కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w92 9/1 పేజీలు 3-8
  • స్వతంత్రులేగాని జవాబుదారులు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • స్వతంత్రులేగాని జవాబుదారులు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దైవిక స్వాతంత్ర్యము—జవాబుదారీతనముతో
  • దేవుడు ఏర్పరచుకున్న ప్రజల స్వాతంత్ర్యము
  • క్రైస్తవ స్వాతంత్ర్యము యొక్క స్వభావము
  • స్వతంత్రులేగాని జవాబుదారులు
  • స్వేచ్ఛకు మూలమైన యెహోవాను సేవించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • నిజమైన స్వేచ్ఛకు మార్గం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • “స్వాతంత్ర్యమును ప్రేమించువారు” అను జిల్లా సమావేశములకు ఆహ్వానము!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • యెహోవా నడిపింపుతో నిజమైన స్వాతంత్రాన్ని పొందండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
w92 9/1 పేజీలు 3-8

స్వతంత్రులేగాని జవాబుదారులు

“[మీరు] సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.”—యోహాను 8:32.

1, 2. (ఎ) మానవ చరిత్రలో స్వాతంత్ర్యము ఎట్లు వర్ణింపబడినది? (బి) నిజముగా ఎవరు మాత్రమే స్వతంత్రులై ఉన్నారు? వివరింపుము.

స్వాతంత్ర్యము. అదెంత శక్తివంతమైన మాట! మానవులు స్వేచ్ఛగా యుండవలెనను కోరిక కారణముగా మానవజాతి అసంఖ్యాకమైన యుద్ధములను, విప్లవములను ఆలాగే లెక్కలేనన్ని సామాజిక గందరగోళములను అనుభవించెను. ది ఎన్‌సైక్లోపీడియా అమెరికానా ఇలా చెప్పుచున్నదనుట నిజమే: ‘నాగరికతా పరిణామమందు, విమోచనకంటె మరే తలంపుకూడ ఎక్కువ ప్రాముఖ్యమైన పాత్ర వహించలేదు.’

2 అయినప్పటికిని, ఎంతమంది ప్రజలు నిజముగా స్వేచ్ఛాజీవులై యున్నారు? అసలు స్వాతంత్ర్యమంటె ఎంతమందికి తెలుసు? ది వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా ఇట్లనుచున్నది: “ప్రజలు సంపూర్ణ స్వాతంత్ర్యమును కలిగియుండాలంటే, వారెట్లు తలంచుదురు, మాట్లాడుదురు, లేక ప్రవర్తించుదురు అనువాటిపై ఎలాంటి ఆంక్షలు ఉండరాదు. తాము ఏమి ఎంపికచేసికొనవచ్చునో వాటిని వారు తెలిసికొనియుండాలి, మరియు వారు ఆ ఎంపికలో తమకిష్టమైన దానిని ఎన్నుకొనే శక్తిని కలిగియుండాలి.” దీని దృష్ట్యా, నిజముగా స్వాతంత్ర్యము కలిగియున్న ఎవరినైనా నీవు ఎరిగియున్నావా? ‘ఎట్లు తలంచుదుము, మాట్లాడుదుము, లేక ప్రవర్తించుదుము అనువాటిపై ఎలాంటి నిషేధములు’ తమకులేవని ఎవరు చెప్పగలరు? సత్యం చెప్పాలంటే, విశ్వమంతటిలో కేవలము ఒకేఒక వ్యక్తి అటువంటి వర్ణనకు సరిపోవును: ఆయన యెహోవా దేవుడు మాత్రమే. ఆయన మాత్రమే సంపూర్ణమైన స్వాతంత్ర్యమును కలిగియున్నాడు. ఆయన మాత్రమే తన కిష్టమైన ఎంపిక చేసికొనగలడు మరియు సమస్త వ్యతిరేకతల మధ్యకూడ దానిని నెరవేర్చగలడు. ఆయన “సర్వశక్తిగలవాడు.”—ప్రకటన 1:8 NW; యెషయా 55:11.

3. ఏ షరతుపై మానవులు సాధారణముగా స్వాతంత్ర్యమును అనుభవింతురు?

3 అల్పులైన మానవులకు, స్వాతంత్ర్యము కేవలము పరిమితముగానే యుండగలదు. అది సాధారణముగా ఏదో అధికారముచే ప్రసాదింపబడవచ్చును లేక అభయమివ్వబడవచ్చును. కాగా అట్టి అధికారమునకు మనముచూపు విధేయతకు అది సంబంధము కలిగియుండును. నిజానికి, ప్రతి సందర్భములో తనకు స్వాతంత్ర్యపు అభయమిచ్చిన అధికారమును గుర్తించినట్లయితేనే ఆ వ్యక్తి స్వాతంత్ర్యము గలవాడై యుండగలడు. ఉదాహరణకు, “స్వేచ్ఛాప్రపంచంలో” జీవించు ఆయావ్యక్తులు ఉద్యమ స్వాతంత్ర్యము, వాక్‌ స్వాతంత్ర్యము, మత స్వాతంత్ర్యమువంటి అనేక ప్రయోజనములను అనుభవించవచ్చును. ఈ స్వాతంత్ర్యములకు హామి ఇచ్చునదేమి? ఆ దేశముయొక్క చట్టము. ఆ చట్టమునకు లోబడినంత కాలము మాత్రమే ఒక వ్యక్తి వాటిని అనుభవించ గలడు. అతడు ఆ స్వాతంత్ర్యమును దుర్వినియోగపరచి, చట్టమును ఉల్లంఘించినట్లయిన, అధికారులు అతని ఉత్తరవాదిగా ఎంచుదురు, అలా అతడు చెరసాలలో పడవేయబడుట ద్వారా అతని స్వాతంత్ర్యము తీవ్రముగా తగ్గించబడును.—రోమీయులు 13:1-4.

దైవిక స్వాతంత్ర్యము—జవాబుదారీతనముతో

4, 5. ఎటువంటి స్వాతంత్ర్యమును యెహోవా ఆరాధికులు అనుభవించుచున్నారు, దేని విషయములో ఆయన వారిని జవాబుదారులుగా చేయును?

4 మొదటి శతాబ్దములో, యేసు స్వాతంత్ర్యమునుగూర్చి మాట్లాడెను. ఆయన యూదులతో ఇట్లనెను: “మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైయుండి సత్యము గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.” (యోహాను 8:31, 32) ఆయన వాక్‌ స్వాతంత్ర్యమును గూర్చిగాని, మత స్వాతంత్ర్యమును గూర్చిగాని మాట్లాడుటలేదు. అనేకమంది యూదులు కోరుకొనినట్లు, రోమా పాలనయొక్క అణచివేతనుండి విముక్తినిగూర్చి నిశ్చయముగా ఆయన మాట్లాడుటలేదు. అది వాటన్నింటికంటె మరెంతో అమూల్యమైనది, అది మానవ చట్టాలు లేక ఎవరో ఒక పాలకుని చమత్కారముద్వారా ప్రసాదింపబడునది కాదుగాని సర్వోన్నత విశ్వ సార్వభౌమాధిపతియగు యెహోవా దయచేయు స్వాతంత్ర్యమైయున్నది. అది మూఢనమ్మకమునుండి, మత అజ్ఞానము నుండి లభించు స్వాతంత్ర్యమేగాక ఇంకా ఎంతో మరెంతో ఎక్కువైనది. అది యెహోవా అనుగ్రహించు స్వాతంత్ర్యము నిజమైన స్వాతంత్ర్యమై యుండి, యుగయుగములు నిలిచియుండును.

5 అపొస్తలుడైన పౌలు ఇట్లనెను: “ప్రభువే (యెహోవా NW) ఆత్మ. ప్రభువు (యెహోవా NW) యొక్క ఆత్మ యెక్కడనుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును.” (2 కొరింథీయులు 3:17) విశ్వాసులైన వారు చివరకు మిగుల శ్రేష్ఠమైన, మహాగొప్పదైన మానవ స్వాతంత్ర్యమును, “దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము” ననుభవించునట్లు యెహోవా శతాబ్దములుగా మానవజాతితో వ్యవహరించుచున్నాడు. (రోమీయులు 8:21) అదే సమయములో, బైబిలు సత్యము మూలముగా యెహోవా కొంత పరిమాణములో మనకు స్వాతంత్ర్యము ననుగ్రహించుచున్నాడు, ఆలాగే మనము ఆ స్వాతంత్ర్యమును దుర్వినియోగపరచినట్లయిన ఆయన మనలను దాని విషయమై జవాబుదారులనుగా చేయుచున్నాడు. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్పవలిసి యున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.”—హెబ్రీయులు 4:13.

6-8. (ఎ) అదాము హవ్వలు ఎటువంటి స్వాతంత్ర్యములనుభవించిరి, ఏ షరతుపై ఆధారపడి వారు ఆ స్వాతంత్ర్యములను కలిగియుండగలరు? (బి) ఆదాము హవ్వలు తమకొరకును తమ సంతానము కొరకును ఏమి పోగొట్టుకొనిరి?

6 మన మొదటి మానవ తలిదండ్రులగు ఆదాము హవ్వలు బ్రతికియున్నప్పుడు యెహోవా యెడల జవాబుదారీతనము నొక్కిచెప్పబడెను. స్వేచ్ఛాచిత్తమనే అమూల్యమైన యీవితో యెహోవా వారిని సృజించెను. బాధ్యతాయుతముగా ఆ స్వేచ్ఛాచిత్తమును ఉపయోగించినంత కాలము, భయంనుండి స్వాతంత్ర్యము, రోగంనుండి స్వాతంత్ర్యము, మరణమునుండి స్వాతంత్ర్యము, నిర్మలమైన మనస్సాక్షితో తమ పరలోకపు తండ్రిని సమీపించు స్వాతంత్ర్యమువంటి ఇతర ఆశీర్వాదములను వారు అనుభవించిరి. అయితే వారు వారి స్వేచ్ఛాచిత్తమును దుర్వినియోగం చేసినప్పుడు, అదంతయు మారిపోయెను.

7 యెహోవా ఆదాము హవ్వలను ఏదెను వనములో ఉంచి, వారి ఆనందము కొరకు ఒకటి మినహా, ఆ వనమందలి సమస్త వృక్ష ఫలములను వారికనుగ్రహించెను. దానిని మాత్రం ఆయన తనకొరకు ఉంచుకొనెను; అది “మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమై” యుండెను. (ఆదికాండము 2:16, 17) ఆ వృక్షఫలమును తినకుండుటద్వారా ఆదాము హవ్వలు, మంచిచెడ్డల విషయములో కట్టడనుంచుటకు కేవలము యెహోవా మాత్రమే స్వాతంత్ర్యము గలవాడని గుర్తించుదురు. వారు బాధ్యతాయుతముగా ప్రవర్తించి, నిషేధ ఫలమును తినకుండినచో, యెహోవా వారికి ఇతర స్వాతంత్ర్యములను అనుగ్రహించియుండేవాడు.

8 విచారకరముగా, హవ్వ తనకుతాను ‘ఏది మంచో ఏది చెడో’ తెలిసికొనవలెనని సర్పము కుయుక్తితో చేసిన సూచనను లక్ష్యపెట్టెను. (ఆదికాండము 3:1-5) మొదట ఆమె, ఆ తరువాత ఆదాము ఆ నిషేధ ఫలమును భుజించిరి. దాని ఫలితముగా, ఏదెను వనములో యెహోవా దేవుడు వారితో మాట్లాడుటకు వచ్చినప్పుడు, వారు సిగ్గుపడి దాగుకొనిరి. (ఆదికాండము 3:8, 9) వారిప్పుడు పాపులై నిర్మలమైన మనస్సాక్షినుండి వచ్చిన దేవుని సమీపించు స్వాతంత్ర్యతా భావమును పోగొట్టుకొనిరి. ఈ కారణం చేతనే, వారు తమ కొరకేగాక తమ సంతానము కొరకును రోగమరణములనుండి కలుగు స్వాతంత్ర్యమును పోగొట్టుకొనిరి. పౌలు ఇట్లు చెప్పెను: “ఒక మనుష్యుని [ఆదాము] ద్వారా పాపమును పాపముద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.”—రోమీయులు 5:12; ఆదికాండము 3:16, 19.

9. తమకున్న స్వాతంత్ర్యమును తగిన పరిమాణములో చక్కగా ఉపయోగించిన వారెవరు?

9 అయినప్పటికిని, మానవజాతి ఇంకను స్వేచ్ఛాచిత్తమును కలిగియుండెను, మరియు కాలగమనములో, కొంతమంది అసంపూర్ణ మానవులును యెహోవాను సేవించుటకు దీనిని బాధ్యతాయుతముగా ఉపయోగించిరి. వారిలోని కొందరిపేర్లు పురాతన కాలమునుండి మనకొరకు భద్రపరచబడినవి. హేబెలు, హనోకు, నోవహు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు (ఈయన ఇశ్రాయేలు అనికూడ పిలువబడెను) వంటి మనుష్యులు తగినరీతిలో స్వాతంత్ర్యము నుపయోగించి ఇంకను దేవుని చిత్తముచేయుటలో ఆనందించిన మాదిరులై యున్నారు. తత్ఫలితముగా వారు చక్కని జీవితము జీవించిరి.—హెబ్రీయులు 11:4-21.

దేవుడు ఏర్పరచుకున్న ప్రజల స్వాతంత్ర్యము

10. తన ప్రత్యేక ప్రజలతో యెహోవా చేసిన నిబంధనయొక్క షరతులు ఏమైయుండెను?

10 మోషే దినములలో, యెహోవా లక్షలసంఖ్యలోనున్న ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాసత్వమునుండి విడిపించి వారితో ఒక నిబంధన చేసెను. అలా వారు ఆయన ప్రత్యేక ప్రజలుగా తయారైరి. ఈ నిబంధన క్రింద ఇశ్రాయేలీయులు, యాజకులను వారి పాపములను తాత్కాలికంగా క్షమించే బలియర్పణ విధానమును కలిగియుండిరి. ఆ విధముగా, వారు ఆరాధనలో దేవుని సమీపించు స్వాతంత్ర్యమును కలిగియుండిరి. ఆలాగే మూఢనమ్మకములతో కూడిన అభ్యాసముల నుండి, అబద్ధ ఆరాధననుండి వారిని స్వతంత్రులనుగా యుంచిన, కట్టడలు, నియమములున్న విధానము కూడ కలిగియుండిరి. ఆ తర్వాత, వారు తమ శత్రువులకు వ్యతిరేకముగా దైవిక సహాయమును అభయముగా పొందినవారై, వారు వాగ్దాన దేశమును స్వాస్థ్యముగా పొందుదురు. నిబంధనలో పాలివారైయున్నందున, ఇశ్రాయేలీయులు యెహోవా ధర్మశాస్త్రమునకు కట్టుబడియుండుటకు అది వారిని బాధ్యులనుగా చేసెను. ఈ షరతును ఇశ్రాయేలీయులు ఇష్టపూర్వకముగా అంగీకరించినవారై, “యెహోవా చెప్పినదంతయు చేసెదమని యేకముగా చెప్పిరి.”—నిర్గమకాండము 19:3-8; ద్వితీయోపదేశకాండము 11:22-25.

11. యెహోవాతో తాము చేసికొనిన నిబంధన విషయములో ఇశ్రాయేలీయులు తప్పిపోవుటవలన వారికేమి సంభవించెను?

11 దాదాపు 1,500 సంవత్సరములకు పైగా ఇశ్రాయేలీయులు యెహోవాతో ఆ ప్రత్యేక సంబంధమందు ఉండిరి. అయితే అనేకమార్లు వారు ఆ నిబంధనను పాటించుటలో విఫలులయ్యారు. అనేకమార్లు వారు అబద్ధ ఆరాధనచే భ్రష్టులై విగ్రహారాధన, మూఢనమ్మకముల దాసత్వములో ప్రవేశించిరి, కావున వారు తమ శత్రువులకు భౌతికముగా దాసులయ్యేందుకు యెహోవా వారిని అనుమతించెను. (న్యాయాధిపతులు 2:11-19) ధర్మశాస్త్రమును పాటించుటద్వారా లభించు స్వతంత్ర సంబంధమైన ఆశీర్వాదములను అనుభవించుటకు బదులు, దానిని అతిక్రమించినందుకు వారు శిక్షింపబడిరి. (ద్వితీయోపదేశకాండము 28:1, 2, 15) చివరకు, సా.శ.పూ. 607లో ఆ జనాంగము బబులోనుకు బంధీలుగా కొనిపోబడుటకు యెహోవా అనుమతించెను.—2 దినవృత్తాంతములు 36:15-21.

12. మోషే ధర్మశాస్త్రము విషయములో చివరకు ఏమి స్పష్టమాయెను?

12 ఇది వారికి బహుకష్టమైన గుణపాఠమై యుండెను. వారు దానినుండి ధర్మశాస్త్రమును పాటించుటయొక్క ప్రాముఖ్యతను నేర్చుకొని యుండాల్సింది. కానీ, 70 సంవత్సరముల తర్వాత ఇశ్రాయేలీయులు తమ స్వంతదేశానికి తిరిగివచ్చినప్పుడు, వారింకను ధర్మశాస్త్రమును సరిగా పాటించుటలో విఫలులైరి. వారు తిరిగివచ్చిన దాదాపు వంద సంవత్సరముల తర్వాత, యెహోవా ఇశ్రాయేలీయుల యాజకులతో ఇట్లనెను: “మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరచి, లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్థకము చేయుచున్నారు.” (మలాకీ 2:8) నిజమే, ఇశ్రాయేలీయులలో ఎంతో చిత్తశుద్ధిగలవారు సహితము ఆ పరిపూర్ణ ధర్మశాస్త్రమునకు సరితూగలేకపోయిరి. అపొస్తలుడైన పౌలు మాటల ప్రకారము, అది ఆశీర్వాదకరమైనదిగా కాక, ఒక “శాపముగా” పరిణమించెను. (గలతీయులు 3:13) స్పష్టముగా, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యమునకు అసంపూర్ణులైన, విశ్వాసులైన మానవులను తెచ్చుటకు మోషే ధర్మశాస్త్రముకంటె ఉన్నతమైనది కావలెను.

క్రైస్తవ స్వాతంత్ర్యము యొక్క స్వభావము

13. చివరకు స్వాతంత్ర్యము కొరకు ఏ శ్రేష్ఠమైన ఆధారము ఏర్పాటుచేయబడెను?

13 ఆ ఉన్నతమైనది యేసుక్రీస్తు యొక్క విమోచన క్రయధనపు బలియై యుండెను. దాదాపు సా.శ. 50వ సంవత్సరములో పౌలు గలతీయలోనున్న అభిషక్త క్రైస్తవుల సంఘమునకు వ్రాసెను. ధర్మశాస్త్ర దాసత్వమునుండి వారిని యెహోవా ఎట్లు విడిపించెనో ఆయన వర్ణించి ఆ పిమ్మట ఇట్లనెను: “ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కుకొనకుడి.” (గలతీయులు 5:1) ఏయే విధములుగా యేసు మనుష్యులను స్వతంత్రులనుగా చేసెను?

14, 15. ఏ అద్భుతమైన రీతులలో యేసు విశ్వసించిన యూదులను, యూదులు కానివారిని స్వతంత్రులుగా చేసెను?

14 యేసు మరణించిన తర్వాత, ఆయనను మెస్సీయగా అంగీకరించి ఆయనకు శిష్యులుగా తయారయిన యూదులు, పాత ధర్మశాస్త్ర నిబంధన స్థానములో వచ్చిన ఒక క్రొత్త నిబంధన క్రిందికి వచ్చిరి. (యిర్మీయా 31:31-34; హెబ్రీయులు 8:7-13) ఈ క్రొత్త నిబంధన క్రింద, వారు—మరియు ఆ తర్వాత వారితో కలిసిన యూదులుకాని విశ్వాసులు—దేవుని ప్రత్యేక ప్రజలైన సహజ ఇశ్రాయేలీయుల స్థానములో వచ్చిన ఒక క్రొత్త ఆత్మీయ జనాంగములో భాగముగా తయారైరి. (రోమీయులు 9:25, 26; గలతీయులు 6:16) ఆ కారణముచేత వారు యేసు వాగ్దానము చేసిన స్వాతంత్ర్యము ననుభవించిరి. ఆయనిట్లనెను: “సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.” ఆ సత్యము, క్రైస్తవులను మోషే ధర్మశాస్త్ర శాపమునుండి విడుదల చేయుటయే గాకుండ, మతనాయకులు వారిపై విధించిన సమస్త భరింపశక్యముకాని ఆచారములనుండి వారిని విముక్తులనుగా చేసెను. మరియు అది యూదులు కాని క్రైస్తవులను విగ్రహారాధననుండి, వారి గత ఆరాధనకు సంబంధించిన మూఢనమ్మకముల నుండి విడిపించెను. (మత్తయి 15:3 6; 23:4; అపొ. కార్యములు 14:11-13; 17:16) ఇంకా ఎక్కువే ఉండెను.

15 స్వతంత్రులనుగా చేయు సత్యమునుగూర్చి యేసు మాట్లాడినప్పుడు ఆయనిట్లనెను: “పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” (యోహాను 8:34) ఆదాము హవ్వలు పాపము చేసినందున, జీవించియుండిన ప్రతివాడు పాపియైయుండి, పాపమునకు దాసుడైయుండెను. ఒక్క యేసు మాత్రమే దానినుండి మినహాయింపబడెను, మరియు యేసు బలి విశ్వాసులను ఆ దాసత్వమునుండి స్వతంత్రులుగా చేసెను. నిజమే, వారింకను స్వభావసిద్ధముగా అసంపూర్ణులును పాపులునై యుండిరి. అయితే వారిప్పుడు, తమ పాపముల విషయమై పశ్చాత్తాపపడి, తమ విన్నపములు ఆలకించబడునను నమ్మకముతో, యేసు బలి ఆధారముగా పాపక్షమాపణను యాచించగలరు. (1 యోహా. 2:1, 2) యేసు విమోచన క్రయధనము ఆధారముగా, దేవుడు వారిని నీతిమంతులని ప్రకటించెను, గనుక వారు నిర్మలమైన మనస్సాక్షితో ఆయనను సమీపించగలరు. (రోమీయులు 8:33) అంతేకాకుండ, ఆ విమోచన క్రయధనము అనంతకాల జీవమునకు పునరుత్థానమగు ఉత్తరాపేక్షకు ద్వారం తెరచినందున, సత్యము మరణభయము నుండి కూడ వారిని స్వతంత్రులను చేసెను.—మత్తయి 10:28; హెబ్రీయులు 2:15.

16. లోకము అందించు ఎటువంటి స్వాతంత్ర్యము కంటెను ఎట్లు క్రైస్తవ స్వాతంత్ర్యము ఉన్నతమైయుండెను?

16 అద్భుతమైన రీతిగా, మానవ పరిభాషలో చెప్పాలంటే వారి స్థానమేదైనను, స్త్రీపురుషులకు క్రైస్తవ స్వాతంత్ర్యము తెరవబడెను. బీదలు, ఖైదీలు, చివరకు దాసులు సహితము విడుదల చేయబడగలరు. మరోవైపున, క్రీస్తునుగూర్చిన వర్తమానమును తృణీకరించిన జనాంగములలోని ప్రముఖులు ఇంకను మూఢనమ్మకము, పాపము మరియు మరణభయముల దాసత్వములోనే ఉండిరి. మనమనుభవించు ఈ స్వాతంత్ర్యము విషయమై యెహోవాకు కృతజ్ఞత తెల్పుటకు మనమెన్నటికి మానుకొనకూడదు. లోకము అందించునదేదియు దానికి సాటిరాదు.

స్వతంత్రులేగాని జవాబుదారులు

17. (ఎ) మొదటి శతాబ్దములో కొందరెట్లు క్రైస్తవ స్వాతంత్ర్యమును పోగొట్టుకొనిరి? (బి) సాతాను లోకములో స్వాతంత్ర్యమువలె కన్పించుదాని వలన మనమెందుకు మోసపోగూడదు?

17 మొదటి శతాబ్దములో, అభిషక్త క్రైస్తవులలో బహుశ అధికులు తమ స్వాతంత్ర్యమునందు ఆనందించి, దాని మూల్యమెంతైనను తమ యథార్థతను కాపాడుకొనిరి. విచారకరముగా, దాని సమస్త ఆశీర్వాదములతోపాటు క్రైస్తవ స్వాతంత్ర్యమును రుచిచూసి కొంతమంది, ఆ పిమ్మట లోకములోని దాసత్వమునకు తిరిగివెళ్లి దానిని తృణీకరించిరి. ఎందుకు? ఎందుకనగా అనేకుల విశ్వాసము నిస్సందేహముగా బలహీనపడెను మరియు వారు ‘కొట్టుకొనిపోయిరి.’ (హెబ్రీయులు 2:1) ఇతరులైతే ‘విశ్వాసమును, మంచి మనస్సాక్షిని త్రోసివేసి, వారి విశ్వాసమును కోల్పోయారు.’ (1 తిమోతి 1:19) బహుశ వారు ఐశ్వర్యాసక్తి లేక ఒకానొక అవినీతికరమైన జీవన విధానములో పడిపోయివుండ వచ్చును. కావున వ్యక్తిగత పఠనమందు, సహవాసమందు, ప్రార్థనయందు, క్రైస్తవ పరిచర్యలో పని కలిగివుంటూ, మన విశ్వాసమును కాపాడుకొనుచు దానిపై నిర్మింపబడుట ఎంత ప్రాముఖ్యము! (2 పేతురు 1:5-8) మనమెన్నటికిని మన క్రైస్తవ స్వాతంత్ర్యమును మెచ్చుకొనుటలో తప్పిపోకుందము గాక! నిజమే, కొందరు తమకంటె లోకములో ఉన్నవారే స్వేచ్ఛగా యున్నారని తలంచుచు, సంఘము వెలుపట తాము చూచు విశృంఖలతద్వారా శోధింపబడవచ్చును. కానీ వాస్తవానికి లోకములో స్వాతంత్ర్యమన్నట్లుగా కన్పించేది కేవలము బాధ్యతారాహిత్యము మాత్రమే. మనము దేవుని దాసులము కానట్లయితే, పాపమునకు దాసులమే మరియు ఆ దాసత్వము కఠోరమైన జీతమునిచ్చును.—రోమీయులు 6:23; గలతీయులు 6:7, 8.

18-20. (ఎ) కొందరెట్లు “హింసాకొయ్యకు శత్రువులైరి”? (బి) ‘దుష్టత్వమును కప్పిపుచ్చుటకు’ కొందరెట్లు స్వాతంత్ర్యమును వాడుకొనిరి?

18 అంతేకాకుండా, పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖలో, ఇట్లు వ్రాశాడు: “అనేకులు క్రీస్తు సిలువకు (హింసా కొయ్యకు NW) శత్రువులుగా నడుచుకొనుచున్నారు; వీరినిగూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి యిప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను.” (ఫిలిప్పీయులు 3:18) అవును, ఒకప్పుడు క్రైస్తవులుగా ఉన్నవారు విశ్వాసమునకు శత్రువులుగా, బహుశ మతభ్రష్టులుగా తయారైన సందర్భాలు కలవు. వారి విధానమును మనము అనుకరించకుండుట ఎంత ఆవశ్యకము! దానికితోడు, పేతురు ఇలా వ్రాశాడు: “స్వతంత్రులై యుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక, దేవునికి దాసులమని లోబడియుండుడి.” (1 పేతురు 2:16) ఒకడు దుష్టత్వమును కప్పిపెట్టుటకు తన స్వాతంత్ర్యమును ఎట్లు వినియోగించ వచ్చును? సంఘముతో సహవసించుచునే ఘోరపాపములు—బహుశ రహస్యముగా—చేయుట ద్వారానే.

19 దియెత్రెఫేను జ్ఞాపకముంచుకొనుము. అతనిగూర్చి యోహాను ఇలా చెప్పాడు: “వారిలో [సంఘములో] ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మును అంగీకరించుట లేదు. . . . అది చాలదన్నట్టుగా, సహోదరులను తానే చేర్చుకొనక, వారిని చేర్చుకొన మనస్సు గలవారిని కూడ ఆటంకపరచుచు సంఘములోనుండి వారిని వెలివేయుచున్నాడు.” (3 యోహాను 9, 10) తన స్వార్థపరత్వాన్ని కప్పిపుచ్చుటకు దియెత్రెఫే తన స్వాతంత్ర్యమును ఉపయోగించెను.

20 శిష్యుడైన యూదా ఇలా వ్రాశాడు: “కొందరు రహస్యముగా జొరబడి యున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు, మన అద్వితీయ నాధుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు.” (యూదా 4) సంఘముతో సహవసిస్తూనే వీరు, ఇతరులపై చెడు ప్రభావమును చూపిరి. (యూదా 8-10, 16) ప్రకటనలో మనము పెర్గము, తుయతైర సంఘములలో, శాఖాభిమానము, విగ్రహారాధన, లైంగిక అవినీతి ఉండెనని చదువుదుము. (ప్రకటన 2:14, 15, 20-23) అది క్రైస్తవ స్వాతంత్ర్యమును ఎంతగా దుర్వినియోగపరచుటయై యున్నది.!

21. తమ క్రైస్తవ స్వాతంత్ర్యమును దుర్వినియోగపరచు వారికొరకు ఏమి వేచియున్నది?

21 ఈ విధముగా క్రైస్తవ స్వాతంత్ర్యమును దుర్వినియోగపరచు వారికొరకు ఏమి వేచియున్నది? ఇశ్రాయేలీయులకు ఏమి సంభవించెనో గుర్తుతెచ్చుకొనుము. ఇశ్రాయేలీయులు దేవుడు ఏర్పరచుకొనిన జనాంగమై యుండెను. అయితే యెహోవా చివరకు దానిని తిరస్కరించెను. ఎందుకు? ఎందుకనగా ఇశ్రాయేలీయులు దేవునితో తమకున్న సంబంధమును దుష్టత్వమును కప్పిపెట్టుటకు వినియోగించిరి. తాము అబ్రాహము సంతానమని వారు గొప్పలు చెప్పుకొనిరి. అయితే వారు అబ్రాహాము సంతానము, యెహోవా ఏర్పరచిన మెస్సీయయగు యేసును తృణీకరించిరి. (మత్తయి 23:37-39; యోహాను 8:39-47; అపొ. కార్యములు 2:36; గలతీయులు 3:16) “దేవుని ఇశ్రాయేలు” మొత్తము జనాంగముగా అలా విశ్వాసరహితులుగా నిరూపించబడరు. (గలతీయులు 6:16) అయితే ఆత్మీయ లేక నైతిక కలుషితమునకు కారణమగు ఏ క్రైస్తవుడైనను చివరకు క్రమశిక్షణను, తీవ్రమైన తీర్పును ఎదుర్కొనును. మన క్రైస్తవ స్వాతంత్ర్యమును మనమెట్లు ఉపయోగించుచున్నామను విషయములో మనందరము జవాబుదారులమై యున్నాము.

22. దేవుని దాసులయ్యేందుకు తమ క్రైస్తవ స్వాతంత్ర్యము నుపయోగించు వారికి ఏ సంతోషము కలుగును?

22 దేవునికి దాసులైయుండి, నిజముగా స్వతంత్రులై యుండుట ఎంత శ్రేష్ఠము! నిజముగా విలువగల స్వాతంత్ర్యమును కేవలము యెహోవా మాత్రమే అనుగ్రహించును. సామెత ఇట్లు చెప్పుచున్నది: “నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాటలాడుదును.” (సామెతలు 27:11) మన క్రైస్తవ స్వాతంత్ర్యమును యెహోవా మహిమార్థమై ఉపయోగించుదము గాక. మనమట్లు చేసినట్లయిన, మన జీవితములకు అర్థముండును, మన పరలోకపు తండ్రిని ప్రీతిపరచెదము, అలా చివరకు దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము ననుభవించు వారిలో మనము కూడ ఉందుము. (w92 6/1)

మీరు వివరించగలరా?

◻ నిజముగా ఎవరు మాత్రమే స్వతంత్రుడై యున్నాడు?

◻ ఆదాము హవ్వలు ఎటువంటి స్వాతంత్ర్యముల ననుభవించిరి, వాటిని వారెట్లు పోగొట్టుకొనిరి?

◻ యెహోవాతో తాముచేసిన నిబంధనను పాటించినప్పుడు ఇశ్రాయేలీయులు ఎటువంటి స్వాతంత్ర్యముల ననుభవించిరి?

◻ యేసును అంగీకరించిన వారికి ఎటువంటి స్వాతంత్ర్యములు వచ్చెను?

◻ మొదటి శతాబ్దములో కొందరెట్లు తమ క్రైస్తవ స్వాతంత్ర్యమును పోగొట్టుకొనిరి లేక దుర్వినియోగపరచిరి?

[6వ పేజీలోని చిత్రాలు]

యేసు ఇచ్చిన స్వాతంత్ర్యము మానవుడు ఇవ్వగల ఏ స్వాతంత్ర్యము కంటెను యింకా శ్రేష్ఠమైయుండెను

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి