కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • cl అధ్యా. 29 పేజీలు 290-299
  • ‘క్రీస్తు ప్రేమను తెలుసుకోండి’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘క్రీస్తు ప్రేమను తెలుసుకోండి’
  • యెహోవాకు దగ్గరవ్వండి
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “ఇంతకన్నా గొప్ప ప్రేమ లేదు”
  • “వాళ్ల మీద జాలిపడ్డాడు”
  • “తండ్రీ, వీళ్లను క్షమించు”
  • మీకు “క్రీస్తు ప్రేమ” తెలుసా?
  • చర్య తీసుకునేందుకు యేసులా మీరూ కదిలించబడ్డారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • యెహోవా—వాత్సల్యంతోకూడిన కనికరంగల మన తండ్రి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • “మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఆయన ప్రజల్ని ప్రేమించాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
మరిన్ని
యెహోవాకు దగ్గరవ్వండి
cl అధ్యా. 29 పేజీలు 290-299
యేసు ఒక వ్యక్తి మీద కనికరం చూపిస్తున్నాడు.

అధ్యాయం 29

‘క్రీస్తు ప్రేమను తెలుసుకోండి’

1-3. (ఎ) యేసు దేనివల్ల తన తండ్రిలా ఉండాలనుకున్నాడు? (బి) యేసు ప్రేమలోని ఏ మూడు కోణాల గురించి ఇప్పుడు చూస్తాం?

అచ్చం వాళ్ల నాన్నలాగే ఉండడానికి ప్రయత్నిస్తున్న పిల్లాడిని మీరు ఎప్పుడైనా చూశారా? ఆ పిల్లాడు అచ్చం వాళ్ల నాన్నలాగే నడుస్తూ, మాట్లాడుతూ, లేదా పనులు చేస్తూ ఉంటాడు. పోనుపోను ఆ పిల్లాడికి వాళ్ల నాన్నకున్న విలువలు, నమ్మకాలు ఒంటపడతాయి. అవును, వాళ్ల నాన్న మీద ఉన్న ప్రేమ, అభిమానం వల్ల అతను అచ్చం వాళ్ల నాన్నలాగే ఉండాలనుకుంటాడు.

2 ఇంతకీ యేసుకు, తన పరలోక తండ్రికి మధ్య అనుబంధం ఎలా ఉంటుంది? ఒక సందర్భంలో, “నేను తండ్రిని ప్రేమిస్తున్నానని” యేసు అన్నాడు. (యోహాను 14:31) అవును, యేసు యెహోవాను ప్రేమించినంతగా ఎవ్వరూ ప్రేమించలేరు. ఈ సృష్టిలో ఏ ప్రాణి కన్నా చాలాకాలం ముందు నుంచే యేసు తన తండ్రితో ఉన్నాడు. కాబట్టి, వాళ్ల అనుబంధం ఈనాటిది కాదు. ఆ ప్రేమ వల్లే ఆయన అచ్చం యెహోవాలా ఉండాలనుకుంటున్నాడు.—యోహాను 14:9.

3 ఈ పుస్తకంలోని ముందటి అధ్యాయాల్లో, యెహోవాకున్న శక్తిని, న్యాయాన్ని, తెలివిని యేసు ఎలా పూర్తిస్థాయిలో చూపించాడో చూశాం. మరి, యేసు తన తండ్రికున్న ప్రేమను ఎలా చూపించాడు? యేసు ప్రేమలో ఉన్న మూడు కోణాల్ని ఇప్పుడు చూద్దాం. అవి ఏంటంటే, ఆయన స్వయంత్యాగ స్ఫూర్తి, గొప్ప కనికరం, క్షమించడానికి సిద్ధంగా ఉండే మనసు.

“ఇంతకన్నా గొప్ప ప్రేమ లేదు”

4. ఏ మనిషీ చూపించలేనంతగా, యేసు స్వయం త్యాగపూరిత ప్రేమను ఎలా చూపించాడు?

4 స్వయం త్యాగపూరిత ప్రేమను చూపించడంలో, యేసు ఒక గొప్ప ఆదర్శం ఉంచాడు. స్వయంత్యాగం అంటే స్వార్థం లేకుండా వేరేవాళ్ల అవసరాల్ని, ఇష్టాల్ని మనకన్నా ముందు ఉంచడం. యేసు ఈ ప్రేమను ఎలా చూపించాడు? స్వయంగా ఆయనే ఇలా అన్నాడు: “స్నేహితుల కోసం ప్రాణం పెట్టడం కన్నా గొప్ప ప్రేమ లేదు.” (యోహాను 15:13) యేసు తన పరిపూర్ణ ప్రాణాన్ని మనకోసం ఇష్టంగా ఇచ్చాడు. ఇంతకన్నా గొప్ప ప్రేమ ఏ మనిషీ చూపించలేడు. అయితే, ఈ స్వయం త్యాగపూరిత ప్రేమను యేసు ఇంకా వేరే విధాలుగా కూడా చూపించాడు.

5. దేవుని ఒక్కగానొక్క కుమారుడు పరలోకాన్ని వదిలి రావడంలో, ఆయన స్వయం త్యాగపూరిత ప్రేమ ఎలా కనిపిస్తుంది?

5 ఈ భూమ్మీదికి రాకముందు, దేవుని ఒక్కగానొక్క కుమారుడికి పరలోకంలో గొప్ప స్థానం ఉండేది. ఆయనకు యెహోవాతో, చాలామంది దేవదూతలతో దగ్గరి సంబంధం ఉండేది. అంత మంచి జీవితం ఉన్నా, ఈ ప్రియ కుమారుడు “అన్నీ వదులుకుని, దాసునిలా మారి, మనిషిలా అయ్యాడు.” (ఫిలిప్పీయులు 2:7) “దుష్టుని గుప్పిట్లో” ఉన్న ఈ లోకంలో, పాపులైన మనుషుల మధ్య జీవించడానికి ఆయన ఇష్టంగా ముందుకొచ్చాడు. (1 యోహాను 5:19) ఇందులో దేవుని కుమారుడికి ఉన్న స్వయం త్యాగపూరిత ప్రేమ మీకు కనిపించట్లేదా?

6, 7. (ఎ) భూమ్మీద పరిచర్య చేస్తున్నప్పుడు, యేసు స్వయం త్యాగపూరిత ప్రేమను ఏయే విధాలుగా చూపించాడు? (బి) నిస్వార్థమైన ప్రేమకు సంబంధించి, మనసును తాకే ఏ ఉదాహరణ యోహాను 19:25-27 లో ఉంది?

6 భూమ్మీద పరిచర్య చేసిన కాలమంతా, యేసు వేర్వేరు విధాలుగా స్వయం త్యాగపూరిత ప్రేమను చూపించాడు. ఆయనలో ఏ కోశానా స్వార్థం లేదు. ఆయన పరిచర్యలో ఎంతగా మునిగిపోయాడంటే, ఒక సగటు మనిషికి ఉండాల్సిన కనీస సౌకర్యాల్ని కూడా ఆయన త్యాగం చేశాడు. “నక్కలకు బొరియలు, ఆకాశపక్షులకు గూళ్లు ఉన్నాయి. కానీ మానవ కుమారుడు తల వాల్చడానికి ఎక్కడా స్థలం లేదు” అని ఆయన అన్నాడు. (మత్తయి 8:20) ఒక నైపుణ్యంగల వడ్రంగిగా యేసు కావాలనుకుంటే పరిచర్యను కాసేపు ఆపి, తన కోసం సౌకర్యవంతమైన ఇల్లు కట్టుకోవచ్చు. లేదంటే కుర్చీలు, బల్లలు లాంటి మంచిమంచి వస్తువులు చేసి ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. కానీ, ఆయన తనకున్న నైపుణ్యాల్ని ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవడానికి వాడుకోలేదు.

7 యేసు స్వయం త్యాగపూరిత ప్రేమ చూపించిన ఒక ఉదాహరణ, యోహాను 19:25-27 లో ఉంది. యేసు చనిపోయే రోజు మధ్యాహ్నం, ఆయన మదిలో ఎన్ని ఆలోచనలు తిరిగి ఉంటాయో ఒకసారి ఊహించండి. ఆయన కొయ్య మీద బాధపడుతూ కూడా తన శిష్యుల గురించి, ప్రకటనా పని గురించి, మరిముఖ్యంగా తన యథార్థత గురించి, తండ్రి పేరును ఘనపర్చడం గురించి ఆలోచించాడు. నిజానికి, భూమ్మీద ఉన్న మనుషులందరి భవిష్యత్తు ఆయన భుజాల మీద ఉంది! అంత ఒత్తిడిలో కూడా, యేసు చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు తన తల్లి మరియ మీద శ్రద్ధ చూపించాడు. బహుశా అప్పటికే ఆమె విధవరాలు అయ్యుంటుంది. యేసు, అపొస్తలుడైన యోహానుతో మరియను తన సొంత తల్లిలా చూసుకోమని చెప్పాడు. తర్వాత యోహాను ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. అలా యేసు తన తల్లి భౌతిక, ఆధ్యాత్మిక అవసరాలు తీర్చడానికి ఒక ఏర్పాటు చేశాడు. యేసు నిస్వార్థమైన ప్రేమను ఎంత అద్భుతంగా చూపించాడో కదా!

“వాళ్ల మీద జాలిపడ్డాడు”

8. యేసుకున్న కనికరం గురించి చెప్పడానికి బైబిలు ఉపయోగించిన గ్రీకు పదానికి అర్థం ఏంటి?

8 తన తండ్రిలాగే, యేసుకు కూడా కనికరం ఉంది. ఎవరైనా బాధపడుతుంటే యేసు కరిగిపోయి, వాళ్లకు ఏదోక విధంగా సహాయం చేయడానికి చూసేవాడని బైబిలు చెప్తుంది. యేసుకున్న కనికరం గురించి చెప్పడానికి బైబిలు ఉపయోగించిన గ్రీకు పదాన్ని, “జాలిపడ్డాడు” అని అనువదించారు. ఒక పండితుడు ఆ పదం గురించి ఇలా అంటున్నాడు: “ఇది . . . ఒక మనిషిని లోలోతుల్లో నుంచి కదిలించే ఒక బలమైన ఫీలింగ్‌. కనికరం గురించి చెప్పడానికి మొత్తం గ్రీకులోనే ఇంతకన్నా శక్తివంతమైన పదం లేదు.” యేసు కనికరంతో కరిగిపోయి వేరేవాళ్లకు సహాయం చేసిన కొన్ని సందర్భాల్ని ఇప్పుడు చూద్దాం.

9, 10. (ఎ) యేసు, ఆయన అపొస్తలులు ఎందుకు ఏకాంత ప్రదేశానికి వెళ్లాలనుకున్నారు? (బి) ఒకపెద్ద గుంపు తన ఏకాంతాన్ని పాడుచేసినప్పుడు, యేసు ఏం చేశాడు? ఎందుకు?

9 కరిగిపోయి, ప్రజలకు దేవుని విషయాలు చెప్పాడు. జాలిపడేలా యేసును ఏది ముఖ్యంగా కదిలించిందో మార్కు 6:30-34 లో చూస్తాం. దీన్ని ఊహించుకోండి. అపొస్తలులు వేర్వేరు ఊళ్లకు వెళ్లి ప్రకటించి, చాలా సంతోషంగా తిరిగొచ్చారు. వాళ్లు యేసు దగ్గరికి వచ్చి వాళ్లు చూసిన వాటి గురించి, విన్న వాటన్నిటి గురించి సంతోషంగా చెప్తున్నారు. కానీ, చాలామంది ప్రజలు రావడంతో యేసుకు, ఆయన అపొస్తలులకు కనీసం తినడానికి కూడా తీరిక లేదు. అన్నిటినీ గమనించే యేసు, అపొస్తలులు అలసిపోయారని గుర్తించాడు. “రండి, మనం ఏకాంత ప్రదేశానికి వెళ్దాం, మీరు కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు” అన్నాడు. వాళ్లు పడవ ఎక్కి గలిలయ సముద్రపు ఉత్తర కొన మీదుగా ఒక ప్రశాంతమైన చోటుకు వెళ్లారు. అయితే ఆ ప్రజలు వీళ్లు వెళ్లడం చూశారు. ఇంకొంతమందేమో దాని గురించి విన్నారు. దాంతో వాళ్లు ఉత్తర తీరం వెంబడి పరిగెత్తుకుంటూ వెళ్లి, యేసు అలాగే ఆయన అపొస్తలుల కన్నా ముందే అక్కడికి చేరుకున్నారు!

10 వీళ్లు అసలు వదిలిపెట్టరు ఏంటి అని యేసు ఏమైనా చికాకుపడ్డాడా? లేదు! అన్ని వేలమంది ప్రజలు తన కోసం ఎదురుచూస్తుంటే, యేసు గుండె కరిగిపోయింది. మార్కు ఇలా రాశాడు: “యేసు . . . అక్కడ చాలామంది ప్రజలు ఉండడం చూశాడు, వాళ్లు కాపరిలేని గొర్రెల్లా ఉండడంతో వాళ్లమీద జాలిపడ్డాడు. అప్పుడు ఆయన వాళ్లకు చాలా విషయాలు బోధించడం మొదలుపెట్టాడు.” వాళ్లలో ప్రతీ ఒక్కరికీ దేవుని విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని యేసు గమనించాడు. వాళ్లను నడిపించడానికి, కాపాడడానికి కాపరి లేక చెల్లాచెదురైన గొర్రెల్లా ఉన్నారు. చేరదీయాల్సిన మతనాయకులే వాళ్లను చీదరించుకుంటుంటే, వాళ్లు ఎంత నలిగిపోతున్నారో యేసుకు తెలుసు. (యోహాను 7:47-49) వాళ్లను చూసి ఆయన గుండె తట్టుకోలేకపోయింది, అందుకే వాళ్లకు “దేవుని రాజ్యం గురించి” బోధించడం మొదలుపెట్టాడు. (లూకా 9:11) గమనించారా? వాళ్లు వింటారో లేదో తెలియకముందే, ఆయన వాళ్ల మీద జాలిపడ్డాడు. మరో మాటలో చెప్పాలంటే, వాళ్లు తను చెప్పింది విన్న తర్వాత యేసు కనికరం చూపించలేదు గానీ, ఆయనకు కనికరం ఉంది కాబట్టే వాళ్లకు బోధించడం మొదలుపెట్టాడు.

యేసు కనికరం చూపిస్తూ, ఒక కుష్ఠురోగిని ముట్టుకుంటున్నాడు. చుట్టూ ఉన్నవాళ్లు ఆ కుష్ఠురోగిని చూసి అసహ్యించుకుంటున్నారు.

‘ఆయన చెయ్యి చాపి అతన్ని ముట్టుకున్నాడు’

11, 12. (ఎ) బైబిలు కాలాల్లో, కుష్ఠురోగుల్ని ఎలా చూసేవాళ్లు? కానీ “ఒంటి నిండా కుష్ఠు” ఉన్న ఒక వ్యక్తి తన దగ్గరికి వచ్చినప్పుడు యేసు ఏం చేశాడు? (బి) యేసు ముట్టుకున్నప్పుడు ఆ కుష్ఠురోగికి ఎలా అనిపించి ఉంటుంది? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక డాక్టర్‌ అనుభవం మనకు ఎలా సహాయం చేస్తుంది?

11 కరిగిపోయి, బాధపడుతున్న వాళ్లకు సహాయం చేశాడు. రకరకాల జబ్బులు ఉన్న ప్రజలు, యేసుకు కనికరం ఉందని గ్రహించి ఆయన దగ్గరికి వచ్చేవాళ్లు. ఒక సందర్భంలో యేసు వెనక చాలామంది నడుస్తున్నారు, అప్పుడు “ఒంటి నిండా కుష్ఠు ఉన్న ఒక వ్యక్తి” ఆయన దగ్గరికి వచ్చాడు. (లూకా 5:12) బైబిలు కాలాల్లో, ఆ వ్యాధి అందరికీ సోకకుండా కుష్ఠురోగుల్ని వేరుగా ఉంచేవాళ్లు. (సంఖ్యాకాండం 5:1-4) కానీ కాలం గడుస్తుండగా, మతనాయకులు సొంతగా కఠినమైన నియమాలు పెట్టి వాళ్లను ఇంకా బాధపెట్టారు.a కానీ యేసు ఏం చేశాడో చూడండి: “అక్కడ ఆయన దగ్గరికి ఒక కుష్ఠురోగి కూడా వచ్చాడు. అతను మోకాళ్లూని, ‘నీకు ఇష్టమైతే, నన్ను శుద్ధుడిగా చేయగలవు’ అని ఆయన్ని వేడుకున్నాడు. ఆయన జాలిపడి చెయ్యి చాపి అతన్ని ముట్టుకుని, ‘నాకు ఇష్టమే! శుద్ధుడివి అవ్వు’ అన్నాడు. వెంటనే అతని కుష్ఠురోగం పోయి, అతను శుద్ధుడయ్యాడు.” (మార్కు 1:40-42) ఆ కుష్ఠురోగి అక్కడ ఉండడం ధర్మశాస్త్రం ప్రకారం తప్పని యేసుకు తెలుసు. అయినా యేసు అతన్ని పంపించేసే బదులు, ఎంతో కనికరంతో ఎవ్వరూ ఊహించనిది ఒకటి చేశాడు. అదేంటంటే, యేసు అతన్ని ముట్టుకున్నాడు!

12 యేసు ముట్టుకున్నప్పుడు, ఆ కుష్ఠురోగికి ఎలా అనిపించి ఉంటుందో మీకు తెలుసా? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ గమనించండి. కుష్ఠువ్యాధుల డాక్టర్‌ అయిన పాల్‌ బ్రాండ్‌, ఇండియాలో తను ట్రీట్‌మెంట్‌ ఇచ్చిన ఒక కుష్ఠురోగి గురించి చెప్పాడు. అతనికి పరీక్ష చేస్తున్నప్పుడు, ఆ డాక్టర్‌ కుష్ఠురోగి భుజం మీద చెయ్యి వేసి, ఒక అనువాదకురాలి ద్వారా అతనికి ఏం ట్రీట్‌మెంట్‌ చేయబోతున్నాడో చెప్పాడు. ఉన్నట్టుండి ఆ కుష్ఠురోగికి ఏడ్పు తన్నుకొచ్చింది. వెంటనే డాక్టర్‌, “ఏమైంది? నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా అని అడిగాడు?” దాన్ని ఆ అనువాదకురాలు, ఆ అబ్బాయి భాషలోకి అడిగి డాక్టర్‌తో ఇలా అంది: “లేదు డాక్టర్‌. మీరు అతని భుజం మీద చెయ్యి వేశారు కదా అందుకే అతనికి ఏడ్పు వచ్చింది, ఇన్నేళ్లుగా అతన్ని ఎవ్వరూ ముట్టుకోలేదంట.” అయితే, యేసు ముట్టుకున్న కుష్ఠురోగి మాత్రం ఇంకా ఎక్కువ సంతోషించాడు, ఇంకా ఎక్కువ ప్రయోజనాలు పొందాడు. ఎందుకంటే యేసు ఒక్కసారి ముట్టుకోగానే, ఇంతకాలం తనను అంటరాని వాడిగా చేసిన రోగం వదిలిపోయింది!

13, 14. (ఎ) యేసు నాయీను నగరానికి వస్తున్నప్పుడు ఏం చూశాడు? ఆ పరిస్థితిని చూస్తే ఎందుకు కడుపు తరుక్కుపోతుంది? (బి) నాయీనులో ఉన్న విధవరాలి కోసం, యేసు కనికరంతో కరిగిపోయి ఏం చేశాడు?

13 కరిగిపోయి, దుఃఖంలో ఉన్నవాళ్లకు సహాయం చేశాడు. తమకు ఇష్టమైనవాళ్లను పోగొట్టుకుని ఎవరైనా ఏడుస్తుంటే, యేసు ప్రాణం ఉసూరుమనేది. ఉదాహరణకు, లూకా 7:11-15 లో ఉన్న సందర్భాన్ని గమనించండి. అది యేసు పరిచర్య మొదలుపెట్టిన దాదాపు ఒక సంవత్సరం తొమ్మిది నెలలకు జరిగింది. ఆయన గలిలయలోని, నాయీను అనే నగరం పొలిమేర్లకు వచ్చాడు. ఆయన నగర ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఊరేగింపును చూశాడు. చనిపోయిన వ్యక్తిని కొంతమంది మోసుకెళ్తున్నారు. వాళ్ల పరిస్థితి చూస్తేనే కడుపు తరుక్కుపోతోంది. ఎందుకంటే చనిపోయింది ఒక యువకుడు, పైగా విధవరాలైన తన తల్లికి మిగిలిన ఒకేఒక్క కొడుకు. ఇలాంటి ఊరేగింపును ఆమె ఇంతకుముందు కూడా చూసింది. కాకపోతే అప్పుడు చనిపోయింది వాళ్ల భర్త, ఈసారి చనిపోయింది తన కొడుకు. బహుశా ఆమెకున్న ఒకేఒక్క తోడు కూడా సమాధిలోకి వెళ్లిపోతుంది. ఆమెతో పాటు ఒక పెద్ద గుంపు ఉంది. వాళ్లలో శోకగీతాలు పాడేవాళ్లు, ఏడ్పు రాగాలు వాయించే సంగీతకారులు ఉన్నారు. (యిర్మీయా 9:17, 18; మత్తయి 9:23) అయితే, యేసు చూపు మాత్రం కడుపుకోత అనుభవిస్తున్న ఆ తల్లి మీద పడింది. ఖచ్చితంగా, ఆమె తన కొడుకును మోస్తున్న పాడె పక్కనే నడుస్తూ ఉండి ఉంటుంది.

14 ఏడుస్తున్న తల్లిని చూసి యేసుకు ‘జాలేసింది.’ ఆయన దయగా, “ఏడ్వకు” అన్నాడు. తర్వాత, ఆయనంతట ఆయనే పాడె దగ్గరికి వచ్చి దాన్ని ముట్టుకున్నాడు. అప్పుడు పాడెను మోస్తున్నవాళ్లు, బహుశా ఆ గుంపులో ఉన్న మిగతావాళ్లు ఆగిపోయారు. ఆయన అధికారంగల వ్యక్తిలా చనిపోయిన అబ్బాయితో, “బాబూ, నేను నీతో చెప్తున్నాను, లే!” అన్నాడు. తర్వాత ఏమైంది? ఏదో గాఢనిద్రలో నుండి లేచినట్టు “చనిపోయిన వ్యక్తి లేచి కూర్చొని, మాట్లాడడం మొదలుపెట్టాడు”! ఇప్పుడు వస్తుంది, మన హృదయాన్ని హత్తుకునే సన్నివేశం: “యేసు అతన్ని వాళ్లమ్మకు అప్పగించాడు.”

15. (ఎ) కనికరానికి, పనులకు ఏ సంబంధం ఉందని బైబిలు ఉదాహరణలు చూపిస్తున్నాయి? (బి) ఈ విషయంలో మనం యేసులా ఎలా ఉండవచ్చు?

15 ఈ ఉదాహరణల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ప్రతీ సందర్భంలో కనికరానికి, పనులకు ఉన్న సంబంధాన్ని గమనించండి. యేసు బాధపడుతున్న వాళ్లను చూసినప్పుడు, జాలి పడకుండా ఉండలేకపోయాడు. అలాగే కనికరంతో సహాయం చేయకుండా ఉండలేకపోయాడు. మనం యేసులా ఎలా ఉండవచ్చు? క్రైస్తవులుగా మంచివార్త ప్రకటించాల్సిన, శిష్యుల్ని చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం అలా చేయడానికి ముఖ్యమైన కారణం, దేవుని మీద మనకున్న ప్రేమ. అయితే, ఇంకో కారణం కనికరం కూడా అని గుర్తుంచుకుందాం. మనం యేసులా ప్రజల మీద జాలి పడినప్పుడు, వాళ్లకు మంచివార్త ప్రకటించడానికి చేయగలిగినదంతా చేయాలనిపిస్తుంది. (మత్తయి 22:37-39) మరి, కష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న, లేదా గుండెకోత అనుభవిస్తున్న మన బ్రదర్స్‌సిస్టర్స్‌ మీద మనం ఎలా కనికరం చూపించవచ్చు? మనమైతే అద్భుతరీతిలో వాళ్ల అనారోగ్యాన్ని తీసేయలేం, లేదా చనిపోయినవాళ్లను లేపలేం. కానీ మనం చొరవ తీసుకుని వాళ్ల మీద మనకు ఎంత శ్రద్ధ ఉందో చెప్పినప్పుడు, లేదా అవసరమైన సహాయం చేసినప్పుడు మన కనికరాన్ని పనుల్లో చూపించవచ్చు.—ఎఫెసీయులు 4:32.

“తండ్రీ, వీళ్లను క్షమించు”

16. క్షమించడానికి సిద్ధంగా ఉంటానని, యేసు ఆఖరికి హింసాకొయ్య మీద ఉన్నప్పుడు కూడా ఎలా చూపించాడు?

16 యేసు ఇంకో విధంగా కూడా యెహోవా ప్రేమను పూర్తిస్థాయిలో చూపించాడు. అదేంటంటే, ఆయన “క్షమించడానికి సిద్ధంగా” ఉండేవాడు. (కీర్తన 86:5) ఆఖరికి హింసాకొయ్య మీద వేలాడుతున్నప్పుడు కూడా, ఆయన దాన్ని చేశాడు. ఆయన అవమానకరమైన మరణాన్ని అనుభవిస్తున్నాడు, ఆయన చేతులకు-కాళ్లకు మేకులు దిగగొట్టి ఉన్నాయి. అలాంటి సమయంలో యేసు, యెహోవాను దేని గురించి అడుగుతున్నాడు? ఆయన్ని హింసిస్తున్న వాళ్లను శిక్షించమని అడుగుతున్నాడా? లేదు. బదులుగా, యేసు చివరిగా ఈ మాటలు అన్నాడు: “తండ్రీ, వీళ్లను క్షమించు. వీళ్లు ఏంచేస్తున్నారో వీళ్లకు తెలీదు.”—లూకా 23:34.b

17-19. తాను ఎవరో తెలీదని మూడుసార్లు చెప్పిన పేతురును క్షమించానని యేసు ఏయే విధాలుగా చూపించాడు?

17 బహుశా, యేసు అపొస్తలుడైన పేతురును క్షమించిన సందర్భం, మన మనసుకు ఇంకా ఎక్కువ హత్తుకుంటుంది. పేతురుకు యేసు అంటే ప్రాణం, అందులో ఏ సందేహం లేదు. నీసాను 14న, యేసు చనిపోయే ముందు రోజు రాత్రి పేతురు ఇలా అన్నాడు: “ప్రభువా, నీతోపాటు చెరసాలకు వెళ్లడానికైనా, నీతో కలిసి చనిపోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను.” కానీ కొన్ని గంటల్లోనే, యేసు ఎవరో తనకు తెలీదని పేతురు మూడుసార్లు అన్నాడు! మూడోసారి అలా అన్న తర్వాత ఏం జరిగిందో బైబిలు మనకు చెప్తుంది: “అప్పుడు ప్రభువు పక్కకు తిరిగి సూటిగా పేతురు వైపు చూశాడు.” పాపం వల్ల బరువెక్కిన గుండెతో పేతురు “బయటికి వెళ్లిపోయి, కుమిలికుమిలి ఏడ్చాడు.” ఆ తర్వాత యేసు చనిపోయినప్పుడు, పేతురు మదిలో ఈ ప్రశ్న మెదిలి ఉంటుంది: ‘నా ప్రభువు నన్ను క్షమించాడా?’—లూకా 22:33, 61, 62.

18 ఆ ప్రశ్నకు జవాబు కోసం, పేతురు ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు. నీసాను 16 ఉదయం యేసు పునరుత్థానం అయ్యాడు, బహుశా అదే రోజు ఆయన ఒంటరిగా పేతురును కలిశాడు. (లూకా 24:34; 1 కొరింథీయులు 15:4-8) తాను ఎవరో తెలీదని అంత నిక్కచ్చిగా చెప్పిన పేతురును, యేసు ఎందుకు ప్రత్యేకంగా కలిశాడు? ఎందుకంటే, పశ్చాత్తాపపడిన పేతురును తాను ఇంకా ప్రేమిస్తున్నానని, తన దృష్టిలో అతను ఇంకా విలువైన వాడేనని యేసు భరోసా ఇవ్వాలనుకున్నాడు. పేతురును బలపర్చడానికి యేసు ఇంకొకటి కూడా చేశాడు.

19 కొన్ని రోజుల తర్వాత, యేసు గలిలయ సముద్రం దగ్గర శిష్యులకు కనిపించాడు. ఆ సందర్భంలో, యేసు (తను ఎవరో తెలీదని మూడుసార్లు చెప్పిన) పేతురును, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని మూడుసార్లు అడిగాడు. యేసు మూడోసారి అడిగినప్పుడు పేతురు, “ప్రభువా, నీకు అన్నీ తెలుసు; నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. నిజమే హృదయాలు చదివే యేసుకు, పేతురు తనను ఎంతో ప్రేమిస్తున్నాడని బాగా తెలుసు. అయినా, యేసు పేతురుకు తన ప్రేమను మూడుసార్లు చెప్పుకునే అవకాశాన్ని ఇచ్చాడు. అంతకుమించి తన ‘చిన్న గొర్రెల్ని మేపే, కాసే’ పని అప్పగించాడు. (యోహాను 21:15-17) అంతకుముందు యేసు, పేతురుకు ప్రకటించే బాధ్యత ఇచ్చాడు. (లూకా 5:10) కానీ, ఇప్పుడు యేసు తిరుగులేని నమ్మకాన్ని చూపిస్తూ, అతని భుజాల మీద ఇంకో బరువైన బాధ్యతను పెట్టాడు. అదేంటంటే, క్రీస్తు అనుచరుల్ని శ్రద్ధగా చూసుకోవడం. కొంతకాలానికి, యేసు పేతురుకు క్రైస్తవ సంఘంలో ఒక ముఖ్యమైన పాత్రను ఇచ్చాడు. (అపొస్తలుల కార్యాలు 2:1-41) యేసు తనను క్షమించాడని, తనను ఇంకా నమ్ముతున్నాడని తెలుసుకున్నప్పుడు పేతురు హాయిగా ఊపిరి పీల్చుకుని ఉంటాడు కదా!

మీకు “క్రీస్తు ప్రేమ” తెలుసా?

20, 21. మనం “క్రీస్తు ప్రేమను” పూర్తిగా తెలుసుకోవాలంటే ఏం చేయాలి?

20 క్రీస్తు ప్రేమ గురించి, దేవుని వాక్యమైన బైబిలు చాలా అద్భుతంగా వర్ణిస్తుంది. ఇంతకీ క్రీస్తు ప్రేమ మనల్ని ఏం చేసేలా కదిలించాలి? బైబిలు ఇలా చెప్తుంది: “జ్ఞానాన్ని మించిన క్రీస్తు ప్రేమను” తెలుసుకోండి. (ఎఫెసీయులు 3:19) మనం ముందే చూసినట్టు యేసు జీవితం, పరిచర్య గురించి ఉన్న సువార్త పుస్తకాలు ఆయన ప్రేమ గురించి మనకు చాలా విషయాలు చెప్తాయి. అయితే, మనం “క్రీస్తు ప్రేమను” పూర్తిగా తెలుసుకోవాలంటే, కేవలం బైబిల్లో ఉన్నవాటిని తెలుసుకుంటే సరిపోదు.

21 ‘తెలుసుకోవడం’ అనే పదానికి గ్రీకులో అర్థం ఏంటంటే, “స్వయంగా రుచి చూసి తెలుసుకోవడం.” మనం యేసులా ప్రేమ చూపించినప్పుడు, అంటే నిస్వార్థంగా మనకన్నా ఇతరుల్ని ముందు ఉంచినప్పుడు, కనికరంతో వేరేవాళ్ల అవసరాల్ని పట్టించుకున్నప్పుడు, మనసులో ఏం పెట్టుకోకుండా క్షమించినప్పుడు మనం ఆయన ఫీలింగ్స్‌ని ఇంకా బాగా అర్థం చేసుకుంటాం. అలా, మనం “జ్ఞానాన్ని మించిన క్రీస్తు ప్రేమను” అనుభవంతో తెలుసుకుంటాం. మనం యేసులా అయ్యేకొద్దీ, ఆయన ఎవరినైతే పూర్తిస్థాయిలో అనుకరించాడో, ఆ ప్రేమగల తండ్రైన యెహోవాకు ఇంకా దగ్గరౌతాం. ఆ విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు.

a రబ్బీల నియమాల ప్రకారం, ఒక కుష్ఠురోగి మనుషులకు దాదాపు ఆరు అడుగుల దూరంలో ఉండాలి. అదే గాలి వీస్తుంటే మాత్రం, కనీసం 150 అడుగుల దూరం ఉండాలి. ఒక రబ్బీ కుష్ఠురోగుల్ని చూసి దాక్కున్నాడు అని, ఇంకొక ఆయన వాళ్లను దూరంగా వెళ్లగొట్టడానికి వాళ్ల మీద రాళ్లు విసిరాడు అని, మిద్రాష్‌ రబ్బా పుస్తకం చెప్తుంది. కాబట్టి వేరేవాళ్లు చీదరించుకుంటే, అసహ్యించుకుంటే, దూరం పెడితే ఆ బాధ ఎలా ఉంటుందో కుష్ఠురోగులకు తెలుసు.

b లూకా 23:34 లోని మొదటి భాగాన్ని కొన్ని ప్రాచీన చేతిరాత ప్రతుల్లో నుండి తీసేశారు. అయితే, చాలా అధికారిక చేతిరాత ప్రతుల్లో ఆ మాటలు ఉన్నాయి. కాబట్టి కొత్త లోక అనువాదంలో, ఇంకా ఇతర అనువాదాల్లో ఆ మాటల్ని ఉంచారు. యేసు ఇక్కడ “వీళ్లు” అంటున్నప్పుడు, బహుశా ఆయన్ని హింసిస్తున్న రోమా సైనికుల్ని సూచిస్తుండవచ్చు. వాళ్లు ఏం చేస్తున్నారో వాళ్లకు తెలీదు, అసలు యేసు ఎవరో కూడా వాళ్లకు తెలీదు. అంతేకాదు, బహుశా తన మరణాన్ని కోరుకున్న యూదులు కూడా యేసు మనసులో ఉండి ఉండవచ్చు. అయితే, ఆ తర్వాత వాళ్లు ఆయన మీద విశ్వాసం ఉంచారు. (అపొస్తలుల కార్యాలు 2:36-38) కానీ యేసును ఎలాగైనా చంపించాలని, వెనకాల ఉండి ఈ కథ అంతటినీ నడిపించిన మతనాయకులు తెలిసితెలిసి కావాలనే అలా చేశారు. కాబట్టి, వాళ్లలో చాలామందికి క్షమాపణ లేదు.—యోహాను 11:45-53.

ధ్యానించడానికి ప్రశ్నలు

  • మత్తయి 9:35-38 యేసు జాలిని లేదా కనికరాన్ని ఏ ముఖ్యమైన విధంగా చూపించాడు? మనం కూడా ఏం చేయాలి?

  • యోహాను 13:34, 35 మనం క్రీస్తు ప్రేమను చూపించడం ఎందుకు ప్రాముఖ్యం?

  • రోమీయులు 15:1-6 స్వార్థమే తెలియని క్రీస్తులా మనం ఎలా ఉండవచ్చు?

  • 2 కొరింథీయులు 5:14, 15 విమోచన క్రయధనం మీద కృతజ్ఞత ఉంటే మనం ఎలా జీవిస్తాం?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి