యెహోవాను ఘనపరచుటకు నీవు ఇంకా ఎక్కువ చేయగలవా?
1 ఆలోచించటానికి మనందరికీ అది ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న. మన బోధకుడైన యేసుక్రీస్తు యొక్క నమ్మకమైన అనుచరులుగా, దేవుని నామాన్ని బహిరంగంగా ప్రకటించుట ద్వారా ఈనాడు మనమాయన్ని ఘనపరుస్తున్నాము. దేవుని అనుగ్రహాన్ని పొందాలంటే మనం తప్పకుండ ఈ బాధ్యతను స్వీకరించవలసిందే. (మార్కు 13:10; లూకా 4:18; అపొ. 4:20; హెబ్రీ. 13:15) యెహోవా యొక్క విశ్వవ్యాప్తమందలో యింకనూ భాగము కాగల్గే మిగిలియున్న చెదిరిన “గొఱ్ఱెల” యొద్దకు ఈ సువార్తను తీసుకొని పోవుట ఎంతటి వర్ణనాతీతమైన ఆధిక్యత—ఘనత!—యోహాను 10:16.
2 పరిచర్యలో మీ పనిని అధికం చేయడం ద్వారా మీరు మరియు మీ పిల్లలు యెహోవాను ఘనపర్చుటకు ఎక్కువ చేయగలరా? ప్రపంచవ్యాప్తంగా, అంతకంతకు పెరుగుతున్న సంఖ్యలో మీ సహోదర సహోదరీలు పయినీరు సేవలో ప్రవేశిస్తున్నారు. ఇండియాలో 1992 ఏప్రిల్ నెలలో, శిఖరాగ్రసంఖ్య అయిన 2,106 మంది ప్రత్యేక, క్రమ, లేక సహాయ పయినీరు సేవలో ఉన్నారు. ఆ నెలలో రిపోర్టు చేసిన ప్రచారకుల మొత్తంలో అది దాదాపు పద్దెనిమిది శాతం! నీవు పయినీరు సేవను గూర్చి వ్యక్తిగతంగా తీవ్రమైన యోచన చేశావా? పూర్తికాల సేవను తమ వృత్తిగా చేసుకొమ్మని మీరు మీ పిల్లలను ప్రోత్సహిస్తారా?
3 పయినీరు సేవను గూర్చిన మీ వ్యక్తిగత భావాలను ఎందుకు విశ్లేషించి చూసుకో కూడదు. ఈ విషయాన్ని గూర్చి ఎప్పుడు పేర్కొనినా, వెంటనే పయినీరు సేవ చేయుటకు మీకు మీ పరిస్థితులు అనుకూలించవని ముగిస్తున్నారా? పయినీరు సేవ చేయడం అందరికీ సాధ్యం కాదన్నది వాస్తవమే. లేఖనానుసారమైన బాధ్యతలు ఇంకా ఇతర అడ్డంకులు పూర్తికాల సేవ నుండి అనేకులను ఆటంకపరచవచ్చు. (1 తిమో. 5:8) కాని మీరు ఇటీవల ఈ విషయాన్ని గూర్చి ప్రార్థనాపూర్వకంగా తలంచారా? కనీసం ఒక్కరైనా క్రమ పయినీరుగా చేయగలరేమోనని కుటుంబ సమేతంగా ఈ విషయాన్ని గూర్చి చర్చించారా? ది వాచ్‌టవర్ 1982, నవంబరు 15 సంచిక 23వ పేజీలో ఆలోచన రేకెత్తించే ఈ వ్యాఖ్యానం చేయబడింది: “నిజంగా ప్రతి క్రైస్తవ సేవకుడు తాను పయినీరు సేవ చేయగలనా లేదా అని ప్రార్థనాపూర్వకంగా ఆలోచించాలి. పదిహేను సంవత్సరాలు పయినీరు సేవ చేసిన ఒక దక్షిణాఫ్రికా జంట ఇలా చెప్పారు: ‘మేమెందుకు పయినీరు సేవ చేస్తున్నాము? ఒకవేళ మేము చేయకపోతే యెహోవా యెదుట దానిని మేము సమర్థించు కోగలమా?’ పయినీర్లు కాని వారందరు ఈ ప్రశ్న వేసుకోవచ్చు: ‘నేను పయినీరును కానన్న వాస్తవాన్ని యెహోవా యెదుట నేను నిజంగా సమర్థించు కోగలనా?’”
4 ఈ అంశంపై వాచ్‌టవర్ నందలి ఇంకొక శీర్షిక ఇలా వ్యాఖ్యానించింది: “ప్రతిఒక్కరు తనకు తాను నమ్మకంగా ఉండాలి. ‘ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనమని’ మీరంటారా? కాని నిజంగా ఆత్మ సిద్ధంగా వుందా? ఆత్మ యొక్క అనంగీకారం శరీర బలహీనతను ఒక సాకుగా తీసుకోవటాన్ని మనం అరికట్టాలి.”—w78 8⁄15 పేజి. 23.
5 తమ పిల్లలు విజయవంతులవ్వాలని కోరుకొనే తల్లిదండ్రులు: సామెతలు 15:20 మనకిలా వాగ్దానం చేస్తున్నది: “జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును.” తమ కుమారులు, కుమార్తెలు యెహోవాకు సమర్పిత సేవచేయాలని నిశ్చయించుకోవడాన్ని బట్టి దైవిక తలిదండ్రులు నిస్సందేహంగా ఆనందిస్తారు. అయినా, మీ పిల్లలు యాంత్రికంగానే సరైన మార్గాన్ని ఎన్నుకోలేరు. ఈ ప్రపంచం యొక్క ఆకర్షణ చాల శక్తివంతమైనది. తలిదండ్రులారా, మీద్వారానే మీ పిల్లల విలువలు రూపుదిద్దబడతాయి. పూర్తికాల సేవయొక్క మేలులను గూర్చి మీరెప్పుడూ అనుకూలంగా మాట్లాడుతూవుంటే, సమర్పిత పయినీర్ల సహచర్యంలో ఉండమని వారిని ప్రోత్సహిస్తే, మీ పిల్లలు చేపట్టగల వృత్తిలో పూర్తికాల సేవ ఎంతో గౌరవనీయమైనదని మీరు నిజంగా అంగీకరిస్తే, ఈ విధమైన అనుకూల దృక్పథం నిస్సందేహంగా మీ పిల్లలపై గొప్ప ప్రభావాన్ని చూపగలదు. మనుష్యులతో కంటె యెహోవాతో మంచిపేరు సంపాదించుకొనే విలువను మెచ్చుకొనునట్లు వారికి సహాయం చేయండి.
6 యౌవనులారా, మీరు చేసుకోవలసిన ఎంపికను గూర్చి సామెతలు 22:1 ఇలా ఉన్నత పరుస్తూంది: “గొప్ప ఐశ్వర్యముకంటె మంచి పేరును వెండి బంగారములకంటె దయయు కోరదగినవి.” మీకొరకు మీరెట్టి పేరును సంపాదించు కుంటారు? సమర్పిత సేవ ద్వారా దేవునితో మంచి పేరు పొందిన, బైబిలులో మనం చదివే స్త్రీ పురుషులను గూర్చి ఆలోచించండి. హనోకు మరియు ప్రియ వైద్యుడైన లూకా సత్యదేవునితో నడిచినవారు. సమూయేలు చిన్న వయసులోనే యెహోవా ఆలయంలో సేవ మొదలుపెట్టి అత్యంత శ్రేష్ఠమైన విద్యను పొందాడు. వారు చేసుకున్న ఎంపికను బట్టి ఈ నమ్మకమైన సేవకులు ఎప్పుడైనా చింతించివుంటారని మీరనుకుంటున్నారా? వారెందుకు చింతించాలి? వారందరు సంతోషకరమైన, ఫలవంతమైన మరియు ఉల్లాసవంతమైన జీవితాలను గడిపారు. మరియు వారు యెహోవా యొక్క నిత్యానుగ్రహాన్ని పొందారు!—కీర్తన 110:3; 148:12, 13; సామె. 20:29; 1 తిమో. 4:8.
7 పిల్లలు వారి జీవితంలో సఫలులైతే, వారి తలిదండ్రులు గర్విస్తారు. “యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము”నకు తర్ఫీదిచ్చి, శిక్షణయిచ్చి, విద్యనభ్యసింప జేయుటలోని వారి పెట్టుబడంతా ఎన్నో రెట్లు ఎక్కువగా తిరిగి ఇవ్వబడిందైయుంటుంది. (కీర్త. 127:3) యెహోవాను ఘనపర్చుటకు తాను చేయగలిగినదంతా చేసిన కుమారుడు లేక కుమార్తె కంటె ఇంకేది తలిదండ్రులకు గర్వకారణం కాగలదు? ఆధునిక కాలాలలో చాలమంది యౌవనస్థులు లుకా, హనోకు, మరియు సమూయేలుల అడుగుజాడలను అనుసరిస్తున్నారు, ఒక ఉత్తరం ఉదహరించినట్లుగా “నా వయస్సు 16. నేను బాప్తిస్మం తీసుకున్న తొమ్మిది నెలల తరువాత . . . నేను క్రమ పయినీరు సేవ చేయటం మొదలు పెట్టాను. అప్పటి నుండి నేను యెహోవా నుండి దీవెనలు పొందుతూనే ఉన్నాను . . . పయినీరు సేవ మీకు పాఠశాలలో కూడ సహాయపడును. మునుపు, నేను సాక్షినైనందుకు నాతోటి విద్యార్థులచే ఎగతాళి చేయబడే దాన్ని. ఇప్పుడు, నేనెంతో వ్యక్తిగత పఠనం చేయాలి కాబట్టి, ‘నన్ను నిందించేవారికి జవాబివ్వ గలుగుతున్నాను.’”
8 సేవలో సంసిద్ధులగుటకు విద్య: ఈ సందర్భంలో లౌకిక విద్యను గూర్చిన ప్రశ్నను పరిశీలిద్దాము. ముఖ్యంగా ఇది సమతూకమైన దృష్టిని కలిగివుండవలసిన సంగతి. నవంబరు 1, 1992, వాచ్‌టవర్‌లో “సంకల్పంతో కూడిన విద్య” అనే శీర్షిక వెలువడింది. “తగినంత విద్య” అనే ఉపశీర్షికలో, ఈ విషయం చెప్పబడింది: “వారు పూర్తికాల పయినీరు పరిచారకులైనను తమ కాళ్లపై తాము నిలబడేవారై యుండాలి. (2 థెస్సలొనీకయులు 3:10-12) . . . ఒక యౌవన క్రైస్తవునికి, ఈ బైబిలు సూత్రాలను గౌరవించుటకు, తన క్రైస్తవ బాధ్యతను నెరవేర్చుటకు ఎంత విద్య అవసరము? . . . సువార్త యొక్క పయినీరు సేవకులుగా ఉండగోరువారికి . . . ఎంత జీతం ‘తగినంత’ అని చెప్పవచ్చు? సాధారణంగా, అలాంటి వారికి తమ సహోదరులపై లేక కుటుంబంపై ‘భారం’ పెట్టకుండా ఉండటానికి పార్ట్ టైమ్ పని సరిపోతుంది.—1 థెస్సలొనీకయులు 2:9.”
9 పూర్తి-కాల సేవ చేయునట్లు క్రమపయినీరు కాగల వ్యక్తికి అదనపు విద్య అవసరమని భావించినట్లైతే నవంబరు 1, 1992 వాచ్‌టవర్ ఇలా సిఫారసు చేసింది: “ఇంటివద్ద జీవిస్తూ, మామూలు క్రైస్తవ పఠన అలవాట్లను కలిగి, కూటములకు హాజరౌతూ, ప్రకటన పనిలో పాల్గొంటూ ఉండగలిగితే ఒక క్రైస్తవ యౌవనస్థుడు అలా చేయవచ్చు.”
10 తనకు పయినీరు సేవ చేయాలని ఉన్నా, వృత్తివిద్యాపాఠశాలకు వెళ్లవలసి వచ్చిన ఒక 22 సంవత్సరాల యౌవనస్థుని గూర్చిన అనుభవం ఆఫ్రికా నుండి వచ్చింది. వృత్తివిద్యాపాఠశాలలో ఉండగానే, సహాయ పయినీరు అయ్యాడు. కచ్చితంగా పరీక్షల్లో విఫలమౌతాడని అతని స్నేహితులు ఎగతాళి చేశారు. వారికి అతని జవాబు ఎప్పుడూ ఇలా ఉండింది: “దేవుని రాజ్యమును, ఆయన నీతిని మొదట వెదకుడి”. స్వయంశిక్షణ కలిగివుంటూ, ప్రతి ఉదయం వేకువనే లేచి రెండు గంటలసేపు పాఠాలు సిద్ధపడి, మధ్యాహ్నం తరగతులు అయిపోయాక ప్రాంతీయసేవలో పాల్గొనేవాడు. ప్రత్యేక వేతనమివ్వబడు బహుమానం కొరకు ముగ్గురు శ్రేష్ఠమైన విద్యార్థులను ఎన్నుకొనుటకు నిర్వహించే ప్రత్యేకమైన పరీక్షల్లో అతను మూడవ స్థానం పొందినప్పుడు మొత్తం పాఠశాలంతా నిర్ఘాంతపోయింది. మన ఈ పయినీరు సహోదరుడు పాఠశాలలో బైబిలు పఠనమును నిర్వహిస్తున్నటువంటి మరో ఆసక్తిగల వ్యక్తియే రెండవ స్థానం పొందిన విద్యార్థి. మొదటి స్థానం పొందిన విద్యార్థి ఎవరనగా ఆసక్తి కలిగినటువంటి ఇంకో యౌవన సాక్షి.
11 పెద్దలు తమ వంతు నిర్వహిస్తారు: పయినీర్లు చేసే పనినిబట్టి గర్వించగల పెద్దలు, ఆసక్తిగల ఈ పరిచారకులకు గొప్ప ప్రోత్సాహమును అందిస్తారు. కష్టపడి పనిచేసే, ఫలభరితులైన పయినీర్లు ఏ సంఘానికైనా ఆశీర్వాదకరమే అని వారికి తెలుసు. క్రమ పయినీరు సేవలో ఒక సంవత్సరం లేక అంతకంటె ఎక్కువ గడిపిన తర్వాత అటువంటి వారు పయినీరు సేవా పాఠశాలలో అదనపు శిక్షణ కొరకు అర్హులౌతారు. పయినీర్లుగా వారు తమ సమర్థతను పెంచుకొనుటకు ఈ శిక్షణ ఎంతో విలువైనదిగా రుజువయ్యింది. పయినీర్లు ఈ పనిలో ముందు నడచువారిగా ఉన్ననూ, వారికి కూడా ప్రేమపూర్వకమైన ప్రోత్సాహము అవసరమే. పెద్దలు ఈ అవసరతను తీర్చుటకు మెలకువగా ఉండాలి.—1 పేతు. 5:1-3.
12 క్రమ పయినీరు పనికి పెద్దలు ఎలా ప్రేరణనివ్వగలరు? ఇందుకు మొదటిగా, అప్పుడప్పుడు ఈ ఆధిక్యతకు ఎవరు చేరుకోగలరో సమీక్షిస్తుండాలి. పయినీరు సేవచేయుటకు అనుకూలత ఉన్నవారిని, అనగా ఒక క్రమ పద్ధతిలో సహాయ పయినీర్లుగా చేసేవారిని, రిటైరైనవారిని, గృహిణులను, విద్యార్థులను సమీపించవచ్చును. ఇందులో పాల్గొనే విధి వారికున్నట్లు భావించకుండునట్లు చేస్తూ, ఆశ మాత్రము ఉండి, పాల్గొనడానికి సంకోచించేవారిని, ఆచరణాత్మకమైన స్వల్ప ప్రోత్సాహముతో వారికి పయినీరు పని అందుబాటులో ఉన్నట్లు వారు భావించేలా చేయవచ్చును.
13 ఈ సేవను చేయుటకు ఇష్టపడువారికి ప్రోత్సాహమిచ్చుటలో పెద్దలు ఒకరు క్రమ పయినీరగుటకు ముందు అనేక మాసములు సహాయ పయినీరుగా గడపాల్సిన అవసరంలేదని పెద్దలు మనస్సునందుంచుకొనవలెను. (km 10/86 ఇన్సర్ట్ 24-26 పేరాలు) అయితే అభ్యర్థి అవసరమైన గంటలను చేరుకోగలడనే సహేతుకమైన నిర్ణయమునకు రావలెను.
14 దరఖాస్తును సంఘ సేవా కమిటీ పునఃసమీక్షించిన తర్వాత, కార్యదర్శి దరఖాస్తులో చూపబడిన అన్ని ప్రశ్నలకు సమాధానం వ్రాయబడినట్లు నిశ్చయించిన తర్వాత, ఏవిధమైన ఆలస్యంలేకుండా దానిని సొసైటికి పంపవలెను.
15 క్రమపయినీర్లు ఎదుర్కొంటున్న సమస్యలేమైనా ఉంటే కార్యదర్శి పెద్దలకు వాటిని తెలియజేయవలెను. ప్రాముఖ్యముగా ఇది అనేకమంది పయినీర్లున్న సంఘములలో అవసరము. సేవా సంవత్సరపు ముగింపులో కాంగ్రిగేషన్ ఎనాల్సిస్ రిపోర్టు (S-10) ఆధారంగా పునఃసమీక్షించుటతోపాటు, ఎవరు పని గంటల విషయంలో వెనుకబడివున్నారో లేక ఎవరు వ్యక్తిగత అవధానము అవసరతలో ఉన్నారో చూచేలాగున కార్యదర్శి వానిని సందర్శించుమని సేవాధ్యక్షుని మార్చి నెల ప్రథమ భాగంలో ఆహ్వానించవలెను. (1993 ఫిబ్రవరి మన రాజ్య పరిచర్య ప్రకటనలను చూడండి.) ఆలస్యం చేయకుండా సహాయమందించినట్లయినా, పయినీరు సేవా సంవత్సరమును విజయవంతముగా ముగించగలడు.
16 క్రమపయినీర్లలలో ఎక్కువమంది, వయస్సులో చిన్నవారై చాలావరకు సత్యములో క్రొత్తవారైయున్నారు. వారి ఇష్టపూర్వకమైన ఆత్మ నిజంగా మనలను ఆనందపరుస్తుంది. అయినా ఈ క్రొత్తవారు ఇంటింటి పనిలో నైపుణ్యాన్ని పెంచుకొనడానికి, సమర్థవంతంగా పునర్దర్శనాలను చేయడానికి, బైబిలు పఠనాలలో బోధించడానికి తర్ఫీదు అవసరం. ఇలాంటి తర్ఫీదు పొందకపోతే, క్రొత్తవారు దాదాపు ఒక సంవత్సరం లేక ఆపై కొంతకాలంలో వారి పరిచర్యలో మంచి ఫలితాలను పొందక పోవుటనుబట్టి పయినీరు సేవను విరమించుకోవచ్చును. జాగరూకతగల పెద్దలు చిన్న సమస్యలను లేక పనిలో వెనుకబడుటను వెంటనే గమనించవచ్చును. తక్షణ అవధానమిచ్చి పయినీరు సమస్యకు తగిన సహాయం అందించబడితే, అనేక సంవత్సరముల ఫలవంతమైన సేవను వారు ఆనందించగలరు.
17 దూర ప్రాంతజలాలలో నీవు చేపలు పట్టగలవా? యేసు శిష్యులలో కొందరు చేపలు పట్టువారు. కొన్నిసార్లు రాత్రంతా చేపలు పట్టినను వారి వలలు నిండలేదు. (యోహాను 21:3) ‘మనుష్యులను పట్టు’ పని అనేక సంవత్సరములు జరిగిన ఈ దేశములోని కొన్ని నగరాలలో ‘చేపలు పట్టు’ పనిగూర్చి తగిన శ్రద్ధవహించగల అనేకమంది ఆసక్తిగల సాక్షులతో నిండిన పెద్ద సంఘములున్నవి. కొందరు చివరకు వారి సంఘ ప్రాంతములోని “జలాలలో” “చేపలు” ఎక్కువలేవు అనే ముగింపుకు రాగలిగారు. (మత్తయి 4:19) కాని అందుకు భిన్నముగా ప్రచారకులు, పయినీర్లు ఎక్కువ బైబిలు పఠనములను నిర్వహిస్తున్న నగరముల నుండి వస్తున్న నివేదికలను వినుట పులకరింప జేయుట లేదా? ఈ పట్టణాలలో పయినీర్లు పొందుతున్న ఆనందము స్పష్టంగా కన్పిస్తుంది. (w92 9/1 పేజి. 20 పేరా 15) అందుచేత కష్టపడి పనిచేసే క్రమపయినీర్లు ఎక్కువ అవసరత ఉన్న మరొక పట్టణమునకు స్వచ్ఛందముగా కదలివెళ్లగల స్థితిలో ఉండి అలా తలస్తుంటే అలా తరలివెళ్లుటకు ముందు ఈ విషయమును వారు బ్రాంచి ఆఫీసును అడిగి తెలుసుకోవాలి.
18 మొదట, కొందరు పయినీరు సేవచేయడం సరైన చర్య అని వారికి తెలుసుకాబట్టి దానిని ప్రారంభించినను, దానిని విజయవంతముగా నెరవేర్చగలమా అని వారు ఆశ్చర్యపడవచ్చును. ఆ సేవను కొన్ని సందేహాలతో, లేక షరతులతో చేపట్టవచ్చును. మొదట్లో ప్రాంతములో వచ్చే ఫలితాలు తక్కువగా కూడా ఉండవచ్చును. అయినా తగిన కాలంలో వారి నైపుణ్యము వృద్ధిచెంది వారి పనిపై యెహోవా ఆశీర్వాదము ఉన్నట్లు రుజువైంది. తత్ఫలితముగా వారి ఆనందము, నమ్మకము పెరిగింది. కొంతమందికి పయినీరు సేవ బేతేలు సేవకు, చివరకు ప్రయాణపనికి ఊతనిచ్చేదిగా తయారైంది.
19 ఒక క్రమపయినీరుగా ఒక దూర పట్టణమునకు తరలివెళ్లడం సాధ్యం కాకపోవచ్చు. కాని ప్రస్తుతం మీ ప్రాంతం ఫలవంతంగా లేకపోతే, మీ రాష్ట్రంలోనే మరో ప్రాంత జలాలలో చేపలుపట్టు అవకాశముండవచ్చును. అలా వెళ్లడానికి జీవిత విధానములో సర్దుబాట్లు అవసరమవుతాయి, గాని ఆత్మీయ దీవెనలు మాత్రం గొప్పగా ఉంటాయనుట తథ్యం.—మత్తయి 6:19-21.
20 లేక, మీ పరిస్థితులు అనుమతించినట్లైతే, మీ స్వంత సర్క్యూట్లో దగ్గరలో ఉన్న సంఘానికి సహాయపడవచ్చు. మీరు అర్హులైనట్లైతే, మరొక పయినీరు ద్వారా మేలు పొందగల సర్క్యూట్‌లోని సంఘాలగూర్చి సలహాలిచ్చుటకు మీ ప్రయాణకాపరి సంతోషించును.
21 కొంతమంది పయినీర్లు, ప్రచారకులు ఇంటివద్ద ఉండే తమ స్వంత ప్రాంతంలోని అవసరతలను తీర్చగలిగారు. వారికి వేరే భాష తెలిసియుండవచ్చు. మీ ప్రాంతంలో చెప్పుకొనదగినంతమంది వేరే భాషను మాట్లాడేవారిని మీరు కనుగొన్నారా? తమ స్వభాష మాట్లాడే వారి యొద్ద నుండి రాజ్యసమాచారం పొందవలసిన అవసరతగల వారు ఉన్నారా? అన్ని రకాల ప్రజలకు రాజ్య సమాచారం అందజేయుటకు ఇంకొక భాష వచ్చిన వారుండడం ఎంతో ప్రయోజనకరం. ఇది నిజంగా సవాలు వంటిదే అయినప్పటికీ, అది చాల ప్రతిఫలదాయకమైనది కూడ అని రుజువయ్యింది.—1 తిమో. 2:4; తీతు 2:11.
22 యెహోవాను ఘనపర్చుటకు ప్రస్తుతం మీరు చేయగలిగినదంతా చేస్తున్నట్లైతే, సేవలో ఇప్పుడు మీకున్న ఆధిక్యతలలో ఆనందించండి. ఇంకా ఎక్కువ చేయగలనని మీరనుకుంటే, విషయాన్ని ప్రార్థనయందు యెహోవాకు తెలియజేయండి. ఏ మార్పులు చేసుకోవటానికి మీ పరిస్థితులు అనుకూలిస్తాయో వాస్తవంగా విశ్లేషించండి. ప్రయాణ కాపరితోగాని, పయినీరు స్ఫూర్తి ఉన్న పెద్దతోగాని మీ ఏర్పాట్లను గూర్చి మాట్లాడండి. మీరు ప్రార్థనాపూర్వకంగా ఆచరణయోగ్యమైన నిర్ణయం తీసుకున్నట్లైతే, తనను ఘనపర్చేవారిని ఘనపరుస్తానన్న యెహోవా వాగ్దానమందు విశ్వాసముంచి, వెంటనే ముందుకు సాగండి.—హెబ్రీ. 13:5, 6; 1 సమూ. 2:30.