అధికారాన్ని గూర్చి క్రైస్తవ దృక్పథము
“దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు.”—రోమీయులు 13:1.
1. సర్వోన్నత అధికారి యెహోవా అని ఎందుకు చెప్పవచ్చు?
అధికారం సృష్టికర్తకుగల హక్కుతో ముడిపెట్టబడి ఉంది. సృష్టంతటికి, సజీవ నిర్జీవమైన వాటన్నిటికీ, ఉనికినిచ్చిన సర్వోన్నతుడు యెహోవా దేవుడు. నిశ్చయంగా ఆయన సర్వోన్నత అధికారి. “ప్రభువా, (యెహోవా, NW.) మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవని” ప్రకటించే పరలోక జీవుల భావాలతో నిజక్రైస్తవులు ఏకీభవిస్తారు.—ప్రకటన 4:11.
2. తమ తోటి మానవులపై పరిపాలన చేసే స్వతఃసిద్ధ అధికారం తమకు లేదని తొలి మానవ పరిపాలకులు ఒక విధంగా ఎలా అంగీకరించారు, పొంతి పిలాతుకు యేసు ఏమి చెప్పాడు?
2 దేవుడనని లేక దేవుని ప్రతినిధినని చెప్పుకోవడం ద్వారా తమ అధికారం న్యాయసమ్మతమైందిగా చేసుకోవాలని అనేకమంది తొలి మానవ పరిపాలకులు ప్రయత్నించారన్న స్పష్టమైన వాస్తవమే, ఇతర మానవులపై పరిపాలన చేసే స్వతఃసిద్ధ అధికారం ఏ మానవునికి లేదనడానికి సూచనగా ఉంది.a (యిర్మీయా 10:23) అధికారానికి ఏకైక న్యాయపరమైన మూలం యెహోవా దేవుడే. యూదయకు రోమా అధిపతియైన పొంతి పిలాతుకు క్రీస్తు ఇలా చెప్పాడు: “పైనుండి నీకు ఇయ్యబడి యుంటేనే తప్ప నామీద నీకు ఏ అధికారమును ఉండదు.”—యోహాను 19:11.
“దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు”
3. “పైఅధికారుల”కు సంబంధించి అపొస్తలుడైన పౌలు ఏమని వ్యాఖ్యానించాడు, యేసు మరియు పౌలు చేసిన వ్యాఖ్యానాలు ఏ ప్రశ్నలను లేవదీస్తాయి?
3 రోమా సామ్రాజ్యాధిపత్యము క్రింద జీవిస్తున్న క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ప్రతివాడును పైఅధికారులకు లోబడియుండ వలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి.” (రోమీయులు 13:1) పిలాతుకు అధికారం “పైనుండి” అనుగ్రహించబడింది అని యేసు చెప్పినప్పుడు ఆయన భావమేమిటి? తన కాలంనాటి రాజకీయ అధికారాలు వాటి స్థానాల్లో దేవునిచేతనే నియమించబడ్డాయని పౌలు ఏ విధంగా భావిస్తున్నాడు? ఈ లోకంలోని ప్రతి రాజకీయ పరిపాలకుని నియామకానికి యెహోవాయే వ్యక్తిగతంగా బాధ్యుడని వారి భావమా?
4. యేసు మరియు పౌలు సాతానును ఏమని పిలిచారు, సాతాను చేసిన ఏ ఆరోపణను యేసు ఖండించలేదు?
4 సాతానును యేసు “ఈ లోకాధికారి” అని, అపొస్తలుడైన పౌలు “ఈ యుగ సంబంధమైన దేవత” అని పిలిచారు. కాబట్టి యిదెలా సాధ్యం కాగలదు? (యోహాను 12:31; 16:11; 2 కొరింథీయులు 4:4) అంతేగాక, సాతాను యేసును శోధించేటప్పుడు, ఈ అధికారం తనకు యివ్వబడిందని చెప్పుకుంటూ, “భూలోక రాజ్యములన్నిటి” పై యేసుకు “అధికారాన్ని” యిస్తానన్నాడు. యేసు అతనిచ్చినదాన్ని నిరాకరించాడు, కాని అలా యివ్వడానికి ఆ అధికారం సాతానుది కాదని ఆయన ఖండించలేదు.—లూకా 4:5-8.
5. (ఎ) మానవ అధికారాన్ని గూర్చి యేసు మరియు పౌలు చెప్పిన మాటలను మనం ఎలా అర్థం చేసుకోవాలి? (బి) ఏ భావంలో పైఅధికారులు “దేవుని వలననే నియమింపబడి” యున్నారు?
5 సాతాను తిరుగుబాటు చేసిన తర్వాత, అలాగే ఆదాము హవ్వలను శోధించి, ఆయన సర్వాధిపత్యాన్ని వారు ఎదిరించేలా చేసిన తర్వాత కూడా అతడిని జీవించి ఉండనివ్వడం ద్వారా యెహోవా సాతానుకు ఈ లోకంపై ఆధిపత్యాన్ని యిచ్చాడు. (ఆదికాండము 3:1-6; నిర్గమకాండము 9:15, 16ను పోల్చండి.) కాబట్టి, ఏదెను తోటలో మొదటి మానవ జత దైవపరిపాలనను లేక దేవుని పరిపాలనను నిరాకరించిన తర్వాత, అలా వేరైపోయిన మానవులు ఒక క్రమమైన సమాజంలో జీవించ గలిగేలా వారు అధికార వ్యవస్థలను ఏర్పరచుకోడానికి యెహోవా అనుమతించాడని యేసు మరియు పౌలు మాటల భావమైయుండాలి. కొన్నిసార్లు, తన సంకల్పాన్ని నెరవేర్చుకోడానికి యెహోవా కొంతమంది పాలకులు లేక ప్రభుత్వాలు పడిపోయేలా చేశాడు. (దానియేలు 2:19-21) ఇతరులను ఆయన అధికారంలో ఉండనిచ్చాడు. ఏ పాలకులనైతే యెహోవా ఉనికిలో ఉండనిస్తాడో, వారు “దేవునివలననే నియమింపబడి” యున్నారని చెప్పవచ్చును.
తొలి క్రైస్తవులు మరియు రోమా అధికారులు
6. రోమా అధికారులను తొలి క్రైస్తవులు ఎలా దృష్టించారు, ఎందుకు?
6 తొలి క్రైస్తవులు ఇశ్రాయేలును ఆక్రమిస్తున్న రోమన్లకు వ్యతిరేకంగా రాజద్రోహము తలపెట్టి, పోరాడిన యూదా తెగవారితో చేతులు కలపలేదు. వీలైనంత మట్టుకు సూత్రీకరించబడిన తమ చట్టవిధానంతో, రోమా అధికారులు తమ సామ్రాజ్య పరిధిలో భూమి మీద, సముద్రంపైనా శాంతిని నెలకొల్పారు; ఎన్నో ప్రయోజనకరమైన నీటి కాలువలను, మార్గాలను, వంతెనలను నిర్మించారు; సాధారణంగా సామాన్యుల సంక్షేమం కొరకు చర్యలు గైకొన్నారు, క్రైస్తవులు వారిని ‘తమకు మేలు కలుగుటకు దేవుని పరిచారకులు [లేక, “సేవకుడు,” అధఃస్సూచి]’ అని దృష్టించారు. (రోమీయులు 13:3, 4) యేసు ఆజ్ఞాపించినట్లుగా క్రైస్తవులు అంతటా సువార్త ప్రకటించడానికి శాంతి భద్రతలు తగిన వాతావరణాన్ని ఏర్పరచాయి. (మత్తయి 28:19, 20) కొంత డబ్బు దేవుడు అంగీకరించని పనుల కొరకు వాడబడినప్పటికీ, రోమన్లు విధించిన సుంకాన్ని వారు మంచి మనస్సాక్షితో చెల్లించేవారు.—రోమీయులు 13:5-7.
7, 8. (ఎ) రోమీయులు 13:1-7 వరకు జాగ్రత్తగా చదవడం దేన్ని వెల్లడి చేస్తుంది, ఆ సందర్భం ఏమి తెలియజేస్తుంది? (బి) ఏ పరిస్థితులలో రోమా అధికారులు “దేవుని పరిచారకుల” వలె ప్రవర్తించలేదు, ఈ విషయంలో తొలి క్రైస్తవులు ఎటువంటి వైఖరిని అవలంభించారు?
7 రోమీయులు 13వ అధ్యాయంలోని మొదటి ఏడు వచనాలు జాగ్రత్తగా చదివినట్లైతే, రాజకీయ “పైఅధికారులు” మంచి చేసేవారిని మెచ్చుకొని, చెడు చేసేవారిని శిక్షించే “దేవుని పరిచారకులు” అని ఆ లేఖనాలు తెలియజేస్తాయి. పైఅధికారులు కాదుగాని దేవుడే ఏది మంచిదో ఏది చెడ్డదో నిర్ణయిస్తాడని సందర్భం చూపిస్తున్నది. అందుచేత రోమా చక్రవర్తి గాని లేక మరితర ఏ రాజకీయ అధికారమైనాగాని దేవుడు నిషేధించినవాటిని కావాలనుకుంటే లేదా దానికి వ్యతిరేకంగా, దేవుడు అవసరమనే వాటిని నిషేధిస్తే, అతను ఇక ఎంతమాత్రము దేవుని పరిచారకునిగా వ్యవహరించేవాడు కాదు. యేసు ఇలా చెప్పాడు: “కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడి.” (మత్తయి 22:21) దేవునికి చెందిన వాటిని అంటే ఆరాధన లేక ఒక వ్యక్తి జీవితం వంటివాటిని రోమా ప్రభుత్వం కోరితే, “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా” అనే అపొస్తలత్వ సలహాను నిజ క్రైస్తవులు అనుసరించారు.—అపొస్తలుల కార్యములు 5:29.
8 చక్రవర్తి ఆరాధన, విగ్రహారాధన వంటివి చేయడం, తమ క్రైస్తవ కూటములను మానేయడం, సువార్త ప్రకటించకుండా ఉండడం వంటివాటిని తొలి క్రైస్తవులు నిరాకరించడం మూలంగా, అది వారిని హింసకు గురిచేసింది. అపొస్తలుడైన పౌలు నీరో చక్రవర్తి ఆదేశం మేరకు వధించబడ్డాడని సాధారణంగా నమ్మబడుతుంది. ఇతర చక్రవర్తులు, ప్రాముఖ్యంగా డొమిషియన్, మార్క్‌స్ యురేలియస్, సెప్టిమిస్, సెవెరస్, డెకయస్, డయోక్లీషన్ వంటి వారు కూడా తొలి క్రైస్తవులను హింసించారు. ఈ చక్రవర్తులు, వారి క్రింది అధికారులు క్రైస్తవులను హింసించినప్పుడు, కచ్చితంగా వారు “దేవుని పరిచారకుల” వలె ప్రవర్తించలేదు.
9. (ఎ) రాజకీయ పైఅధికారుల విషయంలో ఏది వాస్తవమై ఉంటుంది, రాజకీయ మృగము ఎవరి నుండి శక్తిని, అధికారాన్ని పొందుతుంది? (బి) పైఅధికారులకు క్రైస్తవ విధేయతను గూర్చి సహేతుకంగా ఏమి చెప్పవచ్చు?
9 కాబట్టి ఇదంతా వివరించే విషయమేమంటే క్రమమైన మానవ సమాజాన్ని నడిపించడానికి రాజకీయ అధికారాలు కొంత మేరకు “దేవుని ఏర్పాటు” వలె ఉపయోగించబడినప్పటికీ, సాతాను దేవుడైయున్న ఈ లోక విధానంలో అవి ఒక భాగంగా మిగిలి ఉంటాయి. (1 యోహాను 5:19) వారు ప్రకటన 13:1, 2 నందలి “క్రూరమృగం”చే సూచించబడే ప్రపంచవ్యాప్త రాజకీయ సంస్థకు చెందుతారు. ఆ మృగం దాని శక్తిని, అధికారాన్ని అపవాదియగు సాతాను అయిన “ఘట సర్పము” నుండి పొందుతుంది. (ప్రకటన 12:9) కాబట్టి సహేతుకంగా, అలాంటి అధికారాలకు క్రైస్తవ విధేయత పరిమితమైనదే గాని సంపూర్ణమైనది కాదు.—దానియేలు 3:16-18 పోల్చండి.
అధికారం యెడల తగిన గౌరవం
10, 11. (ఎ) అధికారంలో ఉన్న వారిని మనం గౌరవించాలని పౌలు ఎలా చూపించాడు? (బి) “రాజుల కొరకును అధికారులందరి కొరకును” ఎలా మరియు ఎందుకు ప్రార్థనలు చేయవచ్చు?
10 అయితే, క్రైస్తవులు రాజకీయ పైఅధికారుల యెడల మొండితనం, తిరుగుబాటు దృక్పథం కలిగివుండాలని దీని భావం కాదు. నిజమే, ఈ వ్యక్తులలో చాలామంది తమ వ్యక్తిగత లేక బహిరంగ జీవితాల్లో కూడా ప్రాముఖ్యంగా గౌరవించదగిన వారు కాదు. అయినా, అపొస్తలులు తమ మాదిరి మరియు సలహా ద్వారా అధికారంలో ఉన్న వ్యక్తులు గౌరవింపబడాలని చూపించారు. వావివరుసలు తప్పి వ్యభిచరించిన రాజైన రెండవ హేరోదు అగ్రిప్ప ఎదుట పౌలు నిలబడినప్పుడు, ఆయన అతనితో తగిన గౌరవంతో మాట్లాడాడు.—అపొస్తలుల కార్యములు 26:2, 3 25.
11 మన ప్రార్థనలలో లోకసంబంధ అధికారులను గురించి, ప్రాముఖ్యంగా మన జీవితాలను, క్రైస్తవ కార్యాలను ప్రభావితం చేసే నిర్ణయాలు వారు చేయవలసి వచ్చినప్పుడు వారి గురించి వేడుకోవడం సబబుగా ఉంటుందని పౌలు చెప్పాడు. ఆయనిలా వ్రాశాడు: “మనము సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము, అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరి కొరకును రాజులకొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనమును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై యున్నది. ఆయన మనుష్యులందరు రక్షణపొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు.” (1 తిమోతి 2:1-4) అలాంటి అధికారుల యెడల మనం గౌరవప్రదమైన దృక్పథం కలిగివుండడం, “మనుష్యులందరిని” రక్షించడానికి ప్రయత్నించే మన పనిని మరింత స్వతంత్రంగా చేయగలిగేలా వారు మనల్ని అనుమతించడానికి దారి తీయవచ్చు.
12, 13. (ఎ) అధికారాన్ని గురించి పేతురు ఏ సమతూకమైన సలహానిచ్చాడు? (బి) యెహోవాసాక్షులకు వ్యతిరేకంగా అపోహను కలుగజేసే “అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు” మనం ఎలా మూయించవచ్చు?
12 అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడియుండుడి. రాజు అందరికిని అధిపతియనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజువలన పంపబడినవారనియు వారికి లోబడియుండుడి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తనగలవారై, అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. స్వతంత్రులైయుండియు దుష్టత్వమును కప్పి పెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక, దేవునికి దాసులమని లోబడియుండుడి. అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి.” (1 పేతురు 2:13-17) ఎంతటి సమతూకమైన సలహా! ఆయన సేవకులుగా దేవునికి మనం సంపూర్ణ విధేయత చూపించ వలసియున్నాము; దుష్టులను శిక్షించడానికి పంపబడిన రాజకీయ అధికారులకు మనము పరిమితమైన, గౌరవప్రదమైన విధేయత చూపిస్తాము.
13 అనేకమంది లౌకిక అధికారులకు యెహోవాసాక్షులను గూర్చి వింతైన తప్పుడు అభిప్రాయాలు ఉన్నట్లు కనుగొనబడింది. సాధారణంగా దీనికి కారణం దేవుని ప్రజలను ద్వేషించే శత్రువులు ఈ తప్పుడు సమాచారాన్ని వారికి అందజేయడమే. లేక వారికి మన గురించి తెలిసినదంతా బహుశ ప్రజలకు వార్తలను అందించే సాహిత్య మాధ్యమం నుండి వారు పొంది ఉండవచ్చు, వీరు తమ ప్రసారాలలో ఎప్పుడూ నిష్పక్షపాతంగానే ఉండరు. మన గౌరవప్రదమైన దృక్పథం ద్వారా, వీలైనచోట్ల అధికారులకు యెహోవాసాక్షుల పని మరియు నమ్మకాలను గూర్చిన పూర్తి వివరాలను తెలియజేయడం ద్వారా కొన్నిసార్లు ఈ అపోహను తొలగించవచ్చు. పనిరద్దీ కలిగివుండే అధికారులకు జెహోవాస్ విట్నెసెస్ ఇన్ ది ట్వంటీయత్ సెంచరీ అనే బ్రోషూరు సంక్షిప్త వివరణనిస్తుంది. పూర్తి సమాచారం కొరకు, స్థానిక మరియు జాతీయ ప్రజా గ్రంథాలయాల్లో ఉండనర్హతగల చక్కని పరికరమైన జెహోవాస్ విట్నెసెస్—ప్రొక్లైమర్స్ ఆఫ్ గాడ్స్ కింగ్‌డమ్ అనేదాన్ని వారికి అందజేయవచ్చు.
క్రైస్తవ గృహాల్లో అధికారము
14, 15. (ఎ) క్రైస్తవ గృహంలో అధికారానికి మూలాధారం ఏమిటి? (బి) తమ భర్తల యెడల క్రైస్తవ భార్యలు ఎలాంటి దృక్పథాన్ని కలిగివుండాలి, ఎందుకు?
14 లోకసంబంధ అధికారులకు క్రైస్తవులు తగిన గౌరవం చూపించాలని దేవుడు కోరినట్లైతే, క్రైస్తవ గృహాల్లో దేవుడు ఏర్పరచిన అధికార విధానానికి వారు అలాగే గౌరవం చూపించాలన్నది సుస్పష్టమే. యెహోవా ప్రజల మధ్య ఉండే శిరస్సత్వ సూత్రాన్ని అపొస్తలుడైన పౌలు సంక్షిప్తంగా వివరించాడు. ఆయనిలా వ్రాశాడు: “ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను.” (1 కొరింథీయులు 11:3) ఇది దైవపరిపాలన, లేక దేవుని పరిపాలన సూత్రము. దానిలో ఏమి యిమిడి ఉంది?
15 దైవపరిపాలనను గౌరవించడం ఇంటిలో ప్రారంభమౌతుంది. ఒక క్రైస్తవ భార్య అతడు తోటి విశ్వాసి అయినా కాకపోయినా తన భర్త అధికారానికి తగిన గౌరవం చూపించనట్లయితే దైవపరిపాలనకు లోబడడంలేదు. క్రైస్తవులకు పౌలు ఇలా ఉపదేశించాడు: “క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి. స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సైయున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై యున్నాడు.” (ఎఫెసీయులు 5:21-24) క్రీస్తు శిరస్సత్వానికి క్రైస్తవ పురుషులు లోబడివుండవలసినట్లే, క్రైస్తవ స్త్రీలు కూడా తమ భర్తలకు దేవుడిచ్చిన అధికారానికి లోబడివుండడంలోగల జ్ఞానాన్ని గుర్తించాలి. ఇది వారికి లోతైన అంతర్గత సంతృప్తిని, మరి ముఖ్యంగా, యెహోవా ఆశీర్వాదాన్ని తెస్తుంది.
16, 17. (ఎ) నేడున్న అనేకమంది యౌవనస్థుల నుండి క్రైస్తవ గృహాల్లో పెంచబడిన పిల్లలు ఎలా తమను తాము వేరుగా ఉంచుకోగలరు, వారికి ఏ ప్రోత్సాహం ఉంది? (బి) నేటి యౌవనులకు యేసు ఎలా ఒక మంచి ఉదాహరణగా ఉన్నాడు, ఏమి చేయడానికి వారు ప్రోత్సహించబడుతున్నారు?
16 దైవపరిపాలనకు లోబడే పిల్లలు తమ తలిదండ్రులకు తగిన గౌరవం చూపించడానికి సంతోషిస్తారు. అంత్యదినాల్లో ఉండే పిల్లల తరం, తమ “తలిదండ్రులకు అవిధేయులు” అయివుంటారని ప్రవచింపబడింది. (2 తిమోతి 3:1, 2) కాని క్రైస్తవ పిల్లలకు దేవుని ప్రేరేపిత వాక్యం ఇలా చెబుతున్నది: “పిల్లలారా, అన్నివిషయములలో మీ తలిదండ్రుల మాట వినుడి; ఇది ప్రభువునుబట్టి మెచ్చుకొనతగినది.” (కొలొస్సయులు 3:20) తలిదండ్రుల అధికారం యెడల గౌరవం చూపించడం యెహోవాను ప్రీతిపర్చి, ఆయన ఆశీర్వాదాన్ని తెస్తుంది.
17 యేసు విషయంలో ఇది ప్రదర్శించబడింది. లూకా వృత్తాంతం ఇలా తెలియజేస్తుంది: “అంతట ఆయన వారితో [తన తలిదండ్రులతో] కూడ బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి యుండెను. . . . యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను.” (లూకా 2:51, 52) ఆ సమయంలో యేసు 12 సంవత్సరాలవాడు, ఇక్కడ ఉపయోగించబడిన గ్రీకు క్రియాపదము ఆయన తన తలిదండ్రులకు “లోబడి యుండుటలో కొనసాగెను” అని నొక్కిచెబుతుంది. అలా ఆయన యుక్తవయస్సులోకి ప్రవేశించేకొలది లోబడియుండటాన్ని మానలేదు. యౌవనులైన మీరు కూడా ఆత్మీయత యందును, యెహోవా మరియు దైవిక జనుల దయ యందును వర్థిల్లాలంటే, మీరు మీ గృహంలోను, గృహం వెలుపలను అధికారాన్ని గౌరవిస్తారు.
సంఘంలో అధికారము
18. క్రైస్తవ సంఘ శిరస్సు ఎవరు, ఆయన ఎవరికి అధికారాన్ని అప్పగించాడు?
18 క్రైస్తవ సంఘంలో ఉండవలసిన క్రమమును గూర్చి మాట్లాడుతూ, పౌలు ఇలా వ్రాశాడు: “ . . . దేవుడు సమాధానానికే కర్తగాని క్రమరాహిత్యానికి కర్తకాడు. సమస్తమును మర్యాదగాను క్రమముగాను [లేక, “క్రమము ప్రకారము,” అధఃస్సూచి] జరుగనియ్యుడి.” (1 కొరింథీయులు 14:33, 40, NW.) అన్ని విషయాలు క్రమమైన విధంగా జరగాలని, క్రైస్తవ సంఘ శిరస్సైన క్రీస్తు అధికారాన్ని నమ్మకస్తులైన పురుషులకు అప్పగించాడు. మనమిలా చదువుతాము: “పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను. ప్రేమ గలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము.”—ఎఫెసీయులు 4:11, 12, 15.
19. (ఎ) భూమిపైనున్న తన యావదాస్తిపై క్రీస్తు ఎవరిని నియమించాడు, ఆయన ఎవరికి ప్రత్యేక అధికారాన్ని అనుగ్రహించాడు? (బి) క్రైస్తవ సంఘంలో అధికారాన్ని అప్పగించే ఏ పని జరుగుతుంది, దీనికి మన నుండి ఏమి కోరబడుతుంది?
19 ఈ అంత్యకాలంలో, క్రీస్తు తన “యావదాస్తి” లేక భూమిపైనున్న రాజ్యాసక్తుల మీద సామూహికంగా “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” నియమించాడు. (మత్తయి 24:45-47) మొదటి శతాబ్దంలో వలెనే, అభిషక్త క్రైస్తవ పురుషుల పరిపాలక సభ ద్వారా ప్రాతినిధ్యం వహించబడుతున్న ఈ దాసునికి ఇతర అధ్యక్షులను నియమించే, నిర్ణయాలు తీసుకునే అధికారం క్రీస్తు ఇచ్చాడు. (అపొస్తలుల కార్యములు 6:2, 3; 15:2) పరిపాలక సభ బ్రాంచి కమిటీలకు, జిల్లా మరియు ప్రాంతీయ కాపరులకు, భూవ్యాప్తంగా 73,000 కంటే ఎక్కువగావున్న యెహోవాసాక్షుల సంఘాల్లోని ప్రతి సంఘంలోగల పెద్దలకు అధికారాన్ని అప్పగిస్తుంది. ఈ సమర్పిత క్రైస్తవ పురుషులందరు మన మద్దతును, గౌరవాన్ని పొందనర్హులైయున్నారు.—1 తిమోతి 5:17.
20. అధికారంలో ఉన్న తోటి క్రైస్తవుల యెడల గౌరవాన్ని చూపించని వారిని బట్టి యెహోవా అసంతోషపడతాడని ఏ ఉదాహరణ చూపిస్తుంది?
20 క్రైస్తవ సంఘంలో అధికారం కలిగివున్న వారికి మనం చూపించవలసిన గౌరవానికి, మనం లౌకిక అధికారులకు చూపించవలసిన విధేయతకు మధ్య ఒక ఆసక్తికరమైన పోలికను కలిగి ఉండవచ్చు. దేవుడు అంగీకరించే ఒక మానవ చట్టాన్ని ఒక వ్యక్తి అధిగమిస్తే, “పరిపాలించేవారిచే” విధించబడే శిక్ష వాస్తవానికి “చెడ్డకార్యములు చేసేవారిపైకి” వచ్చే దేవుని ఉగ్రత యొక్క పరోక్ష వ్యక్తీకరణై ఉంది. (రోమీయులు 13:3, 4) ఒక వ్యక్తి మానవ చట్టాలను మీరి, లోకసంబంధ అధికారాల యెడల సరైన గౌరవాన్ని చూపించకపోతేనే యెహోవాకు కోపం వస్తే, ఒక సమర్పించుకొన్న క్రైస్తవుడు బైబిలు సూత్రాలను పరిహసించి, అధికారంలోవున్న తోటి క్రైస్తవుల యెడల అగౌరవాన్ని కనపరిస్తే ఆయన మరెంతగా అసంతోషపడవచ్చు!
21. ఏ లేఖనాధార సలహాను పాటించడానికి మనం సంతోషిస్తాము, తరువాతి శీర్షికలో ఏమి పరిశీలించబడుతుంది?
21 తిరుగుబాటు స్వభావాన్ని లేక స్వతంత్ర దృక్పథాన్ని ఏర్పరచుకోవడం ద్వారా దేవుని అసమ్మతికి గురికావడానికి బదులు ఫిలిప్పీలోని క్రైస్తవులకు పౌలు యిచ్చిన ఈ సలహాను మనం పాటిద్దాము: “కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడును విధేయులైయున్న ప్రకారము, నాయెదుట ఉన్నప్పుడు మాత్రమేగాక మరి యెక్కువగా నేను మీతో లేని యీ కాలమందును, భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు, సణుగులును సంశయమును మాని, సమస్త కార్యములను చేయుడి.” (ఫిలిప్పీయులు 2:12-15) తనపైకి తాను అధికార సంక్షోభాన్ని తెచ్చుకొన్న వక్రమైన, స్వీయమార్గము నేర్పరచుకొనిన ప్రస్తుత తరం వలె కాకుండా, యెహోవా ప్రజలు ఇష్టపూర్వకంగా అధికారానికి లోబడతారు. మనం తరువాతి శీర్షికలో చూడబోవునట్లు, వారు ఆ విధంగా గొప్ప ప్రయోజనాలను పొందుతారు.
[అధస్సూచీలు]
a దీని మునుపటి శీర్షికను చూడండి.
పునఃసమీక్ష ద్వారా
◻ సర్వోన్నత అధికారి ఎవరు, ఆయన అధికార హక్కు ఎందుకు న్యాయసమ్మతమైంది?
◻ ఏ భావంలో పైఅధికారులు “దేవుని వలననే నియమింపబడి” యున్నారు?
◻ పైఅధికారులు ఎప్పుడు “దేవుని పరిచారకులు” కాకుండా పోతారు?
◻ క్రైస్తవ కుటుంబాలలో ఏ అధికార విధానం ఉనికిలో ఉంది?
◻ క్రైస్తవ సంఘంలో అధికారాన్ని అప్పగించే ఏ పని జరుగుతుంది?
[18వ పేజీలోని చిత్రం]
యేసు ‘కైసరువి కైసరుకు చెల్లించుడి’ అని చెప్పాడు