‘నీ అభివృద్ధిని తేటగా కనబడనిమ్ము’
“ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని.”—1 కొరింథీయులు 13:11.
1. సృష్టి అద్భుతమనుటకు ఎదుగుదల ఎట్లు ఒక రుజువైయున్నది?
తిమింగిలం, కేవలము సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగల అతి సూక్ష్మమైన అండముతో ఆరంభమై, అది 30 మీటర్ల పొడవు, 80 టన్నుల బరువుగల ప్రాణిగా ఎదుగవచ్చును. అదే ప్రకారము, చిన్న విత్తనంనుండి మహావృక్షమగు సికోయా 90 మీటర్లకు పైగా ఎత్తు పెరగవచ్చును. నిజానికి పెరుగుదల జీవితమందలి అద్భుతాలలో ఒకటి. అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా, మనము నాటవచ్చును, నీరుపోయవచ్చును, కానీ “వృద్ధి కలుగజేయు[వాడు] దేవుడే.”—1 కొరింథీయులు 3:7.
2. బైబిలులో ఏ విధమైన ఎదుగుదల ప్రవచింపబడెను?
2 అయితే, అంతే ఆశ్చర్యకరమైన మరొక విధమైన పెరుగుదల ఉంది. దీనిని ప్రవక్తయైన యెషయా ఇలా ప్రవచించాడు: “వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును, ఎన్నికలేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును.” (యెషయా 60:22) ఈ ప్రవచనము దేవుని ప్రజల పెరుగుదలకు సంబంధించినదై యుండి, మనకాలములో పెద్ద ఎత్తున నెరవేరుతున్నది.
3. యెహోవా తన ప్రజల పనిని త్వరపెడుతున్నాడని 1991 సేవా-సంవత్సర నివేదిక ఎట్లు చూపిస్తున్నది?
3 ప్రపంచవ్యాప్తముగా 1991 సేవా సంవత్సరములో రాజ్య ప్రచారకులు 42,78,820 అను ఒక క్రొత్త శిఖరాగ్ర సంఖ్యను చేరుకొన్నారని, ఆ సంవత్సరములో మొత్తము 3,00,945 మంది బాప్తిస్మము పొందారని యెహోవాసాక్షుల సేవా రిపోర్టు చూపిస్తుంది. అలా అనేకమంది క్రొత్తవారు రావడంతో 3,191 క్రొత్త సంఘాలు ఏర్పడ్డాయి, తదనుగుణంగా క్రొత్త సర్క్యూట్లు, క్రొత్త జిల్లాల సంఖ్యకూడా పెరిగింది. అంటే రోజుకు 8 క్రొత్త సంఘాలు, ప్రతిరెండు రోజులకు ఒక క్రొత్త సర్క్యూటు, ఏర్పడినవని దాని భావం. ఎంత అద్భుతకరమైన పెరుగుదల! స్పష్టంగా, ఈ విషయాలను యెహోవా వేగం చేస్తున్నాడు, తన ప్రజల ప్రయత్నాలపై ఆయన ఆశీర్వాదమున్నది.—కీర్తన 127:1.
స్వయం పరీక్షకు సమయం
4. భవిష్యత్తులోనికి మనము చూస్తూ ఏ ప్రశ్నలను పరిశీలించాలి?
4 చూడడానికి ఇది హృదయానందకరముగా కన్పించినను, ఈ యాశీర్వాదము కొన్ని బాధ్యతలనుకూడ తెస్తున్నది. ఈ క్రొత్తవారందరి ఆత్మీయావసరతలు తీర్చుటకు కావల్సినంతమంది పరిణతిచెందిన వారున్నారా? మనము భవిష్యత్తులోనికి చూస్తుండగా, ఈ పెరుగుదలకు, విస్తరణకు కావల్సినంతమంది పయినీర్లు, పరిచారకులు, పెద్దలు, ప్రయాణ కాపరులు, ఆలాగే ఈ పనికి మద్దతునిచ్చేందుకు ప్రపంచవ్యాప్తముగా బ్రాంచి కార్యాలయాలలో, బేతేలు గృహములలో స్వచ్ఛంద సేవకుల అవసరతను గూర్చి ఆలోచించుటే విస్మయాన్ని కల్గిస్తుంది. ఇంత గొప్ప సంఖ్యలో ప్రజలెక్కడ నుండి వస్తారు? కోత విస్తారముగా ఉన్నదనుటలో సందేహము లేదు. అయితే ఆ కోతకోయుటకు అవసరమైన పనివారిని తీసుకువచ్చుటకు ఈనాడు ఎవరు ఆ స్థితిలో ఉన్నారు?—మత్తయి 9:37, 38.
5. వేగంగా జరుగుచున్న అభివృద్ధి కారణముగా కొన్ని ప్రాంతాలలో ఏ పరిస్థితులు నెలకొనియున్నవి?
5 ఉదాహరణకు, ప్రపంచములోని కొన్ని ప్రాంతాలలో దాదాపు వందమంది రాజ్య ప్రచారకులుగల సంఘాలలో ఒక పెద్ద, ఒకరిద్దరు పరిచారకులు మాత్రమే ఉన్నట్లు రిపోర్టు చేయబడినది. కొన్నిసార్లు ఒకేపెద్ద రెండు సంఘాలలో సేవచేయాల్సి వస్తుంది. మరికొన్ని ప్రాంతాలలో గృహ బైబిలు పఠనములు నిర్వహించుటకు అర్హతగల క్రైస్తవ పరిచారకుల అవసరత ఎంతగా ఉందంటే, పఠనము చేయగోరు క్రొత్తవ్యక్తులు వేచియుండాల్సి వస్తుంది. ఇంకా కొన్ని ప్రాంతాలలో, ఎంత వేగంగా క్రొత్త సంఘాలు ఏర్పడుచున్నాయంటే, ఒకే రాజ్యమందిరాన్ని మూడు, నాలుగు లేక ఐదు సంఘాలు సహితము పంచుకోవాల్సి వస్తుంది. బహుశ మీ ప్రాంతములోను మీరు ఇలాంటి అభివృద్ధినే చూసియుండవచ్చును.
6. మన విషయంలో స్వయం పరీక్ష ఎందుకు సమయానుకూలమై యున్నది?
6 పైన ప్రస్తావించినదంతా మనకేమి తెల్పుచున్నది? ముందున్న కాలము దృష్ట్యా, ఉన్న అవసరాన్ని తీర్చుటకు మన సమయాన్ని, మనకున్న వాటిని మనమెంత శ్రేష్ఠముగా ఉపయోగించగలమోనని మన పరిస్థితులను మనమందరము పరీక్షించుకొనవలెను. (ఎఫెసీయులు 5:15-17) మొదటి శతాబ్దములోని హెబ్రీ క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “కాలమునుబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినవారై యుండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను. మీరు పాలుత్రాగవలసినవారే గాని బలమైన ఆహారము తినగలవారుకారు.” (హెబ్రీయులు 5:12) ఆ మాటలు సూచించునట్లుగా, క్రైస్తవులుకూడ పెరగవలసిన అవసరం ఉంది. ఒక వ్యక్తి క్రైస్తవ పరిపక్వతకు ఎదుగుటకు బదులు ఆత్మీయ పసితనమందే ఊగిసలాడు అపాయం ఉంది. దీనికనుగుణంగా పౌలు మనకిట్లు విజ్ఞప్తి చేస్తున్నాడు: “మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి.” (2 కొరింథీయులు 13:5) బాప్తిస్మము పొందినప్పటినుండి నీవు ఆత్మీయముగా పెరుగుతున్నావో లేదో చూచుకొనుటకు నిన్నునీవు పరీక్షించుకుంటున్నావా? లేక నీవు ఆలాగే ఉండిపోయావా? ఒక వ్యక్తి ఈ విషయమునెలా చెప్పగలడు?
“పిల్లవాని చేష్టలు”
7. ఆత్మీయాభివృద్ధి అందరికి తేటగా కనబడజేయుటకు, మనమేమి చేయవలెను?
7 “నేను పిల్లవాడనై యున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితినని” అపొస్తలుడైన పౌలు చెప్పెను. (1 కొరింథీయులు 13:11) ఆత్మీయాభివృద్ధియందు, ఒక సమయములో మన తలంపులలో, క్రియలలో మనమందరము పిల్లలమే. అయితే, అభివృద్ధిని తేటగా కనబరచడానికి, మనము పౌలు చెప్పినట్లుగా “పిల్లవాని చేష్టలను” బొత్తిగా విడనాడాలి. ఈ చేష్టలు కొన్ని ఏమైయున్నవి?
8. హెబ్రీయులు 5:13, 14 నందు పౌలుచెప్పిన మాటల ప్రకారం, ఆత్మీయ శిశువుయొక్క ఒక లక్షణమేమై యున్నది?
8 “పాలుత్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్యవిషయములో అనుభవములేనివాడై యున్నాడు. వయస్సువచ్చిన వారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును” అని హెబ్రీయులు 5:13, 14లో పౌలు మాటలను మొదట గమనించండి. నీవు ‘నీతి వాక్యవిషయములో అనుభవము’ కలిగియున్నావా? “మేలు కీడులను వివేచించుటకు” తగినంతగా దేవుని వాక్యమగు బైబిలును ఉపయోగించులాగున నీవు దానిని ఎరిగియున్నావా? పరిణతిచెందిన ప్రజలు అలాచేయగలరు, ఎందుకనగా వారు “బలమైన ఆహారము” క్రమముగా పుచ్చుకొంటున్నారని పౌలు చెప్పాడు. ఆ విధముగా, ఒకడు ఆత్మీయముగా ఎదిగాడో లేక ఆత్మీయ శిశువుగానే ఉన్నాడో తెలుసుకోవడానికి బలమైన ఆత్మీయాహారము కొరకు అతడు కలిగియుండు ఆకలి లేదా కోరిక ఒక మంచి సూచనయై యున్నది.
9. ఒక వ్యకి ఆత్మీయాభివృద్ధికి ఆ వ్యక్తి ఆత్మీయాకలి ఎట్లు ఒక సూచనయై యున్నది?
9 కాబట్టి, నీ ఆత్మీయ ఆకలి ఎట్లున్నది? బైబిలు ఆధారిత ప్రచురణలు, క్రైస్తవ కూటములు మరియు సమావేశముల ద్వారా యెహోవా క్రమముగా దయచేస్తున్న విస్తారమైన ఆత్మీయాహారమును నీవెలా దృష్టిస్తున్నావు. (యెషయా 65:13) వార్షిక జిల్లా సమావేశములలో క్రొత్త సాహిత్యములు విడుదల చేయబడినప్పుడు నిస్సందేహముగా నీవు ఎంతగానో ఉల్లసిస్తావు. అయితే నీవు వాటిని ఇంటికి తెచ్చినప్పుడు ఏమిచేస్తావు? కావలికోట లేదా అవేక్! క్రొత్త సంచికలు వచ్చినప్పుడు నీవేమి చేస్తున్నావు? ఈ ప్రచురణలను చదవడానికి నీవు సమయము తీసుకుంటున్నావా, లేక కేవలము ఉన్నతాంశాలను చూడడానికి ఊరకనే పేజీలు త్రిప్పి ఆ పిమ్మట వాటినికూడ మిగతా పుస్తకములతోబాటు బుక్‌షెల్ఫ్‌లో పడవేస్తున్నావా? క్రైస్తవ కూటముల విషయములో కూడ ఇలాంటి ప్రశ్నలే వేసికొనవచ్చును. నీవు క్రమముగా అన్ని కూటములకు హాజరవుతున్నావా? వాటికి సిద్ధపడుటయే కాకుండ నీవు వాటిలో భాగము వహిస్తున్నావా? కొంతమంది ఆత్రముగా కేవలము పైపైన మాత్రమే చదివి, ఆత్మీయాహారమును కావలసిన దానికంటె తక్కువగా తీసుకొనే అలవాటులో పడిపోయారు. కీర్తనల రచయిత విషయానికొస్తే అదెంత భిన్నముగా ఉన్నది, ఆయనిట్లన్నాడు: “నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను.” దావీదు రాజు, ఇంకా ఇలా చెప్పాడు: “మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను; బహుజనులలో నిన్ను స్తుతించెదను.” (కీర్తన 35:18; 119:97) స్పష్టముగా, ఆత్మీయ ఏర్పాట్ల యెడల మన ప్రశంసా స్థాయి మన ఆత్మీయ అభివృద్ధికి ఒక సూచనయై యున్నది.
10. ఎఫెసీయులు 4:14నందు ఆత్మీయ శిశువుయొక్క ఏ లక్షణము సూచించబడెను?
10 “అందువలన మనమికమీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయోపాయములచేత వంచనతోను, తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండ కూడదు” అని చెప్పినప్పుడు పౌలు ఆత్మీయ శిశువుయొక్క మరొక లక్షణమును సూచించాడు. (ఎఫెసీయులు 4:14) పిల్లలకు ప్రతిదానిని గూర్చి తెలిసికోవాలనే ఆరాటం ఎక్కువగా ఉంటుందని, తలిదండ్రులకు బాగా తెలుసు. ఒక విధంగా ఇది అనుకూల లక్షణమే, ఎందుకంటే ఇది వారు పరిశోధించి నేర్చుకొని క్రమేణి పరిణతిచెందిన వ్యక్తులుగా తయారగుటకు దోహదపడుతుంది. అయితే, వారు సులభముగా ఒకదాని తర్వాత మరొక విషయపు పరధ్యానములో పడిపోవు ప్రమాదం ఉంది. మరింత చెడ్డదైన విషయమేమంటే, వారికి అనుభవము లేనందున, ఈ ఆరాటము తరచు వారికిని, ఇతరులకును ముప్పుతెచ్చు తీవ్రమైన సమస్యలలో వారు పడిపోవుటకు నడిపిస్తున్నది. ఆత్మీయ శిశువుల విషయంలోను ఇది నిజమైయుంది.
11. (ఎ) “కల్పింపబడిన ప్రతి ఉపదేశము” అను మాట నుపయోగించినప్పుడు పౌలు మనస్సులో ఏముండెను? (బి) మనమీనాడు ఎటువంటి ‘గాలుల’ నెదుర్కొనుచున్నాము?
11 ఆత్మీయ శిశువులు “కల్పింపబడిన ప్రతి ఉపదేశము” ద్వారా గాలికి కొట్టుకొనిపోవుదురని చెప్పినప్పుడు పౌలు మనస్సులో ఏముండెను? ఇక్కడ “గాలి” అనుమాట గ్రీకు పదమగు ఆనిమోస్ నుండి అనువదింపబడినది. నిజానికి ఈ పదము “చంచలమైన అను తలంపుకు సరిపడు విధముగా ఎంపిక చేయబడెనని” దీనిని గూర్చి ఇంటర్నేషనల్ క్రిటికల్ కామెంట్రీ అభిప్రాయపడింది. ఇది “మనుష్యుల . . . కుయుక్తితోను” అని పౌలుచెప్పిన మాటలను చక్కగా ఉదహరిస్తున్నది. “కుయుక్తి” అను పదమునకు ఆదిమ భాషలో ప్రాథమికంగా “పాచిక” లేక “పాచికలాట” అనగా అదృష్టాన్నిబట్టిసాగే ఆట అను భావము కలదు. ఇక్కడ అసలు విషయమేమంటే, హానికరము కానట్లు, శోధనతో కూడిన, చివరకు యోగ్యమైనట్లుగానే కన్పించు క్రొత్త తలంపులు, గమ్యములను మనము ఎడతెగక ఎదుర్కొంటాము. పౌలు మాటలు ప్రాథమికముగా మన విశ్వాసానికి సంబంధించిన విషయాలకు వర్తిస్తాయి. అనగా, సర్వమత [చర్చీల] ఐక్యతా ఉద్యమాలు, సామాజిక, రాజకీయ పనులవంటి వాటికి అన్వయిస్తాయి. (1 యోహాను 4:1 పోల్చుము.) అయితే ఆ సూత్రము, ఎప్పుడూ మారుతూవుండే లోక ఫ్యాషన్లు—దాని వేషభాషలు, వినోదం, ఆహారం, ఆరోగ్యం లేక వ్యాయామ దినచర్యలు వగైరాలకు సంబంధించికూడా వాస్తవమై యున్నది. అనుభవము, విచక్షణ లేకపోవుట వలన ఆత్మీయ శిశువు అలాంటివాటి ధ్యాసలోపడి, ఆత్మీయాభివృద్ధి చేసికొనుటలోను, మరి ప్రాముఖ్యమైన క్రైస్తవ బాధ్యతలను నెరవేర్చుటలోను తప్పిపోవచ్చును.—మత్తయి 6:22-25.
12. బాధ్యత విషయములో చిన్న పిల్లలెట్లు పెద్దలకు భిన్నముగా ఉంటారు?
12 చిన్నపిల్లల మరొక లక్షణమేమంటే ఎడతెగక తమకు సహాయం, తమయెడల శ్రద్ధ చూపాలని కోరుకుంటారు. వారికి బాధ్యతలంటే ఏమిటో తెలియదు లేక వాటియెడల వారికి శ్రద్ధ వుండదు; పసితనము ప్రతిదీ కేవలము తమాషాగా, ఆకతాయిగా ఉండే కాలము. పౌలు చెప్పినట్లుగా, వారు ‘పిల్లలవలె మాట్లాడుదురు, పిల్లలవలె తలంచుదురు, పిల్లలవలె ఆలోచింతురు.’ తమ పనులు ఇతరులుచేసి పెడతారని వారనుకుంటారు. ఆత్మీయ శిశువును గూర్చికూడ అట్లే చెప్పవచ్చును. క్రొత్త వ్యక్తి తన మొదటి బైబిలు ప్రసంగమును ఇచ్చునప్పుడు లేదా మొదటిసారిగా ప్రాంతీయ పరిచర్యకు వచ్చునప్పుడు, ఆత్మీయ తండ్రి/తల్లి ఆ వ్యక్తికి సహాయపడుటకు చేయదగు ప్రతిదానిని చేయుటకు సంతోషిస్తారు. ఆ క్రొత్త వ్యక్తి ఎప్పుడూ అటువంటి సహాయము కొరకు అలానే ఆధారపడుచున్నట్లయితే మరియు తనయెడల తాను శ్రద్ధ చూపుకొనగలిగే బాధ్యతను అంగీకరించలేకపోతున్నాడని రుజువైతే అప్పుడేమి? స్పష్టముగా అది స్వయం-కృషి లేదనుటకు సూచనగా ఉండును.
13. ప్రతివారు తమ స్వంత బరువును మోయుటకు ఎందుకు నేర్చుకొనవలెను?
13 ఈ విషయములో మనము “ఒకని భారముల నొకడు” భరించవలసి యున్నను, “ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెనని” అపొస్తలుడైన పౌలు యిచ్చిన సలహాను గుర్తుతెచ్చుకోవాలి. (గలతీయులు 6:2, 5) క్రైస్తవ బాధ్యతలు మోయడానికి ఒక వ్యక్తికి సమయము, కృషి అవసరము. అంటే కొన్ని రంగాలలో త్యాగాలు చేయాలని దాని భావము. అయితే ఒక వ్యక్తి శిష్యులనుచేయు పనిలో తన భాగమును అభివృద్ధి చేసికొనక లేదా ఆత్మీయాభివృద్ధి మరియు బాధ్యత చేపట్టు ఏ కోరిక లేకుండా, ఊరకనే ప్రక్కన నిలువబడి, అవేవైనాసరే వినోదమో, విహారయాత్రలో, ఏవో వస్తువులు లేక లౌకిక ఉద్యోగం కొరకు అనవసరంగా వెదకుతూ జీవితమందలి తమాషా మరియు ఆటపాటల్లో మునిగియుండుట గంభీరమైన తప్పిదమై యుండును. “మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి” అని శిష్యుడైన యాకోబు ఉద్భోదించాడు.—యాకోబు 1:22; 1 కొరింథీయులు 16:13.
14. శిశువు లక్షణములను కనబరుచుటలోనే మనమెందుకు సంతృప్తి కలిగియుండకూడదు?
14 అవును, పెద్దవానికి పిల్లవానికి మధ్య తేడా చూపించు అనేక లక్షణాలను సులభముగా గ్రహించవచ్చును. అయితే, పౌలు చెప్పినట్లుగా ఒక ప్రాముఖ్యమైన సంగతేమంటే, మనము పిల్లవాని చేష్టలు విడిచి క్రమేపి పెరిగి పెద్దవారం కావాలి. (1 కొరింథీయులు 13:11; 14:20) లేనట్లయితే, ఆత్మీయ భావములో మనం ఎదుగుదల లేని వారమవుతాము. అయితే ఒకడు అభివృద్ధినెట్లు సాధించవచ్చును? పరిణతి పొందువరకు ఆత్మీయముగా ఎదుగుటలో ఏమి యిమిడియున్నది?
అభివృద్ధి అందరికి ఎట్లు తేటపడును
15. ఎదుగుదల విధానమందలి ప్రాథమిక చర్యలేమై యున్నవి?
15 సరే, సహజ లోకంలో ఎదుగుదల ఎలా జరుగుతుంది? “ప్రతివ్యక్తి తన జీవితమును ఒక కణముతో ప్రారంభించును” అని ది వరల్డ్ బుక్ ఎన్‌సైక్లోపీడియా వివరిస్తున్నది. “ఆ కణము ఆహారమును సేకరించి ఎదుగుటకు కావలసిన నిర్మాణ ఖండాలుగా దానిని మార్చును. ఆ విధముగా, ఆ ఏక కణము దానంతటదే పెరుగును. ఇదే కణము పెరుగుతూ, అనేక కణాలుగా విభాగింపబడును.” ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే ఆ ఎదుగుదల దానంతటదే సంభవించును. సరియైన పోషణ జరిగి, జీర్ణించుకుని దానిని ఉపయోగములో పెట్టినట్లయితే, ఎదుగుదల జరుగుతుంది. దీనిని మనము క్రొత్తగా జన్మించిన శిశువులో స్పష్టముగా చూడవచ్చును. మనకు తెలుసు, క్రొత్తగా జన్మించిన శిశువు తన ఎదుగుదలకు కావల్సిన క్రొవ్వు పదార్థములు, మాంసకృత్తులు, ఖనిజాలతో ప్రత్యేకముగా తయారుచేయబడిన ఆహారము, పాలు ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటుంది. ఫలితం? శిశువు తనమొదటి సంవత్సరంలో పెరిగే ఎత్తు, బరువుతో పోల్చితే, మిగిలిన తన జీవితకాలంలో ఎన్నడూ అంత వేగంగా పెరగడు.
16. అనేకమంది క్రొత్త బైబిలు విద్యార్థులలో ఎట్టి ఎదుగుదల కన్పించినది, అదెట్లు సాధ్యమైనది?
16 ఎదుగుదల యొక్క ఈ సహజ విధానమునుండి మనమెంతో నేర్చుకొని దానిని మనము ప్రాథమిక విషయాలనుండి పరిణతి వరకు మన ఆత్మీయ అభివృద్ధికి అన్వయించ వచ్చును. మొట్టమొదట, ఒక స్థిరమైన పోషణ కార్యక్రమము ఆవశ్యకము. మొదట బైబిలు పఠనమును నీవు ఆరంభించిన కాలమును గూర్చి వెనుకకు ఒకసారి ఆలోచించుము. ఇతరులనేకమంది వలెనే నీవును ఉంటే, బహుశ నీకును దేవుని వాక్యమును గూర్చి ఏమియు తెలిసియుండేది కాదు. అయితే ప్రతివారము నీ పాఠాలను నీవు సిద్ధపడి, బైబిలును పఠించి అనతి కాలములోనే నీవు లేఖనములలోని ప్రాథమిక బోధలన్నింటిని అర్థము చేసికొంటావు. ఇది ఆశ్చర్యకరమైన ఎదుగుదలని, ఇదంతయు దేవుని వాక్యమును క్రమముగా పఠించుట యొక్క ఫలితమేనని నీవు అంగీకరించాల్సిందే!
17. క్రమమైన ఆత్మీయ పోషణ కార్యక్రమము ఏర్పాటుచేసికొనుట ఎందుకు అనివార్యం?
17 మరి ఇప్పటి విషయమేమి? నీవింకా క్రమమైన పఠన కార్యక్రమమును అనుసరిస్తున్నావా? తాను బాప్తిస్మము తీసుకున్నాడు గనుక, తానిక ఒక క్రమములో ఒక నియమిత పద్ధతి ప్రకారం పుష్టికరమైన ఆత్మీయాహారాన్ని పుచ్చుకొనవలసిన అవసరం లేదని ఒకడు ఎన్నటికిని తలంచకూడదు. తిమోతి పరిణతిచెందిన క్రైస్తవ అధ్యక్షుడైనను, పౌలు ఆయనకిట్లు ఉద్భోదించాడు: “నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటియందే సాధకము చేసికొనుము.” (1 తిమోతి 4:15) మనలో ప్రతిఒక్కరము ఆలాగున చేయుట ఎంత ఆవశ్యకము! నీ ఆత్మీయాభివృద్ధిని అందరికి తేటగా కనబడజేయుటకు నీవు ఆసక్తి కలిగియున్నట్లయితే, అటువంటి ప్రయత్నాలు చేయక తప్పదు.
18. ఒకని ఆత్మీయాభివృద్ధి ఎట్లు తేటబడును?
18 తన అభివృద్ధిని అందరికి తేటగా కనబడజేయుట అనగా ఆ వ్యక్తి తనకు తెలిసిన దానిని ఇతరులకు డంబముగా ప్రదర్శించడానికి ప్రత్యేకముగా ప్రయత్నించడం లేదా ఇతరులను ముగ్ధుల్ని చేయడానికి ప్రయత్నించడం అని దాని భావం కాదు. యేసు ఇట్లన్నాడు: “మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగైయుండనేరదు.” మరియు “హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును.” (మత్తయి 5:14; 12:34) మన హృదయాలు మనస్సులు ఎప్పుడైతే దేవుని వాక్యములోని మంచి సంగతులతో నిండివుంటాయో, అప్పుడు మనము చెప్పేదానిలో చేసేదానిలో వాటిని తప్పక ప్రదర్శించగలం.
19. మన ఆత్మీయాభివృద్ధి విషయములో మనమేమి చేయుటకు తీర్మానించుకొనవలెను, ఏ ఫలితాన్ని దృష్టిలో ఉంచుకోవాలి?
19 కావున, ప్రశ్న ఏమంటే: నీ అంతర్గత ఆత్మీయాభివృద్ధిని పురికొల్పగల పౌష్టికాహారాన్ని పొందుటకు నీవు క్రమముగా బైబిలును పఠిస్తూ, క్రైస్తవ కూటాలకు హజరగుచున్నావా? ఆత్మీయాభివృద్ధి విషయం వచ్చేసరికి ఊరకనే ప్రక్కన నిలువబడి చూచేవ్యక్తిగా ఉండుటలో సంతృప్తిపడకుము. యెహోవా సమృద్ధిగా దయచేస్తున్న ఆత్మీయాహారమును సంపూర్ణముగా పుచ్చుకొనుటకు క్రియాత్మక చర్యలు చేపట్టుము. ‘యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ, దివారాత్రము దానిని ధ్యానించు వారిలో’ నీవునూ ఒకడవైనట్లయిన, నిన్ను గూర్చియు ఇట్లు చెప్పబడగలదు: “అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును, అతడు చేయునదంతయు సఫలమగును.” (కీర్తన 1:2, 3) అయితే, నీవు ఎడతెగక ఆత్మీయాభివృద్ధిని సాధించుటకు ఏమిచేయవచ్చును? దీనిని మనము తర్వాతి శీర్షికలో చర్చిద్దాము. (w92 8/1)
నీవు జవాబివ్వగలవా?
◻ మన ఆత్మీయాభివృద్ధిని పరీక్షించుకొనుట ఎందుకు సమయానుసారమై యున్నది?
◻ ఆత్మీయ ఎదుగుదల ఆత్మీయాకలితో ఎట్లు సంబంధము కలిగియున్నది?
◻ “కల్పింపబడిన ప్రతి ఉపదేశము” అనగా అర్థమేమి?
◻ ప్రతివారు ఎందుకు తమ బరువు తామే మోయవలెను?
◻ ఆత్మీయాభివృద్ధి ఎట్లు సాధించబడును?
[10వ పేజీలోని చిత్రాలు]
బైబిలు ఆధారిత ప్రచురణలను చదువుటకు నీవు సమయము తీసికొందువా?