యెహోవా—వాత్సల్యంతోకూడిన కనికరంగల మన తండ్రి
“యెహోవా ఎంతో వాత్సల్యముతో నిండిన అనురాగమును, కనికరమును గలవాడు.”—యాకోబు 5:11, NW అథఃస్సూచి.
1. దీనులు యెహోవా దేవునివద్దకు ఎందుకు ఆకర్షితులౌతారు?
విశ్వం ఎంత పెద్దగా ఉందంటే, అంతరిక్ష శాస్త్రజ్ఞులు దానిలోని పుంతలన్నింటినీ లెక్కపెట్టలేకపోతున్నారు. మనమున్న నక్షత్రవీధి, అంటే పాలపుంతలో ఎన్ని నక్షత్రాలున్నాయో కూడా లెక్కపెట్టలేనంత విస్తారంగా ఉంది. ఆంటరెస్ వంటి కొన్ని నక్షత్రాలు మన సూర్యుని కంటే కూడా ఎన్నో వేల రెట్లు పెద్దవి, ఎంతో కాంతివంతమైనవి. విశ్వంలోని నక్షత్రాలన్నింటినీ సృష్టించిన మహా సృష్టికర్త ఎంత శక్తిమంతుడయ్యుంటాడు! వాస్తవానికి ఆయన “వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే.” (యెషయా 40:26) అయినప్పటికీ, భయాశ్చర్యములు కలిగించే ఈ దేవుడే, “ఎంతో జాలియు కనికరమునుగల” వాడు. దీనులైన యెహోవా సేవకులకు ప్రత్యేకంగా హింస, అనారోగ్యం, కృంగుదల లేక యితర కష్టాలను అనుభవిస్తున్న వారికి ఆ జ్ఞానము ఎంతటి ఓదార్పు నిస్తుంది!
2. ఈ లోకపు ప్రజలు సున్నితమైన భావోద్రేకాలను తరచూ ఎలా దృష్టిస్తారు?
2 క్రీస్తు కల్గివున్న “జాలియు కనికరము” వంటి సున్నితమైన భావోద్రేకాలను అనేకులు బలహీనతలుగా దృష్టిస్తుంటారు. (ఫిలిప్పీయులు 2:1 NW) పరిణామ సిద్ధాంతంవల్ల ప్రభావితం చెంది, యితరులను నొప్పించినా ఫరవాలేదుగానీ తమను తాము ముందుంచుకోవాలని వారు ప్రజలను ప్రోత్సహిస్తుంటారు. వినోదం, క్రీడల్లో మాదిరిగా అనుకరించబడే అనేకమంది, కన్నీరుకార్చని లేక జాలి కనపర్చని కలహ పురుషులు. కొందరు రాజకీయనాయకులు అలాగే ప్రవర్తిస్తుంటారు. క్రూరుడైన నీరో చక్రవర్తికి విద్యనభ్యసింపజేసిన స్టోయిక్ వేదాంతియైన సెనికా, “జాలిపడడం ఓ బలహీనత” అని నొక్కి చెప్పాడు. మాక్ క్లిన్‌టాక్ మరియు స్ట్రాంగ్ రాసిన సైక్లోపీడియా యిలా పేర్కొంటోంది: “స్టోయిసిజమ్ ప్రభావాలు . . . నేటి కాలంలో కూడా మనుష్యుల మనస్సులను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.”
3. యెహోవా మోషేకు తన్ను తాను ఎలా వర్ణించుకున్నాడు?
3 దానికి భిన్నంగా, మానవజాతి సృష్టికర్త వ్యక్తిత్వం హృదయానందకరంగా ఉంటుంది. ఆయన తన్ను గూర్చి తాను మోషేకు యిలా వివరించుకున్నాడు. “యెహోవా కనికరము, (కరుణ NW) దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా . . . దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచ”డు. (నిర్గమకాండము 34:6, 7) నిజమే, తన న్యాయాన్ని నొక్కిచెబుతూ యెహోవా ఈ వర్ణనను ముగించాడు. బుద్ధిపూర్వకంగా పాపంచేసిన వారిని తగిన రీతిగా శిక్షించకుండా ఆయన విడిచిపెట్టడు. అయినప్పటికీ, మొట్టమొదట ఆయన తనను తాను కనికరం గల దేవుడనని వర్ణించుకుంటున్నాడు, అంటే అక్షరార్థంగా “కనికరంతో నిండినవాడు” అని అర్థం.
4. తరచూ “కరుణ” అని అనువదించబడే హెబ్రీ పదానికి గల ఓదార్పుకరమైన భావం ఏమిటి?
4 కొన్నిసార్లు, “కరుణ” అనే మాట శిక్షించకుండా ఉండే వాత్సల్యరహితమైన న్యాయనిర్ణయ భావంలో మాత్రమే తలంపుకు వస్తుంది. అయితే, బైబిలు అనువాదాలను ఒకదానితో ఒకటి పోల్చడం, రాచమ్ అనే క్రియాపదం నుండి తీసుకోబడిన హెబ్రీ విశేషణము యొక్క పూర్తి భావాన్ని వెలికి తెస్తుంది. కొందరు విద్వాంసుల ప్రకారం, దాని అసలు భావం “మృదువుగా ఉండడం.” “మనకు ప్రియమైనవారి లేక మన సహాయం అవసరమైనవారి బలహీనతలను చూసినప్పుడు లేక వారు బాధననుభవించడం చూసినప్పుడు కల్గే భావన వంటి కనికరంతో కూడిన లోతైన మృదువైన భావాన్ని రాచమ్ వ్యక్తపరుస్తుందని” సిననిమ్స్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్ అనే పుస్తకం వివరిస్తోంది. ఈ కోరదగిన లక్షణాన్ని గూర్చి యితర ఓదార్పునిచ్చే నిర్వచనాలు, లేఖనాలపై అంతర్దృష్టి (ఇంగ్లీష్) అనే పుస్తకపు 2వ సంపుటి నందలి 375-9వ పేజీల్లో కనిపిస్తాయి.
5. మోషే ధర్మశాస్త్రంలో కనికరం ఎలా స్పష్టమైంది?
5 ఇశ్రాయేలు జనాంగానికి ఆయనిచ్చిన ధర్మశాస్త్రంలో దేవుని కనికరం స్పష్టంగా కనిపిస్తుంది. విధవరాండ్రు, అనాధలూ పేదవారు వంటి అననుకూల స్థితిలో ఉన్నవారి యెడల కనికరంతో వ్యవహరించాలి. (నిర్గమకాండము 22:22-27; లేవీయకాండము 19:9, 10; ద్వితీయోపదేశకాండము 15:7-11) దాసులు, జంతువులతో సహా అందరూ ప్రతివారం వచ్చే సబ్బాతు విశ్రాంతి నుండి ప్రయోజనం పొందాలి. (నిర్గమకాండము 20:10) అంతేకాకుండా, దీనులైనవారి యెడల కనికరంతో వ్యవహరించిన వ్యక్తులను దేవుడు తన మనస్సులో పెట్టుకునేవాడు. సామెతలు 19:17 యిలా పేర్కొంటోంది: “బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును.”
దైవిక కనికరానికి గల పరిమితులు
6. యెహోవా తన ప్రజల వద్దకు ప్రవక్తలనూ దూతలనూ ఎందుకు పంపించాడు?
6 ఇశ్రాయేలీయులు దేవుని నామాన్ని ధరించారు, అంతేకాక “యెహోవా . . . నామఘనతకొరకు మందిర”మైయుండిన యెరూషలేము నందలి ఆలయంలో ఆరాధించే వారు. (2 దినవృత్తాంతములు 2:4; 6:33) అయితే, కొంతకాలానికి వారు అవినీతిని, విగ్రహారాధనను, హత్యలనూ అనుమతిస్తూ దేవుని నామానికి కళంకం తెచ్చారు. దేవుడు కనికరంగల తన వ్యక్తిత్వానికి తగినట్లుగా పూర్తి జనాంగంపైకి నాశనం తీసుకురాకుండా ఈ చెడు పరిస్థితిని సరిదిద్దేందుకు ఓపికతో ప్రయత్నించాడు. ఆయన “తన జనులయందును తన నివాసస్థలమందును కటాక్షము గలవాడై వారియొద్దకు తన దూతలద్వారా వర్తమానము పంపుచువచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచువచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళిచేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింపశక్యముకాకుండ యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను.”—2 దినవృత్తాంతములు 36:15, 16.
7. యెహోవా కనికరం ఉచ్చస్థాయికి చేరుకున్నప్పుడు యూదా రాజ్యానికి ఏమి సంభవించింది?
7 యెహోవా కనికరము గలవాడు కోపపడేందుకు నిదానించేవాడైనప్పటికీ, అవసరమైనప్పుడు ఆయన నీతియుక్తమైన కోపాన్ని కనపరుస్తాడు. ఆ నాడు, దైవిక కనికరం దాని ఉచ్చస్థాయికి చేరుకుంది. దాని ఫలితాలను గూర్చి మనం యిలా చదువుతాము: “ఆయన [యెహోవా] వారిమీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధస్థలముగానున్న మందిరములోనే వారి యౌవనులను ఖడ్గముచేత సంహరించెను. అతడు యౌవనులయందైనను, యువతులయందైనను, ముసలివారియందైనను, నెరసిన వెండ్రుకలుగల వారియందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరిని అతనిచేతి కప్పగించెను.” (2 దినవృత్తాంతములు 36:17) ఆ విధంగా యెరూషలేము దాని ఆలయం నాశనం చేయబడ్డాయి, మరి ఆ జనాంగం బబులోనుకు చెరగా కొనిపోబడింది.
ఆయన నామమును బట్టి కనికరపడ్డాడు
8, 9. (ఎ) తన నామము బట్టి ఆయన కనికరిస్తాడని యెహోవా ఎందుకు ప్రకటించాడు? (బి) యెహోవా శత్రువులు ఎలా నోరుమూయించబడ్డారు?
8 ఈ విపత్తు విషయమై చుట్టుప్రక్కల దేశాలు సంతోషించాయి. వెక్కిరింపుగా వాళ్లు యిలా అన్నారు: “వీరు యెహోవా జనులే గదా, ఆయన దేశములోనుండి వచ్చినవారే గదా.” ఈ కళంకానికి నొచ్చుకున్న యెహోవా యిలా ప్రకటించాడు: ‘నా నామమును బట్టి కనికరించితిని. . . . నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును, . . . నేను ప్రభువగు యెహోవానని వారు తెలిసికొందురు.’—యెహెజ్కేలు 36:20-23.
9 ఆయన జనాంగము 70 సంవత్సరాలవరకు చెరలో ఉన్న తర్వాత కనికరంగల దేవుడైన యెహోవా వారిని విడిపించి, వారు తిరిగివచ్చి యెరూషలేములో ఆలయాన్ని పునర్నిర్మించుకునేందుకు అనుమతించాడు. అది, వీటిని ఆశ్చర్యంతో చూస్తున్న చుట్టు ప్రక్కలనున్న రాజ్యాల నోరు మూయించింది. (యెహెజ్కేలు 36:35, 36) అయితే, విషాదకరంగా ఇశ్రాయేలు జనాంగం మరలా చెడు ఆచారాల్లో పడిపోయింది. ఓ నమ్మకమైన యూదుడైన నెహమ్యా, ఆ పరిస్థితిని సరిదిద్దేందుకు సహాయపడ్డాడు. ఒక బహిరంగ ప్రార్థనలో, దేవుడు ఆ జనాంగం యెడల కనికరంతో వ్యవహరించిన విషయాలను పునఃసమీక్షిస్తూ ఆయన యిలా అన్నాడు:
10. యెహోవా కనికరాన్ని నెహెమ్యా ఎలా ఎత్తి చూపాడు?
10 “శ్రమకాలమందు వారు నీకు మొఱ్ఱపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి, వారి శత్రువుల చేతిలోనుండి వారిని తప్పించుటకై నీ కృపాసంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి. వారు నెమ్మదిపొందిన తరువాత నీ యెదుట మరల ద్రోహులుకాగా నీవు వారిని వారి శత్రువులచేతికి అప్పగించితివి; వీరు వారిమీద అధికారము చేసిరి. వారు తిరిగి వచ్చి నీకు మొఱ్ఱపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి నీ కృపచొప్పున అనేకమారులు వారిని విడిపించితివి. . . . నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి”తివి.—నెహెమ్యా 9:26-30; యెషయా 63:9, 10 కూడా చూడండి.
11. యెహోవాకు, మానవుల దేవుళ్లకు మధ్య ఎలాంటి భేదం ఉంది?
11 చివరిగా, దేవుని ప్రియకుమారున్ని క్రూరంగా తృణీకరించిన తర్వాత, యూదా జనాంగం దాని ఆధిక్యతా స్థానాన్ని శాశ్వతంగా పోగొట్టుకుంది. వారితో దేవుని యథార్థమైన సంబంధం 1,500 సంవత్సరాలకుపైగా నిలిచింది. నిజంగానే యెహోవా కనికరం గల దేవుడనే వాస్తవానికి అది నిత్యసాక్షిగా ఉంది. పాపపూరితమైన మనుష్యులు ఆవిష్కరించిన క్రూరమైన దేవుళ్లకు భావరహిత దేవతలకూ ఎంత భిన్నం!—ఎనిమిదవ పేజీ చూడండి.
మహాగొప్పగా వ్యక్తపర్చబడిన కనికరం
12. దేవుడు కనికరాన్ని వ్యక్తపర్చడంలో ఏది అన్నింటికంటే గొప్పది?
12 దేవుడు వ్యక్తపర్చిన కనికరంలో అన్నింటికంటే గొప్పది తన ప్రియకుమారున్ని భూమ్మీదికి పంపించడం. నిజమే, అపవాది యొక్క అబద్ధపు నిందలకు సరైన జవాబును ఆయనకందిస్తూ, యేసు యథార్థమైన జీవితం యెహోవాకు ఎంతో ఆనందాన్ని తెచ్చింది. (సామెతలు 27:11) అయితే అదే సమయంలో, నిస్సందేహంగా తన ప్రియ కుమారుడు క్రూరమైన, అవమానకరమైన మరణాన్నొందుతుండగా చూడవలసి రావడం ఏ మానవ తండ్రి ఎన్నడూ సహించని వేదనను యెహోవాకు కలిగించింది. మానవజాతికి రక్షణ ద్వారాన్ని తెరవడమన్నది ఎంతో ప్రేమపూర్వకమైన అర్పణ. (యోహాను 3:16) బాప్తిస్మమిచ్చు యోహాను తండ్రియైన జెకర్యా ప్రవచించినట్లుగా అది “మన దేవుని మహా వాత్సల్యము”ను ఘనపర్చింది.—లూకా 1:77, 79.
13. ఏ ప్రాముఖ్యమైన విధంలో యేసు తన తండ్రి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాడు?
13 దేవుని కుమారున్ని భూమ్మీదికి పంపించడం కూడా యెహోవా వ్యక్తిత్వాన్ని గూర్చి మానవజాతికి స్పష్టమైన దృక్పథాన్నిచ్చింది. అదెలా? ప్రత్యేకంగా దీనులతో వ్యవహరించేటప్పుడు వాత్సల్యంతో కూడిన కనికరాన్ని వ్యక్తపర్చే విషయంలో, యేసు తన తండ్రి వ్యక్తిత్వాన్ని పూర్ణంగా ప్రతిబింబించాడు. (యోహాను 1:14; 14:9) ఈ విషయంలో, మత్తయి, మార్కు, లూకా సువార్తల రచయితలు ముగ్గురూ “ప్రేగులు” అనే పదానికి ఉపయోగించే గ్రీకు పదం నుండి వచ్చిన స్ప్లాగ్‌క్ల్నిజోమయి అనే గ్రీకు క్రియాపదాన్ని ఉపయోగించారు. “అది సామాన్యమైన జాలి లేక కనికరాన్ని వివరించడంలేదు గానీ ఒక మనిషిని తన అంతర్భావాలవరకు కదిలించే ఒక భావోద్రేకాన్ని అది వివరిస్తున్నట్లుగా దాని మూల పద రూపం నుండి చూడవచ్చు. కనికర భావానికి గ్రీకులో ఉన్న అతి బలమైన పదం అదే” అని బైబిలు విద్వాంసుడైన విలియమ్ బార్ల్కే వివరిస్తున్నారు. అది, ‘జాలిపడం’ లేక “కనికరపడడం” వంటి వాటిలా వివిధరకాలుగా అనువదించబడింది.—మార్కు 6:34; 8:2.
యేసు జాలిపడినప్పుడు
14, 15. గలిలయ పట్టణంలో యేసు ఎలా జాలిపడ్డాడు, మరి యిది దేన్ని సూచిస్తుంది?
14 అది గలిలయ పట్టణ దృశ్యం. “కుష్ఠురోగముతో నిండిన” ఓ వ్యక్తి ఆచార ప్రకారం చేయాల్సిన హెచ్చరికను చేయకుండా యేసును సమీపిస్తాడు. (లూకా 5:12) దేవుని ధర్మశాస్త్రంలో చెబుతున్నట్లుగా “అపవిత్రుడను అపవిత్రుడను,” అని కేకలు వేయనందుకు యేసు అతన్ని కఠినంగా గద్దించాడా? (లేవీయకాండము 13:45) లేదు. బదులుగా, “నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు” అని ఆ వ్యక్తి చేసిన దీనమైన విన్నపాన్ని యేసు వింటాడు. యేసు “కనికరపడి,” “నాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్ము” అని చేయి చాపి అతన్ని తాకుతాడు. ఆ వ్యక్తి ఆరోగ్యం వెంటనే కుదుటపడింది. ఆ విధంగా యేసు, తనకు దేవుడిచ్చిన అద్భుతమైన శక్తులనే కాకుండ, అలాంటి శక్తిని ఉపయోగించేందుకు తన్ను కదిలించే సున్నితమైన భావాలను కూడా ప్రదర్శిస్తాడు.—మార్కు 1:40-42.
15 యేసును సమీపించేంతవరకూ ఆయన కనికరాన్ని కనపర్చడా? లేదు. ఆ తర్వాత, నాయీను అనే పట్టణంలో నుండి వచ్చే ఓ అంత్యక్రియల ఊరేగింపు ఆయనకు ఎదురౌతుంది. నిస్సందేహంగా, అంతకుముందు యేసు అనేక అంత్యక్రియలను చూశాడు, కానీ యిది ప్రత్యేకంగా విషాదకరమైంది. చనిపోయిన వ్యక్తి ఓ విధవరాలి ఏకైక కుమారుడు. “కనికరపడి,” యేసు ఆమెను సమీపించి “ఏడువవద్దు,” అంటాడు. తర్వాత, ఆమె కుమారుని పునరుత్థానం చేసే విశిష్టమైన అద్భుతాన్ని చేస్తాడు.—లూకా 7:11-15.
16. తన్ను అనుసరించే పెద్ద గుంపును చూసి యేసు ఎందుకు కనికరపడ్డాడు?
16 పై సంఘటనల నుండి నేర్చుకున్న విశిష్టమైన పాఠం ఏమిటంటే, యేసును “కనికరపడి”నప్పుడు, సహాయపడేందుకు ఆయన ఏదొక అనుకూల చర్యను గైకొంటాడు. తర్వాత మరో సందర్భంలో, ఆయన్ను అనుసరించే పెద్ద గుంపులను యేసు పరిశీలిస్తాడు. “ఆయన వారు కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్నందున వారిమీద కనికర”పడ్డాడు అని మత్తయి నివేదించాడు. (మత్తయి 9:36) సామాన్య ప్రజల ఆత్మీయ ఆకలిని తీర్చేందుకు పరిసయ్యులు ఏమీ చేయరు. బదులుగా, దీనులపై అనేకమైన అనవసర నియమాల భారాన్ని మోపుతారు. (మత్తయి 12:1, 2; 15:1-9; 23:4, 23) “ధర్మశాస్త్ర మెరుగని యీ జనసమూహము శాపగ్రస్తమైనది” అని యేసు చెప్పేవాటిని విన్న వారిని గూర్చి వారన్నప్పుడు, సామాన్య ప్రజల యెడల వారికి గల దృక్పథం బయల్పడింది.—యోహాను 7:49.
17. ప్రజల యెడల యేసుకున్న జాలి ఆయన్ను ఎలా కదిలించింది, మరి అక్కడ ఆయన ఏ గొప్ప నడిపింపును అందిస్తాడు?
17 దానికి విరుద్ధంగా, ప్రజల ఆత్మీయ దుస్థితిని చూసి యేసు ఎంతగానో చలించిపోయాడు. అయితే ఆయన వ్యక్తిగత శ్రద్ధనిచ్చేందుకు ఆసక్తి గలవారు అనేకమంది ఉన్నారు. అందుచేత, ఎక్కువమంది పనివారి కొరకు ప్రార్థించమని ఆయన తన శిష్యులతో చెబుతాడు. (మత్తయి 9:35-38) అలాంటి ప్రార్థనలకు అనుగుణంగా ఈ సమాచారంతో యేసు తన అపొస్తలులను పంపిస్తాడు: “పరలోకరాజ్యము సమీపించియున్నది.” ఆ సందర్భంలో యివ్వబడిన ఉపదేశాలు, నేటి వరకు కూడా క్రైస్తవులకు విలువైన నడిపింపునిచ్చేవిగా ఉన్నాయి. నిస్సందేహంగా, మానవజాతి ఆత్మీయ ఆకలిని తీర్చేందుకు యేసు కనికర భావాలు ఆయనను కదిలిస్తాయి.—మత్తయి 10:5-7.
18. ప్రజలు తన ఏకాంతాన్ని భంగపర్చినప్పుడు యేసు ఎలా ప్రతిస్పందించాడు, దీన్నుండి మనం ఏ పాఠాన్ని నేర్చుకుంటాము?
18 మరో సందర్భంలో, ప్రజల ఆత్మీయ అవసరతల యెడల శ్రద్ధ చూపించాలని యేసు మరలా భావిస్తాడు. ఈసారి ఆయన, ఆయన అపొస్తలులు ప్రకటనా పని తర్వాత చాలా అలసిపోయి ఉన్నారు, విశ్రమించేందుకుగాను వారు ఒక స్థలాన్ని వెతుక్కుంటారు. అయితే ప్రజలు వారిని త్వరగా కనుక్కుంటారు. తమ ఏకాంతానికి భంగం కలిగించినందుకు యేసు చికాకుచెందక, “కనికర”పడ్డాడని మార్కు రాశాడు. మరి యేసుకు గల లోతైన భావాలకు కారణమేమిటి? ‘వారు కాపరిలేని గొఱ్ఱెలవలె ఉన్నారు.’ మరలా, యేసు తన భావాలను క్రియల ద్వారా చూపిస్తాడు అంతేకాకుండా “దేవుని రాజ్యమునుగూర్చి” ప్రజలకు బోధించడం ప్రారంభిస్తాడు. అవును, వారి ఆత్మీయ ఆకలి చూసి ఎంతగా కదిలిపోయాడంటే అయన వారికి బోధించేందుకు తనకు అవసరమైన విశ్రాంతిని కూడా త్యాగం చేశాడు.—మార్కు 6:34; లూకా 9:11.
19. ప్రజల యెడల యేసుకున్న శ్రద్ధ వారి ఆత్మీయ అవసరతలకు మించి ఎలా విస్తృతపర్చబడింది?
19 ప్రజల ఆత్మీయ అవసరతలపై ప్రధాన శ్రద్ధ ఉన్నప్పటికీ యేసు వారి కనీసావసరతలను ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు. అదే సందర్భంలో “స్వస్థత కావలసినవారిని” కూడా ఆయన “స్వస్థపరచెను.” (లూకా 9:11) తర్వాత మరో సందర్భంలో, ప్రజలు ఆయనతో చాలా సమయం ఉన్నారు, వారు యింటినుండి చాలా దూరంలో ఉన్నారు. వారి శారీరక అవసరతను గ్రహించి, యేసు తన శిష్యులతో యిలా అన్నాడు: “ఈ జనులు నేటికి మూడు దినములనుండి నాయొద్ద నున్నారు; వారికి తిన నేమియు లేదు గనుక వారిమీద కనికరపడుచున్నాను; వారు మార్గములో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదు.” (మత్తయి 15:32) సంభవించబోయే అనర్థాన్ని నివారించేందుకు యేసు యిప్పుడొక పని చేశాడు. ఏడు రొట్టెలూ కొన్ని చిన్న చేపలనుండి వచ్చిన ఆహారాన్ని వేల మంది స్త్రీపురుషులకు, పిల్లలకు ఆయన అద్భుత రీతిలో అందిస్తాడు.
20. యేసు కనికరపడ్డ సంఘటనల్లో చివరిగా రాయబడిన దాన్నుండి మనం ఏమి నేర్చుకుంటాము?
20 యేసు కనికరపడ్డాడని చివరిసారిగా నమోదు చేయబడిన సంఘటన యెరూషలేముకు వెళ్తున్న చివరి ప్రయాణమందు జరిగింది. పస్కాను ఆచరించేందుకు పెద్ద గుంపుల ప్రజలు ఆయనతో ప్రయాణిస్తున్నారు. యెరికో పట్టణం దగ్గిరున్న దారిపై యిద్దరు గ్రుడ్డివారైన భిక్షగాళ్లు, “ప్రభువా, మమ్ము కరుణింపుము” అని కేకలు వేస్తూనే ఉన్నారు. వారిని ఊరకుండజేయాలని ప్రజలు ప్రయత్నిస్తారు కానీ, యేసు వారిని పిలిచి తననుండి వారేమి కోరుతున్నారని అడుగుతాడు. “ప్రభువా, మా కన్నులు తెరవవలెను” అని వారు విన్నవిస్తారు. ఆయన “కనికరపడి” వారి కన్నులను తాకుతాడు, అయితే వారు చూపును పొందుతారు. (మత్తయి 20:29-34) దీన్నుండి మనం ఎంతటి ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్చుకుంటాము! యేసు తన భూపరిచర్యలో చివరి వారంలోకి ప్రవేశించబోతున్నాడు. సాతాను ప్రతినిధుల చేతుల్లో క్రూరమైన మరణాన్ని అనుభవించేముందు ఆయన నెరవేర్చాల్సిన పని చాలా ఉంది. అయినప్పటికీ, ఈ ప్రాముఖ్యమైన సమయపు ఒత్తిడి, అల్పమైన మానవ అవసరతల యెడల తనకుగల కనికర భావాలను కనపర్చకుండా నివారించేటట్లు ఆయన అనుమతించలేదు.
కనికరాన్ని ఉన్నతపర్చే ఉపమానాలు
21. యజమాని తన దాసుని పెద్ద అప్పును రద్దు చేయడం ద్వారా ఏమి దృష్టాంతపర్చబడింది?
21 యేసు జీవితంలోని ఈ వృత్తాంతాల్లో ఉపయోగించబడ్డ గ్రీకు క్రియాపదమైన స్ప్లాగ్‌క్నిజోమయి, యేసు చెప్పిన మూడు ఉపమానాల్లో కూడా ఉపయోగించబడింది. ఒక కథలో ఒక దాసుడు ఓ పెద్ద అప్పును తిరిగి చెల్లించేందుకు సమయాన్నివ్వమని అర్థిస్తాడు. అతని యజమానుడు, “కనికరపడి” ఆ అప్పును రద్దుచేస్తాడు. యేసు విమోచన క్రయధన మందు విశ్వాసముంచే ప్రతి క్రైస్తవుని విస్తారమైన పాపపు అప్పును రద్దుచేసే గొప్ప కనికరాన్ని యెహోవా దేవుడు చూపించాడని యిది సూచిస్తోంది.—మత్తయి 18:27; 20:28.
22. తప్పిపోయిన కుమారుని ఉపమానం దేన్ని దృష్టాంతపరుస్తుంది?
22 ఆ తర్వాత తప్పిపోయిన కుమారుని కథ. తప్పుదోవ పట్టిన కుమారుడు యింటికి తిరిగి వచ్చినప్పుడు ఏమి జరిగిందో జ్ఞాపకం చేసుకోండి. “వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను.” (లూకా 15:20) తప్పుదోవ పట్టిన క్రైస్తవుడు నిజమైన పశ్చాతాపాన్ని కనపర్చినప్పుడు, యెహోవా జాలిపడి, కనికరంతో అతన్ని తిరిగి అంగీకరిస్తాడు అని చూపుతోంది. కాబట్టి, మన తండ్రియైన యెహోవా “ఎంతో వాత్సల్యముతో కూడిన అనురాగమును, కనికరమునుగల”వాడని యేసు ఈ రెండు ఉపమానాల ద్వారా చూపుతున్నాడు.—యాకోబు 5:11 NW అథఃస్సూచి.
23. స్నేహపూరితుడైన సమరయుని గూర్చిన యేసు ఉపమానం నుండి మనం ఏ పాఠాన్ని నేర్చుకుంటాము?
23 దోచుకోబడి, కొన ఊపిరితో విడిచిపెట్టబడిన ఒక యూదుని దుస్థితిని చూసి “కనికరప”డ్డ కనికరపూర్ణుడైన సమరయుడి ఉపమానంలో స్ప్లాగ్‌క్ల్నిజోమయి అనే పదాన్ని మూడవసారి ఉపమాన రీతిగా ఉపయోగించడం జరిగింది. (లూకా 10:33) ఆ భావాలకు అనుగుణంగా, అతనికి సహాయపడేందుకు సమరయుడు తనకు చేతనైనదంతా చేశాడు. కనికరాన్ని కనపర్చడంలో నిజమైన క్రైస్తవులు తమ మాదిరిని అనుకరించాలని యెహోవా, యేసు అపేక్షిస్తున్నారని యిది చూపిస్తుంది. దాన్ని మనం కనపర్చగల కొన్ని మార్గాలు తదుపరి శీర్షికలో చర్చించబడతాయి.
పునఃసమీక్షలోని ప్రశ్నలు
◻ కనికరం కల్గివుండడం అంటే భావమేమిటి?
◻ యెహోవా తన నామాన్ని బట్టి కనికరాన్ని ఎలా కనపర్చాడు?
◻ కనికరం చూపడంలో అన్నింటికంటే గొప్పది ఏది?
◻ ఏ విశిష్టమైన విధానంలో యేసు తన తండ్రి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాడు?
◻ యేసు చేసిన కనికరంతో కూడిన చర్యల నుండి మరియు ఆయన ఉపమానాలనుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
[12, 14వ పేజీలోని బాక్సు]
“వాత్సల్యంతోకూడిన ప్రేమపూర్వక శ్రద్ధ”కు ఓ స్పష్టమైన పదం
“నా కడుపు, నా కడుపు!” అని ప్రవక్తైన యిర్మీయా మొరపెట్టాడు. ఏదో చెడు పదార్థాన్ని తినడంవల్ల ఆయనకు ప్రేగుల్లో ఏర్పడిన అస్వస్థతను గూర్చి చెబుతున్నాడా? లేదు. యూదా రాజ్యంపైకి రాబోయే విపత్తు విషయంలో తన లోతైన శ్రద్ధను వివరించేందుకు యిర్మీయా ఒక హెబ్రీ రూపకాన్ని ఉపయోగిస్తున్నాడు.—యిర్మీయా 4:19.
యెహోవా దేవునికి లోతైన భావాలున్నాయి గనుక, “కడుపు” లేక “ప్రేగుల”కు ఉపయోగించిన హెబ్రీ పదం (మెయిమ్) తన వాత్సల్యంతోకూడిన భావాలను వివరించేందుకు కూడా ఉపయోగించబడింది. ఉదాహరణకు, యిర్మీయాకు పూర్వం అనేక దశాబ్దాల క్రితం పది తెగల ఇశ్రాయేలు రాజ్యాన్ని అష్షూరు రాజు చెరపట్టి తీసుకెళ్లాడు. వారి అవిశ్వాసానికి ఒక శిక్షగా యెహోవా దీన్ని అనుమతించాడు. అయితే చెరపట్టబడిన వారిని దేవుడు మర్చిపోయాడా? లేదు. ఆయన తన నిబంధన ప్రజలుగా వారితో యింకా సన్నిహిత సంబంధాన్ని కల్గివున్నాడు. వారిని ఎఫ్రాయిము అనే ప్రముఖ తెగ పేరుతో సంబోధిస్తూ యెహోవా యిలా అడిగాడు: “ఎఫ్రాయిము నా కిష్టమైన కుమారుడా? నాకు ముద్దుబిడ్డా? నేనతనికి విరోధముగ మాటలాడునప్పుడెల్ల అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది, అతనిగూర్చి నా కడుపులో చాలా వేదనగా నున్నది, తప్పక నేనతని కరుణింతును.”—యిర్మీయా 31:20.
యెహోవా, “నా కడుపులో చాలా వేదనగా నున్నది,” అని అనడం ద్వారా చెరలో ఉన్న తన ప్రజల యెడల తనకున్న లోతైన భావాలను వివరించేందుకు ఒక రూపకాన్ని ఉపయోగించాడు. ఈ వచనంపై తన వ్యాఖ్యానంలో 19వ శతాబ్దపు బైబిలు విద్వాంసుడైన ఇ. హెన్‌డర్‌సన్ యిలా రాశాడు: “తిరిగివస్తున్న తప్పిపోయిన కుమారుని యెడల కనపర్చబడిన హృదయాన్ని తాకే తండ్రి ప్రేమకు సాటిలేదు. ఇక్కడ దాన్ని యెహోవా కనపర్చాడు. . . . [విగ్రహారాధికులైన ఎఫ్రాయిమీయులకు] విరుద్ధంగా ఆయన మాట్లాడి వారిని శిక్షించినప్పటికీ, . . . ఆయన వారిని ఎన్నడు మర్చిపోలేదు, బదులుగా చివరికి వాళ్లు మళ్లీ మునుపటి స్థితికి వస్తారనే ఆశయందు ఆయన ఆనందించాడు.”
“ప్రేగులు” లేక “కడుపుకు” ఉపయోగించబడిన గ్రీకు పదం క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో అదే విధంగా ఉపయోగించబడింది. అపొస్తలుల కార్యములు 1:18 నందున్న విధంగా దాన్ని అక్షరార్థంగా ఉపయోగించనప్పుడు, అనురాగం లేక కనికరం యొక్క వాత్సల్యంతోకూడిన భావోద్రేకాలను అది సూచిస్తుంది. (ఫిలేమోను 12) కొన్నిసార్లు ఆ పదం “మంచి” లేక “బాగు” అనే భావమిచ్చే గ్రీకు పదంతో జతపర్చబడుతుంది. అపొస్తలులైన పౌలు, పేతురు, “బాగా జాలిని కనపర్చేవారై” యుండాలి అనే అక్షరార్థమైన భావమున్న “కరుణాహృదయులై” ఉండాలని క్రైస్తవులను ప్రోత్సహిస్తున్నప్పుడు ఈ రెండు జతపర్చబడిన పదాన్నే ఉపయోగించారు. (ఎఫెసీయులు 4:32; 1 పేతురు 3:8) “ప్రేగులు” అనే గ్రీకు పదాన్ని పోలు అనే గ్రీకు పదానికి కూడా జతపర్చవచ్చు. ఈ కూర్పు “ప్రేగులు ఎక్కువ కల్గివుండడం” అనే అక్షరార్థమైన భావాన్ని యిస్తుంది. చాలా అరుదైన ఈ గ్రీకు పదం బైబిల్లో కేవలం ఒక్కసారే ఉపయోగించబడింది అంతేకాకుండా అది యెహోవా దేవున్ని సూచిస్తుంది. న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ ఆ మాటను యిలా చెబుతుంది: “యెహోవా ఎంతో వాత్సల్యంతోకూడిన అనురాగం . . . గలవాడు.”—యాకోబు 5:11.
అత్యంత శక్తిమంతుడైన యెహోవా దేవుడు, మనుష్యులు కనుగొన్న కనికరంలేని దేవుళ్లకు ఎంతో భిన్నంగా ఉన్నందుకు మనం ఎంత ఋణపడివుండాలి! “జాలిగల” తమ దేవుని అనుకరిస్తూ నిజమైన క్రైస్తవులు ఒకరితో ఒకరు మెలిగేటప్పుడు, ఆ విధంగానే ప్రవర్తించేందుకు కదిలింపబడతారు.—ఎఫెసీయులు 5:1.
[10వ పేజీలోని చిత్రం]
దైవిక కనికరం దాని ఉచ్చస్థాయికి చేరుకున్నప్పుడు, తప్పుదోవ పట్టిన తన ప్రజలను బబులోనీయులు జయించేందుకు యెహోవా అనుమతించాడు
[11వ పేజీలోని చిత్రం]
తన ప్రియ కుమారుడు చనిపోవడాన్ని యెహోవా దేవుడు చూడడం, ఎవ్వరూ ఎన్నడూ అనుభవించని అధిక బాధను కల్గించివుంటుంది
[15వ పేజీలోని చిత్రం]
యేసు తన తండ్రి కల్గివున్న కనికరంతో కూడిన వ్యక్తిత్వాన్ని పూర్ణంగా ప్రతిబింబించాడు