కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 సెప్టెంబరు పేజీలు 2-7
  • ‘పెద్దల్ని పిలవండి’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘పెద్దల్ని పిలవండి’
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మనం ఎప్పుడు “సంఘపెద్దల్ని పిలవాలి”?
  • మనం ఎందుకు సంఘపెద్దల్ని పిలవాలి?
  • పెద్దలు మనకు ఎలా సహాయం చేస్తారు?
  • మన బాధ్యత ఏంటి?
  • పాపం చేసినవాళ్ల మీద పెద్దలు ప్రేమ, కరుణ ఎలా చూపించవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • క్రైస్తవ సంఘం ఎలా పనిచేస్తుంది?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • సహోదరులారా—మీకు సంఘ పెద్ద అవ్వాలనే లక్ష్యం ఉందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • యెహోవా ప్రజల మంచి కోసం పాటుపడే కాపరులు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 సెప్టెంబరు పేజీలు 2-7

అధ్యయన ఆర్టికల్‌ 36

పాట 103 కాపరులు మనుషుల్లో వరాలు

‘పెద్దల్ని పిలవండి’

“అతను సంఘ పెద్దల్ని పిలవాలి.”—యాకో. 5:14.

ముఖ్యాంశం

మనకు అవసరమైనప్పుడు సంఘపెద్దల సహాయం తీసుకోవడం ఎందుకు ప్రాముఖ్యమో చూస్తాం.

1. తన గొర్రెలంటే ప్రాణం అని యెహోవా ఎలా చూపించాడు?

తన గొర్రెలంటే యెహోవాకు ప్రాణం! యేసు రక్తంతో ఆయన వాళ్లను కొన్నాడు. వాళ్ల బాగోగులు చూసుకోమని ఆయన సంఘపెద్దలకు చెప్పాడు. (అపొ. 20:28) వాళ్లు తన గొర్రెల్ని అపురూపంగా చూసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. క్రీస్తు నాయకత్వం కింద సంఘపెద్దలు గొర్రెల్ని ఆధ్యాత్మిక ప్రమాదం నుండి కాపాడాలి, అవి ఊరట పొందేలా చూసుకోవాలి.—యెష. 32:1, 2.

2. యెహెజ్కేలు 34:15, 16 ప్రకారం, యెహోవా ఎవరికి సహాయం చేస్తాడు?

2 యెహోవా తన గొర్రెలన్నిటినీ పట్టించుకుంటాడు, బాధలో ఉన్నవాటిని ఇంకా ఎక్కువ పట్టించుకుంటాడు. సంఘపెద్దల్ని ఉపయోగించుకుని ఆధ్యాత్మికంగా బాధపడుతున్నవాళ్లకు ఆయన సహాయం చేస్తాడు. (యెహెజ్కేలు 34:15, 16 చదవండి.) అయితే, మనకు అవసరమైనప్పుడు తన సహాయం అడగాలని యెహోవా ఆశిస్తున్నాడు. అలాంటి సందర్భాల్లో మనం సహాయం కోసం యెహోవాకు పట్టుదలగా ప్రార్థన చేయడంతోపాటు సంఘంలో “కాపరులుగా, బోధకులుగా” ఉన్నవాళ్ల సహాయం అడగాలి.—ఎఫె. 4:11, 12.

3. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

3 ఈ ఆర్టికల్‌లో, సంఘపెద్దల ద్వారా మనకు ఆధ్యాత్మికంగా సహాయం చేయడానికి యెహోవా చేసిన ఏర్పాటు గురించి చూస్తాం. ఈ ప్రశ్నలకు మనం జవాబులు చూస్తాం: మనం ఎప్పుడు సంఘపెద్దల సహాయం అడగాలి? ఎందుకు అడగాలి? వాళ్లు మనకు ఎలా సహాయం చేస్తారు? ప్రస్తుతం మనకు ఏ సమస్యా లేకపోయినా, ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటే దేవుడు చేసిన ఏర్పాటు మీద కృతజ్ఞత పెరుగుతుంది. ఏదోకరోజు అది మన ప్రాణాల్ని కాపాడుతుంది.

మనం ఎప్పుడు “సంఘపెద్దల్ని పిలవాలి”?

4. యాకోబు 5:14-16, 19, 20 వచనాల్లో యాకోబు ఆధ్యాత్మిక అనారోగ్యం గురించి మాట్లాడుతున్నాడని ఎందుకు చెప్పవచ్చు? (చిత్రాలు కూడా చూడండి.)

4 మనకు ఆధ్యాత్మికంగా సహాయం చేయడానికి దేవుడు చేసిన ఏర్పాటు గురించి చెప్తూ, శిష్యుడైన యాకోబు ఇలా అడిగాడు: “మీలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా? అతను సంఘ పెద్దల్ని పిలవాలి.” (యాకోబు 5:14-16, 19, 20 చదవండి.) ఈ లేఖన సందర్భాన్ని గమనిస్తే, యాకోబు ఆధ్యాత్మిక అనారోగ్యం గురించి మాట్లాడుతున్నాడని అర్థమౌతుంది. అలాంటి వ్యక్తి పిలవాల్సింది డాక్టర్‌ని కాదుగానీ సంఘపెద్దల్ని. ఎందుకంటే, అతనికి ఉన్న ఆధ్యాత్మిక అనారోగ్యం పోవాలంటే ఆ వ్యక్తి పాపాలు క్షమించబడాలి. కొన్నిసార్లు, ఆధ్యాత్మిక అనారోగ్యం ఉన్నప్పుడు చేయాల్సిన పనులు, శారీరక అనారోగ్యం ఉన్నప్పుడు చేయాల్సిన పనులు ఇంచుమించు ఒకటే. ఉదాహరణకు, మనకు ఒంట్లో బాగోలేకపోతే డాక్టర్‌ దగ్గరికి వెళ్తాం. మనకు ఎలా అనిపిస్తుందో చెప్తాం, డాక్టర్‌ చెప్పినవి పాటిస్తాం. అదేవిధంగా, మనం ఆధ్యాత్మికంగా అనారోగ్యంగా ఉంటే సంఘపెద్దల దగ్గరికి వెళ్లాలి, మన పరిస్థితిని వివరించాలి, లేఖనాలు ఉపయోగిస్తూ వాళ్లు చెప్పే సలహాల్ని పాటించాలి.

చిత్రాలు: 1. భుజం నొప్పి ఉందని ఒకవ్యక్తి డాక్టర్‌కి చెప్తున్నాడు. 2. ఒక బ్రదర్‌ పార్కులో కూర్చొని, తన సమస్య గురించి ఒక పెద్దకు చెప్తున్నాడు.

మనకు ఒంట్లో బాలేకపోతే డాక్టర్‌ దగ్గరికి వెళ్తాం; మనం ఆధ్యాత్మికంగా అనారోగ్యంగా ఉంటే సంఘపెద్దల దగ్గరికి వెళ్లాలి (4వ పేరా చూడండి)


5. మన ఆధ్యాత్మిక ఆరోగ్యం ప్రమాదంలో ఉందని ఎలా చెప్పవచ్చు?

5 ఆధ్యాత్మికంగా అనారోగ్యంగా అనిపిస్తే, సంఘపెద్దల దగ్గరికి వెళ్లాలని యాకోబు 5వ అధ్యాయం ప్రోత్సహిస్తుంది. యెహోవాతో మనకు ఉన్న స్నేహం తెగిపోవడానికి ముందే అలా సహాయం తీసుకోవడం ఎంతో తెలివైన పని. మనతో మనం నిజాయితీగా ఉండాలి. ఎందుకంటే మన ఆధ్యాత్మిక స్థితి గురించి మనల్ని మనం మోసం చేసుకునే ప్రమాదం ఉందని లేఖనాలు హెచ్చరిస్తున్నాయి. (యాకో. 1:22) సార్దీస్‌లో ఉన్న కొంతమంది తొలి క్రైస్తవులు అదే పొరపాటు చేశారు. అందుకే వాళ్ల ఆధ్యాత్మిక స్థితి గురించి యేసు వాళ్లను హెచ్చరించాడు. (ప్రక. 3:1, 2) మన ఆధ్యాత్మిక ఆరోగ్యం ఎలా ఉందో చెక్‌ చేసుకోవడానికి ఒక మంచి పద్ధతి ఏంటంటే, ఆరాధన విషయంలో ఒకప్పుడు ఉన్నంత ఆసక్తి ఇప్పుడు మనకు ఉందో లేదో పోల్చుకుని చూడడం. (ప్రక. 2:4, 5) దానికోసం మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘బైబిలు చదివే విషయంలో, లోతుగా ఆలోచించే విషయంలో నా ఆసక్తి తగ్గిపోయిందా? మీటింగ్స్‌కి సిద్ధపడి, హాజరవడం కుంటుపడిందా? పరిచర్యలో నా ఉత్సాహం చల్లబడిందా? సంపదలు, సరదాలు నా సమయాన్ని, ఆలోచనల్ని దోచుకుంటున్నాయా?’ ఈ ప్రశ్నల్లో దేనికైనా మీ జవాబు అవును అయితే, మీరు ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నారని అర్థం. ఒకవేళ ఇప్పుడు జాగ్రత్తపడకపోతే విషయం చేయిదాటిపోతుంది. మనంతట మనమే ఆ బలహీనత నుండి బయటపడలేకపోతే, లేదా ఇప్పటికే మనం దేవుని ప్రమాణాల్ని మీరేంత దూరం వెళ్లిపోయుంటే, సంఘపెద్దల సహాయం తీసుకోవడం తప్పనిసరి!

6. ఘోరమైన పాపం చేసిన వ్యక్తి ఏం చేయాలి?

6 ఒకవ్యక్తి సంఘం నుండి తొలగించబడేంత ఘోరమైన పాపం చేస్తే అతను సంఘపెద్దల దగ్గరికి వెళ్లాలి. (1 కొరిం. 5:11-13) అలాంటి వ్యక్తి యెహోవాతో తనకు ఉన్న బంధాన్ని బాగుచేసుకోవడానికి పెద్దల సహాయం అవసరం. యెహోవా విమోచన క్రయధనం ఆధారంగా మనల్ని క్షమించాలంటే, మనం “పశ్చాత్తాపానికి తగిన పనులు” చేయాలి. (అపొ. 26:20) ఆ పనుల్లో ఒకటి ఏంటంటే, ఘోరమైన పాపం చేసినప్పుడు సంఘపెద్దల దగ్గరికి వెళ్లడం.

7. ఎవరికి కూడా సంఘపెద్దల సహాయం అవసరం?

7 ఘోరమైన పాపం చేసినవాళ్లకే కాదు, ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నవాళ్లకు కూడా సంఘపెద్దల సహాయం అవసరం. (అపొ. 20:35) ఉదాహరణకు, తప్పుడు కోరికలతో చేసే పోరాటంలో గెలవలేమని మీరు భయపడుతుండవచ్చు. ముఖ్యంగా, మీరు సత్యం తెలుసుకోవడానికి ముందు డ్రగ్స్‌ తీసుకున్నా, అశ్లీల చిత్రాలు చూసినా లేదా అనైతికంగా జీవించినా, వాటితో పోరాడడం మీకు ఇంకొంచెం కష్టం కావచ్చు. వీటితో మీరు ఒంటరిగా పోరాడాల్సిన పనిలేదు సంఘపెద్దల సహాయం తీసుకోండి. మీరు చెప్పేది శ్రద్ధగా విని, మీకు సరిగ్గా సరిపోయే సలహా ఇచ్చి, తప్పుడు కోరికల్ని తిప్పికొట్టి, యెహోవాను సంతోషపెట్టగలరనే భరోసానిచ్చే సంఘపెద్దతో మాట్లాడండి. (ప్రసం. 4:12) వీటితో మీరు పోరాడలేకపోతున్నారని అనిపిస్తుందా? అలాగైతే, మీరు సహాయం అడిగినందుకు యెహోవా సంతోషిస్తున్నాడని పెద్దలు గుర్తు చేస్తారు. అంతేకాదు, మీకు వినయం ఉందని, మీ సొంత తెలివి మీద ఆధారపడట్లేదని సంఘపెద్దలు మీకు గుర్తు చేయవచ్చు.—1 కొరిం. 10:12.

8. మనం చేసిన పొరపాట్ల గురించి చీటికిమాటికి వెళ్లి సంఘపెద్దలతో మాట్లాడాలా? వివరించండి.

8 అయితే, మీరు చేసే ప్రతీ చిన్న పొరపాటుకు సంఘపెద్దల దగ్గరికి వెళ్లాల్సిన అవసరంలేదు. ఉదాహరణకు, మీ తోటి బ్రదర్‌ని లేదా మీ తోటి సిస్టర్‌ని బాధపెట్టే మాట ఏదైనా అనుండవచ్చు. లేదా వాళ్లమీద కోప్పడి ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో సంఘపెద్దల దగ్గరికి వెళ్లే బదులు, ముందు వెళ్లి మీ సహోదరునితో లేదా సహోదరితో సమాధానపడమని యేసు చెప్పిన సలహాను పాటించవచ్చు. (మత్త. 5:23, 24) అలాగే సౌమ్యత, ఓర్పు, ఆత్మనిగ్రహం లాంటి అంశాల గురించి పరిశోధన చేస్తే, ఆ లక్షణాల్ని ముందుముందు ఇంకా బాగా చూపించగలుగుతారు. ఒకవేళ అప్పటికి మీ సమస్య పరిష్కారం కాకపోతే, అప్పుడు సంఘపెద్దల సహాయం తీసుకోవడంలో తప్పులేదు. ఫిలిప్పీయులకు రాసిన ఉత్తరంలో యువొదియ, సుంటుకే అనే సహోదరీలు తమ మధ్య ఉన్న మనస్పర్థలను పరిష్కరించుకునేలా సహాయం చేయమని ఒక సహోదరునికి అపొస్తలుడైన పౌలు చెప్పాడు. అలాగే మీ సంఘంలో కూడా సంఘపెద్దలు మీకు అలాగే సహాయం చేస్తారు.—ఫిలి. 4:2, 3.

మనం ఎందుకు సంఘపెద్దల్ని పిలవాలి?

9. సంఘపెద్దల సహాయం తీసుకోవడానికి మనం ఎందుకు సిగ్గుపడకూడదు? (సామెతలు 28:13)

9 మనం ఏదైనా ఘోరమైన పాపం చేసినప్పుడు లేదా మన బలహీనతలతో పోరాడడం మనవల్ల కావట్లేదని అనిపించినప్పుడు సహాయం అడగాలంటే మనకు విశ్వాసం, ధైర్యం కావాలి. కాబట్టి సంఘపెద్దల సహాయం తీసుకోవడానికి మనం అస్సలు సిగ్గుపడకూడదు. ఎందుకంటే యెహోవా చేసిన ఆ ఏర్పాటును ఉపయోగించుకోవడం వల్ల మనం ఆయన్ని, ఆయన నిర్దేశాల్ని నమ్ముతున్నామని చూపిస్తాం. మనం పడిపోతున్నప్పుడు యెహోవా సహాయం కావాలని గుర్తించాలి. (కీర్త. 94:18) ఒకవేళ మనం పాపం చేస్తే, దాన్ని ఒప్పుకుని, దాని జోలికి మళ్లీ వెళ్లొద్దని గట్టిగా అనుకుంటే, ఆయన మనమీద కరుణ చూపిస్తాడు.—సామెతలు 28:13 చదవండి.

10. మన పాపాల్ని కప్పిపుచ్చుకోవడానికి చూస్తే ఏం జరుగుతుంది?

10 మనకు అవసరమైనప్పుడు సంఘపెద్దల సహాయం తీసుకుంటే ఎన్ని లాభాలు ఉన్నాయో, మనం తప్పు చేసినప్పుడు వాటిని దాచిపెడితే అన్నే నష్టాలు ఉంటాయి. దావీదు రాజు ఆయన చేసిన పాపాల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించాడు. దానివల్ల ఆయన ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా నానాకష్టాలు పడ్డాడు. (కీర్త. 32:3-5) ఉదాహరణకు, మనకు ఏదైనా జబ్బు చేసినప్పుడు లేదా దెబ్బ తగిలినప్పుడు దానికి వైద్యం తీసుకోకపోతే అది ఇంకా ముదిరిపోతుంది. అదేవిధంగా, మనకు ఆధ్యాత్మికంగా ఏదైనా సమస్య ఉంటే, పెద్దల సహాయం తీసుకోకపోతే ఆ సమస్య ఇంకా ముదిరే అవకాశం ఉంది. యెహోవాకు ఇది తెలుసు కాబట్టే ఆయన చేసిన ఏర్పాటును ఉపయోగించుకుంటూ తనతో ఉన్న ‘వివాదాన్ని పరిష్కరించుకోమని’ ఆహ్వానిస్తున్నాడు.—యెష. 1:5, 6, 18.

11. ఘోరమైన పాపాల్ని దాచాలని చూస్తే మనతోపాటు వేరేవాళ్లు కూడా ఎలా నష్టపోతారు?

11 ఒకవేళ మనం చేసిన ఘోరమైన పాపాన్ని దాచాలని చూస్తే, వేరేవాళ్లు కూడా నష్టపోతారు. ఎలాగంటే, సంఘం మొత్తం మీద దేవుని పవిత్రశక్తి పనిచేయకుండా మనం అడ్డుపడిన వాళ్లమౌతాం. (ఎఫె. 4:30) అలాగే బ్రదర్స్‌సిస్టర్స్‌ మధ్యవున్న శాంతిని పాడుచేసిన వాళ్లమౌతాం. ఒకవేళ సంఘంలో ఎవరైనా ఘోరమైన పాపం చేశారని మనకు తెలిస్తే, వెళ్లి సంఘపెద్దలతో మాట్లాడమని తప్పుచేసిన వ్యక్తికి చెప్పాలి.a ఒకవేళ ఆ వ్యక్తి వెళ్లి పెద్దలకు చెప్పకపోతే, మనమైనా వెళ్లి పెద్దలకు చెప్పాలి. అలా చెప్పకుండా ఆ ఘోరమైన పాపాన్ని దాచాలని చూస్తే, అది పాపంతో సమానం. (లేవీ. 5:1) మనకు యెహోవా మీద ప్రేమ ఉంటే ముందుకొస్తాం, నిజం చెప్తాం. అప్పుడు సంఘమంతా పవిత్రంగా ఉంటుంది. తప్పుచేసిన వ్యక్తి కూడా యెహోవాతో తనకున్న బంధాన్ని బాగుచేసుకోవడానికి మనం సహాయం చేసినవాళ్లమౌతాం.

పెద్దలు మనకు ఎలా సహాయం చేస్తారు?

12. ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నవాళ్లకు సంఘపెద్దలు ఎలా సహాయం చేస్తారు?

12 ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నవాళ్లకు మద్దతివ్వాలని యెహోవా సంఘపెద్దలకు చెప్పాడు. (1 థెస్స. 5:14) కాబట్టి ఒకవేళ మీరు ఏదైనా పొరపాటు చేస్తే మీ మనసులో ఉన్న ఆలోచనలన్నిటినీ తెలుసుకోవడానికి సంఘపెద్దలు కొన్ని ప్రశ్నలు అడగవచ్చు. (సామె. 20:5) బహుశా మీరు పెరిగిన వాతావరణాన్ని బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి లేదా చేసిన తప్పువల్ల మీకు కలిగిన సిగ్గును బట్టి మీ మనసులో ఉన్నదంతా చెప్పడం కష్టంగా ఉండవచ్చు. అయినాసరే, మీరు అలా చెప్తే సంఘపెద్దలకు సహాయం చేసినవాళ్లౌతారు. బహుశా మీ మాటలు ‘వెర్రిమాటల్లా’ అనిపించినాసరే భయపడకండి. (యోబు 6:3) సంఘపెద్దలు కూడా వెంటనే ఒక ముగింపుకు రాకుండా మీరు చెప్పేదంతా జాగ్రత్తగా వింటారు. సలహా ఇచ్చేముందు పూర్తి వివరాలు తెలుసుకుంటారు. (సామె. 18:13) గొర్రెల్ని కాయాలంటే సమయం పడుతుందని వాళ్లకు తెలుసు. కాబట్టి ఒక్కసారే కలిసి గబగబా విషయాల్ని పరిష్కరించాలని వాళ్లు చూడరు.

13. ప్రార్థన, బైబిలు ఉపయోగించి సంఘపెద్దలు మనకు ఎలా సహాయం చేస్తారు? (చిత్రాలు కూడా చూడండి.)

13 మీరు సంఘపెద్దల్ని పిలిచినప్పుడు, మీరు అప్పటికే తప్పుచేశామనే బాధతో నలిగిపోతుంటారు కాబట్టి వాళ్లు పుండు మీద కారం చల్లినట్టు చేయరు. బదులుగా వాళ్లు మీ తరఫున ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలకున్న “శక్తి” చూసి మీరు ఆశ్చర్యపోతారు. వాళ్లిచ్చే సహాయంలో “యెహోవా పేరున [మీకు] నూనె” రాయడం కూడా ఉంది. (యాకో. 5:14-16) ఇక్కడ “నూనె” అంటే దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని అది సూచిస్తుంది. వాళ్లు లేఖనాల్ని చక్కగా ఉపయోగించి మీకు ఉపశమనాన్ని, ఊరటను ఇస్తారు. యెహోవాతో తెగిపోయిన మీ బంధాన్ని కలుపుకోవడానికి మీకు సహాయం చేస్తారు. (యెష. 57:18) లేఖనాలతో వాళ్లు ఇచ్చే సహాయం వల్ల సరైనది చేయాలనే మీ నిర్ణయాన్ని ఇంకా బలపర్చుకోవచ్చు. వాళ్ల ద్వారా యెహోవా మీకు ఇలా చెప్పడం మీరు వింటారు: “ఇదే దారి. ఇందులో నడువు.”—యెష. 30:21.

చిత్రాలు: 1. ముందటి చిత్రంలో ఉన్న డాక్టర్‌ ఆ వ్యక్తి భుజాన్ని చూస్తున్నాడు. గోడ మీద ఆ వ్యక్తి భుజం ఎక్స్‌రే ఉంది. 2. ముందటి చిత్రంలో ఉన్న సంఘపెద్ద, ఇంకో సంఘపెద్దతో కలిసి ఆ బ్రదర్‌ ఇంటికి వెళ్లాడు. ఆ పెద్దలు లేఖనాల్ని ఉపయోగించి అతన్ని ప్రోత్సహిస్తున్నారు. ఆ పెద్దలు చెప్పే మాటల్ని ఆ బ్రదర్‌ చక్కగా వింటున్నాడు.

సంఘపెద్దలు లేఖనాల్ని ఉపయోగించి మనకు ఉపశమనాన్ని, ఊరటను ఇస్తారు (13-14 పేరాలు చూడండి)


14. గలతీయులు 6:1 ప్రకారం, “తప్పటడుగు వేసిన” వాళ్లకు సంఘపెద్దలు ఎలా సహాయం చేస్తారు? (చిత్రాలు కూడా చూడండి.)

14 గలతీయులు 6:1 చదవండి. “తప్పటడుగు వేసే” క్రైస్తవులు దేవుని ప్రమాణాల్ని మీరినట్లు అవుతుంది. ఇక్కడ “తప్పటడుగు” అంటున్నప్పుడు ఒక తెలివితక్కువ నిర్ణయం అయ్యుండవచ్చు లేదా ఒక ఘోరమైన పాపం అయ్యుండవచ్చు. అయితే ప్రేమగల క్రైస్తవ పెద్దలు అలాంటి ఒక వ్యక్తిని, ‘సౌమ్యంగా సరైన దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు.’ ఇక్కడ “సరైన దారిలోకి తీసుకురావడం” అని అనువదించబడిన గ్రీకు పదానికి, విరిగిన ఎముకను చక్కగా అతికించడంతో కూడా పోల్చవచ్చు. ఒక మంచి డాక్టర్‌ విరిగిన ఎముకను వీలైనంత తక్కువ నొప్పితో అతికించడానికి ప్రయత్నిస్తాడు. అదేవిధంగా, ఆధ్యాత్మిక అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ల నొప్పిని పెంచకుండా సంఘపెద్దలు వాళ్లకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే, సంఘపెద్దలు “[తమ] విషయంలో కూడా జాగ్రత్తగా” ఉండాలని బైబిలు చెప్తుంది. ఎందుకంటే వాళ్లు కూడా అపరిపూర్ణులే. తప్పటడుగు వేసే అవకాశం వాళ్లకు కూడా ఉందని వాళ్లు గుర్తించి మనకు సహాయం చేస్తారు. అలా సహాయం చేస్తున్నప్పుడు కూడా వాళ్లు మనకన్నా గొప్పని గానీ, మనకన్నా ఎక్కువ నీతిమంతులని గానీ, మన విషయంలో వెంటనే తీర్పుతీర్చే మనస్తత్వం గానీ లేకుండా సహానుభూతి చూపిస్తారు.—1 పేతు. 3:8.

15. మనకు ఏదైనా సమస్య ఉంటే ఏం చేయాలి?

15 మనం మన సంఘపెద్దల్ని నమ్మవచ్చు. విషయాల్ని గోప్యంగా ఉంచడం, సొంత అభిప్రాయాలు కాకుండా బైబిలు ఆధారంగా సలహాలు ఇవ్వడం, మన సమస్యల్లో సహాయం చేస్తూ ఉండడం వాళ్లకు బాగా తెలుసు. ఎందుకంటే, ఆ విషయాల్లో వాళ్లు శిక్షణ తీసుకున్నారు. (సామె. 11:13; గల. 6:2) వాళ్ల వ్యక్తిత్వాలు, అనుభవం వేర్వేరుగా ఉండవచ్చు. కానీ మనకు ఏదైనా సమస్య ఉంటే, ఏ సంఘపెద్ద దగ్గరికైనా మనం వెళ్లొచ్చు. అయితే, మనం వినాలనుకుంటున్న సలహా ఎవరిస్తారా అని ఒక్కో సంఘపెద్ద దగ్గరికి వెళ్లి సలహా అడగం. ఒకవేళ అలాచేస్తే మనకు “నచ్చేవాటినే” వినాలనుకుంటున్నట్లు చూపిస్తాం. అలాగే, బైబిలు ప్రకారం ఉన్న “మంచి బోధను” వినడానికి ఇష్టపడట్లేదని చూపించినట్టు అవుతుంది. (2 తిమో. 4:3) ఒకవేళ మనం ఏదైనా సమస్యతో ఒక సంఘపెద్ద దగ్గరకు వెళ్తే, ఆయన తన అభిప్రాయాన్ని వెంటనే చెప్పేముందు, ఆ సమస్య గురించి మనం ఇప్పటికే ఎవరైనా సంఘపెద్దతో మాట్లాడామా, మాట్లాడితే ఆ సంఘపెద్ద ఏ సలహా ఇచ్చాడు లాంటి విషయాల్ని అడిగి తెలుసుకుంటాడు. అలాగే ఆ సంఘపెద్దకు అణకువ ఉంటే, సలహా ఇచ్చేముందు వేరే సంఘపెద్దల్ని కూడా సంప్రదిస్తాడు.—సామె. 13:10.

మన బాధ్యత ఏంటి?

16. మనందరికి ఏ బాధ్యత ఉంది?

16 మనం సమస్యల్లో ఉన్నప్పుడు సంఘపెద్దలు సలహా ఇస్తారు, సహాయం చేస్తారు కానీ నిర్ణయాన్ని మాత్రం మనకే వదిలేస్తారు. దైవభక్తితో జీవించే విషయంలో మనందరికీ వ్యక్తిగత బాధ్యత ఉంది. ఎందుకంటే మన పనులకు, మన మాటలకు మనమే దేవునికి లెక్క అప్పజెప్పాలి. ఆయన సహాయంతో మనం తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం, నమ్మకంగా ఉండగలుగుతాం. (రోమా. 14:12) కాబట్టి సంఘపెద్దలు మనం ఏం చేయాలో చెప్పే బదులు, ఫలానా విషయంలో దేవుని ఆలోచన ఏంటో లేఖనాల్ని ఉపయోగించి మనకు వివరిస్తారు. నిర్ణయం తీసుకునే బాధ్యతను మనకే వదిలేస్తారు. లేఖనాలు ఉపయోగించి వాళ్లిచ్చే సలహాను పాటించినప్పుడు మన ‘వివేచనా సామర్థ్యాలకు’ శిక్షణ ఇచ్చుకుని, మంచి నిర్ణయాలు తీసుకుంటాం.—హెబ్రీ. 5:14.

17. యెహోవా మనకు ఏమేం ఇచ్చాడు? మనం ఏ విషయంలో మొహమాటపడకూడదు?

17 యెహోవా గొర్రెలుగా ఉండడం మనకు దొరికిన గొప్ప అవకాశం. మనందరికి శాశ్వతకాలం జీవించే అవకాశం ఇవ్వడానికి యెహోవా “మంచి కాపరి” అయిన యేసును విమోచన క్రయధనంగా ఇచ్చాడు. (యోహా. 10:11) అలాగే సంఘపెద్దల్ని ఇవ్వడం వల్ల యెహోవా ఈ మాటల్ని నిజం చేశాడు: “నా హృదయం ప్రకారం నడుచుకునే కాపరుల్ని మీకు ఇస్తాను; వాళ్లు జ్ఞానంతో, లోతైన అవగాహనతో మిమ్మల్ని పోషిస్తారు.” (యిర్మీ. 3:15) మనం ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నప్పుడు లేదా జబ్బుపడినప్పుడు సంఘపెద్దల్ని పిలవడానికి అస్సలు మొహమాటపడకూడదు. అప్పుడు వాళ్లను ఉపయోగించుకుని యెహోవా చేసే సహాయాన్ని కళ్లారా చూడగలుగుతాం.

మీరెలా జవాబిస్తారు?

  • మనం సంఘపెద్దల్ని ఎప్పుడు పిలవాలి?

  • మనం సంఘపెద్దల్ని ఎందుకు పిలవాలి?

  • సంఘపెద్దలు మనకు ఎలా సహాయం చేస్తారు?

పాట 31 దేవునితో నడవండి!

a ఒకవేళ తప్పుచేసిన వ్యక్తికి సరిపడా సమయం ఇచ్చినా, అతను సంఘపెద్దల దగ్గరికి వెళ్లి తన తప్పు గురించి చెప్పకపోతే, మీరు వెళ్లి మీకు తెలిసింది సంఘపెద్దలకు చెప్పాలి. అలా మీరు యెహోవాకు నమ్మకంగా ఉన్నవాళ్లు అవుతారు.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి