కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w00 8/15 పేజీలు 26-29
  • మీరు “పూర్తిగా ఎదిగిన” క్రైస్తవులేనా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు “పూర్తిగా ఎదిగిన” క్రైస్తవులేనా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “అవగాహనా శక్తుల విషయంలో పూర్తిగా ఎదగండి”
  • అత్యుత్సాహంతో ప్రకటించేవారు, బోధించేవారు
  • యథార్థతను కాపాడుకునేవారు
  • నమ్మకమైనవారు
  • మీ చర్యల ద్వారా ప్రేమను ప్రదర్శించండి
  • స్వచ్ఛారాధనను పెంపొందింపజేయటానికి మన నైపుణ్యాలూ, ఆస్తులూ
  • పరిణతికి ఎదుగుతూ సాగిపోదాం!
  • “పరిణతి సాధించే దిశగా ముందుకు” సాగిపోండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • మీరు క్రీస్తులాంటి పరిణతిని సాధించడానికి కృషిచేస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • ‘నీ అభివృద్ధిని తేటగా కనబడనిమ్ము’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • మీ అభివృద్ధి తేటగా కనబడనివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
w00 8/15 పేజీలు 26-29

మీరు “పూర్తిగా ఎదిగిన” క్రైస్తవులేనా?

“నేను పిల్లవాడనై యున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని.” అపొస్తలుడైన పౌలు వ్రాసిన మాటలవి. మనమందరమూ ఒకప్పుడు నిస్సహాయులైన పిల్లల్లానే ఉన్నాము. అయితే, మనం అలానే ఉండిపోలేదు కదా! పౌలు ఇలా అంటున్నాడు: “ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని.”—1 కొరింథీయులు 13:11.

అదే విధంగా క్రైస్తవులందరూ మొదట్లో ఆధ్యాత్మికంగా పిల్లల్లానే ఉంటారు. కానీ కొంతకాలానికి అందరమూ, “విశ్వాసవిషయములోను దేవుని జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది, సంపూర్ణ [“పూర్తిగా ఎదిగిన,” NW] పురుషులమగువరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత” గలవారమవ్వగల్గుతాము. (ఎఫెసీయులు 4:11-13) 1 కొరింథీయులు 14:20 లో మనకు ఇలా ఉద్బోధ చేయబడింది: “సహోదరులారా, మీరు బుద్ధివిషయమై పసిపిల్లలు కాక . . . పెద్దవారలై యుండుడి [“అవగాహనా శక్తుల విషయంలో పూర్తిగా ఎదగండి,” NW].”

పరిణతి చెందిన, పూర్తిగా ఎదిగిన క్రైస్తవులు తమ మధ్య ఉండడం నేడు దేవుని ప్రజలకు ఒక ఆశీర్వాదమే, ప్రాముఖ్యంగా ఎంతో మంది కొత్తవారు ఉండడం మూలంగా ఇది నిరాకరించలేని వాస్తవం. పూర్తిగా ఎదిగిన క్రైస్తవులు సంఘానికి స్థిరత్వాన్ని ఆపాదిస్తారు. వారు ఏ సంఘంలో ఉన్నా ఆ పూర్తి సంఘం కల్గివున్న వైఖరిపైన లేదా స్వభావంపైన వారు మంచి ప్రభావాన్ని కనపరుస్తారు.

శారీరక ఎదుగుదల దాదాపు మన ప్రమేయమేమీ లేకుండానే జరిగినా ఆధ్యాత్మిక ఎదుగుదల మాత్రం సమయం వెచ్చిస్తేనే కృషి చేస్తేనే సాధ్యమౌతుంది. అందుకని, పౌలు కాలంలోని కొందరు క్రైస్తవులు ఎన్నో సంవత్సరాలుగా దేవుని సేవ చేస్తున్నప్పటికీ వారు ‘సంపూర్ణులగుటలో’ విఫలమయ్యారంటే అందులో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. (హెబ్రీయులు 5:12; 6:1) మీ విషయం ఏమిటి? మీరు ఎన్నో సంవత్సరాలుగా దేవుని సేవచేస్తున్నా లేదా ఇటీవలనే ప్రారంభించినా మిమ్మల్ని మీరు నిజాయితీగా పరిశీలించుకోవడం మంచిది. (2 కొరింథీయులు 13:5) నిజంగా పరిణతి చెందిన వారని, లేదా పూర్తిగా ఎదిగిన క్రైస్తవులని పరిగణింపబడగల వారిలో మీరూ ఉన్నారా? లేనట్లైతే మీరు వారిలో ఎలా చేరగలరు?

“అవగాహనా శక్తుల విషయంలో పూర్తిగా ఎదగండి”

ఆధ్యాత్మికంగా చిన్నపిల్లలుగా ఉన్నవారు సులభంగా “మనుష్యుల మాయోపాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబ[డతారు].” అందుకని పౌలు ఇలా ఉద్బోధ చేశాడు: “ప్రేమ గలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సయియున్నాడు.” (ఎఫెసీయులు 4:14-16) మనమలా ఎలా చేయగలము? హెబ్రీయులు 5:14 ఇలా చెబుతుంది: “వయస్సు వచ్చిన వారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును.”

పరిణతి చెందిన వ్యక్తుల జ్ఞానేంద్రియాలు, వారు వాటిని మళ్ళీ మళ్ళీ ఉపయోగించడం మూలంగా లేదా బైబిలు సూత్రాలను అన్వయించుకోవడంలో అనుభవం గడించడం మూలంగా అవి సాధకము చేయబడతాయని గమనించండి. కాబట్టి మరి, కన్ను మూసి తెరిచేంతలోనే ఎవరూ పరిణతి చెందినవారు కాలేరు; ఆధ్యాత్మికంగా ఎదగాలంటే సమయం పడుతుంది. అయినా, మీరు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలను మీ వ్యక్తిగత పఠనం ద్వారా—ప్రాముఖ్యంగా దేవుని వాక్యంలోని లోతైన విషయాలను పఠించడం ద్వారా ఎంతో వేగిరపర్చగలరు. ఇటీవలి కాలాల్లో కావలికోట లోతైన విషయాలెన్నింటినో చర్చించింది. పరిణతి చెందినవారు, “కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి” అని చెబుతూ అటువంటి శీర్షికలకు దూరంగా ఉండరు. (2 పేతురు 3:16) బదులుగా, వారు అటువంటి బలమైన ఆహారాన్ని పూర్తి ఉత్సాహంతో భుజిస్తారు!

అత్యుత్సాహంతో ప్రకటించేవారు, బోధించేవారు

యేసు తన శిష్యులకు ఇలా నిర్దేశాలిచ్చాడు: “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి.” (మత్తయి 28:19, 20) ప్రకటనా పనిలో అత్యుత్సాహంతో పాల్గొనడం కూడా మీ ఆధ్యాత్మిక ఎదుగుదలను వేగిరపర్చగలదు. మీ పరిస్థితులు అనుమతిస్తున్నంత మేరకు పరిచర్యలో పూర్తిగా భాగం వహించటానికి మీరెందుకు కృషిచేయకూడదు?—మత్తయి 13:23.

కొన్నిసార్లు జీవితంలోని ఒత్తిళ్ళ మూలంగా ప్రకటనా పనిలో సమయాన్ని వెచ్చించడం కష్టం కావచ్చు. అయినా ప్రచారకునిగా ఉండడానికి మీరు పూర్తిగా ‘పోరాడుతూ’ ఉండడం ద్వారా మీ జీవితంలో మీరు “సువార్త”కు ఇచ్చే ప్రాముఖ్యాన్ని ప్రదర్శిస్తారు. (లూకా 13:24; రోమీయులు 1:16) ఆ విధంగా ఇతరులు మిమ్మల్ని “విశ్వాసులకు మాదిరిగా” దృష్టిస్తారు.—1 తిమోతి 4:12.

యథార్థతను కాపాడుకునేవారు

పరిణతికి ఎదగడంలో మీరు మీ యథార్థతను కాపాడుకోవడానికి గట్టి కృషి సల్పడం కూడా ఇమిడివుంది. కీర్తన 26:1 లో నమోదు చేయబడినట్లుగా దావీదు ఇలా ప్రకటించాడు: “యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. నాకు తీర్పు తీర్చుము.” యథార్థవంతులుగా ఉండడమంటే నైతికంగా పటిష్ఠంగా ఉండడం, సంపూర్ణంగా ఉండడం. అయితే దానర్థం పరిపూర్ణత కాదు. దావీదే ఎన్నోసార్లు గంభీరమైన పాపాలు చేశాడు. అయినప్పటికీ ఆయన గద్దింపును స్వీకరించి, తన మార్గాల్ని సరిచేసుకోవడం ద్వారా, ఆయన తన హృదయంలో ఇంకా యెహోవా దేవుని పట్ల నిజమైన ప్రేమ ఉందని ప్రదర్శించాడు. (కీర్తన 26:2, 3, 6, 8, 11) యథార్థతలో సంపూర్ణమైన హృదయంతో భక్తిని కలిగివుండడం ఇమిడివుంది. దావీదు తన కుమారుడైన సొలొమోనుకు ఇలా చెప్పాడు: “నీవు [నీ తండ్రియొక్క దేవుడైన యెహోవాను] తెలిసికొని హృదయపూర్వకముగా . . . ఆయనను సేవించుము.”—1 దినవృత్తాంతములు 28:9.

యథార్థతను కాపాడుకోవడంలో దేశ రాజకీయాలకూ వాటి యుద్ధాలకూ దూరంగా ఉంటూ ‘లోకసంబంధులు కాకుండా’ ఉండడం ఇమిడివుంది. (యోహాను 17:16) మీరు వ్యభిచారము, అనైతికత, మాదకద్రవ్యాల దుర్వినియోగము వంటి భ్రష్టమైన అభ్యాసాలను కూడా విడనాడాలి. (గలతీయులు 5:19-21) అయితే, యథార్థతను కాపాడుకోవడంలో వాటిని విసర్జించడమేగాక ఇంకా ఎంతో ఇమిడివుంది. సొలొమోను ఇలా హెచ్చరించాడు: “బుక్కా వాని తైలములో చచ్చిన యీగలు పడుటచేత అది చెడువాసన కొట్టును; కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినయెడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును.” (ప్రసంగి 10:1) అవును, “కొంచెము బుద్ధిహీనత,” ఉదాహరణకు వెకిలి హాస్యం, లేదా అసభ్యంగా ప్రవర్తించడం వంటివి “జ్ఞానము” కల్గివున్న వ్యక్తుల మంచి పేరును పాడుచేయగలవు. (యోబు 31:1) అందుకని, మీ ప్రవర్తన అంతటిలో మాదిరికరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ, చివరికి “దుష్టత్వపు పోకడలను” కూడా నివారిస్తూ మీ పరిణతిని ప్రదర్శించండి.—1 థెస్సలొనీకయులు 5:22, కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌.

నమ్మకమైనవారు

పూర్తిగా ఎదిగిన క్రైస్తవుడు నమ్మకమైనవాడు కూడాను. ఎఫెసీయులు 4:24 లో మనం చదువుతున్నట్లుగా పౌలు క్రైస్తవులను ఇలా ప్రోత్సహిస్తున్నాడు: “నీతియు యథార్థమైన [“నమ్మకమైన,” NW] భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను.” గ్రీకు లేఖనాల్లో “నమ్మకము” అనే పదంలో పవిత్రత, నీతి, భక్తి అనే భావాలు ఇమిడివున్నాయి. నమ్మకమైన వ్యక్తి భక్తి, నిష్ఠలు గలవాడు; ఆయన దేవునిపట్ల తనకున్న విధులన్నింటినీ జాగ్రత్తగా నిర్వర్తిస్తాడు.

మీరు అటువంటి నమ్మకమైన వ్యక్తిగా తయారుకావడానికి ఏ మార్గాలున్నాయి? ఒక మార్గమేమిటంటే, మీరు మీ స్థానిక సంఘ పెద్దలతో సహకరించడమే. (హెబ్రీయులు 13:17) క్రైస్తవ సంఘానికి క్రీస్తు నియుక్త శిరస్సు అని గుర్తిస్తూ పరిణతి చెందిన క్రైస్తవులు “[దేవుని] సంఘమును కాయుటకు” నియమించబడినవారికి నమ్మకంగా ఉంటారు. (అపొస్తలుల కార్యములు 20:28) నియమిత పెద్దల అధికారాన్ని సవాలు చేయడం లేదా దాన్ని బలహీనపర్చడం ఎంత అనుచితమై ఉంటుంది! “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[నికీ],” “తగినవేళ” ఆధ్యాత్మిక “అన్నము” అందించటానికి ఆ దాసుడు ఉపయోగించుకునే మాధ్యమాలకూ కూడా మీరు నమ్మకంగా ఉండాలి. (మత్తయి 24:45) కావలికోటలోనూ అలాగే దానితోపాటు వచ్చే ప్రచురణల్లోనూ వచ్చే సమాచారాన్ని చదివి అన్వయించుకోవడానికి సంసిద్ధంగా ఉండండి.

మీ చర్యల ద్వారా ప్రేమను ప్రదర్శించండి

పౌలు థెస్సలొనీకలోని క్రైస్తవులకు ఇలా వ్రాశాడు: “మీ అందరిలో ప్రతివాడును ఎదుటివానియెడల చూపు ప్రేమ విస్తరించుచున్నది.” (2 థెస్సలొనీకయులు 1:3) ప్రేమలో పెరుగుతూ ఉండడం ఆధ్యాత్మిక ఎదుగుదలలోని ఎంతో ప్రాముఖ్యమైన అంశం. యోహాను 13:35 లో ఉన్న విధంగా యేసు ఇలా అన్నాడు: “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందు[రు].” అటువంటి సహోదర ప్రేమ కేవలం భావోద్వేగ పరంగా లేదా భావనాత్మకంగా మాత్రమే వ్యక్తం చేసేది కాదు. వైన్స్‌ ఎక్స్‌పోజిటరీ డిక్షనరీ ఆఫ్‌ ఓల్డ్‌ అండ్‌ న్యూ టెస్టమెంట్‌ వర్డ్స్‌ ఇలా చెబుతుంది: “ప్రేమ అది పురికొల్పే చర్యల ద్వారానే తెలియపర్చబడుతుంది.” అవును, ఈ విషయంలో మీరు మీ ప్రేమను చర్యల ద్వారా ప్రదర్శించడం ద్వారా పరిణతికి ఎదుగుతారు!

ఉదాహరణకు, మనం రోమీయులు 15:7 లో ఇలా చదువుతాము: “మీరును ఒకనినొకడు చేర్చుకొనుడి.” మన ప్రేమను ప్రదర్శించే ఒక మార్గమేమిటంటే, మనం సంఘ కూటాలకు వెళ్ళినప్పుడు అక్కడ తోటి విశ్వాసులనూ క్రొత్తగా వచ్చినవారినీ పలకరించడమే—ఆప్యాయంగాను ఆదరణతోను! వారితో మంచి పరిచయం పెంచుకోండి. మనం “సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ” పట్టించుకోవాలి. (ఫిలిప్పీయులు 2:4) బహుశ మీరు మీ ఇంటికి వేర్వేరు వ్యక్తుల్ని ఆహ్వానించి ఆతిథ్యాన్ని కనపర్చడం సాధ్యమౌతుందేమో. (అపొస్తలుల కార్యములు 16:14, 15) కొన్నిసార్లు ఇతరుల అపరిపూర్ణతలు మీ ప్రేమ ఎంత ప్రగాఢమైనదో పరీక్షించగలవు. కానీ మీరు ‘ప్రేమతో ఒకరినొకరు సహించడం’ నేర్చుకుంటుండే కొలది మీరు పూర్తిగా ఎదిగిన వారౌతున్నారని చూపిస్తారు.—ఎఫెసీయులు 4:1-2.

స్వచ్ఛారాధనను పెంపొందింపజేయటానికి మన నైపుణ్యాలూ, ఆస్తులూ

ప్రాచీన కాలంలో, యెహోవా ఆలయాన్ని చూసుకునే బాధ్యతను దేవుని ప్రజల్లో అందరూ నిర్వర్తించలేదు. అందుకని ఈ విషయంలో వారిని పురికొల్పటానికి దేవుడు హగ్గయి, మలాకీ లాంటి ప్రవక్తల్ని పంపించాడు. (హగ్గయి 1:2-6; మలాకీ 3:10) పరిణతి చెందిన క్రైస్తవులు నేడు యెహోవా ఆరాధనకు మద్దతునివ్వటానికి తమ నైపుణ్యాలనూ ఆస్తులనూ ఆనందంగా ఉపయోగిస్తారు. 1 కొరింథీయులు 16:1, 2 వచనాల్లోని సూత్రాన్ని అనుసరిస్తూ అటువంటి వారి మాదిరిని అనుకరించండి. ‘మీరు వర్ధిల్లిన కొలది మీ దగ్గర కొంత సొమ్ము నిలువచేస్తూ’ సంఘానికీ, యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త పనికీ చందా వేయటానికి దాన్ని ఉపయోగించండి. దేవుని వాక్యమిలా వాగ్దానం చేస్తుంది: “సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును.”—2 కొరింథీయులు 9:6.

మీ సమయమూ మీ శక్తీ వంటి మీకున్న ఇతర ఆస్తుల్ని విస్మరించకండి. తక్కువ ప్రాముఖ్యమైన విషయాల్ని విడనాడుతూ ‘సమయము పోనివ్వకుండా’ ఉండడానికి ప్రయత్నించండి. (ఎఫెసీయులు 5:15, 16; ఫిలిప్పీయులు 1:9, 10) సమయాన్ని ఉపయోగించే విషయంలో మంచి సామర్థ్యాన్ని కల్గివుండడం నేర్చుకోండి. అలా చేయడం ద్వారా యెహోవా ఆరాధనను అభివృద్ధిచేసే పనుల్లో, ఉదాహరణకు రాజ్యమందిరం బాగోగులు చూసుకోవడం లేదా అలాంటి మరితర పనుల్లో పాల్గొనడం సాధ్యమౌతుంది. మీ ఆస్తులను ఈ విధంగా ఉపయోగించడం మీరు పూర్తిగా ఎదిగిన క్రైస్తవులౌతున్నారన్న దానికి మరింత రుజువునిస్తుంది.

పరిణతికి ఎదుగుతూ సాగిపోదాం!

పఠనాసక్తి ఉన్నవారు, జ్ఞానవంతులు, అత్యంతాసక్తితో సువార్తను ప్రకటించేవారు, తమ ప్రవర్తనలో నిష్కల్మషులైనవారు, నమ్మకమైనవారు, ప్రేమగలవారు, రాజ్య పనికి తమ శక్తియుక్తుల్నీ వస్తుసంపదల్నీ వెచ్చించటానికి సంసిద్ధంగా ఉండేవారైన స్త్రీపురుషులు నిజంగా ఒక గొప్ప ఆశీర్వాదమే. అందుకని అపొస్తలుడైన పౌలు ఇలా ఉద్బోధ చేయడంలో ఆశ్చర్యమేమీలేదు: “క్రీస్తునుగూర్చిన మూలోపదేశము మాని, సంపూర్ణులమగుటకు సాగిపోదము.”—హెబ్రీయులు 6:1.

మీరు పూర్తిగా ఎదిగిన పరిణతి చెందిన క్రైస్తవులేనా? లేదా మీరింకా కొన్ని అంశాల్లో ఆధ్యాత్మికంగా చిన్నపిల్లలుగానే ఉన్నారా? (హెబ్రీయులు 5:13) ఏదేమైనా, వ్యక్తిగత పఠనం చేస్తూ ఉండండి, ప్రకటిస్తూ కొనసాగండి, మీ సహోదరుల పట్ల ప్రేమను ప్రదర్శిస్తూ ముందుకు సాగండి. పరిణతి చెందిన వ్యక్తులు మీకు ఎటువంటి సలహాను క్రమశిక్షణను ఇచ్చినా దాన్ని స్వీకరించండి. (సామెతలు 8:33) క్రైస్తవ బాధ్యతలన్నింటినీ పూర్తిగా నిర్వర్తించండి. సకాలంలో చక్కని కృషితో మీరు కూడా “విశ్వాసవిషయములోను దేవుని కుమారునిగూర్చిన జ్ఞానవిషయములోను ఏకత్వముపొంది, సంపూర్ణపురుషు[లు], అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత” గలవారు కాగల్గుతారు.—ఎఫెసీయులు 4:11.

[27వ పేజీలోని బ్లర్బ్‌]

పూర్తిగా ఎదిగిన క్రైస్తవులు సంఘానికి స్థిరత్వాన్ని ఆపాదిస్తారు. వారు పూర్తి సంఘం కల్గివున్న వైఖరిపైన లేదా స్వభావంపైన మంచి ప్రభావాన్ని కనపరుస్తారు

[29వ పేజీలోని చిత్రాలు]

పరిణతి చెందినవారు ఇతరుల్లో ఆసక్తిని కనబరుస్తూ సంఘ స్ఫూర్తికి దోహదపడగలరు

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి