కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 2/15 పేజీలు 26-29
  • పెద్దలారా—ఇతరులను సాత్వికముతో సరిదిద్దుడి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పెద్దలారా—ఇతరులను సాత్వికముతో సరిదిద్దుడి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అపొస్తలుల ఉపదేశము
  • కొన్ని సహాయకరమైన చర్యలు
  • సంతోషించుటకు కారణము
  • ‘పెద్దల్ని పిలవండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • నాయకులుగా ఉన్నవారికి విధేయులై యుండుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • పెద్దలారా దేవుని మందను మృదువుగా కాయుడి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఇష్టపూర్వకముగా దేవుని మందను కాయుడి
    కావలికోట అధ్యయన ఆర్టికల్‌ల బ్రోషుర్‌
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 2/15 పేజీలు 26-29

పెద్దలారా—ఇతరులను సాత్వికముతో సరిదిద్దుడి

నిజమైన క్రైస్తవుని హృదయాన్ని మంచి ఫలములు ఫలించే ఆత్మీయతోటకు పోల్చవచ్చును. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయ, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అక్కడ విరాజిల్లుతాయి. ఎందుకంటే ఇవన్ని సమర్పించుకున్న తన సేవకులకు యెహోవా దేవుడు ఇచ్చే పరిశుద్ధాత్మ ఫలాలు. (గలతీయులు 5:22, 23) అయినను, హృదయమనే తోటను తన పరలోకపు తండ్రికి యిష్టమైన స్థలంగా కాపాడుకోవాలని అనుకునే ప్రతి క్రైస్తవుడు అందులో పారంపర్యంగావచ్చిన పాపపు గురుగులు పెరగకుండా ప్రయాసతో ఎడతెగక పోరాటాన్ని సలుపుతుండాలి.—రోమీయులు 5:5, 12.

అప్పుడప్పుడు, దైవికసంబంధమైన వ్యక్తియొక్క అసంపూర్ణ హృదయములో కోరదగని కొన్ని విషయాలు పెరగటాని కారంభిస్తాయి. అతనికి లేక ఆమెకు మంచి ఆత్మీయ చరిత్ర ఉండవచ్చు. అయినా ఏదొక సమస్య తలెత్తుతుంది. బహుశా అది చెడ్డసహవాసముల మూలంగానో లేక వివేకయుక్తముగాని నిర్ణయము మూలంగానో పుట్టుకొచ్చింది కావచ్చు. అటువంటి వ్యక్తికి సంఘ పెద్దలు ఎట్లు ఆత్మీయంగా సహాయము చేయగలరు?

అపొస్తలుల ఉపదేశము

తప్పుచేసిన క్రైస్తవునికి సహాయం చేసేటప్పుడు, అపొస్తలుడైన పౌలుయొక్క సలహాను పెద్దలు పాటించవలసిన అవసరమున్నది: “సహోదరులారా, ఒకడు (తనకు తెలియక NW) ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసికొని రావలెను.” (గలతీయులు 6:1) ‘తనకు తెలియక ముందు’ తోటివిశ్వాసి “ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల,” ఆయనకు సాధ్యమైనంత త్వరలో పెద్దలు సహాయమునందించవలసిన బాధ్యతను కలిగియున్నారు.

పౌలు ఇక్కడ “ఒకడు” తప్పిదములో చిక్కుకొనినట్లయిన అని ప్రస్తావిస్తున్నాడు. అయినా, ఇక్కడ ఉపయోగించబడిన గ్రీకు పదము (ఏన్‌’థ్రోపాస్‌) పురుషునికిని స్త్రీకిని అన్వయించబడగలదు. కావున ఒక వ్యక్తిని “మంచి దారికి తీసికొని” రావడమంటే అర్థమేమిటి? ఈ గ్రీకు పదమునకు (కా.టర్‌.టి’జో) “సరైన వరుసలో చక్కపెట్టుట” అని అర్థము. అదే పదము వలలను సరిచేసికొనుటకు ఉపయోగించబడింది. (మత్తయి 4:21) ఇది విరిగిపోయిన ఒక అవయవాన్ని చక్కపెట్టుటకును అన్వయించబడగలదు. తన రోగికి అనవసరమైన నొప్పికలగకుండా వైద్యుడు దీనిని జాగ్రత్తగా చేస్తాడు. అలాగే ఒక సహోదరుని లేక సహోదరిని ఆత్మీయంగా సరైన స్థితికితేవడానికి జాగ్రత్త, నైపుణ్యం, వాత్సల్యం అవసరము.

ఒక వ్యక్తిని సరిదిద్దేటప్పుడు సాత్వికమైన మనస్సును ప్రదర్శించుటద్వారా పెద్దలు తమ స్వంత ఆత్మీయతను నిరూపించుకుంటారు. సాత్వికముగల యేసు అటువంటి విషయాలతో సాత్వికముతోనే వ్యవహరిస్తాడు. (మత్తయి 11:29) తప్పుదారిని పట్టిన యెహోవా సేవకునియెడల పెద్దలు ఇదే లక్షణమును ప్రదర్శించవలసియున్నారు. ఎందుకనగా వారు వారి హృదయ తలంపులకు భిన్నంగా పాపములో పడకుండునంత అతీతులేమి కాదు. గతంలో అలాంటిదేమి జరగకపోతే భవిష్యత్తులోనైనా ఇది సంభవించవచ్చును.

ఆత్మీయంగా అర్హులైన ఈ పురుషులు తోటి ఆరాధికుల భారములను ప్రేమతో ‘భరించవలెను’. నిజముగా పెద్దలు వారి సహోదరుడు లేక సహోదరి సాతానుకు, శోధనలకు, శరీరబలహీనతలకు, పాపపు వేదనలకు వ్యతిరేకంగా పోరాడునట్లు సహాయంచేయాలనేది తమ హృదయములో కలిగియున్నారు. “క్రీస్తు నియమమును” నెరవేర్చుటలో క్రైస్తవ అధ్యక్షులకు ఇదొక మార్గమైయున్నది.—గలతీయులు 6:2.

నిజంగా ఆత్మీయ అర్హతలు గల పురుషులు “ఎవడైనను వట్టివాడైయుండి తాను ఎన్నికైన వాడనని యెంచుకొనినయెడల తన్నుతానే మోసపరచుకొనును” అనే విషయాన్ని గుర్తించినవారై దీనులైయుంటారు. (గలతీయులు 6:3) పెద్దలు సహాయకరమైనదాన్ని సరైనదాన్ని చేయాలని ఎంత కష్టపడినను, పరిపూర్ణుడు, ప్రేమపూర్వక వాత్సల్యముగల దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు పోలిస్తే వారు తప్పిపోతూనే వుంటారు. అయితే అంతమాత్రాన వారు తమ శక్తివంచన లేకుండా కృషిచేయకూడదని కాదు.

ఒక తోటి విశ్వాసిని అహంభావముతో అతనికంటె తామే పవిత్రులమనే ధోరణిలో ఖండించడం కూడదని పెద్దలకు తెలుసు. నిశ్చయంగా యేసు అలా చేయలేదు. స్నేహితులకొరకేగాక తన శత్రువులకొరకును ఆయన తన ప్రాణమర్పించెను. అలాగే పెద్దలుకూడా సహోదరసహోదరీలకు వారి కష్టములలో సహాయపడునప్పుడు అటువంటి ప్రేమనే ప్రదర్శించి, పరలోకపు తండ్రికి, ఆయన నీతియుక్త ప్రమాణములకు వారు దగ్గరయ్యేటట్లు కృషిచేస్తారు. తోటి ఆరాధికులను సరిదిద్దుటకు పెద్దలకు సహాయపడే కొన్ని చర్యలేమిటి?

కొన్ని సహాయకరమైన చర్యలు

సాత్వికమైన మనస్సుతో మాట్లాడుతూ ప్రవర్తిస్తూ ప్రార్థనాపూర్వకంగా యెహోవాపై ఆధారపడుము. యేసు సాత్వికమైన మనస్సుగలవాడు. నడిపింపుకొరకు తన తండ్రిని ఎడతెగక ప్రార్థించాడు. ఎల్లప్పుడు ఆయనకిష్టమైన వాటినే ఈయన చేశాడు. (మత్తయి 21:5; యోహాను 8:29) ఒక తప్పిదపు అడుగువేసిన వారిని సరిదిద్దుటకు ప్రయత్నించేటప్పుడు పెద్దలును అలాగే ప్రవర్తించవలెను. సాత్వికమైన మనస్సుగల ఉపకాపరిగా, ఒక పెద్ద బెదిరించేవాడుగా కాక తన మాటతో ప్రోత్సహించేవానిగాను, క్షేమాభివృద్ధి కలుగజేసేవానిగాను ఉండాలి. చర్చా సమయాలలో సహాయమవసరమైన క్రైస్తవుడు స్వేచ్ఛగా తన తలంపులను వ్యక్తపరచుకొనేంత సుఖంగా భావించుకొనేలా అనుకూల వాతావరణాన్ని సృష్టించటానికి ప్రయత్నిస్తాడు. అందుకు హృదయపూర్వకమైన ప్రారంభపు ప్రార్థన సహాయకరంగా ఉండగలదు. సాత్వికముతో ఇచ్చే హెచ్చరికను పొందువాడు, హెచ్చరిక యిచ్చేవారు యేసువలె దేవునికిష్టమైన దానిని చెయ్యాలని కోరుకుంటున్నారని తన హృదయమును సంసిద్ధంగా తెరుస్తాడు. అటువంటి ప్రేమపూర్వకమైన, సాత్విక ధోరణిలో యిచ్చే సలహాను అన్వయించుకోవలసిన అవసరతను అతని మనస్సులో నాటుటకు ముగింపు ప్రార్థన తోడ్పడుతుంది.

ప్రార్థన తర్వాత నిష్కపటముగా అభినందించుము. అది వ్యక్తిగత లక్షణములైన దయ, నమ్మకత్వము లేక పట్టుదల మొదలగువాటికి సంబంధించినదిగా ఉండవచ్చును. బహుశా అనేక సంవత్సరాలుగా ఆయన లేక ఆమె యెహోవాకు నమ్మకంగాచేసిన సేవా చరిత్రను ప్రస్తావించేదైయుండవచ్చు. ఈవిధంగా ఆ వ్యక్తియెడల మనము శ్రద్ధకలిగియున్నామని, క్రీస్తులాంటి గౌరవమును ఆయనయెడల కలిగియున్నామని చూపగలము. తుయతైర సంఘమునకు యేసు తన వర్తమానమును ఈ విధమైన అభినందనతో ప్రారంభించాడు: “నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను నీ సహనమును నేనెరుగుదును; నీ మొదటి క్రియలకన్న నీ కడపటి క్రియలు మరియెక్కువైనవని యెరుగుదును.” (ప్రకటన 2:19) ఆ మాటలు ఆ సంఘస్థులకు వారి మంచి క్రియలను యేసు ఎరిగియున్నాడనే అభయమిచ్చెను. ఆ సంఘ తప్పులలో “యెజెబెలు” ప్రభావాన్ని అనుమతిస్తుండడం ఉన్ననూ—యితర విషయాలలో అది బాగుగా ప్రవర్తిస్తున్నందున ఈ సహోదర సహోదరీల ఆసక్తిదాయకమైన క్రియ గుర్తించబడకుండా పోలేదను సంగతిని వారు తెలుసుకోవాలని యేసు కోరెను. (ప్రకటన 2:20) అలాగే పెద్దలును యోగ్యమైన విషయములలో అభినందించవలెను.

ఒక తప్పిదాన్ని దాని పరిస్థితులకు మించి గంభీరముగా పరిగణించకుము. పెద్దలు దేవుని మందను కాపాడి ఆయన సంస్థను తప్పక పరిశుభ్రముగా ఉంచాలి. అయితే, తీవ్రమైన హెచ్చరిక అవసరమైన ఆత్మీయ తప్పుటడుగులను న్యాయపరమైన విచారణ లేకుండానే ఒకరు లేక ఇద్దరు పెద్దల వివేకముతో నిర్వహించవచ్చును. అనేక సందర్భాలలో ఒక క్రైస్తవుని తప్పుటడుగు వెనుక బుద్ధిపూర్వకమైన దుష్టత్వముకాక, మానవ బలహీనత చోటుచేసుకుంటుంది. పెద్దలు మందను మృదువుగా చూసేవారై ఈ విషయమును గుర్తుంచుకోవాలి: “కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును; కనికరము తీర్పును మించి అతిశయపడును.” (యాకోబు 2:13; అపొ. కార్యములు 20:28-30) గనుక గోరంతను కొండంతలు చేసేబదులు, పశ్చాత్తాపముగల తోటి విశ్వాసుల విషయంలో పెద్దలు కనికరము, వాత్సల్యముగల మనదేవుడైన యెహోవావలెనే వ్యవహరించవలెను.—ఎఫెసీయులు 4:32.

తప్పిదమునకు నడిపిన కారణాలను అర్థంచేసికొని వివేచన కనపరచుము. తోటి విశ్వాసి తన హృదయమును స్వేచ్ఛగా బయటపెడుతుండగా పెద్దలు జాగ్రత్తగా వినవలసిన అవసరమున్నది. దేవుడు ‘విరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చేయడు’ గనుక పెద్దలును అలాగే ఉండవలెను. (కీర్తన 51:17) బహుశా వివాహ జత భావోద్రేక పరమైన విషయములందు మద్దతు కోల్పోవుట సమస్యకు మూల కారణం కావచ్చు. తీవ్రమైన, దీర్ఘకాలిక మనోవేదన వ్యక్తియొక్క భావోద్రేక పరమైన బలమును నిర్మూలించియుండవచ్చును లేదా వివేకయుక్తమైన తీర్మానములను చేసికొనుట మరీ కష్టతరం చేయవచ్చును. ప్రేమగల పెద్దలు ఇటువంటి వాస్తవాలను పరిగణలోనికి తీసుకుంటారు. ఎందుకనగా “అక్రమముగా నడుచువారికి బుద్ధిచెప్పుడని” అంటున్ననూ, “ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనియ్యుడి, అందరియెడల దీర్ఘశాంతముగలవారై యుండు”డని కూడా పౌలు గట్టిగా పురికొల్పుచున్నాడు. (1 థెస్సలొనీకయులు 5:14) పెద్దలు దేవుని నీతియుక్తమైన ప్రమాణముల స్థాయిని తగ్గించకూడదు. అయితే అదే సమయంలో, దేవునివలె కఠినతను తగ్గించగల అవకాశాలను గూర్చి తలంచవలెను.—కీర్తన 103:10-14; 130:3.

మీ తోటి క్రైస్తవుని ఆత్మగౌరవమును కించపరచకుము. మనమెన్నటికి మన సహోదరుని లేక సహోదరిని అగౌరపరచకూడదు లేదా అతను లేక ఆమె అయోగ్యులనే తలంపునిచ్చుటకు ఎప్పటికి ప్రయత్నించకూడదు. బదులుగా ఆ వ్యక్తియొక్క క్రైస్తవ లక్షణములపైన, దేవునియెడలగల ప్రేమవిషయంలో మనకు నమ్మకముందని అభయమిస్తే, వారు తమ తప్పును దిద్దుకోడానికి ప్రోత్సాహకరంగా ఉండగలదు. కొరింథీయులతో పౌలు వారి “సిద్ధమనస్సు” మరియు “ఆసక్తిని” గూర్చి వారిని ఇతరులయెదుట పొగడితినని చెప్పినప్పుడు, చాలామట్టుకు వారు ప్రోత్సాహమును పొందివుంటారు.—2 కొరింథీయులు 9:1-3.

యెహోవాపై నమ్మకముంచుట ద్వారా సమస్యను అధికమించవచ్చునని చూపుము. అవును, ఆ వ్యక్తి దేవునియందు మనఃపూర్వకంగా నమ్మికయుంచుట, దేవుని వాక్య సలహాను అన్వయించుకొనుట తగిన దిద్దుబాటునుచేసికొనుటకు తోడ్పడుతుందని గ్రహించగల్గేలా సహాయముచేయ ప్రయత్నించుము. అలా సరిదిద్దుటకు మన మాటలు లేఖనములలోనుండి, బైబిలుపై ఆధారపడి వ్రాయబడిన ప్రచురణలోనుండి వచ్చేవై యుండవలెను. మన లక్ష్యము రెండు ఉద్దేశములు గలది: (1)సహాయమవసరమైనవారు యెహోవా దృక్పథమును గ్రహించి, వివేచించేటట్లు సహాయపడటం (2) దైవిక మార్గనిర్దేశకాలను కొంతమేరకు ఎలా అలక్ష్యము చేశాడో లేక అనుసరించుటలో తప్పిపోయాడో చూపించుటయే.

లేఖన హెచ్చరికను, దయ మరియు సూటియైన ప్రశ్నలతోను కలగలుపుము. హృదయమును చేరుటలో ఇది ఎంతో ఫలవంతంగా ఉండగలదు. తన ప్రజలు ఎలా మార్గము తప్పిపోయారో అర్థంచేసుకొనేలా చేయడానికి యెహోవా తన ప్రవక్తయైన మలాకీ ద్వారా ఒక ప్రశ్నవేస్తూ, ఇలా అడిగాడు: “మానవుడు దేవునియొద్ద దొంగిలునా?,” తదుపరి ఆయనే “మీరు నాయొద్ద దొంగిలితిరి” అనెను. (మలాకీ 3:8) మోషే ధర్మశాస్త్రము వారిని కోరిన ప్రకారము ఇశ్రాయేలీయులు తమ పంటలో పదియవ భాగమును ఇచ్చుటలో తప్పిపోవుట వారు యెహోవాయొద్ద దొంగిలించుటతో సమానమాయెను. ఈ పరిస్థితిని చక్కదిద్దుకొనుటకు, స్వచ్ఛమైన ఆరాధనయెడలగల తమ విధులను ఇశ్రాయేలీయులు నెరవేర్చినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించును. అలాగే పెద్దలును ఆలోచననను రేకెత్తింపజేసే, శ్రద్ధను ప్రదర్శించే ప్రశ్నల ద్వారా, ఈనాడు సరైనదానిని చేయుటలో పరలోకపుతండ్రియందు నమ్మకముంచి ఆయనకు విధేయులవటం ఇమిడియుందని నొక్కిచెప్పవచ్చును. (మలాకీ 3:10) అటువంటి ఆలోచనలను తెలియజేయుట, మన సహోదరుని ‘పాదములకు మార్గమును సరాళము’ చేసికొనుటలో ఎంతగానో దోహదపడును.—హెబ్రీయులు 12:13.

హెచ్చరికను అంగీకరించుటలోని ప్రయోజనములను నొక్కితెల్పుము. ఫలవంతమై ఉపదేశములో చెడు విధానాన్ని అనుసరించుటద్వారా కలిగే ఫలితాల విషయంలో ఉద్బోధించి, సంగతులను చక్కదిద్దుకొనినట్లయిన కలిగే ప్రయోజనాలను గుర్తుచేయడం కూడా ఇమిడివుంది. సమయోచితమైన హెచ్చరికనిచ్చిన తర్వాత, ఆత్మీయంగా మందకొడిగావున్న లవొదికయ సంఘమునకు, వారు తమ పూర్వపు క్రియలను మార్చుకొని ఆసక్తిగల శిష్యులైతే ఆయనతోపాటు పరలోకములో పాలించే ఉత్తరాపేక్షతోపాటు, విశేషమైన ఆధిక్యతలను అనుభవిస్తారని యేసు వారికి అభయమిచ్చెను.—ప్రకటన 3:14-21.

ఇవ్వబడిన ఉపదేశము గైకొనబడిందనే విషయంలో శ్రద్ధచూపుము. తాను విరిగిన ఎముకను సరిచేసి కట్టినట్లయిన ఒక మంచి డాక్టరు అది సరిగ్గా కూర్చుందో లేదో అప్పుడప్పుడు చూచునట్లే, చెప్పబడిన ఉపదేశము గైకొనబడిందా లేదా అనేదాన్ని నిర్ధారించుకోడానికి పెద్దలు ప్రయత్నించాలి. వారిట్లు ప్రశ్నించుకొనవచ్చును: ఇంకా సహాయమేమైన అవసరమా? అదే ఉపదేశాన్ని మరొక రీతిలో చేయాలా? దీనత్వముయొక్క అవసరతనుగూర్చి యేసు తన శిష్యులకు పదేపదే ఉపదేశించవలసి వచ్చెను. కొంతకాలము వరకు ఆయన ఓపికతో ఉపదేశముద్వారా, దృష్టాంతములద్వారా, ఇతర ప్రదర్శనా పూర్వక పాఠముల ద్వారా వారి ఆలోచనను సరిదిద్దెను. (మత్తయి 20:20-28; మార్కు 9:33-37; లూకా 22:24-27; యోహాను 13:5-17) అటువలెనే ఒక సహోదరుడు లేక సహోదరి పూర్తిగా చక్కదిద్దబడ్డట్లు నిశ్చయత లభించేంతవరకు పెద్దలు ఆ వ్యక్తి పూర్తి ఆత్మీయ ఆరోగ్యముపొందేలా పురోగమించేంతవరకు లేఖన సంబంధమైన చర్చలను ఏర్పాటుచేయవచ్చును.

ఏదైనా అభివృద్ధి చేసికొని ఉంటే దానిని అభినందించుము. తప్పుమార్గముపట్టిన వ్యక్తి నిష్కపటంగా లేఖన సలహాను అన్వయింపజేసికొనుటకు ప్రయత్నిస్తుంటే, ఆప్యాయకరంగా ఆయనను మెచ్చుకొనుము. ఇది మొదట ఇవ్వబడిన హెచ్చరికకు బలమును చేకూర్చుతుంది. ఇంకను అభివృద్ధిచేసికొనడానికి ప్రోత్సాహమిస్తుంది. కొరింథీయులకు వ్రాసిన తన మొదటి పత్రికలో పౌలు అనేక విషయాలలో వారికి గట్టి హెచ్చరిక నివ్వవలసి వచ్చెను. ఆయన పత్రికకు వారు సరిగా స్పందించారని తీతు పౌలుకు వర్తమానము పంపినప్పుడు, వారిని మెచ్చుకొనుటకు పౌలు మరలా వ్రాసెను. ఆయన, “మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదుగాని మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని” ‘యిప్పుడు సంతోషించుచున్నాను’” అనెను.—2 కొరింథీయులు 7:9.

సంతోషించుటకు కారణము

అవును, తన ఉపదేశము కొరింథీయులకు సహాయపడిందని వినినప్పుడు పౌలు సంతోషించాడు. అలాగే ప్రస్తుత దిన పెద్దలు కూడ వారి ప్రేమగల సహాయమునకు అనుకూలముగా స్పందించి, తన తప్పుమార్గమునుండి మళ్లిన తోటి ఆరాధికుని గూర్చి గొప్పసంతోషాన్ని పొందుతారు. పశ్చాత్తాపపడిన క్రైస్తవుని హృదయములోనుండి ముల్లుగల పాపపు గురుగులను పెరికివేసి అందులో దైవిక ఫలాలు సమృద్ధిగా తాండవమాడునట్లు సహాయపడుటలో వారు నిజంగా ఆనందిస్తారు.

ఒక తప్పుమార్గములోకి వెళ్లిన వ్యక్తిని సరిదిద్దుటలో పెద్దలు విజయవంతులైతే అతన్ని లేక ఆమెను ఆత్మీయంగా పూర్తి వినాశనకరమైన మార్గం నుండి మరల్చవచ్చును. (యాకోబు 5:19, 20 పోల్చుము.) అటువంటి సహాయమునుబట్టి దానిని పొందినవాడు యెహోవా దేవునికి కృతజ్ఞతను వ్యక్తపరచవలెను. పెద్దలందించే అటువంటి ప్రేమగల సహాయము, వాత్సల్యము, వివేచన మెచ్చుకొనుట సముచితము. ఆత్మీయ స్వస్థత చేకూరినప్పుడు, అందులో భాగము వహించినవారందరు సాత్వికముతో సరిదిద్దబడినందుకు సంతోషించగలరు.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి