కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w06 6/15 పేజీలు 25-29
  • “నీ శాసనములు నాకు సంతోషకరములు”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “నీ శాసనములు నాకు సంతోషకరములు”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని ఏర్పాట్లపట్ల విశ్వసనీయత
  • హెచ్చరికను గుర్తుచేసే ఉదాహరణ
  • పవిత్రతను కాపాడుకోవడం
  • దేవుని శాసనాలను లక్ష్యపెట్టండి
  • యెహోవా జ్ఞాపికలు మీకు అతి ప్రియమైనవిగా ఉన్నాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • యెహోవా జ్ఞాపికలు నమ్మదగినవి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • దావీదు, సౌలు
    నా బైబిలు పుస్తకం
  • మీ పరిస్థితులు మీ జీవితాన్ని అదుపు చేస్తున్నాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
w06 6/15 పేజీలు 25-29

“నీ శాసనములు నాకు సంతోషకరములు”

“పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి.”​—రోమీయులు 15:4.

1. యెహోవా మనకెలా తన శాసనాలు గుర్తుచేస్తాడు, అవి మనకెందుకు అవసరం?

ఈ కష్టకాలాల ఒత్తిళ్లను ఎదుర్కొనేలా సహాయం చేసేందుకు యెహోవా పదేపదే తన ప్రజలకు తన శాసనాలు గుర్తు చేస్తున్నాడు. ఈ శాసనాల్లో కొన్ని వ్యక్తిగత పఠనమప్పుడు గుర్తుచేయబడుతుంటే, మరికొన్ని క్రైస్తవ కూటాల్లో అందించబడే సమాచార రూపంలో లేదా వ్యాఖ్యానాల రూపంలో గుర్తుచేయబడుతున్నాయి. ఈ సందర్భాల్లో మనం చదివే లేదా వినేవాటిలో అధికశాతం సమాచారం మనకు క్రొత్తకాదు. బహుశా మనమలాంటి సమాచారాన్ని అంతకుముందే పరిశీలించివుండవచ్చు. అయితే, మనం మర్చిపోయే అవకాశముంది కాబట్టి, యెహోవా సంకల్పాల, నియమాల, ఉపదేశాల గురించి మనమెల్లప్పుడూ మన జ్ఞాపకశక్తికి పదునుపెడుతూ ఉండాలి. మనం దేవుని శాసనాలపట్ల కృతజ్ఞతతో ఉండాలి. అవి మనం దైవిక జీవన విధానాన్ని చేపట్టేలా మనల్ని పురికొల్పిన కారణాలను గుర్తుపెట్టుకునేందుకు సహాయం చేస్తూ మనల్ని ప్రోత్సహిస్తాయి. అందుకే, కీర్తనకర్త యెహోవాను ఉద్దేశించి ఇలా పాడాడు: “నీ శాసనములు నాకు సంతోషకరములు.”​—కీర్తన 119:24.

2, 3. (ఎ) బైబిలు వ్యక్తుల జీవిత కథలను మనకాలం వరకు ఎందుకు భద్రపరిచాడు? (బి) ఈ ఆర్టికల్‌లో లేఖనాలనుండి ఏ వృత్తాంతాలను మనం పరిశీలిస్తాం?

2 దేవుని వాక్యం అనేక శతాబ్దాల పూర్వం వ్రాయబడినప్పటికీ, అది చాలా శక్తిమంతమైనది. (హెబ్రీయులు 4:12) అది బైబిల్లో పేర్కొనబడిన వ్యక్తుల నిజజీవిత వృత్తాంతాలను అందిస్తోంది. బైబిలు కాలాల దగ్గరనుండి ఆచారాలు, అభిప్రాయాలు మారినా, మనం ఎదుర్కోవలసిన సవాళ్లు తరచూ ఆ కాలం వాళ్లు ఎదుర్కొన్న సవాళ్లలాగే ఉన్నాయి. మన ప్రయోజనార్థం బైబిల్లో భద్రపరచబడిన అనేక కథలు యెహోవాను ప్రేమించి, తీవ్ర పరిస్థితుల్లోనూ ఆయనను నమ్మకంగా సేవించిన ప్రజల ఉత్తేజకరమైన ఉదాహరణలను అందిస్తున్నాయి. ఇతర వృత్తాంతాలు దేవుడు అసహ్యించుకునే ప్రవర్తనల గురించి స్పష్టం చేస్తున్నాయి. యెహోవా మనకు ముఖ్యమైన పాఠాలను గుర్తుచేసేందుకు మంచివారి, చెడ్డవారి వృత్తాంతాలను బైబిల్లో వ్రాయించాడు. అవి అపొస్తలుడైన పౌలు వ్రాసినట్లే ఉన్నాయి: “ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి.”​—రోమీయులు 15:4.

3 మనం లేఖనాల్లోని ఈ క్రింది మూడు వృత్తాంతాలపై దృష్టి నిలుపుదాం: సౌలుతో దావీదు వ్యవహరించిన విధానం, అననీయ, సప్పీరాల వృత్తాంతం, పోతీఫరు భార్య విషయంలో యోసేపు ప్రవర్తన. ఈ వృత్తాంతాల్లో ప్రతీది మనకు విలువైన పాఠాలు బోధిస్తుంది.

దేవుని ఏర్పాట్లపట్ల విశ్వసనీయత

4, 5. (ఎ) సౌలు, దావీదుల మధ్య ఎలాంటి పరిస్థితి నెలకొంది? (బి) సౌలు విరోధభావానికి దావీదు ఎలా స్పందించాడు?

4 రాజైన సౌలు యెహోవాపట్ల అవిధేయత చూపించి, ఆయన ప్రజలపై పరిపాలించే అర్హత కోల్పోయాడు. అందువల్ల దేవుడు అతణ్ణి తిరస్కరించి, ఇశ్రాయేలు భావిరాజుగా దావీదును అభిషేకించమని సమూయేలు ప్రవక్తను నిర్దేశించాడు. యోధునిగా దావీదు తన శౌర్యాన్ని ప్రదర్శించి ప్రజల అభినందనను పొందినప్పుడు, సౌలు దావీదునొక ప్రత్యర్థిగా చూడడం ఆరంభించాడు. ఆయనను చంపేందుకు సౌలు పదేపదే ప్రయత్నించాడు. అయితే యెహోవా దావీదుకు తోడైవున్నాడు కాబట్టి, ఆయన ప్రతీ సందర్భంలో తప్పించుకున్నాడు.​—1 సమూయేలు 18:6-12, 25; 19:10, 11.

5 చాలా సంవత్సరాలు దావీదు పలాయితునిగా జీవించాడు. సౌలును చంపే అవకాశం దావీదుకు దొరికినప్పుడు, యెహోవాయే ఆ శత్రువును దావీదు చేతికి అప్పగిస్తున్నాడంటూ, సౌలును చంపమని దావీదు సహచరులు ఆయనను బలవంతపెట్టారు. అయినాసరే, దావీదు అలా చంపేందుకు నిరాకరించాడు. యెహోవాపట్ల ఆయనకున్న విశ్వసనీయత, దేవుని ప్రజల అభిషిక్త రాజుగా సౌలు స్థానంపట్ల గౌరవం ఆయనలా నిరాకరించేందుకు పురికొల్పాయి. సౌలును ఇశ్రాయేలు రాజుగా నియమించింది యెహోవాయే కదా? కాబట్టి సౌలును తొలగించాలనుకుంటే యెహోవాయే తగినకాలంలో ఆయనను తొలగిస్తాడు కూడా. అందువల్ల జోక్యం చేసుకోవడం తనపని కాదని దావీదు భావించాడు. ఆయన తనపట్ల సౌలుకున్న విరోధభావాన్ని తొలగించేందుకు ఆ పరిస్థితుల్లో తాను చేయగలిగినంతా చేసి, చివరికిలా అన్నాడు: “యెహోవాయే అతని మొత్తును, అతడు అపాయమువలన చచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించును; యెహోవాచేత అభిషేకము నొందిన వానిని నేను చంపను.”​—1 సమూయేలు 24:3-15; 26:7-20.

6. దావీదు, సౌలుల వృత్తాంతాన్ని పరిశీలించడం మనకెందుకు ప్రాముఖ్యం?

6 ఈ వృత్తాంతంలో ఓ ప్రాముఖ్యమైన పాఠముంది. క్రైస్తవ సంఘంలో ఫలాన సమస్యలు ఎందుకు తలెత్తుతాయని మీరెప్పుడైనా ప్రశ్నించుకున్నారా? బహుశా ఎవరోఒకరు సరిగా ప్రవర్తించని కారణంగా కావచ్చు. అతని ప్రవర్తన ఘోరమైన తప్పు కాకపోయినా, అది మిమ్మల్ని కలవరపెడుతుండవచ్చు. అలాంటప్పుడు మీరెలా స్పందించాలి? ఆయనపట్ల మీకున్న క్రైస్తవ శ్రద్ధనుబట్టి, యెహోవాపట్ల మీకున్న విశ్వసనీయతనుబట్టి, ఆయనను పోగొట్టుకోకూడదనే లక్ష్యంతో మీరు ఆ వ్యక్తితో ప్రేమపూర్వకంగా మాట్లాడడానికి ఇష్టపడవచ్చు. అయినప్పటికీ, సమస్య ఇంకా అలాగేవుంటే అప్పుడేమిటి? న్యాయంగా మీరు చేయగలిగినదంతా చేసిన తర్వాత, ఆ విషయాన్ని యెహోవాకే వదిలిపెట్టేందుకు మీరు ఇష్టపడవచ్చు. దావీదు అలాగే చేశాడు.

7. మనకు అన్యాయం లేదా వివక్ష ఎదురైనప్పుడు, దావీదును అనుకరిస్తూ మనమెలా స్పందించాలి?

7 లేదా మీరు సామాజిక అన్యాయానికి లేక మత వివక్షకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటుండవచ్చు. ఈ సమయంలో వాటిగురించి మీరు చేయగలిగిందేమీ లేకపోవచ్చు. అలాంటి పరిస్థితిని సహించడం చాలా కష్టం, అయితే అన్యాయంపట్ల దావీదు స్పందించిన తీరు మనకొక పాఠాన్ని నేర్పిస్తుంది. దావీదు వ్రాసిన కీర్తనలు, సౌలు కబంధహస్తాల నుండి తనను తప్పించమని ఆయన చేసిన హృదయపూర్వక ప్రార్థనలు మాత్రమే కాక, యెహోవాపట్ల ఆయనకున్న విశ్వసనీయతను, దేవుని నామం మహిమపర్చబడడంపట్ల ఆయనకున్న శ్రద్ధను కూడా యోగ్యమైన రీతిలో వివరిస్తున్నాయి. (కీర్తన 18:1-6, 25-27, 30-32, 48-50; 57:1-11) సౌలు చాలా సంవత్సరాలపాటు తనపట్ల అన్యాయంగా ప్రవరిస్తూవున్నా దావీదు యెహోవాపట్ల విశ్వసనీయంగా ఉన్నాడు. మనకు అన్యాయం జరుగుతున్నా, ఇతరులు మనకేమి చేసినా మనం కూడా యెహోవాపట్ల ఆయన సంస్థపట్ల నమ్మకంగా ఉండాలి. యెహోవాకు పరిస్థితి బాగా తెలుసనే నమ్మకంతో మనం ఉండవచ్చు.—కీర్తన 86:2.

8. మొజాంబిక్‌లోని యెహోవాసాక్షులు యెహోవాపట్ల తమకున్న విశ్వసనీయత పరీక్షించబడినప్పుడు ఎలా స్పందించారు?

8 పరీక్షా సమయంలో యెహోవాకు విశ్వసనీయంగా హత్తుకున్నవారిలో మొజాంబిక్‌లోని క్రైస్తవులు ఆధునిక దిన ఉదాహరణగా ఉన్నారు. ప్రతిఘటనా ఉద్యమదళాలు 1984లో వారి గ్రామాలపై పదేపదే దాడిచేసి, వారిని దోచుకొని ఇళ్లకు నిప్పంటించి, గ్రామస్థులను హతమార్చారు. ఆ నిజ క్రైస్తవులు, తమను తాము కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు కనిపించారు. ఆ ప్రాంత నివాసులు సాయుధ ఉద్యమంలో చేర్చాలనే ప్రయత్నాల ఒత్తిడికి లేదా ఇతరవిధాలుగా ఆ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలనే ఒత్తిడికి గురయ్యారు. అలా చేయడం తమ క్రైస్తవ తటస్థతా వైఖరికి విరుద్ధమని యెహోవాసాక్షులు భావించారు. వారు నిరాకరించడం ఉద్యమకారులు ఆగ్రహించేలా చేసింది. ఆ సంక్షోభ సమయంలో దాదాపు 30 మంది సాక్షులు హత్యచేయబడ్డారు, అయితే ప్రాణాపాయ స్థితి సహితం దేవుని ప్రజల విశ్వసనీయతను భంగం చేయలేకపోయింది.a దావీదులాగే వారు అన్యాయాలను సహించి చివరకు విజయం సాధించారు.

హెచ్చరికను గుర్తుచేసే ఉదాహరణ

9, 10. (ఎ) కొన్ని లేఖనాధార ఉదాహరణల నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు? (బి) అననీయ, సప్పీరాల క్రియల్లో ఎలాంటి దోషముంది?

9 లేఖనాల్లో పేర్కొనబడిన కొందరు వ్యక్తులు, మన ప్రవర్తన ఎలా ఉండకూడదు అనే అంశాన్ని గుర్తుచేసే ఉదాహరణలుగా ఉన్నారు. నిజానికి, బైబిల్లో దేవుని ప్రజల్లోని కొందరితో సహా తప్పుచేసి పర్యవసానాలు అనుభవించిన చాలామంది వృత్తాంతాలు ఉన్నాయి. (1 కొరింథీయులు 10:11) అలాంటి వృత్తాంతాల్లో ఒకటి, యెరూషలేములో మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘ సభ్యులుగా ఉన్న వివాహిత దంపతులైన అననీయ, సప్పీరాలది.

10 సా.శ. 33 పెంతెకొస్తు తర్వాత, అపొస్తలుల సహవాసం నుండి ప్రయోజనం పొందేందుకు యెరూషలేములో ఉండిపోయిన క్రొత్త విశ్వాసులకు వస్తుపరమైన సహాయం అందించే అవసరమేర్పడింది. ఎవరికీ కొదువలేకుండా చేయాలనే ఉద్దేశంతో సంఘస్థులు కొందరు తమ ఆస్తులు అమ్మేశారు. (అపొస్తలుల కార్యములు 2:41-45) అననీయ, సప్పీరాలు తమ పొలం అమ్మి, వచ్చిన సొమ్ములో కొంతభాగమే అపొస్తలులకు అప్పగించి, అమ్మిన తర్వాత వచ్చిన సొమ్మంతా తాము ఇస్తున్నామని బుకాయించారు. నిజానికి అననీయ, సప్పీరాలు తక్కువో ఎక్కువో తాము కోరుకున్నంత ఇవ్వవచ్చు, అయితే వారి ఉద్దేశం చెడ్డది, వారి క్రియలు మోసపూరితమైనవి. వారు అపొస్తలులను ఆకట్టుకుని, తాము వాస్తవంగా చేస్తున్నదానికన్నా ఎక్కువ చేస్తున్నట్లుగా కనిపించాలని కోరుకున్నారు. అయితే పరిశుద్ధాత్మ ప్రేరణతో అపొస్తలుడైన పేతురు వారి మోసాన్ని, వేషధారణను బహిర్గతం చేసినప్పుడు యెహోవా వారిని మరణశిక్షతో దండించాడు.​—అపొస్తలుల కార్యములు 5:1-10.

11, 12. (ఎ) నిజాయితీ విషయంలో లేఖనాధార హెచ్చరికలకు సంబంధించిన కొన్ని ఉదాహరణలేమిటి? (బి) నిజాయితీగా ఉండడంవల్ల కలిగే ప్రయోజనాలేమిటి?

11 ప్రజలు మనల్ని మంచివారిగా పరిగణించాలనే ఉద్దేశంతో అబద్ధం చెప్పేందుకు మనమెప్పుడైనా శోధించబడితే, అననీయ, సప్పీరాల కథ మనకు గట్టి హెచ్చరికగా ఉంటుంది. మనం తోటివాళ్లను మోసం చేయవచ్చేమో గానీ, యెహోవాను మోసగించలేం. (హెబ్రీయులు 4:13) మనం పరస్పరం నిజాయితీగా ఉండాలని లేఖనాలు పదేపదే మనల్ని ప్రోత్సహిస్తున్నాయి, ఎందుకంటే అవినీతిలేని భూమిలో అబద్ధికులకు చోటుండదు. (సామెతలు 14:2; ప్రకటన 21:8; 22:15) దానికిగల కారణం స్పష్టం. అబద్ధాన్నంతటినీ ప్రోత్సహించేవాడు మరెవరో కాదు అపవాదియైన సాతానే.​—యోహాను 8:44.

12 నిజాయితీని మన జీవన విధానంగా చేసుకోవడం అనేక ప్రయోజనాలు తెస్తుంది. వాటిలో పరిశుభ్రమైన మనస్సాక్షి, ఇతరులు మనల్ని నమ్ముతారనే సంతృప్తి ఉన్నాయి. అనేక సందర్భాల్లో క్రైస్తవులు నిజాయితీగా ఉన్నందువల్లే ఉద్యోగాలు పొందారు లేదా తమ ఉద్యోగాలు నిలుపుకున్నారు. అయితే నిజాయితీగా ఉండడంవల్ల కలిగే ప్రాముఖ్యమైన ప్రయోజనమేమిటంటే, మనం సర్వశక్తిగల దేవుని స్నేహాన్ని సంపాదించుకుంటాం.​—కీర్తన 15:1, 2.

పవిత్రతను కాపాడుకోవడం

13. యోసేపుకు ఎలాంటి పరిస్థితి ఎదురైంది, ఆయనెలా స్పందించాడు?

13 పితరుడైన యాకోబు కుమారుడైన యోసేపు 17 ఏళ్ల వయసులో ఐగుప్తు దాసత్వానికి అమ్మివేయబడ్డాడు. చివరికాయన, ఐగుప్తు రాజు దగ్గర ఉద్యోగం చేస్తున్న పోతీఫరు ఇంటికి చేరాడు, అక్కడ ఆయన యజమాని భార్య కన్ను ఆయనపై పడింది. అందంగా ఉన్న యువకుడైన యోసేపుతో లైంగిక సంబంధం పెట్టుకోవాలనే కోరికతో ఆమె ప్రతీరోజు “తనతో శయనించుమని” ఆయనను పోరుపెట్టింది. యోసేపు తన ఇంటికి దూరంగా తననెవరూ ఎరుగని దేశంలో నివసిస్తున్నాడు. ఆయన ఇతరులెవరికీ తెలియకుండా ఈ స్త్రీతో సులభంగా సంబంధం పెట్టుకోవచ్చు. కానీ, పోతీఫరు భార్య చివరకు తన వస్త్రం పట్టుకొని లాగినప్పుడు, యోసేపు అక్కడనుండి పారిపోయాడు.​—ఆదికాండము 37:2, 18-28; 39:1-12.

14, 15. (ఎ) యోసేపు వృత్తాంతం మనకెందుకు ఆసక్తి కలిగించాలి? (బి) దేవుని హెచ్చరికల్ని తాను లక్ష్యపెట్టినందుకు ఓ క్రైస్తవ స్త్రీ ఎందుకు కృతజ్ఞతతో ఉంది?

14 యోసేపు దైవభక్తిగల కుటుంబంలో పెరగడమే కాక, భార్యాభర్తలుకాని వ్యక్తుల మధ్య లైంగిక సంబంధాలు తప్పని కూడా ఆయన అర్థం చేసుకున్నాడు. “నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును” అని ఆయన అడిగాడు. ఒక పురుషునికి ఒకే భార్య ఉండాలని ఏదెనులో మానవులకోసం వ్యక్తపర్చబడిన దేవుని ప్రమాణం గురించి ఆయనకున్న జ్ఞానం ఆ నిర్ణయం తీసుకునేలా ఆయనను ప్రోత్సహించి ఉండవచ్చు. (ఆదికాండము 2:24) నేడు దేవుని ప్రజలు యోసేపు స్పందించిన విధానాన్ని ధ్యానించడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. కొన్ని ప్రాంతాల్లో లైంగిక సంబంధాలపట్ల మనోభావాలు ఎంత ఉదాసీనంగా ఉన్నాయంటే, లైంగిక దుర్నీతికి దూరంగావుండే యౌవనులను తోటివాళ్లు అపహసిస్తారు. వయోజనుల్లో వివాహేతర సంబంధాలు సర్వసాధారణంగా ఉన్నాయి. కాబట్టి, యోసేపు వృత్తాంతం మనకాలంలో గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశాన్ని మనకు గుర్తుచేస్తోంది. దేవుని ప్రమాణం ప్రకారం జారత్వం, వ్యభిచారం ఇంకా పాపాలుగానే ఉన్నాయి. (హెబ్రీయులు 13:4) లైంగిక దుర్నీతికి పాల్పడాలనే శోధనలో పడిపోయిన చాలామంది అలా చేయకుండా ఉండేందుకు బలమైన కారణం ఉందని అంగీకరిస్తున్నారు. అవాంఛిత ఫలితాల్లో అవమానభావం, దెబ్బతిన్న మనస్సాక్షి, ఈర్ష్యాభావాలు, గర్భధారణ, సుఖవ్యాధులు వంటివి ఉండవచ్చు. లేఖనాలు మనకు గుర్తుచేస్తున్నట్లుగా, జారత్వానికి పాల్పడే వ్యక్తి “తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.”​—1 కొరింథీయులు 5:9-12; 6:18; సామెతలు 6:23-29, 32.

15 అవివాహిత యెహోవాసాక్షిగావున్న జెనీకిb దేవుని శాసనాలపట్ల కృతజ్ఞత కలిగివుండే కారణముంది. ఉద్యోగ స్థలంలో, అందగాడైన ఓ తోటి ఉద్యోగి తనపట్ల ప్రణయాత్మక ఆసక్తి ప్రదర్శించాడు. జెనీ స్పందించకపోయే సరికి, అతను తన ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. “పవిత్రంగా ఉండేందుకు నేను సంఘర్షించే పరిస్థితి నాకు వచ్చింది, ఎందుకంటే ఒక పురుషుడు మీ విషయంలో ఆసక్తి చూపించడం గొప్పగా అనిపిస్తుంది” అని ఆమె ఒప్పుకుంటోంది. అయితే, ఆ వ్యక్తి చాలామంది స్త్రీలతో సంబంధం పెట్టుకున్నట్లే తనతోకూడా సంబంధం పెట్టుకునేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నాడని ఆమె గ్రహించింది. ఎదిరించే శక్తి తనలో సన్నగిల్లుతున్నట్లు అనిపించినప్పుడు, తనపట్ల నమ్మకంగా ఉండేందుకు సహాయం చేయమని యెహోవాను వేడుకుంది. బైబిల్లో, క్రైస్తవ ప్రచురణల్లో జెనీ పరిశోధించి తెలుసుకున్న విషయాలు ఆమె జాగ్రత్తపడేందుకు పురికొల్పిన హెచ్చరికలుగా పనిచేశాయి. ఆ హెచ్చరికల్లో ఒకటి యోసేపు, పోతీఫరు భార్య గురించిన వృత్తాంతం. “నేను యెహోవాను ఎంతగా ప్రేమిస్తున్నానో నేను గుర్తుచేసుకున్నంత కాలం, ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపం చేస్తానని నేను భయపడనక్కర్లేదు” అని ఆమె చెబుతోంది.

దేవుని శాసనాలను లక్ష్యపెట్టండి

16. బైబిల్లో ప్రస్తావించబడిన వ్యక్తుల జీవితాలను సమీక్షించి, ధ్యానించడం ద్వారా మనమెలా ప్రయోజనం పొందవచ్చు?

16 యెహోవా మనకోసం లేఖనాల్లో ఫలాన వృత్తాంతాలను ఎందుకు భద్రపరిచాడో అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం ద్వారా మనమందరం ఆయన ప్రమాణాలపట్ల కృతజ్ఞతను పెంచుకోవచ్చు. అవి మనకేమి బోధిస్తున్నాయి? బైబిలు వ్యక్తులు కనబరచిన ఏ లక్షణాలు లేదా స్వభావాలు మనం అనుకరించాలి లేదా విసర్జించాలి? అక్షరార్థంగా వేలాదిమంది దేవుని వాక్యంలో పేర్కొనబడ్డారు. దేవుని ఉపదేశాన్ని ప్రేమించేవారందరూ, యెహోవా జాగ్రత్తగా భద్రపరచిన ఉదాహరణల నుండి మనం నేర్చుకోగల పాఠాలతోపాటు, రక్షణదాయకమైన జ్ఞానం విషయంలో తృష్ణను వృద్ధిచేసుకోవాలి. మనం నేర్చుకోవాల్సిన పాఠాలున్న అలాంటి వ్యక్తుల వృత్తాంతాలకు సంబంధించిన ఆర్టికల్స్‌ను ఈ పత్రిక తరచూ ప్రచురించింది. వాటిని సమీక్షించేందుకు సమయమెందుకు కేటాయించకూడదు?

17. యెహోవా శాసనాల విషయంలో మీరేమనుకుంటున్నారు, ఎందుకలా అనుకుంటున్నారు?

17 తన చిత్తం చేసేందుకు కృషిచేస్తున్న వారిపట్ల యెహోవా కనబరిచే ప్రేమపూర్వక శ్రద్ధపట్ల మనమెంత కృతజ్ఞత కలిగివుండవచ్చో కదా! బైబిల్లో ప్రస్తావించబడిన స్త్రీపురుషులు ఎలా పరిపూర్ణులు కారో అలాగే మనమూ ఖచ్చితంగా పరిపూర్ణులం కాదు. అయితే, వారి క్రియల వ్రాతపూర్వక చరిత్ర మనకెంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దేవుని శాసనాలను లక్ష్యపెట్టడం ద్వారా మనం ఘోరమైన తప్పిదాలను తప్పించుకోవడమే కాక, నీతిమార్గాల్లో నడిచినవారి చక్కని మాదిరిని కూడా అనుకరించవచ్చు. మనమలా చేసినప్పుడు, మనం కూడా కీర్తనకర్తలాగే ఇలా పాడగలుగుతాం: “ఆయన [యెహోవా] శాసనములను గైకొనుచు పూర్ణహృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. నేను నీ శాసనములనుబట్టి ప్రవర్తించుచున్నాను అవి నాకు అతి ప్రియములు.”​—కీర్తన 119:2, 167.

[అధస్సూచీలు]

a యెహోవాసాక్షుల వార్షిక పుస్తకము 1996 (ఆంగ్లం)లో, 160-2 పేజీలు చూడండి.

b పేరు మార్చబడింది.

మీరెలా జవాబిస్తారు?

• సౌలుపట్ల దావీదుకున్న దృక్పథం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

• అననీయ, సప్పీరాల వృత్తాంతం మనకేమి బోధిస్తోంది?

• యోసేపు వృత్తాంతం మనకెందుకు నేడు ప్రత్యేకంగా ఆసక్తికరంగా ఉంది?

[26వ పేజీలోని చిత్రం]

సౌలు చంపబడేందుకు దావీదు ఎందుకు నిరాకరించాడు?

[27వ పేజీలోని చిత్రం]

అననీయ, సప్పీరాల వృత్తాంతం నుండి మనమేమి నేర్చుకుంటాం?

[28వ పేజీలోని చిత్రం]

ఏ కారణంచేత యోసేపు లైంగిక దుర్నీతిని తిరస్కరించాడు?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి