్లి తన ముద్దుల కొడుకును వేరే ఆమెకే ఇచ్చేయమని రాజును బ్రతిమాలింది. కానీ వేరే ఆమె మాత్రం, ఆ బిడ్డను రెండు సగాలు చేయాల్సిందే అని పట్టుబట్టింది. ఇప్పుడు నిజమేంటో సొలొమోనుకు అర్థమైపోయింది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ మీద తల్లికి ఎంత మమకారం ఉంటుందో ఆయనకు తెలుసు, కాబట్టి ఆ జ్ఞానాన్ని ఉపయోగించి ఆయన ఈ గొడవను పరిష్కరించాడు. సొలొమోను ఆ బిడ్డను అసలు తల్లికే ఇచ్చేస్తూ “ఆమే ఆ బిడ్డ తల్లి” అని అన్నప్పుడు, ఆమె ఎంత హాయిగా ఊపిరి పీల్చుకుని ఉంటుందో కదా.—1 రాజులు 3:16-27.

3 భలే కనిపెట్టాడు కదా, ఎంత తెలివో! సొలొమోను ఆ గొడవను ఎలా పరిష్కరించాడో ప్రజలు విన్నారు. దేవుడు ఆయనకు అంత తెలివిని ఇవ్వడం చూసి వాళ్లు ఆశ్చర్యంలో మునిగిపోయారు. అవును, సొలొమోనుకు ఉన్న తెలివి దేవుడిచ్చిన బహుమతి. యెహోవా ఆయనకు “తెలివి, అవగాహన గల హృదయాన్ని” ఇచ్చాడు. (1 రాజులు 3:12, 28) మరి మన సంగతేంటి? మనకు కూడా దేవుడు తెలివిని ఇస్తాడా? ఇస్తాడు, ఎందుకంటే పవిత్రశక్తి ప్రేరణతో సొలొమోను ఇలా రాశాడు: “తెలివిని ఇచ్చేది యెహోవాయే.” (సామెతలు 2:6) తెలివి అంటే జ్ఞానాన్ని, అవగాహనను, వివేచనను కలిపి సరిగ్గా ఉపయోగించే సామర్థ్యం. తెలివి కోసం మనస్ఫూర్తిగా వెతికితే దాన్ని ఇస్తానని యెహోవా మాటిస్తున్నాడు. ఇంతకీ పరలోకం నుండి వచ్చే తెలివిని మనం ఎలా సంపాదించుకోవచ్చు? దాన్ని మన జీవితంలో ఎలా చూపించవచ్చు?

‘తెలివిని సంపాదించండి’—అదెలా?

4-7. తెలివిని సంపాదించాలంటే మనం ఏ నాలుగు పనులు చేయాలి?

4 దేవుడు మనకు తెలివిని ఇవ్వాలంటే మనం మేధావులమో, బాగా చదువుకున్న వాళ్లమో అయ్యుండాలా? లేదు. మన సంస్కృతి ఏదైనా, మనం చదువుకున్నా-చదువుకోకపోయినా యెహోవా మనకు తెలివిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. (1 కొరింథీయులు 1:26-29) కాకపోతే మనమే మొదటి అడుగు వేయాలి. ఎందుకంటే, బైబిలు “తెలివిని సంపాదించు” అని మనల్ని ప్రోత్సహిస్తుంది. (సామెతలు 4:7) దాన్ని మనమెలా చేయవచ్చు?

5 మొదటిగా, మనకు దేవుని మీద భయం ఉండాలి. సామెతలు 9:10 ఇలా చెప్తుంది: “యెహోవా మీదుండే భయమే తెలివికి ఆరంభం [“మొదటి మెట్టు,” పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌].” దేవుని మీదుండే భయమే నిజమైన తెలివికి పునాది. అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఒకసారి గుర్తుతెచ్చుకోండి, తెలివిలో జ్ఞానాన్ని చక్కగా ఉపయోగించడం కూడా ఉంది. దేవునికి భయపడడం అంటే ఆయన ఏం చేస్తాడో అని గజగజ వణికిపోవడం కాదు గానీ భక్తితో, గౌరవంతో, నమ్మకంతో ఆయనకు లోబడడం. అలాంటి భయం మనకు మంచి చేస్తుంది, సరైనది చేయాలనే కోరికను పుట్టిస్తుంది. మనం దేవుని ఇష్టం గురించి, ఆయన పనుల గురించి జ్ఞానం సంపాదించాం కాబట్టి, దానికి తగ్గట్టుగా మన జీవితాన్ని మలుచుకునేలా అది మనల్ని కదిలిస్తుంది. అంతకన్నా తెలివైన పని ఇంకొకటి లేదు, ఎందుకంటే యెహోవా ప్రమాణాలు వాటిని పాటించేవాళ్లకు ఎప్పుడూ మంచే చేస్తాయి.

6 రెండోదిగా, మనకు వినయం, అణకువ ఉండాలి. వినయం, అణకువ లేనిచోట దేవుని తెలివి ఒక్క క్షణం కూడా ఉండదు. (సామెతలు 11:2) అలాగని ఎందుకు అంటున్నాం? వినయం, అణకువ ఉంటే మనకు అన్నీ తెలియవని, మన అభిప్రాయాలే ఎప్పుడూ సరైనవి కావని ఒప్పుకుంటాం. అలాగే ఫలానా విషయంలో యెహోవా ఆలోచన ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. యెహోవా “గర్విష్ఠుల్ని వ్యతిరేకిస్తాడు,” కానీ నిజమైన వినయం ఉన్నవాళ్లకు ఇష్టంగా తెలివిని ఇస్తాడు.—యాకోబు 4:6.

7 మూడోదిగా, దేవుని వాక్యమైన బైబిల్ని మనం అధ్యయనం చేయాలి. దాని నిండా యెహోవా తెలివి ఉంది. ఆ తెలివిని సంపాదించాలంటే మనం చెమటోడ్చి దాన్ని తవ్వాలి. (సామెతలు 2:1-5) నాలుగోదిగా, మనం ప్రార్థించాలి. మనం తెలివి కోసం దేవుణ్ణి మనస్ఫూర్తిగా అడిగినప్పుడు, ఆయన కాదనకుండా ఇస్తాడు. (యాకోబు 1:5) పవిత్రశక్తి సహాయం కోసం మనం చేసే ప్రార్థనలకు యెహోవా ఖచ్చితంగా జవాబిస్తాడు. ఆ పవిత్రశక్తి, బైబిల్లో ఉన్న సంపదను తవ్వి తీయడానికి సహాయం చేస్తుంది. అలా బైబిల్లోని మాటలు మన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి, ప్రమాదాల్ని తప్పించుకోవడానికి, తెలివైన నిర్ణయాల్ని తీసుకోవడానికి సహాయం చేస్తాయి.—లూకా 11:13.

దేవుని తెలివిని సంపాదించాలంటే, మనం చెమటోడ్చి దాన్ని తవ్వాలి

8. మనం నిజంగా దేవుని తెలివిని సంపాదిస్తే, అది ఎలా తెలిసిపోతుంది?

8 మనం 17వ అధ్యాయంలో చూసినట్టు, దేవుని తెలివి హృదయం లోపల ఉండేది కాదు, అది పైకి పనుల్లో కనిపిస్తుంది. అదేవిధంగా, మనం నిజంగా దేవుని తెలివిని సంపాదిస్తే, అది మన ప్రవర్తనలో తెలిసిపోతుంది. అది ఎలా కనిపిస్తుందో శిష్యుడైన యాకోబు వివరించాడు: “పరలోకం నుండి వచ్చే తెలివి మొట్టమొదట స్వచ్ఛమైనది, తర్వాత శాంతికరమైనది, పట్టుబట్టే స్వభావం లేనిది, లోబడడానికి సిద్ధంగా ఉండేది, కరుణతో, మంచి ఫలాలతో నిండివున్నది, పక్షపాతం గానీ వేషధారణ గానీ లేనిది.” (యాకోబు 3:17) వీటిలో ఒక్కో విషయాన్ని పరిశీలిద్దాం. అవి పరిశీలిస్తున్నప్పుడు, ‘పరలోకం నుండి వచ్చే తెలివి నా జీవితంలో పనిచేస్తుందా?’ అని మీరు ప్రశ్నించుకోవచ్చు.

“స్వచ్ఛమైనది, తర్వాత శాంతికరమైనది”

9. స్వచ్ఛంగా ఉండడం అంటే ఏంటి? తెలివి గురించి మాట్లాడుతున్నప్పుడు, అది మొట్టమొదట స్వచ్ఛమైనది అని చెప్పడం ఎందుకు సరైనది?

9 “మొట్టమొదట స్వచ్ఛమైనది.” స్వచ్ఛంగా ఉండడం అంటే మన పనుల్లోనే కాదు, మన ఆలోచనల్లో, ఫీలింగ్స్‌లో కూడా పవిత్రంగా ఉండడం అని అర్థం. బైబిలు తెలివిని హృదయంతో ముడిపెడుతుంది. ఒకవేళ హృదయం తప్పుడు ఆలోచనలతో, కోరికలతో, ఉద్దేశాలతో మురికిగా ఉంటే, అలాంటి హృదయంలోకి దేవుని తెలివి ఎలా వస్తుంది చెప్పండి. (సామెతలు 2:10; మత్తయి 15:19, 20) కానీ, అపరిపూర్ణ మనుషులుగా మనకు ఎంతవరకు వీలైతే అంతవరకు హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకుంటే, మనం ‘చెడు చేయడం మానేసి, మంచి చేస్తాం.’ (కీర్తన 37:27; సామెతలు 3:7) పరలోకం నుండి వచ్చే తెలివి గురించి మాట్లాడుతున్నప్పుడు, మొట్టమొదట స్వచ్ఛత గురించి మాట్లాడడం సరైనదే. ఎందుకంటే మనం నైతికంగా, ఆధ్యాత్మికంగా స్వచ్ఛంగా లేకపోతే ఆ తెలివికి సంబంధించిన మిగతా లక్షణాల్ని సరిగ్గా చూపించలేం.

10, 11. (ఎ) మనం ఎందుకు శాంతిగా ఉండాలి? (బి) మీరు తోటి బ్రదర్‌నో, సిస్టర్‌నో బాధపెట్టారని తెలిస్తే మీరు ఎలా సమాధానపడవచ్చు? (అధస్సూచి కూడా చూడండి.)

10 “తర్వాత శాంతికరమైనది.” పరలోకం నుండి వచ్చే తెలివి, మనం శాంతి కోసం కృషిచేసేలా కదిలిస్తుంది. శాంతి అనేది దేవుని పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్లో ఒకటి. (గలతీయులు 5:22) దేవుని ప్రజల మధ్య ఉన్న “ఐక్యతను” పాడుచేయకుండా ఉండడానికి మనం కృషిచేస్తాం. (ఎఫెసీయులు 4:3) అలాగే మనస్పర్థలు లేదా గొడవలు వచ్చినప్పుడు, శాంతిని తిరిగి తీసుకురావడానికి చేయగలిగినదంతా చేస్తాం. అలా ఎందుకు చేయాలి? బైబిలు ఇలా చెప్తుంది: “శాంతిగా జీవిస్తూ ఉండండి; అప్పుడు ప్రేమకు, శాంతికి మూలమైన దేవుడు మీకు తోడుంటాడు.” (2 కొరింథీయులు 13:11) కాబట్టి మనం శాంతిగా జీవించినంత కాలం, శాంతికి మూలమైన దేవుడు మనతో ఉంటాడు. మనం బ్రదర్స్‌సిస్టర్స్‌తో శాంతిగా ఉంటేనే యెహోవాతో మన స్నేహం బాగుంటుంది. ఇంతకీ మనం శాంతిని ఎలా కాపాడవచ్చు? ఒక ఉదాహరణ చూద్దాం.

11 మీరు ఒక బ్రదర్‌నో, సిస్టర్‌నో బాధపెట్టారని తెలిస్తే ఏం చేయాలి? యేసు ఇలా చెప్పాడు: “నువ్వు బలిపీఠం దగ్గరికి నీ అర్పణను తెస్తున్నప్పుడు, నీ సహోదరుడు నీ వల్ల నొచ్చుకున్నాడని అక్కడ నీకు గుర్తొస్తే, బలిపీఠం ఎదుటే నీ అర్పణను విడిచిపెట్టి వెళ్లి ముందు నీ సహోదరునితో సమాధానపడు; తర్వాత తిరిగొచ్చి నీ అర్పణను అర్పించు.” (మత్తయి 5:23, 24) మీ సహోదరుని దగ్గరికి వెళ్లడానికి మీరే ముందడుగు వేయడం ద్వారా ఆ సలహాను పాటించవచ్చు. అయితే మీరు ఏ ఉద్దేశంతో వెళ్లాలి? ఆయనతో ‘సమాధానపడడమే’ మీ ఉద్దేశం.b అలా సమాధానపడాలంటే, ఆయనే అనవసరంగా నొచ్చుకున్నాడు అనుకోకుండా, మీ వల్ల ఆయన బాధపడ్డాడని మీరు ఒప్పుకోవాల్సి రావచ్చు. మీరు ఆయన దగ్గరికి వెళ్లేముందు, అలాగే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మీ ఉద్దేశాన్ని మనసులో ఉంచుకుంటే బహుశా అపార్థాలు తీసేసుకుంటారు, అవసరమైతే సారీ చెప్పుకుంటారు, ఒకరినొకరు క్షమించుకుంటారు. అలా మీరు శాంతి కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి కృషిచేసినప్పుడు, మీకు దేవుని తెలివి ఉందని చూపిస్తారు.

“పట్టుబట్టే స్వభావం లేనిది, లోబడడానికి సిద్ధంగా ఉండేది”

12, 13. (ఎ) యాకోబు 3:17 లో “పట్టుబట్టే స్వభావం లేనిది” అనే మాటకు అర్థమేంటి? (బి) మనం పట్టుబట్టేవాళ్లం కాదని ఎలా చూపించవచ్చు?

12 “పట్టుబట్టే స్వభావం లేనిది.” దాని అర్థమేంటి? పండితులు చెప్తున్నట్టు, యాకోబు 3:17 లో “పట్టుబట్టే స్వభావం లేనిది” అనే మాట కోసం ఉపయోగించిన గ్రీకు పదాన్ని అనువదించడం కష్టం. ఆ మాటకు, అవసరమైతే ఒక మెట్టు దిగిరావడం అనే అర్థం ఉంది. అనువాదకులు దాన్ని “మృదువుగా ఉండడం,” “ఓర్చుకోవడం,” “వేరేవాళ్ల ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోవడం” అని చాలా రకాలుగా అనువదించారు. పరలోకం నుండి వచ్చే తెలివిలోని ఈ లక్షణాన్ని మన జీవితంలో ఎలా చూపించవచ్చు?

13 “మీరు పట్టుబట్టే ప్రజలు కాదని అందరికీ తెలియనివ్వండి” అని ఫిలిప్పీయులు 4:5 చెప్తుంది. వేరే అనువాదంలో ఆ లేఖనం ఇలా ఉంది: “మీరు పట్టుబట్టే ప్రజలు కాదు అనే పేరు తెచ్చుకోండి.” (జె. బి. ఫిలిప్స్‌ రాసిన ద న్యూ టెస్ట్‌మెంట్‌ ఇన్‌ మోడర్న్‌ ఇంగ్లీష్‌) గమనించండి, ఇక్కడ ప్రశ్న మన గురించి మనం ఏమనుకుంటున్నాం అని కాదు, ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు, మనకు ఎలాంటి పేరు ఉంది అని. పట్టుబట్టే స్వభావం లేని వ్యక్తి రూల్స్‌ పట్టుకుని వేలాడడు, తన మాటే నెగ్గాలని అనుకోడు. బదులుగా ఆయన వేరేవాళ్లు చెప్పేది వినడానికి, అవసరమైతే వాళ్ల ఇష్టాలకు తగ్గట్టు ఒక మెట్టు దిగిరావడానికి కూడా ఇష్టపడతాడు. అంతేకాదు ఆయన క్రూరంగా, కఠినంగా కాదుగానీ వేరేవాళ్లతో మృదువుగా ఉంటాడు. క్రైస్తవులందరికీ ఈ లక్షణం ఉండాలి, మరిముఖ్యంగా పెద్దలకు ఉండాలి. ఎందుకంటే వాళ్లు మృదువుగా ఉంటేనే, అందరూ వాళ్ల దగ్గరికి ఈజీగా రాగలుగుతారు. (1 థెస్సలొనీకయులు 2:7, 8) అయితే, మనందరం ఈ ప్రశ్న వేసుకోవడం మంచిది: ‘నేను వేరేవాళ్లను పట్టించుకుంటూ, అవసరమైతే ఒక మెట్టు దిగిరావడానికి ఇష్టపడుతూ, మృదువుగా ఉంటాను అనే పేరు నాకు ఉందా?’

14. మనం “లోబడడానికి సిద్ధంగా” ఉంటామని ఎలా చూపించవచ్చు?

14 “లోబడడానికి సిద్ధంగా ఉండేది.” ఇక్కడ ఉపయోగించిన గ్రీకు పదం, క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ఇక్కడ తప్ప మరెక్కడా కనిపించదు. “ఆదేశాలకు ఇష్టంగా లోబడే సైనికుల గురించి చెప్పడానికి ఈ పదాన్ని ఎక్కువగా వాడతారు” అని ఒక పండితుడు అంటున్నాడు. అందులో “తేలిగ్గా వంగడం,” “లొంగడం” అనే అర్థం ఉంది. పరలోకం నుండి వచ్చే తెలివి ప్రకారం నడుచుకునే వ్యక్తి, బైబిలు చెప్పేదానికి వెంటనే లోబడతాడు. ఆయన మనసులో ఒకటి అనేసుకుని, ఇక దాన్నే పట్టుకుని వేలాడే మొండివ్యక్తి కాదు. బదులుగా ఆయన అనుకున్నది గానీ, ఆయన తీసుకున్న నిర్ణయం గానీ తప్పని బైబిలు నుండి స్పష్టంగా చూపించినప్పుడు, ఆయన వెంటనే మార్చుకుంటాడు. మీకు అలాంటి పేరే ఉందా?

“కరుణతో, మంచి ఫలాలతో నిండివున్నది”

15. కరుణ అంటే ఏంటి? యాకోబు 3:17 లో ‘కరుణను,’ ‘మంచి ఫలాల్ని’ కలిపి చెప్పడం ఎందుకు సరైనది?

15 “కరుణతో, మంచి ఫలాలతో నిండివున్నది.”c పరలోకం నుండి వచ్చే తెలివిలో కరుణ చాలా ముఖ్యమైన భాగం. ఎందుకంటే ఆ తెలివి “కరుణతో నిండివున్నది” అని బైబిలు చెప్తుంది. బైబిలు ‘కరుణను,’ ‘మంచి ఫలాల్ని’ కలిపి చెప్పడం గమనించారా? అది సరైనదే. ఎందుకంటే, బైబిల్లో కరుణ అనేది తరచూ అవతలివాళ్ల మీద చూపించే నిజమైన శ్రద్ధను, జాలిని సూచిస్తుంది. ఆ జాలి, మంచి పనులు అనే ఫలాల్ని పుష్కలంగా పండిస్తుంది. ఒక రెఫరెన్సు పుస్తకం ఏం చెప్తుందంటే, “కరుణ అంటే ఎవరైనా బాధలో ఉంటే అయ్యో పాపం అని జాలిపడి, వాళ్లకు ఏదోక విధంగా సహాయం చేయడానికి ప్రయత్నించడం.” కాబట్టి, పరలోకం నుండి వచ్చే తెలివి ఉన్న వ్యక్తి ఊరికే వాస్తవాలు, సమాచారం తెలుసుకోవడం మీద ఆసక్తి చూపించడు గానీ, ప్రజల మీద ఆసక్తి చూపిస్తాడు, వాళ్లను పట్టించుకుంటూ దయతో సహాయం చేస్తాడు. మనం కరుణతో నిండి ఉన్నామని ఎలా చూపించవచ్చు?

16, 17. (ఎ) మనం దేవుని మీదున్న ప్రేమతోనే కాకుండా, ఇంకా దేనివల్ల ప్రకటనా పని చేస్తాం? ఎందుకు? (బి) మనం కరుణతో నిండి ఉన్నామని ఏయే విధాలుగా చూపించవచ్చు?

16 దానికి ఒక ముఖ్యమైన మార్గం, దేవుని రాజ్యం గురించి ప్రకటించడమే. మనం ఆ పని ఎందుకు చేస్తాం? ముఖ్యంగా, దేవుని మీద ప్రేమతోనే చేస్తాం. కాకపోతే, ప్రజల మీద కరుణ లేదా కనికరం వల్ల కూడా మనం ప్రకటనా పని చేస్తాం. (మత్తయి 22:37-39) ఈ రోజుల్లో చాలామంది “కాపరిలేని గొర్రెల్లా చర్మం ఒలిచేయబడి, వదిలేయబడ్డారు.” (మత్తయి 9:36, అధస్సూచి) అబద్ధమత కాపరులు వాళ్లను నిర్లక్ష్యం చేసి, ఆధ్యాత్మికంగా గుడ్డివాళ్లను చేశారు. దానివల్ల ప్రజలు బైబిల్లో ఉన్న తెలివైన సలహాల్ని, త్వరలోనే దేవుని రాజ్యం భూమ్మీదికి తీసుకొచ్చే ఆశీర్వాదాల్ని చూడలేకపోతున్నారు. వాళ్లు ఆధ్యాత్మికంగా ఎంత దీనస్థితిలో ఉన్నారో ఆలోచించినప్పుడు, మనకు వాళ్లమీద కనికరం పొంగుకొస్తుంది. అంతేకాదు, యెహోవా ప్రేమతో చేయబోయే వాటిని వాళ్లకు ఎలాగైనా చెప్పాలనిపిస్తుంది.

ఒక జంట, తమ పిల్లలు వృద్ధ సహోదరి కోసం ఆహారాన్ని, సహాయం చేయడానికి పనిముట్లను తీసుకొచ్చారు.

మనం కరుణ లేదా కనికరం చూపించినప్పుడు, “పరలోకం నుండి వచ్చే తెలివి” ఉందని చూపిస్తాం

17 మనం కరుణతో నిండి ఉన్నామని ఇంకా ఏయే విధాలుగా చూపించవచ్చు? యేసు చెప్పిన సమరయుడి కథను మళ్లీ ఒకసారి గుర్తుతెచ్చుకోండి. దొంగలు ఒకతన్ని దోచుకొని, కొట్టి, రోడ్డు పక్కన పడేశారు. అటుగా వచ్చిన సమరయుడు అతన్ని చూసి జాలిపడి, ‘కరుణతో’ అతని దెబ్బలకు కట్టుకట్టి, అతని బాగోగులు చూసుకున్నాడు. (లూకా 10:29-37) కరుణ చూపించడం అంటే జాలిపడి ఊరుకోవడం కాదుగానీ, వాళ్లకు అవసరమైన సహాయం చేయడం అని దీన్నిబట్టి అర్థమవ్వట్లేదా? బైబిలు ఇలా చెప్తుంది: “అందరికీ మంచి చేద్దాం, ముఖ్యంగా తోటి విశ్వాసులకు.” (గలతీయులు 6:10) మనం అదెలా చేయవచ్చో కొన్ని ఉదాహరణలు చూడండి. ఒక పెద్దవయసు బ్రదర్‌నో, సిస్టర్‌నో మనం మీటింగ్స్‌కి తీసుకెళ్లి తీసుకురావచ్చు. భర్త చనిపోయిన ఒక సిస్టర్‌కి, ఇంటిని రిపేరు చేయడంలో సహాయం చేయవచ్చు. (యాకోబు 1:27) నిరుత్సాహంలో ఉన్న ఒకరికి “మంచి మాట” చెప్పి, సంతోషాన్ని పంచవచ్చు. (సామెతలు 12:25) అలా మనం కరుణ చూపిస్తే, పరలోకం నుండి వచ్చే తెలివి మనలో పనిచేస్తుందని చూపిస్తాం.

“పక్షపాతం గానీ వేషధారణ గానీ లేనిది”

18. పరలోకం నుండి వచ్చే తెలివి ఉంటే, మన మనసులో నుండి ఏం తీసేసుకుంటాం? ఎందుకు?

18 “పక్షపాతం లేనిది.” దేవుని తెలివి దేశం, జాతి, రంగు, రూపం చూడదు. మనం అలాంటి తెలివితో నడుచుకున్నప్పుడు మన మనసులో ఏ మూల పక్షపాతం చూపించాలన్న ఆలోచన వచ్చినా, దాన్ని వేర్లతో సహా పీకేస్తాం. (యాకోబు 2:9) అంటే చదువు, డబ్బు, సంఘంలో బాధ్యతలు ఉన్నవాళ్లను ఒకలా, మిగతావాళ్లను ఒకలా చూడం. ఒకవేళ తక్కువవాళ్లలా అనిపించినా సరే, మన బ్రదర్స్‌సిస్టర్స్‌లో ఎవ్వర్నీ చిన్నచూపు చూడం. యెహోవా ప్రేమను పొందడానికే వాళ్లు అర్హులు అయినప్పుడు, ఖచ్చితంగా మన ప్రేమను పొందడానికి కూడా అర్హులే.

19, 20. (ఎ) “వేషధారి” అని అనువదించిన గ్రీకు పదం ఎక్కడినుండి వచ్చింది? (బి) “వేషధారణలేని సహోదర అనురాగాన్ని” మనం ఎలా చూపిస్తాం? అది ఎందుకు ప్రాముఖ్యం?

19 “వేషధారణ లేనిది.” వేషధారి అని అనువదించిన గ్రీకు పదానికి, “ఒక పాత్రలో నటించే నటుడు” అనే అర్థం ఉండవచ్చు. పాతకాలంలో గ్రీకు, రోమన్‌ నటులు పెద్దపెద్ద ముసుగులు వేసుకుని నటించేవాళ్లు. కాబట్టి “వేషధారి” అని అనువదించిన గ్రీకు పదానికి వేషం వేసుకుని, లేనిది ఉన్నట్టు చూపించడం అనే అర్థం ఉంది. మనకు దేవుని తెలివి ఉంటే, బ్రదర్స్‌సిస్టర్స్‌తో బయటికి ఎలా ఉంటున్నాం అనే కాదు, వాళ్ల గురించి మనసులో ఏం అనుకుంటున్నాం అనేది కూడా జాగ్రత్తగా చూసుకుంటాం.

20 ‘సత్యానికి లోబడడం వల్ల, వేషధారణలేని సహోదర అనురాగం’ మనలో ఉంటుందని అపొస్తలుడైన పేతురు అన్నాడు. (1 పేతురు 1:22) అవును, మన సహోదర అనురాగం పైపైన చూపించేదిగా ఉండకూడదు. అందుకే మనం అవతలివాళ్ల దగ్గర మంచి పేరు కొట్టేయాలని ముసుగులు వేసుకోం, ప్రేమ ఉన్నట్టు నటించం. మనం నిజంగా, మనస్ఫూర్తిగా వాళ్లను ప్రేమించాలి. అలా చేసినప్పుడు తోటి బ్రదర్స్‌సిస్టర్స్‌ మనల్ని నమ్ముతారు. ఎందుకంటే, మనం బయట ఎలా ఉన్నామో, లోపల కూడా నిజంగా అలాగే ఉన్నామని వాళ్లకు తెలుసు. అంత నిజాయితీగా ఉన్నప్పుడు సంఘంలో నిజమైన స్నేహాలు చిగురిస్తాయి, నమ్మకం అనే పువ్వులు పూస్తాయి.

“తెలివిని . . . భద్రంగా కాపాడుకో”

21, 22. (ఎ) సొలొమోను ఎందుకు తెలివిని భద్రంగా కాపాడుకోలేకపోయాడు? (బి) మనం ఎలా తెలివిని భద్రంగా కాపాడుకోవచ్చు? అలా చేయడం వల్ల ఏంటి లాభం?

21 తెలివి యెహోవా ఇచ్చిన బహుమానం, దాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలి. సొలొమోను ఇలా రాశాడు: “నా కుమారుడా . . . తెలివిని, ఆలోచనా సామర్థ్యాన్ని భద్రంగా కాపాడుకో.” (సామెతలు 3:21) బాధాకరంగా, ఆ మాటలు రాసిన సొలొమోనే అలా కాపాడుకోలేదు. ఆయన యెహోవాకు లోబడి ఉన్నంతకాలం తెలివైనవాడిగానే ఉన్నాడు. కానీ చివర్లో, ఆయన పెళ్లి చేసుకున్న చాలామంది విదేశీ భార్యలు ఆయన హృదయాన్ని యెహోవా ఆరాధన నుండి పక్కకు తిప్పేశారు. (1 రాజులు 11:1-8) సొలొమోనుకు జరిగినదాన్ని బట్టి, ఎంత జ్ఞానం ఉన్నా దాన్ని సరిగ్గా వాడకపోతే అది బూడిదలో పోసిన పన్నీరే అని అర్థమౌతుంది.

22 తెలివిని మనం ఎలా భద్రంగా కాపాడుకోవచ్చు? మనం రోజూ బైబిల్ని, “నమ్మకమైన, బుద్ధిగల దాసుడు” ఇచ్చే బైబిలు ప్రచురణల్ని చదవడం మాత్రమే కాదు, చదివినవాటిని పాటించడానికి కూడా కృషిచేయాలి. (మత్తయి 24:45) దేవుని తెలివిని మన జీవితంలో చూపించడానికి బోలెడు కారణాలు ఉన్నాయి. దానివల్ల ఇప్పుడు మన జీవితం బాగుంటుంది, అలాగే కొత్త లోకంలో దేవుడు ఇవ్వబోయే “వాస్తవమైన జీవితం మీద గట్టి పట్టు” సాధించగలుగుతాం. (1 తిమోతి 6:19) అన్నిటికన్నా ముఖ్యంగా, పరలోకం నుండి వచ్చే తెలివిని చూపించడానికి ప్రయత్నించడం వల్ల, తెలివి అంతటికీ మూలమైన యెహోవాకు ఇంకాఇంకా దగ్గరౌతాం.

a ఆ ఇద్దరు ఆడవాళ్లు వేశ్యలు అని 1 రాజులు 3:16 చెప్తుంది. యెహోవాసాక్షులు ప్రచురించిన ఇన్‌సైట్‌ ఆన్‌ ద స్క్రిప్చర్స్‌ పుస్తకం ఇలా చెప్తుంది: “పెళ్లి కాకుండానే బిడ్డను కనడం వల్ల బైబిలు ఆ ఇద్దరు స్త్రీలను వేశ్యలు అంటుండవచ్చు. అంతేగానీ వాళ్లు వృత్తిపరంగా వేశ్యలు అయ్యుండకపోవచ్చు. వాళ్లు యూదా స్త్రీలు గానీ, చాలామట్టుకు విదేశీ స్త్రీలు గానీ అయ్యుండవచ్చు.”

b “సమాధానపడు” అని అనువదించిన గ్రీకు పదానికి, “శత్రుత్వాన్ని స్నేహంగా మార్చుకోవడం, రాజీపడడం, మళ్లీ ఇదివరకటిలా కలిసిపోయి మామూలు అవ్వడం లేదా సఖ్యత కుదుర్చుకోవడం” అనే అర్థాలు ఉన్నాయి. కాబట్టి పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలి, కుదిరితే నొచ్చుకున్న వ్యక్తి హృదయంలో నుండి కోపాన్ని, బాధను తీసేయాలి అన్నదే మీ లక్ష్యమై ఉండాలి.—రోమీయులు 12:18.

c వేరే అనువాదం ఆ మాటల్ని “కనికరంతో, మంచి పనులతో నిండివున్నది” అని అనువదించింది.—ఛార్లెస్‌ బి. విలియమ్స్‌ అనువదించిన ఎ ట్రాన్స్‌లేషన్‌ ఇన్‌ ద లాంగ్వేజ్‌ ఆఫ్‌ ద పీపుల్‌.

ధ్యానించడానికి ప్రశ్నలు

  • ద్వితీయోపదేశకాండం 4:4-6 మనకు తెలివి ఉందని ఎలా చూపించవచ్చు?

  • కీర్తన 119:97-105 మనం బుద్ధిగా బైబిల్ని చదివి, చదివినవాటిని పాటిస్తే ఏంటి ప్రయోజనం?

  • సామెతలు 4:10-13, 20-27 మనకు దేవుని తెలివి ఎందుకు కావాలి?

  • యాకోబు 3:1-16 సంఘపెద్దలు తెలివిని, అర్థం చేసుకునే మనస్తత్వాన్ని ఎలా చూపించవచ్చు?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి