6వ అధ్యాయం
మనం చనిపోయాక ఎక్కడికి వెళ్తాము?
1-3. మరణం గురించి అందరికీ ఏ ప్రశ్నలు వస్తాయి, వాటికి కొన్ని మతాలు ఎలా జవాబు ఇస్తాయి?
ఒక సమయానికి “మరణం ఇక ఉండదు” అని బైబిలు మాట ఇస్తుంది. (ప్రకటన 21:4) విమోచన క్రయధనం మనకు శాశ్వతంగా జీవించే అవకాశాన్ని ఇస్తుందని 5వ అధ్యాయంలో నేర్చుకున్నాం. అయినా మనుషులు చనిపోతూనే ఉన్నారు. (ప్రసంగి 9:5) కాబట్టి మనకు వచ్చే ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, చనిపోయాక మనకు ఏమవుతుంది?
2 మనకు ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఇలా ఆలోచిస్తుండవచ్చు: ‘ఆయన ఎక్కడికి వెళ్లిపోయాడు? మనల్ని చూస్తున్నాడా? మనకు సహాయం చేస్తాడా? మళ్లీ ఆయనను ఎప్పుడైనా చూస్తామా?’
3 ఈ ప్రశ్నలకు మతాలు వేర్వేరు జవాబులు ఇస్తాయి. కొంతమంది మీరు మంచివాళ్లైతే దేవుని దగ్గరికి వెళ్తారని, చెడ్డవాళ్లైతే నరకంలో కాలుతుంటారని నేర్పిస్తారు. ఇంకొంతమంది, చనిపోయినవాళ్లు ఆత్మలుగా మారి ఇదివరకు చనిపోయిన తమ కుటుంబ సభ్యుల్ని కలుసుకుని వాళ్లతో ఉంటారు అని అంటారు. మిగతావాళ్లు మీరు చనిపోయి మీకు తీర్పు జరిగాక మీరు మళ్లీ పుడతారని, లేదా వేరే శరీరంతో బహుశా మనిషిగా అయినా కనీసం జంతువుగా అయినా పునర్జన్మ ఎత్తుతారని అంటుంటారు.
4. మరణం గురించి మతాలన్నీ నేర్పించే ఒక విషయం ఏంటి?
4 మతాలు వేరువేరుగా బోధిస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ చివరికి అన్నీ మతాలు ప్రాథమికంగా ఒకే విషయాన్ని నేర్పిస్తాయి. మనిషి చనిపోయాక, వాళ్లలో ఏదో ఒక భాగం బ్రతికే ఉంటుంది. అది నిజమేనా?
చనిపోయాక మనం ఎక్కడికి వెళ్తాం?
5, 6. చనిపోయాక మనకు ఏమి అవుతుంది?
5 చనిపోయాక మనుషులకు ఏమవుతుందో యెహోవాకు తెలుసు, మనిషి చనిపోయాక, అంతటితో అతని జీవితం ఆగిపోతుంది అని ఆయన మనకు చెప్పాడు. మరణం జీవానికి వ్యతిరేకం. కాబట్టి ఎవరైనా చనిపోయినప్పుడు అతని మనసు, అతని ఆలోచనలు ఎక్కడో బ్రతికి ఉండవు.a చనిపోయినప్పుడు మనం చూడలేము, వినలేము, అసలు ఆలోచించలేము.
6 రాజైన సొలొమోను “చనిపోయినవాళ్లకు ఏమీ తెలీదు” అని రాశాడు. చనిపోయిన వాళ్లు ప్రేమించలేరు, పగ పెట్టుకోలేరు. “సమాధిలో పని గానీ, ఉపాయం గానీ, జ్ఞానం గానీ, తెలివి గానీ ఉండదు.” (ప్రసంగి 9:5, 6, 10 చదవండి.) ఎవరైనా చనిపోయినప్పుడు “వాళ్ల ఆలోచనలు” ఆగిపోతాయి అని కీర్తన 146:4 లో బైబిలు చెప్తుంది.
మరణం గురించి యేసు ఏమి చెప్పాడు?
యెహోవా మనుషుల్ని ఎల్లప్పుడూ భూమి మీద బ్రతికి ఉండడానికే చేశాడు
7. మరణం గురించి యేసు ఏమని చెప్పాడు?
7 తన స్నేహితుడైన లాజరు చనిపోయినప్పుడు యేసు శిష్యులతో ఇలా అన్నాడు: “మన స్నేహితుడు లాజరు నిద్రపోతున్నాడు.” అంటే అతను విశ్రాంతి తీసుకుంటున్నాడు అని అర్థం కాదు. తర్వాత యేసు “లాజరు చనిపోయాడు” అని అన్నాడు. (యోహాను 11:11-14) యేసు మరణాన్ని నిద్రతో పోల్చాడు. లాజరు పరలోకానికి వెళ్ళాడని, లేదా చనిపోయిన కుటుంబ సభ్యులను కలుసుకున్నాడని యేసు చెప్పలేదు. అతను నరకంలో చిత్రహింసలు అనుభవిస్తున్నాడని, లేదా మనిషిగానో జంతువుగానో మళ్లీ పుట్టాడని కూడా చెప్పలేదు. కానీ లాజరు గాఢ నిద్ర లాంటి స్థితిలో ఉన్నట్లుగా చెప్పవచ్చు. మరొక చోట కూడా మరణాన్ని యేసు గాఢ నిద్రతో పోల్చాడు. యాయీరు కుమార్తెను లేపినప్పుడు యేసు “ఆమె చనిపోలేదు, నిద్రపోతోంది అంతే” అని చెప్పాడు.—లూకా 8:52.
8. దేవుడు మనుషుల్ని చనిపోవడానికి చేయలేదని మనకు ఎలా తెలుసు?
8 ఆదాముహవ్వలు కొంతకాలం జీవించి తర్వాత చనిపోవాలని దేవుడు సృష్టించాడా? లేదు. యెహోవా వాళ్లను మంచి ఆరోగ్యంతో ఎప్పుడూ బ్రతికే ఉండాలని సృష్టించాడు. యెహోవా మనుషుల్ని చేసినప్పుడు ఎల్లప్పుడూ బ్రతికి ఉండాలనే కోరికను వాళ్లలో పెట్టాడు. (ప్రసంగి 3:11) పిల్లలు పెరిగి తర్వాత ముసలివాళ్లై చనిపోవాలని తల్లిదండ్రులు కోరుకోరు కదా, యెహోవా కూడా మన గురించి అలానే ఆలోచిస్తాడు. మరి దేవుడు మనల్ని ఎప్పుడూ బ్రతికి ఉండాలనే ఉద్దేశంతో సృష్టిస్తే మనం ఎందుకు చనిపోతున్నాం?
మనం ఎందుకు చనిపోతున్నాం?
9. దేవుడు ఆదాముహవ్వకు ఇచ్చిన ఆజ్ఞ న్యాయమైనదే కానీ పాటించడానికి కష్టమైనది ఎందుకు కాదు?
9 ఏదెను తోటలో, యెహోవా ఆదాముతో ఇలా అన్నాడు: “ఈ తోటలోని ప్రతీ చెట్టు పండ్లను నువ్వు తృప్తిగా తినొచ్చు. కానీ, మంచిచెడుల తెలివినిచ్చే చెట్టు పండ్లను మాత్రం నువ్వు తినకూడదు; ఎందుకంటే దాని పండ్లను తిన్న రోజున నువ్వు ఖచ్చితంగా చనిపోతావు.” (ఆదికాండం 2:9, 16, 17) దేవుడు స్పష్టంగా ఇచ్చిన ఆ ఆజ్ఞ పాటించడం అంత కష్టమేమీ కాదు. ఆదాము, హవ్వకు ఏది మంచో ఏది చెడో చెప్పే హక్కు యెహోవాకు ఉంది. యెహోవాకు లోబడడం ద్వారా ఆదాము, హవ్వ ఆయన అధికారానికి లోబడుతున్నారని చూపించేవాళ్లు. అంతేకాదు యెహోవా వాళ్లకు ఇచ్చిన వాటన్నిటిని బట్టి ఆయనకు ఎంత కృతజ్ఞులై ఉన్నారో చూపించి ఉండేవాళ్లు.
10, 11. (ఎ) సాతాను ఆదాముహవ్వను ఎలా మోసం చేశాడు? (బి) ఆదాము, హవ్వకు ఎందుకు క్షమాపణ లేదు?
10 విచారకరంగా ఆదాము, హవ్వ దేవునికి లోబడకూడదని నిర్ణయించుకున్నారు. సాతాను హవ్వతో: “ఈ తోటలో ఉన్న అన్ని చెట్ల పండ్లనూ మీరు తినకూడదని దేవుడు నిజంగా చెప్పాడా?” అని అడిగాడు. అందుకు హవ్వ ఇలా జవాబిచ్చింది: “మేము ఈ తోటలోని చెట్ల పండ్లను తినొచ్చు. కానీ ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు పండ్ల గురించి దేవుడు, ‘మీరు దాని పండ్లను తినకూడదు, అసలు దాన్ని ముట్టకూడదు; లేకపోతే మీరు చనిపోతారు’ అని చెప్పాడు.”—ఆదికాండం 3:1-3.
11 తర్వాత సాతాను ఇలా అన్నాడు: “మీరు చావనే చావరు. మీరు దాని పండ్లను తిన్న రోజునే మీ కళ్లు తెరుచుకుంటాయని, మీకు మంచిచెడులు తెలిసి మీరు దేవునిలా అవుతారని దేవునికి తెలుసు.” (ఆదికాండం 3:4-6) ఏది మంచో ఏది చెడో తన సొంతగా నిర్ణయించుకోవచ్చని హవ్వ అనుకునేలా సాతాను చేయాలనుకున్నాడు. అదే సమయంలో దేవునికి లోబడకపోతే ఏమి జరుగుతుంది అనే విషయంలో సాతాను హవ్వకు అబద్ధం చెప్పాడు. హవ్వ చనిపోదని సాతాను చెప్పాడు కాబట్టి హవ్వ ఆ పండు తిని భర్తకు కూడా ఇచ్చింది. యెహోవా ఆ పండు తినవద్దు అని చెప్పాడని ఆదాము, హవ్వకు తెలుసు. వాళ్లు ఆ పండు తిన్నప్పుడు దేవుడు ఇచ్చిన స్పష్టమైన, న్యాయమైన ఆజ్ఞకు లోబడాల్సిన అవసరం లేదని నిర్ణయించుకున్నారు. దాన్ని తినడం ద్వారా వాళ్లు యెహోవాను వాళ్ల ప్రేమగల పరలోక తండ్రిగా గౌరవించడం లేదని చూపించారు. వాళ్లు చేసిన దానికి క్షమాపణే లేదు.
12. ఆదాముహవ్వ యెహోవాకు లోబడకుండా ఉండడం ఎందుకు చాలా నిరాశ కలిగిస్తుంది?
12 మన మొదటి తల్లిదండ్రులు వాళ్ల సృష్టికర్త మీద గౌరవం లేకుండా ప్రవర్తించడం చాలా నిరాశ కలిగిస్తుంది. మీరు కష్టపడి కొడుకుని గానీ కూతురుని గానీ పెంచి పెద్ద చేశాక వాళ్లు మీకు ఎదురు తిరిగి మీరు వద్దు అన్న పనిని చేస్తే మీకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మీ గుండె పగిలిపోయే పరిస్థితి రాదా?
ఆదాము మట్టి నుండి వచ్చాడు, మళ్లీ మట్టిలోకే వెళ్లిపోయాడు
13. “తిరిగి మట్టికి చేరుతావు” అని యెహోవా చెప్పిన మాటల అర్థం ఏంటి?
13 ఆదాముహవ్వ అవిధేయత చూపించినప్పుడు వాళ్లు శాశ్వతంగా జీవించే అవకాశాన్ని పోగొట్టుకున్నారు. యెహోవా ఆదాముతో “నువ్వు మట్టే కాబట్టి తిరిగి మట్టికి చేరుతావు” అని చెప్పాడు. (ఆదికాండం 3:19 చదవండి.) అంటే ఆదాము మళ్లీ మట్టి అయిపోతాడు, అంటే యెహోవా ఆదామును అసలు సృష్టించనట్లుగా అయిపోతాడు. (ఆదికాండం 2:7) ఆదాము దేవుని మాట వినకపోవడం వల్ల చనిపోయాడు, ఆయన ఇంక అసలు ఎక్కడా లేడు.
14. మనం ఎందుకు చనిపోతాం?
14 ఆదాముహవ్వ దేవునికి లోబడి ఉంటే, వాళ్లు ఇప్పటికీ బ్రతికి ఉండేవాళ్లు. కానీ వాళ్లు అవిధేయత చూపించడం ద్వారా పాపం చేశారు, తర్వాత కొంతకాలానికి చనిపోయారు. పాపం మన మొదటి తల్లిదండ్రుల నుండి మనకు వారసత్వంగా వచ్చిన ఒక ఘోరమైన జబ్బు లాంటిది. మనమంతా పాపులుగా పుడతాం, అందుకే మనం చనిపోతాం. (రోమీయులు 5:12) కానీ మనుషుల కోసం దేవుడు ఉద్దేశించింది అది కాదు. మనుషులు చనిపోవాలని దేవుడు ఎప్పుడూ అనుకోలేదు, అందుకే బైబిలు మరణాన్ని “శత్రువు” అని పిలుస్తుంది.—1 కొరింథీయులు 15:26.
సత్యం మనల్ని విడుదల చేస్తుంది
15. మరణం గురించిన సత్యం మనల్ని ఎలా విడుదల చేస్తుంది?
15 మరణం గురించిన సత్యం మనల్ని తప్పుడు అభిప్రాయాల నుండి బయట పడేస్తుంది. చనిపోయినవాళ్లకు నొప్పిగానీ, బాధగానీ ఉండవని బైబిలు బోధిస్తుంది. మనం వాళ్లతో మాట్లాడలేం, వాళ్లు మనతో మాట్లాడలేరు. చనిపోయినవాళ్లకు మనం సహాయం చేయలేం, వాళ్లు మనకు సహాయం చేయలేరు. వాళ్లు మనకు హాని చేయలేరు కాబట్టి చనిపోయినవాళ్ల విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. అయితే చాలా మతాలు, చనిపోయినవాళ్లు ఎక్కడో బ్రతికే ఉంటారని, మనం మత గురువులకు లేదా దైవజనులకు డబ్బు ఇచ్చి చనిపోయినవాళ్లకు సహాయం చేయవచ్చని చెప్తాయి. కానీ మనం మరణం గురించిన సత్యం తెలుసుకున్నప్పుడు, ఆ అబద్ధాల వల్ల మోసపోం.
16. చనిపోయినవాళ్ల గురించి చాలా మతాలు ఏ అబద్ధం నేర్పిస్తాయి?
16 సాతాను అబద్ధ మతాన్ని ఉపయోగించి మనకు అబద్ధాలు చెప్తున్నాడు, చనిపోయినవాళ్లు ఇంకా బ్రతికే ఉన్నారని నమ్మేలా చేస్తున్నాడు. ఉదాహరణకు, కొన్ని మతాలు మనం చనిపోయినా మనలో ఏదో ఒక భాగం ఎక్కడో ఒక చోట బ్రతికే ఉంటుందని చెప్తాయి. మీ మతం కూడా అదే విషయాన్ని నేర్పిస్తుందా? లేదా చనిపోయినవాళ్ల గురించి బైబిలు చెప్పే విషయాన్ని నేర్పిస్తుందా? ప్రజలను యెహోవా నుండి దూరం చేయడానికి సాతాను అబద్ధాలను ఉపయోగిస్తున్నాడు.
17. మనుషుల్ని నరకంలో కాల్చే బోధ ఎందుకు యెహోవాకు అవమానం తెస్తుంది?
17 చాలా మతాలు నేర్పించే విషయాలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఉదాహరణకు చెడ్డవాళ్లను నరకంలో కాలుస్తారని కొంతమంది చెప్తారు. ఆ అబద్ధం యెహోవాను అవమానపరుస్తుంది. ఆయన ఎప్పుడూ ప్రజలు అలా బాధపడడానికి ఒప్పుకోడు! (1 యోహాను 4:8 చదవండి.) పిల్లలు తప్పు చేశారని తల్లిదండ్రులు ఎవరైనా వాళ్ల చేతుల్ని మంటలో కాలుస్తారా? అది చాలా కిరాతకం అని మీకు అనిపిస్తుంది కదా. అలాంటి వాళ్లతో పరిచయం పెంచుకోవాలని కూడా మీరు అనుకోరు. ఖచ్చితంగా మనం యెహోవా గురించి అలానే అనుకోవాలని సాతాను కోరుకుంటున్నాడు.
18. మనం చనిపోయినవాళ్లకు ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు?
18 కొన్ని మతాలు మనుషులు చనిపోయాక ఆత్మలు అవుతారు అని చెప్తాయి. ఆ మతాలు మనం ఆత్మలకు భయపడాలని వాటిని గౌరవించాలని నేర్పిస్తాయి. ఎందుకంటే ఆత్మలు శక్తివంతమైన స్నేహితులుగా లేదా భయంకరమైన శత్రువులుగా అవుతాయని అంటారు. చాలామంది ఆ అబద్ధాన్ని నమ్ముతారు. వాళ్లు చనిపోయినవాళ్లకి భయపడతారు కాబట్టి యెహోవాను ఆరాధించే బదులు చనిపోయిన వాళ్లను ఆరాధిస్తారు. గుర్తుంచుకోండి, చనిపోయినవాళ్లకు ఏమి తెలియదు, వాళ్లు ఏమి అర్థం చేసుకోలేరు కాబట్టి మనం వాళ్లంటే భయపడాల్సిన అవసరం లేదు. యెహోవాయే మన సృష్టికర్త. ఆయనే నిజమైన దేవుడు, మనం ఆయనను మాత్రమే ఆరాధించాలి.—ప్రకటన 4:11.
19. చనిపోయినవాళ్ల గురించిన సత్యం తెలుసుకోవడం మనకు ఎలా సహాయం చేస్తుంది?
19 మరణం గురించిన సత్యం మనకు తెలిసినప్పుడు, మతసంబంధమైన అబద్ధాల నుండి మనం బయటపడవచ్చు. ఆ సత్యం మన జీవితం గురించి, భవిష్యత్తు గురించి యెహోవా చేసిన అద్భుతమైన వాగ్దానాలను అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది.
20. మనం తర్వాత అధ్యాయంలో ఏమి నేర్చుకుంటాం?
20 చాలాకాలం క్రితం, దేవుని సేవకుడైన యోబు ఇలా అడిగాడు: “మనిషి చనిపోతే మళ్లీ బ్రతకగలడా?” (యోబు 14:14) చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతకడం నిజంగా సాధ్యమేనా? బైబిల్లో దేవుడు ఇచ్చే సమాధానం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అదేంటో మనం తర్వాత అధ్యాయంలో చూస్తాం.
a ఆత్మ లేదా జీవాత్మ, మనిషి చనిపోయాక కూడా బ్రతికే ఉంటుందని కొంతమంది నమ్ముతారు. దీని గురించి ఎక్కువ సమాచారం కోసం అదనపు సమాచారంలో 17, 18 పాయింట్లు చూడండి.