కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lvs అధ్యా. 15 పేజీలు 200-212
  • మీ పనిలో ఆనందించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ పనిలో ఆనందించండి
  • దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి
  • “దేవుని ప్రేమ”లో చదవండి
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పని విషయంలో ఇద్దరు ఆదర్శవంతులు
  • పని విషయంలో మన అభిప్రాయం ఎలా ఉండాలి?
  • ఎలాంటి ఉద్యోగాన్ని ఎంచుకోవాలి?
  • ‘ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో పరిశీలించి తెలుసుకోండి’
  • అత్యంత ప్రాముఖ్యమైన పని
  • మనం ఎందుకు పనిచేయాలి?
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
  • మీ పని అంతటిలో ఆనందాన్ని వెదకండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • పనిపట్ల సమతుల్యమైన దృక్కోణాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • మీకు మీ పనంటే విసుగ్గా ఉందా?
    తేజరిల్లు!—1998
మరిన్ని
దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి
lvs అధ్యా. 15 పేజీలు 200-212
పని స్థలంలో తోటి ఉద్యోగికి సాక్ష్యమిస్తున్న సహోదరుడు

15వ అధ్యాయం

మీ పనిలో ఆనందించండి

“ప్రతీ వ్యక్తి . . . తన కష్టమంతటిని బట్టి సుఖపడాలి.”—ప్రసంగి 3:13.

1-3. (ఎ) పని గురించి చాలామంది ఏమనుకుంటున్నారు? (బి) ఈ అధ్యాయంలో ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమను, తమ కుటుంబాల్ని పోషించుకోవడానికి కష్టపడి పనిచేస్తున్నారు. అయితే చాలామందికి వాళ్ల ఉద్యోగం నచ్చదు, కొంతమందైతే రోజూ ఉద్యోగానికి వెళ్లాలంటే భయపడతారు. మీ పరిస్థితీ అదే అయితే, పనిలో ఆనందించడానికి మీరేం చేయవచ్చు? మీ పనిని మీరెలా ఇష్టపడవచ్చు?

2 యెహోవా మనకు ఇలా చెప్తున్నాడు: “ప్రతీ వ్యక్తి తింటూ తాగుతూ తన కష్టమంతటిని బట్టి సుఖపడాలి. ఇది దేవుడు ఇచ్చిన బహుమతి.” (ప్రసంగి 3:13) పని చేయాల్సిన అవసరంతో, పని చేయాలనే కోరికతో యెహోవా మనల్ని సృష్టించాడు. మనం చేసే పనిని ఇష్టపడాలని ఆయన కోరుకుంటున్నాడు.—ప్రసంగి 2:24; 5:18 చదవండి.

3 మరి మన పనిలో ఆనందించడానికి ఏది సహాయం చేస్తుంది? క్రైస్తవులు ఎలాంటి ఉద్యోగాలు చేయకూడదు? మన పనిని, యెహోవా ఆరాధనను ఎలా సమతుల్యం చేసుకోవచ్చు? మనం చేయగల అత్యంత ప్రాముఖ్యమైన పని ఏంటి?

పని విషయంలో ఇద్దరు ఆదర్శవంతులు

4, 5. పని విషయంలో యెహోవా అభిప్రాయం ఏంటి?

4 యెహోవాకు పనిచేయడం అంటే చాలా ఇష్టం. ఆదికాండం 1:1 లో ఇలా ఉంది: “మొదట్లో దేవుడు ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు.” దేవుడు భూమిని, దానిమీద ఉన్న వాటన్నిటినీ చేసిన తర్వాత, తన సృష్టిని చూసి “అది చాలా బాగుంది” అన్నాడు. (ఆదికాండం 1:31) తాను చేసింది చూసి సృష్టికర్త సంతోషించాడు.—1 తిమోతి 1:11.

5 యెహోవా ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాడు. యేసు ఇలా అన్నాడు: “నా తండ్రి ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నాడు.” (యోహాను 5:17) యెహోవా చేస్తున్న అద్భుతమైన పనుల్లో అన్నీ తెలియకపోయినా, కొన్ని మనకు తెలుసు. ఉదాహరణకు, పరలోకంలో తన కుమారుడైన యేసుక్రీస్తుతో కలిసి పరిపాలించే వాళ్లను దేవుడు ఎంచుకుంటున్నాడు. (2 కొరింథీయులు 5:17) అంతేకాదు యెహోవా మనుషులకు నిర్దేశం ఇస్తున్నాడు, వాళ్ల బాగోగులు చూసుకుంటున్నాడు. ప్రపంచవ్యాప్త ప్రకటనా పని వల్ల లక్షలమంది యెహోవాను తెలుసుకుని, పరదైసు భూమ్మీద శాశ్వతకాలం జీవించే అవకాశం పొందుతున్నారు.—యోహాను 6:44; రోమీయులు 6:23.

6, 7. యేసు ఎలా కష్టపడి పనిచేశాడు?

6 తన తండ్రిలాగే యేసుకు కూడా పనిచేయడమంటే ఇష్టం. యేసు భూమ్మీదికి రాకముందు, దేవుని “ప్రధానశిల్పిగా” పరలోకంలో, భూమ్మీద ఉన్న వాటన్నిటినీ సృష్టించడంలో సహాయం చేశాడు. (సామెతలు 8:22-31; కొలొస్సయులు 1:15-17) భూమ్మీదికి వచ్చాక కూడా యేసు కష్టపడి పనిచేశాడు. యౌవనంలో ఉన్నప్పుడు ఆయన వడ్రంగి పని నేర్చుకున్నాడు. ఇళ్లకు కావాల్సిన దూలాలు, తలుపులు, బల్లలు, కుర్చీలు చేసివుంటాడు. ఆయన పనిలో ఎంతగా నైపుణ్యం సాధించాడంటే, ఆయనకు “వడ్రంగి” అనే పేరు వచ్చింది.—మార్కు 6:3.

7 అయితే యేసు భూమ్మీద చేసిన అత్యంత ప్రాముఖ్యమైన పని, ప్రజలకు మంచివార్త ప్రకటించి యెహోవా గురించి బోధించడమే. ఆయన ఆ పనిని పూర్తి చేయడానికి మూడున్నర సంవత్సరాలే ఉన్నాయి. కాబట్టి ఆయన తెల్లవారుజాము నుండి రాత్రి చాలా పొద్దుపోయే వరకు కష్టపడి పనిచేశాడు. (లూకా 21:37, 38; యోహాను 3:2) ఆయన దుమ్ముపట్టిన రోడ్ల మీద వందల కిలోమీటర్లు నడిచాడు, వీలైనంత ఎక్కువమందికి మంచివార్త ప్రకటించాడు.—లూకా 8:1.

8, 9. యేసు తన పనిలో ఆనందించాడని ఎలా చెప్పవచ్చు?

8 దేవుని పనిచేయడం యేసుకు ఆహారం లాంటిది. అది ఆయనకు శక్తిని, బలాన్ని ఇచ్చింది. ఆయన కనీసం తినడానికి కూడా సమయం లేనంతగా కష్టపడిన రోజులు ఉన్నాయి. (యోహాను 4:31-38) ఆయన దొరికిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రజలకు తన తండ్రి గురించి నేర్పించాడు. అందుకే ఆయన యెహోవాతో ఇలా అనగలిగాడు: “చేయడానికి నువ్వు నాకు ఇచ్చిన పనిని పూర్తిచేసి భూమ్మీద నిన్ను మహిమపర్చాను.”—యోహాను 17:4.

