కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lv అధ్యా. 4 పేజీలు 41-55
  • అధికారంలో ఉన్నవారిని ఎందుకు గౌరవించాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అధికారంలో ఉన్నవారిని ఎందుకు గౌరవించాలి?
  • ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • గౌరవించడం ఎందుకు కష్టంగా ఉంటుంది?
  • అధికారంలో ఉన్నవారిని ఎందుకు గౌరవించాలి?
  • కుటుంబంలో అధికారాన్ని గౌరవించండి
  • సంఘంలో అధికారాన్ని గౌరవించండి
  • ప్రభుత్వాధికారుల్ని గౌరవించండి
  • అధికారాన్ని ఎందుకు గౌరవించాలి?
    దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి
  • మీపై అధికారం ఇవ్వబడిన వారిని సన్మానించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • అధికారాన్ని గూర్చి క్రైస్తవ దృక్పథము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • యెహోవా అధికారాన్ని అంగీకరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
మరిన్ని
‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
lv అధ్యా. 4 పేజీలు 41-55
కుటుంబానికి బోధిస్తున్న తండ్రి

4వ అధ్యాయం

అధికారంలోఉన్నవారిని ఎందుకు గౌరవించాలి?

‘అందరినీ సన్మానించండి.’ —1 పేతురు 2:17.

1, 2. (ఎ) అధికారంలో ఉన్నవారిని గౌరవించే విషయంలో కొన్నిసార్లు మనకెలా అనిపిస్తుంది? (బి) మనం ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోబోతున్నాం?

అమ్మ ఏదైనా ఇష్టంలేని పని చెప్తే చిన్నపిల్లవాడు మొహం ఎలా పెడతాడో మీరెప్పుడైనా చూశారా? ఆ పని చేయడం వాడికి అస్సలు ఇష్టం లేకపోయినా అమ్మ చెప్పింది కాబట్టి చేస్తాడు. ఎందుకంటే అమ్మ మాట వినాలని వాడికి తెలుసు. కొన్నిసార్లు మనకూ అలాంటి పరిస్థితే ఎదురవుతుంది.

2 అధికారంలో ఉన్నవారి మాట వినడం మనకప్పుడప్పుడూ రుచించదు. కొన్నిసార్లు మీకూ అలాగే అనిపిస్తుందా? అయితే, మీరొక్కరే కాదు చాలామంది అలాగే అనుకుంటారు. మన కాలంలోనైతే ఎవ్వరూ ఎవ్వరి మాటా వినేటట్టు లేరు. అయినా, మనపై అధికారం ఉన్నవారిని మనం గౌరవించాలని బైబిలు చెబుతోంది.a (సామెతలు 24:21) మనం దేవుని ప్రేమలో నిలిచివుండాలంటే వారిని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటప్పుడు సహజంగానే మన మనసులో కొన్ని సందేహాలు తలెత్తుతాయి. అధికారంలో ఉన్నవారిని గౌరవించడం మనకు ఎందుకు కష్టంగా ఉంటుంది? యెహోవా దీన్ని ఎందుకు ఒక ఆజ్ఞగా ఇచ్చాడు? మనం మనస్ఫూర్తిగా గౌరవించేలా మనకు సహాయం చేసేవి ఏమిటి? ఏయే విధాలుగా మనం గౌరవం చూపించవచ్చు?

గౌరవించడం ఎందుకు కష్టంగా ఉంటుంది?

3, 4. (ఎ) అపరిపూర్ణత, పాపం ఎలా వచ్చాయి? (బి) మన అపరిపూర్ణత వల్ల అధికారానికి లోబడడం ఎందుకు కష్టమౌతుంది?

3 అధికారంలో ఉన్నవారిని గౌరవించడం ఎందుకు కష్టంగా ఉంటుందో తెలుసుకుందాం. దానికి ముఖ్యంగా రెండు కారణాలున్నాయి. (1) మనం అపరిపూర్ణులం. (2) అధికారంలో ఉన్న మానవులు కూడా అపరిపూర్ణులే. ఆదాముహవ్వలు ఏదెను తోటలో దేవుని అధికారంపై తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళు అపరిపూర్ణులు, పాపులు అయ్యారు. అంటే తిరుగుబాటు చేయడంతో పాపం పుట్టింది. అందుకే మనలో కూడా చిన్నప్పటినుండే అలాంటి తిరుగుబాటు స్వభావం కనిపిస్తుంది.—ఆదికాండము 2:15-17; 3:1-7; కీర్తన 51:5; రోమీయులు 5:12.

4 మనలో అపరిపూర్ణత ఉన్నందువల్లే గర్వం, అహంకారం లాంటివి సులభంగా పొడచూపుతాయి. అదే వినయమైతే మనం కష్టపడి దాన్ని అలవర్చుకుని, ఆ మంచి గుణాన్ని కోల్పోకుండా చూసుకోవాల్సొస్తుంది. మనమెన్నో ఏళ్ళుగా దేవునికి సేవచేస్తున్నా కొన్నిసార్లు మొండిగా, గర్వంగా తయారవ్వవచ్చు. కోరహు విషయమే తీసుకోండి. ఆయన యెహోవా ప్రజలతో పాటు అనేక కష్టాలు అనుభవించినా నమ్మకంగానే ఉన్నాడు. అయితే, ఆయన అధికారం కోసం ప్రాకులాడి, అహంకారంతో ప్రజల్ని రెచ్చగొట్టి, మిక్కిలి సాత్వికుడైన మోషేపై తిరుగుబాటు చేశాడు. (సంఖ్యాకాండము 12:3; 16:1-3) ఉజ్జియా కూడా ఏమి చేశాడో చూడండి. గర్వంతో యెహోవా ఆలయానికి వెళ్లి యాజకులు మాత్రమే చేయాల్సిన పని చేశాడు. (2 దినవృత్తాంతములు 26:16-21) అలాంటి తిరుగుబాటుదారులను దేవుడు కఠినంగా శిక్షించాడు. వాళ్ల చెడు ప్రవర్తన మనకు హెచ్చరికగా ఉండాలి. ఒకవేళ అధికారాన్ని ఎదిరించేంత గర్వం మనలో ఉంటే మన స్వభావాన్ని మార్చుకోవాలి.

5. అపరిపూర్ణ మానవులు అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేశారు?

5 ఇంకో విషయమేమిటంటే అధికారంలో ఉన్న అపరిపూర్ణ మానవులు చేసే పనుల్నిబట్టి కూడా వారిని గౌరవించాలనిపించదు. ఎందుకంటే చాలామంది తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, ప్రజల్ని పీడిస్తూ, క్రూరంగా ప్రవర్తిస్తారు. ఇప్పుడే కాదు చరిత్రంతటిలో అలాంటివాళ్ళు ఎంతోమంది కనిపిస్తారు. (ప్రసంగి 8:9 చదవండి.) ఉదాహరణకు, దేవుడు సౌలును రాజుగా ఎంపిక చేసే సమయానికి ఆయన మంచివాడు, వినయస్థుడు. కానీ తర్వాత అహంకారిగా, అసూయాపరునిగా మారి, నమ్మకస్థుడైన దావీదును హింసించాడు. (1 సమూయేలు 9:20, 21; 10:20-22; 18:7-11) ఆయన తర్వాత రాజైన దావీదు ఎంతో చక్కగా పరిపాలించి, మంచి రాజు అనిపించుకున్నాడు. అయినా తన అధికారాన్ని దుర్వినియోగం చేసి హిత్తీయుడైన ఊరియా భార్యతో శయనించడమే కాక, కుట్రపన్ని ఆ అమాయకుణ్ణి యుద్ధపంక్తిలో ముందు నిలబెట్టి ఆయన చావుకు కారణమయ్యాడు. (2 సమూయేలు 11:1-17) అవును, అపరిపూర్ణ మానవులకు అధికారమిస్తే వారు దాన్ని సరిగ్గా ఉపయోగించలేరు. అంతేగాక అధికారంలో ఉన్నవారికి యెహోవా మీద గౌరవం లేకపోతే వాళ్ళింకా ఘోరంగా ప్రవర్తిస్తారు. బ్రిటన్‌లోని ఒక రాజకీయవేత్త మాట్లాడుతూ, ‘క్యాథలిక్‌ పోపులు అధికార దుర్వినియోగం చేసి అనేకమందిని అణగద్రొక్కి హింసల పాలుచేశారు’ అని అన్నాడు. దీనంతటిని బట్టి చూస్తే, ‘మనం అధికారంలో ఉన్నవారిని ఎందుకు గౌరవించాలి’ అనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా? దానికి మనమిప్పుడు జవాబు చూద్దాం.

అధికారంలో ఉన్నవారిని ఎందుకు గౌరవించాలి?

6, 7. (ఎ) యెహోవామీద ప్రేమ ఉంటే మనమేం చేస్తాం? ఎందుకు? (బి) అధికారాన్ని గౌరవించడం అంటే ఏమిటి?

6 అధికారంలో ఉన్నవారిని గౌరవించడానికి ఒక మంచి కారణం ప్రేమ. యెహోవామీద, ఇతరులమీద, చివరికి మనమీద మనకు ప్రేమ ఉంటే మనం వారిని గౌరవిస్తాం. అందరికన్నా ఎక్కువగా మనం యెహోవాను ప్రేమిస్తాం కాబట్టి ఆయనకు సంతోషం కలిగించే పనులే చేయాలనుకుంటాం. (సామెతలు 27:11; మార్కు 12:29, 30 చదవండి.) ఏదెను తోటలో తిరుగుబాటు జరిగినప్పుడు విశ్వాన్ని పరిపాలించే ఆయన అధికారం సవాలు చేయబడింది. అప్పట్నుంచి చాలామంది సాతాను పక్షం వహించి యెహోవా అధికారాన్ని తిరస్కరించారని మనకు తెలుసు. కానీ, మనం మాత్రం సంతోషంగా యెహోవా పక్షాన ఉంటాం. ప్రకటన 4:10, 11 లోని మహత్తరమైన మాటలు చదివినప్పుడు మన హృదయంలో కూడా ఆ మాటలే మారుమ్రోగుతాయి. యెహోవాయే ఈ విశ్వ పరిపాలకుడన్న విషయాన్ని ఆ వచనం ఎంత స్పష్టంగా చెబుతుందో కదా! అందుకే మనం యెహోవా అధికారాన్ని ఒప్పుకొని, అనుదిన జీవితంలో ఆయనకు లోబడతాం.

7 అధికారాన్ని గౌరవించడం అంటే మాట వినడం మాత్రమే కాదు. యెహోవా మీద మనకు ప్రేమ ఉంది కాబట్టి ఆయన చెప్పింది చేస్తాం. అయితే కొన్నిసార్లు మనకది కష్టంగా ఉంటుంది. అలా అనిపించినప్పుడు మనం మొదటి పేరాలో చూసిన పిల్లవాడిలాగే లోబడడం నేర్చుకోవాలి. కొన్నిసార్లు లోబడడం కష్టంగా అనిపించినా యేసు, తన తండ్రి చిత్తం చేయకుండా ఉండలేదు. ఆయన తన తండ్రితో, “నా ఇష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక” అన్నాడు.—లూకా 22:42.

8. (ఎ) నేడు మనమెలా యెహోవా అధికారానికి లోబడతాం? యెహోవా దాన్నెలా పరిగణిస్తాడు? (బి) ఉపదేశాన్ని విని, అంగీకరించడానికి మనకేది సహాయం చేస్తుంది? (52-53 పేజీల్లో ఉన్న బాక్సు చూడండి.)

8 నేడు యెహోవా స్వయంగా వచ్చి మనతో మాట్లాడడు. బదులుగా తన వాక్యం ద్వారా, భూమ్మీదున్న తన ప్రతినిధుల ద్వారా నిర్దేశాలిస్తాడు. కాబట్టి ఆయన నియమించిన లేదా ప్రస్తుతానికి అధికారంలో ఉండనిచ్చిన వారిని గౌరవించడం ద్వారా యెహోవా అధికారానికి మనం లోబడతాం. ఒకవేళ వారు బైబిలు చూపించి సరిదిద్దినప్పుడు దాన్ని అంగీకరించకుండా ఎదురు తిరిగితే మనం దేవుణ్ణి అవమానించినట్లవుతుంది. ఇశ్రాయేలీయులు మోషే విషయంలో సణిగి, ఎదురు తిరిగినప్పుడు వాళ్ళు మోషేపై కాదు తనమీదే తిరగబడ్డారని యెహోవా అన్నాడు.—సంఖ్యాకాండము 14:26, 27.

9. తోటివారిమీద ప్రేమ ఉంటే అధికారంలో ఉన్నవారిని ఎందుకు గౌరవిస్తాం? ఉదాహరణతో చెప్పండి.

9 తోటివారిమీద ప్రేమ ఉంటే కూడా అధికారంలో ఉన్నవారిని గౌరవిస్తాం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. మీరొక సైనికుడిగా పనిచేస్తున్నారనుకోండి. సైన్యంలో ప్రతీ ఒక్కరూ తమ పైఅధికారి ఆజ్ఞకు లోబడాలి. వారిలో ఏ ఒక్కరు లోబడకపోయినా మొత్తం సైన్యానికే ముప్పు రావచ్చు. నేడు సైనిక దళాలు ప్రపంచంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయన్న మాట నిజమే. కానీ యెహోవా సైన్యాలైతే మనకు మేలే చేస్తాయి. దేవుణ్ణి “సైన్యముల కధిపతియగు యెహోవా” అని బైబిలు వందలసార్లు పిలుస్తుంది. (1 సమూయేలు 1:3) పరలోకంలో పరాక్రమవంతులైన వేవేల దేవదూతలకు దేవుడు అధిపతిగా ఉన్నాడు. కొన్నిసార్లు యెహోవా భూమ్మీదున్న తన సేవకుల్ని కూడా సైన్యంతో పోల్చాడు. (కీర్తన 68:11; యెహెజ్కేలు 37:1-10) యెహోవా మనపై అధికారులుగా ఉంచినవారికి లోబడకపోతే మనం కూడా మన సహోదరులను ప్రమాదంలో పడేసినవారమవుతాం. ఒక పిల్లవాడు పెద్దల మాట వినకపోతే కుటుంబంలో అందరూ బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఒక క్రైస్తవుడు సంఘంలో నియమిత పెద్దలకు లోబడకపోతే సంఘంలోని ఇతరులకూ ఇబ్బంది కలగవచ్చు. (1 కొరింథీయులు 12:14, 24-26) కాబట్టి అధికారంలో ఉన్నవారిని గౌరవిస్తూ, వారికి సహకరించడం ద్వారా మనకు ఇతరుల మీద ప్రేమ ఉందని చూపిస్తాం.

10, 11. అధికారంలో ఉన్నవారికి మనమెందుకు లోబడాలి?

10 అధికారంలో ఉన్నవారికి లోబడితే మనకే మంచిది. అధికారానికి లోబడమని చెప్పిన చాలా సందర్భాల్లో యెహోవా, దానివల్ల వచ్చే ప్రయోజనాల గురించి కూడా చెప్పాడు. ఉదాహరణకు, పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలని ఆజ్ఞాపించడమే కాక, వాళ్ళలా లోబడితే సంతోషంగా, ఎక్కువ కాలం జీవిస్తారని చెప్పాడు. (ద్వితీయోపదేశకాండము 5:16; ఎఫెసీయులు 6:2, 3) దేవునితో మనకున్న సంబంధం పాడవకుండా ఉండాలంటే మనం సంఘ పెద్దలను గౌరవించాలని కూడా చెప్పాడు. (హెబ్రీయులు 13:7, 17) మన మేలు కొరకే ప్రభుత్వాధికారులకు లోబడమని చెప్పాడు.—రోమీయులు 13:3, 4.

11 అధికారులకు లోబడమని యెహోవా మనకెందుకు చెబుతున్నాడో తెలుసుకున్న తర్వాత అలా లోబడడం అంత కష్టం కాదని మీరు అంగీకరించరా? కాబట్టి మనమిప్పుడు ముఖ్యంగా మన జీవితంలో ఏ మూడు రంగాల్లో అధికారంలో ఉన్నవారిని గౌరవించాలో తెలుసుకుందాం.

కుటుంబంలో అధికారాన్ని గౌరవించండి

12. (ఎ) కుటుంబంలో భర్తకు యెహోవా ఏ అధికారాన్ని ఇచ్చాడు? (బి) భర్త తన బాధ్యతల్ని ఎలా నిర్వర్తించాలి?

12 యెహోవా దేవుడే ఈ కుటుంబ వ్యవస్థను ఏర్పరిచాడు. అన్నీ క్రమపద్ధతిలో ఉండేలా చూసే దేవుడు కుటుంబం కూడా చక్కగా నడిచే ఏర్పాటు చేశాడు. (1 కొరింథీయులు 14:33) కుటుంబాన్ని నడిపించే అధికారాన్ని దేవుడు భర్తకిచ్చాడు. క్రీస్తు సంఘాన్ని ప్రేమగా చూసుకున్నట్లే, భర్త తన కుటుంబాన్ని ప్రేమగా చూసుకుంటూ తనకు శిరస్సుగా ఉన్న క్రీస్తుయేసు పట్ల గౌరవం చూపిస్తాడు. (ఎఫెసీయులు 5:23) భర్త తన బాధ్యతల్ని విస్మరించకూడదు, వాటిని సక్రమంగా నిర్వర్తించాలి. అలాగని ఆయన కఠినంగా, క్రూరంగా కాదుగానీ తన కుటుంబ సభ్యులతో ప్రేమగా, వారిని అర్థంచేసుకుంటూ, దయగా ప్రవర్తించాలి. తనకెంత అధికారం ఉన్నా అది యెహోవా దేవుని అధికారం కంటే ఎక్కువ కాదని కూడా ఆయన గుర్తుంచుకోవాలి.

క్రీస్తులాగే క్రైస్తవ భర్త ప్రేమతో తన అధికారాన్ని ఉపయోగిస్తాడు

13. భార్య తన బాధ్యతల్ని ఎలా నిర్వర్తిస్తే యెహోవా సంతోషిస్తాడు?

13 భార్య తన భర్తకు సాటియైన సహకారిగా ఉండాలి. కుటుంబంలో ఆమెకు కూడా కొంత అధికారం ఉంది. ఎందుకంటే పిల్లలు “తల్లి చెప్పు బోధను త్రోసివేయకూడదు” అని బైబిలు చెబుతోంది. (సామెతలు 1:8) అయితే ఆమెకు భర్తకున్నంత అధికారం ఉండదు. క్రైస్తవ భార్య కుటుంబాన్ని నడిపించడంలో భర్తకు సహాయంచేస్తూ ఆయన అధికారం పట్ల గౌరవం చూపిస్తుంది. భర్తను కించపర్చదు, తెలివిగా తన దారికి తెచ్చుకోవాలని ప్రయత్నించదు లేదా పెత్తనం చెలాయించదు. బదులుగా తన భర్తకు మద్దతిస్తూ సహకరిస్తుంది. ఒకవేళ భర్త తీసుకున్న నిర్ణయాలు ఆమెకు ఇష్టం లేకపోతే తన అభిప్రాయమేమిటో గౌరవపూర్వకంగా వివరించి, ఆ తర్వాత ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా లోబడుతుంది. ఆమె భర్త అవిశ్వాసి అయితే ఆమెకు కొన్ని సమస్యలు ఎదురవ్వవచ్చు, అయినప్పటికీ ఆమె తన భర్తకు లోబడివుంటే ఆయన యెహోవా సేవకుడయ్యే అవకాశముంది.—1 పేతురు 3:1 చదవండి.

బురదతో ఇళ్లంతా పాడుచేసిన కొడుకును ప్రేమతో సరిదిద్దుతున్న తండ్రి

14. పిల్లలు తమ తల్లిదండ్రుల్ని, యెహోవాను ఎలా సంతోషపెట్టవచ్చు?

14 పిల్లలు తల్లిదండ్రుల మాట విన్నప్పుడు యెహోవాను సంతోషపెడతారు. అలాగే తల్లిదండ్రులను కూడా సంతోషపెట్టి, వారికి మంచి పేరు తీసుకొస్తారు. (సామెతలు 10:1) తల్లి లేదా తండ్రి మాత్రమే ఉన్న పిల్లలు కూడా ఇంట్లో తమ మద్దతు ఇంకా ఎక్కువ అవసరమని గుర్తించి వారికి లోబడివుంటారు. కుటుంబంలో అందరూ దేవుడు తమకిచ్చిన బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తిస్తే ఆ గృహంలో సుఖశాంతులు విలసిల్లుతాయి. అలాంటి కుటుంబాలు, కుటుంబ వ్యవస్థనే స్థాపించిన యెహోవా దేవునికి ఘనతను తీసుకువస్తాయి.—ఎఫెసీయులు 3:14, 15.

సంఘంలో అధికారాన్ని గౌరవించండి

15. (ఎ) సంఘంలో యెహోవా అధికారాన్ని గౌరవిస్తున్నామని ఎలా చూపించవచ్చు? (బి) అధికారం ఉన్నవారికి లోబడడానికి మనకెలాంటి సూత్రాలు సహాయం చేస్తాయి? (54-55 పేజీల్లోని బాక్సు చూడండి.)

15 యెహోవా దేవుడు తన కుమారుణ్ణి క్రైస్తవ సంఘంపై రాజుగా నియమించాడు. (కొలొస్సయులు 1:13) యేసు భూమిపైనున్న దేవుని ప్రజల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడానికి ‘నమ్మకమైనవాడు బుద్ధిమంతుడైన దాసుడిని’ నియమించాడు. (మత్తయి 24:45-47) యెహోవాసాక్షుల పరిపాలక సభే ఆ దాసుడు. మొదటి శతాబ్దంలోని క్రైస్తవ సంఘాల్లో జరిగినట్లే, నేడు కూడా సంఘాల్లోని పెద్దలకు పరిపాలక సభ ఉత్తరాల ద్వారా, వారి ప్రతినిధులైన ప్రయాణ పైవిచారణకర్తల ద్వారా ఉపదేశాన్ని, నిర్దేశాల్ని ఇస్తుంది. మనం క్రైస్తవ పెద్దల అధికారాన్ని గౌరవిస్తే యెహోవాను గౌరవించినట్టే.—1 థెస్సలొనీకయులు 5:12; హెబ్రీయులు 13:17 చదవండి.

16. దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తితో పెద్దల్ని నియమించడమంటే ఏమిటి?

16 పెద్దలు, పరిచర్య సేవకులు పరిపూర్ణులు కాదు. మనలాగే వాళ్ళు కూడా తప్పులు చేస్తారు. అయినప్పటికీ, సంఘ సభ్యులందరూ తనతో సన్నిహిత సంబంధాన్ని కలిగివుండేలా సహాయం చేయడానికి యెహోవా పెద్దల్ని, పరిచర్య సేవకుల్ని ‘మనుష్యులకు ఈవులుగా’ అనుగ్రహించాడు. (ఎఫెసీయులు 4:8) దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తితో పెద్దల్ని నియమిస్తాడు. (అపొస్తలుల కార్యములు 20:28) అంటే ఏమిటి? అంటే దేవుని పరిశుద్ధాత్మ శక్తి సహాయంతో రాయబడిన బైబిల్లోని అర్హతల్ని ఆ సహోదరులు సంపాదించుకోవాలి. (1 తిమోతి 3:1-7, 12; తీతు 1:5-9) అంతేగాక, ఒక సహోదరుడు అర్హుడో కాదో నిర్ణయించే ముందు పెద్దలు యెహోవా పరిశుద్ధాత్మ శక్తి నడిపింపు కోసం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారు.

17. సంఘ కూటాలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు క్రైస్తవ స్త్రీలు ఎందుకు ముసుగు వేసుకోవాలి?

17 సంఘంలో సాధారణంగా క్షేత్ర పరిచర్య కూటాన్ని నిర్వహించడం వంటివాటిని పెద్దలు, పరిచర్య సేవకులే చేయాలి. వారు లేని సందర్భాల్లో బాప్తిస్మం తీసుకున్న వేరే సహోదరులు వాటిని నిర్వహించాలి. సహోదరులు ఎవరూ లేకపోతే అర్హత ఉన్న క్రైస్తవ సహోదరీలు వాటిని నిర్వహిస్తారు. కానీ బాప్తిస్మం తీసుకున్న సహోదరులు చేయాల్సినవి సహోదరీలు చేస్తున్నప్పుడు తలపై ముసుగు వేసుకోవాలి.b (1 కొరింథీయులు 11:3-10) అలా ముసుగు వేసుకున్నప్పుడు ఒక స్త్రీ కుటుంబంలోనూ, సంఘంలోనూ పురుషులకు యెహోవా ఇచ్చిన అధికారాన్ని గౌరవిస్తుంది.

ప్రభుత్వాధికారుల్ని గౌరవించండి

18, 19. (ఎ) రోమీయులు 13:1-7 లోని సూత్రాలను సొంత మాట్లలో వివరించండి. (బి) ప్రభుత్వాధికారులను మనమెలా గౌరవించాలి?

18 నిజక్రైస్తవులు రోమీయులు 13:1-7 వచనాల్లోని సూత్రాలను జాగ్రత్తగా పాటిస్తారు. (చదవండి.) ఆ వచనాలను చదివినప్పుడు అక్కడ ప్రస్తావించబడిన “పై అధికారులు” ప్రభుత్వాధికారులని మీకు అర్థమౌతుంది. యెహోవా అనుమతించినంత కాలం వారు కొంతమేర సమాజంలో శాంతిభద్రతల్ని పరిరక్షిస్తూ, మనకవసరమైన కొన్ని సేవలు అందిస్తుంటారు. వారు విధించిన నియమాలను పాటించడం ద్వారా వారిపట్ల గౌరవం చూపిస్తాం. చెల్లించాల్సిన పన్నులన్నీ చెల్లిస్తాం, ప్రభుత్వ నియమానుసారం నింపాల్సిన దస్తావేజుల్లో, పత్రాల్లో సరైన వివరాలు నింపుతాం. మనకు, కుటుంబానికి, వ్యాపారానికి, స్థిరచరాస్తులకు సంబంధించిన నియమాలేవైనా ఉంటే జాగ్రత్తగా పాటిస్తాం. కానీ, దేవుని నియమాలకు విరుద్ధమైనది చేయమని చెప్పినప్పుడు మాత్రం మనం ప్రభుత్వాలకు లోబడం. బదులుగా పూర్వం అపొస్తలులు చెప్పినట్టే ‘మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడాలి’ అని చెబుతాం.—అపొస్తలుల కార్యములు 5:28, 29; 48వ పేజీలోవున్న “నేను ఎవరి అధికారానికి లోబడాలి?” అనే బాక్సు చూడండి.

నేను ఎవరి అధికారానికి లోబడాలి?

సూత్రం: “యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు.”—యెషయా 33:22.

ఈ ప్రశ్నలు వేసుకోండి . . .

  • యెహోవా సూత్రాలకు విరుద్ధమైనది చేయమని ఎవరైనా నన్నడిగితే నేనేం చేయాలి?—మత్తయి 22:37-39; 26:52; యోహాను 18:36.

  • యెహోవా చెప్పింది చేయకూడదని ఎవరైనా నన్ను ఆదేశిస్తే నేనేం చేయాలి?—అపొస్తలుల కార్యములు 5:27-29; హెబ్రీయులు 10:24, 25.

  • అధికారంలో ఉన్నవారిని నేనెందుకు గౌరవించాలి?—రోమీయులు 13:1-4; 1 కొరింథీయులు 11:3; ఎఫెసీయులు 6:1-3.

19 మన ప్రవర్తనలో కూడా ప్రభుత్వాధికారులపట్ల గౌరవం చూపించాలి. కొన్నిసార్లు మనం నేరుగా వారితో మాట్లాడాల్సిరావచ్చు. అపొస్తలుడైన పౌలు అగ్రిప్ప రాజుతో, అధిపతియైన ఫేస్తుతో మాట్లాడాడు. వాళ్ళిద్దరూ ఘోరమైన తప్పులు చేసినా పౌలు వారితో గౌరవంగానే మాట్లాడాడు. (అపొస్తలుల కార్యములు 26:2, 25) మనం దేశాధ్యక్షుడితో మాట్లాడినా లేక మామూలు పోలీసుతో మాట్లాడినా పౌలులాగే గౌరవంగా మాట్లాడాలి. చదువుకునే క్రైస్తవ పిల్లలు తమ టీచర్లను, పాఠశాల అధికారులను, అక్కడ పనిచేసేవారిని గౌరవించాలి. యెహోవాసాక్షులముగా మనం, మన నమ్మకాల్ని గౌరవించేవారితో మాత్రమే కాదుగానీ, మనమంటే పడనివాళ్లతో కూడా మర్యాదగా ప్రవర్తించాలి. నిజం చెప్పాలంటే, మనం గౌరవంగా, మర్యాదగా ప్రవర్తించేవారమని అవిశ్వాసులు గుర్తించాలి.—రోమీయులు 12:17, 18 చదవండి; 1 పేతురు 3:15.

20, 21. అధికారంలో ఉన్నవారిని గౌరవించడంవల్ల కలిగే కొన్ని ప్రయోజనాలేమిటి?

20 ‘అందరిని సన్మానించండి’ అని అపొస్తలుడైన పేతురు చెప్పాడు. (1 పేతురు 2:17) ఆయన చెప్పినట్టుగా మనం అందరినీ మనస్ఫూర్తిగా గౌరవిద్దాం. మనం నిజంగా గౌరవం చూపించేవారమని ప్రజలు గమనించినప్పుడు వారికి మనపై సదభిప్రాయం ఏర్పడుతుంది. నేడు లోకంలో రోజురోజుకీ ఇతరులపట్ల గౌరవం తరిగిపోతోంది. కాబట్టి, “మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి” అని యేసు ఆజ్ఞాపించినట్లుగా ఇతరులను గౌరవిద్దాం.—మత్తయి 5:16.

21 ఆధ్యాత్మిక అంధకారంతో నిండిన ఈ లోకంలో మంచి మనసున్న ప్రజలు సత్యం వైపు ఆకర్షితులవుతారు. కాబట్టి కుటుంబంలో, సంఘంలో, ప్రభుత్వాధికారులపట్ల మనం చూపించే గౌరవ మర్యాదల్ని అలాంటివారు గమనించి, మనతోపాటు వెలుగుబాటలో నడవాలని నిర్ణయించుకోవచ్చు. నిజంగా అదే జరిగితే మనమెంత ఆనందిస్తామో కదా! ఒకవేళ అలా జరగకపోయినా ఒకటి మాత్రం నిజం. మనం ఇతరులను గౌరవిస్తే యెహోవా సంతోషిస్తాడు. మనమాయన ప్రేమలో నిలిచివుంటాం. మనకు అంతకన్నా ఎక్కువేం కావాలి?

a ఈ అధ్యాయంలో “అధికారం” గురించి మాట్లాడుతున్నప్పుడు అది ఇంట్లో, సంఘంలో, యెహోవాకు, యేసుక్రీస్తుకు, ప్రభుత్వాధికారులకు ఉన్న అధికారాన్ని సూచిస్తుంది.

b క్రైస్తవ స్త్రీలు ముసుగు ఎప్పుడు వేసుకోవాలో 239-242 పేజీల్లో వివరించబడింది.

‘ఆలోచన విని ఉపదేశాన్ని అంగీకరించండి’

నేడు లోకంలో సాతాను స్వభావం అంటే తిరగబడే తత్వం, తగువులాడే స్వభావమే ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే సాతానును “వాయుమండల సంబంధమైన అధిపతి” అని పిలుస్తూ, అతడే ‘అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపిస్తున్నాడు’ అని బైబిలు చెబుతోంది. (ఎఫెసీయులు 2:2) నేడు చాలామంది ఎవ్వరి అధికారానికీ లోబడకుండా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటున్నారు. విచారకరంగా క్రైస్తవ సంఘంలోని కొంతమంది అలాంటి స్వేచ్ఛనే కోరుకుంటున్నారు. ఉదాహరణకు ఒక పెద్ద, లైంగిక దుర్నీతి లేదా హింసాత్మక వినోదం గురించి ప్రేమతో మందలించినప్పుడు కొందరు దాన్ని ఇష్టపడకపోవచ్చు లేదా కోప్పడవచ్చు. ప్రతీ ఒక్కరం సామెతలు 19:20 లోని ఈ ఉపదేశాన్ని పాటించాలి: “నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము.”

అలా చేయడానికి మనకేది సహాయం చేస్తుంది? ప్రజలు సలహాను లేదా ఉపదేశాన్ని అంగీకరించకపోవడానికి గల మూడు కారణాలను పరిశీలించి, వాటి గురించి బైబిలు ఏమి చెబుతోందో గమనించండి.

  • “ఆ సలహా సరైనది కాదని నాకనిపిస్తోంది.” ఆ సలహా నాకు వర్తించదని లేదా అది ఇచ్చిన వ్యక్తి పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోలేదని మనకనిపించవచ్చు. దానితో మనమా సలహాను పెద్దగా పట్టించుకోకపోవచ్చు. (హెబ్రీయులు 12:5) మనందరం అపరిపూర్ణులం కాబట్టి, మన అభిప్రాయాన్నే సరిదిద్దుకోవాలేమో? (సామెతలు 19:2, 3) ఆ సలహా మనకివ్వబడేందుకు సరైన కారణమే ఉందేమో? అలాగైతే, మనలోని లోపాన్ని గుర్తించాలి. ‘ఉపదేశాన్ని విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాని పొందుము’ అని దేవుని వాక్యం చెబుతోంది.—సామెతలు 4:13.

  • “ఆయన చెప్పిన తీరు నాకు నచ్చలేదు.” నిజమే, ఉపదేశాన్ని సరైన విధంగా ఇవ్వాలని దేవుని వాక్యం చెబుతోంది. (గలతీయులు 6:1) అదే సమయంలో బైబిలు, “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు” అని కూడా చెబుతోంది. (రోమీయులు 3:23) ఏ లోపం లేని సరైన ఉపదేశం కేవలం ఒక పరిపూర్ణ మనిషే ఇవ్వగలడు. (యాకోబు 3:2) అయితే యెహోవా మనకు ఉపదేశమిచ్చి సరిదిద్దడానికి అపరిపూర్ణ మానవుల్ని ఉపయోగిస్తున్నాడు. కాబట్టి వారెలా మాట్లాడుతున్నారో చూడడంకన్నా వారేమి చెబుతున్నారో వినడం మంచిది. ఆ తర్వాత దాన్ని ఎలా అన్వయించుకోవాలో ప్రార్థనాపూర్వకంగా ఆలోచించండి.

  • “నన్ను సరిదిద్దే అర్హత ఆయనకు లేదు!” మనల్ని సరిదిద్దే వ్యక్తిలో తప్పుల్ని చూసి ఆయనకు ఆ అర్హత లేదనుకుంటే పైన ప్రస్తావించబడిన విషయాల్ని గుర్తుంచుకోవాలి. అంతేగాక, మనం ఆ వ్యక్తి కన్నా పెద్దవాళ్లం, ఎక్కువ అనుభవం ఉంది లేక సంఘంలో బాధ్యతలు ఎక్కువున్నాయి కాబట్టి, మనకు చెప్పే అర్హత ఆయనకు లేదనుకుంటే మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. పూర్వం ఇశ్రాయేలులో రాజుకు ఎంతో అధికారమున్నా ప్రవక్తలు, యాజకులు, రాజ్యంలో ఇతరులు చెప్పేది వినాలి. (2 సమూయేలు 12:1-13; 2 దినవృత్తాంతములు 26:16-20) నేడు కూడా యెహోవా సంస్థ, మనల్ని సరిదిద్దడానికి అపరిపూర్ణ మానవుల్నే నియమిస్తుంది. పరిణతి గల క్రైస్తవులు వారి మాట విని వారిచ్చే సలహాను పాటిస్తారు. ఒకవేళ మనకు ఇతరులకన్నా ఎక్కువ అనుభవం, బాధ్యతలుంటే, ఆ సలహాను అంగీకరించి పాటించేంత వివేచన, వినయం కూడా అంతే ఎక్కువగా ఉండాలి.—1 తిమోతి 3:2, 3; తీతు 3:2.

నిజానికి దిద్దుబాటు అవసరం లేనివారంటూ ఎవరూ ఉండరు. కాబట్టి, మనల్ని ఎవరైనా సరిదిద్దినప్పుడు వెంటనే దాన్ని అంగీకరించి, వినయంగా అన్వయించుకుని, యెహోవా మనల్ని కాపాడడానికి ఇంత చక్కని ఏర్పాటు చేసినందుకు ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాలని తీర్మానించుకుందాం. యెహోవాకు మనమీద ప్రేమ ఉంది కాబట్టే ఆయన మనల్ని సరిదిద్దుతాడు. ఆయన ప్రేమలో నిలిచివుండాలని మనం కోరుకుంటాం.—హెబ్రీయులు 12:4-11.

‘మీపై నాయకులుగా ఉన్నవారికి లోబడివుండండి’

భీకరారణ్యంలో లక్షలాదిమంది ఇశ్రాయేలీయులను మోషే ఒక్కడే నడిపిస్తున్నాడు. వారందరి సమస్యల్ని పరిష్కరించడం ఆయనకు తలకు మించిన భారంగా ఉంది. అందుకే వెంటనే ఆయనొక ఏర్పాటు చేయాల్సొచ్చింది. ఏంటది? మోషే ‘ఇశ్రాయేలీయులందరిలో సామర్థ్యంగల మనుష్యులను ఏర్పరచుకొని, వెయ్యిమందికి ఒకరిని, నూరుమందికి ఒకరిని, ఏబదిమందికి ఒకరిని, పదిమందికి ఒకరిని చొప్పున న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజలమీద ప్రధానులనుగా నియమించాడు.’—నిర్గమకాండము 18:25.

నేడు క్రైస్తవ సంఘంలో కూడా ఒక క్రమపద్ధతిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే, ప్రతీ క్షేత్రసేవా గ్రూపుకు ఒక పైవిచారణకర్త, సంఘంలో కొంతమంది పెద్దలు, కొన్ని సంఘాలకు ఒక ప్రాంతీయ పైవిచారణకర్త ఉంటారు. ఒక దేశంలో దేశపు కమిటీ లేదా బ్రాంచి కమిటీ ఉంటుంది. ఇంత మంచి ఏర్పాటు ఉన్నందువల్లే కాపరిగా ఉన్న ప్రతీ పెద్దా యెహోవా తనకప్పగించిన గొర్రెలను శ్రద్ధగా చూసుకోగలుగుతున్నారు. అలాంటి కాపరులు యెహోవాకు, క్రీస్తుకు జవాబుదారులుగా ఉంటారు.—అపొస్తలుల కార్యములు 20:28.

సంస్థలోని ఈ ఏర్పాటుకు మనందరం మనస్ఫూర్తిగా లోబడాలి. సంఘంలో పెద్దలుగా ఉన్నవారిని గౌరవించని దియొత్రెఫేలా మనమెప్పటికీ ఉండకూడదు. (3 యోహాను 9, 10) కానీ మనం, అపొస్తలుడైన పౌలు చెప్పినట్లే చేయాలనుకుంటాం. ఆయనిలా అన్నాడు: “మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్‌ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి.” (హెబ్రీయులు 13:17) కొంతమంది ఏమి చేస్తారంటే, పెద్దలు చెప్పింది వారికి నచ్చితేనే వింటారు, నచ్చకపోయినా లేదా ఎందుకు చెప్పారో అర్థంకాకపోయినా వాళ్ళు వినరు. కానీ లోబడడం అంటే ఇష్టమున్నా లేకపోయినా తలొగ్గడం అని గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రతీ ఒక్కరం ‘నా పైన నాయకులుగా ఉన్నవారి మాట విని, నేను వారికి లోబడుతున్నానా?’ అని ప్రశ్నించుకోవాలి.

సంఘం ఎలా నడవాలనే విషయంలో దేవుని వాక్యం ప్రతీ ఏర్పాటును, పద్ధతిని పూసగుచ్చినట్లు వివరించడంలేదు. అయినప్పటికీ, “సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనియ్యుడి” అని బైబిలు చెబుతోంది. (1 కొరింథీయులు 14:39, 40) పరిపాలక సభ ఈ సూత్రాన్ని మనసులో ఉంచుకునే, సంఘం సరిగ్గా నడవాలనే ఉద్దేశంతో వివిధ పద్ధతుల్ని ప్రవేశపెట్టి తగిన నిర్దేశాలను అందిస్తోంది. సంఘంలో బాధ్యతగల పురుషులు పరిపాలక సభ నిర్దేశాలను ఖచ్చితంగా పాటిస్తూ విధేయత విషయంలో మంచి మాదిరిగా ఉంటారు. అలాగే వారు తమమీద పైవిచారణ చేసేవారు చెప్పేదానికి సమ్మతిస్తూ, వారికి ‘సులభంగా లోబడతారు.’ (యాకోబు 3:17) అలా క్రమ పద్ధతిలో ఏర్పాటుచేయబడిన క్షేత్రసేవా గ్రూపు, సంఘం, ప్రాంతం, దేశంలోని విశ్వాసులు ఏకమనస్సుతో “శ్రీమంతుడగు [‘సంతోషంగా ఉండే,’ NW]” దేవుడైన యెహోవాను ఆరాధిస్తూ ఆయనకు ఘనతను తీసుకువస్తారు.—1 తిమోతి 1:8; 1 కొరింథీయులు 14:33.

అంతేగాక హెబ్రీయులు 13:17 లోనే పౌలు, మనం లోబడకపోతే జరిగే హాని గురించి కూడా చెప్పాడు. మనం లోబడకపోతే బాధ్యతగల సహోదరులు తమ పనిని “దుఃఖముతో” చేస్తారు. తమ సంరక్షణలోని గొర్రెలు సహకరించకుండా, తిరుగుబాటు చేస్తూ ఉంటే వారికి తమ బాధ్యతలు పవిత్ర సేవలో దొరికే సదవకాశాలుగా కాక మోయలేని భారంగా అనిపిస్తాయి. అలా జరిగితే “మీకు” అంటే సంఘం అంతటికీ హాని కలుగుతుంది. అలాగే సంఘ సభ్యులు, దేవుడు నియమించిన వ్యక్తుల్ని ధిక్కరిస్తే మరోరకంగా కూడా హాని కలుగుతుంది. ఒక వ్యక్తి ఎవరికీ లోబడనంత అహంకారియైతే యెహోవాతో ఆయనకున్న సంబంధం పాడై దేవునికి దూరమవుతాడు. (1 పేతురు 5:5) కాబట్టి మనందరం దేవుడు నియమించిన వారి మాట ఎల్లప్పుడూ వింటూ, వారికి లోబడుతూ ఉందాం.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి