10వ అధ్యాయం
మీ పరిచర్యను విస్తృతం చేసుకునే మార్గాలు
తన శిష్యుల్ని రాజ్య ప్రచారకులుగా పంపించే సమయం వచ్చినప్పుడు, యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “కోయాల్సిన పంట చాలా ఉంది, కానీ పనివాళ్లు కొంతమందే ఉన్నారు.” చేయాల్సిన పని ఎంతో ఉంది కాబట్టి ఆయన ఇంకా ఇలా అన్నాడు: “తన పంట కోయడానికి పనివాళ్లను పంపించమని కోత యజమానిని వేడుకోండి.” (మత్త. 9:37, 38) శిష్యులు తమ పరిచర్యను ఎలా చేయాలో యేసు చెప్పాడు. ఆయన చెప్పిన ఈ మాటల్లో ఆ పని ఎంత అత్యవసరమైనదో అర్థమౌతుంది: “మీరు ఇశ్రాయేలు నగరాల్లో, గ్రామాల్లో మీ పని పూర్తి చేసేలోపే మానవ కుమారుడు వస్తాడని మీతో నిజంగా చెప్తున్నాను.”—మత్త. 10:23.
2 నేడు కూడా, క్షేత్ర పరిచర్యలో మనం చేయాల్సిన పని చాలా ఉంది. అంతం రాకముందే ఈ రాజ్య సువార్త ప్రకటించబడాలి, దానికి సమయం ఎక్కువ లేదు! (మార్కు 13:10) మన క్షేత్రం ఈ లోకం కాబట్టి మనం కూడా యేసు, ఆయన శిష్యులు ఉన్నలాంటి పరిస్థితిలోనే ఉన్నాం. కాకపోతే మనం ప్రకటించాల్సిన క్షేత్రం చాలా పెద్దది. అంతేకాదు, కోట్ల సంఖ్యలో ఉన్న ప్రపంచ జనాభాతో పోలిస్తే మనం చాలా తక్కువమందిమి ఉన్నాం. అయినప్పటికీ, యెహోవా మనకు సహాయం చేస్తాడనే నమ్మకంతో మనం ఉండవచ్చు. ప్రపంచవ్యాప్తంగా రాజ్యసువార్త ప్రకటించబడుతుంది, యెహోవా నియమిత సమయానికి అంతం వస్తుంది. కాబట్టి, మన పరిచర్యను సంపూర్ణంగా చేయడానికి మన జీవితంలో దేవుని రాజ్యానికి మొదటి స్థానం ఇస్తున్నామా? దానికోసం మనం ఎలాంటి ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకోవచ్చు?
3 తన సమర్పిత సేవకుల నుండి యెహోవా ఏమి కోరుతున్నాడో చెప్తూ, యేసు ఇలా అన్నాడు: “నువ్వు నీ దేవుడైన యెహోవాను నీ నిండు హృదయంతో, నీ నిండు ప్రాణంతో, నీ నిండు మనసుతో, నీ పూర్తి బలంతో ప్రేమించాలి.” (మార్కు 12:30) మనం నిండు ప్రాణంతో దేవుని సేవ చేయాలి. అంటే మనకు యెహోవాపై ఎంత ప్రగాఢమైన భక్తి ఉంది, ఆయనకు ఎంత మనస్ఫూర్తిగా సమర్పించుకున్నాం అనేది ఆయన సేవలో చేయగలిగినదంతా చేయడం ద్వారా చూపిస్తాం. (2 తిమో. 2:15) మన వ్యక్తిగత పరిస్థితులకు, సామర్థ్యాలకు తగ్గట్టు యెహోవా సేవలో ఎన్నో అవకాశాలు మనందరి ముందున్నాయి. అలాంటి కొన్ని అవకాశాల గురించి పరిశీలించి, మీ పరిచర్యను సంపూర్ణంగా చేయడానికి మీరు ఏ ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకోవచ్చో ఆలోచించండి.
సంఘంలో ప్రచారకునిగా సేవ చేయడం
4 మంచివార్త ప్రకటించే, బోధించే గొప్ప అవకాశం సత్యాన్ని హత్తుకునే వాళ్లందరికీ ఉంది. యేసు తన శిష్యులకు చేయమని అప్పగించిన ప్రాథమిక పని అదే. (మత్త. 24:14; 28:19, 20) సాధారణంగా, యేసుక్రీస్తు శిష్యునిగా ఉన్న వ్యక్తి, మంచివార్త గురించి వినగానే దానిగురించి ఇతరులతో మాట్లాడడం మొదలుపెడతాడు. అంద్రెయ, ఫిలిప్పు, కొర్నేలి, మరితరులు అదే చేశారు. (యోహా. 1:40, 41, 43-45; అపొ. 10:1, 2, 24; 16:14, 15, 25-34) అంటే, ఓ వ్యక్తి బాప్తిస్మం తీసుకోకముందే మంచివార్త గురించి ఇతరులకు చెప్పవచ్చా? అవును! ఓ వ్యక్తి సంఘంలో బాప్తిస్మం తీసుకొనని ప్రచారకునిగా అర్హుడైన వెంటనే ఇంటింటి పరిచర్యలో పాల్గొనవచ్చు. అంతేకాదు, అతని సామర్థ్యాల్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి ఇతర పద్ధతుల్లో కూడా మంచివార్త ప్రకటించవచ్చు.
5 ఓ ప్రచారకుడు బాప్తిస్మం తీసుకున్న తర్వాత, ఇతరులు మంచివార్త గురించి తెలుసుకోవడానికి అతను చేయగలిగినదంతా చేయాలని తప్పకుండా కోరుకుంటాడు. ప్రకటనా పనిలో పాల్గొనే గొప్ప అవకాశం పురుషులకు, స్త్రీలకు ఇద్దరికీ ఉంది. దేవుని రాజ్య సంబంధ విషయాల్ని వృద్ధి చేసే విషయంలో మనకు ఓ చిన్న వంతు ఉండడం ఆశీర్వాదంగా భావిస్తాం. అయితే, తమ పరిచర్యను విస్తృతం చేసుకోగలిగే వాళ్లు దేవుని సేవలోని మరిన్ని అవకాశాల్ని అందిపుచ్చుకుంటే సంతోషంగా ఉంటారు.
అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో సేవ చేయడం
6 బహుశా మీ సంఘ క్షేత్రంలో తరచూ పరిచర్య జరిగి ఉంటుంది, దానిలో సమగ్రంగా సాక్ష్యమిచ్చి ఉంటారు. అలాంటప్పుడు, అవసరం ఎక్కువున్న ప్రాంతాలకు వెళ్లి సేవచేయడం ద్వారా మీ పరిచర్యను విస్తృతం చేసుకోవాలని మీరు అనుకుంటుండవచ్చు. (అపొ. 16:9) ప్రస్తుతం మీరు ఓ సంఘ పెద్ద గానీ సంఘ పరిచారకుడు గానీ అయితే, వేరే సంఘానికి మీ సహాయం అవసరం కావచ్చు. మీ సర్క్యూట్‌లోనే మీరు వేరే సంఘానికి ఎలా సహాయం చేయవచ్చో మీ ప్రాంతీయ పర్యవేక్షకుడు కొన్ని సలహాలు ఇవ్వొచ్చు. ఒకవేళ మీరు మీ దేశంలోనే మరో ప్రాంతంలో సేవ చేయాలనుకుంటే, దానికి కావాల్సిన వివరాలు బ్రాంచి కార్యాలయం ఇవ్వవచ్చు.
7 మీరు వేరే దేశానికి వెళ్లి సేవ చేయాలనుకుంటున్నారా? అయితే, మీరు దాని గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ విషయం గురించి మీ సంఘ పెద్దలతో మాట్లాడండి. మీరు అలా వెళ్లడం మీపై, మీతో వస్తున్న వ్యక్తిపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. (లూకా 14:28) ఒకవేళ మీరు వేరే దేశంలో ఎక్కువ కాలం చేయాలని అనుకోకపోతే, మీ దేశంలోనే మరో ప్రాంతంలో సేవచేయడం గురించి ఆలోచించడం మంచిది.
8 కొన్ని దేశాల్లో, వేరే దేశం నుండి వచ్చిన పెద్దలు స్థానిక పెద్దల కన్నా ఎక్కువకాలం సత్యంలో ఉండివుంటారు. అలాంటప్పుడు, వినయంగల స్థానిక పెద్దలు వేరే దేశం నుండి వచ్చిన అనుభవంగల పెద్దల్ని నాయకత్వం వహించనిస్తారు. మీరు ఓ సంఘ పెద్దగా ఉండి, అలాంటి దేశాలకు వెళ్లి సేవ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే, ఆ సహోదరుల స్థానంలో సేవచేయాలనేది మీ ఉద్దేశం కాదని గుర్తుంచుకోండి. బదులుగా, వాళ్లతో కలిసి సేవ చేయండి. సంఘ బాధ్యతలు చేపట్టేలా అర్హత సంపాదించమని, వాటిని స్వీకరించమని వాళ్లను ప్రోత్సహించండి. (1 తిమో. 3:1) సంఘానికి సంబంధించిన కొన్ని పనులు, మీ దేశంలో జరిగినట్లే అక్కడ జరగకపోతే ఓపిగ్గా ఉండండి. సంఘ పెద్దగా మీకున్న అనుభవం వల్ల సహోదరులు పూర్తి ప్రయోజనం పొందేలా చూసుకోండి. అలా చేస్తే, మీరు మీ దేశానికి తిరిగి వెళ్లాల్సి వచ్చినప్పుడు, సంఘాన్ని చూసుకోవడానికి స్థానిక పెద్దలు మెరుగైన స్థానంలో ఉంటారు.
9 మీ సహాయం అవసరమయ్యే సంఘాల పేర్లను బ్రాంచి కార్యాలయం తెలియజేసే ముందు, మీ సంఘ సేవా కమిటీ ఓ సిఫారసు ఉత్తరాన్ని పంపించాలి. మీరు ఓ సంఘ పెద్దగా లేదా సంఘ పరిచారకునిగా లేదా పయినీరుగా లేదా ఓ ప్రచారకునిగా సేవచేస్తున్నా సేవా కమిటీ ఆ సిఫారసు ఉత్తరాన్ని పంపించాలి. మీ సంఘ సేవా కమిటీ మీ సిఫారసు ఉత్తరంతోపాటు, వివరాలు కోరుతూ మీరు రాసిన ఉత్తరాన్ని మీరు సేవ చేయాలనుకుంటున్న దేశంలోని బ్రాంచి కార్యాలయానికి నేరుగా పంపిస్తుంది.
వేరే భాషలో ప్రకటించడం
10 మీ పరిచర్యను విస్తృతం చేసుకోవడానికి సంజ్ఞా భాషతో సహా వేరే భాషను నేర్చుకోవాలని మీరు అనుకుంటుండవచ్చు. ఒకవేళ మీకు వేరే భాషలో ప్రకటించాలనే లక్ష్యం ఉంటే, దాని గురించి మీ సంఘ పెద్దలతో, ప్రాంతీయ పర్యవేక్షకునితో మాట్లాడండి. వాళ్లు మీకు సలహాల్ని, కావాల్సిన ప్రోత్సాహాన్ని ఇవ్వగలుగుతారు. కొన్ని సర్క్యూట్లలో, బ్రాంచి కార్యాలయం నిర్దేశం కింద, అర్హులైన ప్రచారకులకు, పయినీర్లకు వేరే భాష నేర్పించడానికి భాషా తరగతుల్ని ఏర్పాటు చేశారు.
పయినీరు సేవ
11 సహాయ పయినీరుగా, క్రమ పయినీరుగా, ప్రత్యేక పయినీరుగా లేదా ఇతర పూర్తికాల సేవకులుగా అవ్వాలంటే, ఎలాంటి అర్హతలు ఉండాలో ప్రతీ ప్రచారకునికి తెలిసుండాలి. పయినీరుగా సేవచేసే వ్యక్తి బాప్తిస్మం తీసుకున్న, ఆదర్శవంతుడైన క్రైస్తవుడై ఉండాలి. అంతేకాదు, అతను లేదా ఆమె మంచివార్త ప్రకటిస్తూ నిర్దిష్టమైన గంటల్ని చేరుకునే స్థితిలో ఉండాలి. సహాయ పయినీరు, క్రమ పయినీరు దరఖాస్తులను సంఘ సేవా కమిటీ ఆమోదిస్తుంది. ప్రత్యేక పయినీర్లను మాత్రం బ్రాంచి కార్యాలయం నియమిస్తుంది.
12 సహాయ పయినీర్లు తమ పరిస్థితుల్ని బట్టి ఒక నెల లేదా వరుసగా కొన్ని నెలల కోసం, లేదా ఆ సేవలో కొనసాగుతూ ఉండడానికి నియమించబడతారు. చాలామంది రాజ్య ప్రచారకులు ప్రత్యేక సందర్భాల్లో, అంటే జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో లేదా ప్రాంతీయ పర్యవేక్షకుని సందర్శనా నెలలో సహాయ పయినీరు సేవ చేస్తారు. కొంతమంది, సెలవులున్న నెలల్లో సహాయ పయినీరు సేవ చేస్తారు. బాప్తిస్మం తీసుకున్న పిల్లలు, తమ స్కూల్‌కు సెలవులున్న నెలల్లో సహాయ పయినీరు సేవ చేయవచ్చు. ప్రతీ సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలల్లో అలాగే ప్రాంతీయ పర్యవేక్షకుని సందర్శనా నెలలో సహాయ పయినీరు గంటలు తగ్గించబడ్డాయి కాబట్టి ప్రచారకులు ఆ ఏర్పాటును ఉపయోగించుకుని సహాయ పయినీరు సేవ చేయవచ్చు. మీ వ్యక్తిగత పరిస్థితులు ఏవైనా, మీకు చక్కని నైతిక ప్రవర్తనా మంచి అలవాట్లూ ఉండి, నిర్దిష్టమైన గంటల్ని చేరుకునే ఏర్పాట్లు చేసుకుంటే, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ నెలలు సహాయ పయినీరు సేవ చేయగలరనే నమ్మకం మీకుంటే, మీరు పెట్టిన సహాయ పయినీరు సేవ దరఖాస్తును పరిశీలించడానికి పెద్దలు సంతోషిస్తారు.
13 క్రమ పయినీరు సేవ చేయడానికి అర్హులవ్వాలంటే, సంవత్సరంలో చేయాల్సిన గంటల్ని పూర్తిచేసే స్థితిలో మీరు ఉండాలి. క్రమ పయినీరుగా, మీరు మీ సంఘంతో కలిసి సన్నిహితంగా పనిచేయాలి. ఉత్సాహంగా సేవచేసే పయినీర్లు సంఘానికి ఓ ఆశీర్వాదం. ఎందుకంటే, వాళ్లు తోటి సహోదరసహోదరీల్లో పరిచర్యపట్ల ఉత్సాహాన్ని కలిగిస్తారు, అలాగే పయినీరు సేవ చేపట్టమని వాళ్లను ప్రోత్సహిస్తారు. క్రమ పయినీరు సేవకోసం దరఖాస్తు చేసుకునేవాళ్లు ఆదర్శవంతులైన ప్రచారకులై ఉండాలి, బాప్తిస్మం తీసుకుని కనీసం ఆరు నెలలైనా అయ్యుండాలి.
14 సాధారణంగా, సమర్థవంతంగా పరిచర్య చేస్తున్న క్రమ పయినీర్లలో నుండి ప్రత్యేక పయినీర్లను ఎంపిక చేస్తారు. బ్రాంచి కార్యాలయం వాళ్లను ఎక్కడికి నియమిస్తే, వాళ్లు అక్కడికి వెళ్లి సేవ చేయగలగాలి. చాలావరకు, ఆసక్తిగల ప్రజల్ని కనుగొని, కొత్త సంఘాల్ని ఏర్పాటు చేయగలిగేలా మారుమూల ప్రాంతాలకు వాళ్లను నియమిస్తారు. కొన్నిసార్లు, క్షేత్రాన్ని పూర్తి చేయడంలో సహాయం అవసరమైన సంఘాలకు వాళ్లను నియమిస్తారు. అయితే, పెద్దలుగా సేవ చేస్తున్న కొంతమంది ప్రత్యేక పయినీర్లు చిన్న సంఘాలకు సహాయం చేయడానికి నియమించబడతారు. క్షేత్రాన్ని పూర్తి చేయడంలో అంతగా సహాయం అవసరం లేకపోయినా వాళ్లు నియమించబడవచ్చు. ప్రత్యేక పయినీర్లకు కనీస అవసరాల కోసం కొంత డబ్బు ఇవ్వబడుతుంది. కొంతమంది తాత్కాలిక ప్రత్యేక పయినీర్లుగా కూడా నియమించబడతారు.
క్షేత్ర మిషనరీలు
15 పరిపాలక సభలోని సేవా కమిటీ, క్షేత్ర మిషనరీలను నియమిస్తుంది. ఆ తర్వాత, స్థానిక బ్రాంచి కమిటీ వాళ్లను ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో సేవ చేయడానికి నియమిస్తుంది. వాళ్లు ప్రకటనా పనిని, అలాగే సంఘ కార్యకలాపాల్ని పటిష్ఠపర్చడానికి, బలపర్చడానికి సహాయం చేస్తారు. చాలావరకు, వాళ్లు రాజ్య సువార్తికుల కోసం పాఠశాలలో శిక్షణ పొందుతారు. వాళ్లకు వసతి, కనీస అవసరాల కోసం కొంత డబ్బు ఇవ్వబడుతుంది.
ప్రాంతీయ సేవ
16 ప్రాంతీయ పర్యవేక్షకులను పరిపాలక సభ నియమిస్తుంది. ఆ నియామకం పొందడానికి ముందు, వాళ్లు సబ్‌స్టిట్యూట్ (ప్రత్యామ్నాయ) ప్రాంతీయ పర్యవేక్షకులుగా సేవ చేస్తూ శిక్షణ పొందుతారు, అనుభవం సాధిస్తారు. అలాంటి పురుషులకు పరిచర్య పట్ల, సహోదరసహోదరీల పట్ల ప్రేమ ఉంటుంది. వాళ్లు ఉత్సాహవంతమైన పయినీర్లు, బైబిల్ని శ్రద్ధగా చదివే విద్యార్థులు, సమర్థవంతులైన ప్రసంగీకులు, బోధకులు. వాళ్లలో పవిత్రశక్తి పుట్టించే లక్షణాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి; వాళ్లు సమతుల్యతను, సహేతుకతను, వివేచనను చూపిస్తారు. ఒకవేళ ఆ సహోదరుడు వివాహితుడైతే, అతని పయినీరు భార్య ఇతరులతో ప్రవర్తించే విషయంలో, వ్యవహరించే విషయంలో చక్కని ఆదర్శవంతురాలిగా ఉంటుంది. ఆమె సమర్థవంతంగా ప్రకటిస్తుంది. అంతేకాదు విధేయురాలైన క్రైస్తవ భార్యగా తన పాత్ర ఏంటో ఆమె అర్థం చేసుకుంటుంది, అంటే తన భర్త తరఫున మాట్లాడడం గానీ అధికారం చెలాయిస్తూ మాట్లాడడం గానీ చేయదు. ప్రాంతీయ పర్యవేక్షకులకు, వాళ్ల భార్యలకు చాలా కష్టమైన దినచర్య ఉంటుంది, కాబట్టి ప్రాంతీయ సేవ చేయాలనుకునేవాళ్లు మంచి ఆరోగ్యంతో ఉండాలి. పయినీర్లు ప్రాంతీయ సేవకు నేరుగా దరఖాస్తు చేసుకోలేరు. బదులుగా, ప్రాంతీయ సేవ చేయాలనే తమ కోరికను ప్రాంతీయ పర్యవేక్షకునికి చెప్తారు. అప్పుడు ఆయన వాళ్లకు కావాల్సిన సలహాలు ఇస్తాడు.
దైవపరిపాలనా పాఠశాలలు
17 రాజ్య సువార్తికుల కోసం పాఠశాల: సంఘాలకు ఆధ్యాత్మిక మద్దతివ్వడానికి, అరుదుగా పరిచర్య చేసిన క్షేత్రాల్ని పూర్తి చేయడానికి, రాజ్య సువార్తికులు చాలా అవసరం. కాబట్టి, రాజ్య సువార్తికుల కోసం పాఠశాలలో ప్రత్యేక శిక్షణ పొందడానికి ఒంటరి సహోదరులు, ఒంటరి సహోదరీలు, దంపతులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ పాఠశాలలో పట్టభద్రులైన వాళ్లను, తమ దేశంలో అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో క్రమ పయినీర్లుగా సేవ చేయడానికి పంపిస్తారు. అయితే, తమను తాము అందుబాటులో ఉంచుకున్నవాళ్లకు, తమ దేశంలోగానీ వేరే దేశంలోగానీ ఇతర నియామకాలు ఇవ్వవచ్చు. కొంతమందిని తాత్కాలిక లేదా పూర్తికాల ప్రత్యేక పయినీర్లుగా పంపించవచ్చు. ఈ పాఠశాలకు వెళ్లాలనుకుంటున్న పయినీర్లు, ప్రాదేశిక సమావేశంలో దానికి సంబంధించి జరిగే కూటానికి హాజరై మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
18 వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్: ఈ పాఠశాలకు హాజరవ్వడానికి ఎంపిక చేయబడిన ఒంటరి సహోదరులు, ఒంటరి సహోదరీలు, దంపతులు ఇంగ్లీష్ మాట్లాడగలగాలి అలాగే వాళ్లు ప్రత్యేక పూర్తికాల సేవ చేస్తుండాలి. క్షేత్రాన్ని లేదా బ్రాంచి వ్యవస్థీకరణను పటిష్ఠపర్చే, బలపర్చే సామర్థ్యం వాళ్లకు ఉండాలి. వాళ్లు తోటి సహోదరసహోదరీలకు సంతోషంగా సహాయం చేయగలరనీ, లేఖనాలు అలాగే దైవిక నిర్దేశాల్ని తెలుసుకుని, వాటిని పాటించేలా ఇతరులకు దయగా సహాయం చేయగలరనీ నిరూపించుకొని ఉండాలి. ఈ పాఠశాలకు దరఖాస్తు చేసుకోమని స్థానిక బ్రాంచి కమిటీ, అర్హులైన సహోదరసహోదరీలను ఆహ్వానిస్తుంది. ఈ పాఠశాలలో పట్టభద్రులైన వాళ్లను, తమ దేశంలోని లేదా వేరే దేశంలోని క్షేత్రంలోగానీ బ్రాంచి కార్యాలయంలోగానీ సేవ చేసేందుకు నియమిస్తారు.
బెతెల్ సేవ
19 బెతెల్‌లో సేవ చేయడం ఒక ప్రత్యేకమైన అవకాశం. బెతెల్ అనే పేరుకు “దేవుని ఇల్లు” అని అర్థం, అక్కడ జరిగే ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ఆ పేరు సరిగ్గా సరిపోతుంది. బెతెల్ సేవ చేసే సహోదరసహోదరీలు బైబిలు ప్రచురణల్ని ఉత్పత్తి చేయడం, అనువదించడం, బైబిలు సాహిత్యాన్ని పంపిణి చేయడం వంటివాటికి సంబంధించిన ముఖ్యమైన పనుల్ని చూసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాల్ని పర్యవేక్షిస్తూ వాటిని నిర్దేశిస్తున్న పరిపాలక సభ, ఆ సహోదరసహోదరీల సేవను ఎంతో విలువైనదిగా చూస్తుంది. అనువాద పని చేసే చాలామంది బెతెల్ కుటుంబ సభ్యులు తమ బ్రాంచి క్షేత్రంలో, తాము అనువదించే భాష మాట్లాడే ప్రాంతంలో ఉంటూ, అక్కడే పని చేస్తారు. దానివల్ల, ప్రజలు తమ రోజువారీ జీవితంలో ఆ భాషను ఎలా మాట్లాడుతున్నారో వాళ్లు తెలుసుకోగలుగుతారు. అంతేకాదు, ప్రచురణల్లో ఉపయోగించే భాష ప్రజలకు అర్థమౌతుందో లేదో కూడా వాళ్లు స్వయంగా చూడగలుగుతారు.
20 బెతెల్‌లో చేసే చాలా పనులు శారీరక శ్రమతో కూడుకున్నవి. అందుకే బెతెల్ సేవ చేయాలనుకునేవాళ్లు ముఖ్యంగా, సమర్పించుకుని బాప్తిస్మం తీసుకున్న యౌవన సహోదరులై ఉండాలి. అంతేకాదు వాళ్లు ఆరోగ్యంగా, బలంగా ఉండాలి. ఒకవేళ మీ దేశాన్ని పర్యవేక్షిస్తున్న బ్రాంచిలో అవసరం ఉండి, మీరు అక్కడ సేవ చేయాలని కోరుకుంటుంటే, మరిన్ని వివరాల కోసం మీ సంఘ పెద్దల్ని అడగండి.
నిర్మాణ సేవ
21 సొలొమోను కాలంలో ఆలయాన్ని నిర్మించే పనిలాగే, నేడు రాజ్య మందిరాలను, సమావేశ హాళ్లను, బెతెల్ భవనాలను, బ్రాంచి కార్యాలయాలను, రిమోట్ ట్రాన్స్‌లేషన్ భవనాలను నిర్మించే పని కూడా పవిత్ర సేవలో ఓ భాగం. (1 రాజు. 8:13-18) ఈ పనిలో పాల్గొనడానికి చాలామంది సహోదరసహోదరీలు తమ సమయాన్ని, వనరుల్ని ఉత్సాహంగా వెచ్చిస్తున్నారు.
22 ఆ పనిలో పాల్గొనడం మీకు వీలౌతుందా? మీరు బాప్తిస్మం తీసుకున్న ప్రచారకులై ఉండి, దానిలో పాల్గొనాలని కోరుకుంటుంటే, మీ ప్రాంతంలో నిర్మాణ పనిని పర్యవేక్షిస్తున్న సహోదరులకు మీరు సహాయం చేయవచ్చు. మీకు ఆ పనిలో అంతగా నైపుణ్యాలు లేకపోయినా, వాళ్లు మీకు శిక్షణ ఇస్తారు. మీరు నిర్మాణ పనిలో పాల్గొనడానికి అందుబాటులో ఉంటే, ఆ విషయం మీ సంఘ పెద్దలతో మాట్లాడండి. అర్హులైన, బాప్తిస్మం తీసుకున్న కొంతమంది ప్రచారకులు వేరే దేశాల్లోని రాజ్యమందిరాలను, సమావేశ హాళ్లను, బెతెల్ భవనాలను, బ్రాంచి కార్యాలయాలను, రిమోట్ ట్రాన్స్‌లేషన్ భవనాలను నిర్మించే పనిలో కూడా పాల్గొనగలిగారు.
23 నిర్మాణ పనిలో సేవచేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆ పనిలో కొంత నైపుణ్యం ఉండి, తమకు దగ్గర్లో జరుగుతున్న నిర్మాణ పనికి మద్దతివ్వగల, బాప్తిస్మం తీసుకున్న ఆదర్శవంతులైన ప్రచారకులు స్థానిక డిజైన్/నిర్మాణ వాలంటీర్లుగా సేవ చేయవచ్చు. మరికొంతమంది, రెండు వారాల నుండి మూడు నెలలపాటు వేరే ప్రాంతాలకు వెళ్లి, అక్కడ జరుగుతున్న నిర్మాణ పనికి మద్దతివ్వగలుగుతారు. అలాంటివాళ్లను నిర్మాణ వాలంటీర్లుగా బ్రాంచి కార్యాలయం నియమిస్తుంది. అయితే, ఎక్కువ కాలంపాటు సేవ చేసేందుకు నియమించబడిన వాళ్లను నిర్మాణ సేవకులు అంటారు. వేరే దేశంలో నిర్మాణ సేవకునిగా నియమించబడిన వాళ్లను, విదేశీ నిర్మాణ సేవకుడు అంటారు. నిర్మాణ గ్రూపులో నిర్మాణ సేవకులు, నిర్మాణ వాలంటీర్లు ఉంటారు. వీళ్లు ప్రతీ నిర్మాణ ప్రాజెక్టులో నాయకత్వం వహిస్తారు. వీళ్లకు స్థానిక డిజైన్/నిర్మాణ వాలంటీర్లు అలాగే ఆ ప్రాజెక్టు జరిగే స్థానిక సంఘాల్లోని సహోదరసహోదరీలు కూడా మద్దతిస్తారు. ఒక ప్రాజెక్టు పూర్తవ్వగానే, మరో ప్రాజెక్టును మొదలుపెట్టడానికి నిర్మాణ గ్రూపులు బ్రాంచి క్షేత్రంలోనే మరో ప్రాంతానికి వెళ్తాయి.
మీ ఆధ్యాత్మిక లక్ష్యాలు ఏమిటి?
24 మీ జీవితాన్ని యెహోవాకు సమర్పించుకొని ఉంటే, మీరు ఆయన్ని ఎల్లప్పుడూ సేవించాలని కోరుకుంటారు. అలా సేవించడానికి మీరు పెట్టుకున్న ఆధ్యాత్మిక లక్ష్యాలు ఏమిటి? ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకోవడంవల్ల మీ సామర్థ్యాల్ని, వనరుల్ని తెలివిగా ఉపయోగించగలుగుతారు. (1 కొరిం. 9:26) అలాంటి లక్ష్యాలు పెట్టుకుంటే మీరు ఆధ్యాత్మిక ప్రగతి సాధించగలుగుతారు, అదనపు సేవావకాశాల కోసం కృషిచేసేలా ఎక్కువ ప్రాముఖ్యమైన వాటిమీద మనసు పెట్టగలుగుతారు.—ఫిలి. 1:10; 1 తిమో. 4:15, 16.
25 దేవుని సేవ చేసే విషయంలో అపొస్తలుడైన పౌలు మనకు చక్కని ఆదర్శం ఉంచాడు. (1 కొరిం. 11:1) ఆయన యెహోవా సేవలో తన శక్తినంతా ధారపోశాడు. సేవచేసే ఎన్నో అవకాశాల్ని యెహోవాయే తనకిచ్చాడని పౌలు గుర్తించాడు. అందుకే, కొరింథులోని సహోదరులకు ఆయనిలా రాశాడు: “సేవచేసే పెద్ద తలుపు తెరవబడింది.” ఇది మన విషయంలో నిజం కాదంటారా? అవును, సంఘంతో కలిసి యెహోవా సేవ చేయడానికి ఎన్నో అవకాశాలు మన ముందున్నాయి. ముఖ్యంగా రాజ్య సువార్త ప్రకటించడం. కానీ పౌలు విషయంలో “పెద్ద తలుపు” గుండా వెళ్లడం అంటే “చాలామంది వ్యతిరేకులతో” పోరాడడం లాంటిది. (1 కొరిం. 16:9, అధస్సూచి) పౌలు తనను తాను క్రమశిక్షణలో పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఏమన్నాడో గమనించండి: “నా శరీరాన్ని నలగ్గొట్టుకుంటున్నాను, దాన్ని బానిసగా చేసుకుంటున్నాను.” (1 కొరిం. 9:24-27, అధస్సూచి) మన ఆలోచన తీరు అలాగే ఉందా?
ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకోవడంవల్ల మీ సామర్థ్యాల్ని, వనరుల్ని తెలివిగా ఉపయోగించగలుగుతారు
26 మీ వ్యక్తిగత పరిస్థితులకు తగ్గట్లు ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకోవడానికి కృషి చేయమని మీలో ప్రతీఒక్కరిని ప్రోత్సహిస్తున్నాం. పూర్తికాల సేవ చేయాలనే లక్ష్యాన్ని చిన్నప్పుడే పెట్టుకోవడంవల్ల, చాలామంది ఇప్పుడు ఏదోక పూర్తికాల సేవ చేస్తున్నారు. వాళ్లు పిల్లలుగా ఉన్నప్పుడే, అలాంటి లక్ష్యాలు పెట్టుకోమని వాళ్ల తల్లిదండ్రులు, ఇతరులు వాళ్లను ప్రోత్సహించారు. అందువల్లే వాళ్లు ఇప్పుడు యెహోవా సేవలో ఎన్నో ఆశీర్వాదాలను పొందుతున్నారు. తాము తీసుకున్న నిర్ణయం గురించి వాళ్లు ఏమాత్రం బాధపడట్లేదు. (సామె. 10:22) ప్రతీవారం పరిచర్యలో పాల్గొనడం, బైబిలు అధ్యయనాలు నిర్వహించడం, కూటాలకు చక్కగా సిద్ధపడడం వంటి ఇతర లక్ష్యాలను కూడా మనం పెట్టుకోవచ్చు. అయితే, మనం స్థిరంగా ఉంటూ పరిచర్యను సంపూర్ణంగా చేయడమే చాలా ప్రాముఖ్యం. మనం అలా చేస్తే యెహోవాను ఘనపరుస్తాం, ఆయన్ని నిరంతరం సేవించాలనే మన అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటాం.—లూకా 13:24; 1 తిమో. 4:7బి, 8.