9 అవును యెహోవా, యేసు ఇద్దరూ కష్టపడి పనిచేస్తారు. తమ పనిలో ఆనందాన్ని, సంతృప్తిని పొందుతారు. మనం ‘దేవుణ్ణి అనుకరించాలని,’ ‘నమ్మకంగా క్రీస్తు అడుగుజాడల్లో నడవాలని’ కోరుకుంటాం. (ఎఫెసీయులు 5:1; 1 పేతురు 2:21) అందుకే మనం కష్టపడి పనిచేయడానికి, ప్రతీ పనిని వీలైనంత మంచిగా చేయడానికి ప్రయత్నిస్తాం.

పని విషయంలో మన అభిప్రాయం ఎలా ఉండాలి?

10, 11. పని విషయంలో మంచి అభిప్రాయం కలిగివుండడానికి ఏది సహాయం చేస్తుంది?

10 యెహోవా ప్రజలమైన మనం మనల్ని, మన కుటుంబాల్ని పోషించుకోవడానికి కష్టపడి పనిచేస్తాం. మన పనిని ఇష్టంగా చేయాలని మనం కోరుకుంటాం, కానీ అది అంత తేలిక కాకపోవచ్చు. మరి మన పనిలో ఆనందించడానికి ఏం చేయవచ్చు?

తన పనిలో ఆనందిస్తున్న ఒక సహోదరుడు

పని విషయంలో మంచి అభిప్రాయం ఉంటే ఏ పనైనా ఆనందంగా చేస్తాం

11 పని విషయంలో మంచి అభిప్రాయంతో ఉండండి. పని విషయంలో మన పరిస్థితుల్ని మార్చుకోలేకపోవచ్చు కానీ మన అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు. యెహోవా మన నుండి ఏం కోరుకుంటున్నాడో అర్థం చేసుకుంటే, పని విషయంలో మంచి అభిప్రాయంతో ఉంటాం. ఉదాహరణకు, కుటుంబ పెద్ద తన కుటుంబ అవసరాల్ని తీర్చడానికి శక్తిమేరకు కృషిచేయాలని యెహోవా కోరుకుంటున్నాడు. అలా చేయని వ్యక్తి “అవిశ్వాసి కన్నా చెడ్డవాడు” అని బైబిలు చెప్తుంది. (1 తిమోతి 5:8) మీరు కుటుంబ పెద్ద అయితే మీ కుటుంబ అవసరాలు తీర్చడానికి కష్టపడి పనిచేయండి. మీ పని మీకు నచ్చినా, నచ్చకపోయినా మీ కుటుంబ అవసరాలు తీర్చడం ద్వారా యెహోవాను సంతోషపెడుతున్నారని గుర్తుంచుకోండి.

తన పనిలో ఆనందిస్తున్న ఒక సహోదరి

12. కష్టపడి పనిచేయడం వల్ల, నిజాయితీగా ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి?

12 కష్టపడి పనిచేయండి, నిజాయితీగా ఉండండి. దానివల్ల మీ పనిలో ఆనందించగలుగుతారు. (సామెతలు 12:24; 22:29) అంతేకాదు, మీ యజమాని మిమ్మల్ని నమ్ముతాడు. నిజాయితీగా పనిచేసే వాళ్లను యజమానులు ఇష్టపడతారు. ఎందుకంటే నిజాయితీపరులు పని స్థలంలో డబ్బును, వస్తువుల్ని దొంగిలించరు, సమయాన్ని వృథా చేయరు. (ఎఫెసీయులు 4:28) అంతకన్నా ముఖ్యంగా మీరు కష్టపడి పనిచేయడం, నిజాయితీగా ఉండడం యెహోవా చూస్తాడు. ఆయన్ని సంతోషపెడుతున్నారనే సంతృప్తి, “మంచి మనస్సాక్షి” మీకు ఉంటాయి.—హెబ్రీయులు 13:18; కొలొస్సయులు 3:22-24.

పని స్థలంలో తోటి ఉద్యోగికి సాక్ష్యమిస్తున్న సహోదరుడు

13. పని స్థలంలో నిజాయితీగా ఉండడం వల్ల ఇంకా ఏ ప్రయోజనాలు రావచ్చు?

13 పని స్థలంలో మీ ప్రవర్తన యెహోవాకు మహిమ తీసుకురావచ్చని గుర్తుంచుకోండి. దానివల్ల కూడా మీ పనిలో ఆనందించగలుగుతారు. (తీతు 2:9, 10) అంతేకాదు మీ మంచి ఆదర్శాన్ని చూసి తోటి ఉద్యోగులు ఎవరైనా బైబిలు అధ్యయనానికి ఒప్పుకోవచ్చు.—సామెతలు 27:11; 1 పేతురు 2:12 చదవండి.

ఎలాంటి ఉద్యోగాన్ని ఎంచుకోవాలి?

14-16. ఉద్యోగాన్ని ఎంచుకునేటప్పుడు మనం వేటి గురించి ఆలోచించాలి?

14 క్రైస్తవులు ఏ ఉద్యోగాలు చేయాలి, ఏ ఉద్యోగాలు చేయకూడదు అనే పట్టిక బైబిల్లో లేదు. అయితే పని విషయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా సహాయం చేసే సూత్రాలు అందులో ఉన్నాయి. (సామెతలు 2:6) బైబిలు సూత్రాల్ని ఉపయోగిస్తూ మనం ఈ ప్రశ్నలు వేసుకోవచ్చు.

వార్తాపత్రికలో ఉద్యోగ ప్రకటనలు చూస్తున్న సహోదరుడు

యెహోవా ప్రమాణాలకు వ్యతిరేకంగా లేని ఉద్యోగాల్ని ఎంచుకోండి

15 నేను ఈ ఉద్యోగంలో యెహోవా అసహ్యించుకునే వాటిని చేయాల్సి వస్తుందా? దొంగతనం చేయడం, అబద్ధాలాడడం వంటివాటిని యెహోవా అసహ్యించుకుంటాడని మనం తెలుసుకున్నాం. (నిర్గమకాండం 20:4; ఎఫెసీయులు 4:28; ప్రకటన 21:8) కాబట్టి యెహోవా ప్రమాణాలకు వ్యతిరేకమైన ఏ పనీ మనం చేయం.—1 యోహాను 5:3 చదవండి.

16 ఈ ఉద్యోగం యెహోవా ఖండించే వాటికి మద్దతిస్తుందా లేదా ప్రోత్సహిస్తుందా? ఉదాహరణకు, మీకు బ్లడ్‌ బ్యాంకులో రిసెప్షనిస్టు ఉద్యోగం వచ్చిందనుకోండి. రిసెప్షనిస్టుగా పనిచేయడంలో తప్పు లేదు. అయితే రక్తం విషయంలో యెహోవా ఆజ్ఞ ఏంటో మీకు తెలుసు. రక్తం తీసుకోవడం, ఎక్కించడం లాంటివి స్వయంగా మీరు చేయకపోయినా, బ్లడ్‌ బ్యాంకులో పనిచేస్తే మీరు వాటికి మద్దతిచ్చినట్టు అవ్వదా? యెహోవా దృష్టిలో మీరూ ఆ తప్పు చేస్తున్నట్టు అవ్వదా?—అపొస్తలుల కార్యాలు 15:29.

17. దేవుణ్ణి సంతోషపెట్టే నిర్ణయాలు ఎలా తీసుకోవచ్చు?

17 దేవుని సూత్రాల సహాయంతో మనం పరిణతిగల వ్యక్తుల్లా ‘వివేచనా సామర్థ్యాల్ని ఉపయోగిస్తూ వాటికి శిక్షణ ఇచ్చుకోవచ్చు, తప్పొప్పుల్ని గుర్తించవచ్చు.’ (హెబ్రీయులు 5:14) మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను ఈ ఉద్యోగం చేస్తే వేరేవాళ్లు అభ్యంతరపడతారా? ఈ ఉద్యోగం వల్ల నా భార్యాపిల్లల్ని వదిలేసి వేరే దేశానికి వెళ్లాల్సి వస్తుందా? అది వాళ్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?’

‘ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో పరిశీలించి తెలుసుకోండి’

18. ఆరాధనకు మొదటి స్థానం ఇవ్వడం ఎందుకు ఒక సవాలుగా ఉండవచ్చు?

18 ఈ ‘ప్రమాదకరమైన, కష్టమైన కాలాల్లో’ మనం యెహోవా ఆరాధనకు మొదటి స్థానం ఇవ్వడం అంత తేలిక కాదు. (2 తిమోతి 3:1) ఉద్యోగం దొరకడం, దాన్ని నిలబెట్టుకోవడం మనకు ఒక సవాలుగా ఉండవచ్చు. కుటుంబ అవసరాలు తీర్చాలని మనకు తెలుసు. అయితే మనం వస్తుసంపదలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే, ఆరాధనకు మొదటి స్థానం ఇవ్వలేం. (1 తిమోతి 6:9, 10) కాబట్టి ‘ఎక్కువ ప్రాముఖ్యమైన వాటికి’ మొదటి స్థానం ఇస్తూనే, కుటుంబ అవసరాలు తీర్చడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?—ఫిలిప్పీయులు 1:10.

19. యెహోవా మీద నమ్మకం ఉంటే ఏం చేస్తాం?

19 యెహోవా మీద పూర్తి నమ్మకం ఉంచండి. (సామెతలు 3:5, 6 చదవండి.) మనకు నిజంగా ఏది అవసరమో యెహోవాకు బాగా తెలుసు, మన మీద ఆయనకు ఎంతో శ్రద్ధ ఉంది. (కీర్తన 37:25; 1 పేతురు 5:7) బైబిలు ఇలా చెప్తుంది: “డబ్బును ప్రేమించకండి, ఉన్నవాటితో సంతృప్తిగా జీవించండి. ఎందుకంటే, దేవుడే ఇలా అన్నాడు: ‘నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను, నిన్ను ఎన్నడూ వదిలేయను.’” (హెబ్రీయులు 13:5) కుటుంబ అవసరాలు తీర్చడం గురించి మనం అదేపనిగా ఆందోళనపడడం యెహోవాకు ఇష్టంలేదు. తన ప్రజల అవసరాలు తీర్చగలనని ఆయన ఎన్నోసార్లు నిరూపించాడు. (మత్తయి 6:25-32) కాబట్టి మన పరిస్థితి ఎలా ఉన్నా క్రమంగా బైబిల్ని అధ్యయనం చేస్తాం, మంచివార్త ప్రకటిస్తాం, కూటాలకు వెళ్తాం.—మత్తయి 24:14; హెబ్రీయులు 10:24, 25.

20. మన జీవితాన్ని సాదాసీదాగా ఎలా ఉంచుకోవచ్చు?

20 మీ కంటిని తేటగా ఉంచుకోండి. (మత్తయి 6:22, 23; అధస్సూచి చదవండి.) అంటే, జీవితాన్ని సాదాసీదాగా ఉంచుకుంటూ యెహోవా ఆరాధనపై దృష్టి నిలపండి. దేవునితో ఉన్న స్నేహానికి కాకుండా డబ్బు, మంచి జీవితం, కొత్తకొత్త వస్తువులు వంటివాటికి ప్రాముఖ్యత ఇవ్వడం మూర్ఖత్వమని మనకు తెలుసు. మరి ముఖ్యమైన విషయాలకు ఎలా మొదటి స్థానం ఇవ్వవచ్చు? అనవసరంగా అప్పులు చేయకండి. ఒకవేళ అప్పు చేసివుంటే, దాన్ని తీర్చడానికి ప్రణాళిక వేసుకోండి. జాగ్రత్తగా లేకపోతే వస్తుసంపదలు మన సమయాన్ని, శక్తిని తినేయవచ్చు. దానివల్ల ప్రార్థించడానికి, అధ్యయనం చేయడానికి, లేదా ప్రకటించడానికి సమయం మిగలకపోవచ్చు. వస్తుసంపదలతో మన జీవితాన్ని చిక్కుల్లో పడేసుకునే బదులు “ఆహారం, బట్టలు” వంటి కనీస అవసరాలతో తృప్తిగా ఉండడం మంచిది. (1 తిమోతి 6:8) ఎప్పటికప్పుడు మీ పరిస్థితుల్ని పరిశీలించుకుంటూ, యెహోవాను ఇంకా ఎక్కువగా ఎలా సేవించవచ్చో ఆలోచించండి.

21. మన జీవితంలో దేనికి మొదటి స్థానం ఇవ్వాలో ఎందుకు నిర్ణయించుకోవాలి?

21 సరైన విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వండి. మన సమయాన్ని, శక్తిని, వస్తుసంపదల్ని తెలివిగా ఉపయోగించాలి. లేదంటే చదువు, డబ్బు వంటి అంతగా ప్రాముఖ్యంకాని విషయాలు మన అమూల్యమైన సమయాన్ని తినేస్తాయి. యేసు ఇలా అన్నాడు: “రాజ్యానికి . . . మొదటిస్థానం ఇస్తూ ఉండండి.” (మత్తయి 6:33) మన నిర్ణయాలు, అలవాట్లు, రోజువారీ పనులు, లక్ష్యాలు వంటివన్నీ మన హృదయంలో దేనికి మొదటి స్థానం ఇస్తున్నామో చూపిస్తాయి.

అత్యంత ప్రాముఖ్యమైన పని

22, 23. (ఎ) క్రైస్తవులకు ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన పని ఏంటి? (బి) మన పనిలో ఆనందించడానికి ఏది సహాయం చేస్తుంది?

22 మనకున్న అత్యంత ప్రాముఖ్యమైన పని యెహోవాను సేవించడం, మంచివార్త ప్రకటించడం. (మత్తయి 24:14; 28:19, 20) యేసులాగే మనం కూడా ఈ పనిలో చేయగలిగినదంతా చేయాలనుకుంటాం. కొంతమంది అవసరం ఎక్కువున్న ప్రాంతానికి వెళ్లి సేవ చేస్తున్నారు. ఇంకొంతమంది వేరే భాష నేర్చుకుని, ఆ భాష మాట్లాడే ప్రజలకు ప్రకటిస్తున్నారు. అలా సేవ చేస్తున్నవాళ్లతో మాట్లాడి, వాళ్లకు ఎలా అనిపిస్తుందో అడగండి. తమ జీవితం ఇప్పుడు మరింత సంతోషంగా, అర్థవంతంగా ఉందని వాళ్లు చెప్తారు.—సామెతలు 10:22 చదవండి.

పరిచర్య చేస్తున్న దంపతులు

యెహోవాను సేవించడమే అత్యంత ప్రాముఖ్యమైన పని

23 నేడు మనలో చాలామందిమి కుటుంబ కనీస అవసరాలు తీర్చడానికి ఉద్యోగంలో ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తోంది. కొందరైతే రెండు మూడు ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది. యెహోవాకు ఇదంతా తెలుసు, కుటుంబాన్ని చూసుకోవడానికి మనం చేస్తున్న కృషి అంతటిని ఆయన గుర్తిస్తాడు. కాబట్టి మనం ఏ పని చేస్తున్నా యెహోవాలా, యేసులా కష్టపడి పనిచేద్దాం. మనకున్న అత్యంత ప్రాముఖ్యమైన పని యెహోవాను సేవించడం, దేవుని రాజ్యం గురించిన మంచివార్త ప్రకటించడం అని గుర్తుంచుకుందాం. ఆ పని మనకు నిజమైన ఆనందాన్ని ఇస్తుంది.

బైబిలు సూత్రాలు

1 యెహోవా మనుషుల్ని పని చేయాలనే కోరికతో సృష్టించాడు

“ప్రతీ వ్యక్తి తింటూ తాగుతూ తన కష్టమంతటిని బట్టి సుఖపడాలి. ఇది దేవుడు ఇచ్చిన బహుమతి.”—ప్రసంగి 3:13

పని దేవుడు ఇచ్చిన బహుమతి అని ఎందుకు చెప్పవచ్చు?

  • ఆదికాండం 1:1, 31; ప్రసంగి 2:24; యోహాను 5:17

    యెహోవా కష్టపడి పనిచేస్తాడు, ఆ పనిలో ఆనందిస్తాడు. మనం కూడా పనిని ఇష్టపడాలని ఆయన కోరుకుంటున్నాడు.

  • సామెతలు 8:22-31; కొలొస్సయులు 1:15-17

    యేసు పరలోకంలో, భూమ్మీద ఎప్పుడూ కష్టపడి పనిచేశాడు.

  • మార్కు 6:3; లూకా 21:37, 38; యోహాను 4:31-38; 17:4

    యేసు ప్రతీ పనిని చాలా నైపుణ్యవంతంగా చేశాడు, కష్టమైనా తనకు అప్పగించిన పనుల్ని పూర్తిచేశాడు.

2 పని విషయంలో మన అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు

“తన పనిలో నైపుణ్యం ఉన్న వ్యక్తిని చూశావా? అతను . . . రాజుల ముందు నిలబడతాడు.”—సామెతలు 22:29

పనిలో ఆనందించడానికి మనకు ఏవి సహాయం చేస్తాయి?

  • సామెతలు 12:24; కొలొస్సయులు 3:22-24; హెబ్రీయులు 13:18

    మన ఉద్యోగాన్ని, పరిస్థితుల్ని మార్చుకోలేకపోవచ్చు కానీ పని విషయంలో మన అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు. మనం నిజాయితీగా ఉండాలని, కష్టపడి పనిచేయాలని కోరుకుంటాం.

  • సామెతలు 27:11; 1 తిమోతి 5:8; 1 పేతురు 2:12

    కుటుంబ అవసరాల్ని తీర్చడం ద్వారా మీరు దేవునికి లోబడుతున్నారు. పని స్థలంలో మీ మంచి ప్రవర్తన యెహోవాకు మహిమ తెస్తుంది.

  • నిర్గమకాండం 20:13-15; సామెతలు 2:6; రోమీయులు 14:19-22; ఎఫెసీయులు 5:28–6:4; 1 యోహాను 5:3; ప్రకటన 18:4

    మనం చేసే పని మనపై, మన కుటుంబంపై, తోటి సహోదర సహోదరీలపై, ముఖ్యంగా యెహోవాపై ఎలాంటి ప్రభావం చూపించవచ్చో తెలుసుకోవడానికి బైబిలు సహాయం చేస్తుంది.

3 సరైన వాటికి ప్రాముఖ్యతను ఇస్తే, పనిని ఆనందించగలుగుతాం

‘ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో పరిశీలించి తెలుసుకోండి.’—ఫిలిప్పీయులు 1:10

దేనికి మొదటి స్థానం ఇవ్వాలి?

  • కీర్తన 37:25; సామెతలు 3:5, 6; 1 పేతురు 5:7

    మీ రోజువారీ అవసరాలేంటో యెహోవాకు తెలుసనే నమ్మకంతో ఉండండి.

  • మత్తయి 6:25-32; 1 తిమోతి 6:8-10; హెబ్రీయులు 13:5

    ఉన్నవాటితో తృప్తిగా ఉండడం నేర్చుకోండి.

  • సామెతలు 10:22; మత్తయి 6:33; 28:19, 20; హెబ్రీయులు 10:24, 25

    యెహోవా సేవకు, మంచివార్త ప్రకటించడానికి మొదటి స్థానం ఇవ్వండి. మనం చేయగల అత్యంత ప్రాముఖ్యమైన పని అదే.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి