22వ అధ్యాయం
మనం ఎందుకు అబద్ధాలు చెప్పకూడదు?
ఒక అమ్మాయి, “అలాగే అమ్మా, బడి అయిపోగానే ఇంటికి వచ్చేస్తా” అని వాళ్లమ్మతో చెప్పింది. కానీ ఆ అమ్మాయి బడి అయిపోయిన తర్వాత తన స్నేహితులతో ఆడుకుని వాళ్ల అమ్మతో, “బడి అయిపోయిన తర్వాత మా టీచరు ఉండమన్నారు” అని చెప్పింది. అలా చెప్తే తప్పేమీ లేదా?—
ఈ అబ్బాయి చేసిన తప్పేమిటి?
ఒక అబ్బాయి, వాళ్ల నాన్న అడిగినప్పుడు, “లేదు, నేను బంతితో ఇంట్లో ఆడలేదు” అని చెప్పాడు. కానీ ఆ అబ్బాయి నిజంగా ఇంట్లోనే ఆడి, అలా ఆడలేదని చెప్పడం తప్పా?—
ఏమి చేయడం సరైనదో మన గొప్ప బోధకుడు చెప్పాడు. ‘మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లు ఉండాలి; అలా కాకుండా ఇంకేమి చెప్పినా అది దుష్టుని నుండి పుట్టినదే’ అని ఆయన చెప్పాడు. (మత్తయి 5:37) ఆయన చెప్పిన మాటలకు అర్థమేమిటి?— మనం ఏం చెప్తామో అదే చేయాలని అర్థం.
నిజం చెప్పడం ఎంత ప్రాముఖ్యమో చూపించే ఒక కథ బైబిల్లో ఉంది. అది, యేసు శిష్యులమని చెప్పుకున్న ఇద్దరి గురించిన కథ. ఏం జరిగిందో చూద్దాం.
యేసు చనిపోయిన దాదాపు రెండు నెలలకు, యూదులు చేసుకునే పెంతెకొస్తు అనే ఒక ప్రాముఖ్యమైన పండుగ కోసం చాలామంది దూర ప్రాంతాల నుండి యెరూషలేముకు వచ్చారు. అప్పుడు అపొస్తలుడైన పేతురు ఒక అద్భుతమైన ప్రసంగం ఇచ్చాడు, అందులో ఆయన, యెహోవా దేవుడు తిరిగి బ్రతికించిన యేసు గురించి ప్రజలకు చెప్పాడు. యెరూషలేముకు వచ్చిన వాళ్లలో చాలామందికి యేసు గురించి వినడం అదే మొదటిసారి. వాళ్లు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని అనుకున్నారు. అప్పుడు వాళ్లు ఏమి చేశారు?
వాళ్లు అనుకున్న దానికన్నా ఎక్కువ రోజులు అక్కడే ఉన్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్లలో కొంతమంది దగ్గరున్న డబ్బులు అయిపోయాయి, అయితే ఆహారం కొనుక్కోవాలంటే డబ్బులు అవసరం. అప్పుడు యెరూషలేములో ఉన్న శిష్యులు వాళ్లకు సహాయం చేద్దామనుకున్నారు. అందుకే, ఆ శిష్యుల్లో చాలామంది తమకున్న వాటిని అమ్మి, వచ్చిన డబ్బును యేసు అపొస్తలుల దగ్గరకు తీసుకొచ్చారు. అలా వచ్చిన డబ్బును అపొస్తలులు అవసరంలో ఉన్నవాళ్లకు ఇచ్చేవాళ్లు.
యెరూషలేములోవున్న క్రైస్తవ సంఘంలో సభ్యులైన అననీయా, అతని భార్య సప్పీరా తమకున్న ఒక పొలాన్ని అమ్మారు. అలా అమ్మమని ఎవ్వరూ వాళ్లకు చెప్పలేదు. వాళ్లే అమ్మాలని అనుకున్నారు. కానీ, వాళ్లు అమ్మింది యేసు కొత్త శిష్యుల మీద ఉన్న ప్రేమతో కాదు. వాళ్లిద్దరూ నిజానికి అంత మంచివాళ్లు కాకపోయినా తాము మంచివాళ్లం అన్నట్లు చూపించాలనుకున్నారు. అందుకే, ఇతరులకు సహాయం చేయడానికి పొలం అమ్మగా వచ్చిన డబ్బంతా ఇచ్చేస్తున్నట్లు చెప్పాలని నిర్ణయించుకున్నారు. నిజానికి వాళ్లు దానిలో కొంత డబ్బునే ఇచ్చి, మొత్తం డబ్బు ఇచ్చేస్తున్నామని చెప్పాలనుకున్నారు. దాని గురించి మీరేమి అనుకుంటున్నారు?—
అననీయ డబ్బు తీసుకుని అపొస్తలుల దగ్గరకు వచ్చాడు. ఆ డబ్బు వాళ్లకు ఇచ్చాడు. కానీ అతను మొత్తం డబ్బు ఇవ్వడంలేదని దేవునికి తెలుసు. అందుకే దేవుడు, ఆ విషయంలో అననీయ నిజాయితీగా లేడని అపొస్తలుడైన పేతురుకు తెలిసేలా చేశాడు.
అననీయ పేతురుతో ఏమని అబద్ధం చెప్తున్నాడు?
అప్పుడు పేతురు, ‘అననీయా, నీ హృదయాన్ని ప్రేరేపించేలా సాతానుకు ఎందుకు అవకాశం ఇచ్చావు? ఆ పొలం నీది. దాన్ని అమ్మమని ఎవరూ నిన్ను అడగలేదు. అమ్మిన తర్వాత కూడా ఆ డబ్బును ఏమి చేయాలో నిర్ణయించుకునే అవకాశం నీకు ఉంది. కానీ ఆ డబ్బులో కొంతే ఇస్తూ మొత్తం ఇచ్చేస్తున్నట్లు ఎందుకు నటిస్తున్నావు? ఇలా చేసి నువ్వు మాతో మాత్రమే కాదుగానీ దేవునితో అబద్ధమాడావు’ అన్నాడు.
అది చాలా పెద్ద విషయం. అననీయ అబద్ధం చెప్పాడు! ఆయన తాను చేస్తున్నానని చెప్పినది చేయలేదు. ఆయనలా నటించాడు అంతే. ఆ తర్వాత ఏమి జరిగిందో బైబిలు మనకు చెప్తుంది. ‘పేతురు మాటలు వినగానే, అననీయ కింద పడి చనిపోయాడు’ అని అది చెప్తోంది. దేవుడు ఆయన చనిపోయేలా చేశాడు! అక్కడున్న వాళ్లు, ఆయన శవాన్ని బయటకు తీసుకెళ్లి పాతిపెట్టారు.
అబద్ధం చెప్పినందుకు అననీయకు ఏమైంది?
దాదాపు మూడు గంటల తర్వాత సప్పీరా అక్కడకు వచ్చింది. తన భర్తకు ఏమి జరిగిందో ఆమెకు తెలియదు. పేతురు ఆమెను, ‘మీ ఇద్దరు మాకు ఎంత డబ్బు ఇచ్చారో అంతకే మీ పొలం అమ్మారా?’ అని అడిగాడు.
అప్పుడు సప్పీరా, ‘అవును మా పొలాన్ని అంతకే అమ్మాము’ అని చెప్పింది. కానీ అది అబద్ధం! వాళ్లు పొలం అమ్మగా వచ్చిన డబ్బులో కొంత డబ్బు ఉంచుకున్నారు. అందుకే దేవుడు, సప్పీరా కూడా చనిపోయేలా చేశాడు.—అపొస్తలుల కార్యములు 5:1-11.
అననీయ, సప్పీరాలకు జరిగిన దాని నుండి మనం ఏమి నేర్చుకోవాలి?— అబద్ధాలు చెప్పేవాళ్లంటే దేవునికి ఇష్టంలేదని మనం తెలుసుకోవాలి. మనం ఎప్పుడూ నిజమే చెప్పాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ అబద్ధాలు చెప్పినా ఫర్వాలేదని చాలామంది అంటారు. నిజంగా ఫర్వాలేదా?— భూమ్మీదున్న అన్ని రకాల వ్యాధులు, బాధ, మరణం ఒక్క అబద్ధం వల్లే వచ్చాయన్న సంగతి మీకు తెలుసా?—
మొట్టమొదటి అబద్ధం ఎవరు చెప్పారని యేసు అన్నాడు, ఆ అబద్ధం వల్ల ఏం జరిగింది?
మొదటి స్త్రీ అయిన హవ్వతో సాతాను అబద్ధం చెప్పాడని మీకు గుర్తుండి ఉంటుంది. దేవుని మాట వినకుండా, తినకూడదని ఆయన చెప్పిన పండు తింటే ఆమె చనిపోదని సాతాను ఆమెతో చెప్పాడు. సాతాను చెప్పింది నమ్మి హవ్వ ఆ పండు తినేసింది, ఆదాము కూడా తినేలా చేసింది. దాంతో వాళ్లు పాపులు అయ్యారు, వాళ్ల పిల్లలందరు పాపులుగానే పుడతారు. ఆదాము పిల్లలంతా పాపులే కాబట్టి, వాళ్లంతా బాధలుపడి, చనిపోయారు. అసలు ఆ సమస్యంతా ఎలా మొదలైంది?— ఒక్క అబద్ధంతో మొదలైంది.
సాతాను ‘అబద్ధాలు చెప్పేవాడు, అబద్ధానికి తండ్రి’ అని యేసు ఊరికే అనలేదు! మొట్టమొదటి అబద్ధం చెప్పింది అతనే. ఎవరైనా అబద్ధం చెప్తున్నారంటే వాళ్లు సాతాను మొదలుపెట్టిన దానినే చేస్తున్నారు. మనకు ఎప్పుడైనా అబద్ధం చెప్పాలని అనిపిస్తే ఈ విషయాన్ని గుర్తుచేసుకోవాలి.—యోహాను 8:44.
అబద్ధం చెప్పాలని మీకు ఎప్పుడు అనిపిస్తుంది?— మీరు ఏదైనా తప్పు చేసినప్పుడే కదా?— అనుకోకుండా మీరు ఏదైనా పగులగొట్టి ఉండొచ్చు. అది ఎవరు పగులగొట్టారని మిమ్మల్ని అడిగితే, ఇంకెవరో పగులగొట్టారని చెప్పవచ్చా? లేదా అది ఎలా జరిగిందో మీకు తెలియదన్నట్లు నటించవచ్చా?—
అబద్ధం చెప్పాలని మీకు ఎప్పుడు అనిపిస్తుంది?
మీరు మీ హోమ్‌వర్క్ మొత్తం పూర్తి చేయకుండా కొంచెమే చేశారు అనుకోండి. అప్పుడు మొత్తం చేసేశానని చెప్పవచ్చా?— అననీయ సప్పీరాలకు ఏమి జరిగిందో మనం గుర్తుంచుకోవాలి. వాళ్లు నిజమేమిటో పూర్తిగా చెప్పలేదు. దేవుడు అక్కడికక్కడే వాళ్లు చనిపోయేలా చేసి నిజం దాచిపెట్టడం ఎంత చెడ్డపనో చూపించాడు.
కాబట్టి, మనం ఏ పొరపాటు చేసినా అబద్ధం చెప్పడం వల్ల సమస్య ఎప్పుడూ పెద్దదే అవుతుంది. అంతేకాదు నిజమేమిటో పూర్తిగా చెప్పకపోవడం కూడా తప్పే. ‘సత్యమే మాట్లాడాలి’ అని బైబిలు చెప్తోంది. ‘ఒకరితో ఒకరు అబద్ధం ఆడకూడదు’ అని కూడా అది చెప్తోంది. యెహోవా ఎప్పుడూ సత్యమే మాట్లాడతాడు, మనం కూడా అలాగే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు.—ఎఫెసీయులు 4:25; కొలొస్సయులు 3:9.
మనం ఎప్పుడూ నిజమే చెప్పాలి. ఆ విషయం గురించి, నిర్గమకాండము 20:16; సామెతలు 6:16-19; 12:19; 14:5; 16:6; హెబ్రీయులు 4:13 వచనాల్లో ఉంది.