విరిగిన హృదయాన్ని యెహోవా తృణీకరించడు
“విరిగిన మనసే దేవునికిష్టమైన బలులు; దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.”—కీర్తన 51:17.
1. తన ఆరాధికులు గంభీరమైన పాపం చేసినను పశ్చాత్తాపపడిన వారిని యెహోవా ఎలా దృష్టిస్తాడు?
యెహోవా ‘ప్రార్థన తనయొద్దకు చేరకుండ మేఘము చేత తనను కప్పుకొనగలడు.’ (విలాపవాక్యములు 3:44) కాని తన ప్రజలు తనతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. తన ఆరాధికులలో ఒకరు గంభీరమైన తప్పిదం చేసినా పశ్చాత్తాపం చెందితే, మన పరలోకపు తండ్రి ఆ వ్యక్తి చేసిన మంచిని జ్ఞాపకముంచుకుంటాడు. అందుకే, అపొస్తలుడైన పౌలు తన తోటి క్రైస్తవులకు ఇలా చెప్పగల్గాడు: “మీరు చేసిన కార్యమును, . . . తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.”—హెబ్రీయులు 6:10.
2, 3. తప్పుచేసిన తోటి విశ్వాసులతో వ్యవహరిస్తున్నప్పుడు క్రైస్తవ పెద్దలు ఏ విషయాన్ని పరిగణలోనికి తీసుకోవాలి?
2 క్రైస్తవ పెద్దలు తోటి విశ్వాసులు దేవునికి ఏళ్లతరబడి చేసిన విశ్వసనీయమైన సేవను కూడా గుర్తుంచుకోవాలి. తప్పునడత నడిచిన లేక గంభీరమైన పాపం చేసి పశ్చాత్తాపపడినవారు చేసిన పరిశుద్ధ సేవ కూడా ఇందులో యిమిడి ఉంది. క్రైస్తవ కాపరులు దేవుని మందలోని వారందరి ఆత్మీయ శ్రేయస్సు కోరుతారు.—గలతీయులు 6:1, 2.
3 పశ్చాత్తాపం చెందిన తప్పిదస్థునికి యెహోవా కృప కావాలి. అయిననూ, ఇంకాకొంత అవసరమైయున్నది. కీర్తన 51:10-19 నందలి దావీదు మాటల ద్వారా ఇది స్పష్టం చేయబడింది.
నిర్మలమైన హృదయం అవసరం
4. దావీదు ఒక శుద్ధహృదయం, ఒక నూతన మనస్సు కొరకు ఎందుకు ప్రార్థించాడు?
4 ఒక సమర్పించుకున్న క్రైస్తవుడు తన పాపం వల్ల క్షీణించిన ఆత్మీయ స్థితిలో ఉంటే, యెహోవా కృప, క్షమాపణతోపాటు అతనికింకేమి కూడా అవసరం? దావీదు ఇలా విన్నవించుకున్నాడు: “దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్ధిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము.” (కీర్తన 51:10) గంభీరమైన పాపం చేయడానికి ప్రేరణ అతని మనస్సులో ఇంకా ఉందని దావీదు గ్రహించాడు గనుక, ఈ విన్నపం చేశాడని స్పష్టమౌతుంది. ఊరియా, బత్షెబాలకు సంబంధించి దావీదు చేసిన పాపాల వంటివి మనం చేయకపోయినా, ఘోరమైన పాపభరిత ప్రవర్తనలో పాల్పంచుకోవాలని కలిగే శోధనకు లొంగిపోకుండా ఉండడానికి మనకు యెహోవా సహాయం అవసరం. ఇంకనూ, హత్యా, దొంగతనం వంటి నేరాలకు సరిసమానమైన—ద్వేషం, ధనాపేక్షవంటి పాపభరిత లక్షణాలను మన మనస్సులోనుండి తీసివేసుకోడానికి మనకు వ్యక్తిగతంగా దైవిక సహాయం అవసరం కావచ్చును.—కొలొస్సయులు 3:5, 6; 1 యోహాను 3:15.
5. (ఎ) శుద్ధహృదయం కలిగివుండడం అంటే ఏమిటి? (బి) ఒక నూతన మనస్సుకొరకు దావీదు ప్రార్థించినప్పుడు అతనేమి కోరాడు?
5 తన సేవకులకు “శుద్ధహృదయము,” అంటే, శుద్ధమైన తలంపులు లేక ఉద్దేశ్యాలు ఉండాలని యెహోవా కోరుతున్నాడు. తాను అటువంటి శుద్ధతను కనపరచ లేదని గ్రహించి, తన మనస్సును శుభ్రపరచి, దాన్ని దైవిక కట్టడలకు అనుగుణ్యంగా ఉంచమని దావీదు ప్రార్థించాడు. కీర్తనల రచయిత ఒక నూతనమైన, సరైన ఆత్మ లేక మానసిక స్థితి కూడా కావాలనుకున్నాడు. శోధనను ఎదిరించుటకు తనకు సహాయం చేసి, యెహోవా శాసనాలకు కట్టడలకు దృఢంగా కట్టుబడి ఉండే ఒక ఆత్మ ఆయనకు అవసరమాయెను.
పరిశుద్ధాత్మ ప్రాముఖ్యం
6. తన పరిశుద్ధాత్మను తననుండి తీసివేయవద్దని దావీదు యెహోవాను ఎందుకు వేడుకున్నాడు?
6 మనం తప్పు లేక దోషం చేసినందుకు విచారంలో మునిగి ఉన్నప్పుడు, దేవుడు మననుండి తన పరిశుద్ధాత్మ, లేక చురుకైన శక్తిని తీసేస్తాడని, మనల్ని ప్రక్కకు త్రోసేయబోతున్నాడని మనం భావించవచ్చు. దావీదు అలాగే భావించాడు, అందుకే అతను యెహోవాకిలా విన్నవించుకున్నాడు: “నీ సన్నిధిలోనుండి నన్ను త్రోసివేయకుము; నీ పరిశుద్ధాత్మను నాయొద్దనుండి తీసివేయకుము.” (కీర్తన 51:11) మదనపడుతున్న, దీనుడైన దావీదు తన పాపాలు యెహోవాను సేవించడానికి తనను అనర్హున్ని చేశాయని భావించాడు. దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడ్డం అంటే ఆయన అభిమానం, ఓదార్పు, మరియు దీవెనలను కోల్పోవడం అని అర్థం. ఒకవేళ దావీదు ఆత్మీయంగా స్వస్థతనొందాలంటే, అతనికి యెహోవా పరిశుద్ధాత్మ అవసరమైయుండింది. అది ఆయనపై నిలిచి ఉండగా, యెహోవాను ప్రీతిపరచడానికి రాజు ప్రార్థనా పూర్వకంగా దైవిక నడిపింపును కోరేవాడు, పాపాన్ని విడనాడే వాడు, జ్ఞానంతో పరిపాలించి ఉండేవాడు. పరిశుద్ధాత్మను అనుగ్రహించు వానికి విరుద్ధంగా తాను చేసిన పాపాలు తెలుసుకున్నాడు కనుక, తననుండి దాన్ని తీసివేయ వద్దని దావీదు సరియైన విధంగానే యెహోవాను వేడుకున్నాడు.
7. మనం పరిశుద్ధాత్మ కొరకు ఎందుకు ప్రార్థించాలి, దాన్ని దుఃఖపరచకుండా ఎందుకు జాగ్రత్తపడాలి?
7 మన విషయం ఏమిటి? మనం పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించాలి, దాని నడిపింపును అనుసరించడంలో తప్పిపోయి దానిని దుఃఖపరచకుండా ఉండడానికి జాగ్రత్త పడాలి. (లూకా 11:13; ఎఫెసీయులు 4:30) అలాకాకపోతే, మనం ఆత్మను కోల్పోతాం, దేవుడిచ్చిన దాని ఫలాలగు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వీకము, మరియు ఆశానిగ్రహమును ప్రదర్శించలేము. ప్రాముఖ్యంగా మనం, ఆయనకు విరుద్ధంగా పశ్చాత్తాపపడకుండా తప్పుచేస్తూనే ఉంటే యెహోవా దేవుడు తన పరిశుద్థాత్మను మననుండి తీసివేస్తాడు.
రక్షణానందము
8. మనం పాపం చేసిననూ రక్షణానందాన్ని పొందాలంటే మనమేమి చేయాల్సిన అవసరం ఉంది?
8 ఆత్మీయ పునరుద్ధరణను అనుభవించిన పశ్చాత్తాపం చెందిన పాపి యెహోవా రక్షణ ఏర్పాటునందు తిరిగి ఆనందించగలడు. దీనికొరకే వేడుకొంటూ, దావీదు దేవున్ని యిలా ప్రార్థించాడు: “నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము, సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము.” (కీర్తన 51:12) యెహోవా దేవుని రక్షణయందు నిరీక్షణ ఉంచి ఆనందించడం ఎంత మహత్తరంగా ఉంటుంది! (కీర్తన 3:8) దేవునికి విరుద్ధంగా పాపం చేసిన తర్వాత, ఆయన ద్వారానే రక్షణానందాన్ని తిరిగి పొందాలని దావీదు ఇష్టపడ్డాడు. తర్వాతి కాలాల్లో, తన కుమారుడైన యేసుక్రీస్తు అర్పించిన విమోచన క్రయధనం ద్వారా యెహోవా రక్షణను ఏర్పాటుచేశాడు. సమర్పించుకున్న సేవకులుగా మనం ఘోరపాపం చేసినను రక్షణానందాన్ని తిరిగిపొందాలని మనం యిష్టపడితే, పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపం చేయకుండా ఉండడానికి మనకు పశ్చాత్తాప వైఖరి అవసరము.—మత్తయి 12:31, 32; హెబ్రీయులు 6:4-6.
9. దావీదు తనకు “నెమ్మదిగల మనస్సు కలుగజేసి” తన మద్దతునీయమని యెహోవాను అడిగినప్పుడు అతనేమి కోరుతున్నాడు?
9 తనకు “సమ్మతిగల మనస్సు కలుగజేసి” మద్దతునీయమని దావీదు యెహోవాను అడిగాడు. నిజానికి యీ మాట, సహాయం చేయడానికి దేవుని ఇష్టతను లేక పరిశుద్ధాత్మ సహాయాన్ని గూర్చి తెలియజేయడం లేదు గానీ, దావీదుకున్న మానసిక దృక్పథాన్ని సూచిస్తుంది. దేవుడు తనకు సమ్మతిగల మనస్సును దయచేయటం ద్వారా మళ్లీ పాపంలో పడిపోకుండా ఉండడానికి, మంచిచేయడానికి సహాయం చేయాలని దావీదు ఇష్టపడ్డాడు. యెహోవా దేవుడు తన సేవకులకు తదేకంగా సహాయపడతాడు, అనేక కష్టాలతో కృంగిపోయినవారిని లేవనెత్తుతాడు. (కీర్తన 145:14) ముఖ్యంగా మనం తప్పుచేసినప్పటికీ, పశ్చాత్తాపం చెంది, యెహోవాను మునుపెన్నటికంటే ఎక్కువ విశ్వాసంతో సేవించడానికి కోరుకునే అవసరతను గుర్తించడం ఎంత ఊరట కలిగిస్తుంది!
అతిక్రమం చేసేవారికి ఏమి బోధిస్తాడు?
10, 11. (ఎ) అతిక్రమము చేసిన ఇశ్రాయేలీయులకు దావీదు ఏమి బోధించగల్గెను? (బి) తాను ఏమి చేసిన తర్వాతనే దావీదు పాపులకు బోధించగల్గెను?
10 ఒకవేళ దేవుడు అనుమతిస్తే, యెహోవా కనికరం పట్ల తనకున్న మెప్పును ప్రదర్శించే దానిని, ఇతరులకు మేలైన దానిని నిస్వార్థంగా చేయాలని దావీదు కోరుకున్నాడు. ప్రార్థనా పూర్వక మనోభావాలను యెహోవాకు తెలియజేస్తూ, పశ్చాత్తాపం చెందిన రాజు తదుపరి యిలా ఉద్ఘాటించాడు: “అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను, పాపులును నీ తట్టు తిరుగుదురు.” (కీర్తన 51:13) మరి పాపభరితుడైన దావీదు, దేవుని శాసనాలను అతిక్రమించిన వారికి వాటినెలా బోధించగలడు? ఆయన వాళ్లకు ఏమి చెప్తాడు? దీని వల్ల ఎటువంటి మేలు కల్గింది?
11 యెహోవా యొక్క మార్గాలను తెలియజేయడం ద్వారా అతిక్రమం చేసిన ఇశ్రాయేలీయులను దుష్ప్రవర్తన నుండి పక్కకు త్రిప్ప వచ్చునను నిరీక్షణతో, పాపం ఎంత చెడ్డదో, పశ్చాత్తాపం అంటే ఏమిటో, దేవుని దయను ఎలా పొందాలను విషయాలను దావీదు తెలియజేయగల్గివుండేవాడు. యెహోవా యొక్క అనంగీకారాన్ని, దెబ్బతిన్న మనస్సాక్షిని చవిచూసిన దావీదు, పశ్చాత్తాపం చెంది మనస్సు విరిగిపోయిన తప్పిదస్థులకు, నిస్సందేహంగా ఒక ప్రేమపూర్వక బోధకుడుకాగలడు. అయితే, ముందు తాను స్వయంగా యెహోవా నియమాలను అంగీకరించి ఆయన క్షమాపణను అనుభవించిన తర్వాతనే ఇతరులకు బోధించడానికి అతడు తన ఉదాహరణను ఉపయోగించగలడు, ఎందుకంటే దైవిక నియమాలకు లోబడటానికి నిరాకరించే వారికి, ‘దేవుని కట్టడలను వివరించే’ హక్కు లేదు.—కీర్తన 50:16, 17.
12. దేవుడు తనను రక్తాపరాధంనుండి విముక్తుని చేశాడనే విషయం ద్వారా దావీదు ఏమి నేర్చుకున్నాడు?
12 తన మనోభావాలను మరలా ఇంకో విధంగా తెలియజేస్తూ, దావీదు ఇలా అన్నాడు: “దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధమునుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతినిగూర్చి ఉత్సాహగానము చేయును.” (కీర్తన 51:14) రక్తాపరాధం మరణశిక్షను తెచ్చింది. (ఆదికాండము 9:5, 6) తన రక్షణకర్తయగు దేవుడు ఊరియా విషయంలో తనపైనున్న రక్తాపరాధం నుండి తనను తప్పించాడనే విషయం తెలుసుకొనడం దావీదు హృదయానికి మనస్సుకు నెమ్మదినిస్తుంది. అప్పుడు అతని నాలుక తన నీతిని కాక, యెహోవా నీతిని ఆనందంతో గానం చేయగల్గింది. (ప్రసంగి 7:20; రోమీయులు 3:10) దావీదు తాను చేసిన జారత్వాన్ని తుడిచివేయలేడు లేక ఊరియాను సమాధిలో నుండి తిరిగి రప్పించలేడు, అలాగే ఈనాటి మానవుడు కూడా తాను భంగపరిచిన వ్యక్తి యొక్క పవిత్రతను తిరిగి చేకూర్చలేడు లేక తాను చంపిన వానిని పునరుత్థానం చేయలేడు. మనం శోధింపబడినప్పుడు దాని గూర్చి ఆలోచించ వద్దా? యెహోవా న్యాయంగా మనపై చూపిన కనికరాన్ని మనం ఎంతగా మెచ్చుకోవాలి! వాస్తవానికి, మన మెప్పు ఈ క్షమాపణకు నీతికి ఊటయైన వ్యక్తి వైపుకు ఇతరులను తిప్పడానికి మనలను పురికొల్పాలి.
13. ఒక పాపి కేవలం ఎటువంటి పరిస్థితులలోనే తన పెదవులను యెహోవా ఘనత కొరకై తెరువగలడు?
13 తన సత్యాలను చెప్పడానికి, దేవుడే దయాపూర్వకంగా వారి పెదవులను తెరిస్తేతప్ప ఏ తప్పిదస్థుడు కూడా యెహోవాను స్తుతించడానికి తన పెదవులను సరిగ్గా తెరవలేడు. అందుకే దావీదు ఇలా గానం చేశాడు: “యెహోవా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము.” (కీర్తన 51:15) దేవుడు తనను క్షమించినందుకు అతని మనస్సాక్షి కుదుటపడింది గనుకనే దావీదు, అతిక్రమం చేసిన వారికి యెహోవా మార్గాలను బోధించడానికి ప్రేరేపించబడ్డాడు, అతడాయనను ఎంతగానో ఘనపరచగల్గెను. దావీదువలె తమ పాపములు క్షమించబడిన వారందరూ యెహోవా తమపై చూపిన కృపాతిశయాన్ని మెచ్చుకోవాలి, దేవుని సత్యాన్ని, ఆయన ‘స్తుతిని ప్రచురపరచునట్లు’ ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.—కీర్తన 43:3.
దేవునికి అంగీకారమైన బలులు
14. (ఎ) ధర్మశాస్త్ర నిబంధన ప్రకారం ఏయే బలులు అవసరమైయుండెను? (బి) కొన్ని మంచి పనులు చేయడం ద్వారా మనం ఎప్పుడూ చేసే తప్పులను పరిహరించు కోగలమని ఆలోచించడం ఎందుకు తప్పు?
14 దావీదు లోతైన జ్ఞానాన్ని ఆర్జించినందుకు ఆయనిలా అన్నాడు: “నీవు [యెహోవా] బలిని కోరువాడవుకావు కోరినయెడల నేను అర్పించుదును; దహనబలి నీకిష్టమైనది కాదు.” (కీర్తన 51:16) ధర్మశాస్త్ర నిబంధన ప్రకారం దేవునికి జంతు బలులు ఇవ్వాలి. దావీదు చేసిన జారత్వం, హత్య మరణ శిక్ష విధింపబడవలసినంతటి పాపాలు కాబట్టి, అవి బలులవల్ల పరిహరించబడజాలవు. అలా అయితే, అతను యెహోవాకు విస్తారంగా జంతు బలులర్పించి యుండేవాడు. మనఃపూర్వక పశ్చాత్తాపం లేకుంటే, బలులు నిరర్థకం. కనుక కొన్ని మంచి పనులు చేయడం ద్వారా మనం ఎప్పుడూ చేసే తప్పులకు పరిహారం చెల్లించగలమని ఆలోచించడం తప్పు.
15. విరిగిన మనస్సుగల సమర్పించుకున్న వ్యక్తి దృక్పథమేమిటి?
15 దావీదు ఇంకా యిలా అన్నాడు: “విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు; దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.” (కీర్తన 51:17) పశ్చాత్తాపం చెందిన పాపి విషయంలో, “విరిగిన మనస్సే దేవునికి” అంగీకారమైన “బలులు.” అటువంటి వ్యక్తికి తిరుగుబాటు స్వభావం ఉండదు. విరిగిన మనస్సుగల్గి సమర్పించుకున్న వ్యక్తి తను చేసిన పాపానికై బహుగా దుఃఖిస్తాడు, దేవుని అనంగీకారాన్ని చవిచూసినందుకు అణిగిమనిగి ఉంటాడు, ఆ అంగీకారాన్ని పొందడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మన పాపాల నిమిత్తం పశ్చాత్తాపం చెంది, పరిపూర్ణ భక్తితో ఆయనకు మన హృదయాలను సమర్పించేంతవరకూ దేవునికి విలువైనదేది కూడా మనం ఇవ్వలేము.—నహూము 1:2.
16. తన పాపం విషయమై బాధపడుతున్న వ్యక్తిని దేవుడు ఎలా దృష్టిస్తాడు?
16 విరిగి నలిగిన హృదయం వంటి బలిని యెహోవా నిరాకరించడు. కావున ఆయన ప్రజలుగా మనం ఎన్ని కష్టాలను అనుభవించినా, నిరాశకు లోనవ్వకూడదు. మన జీవన పయనంలో మనం ఎప్పుడైనా తొట్రిల్లి ఏదైనా విషయానికై దైవ కృపకొరకు మన హృదయం మొరపెట్టాల్సి వచ్చినా, అంతా అయిపోయిందని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మనం ఘోర పాపం చేసినా పశ్చాత్తాపం చెందితే, మన విరిగిన హృదయాన్ని యెహోవా తిరస్కరించడు. క్రీస్తు విమోచనా క్రయధనం ఆధారంగా ఆయన మనలను క్షమించి తన దయకు పాత్రులను చేస్తాడు. (యెషయా 57:15; హెబ్రీయులు 4:16; 1 యోహాను 2:1) దావీదువలె మన ప్రార్థనలు కూడా దైవిక అనుగ్రహాన్ని పొందడానికే తప్ప, అవసరమైన గద్దింపు లేక దిద్దుబాటును తప్పించుకోవడానికి కాదు. దేవుడు దావీదును క్షమించాడు, కాని అతన్ని శిక్షించాడు.—2 సమూయేలు 12:11-14.
పవిత్ర ఆరాధనయెడల శ్రద్ధ
17. దేవుని క్షమాపణ కొరకు వేడుకొనడమే కాక, పాపులు ఇంకా ఏమి చేయాలి?
17 ఒకవేళ మనమేదైనా ఘోరపాపం చేస్తే, అది మనల్ని నిస్సందేహంగా కలత పరుస్తుంది, పశ్చాత్తాపం చెందిన హృదయం మనల్ని దేవుని క్షమాపణ కొరకు వేడుకొమ్మని పూరికొల్పుతుంది అయిననూ, ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థించుదము. మళ్లీ దేవునికి అంగీకారమైన ఆరాధనను చేయాలని దావీదు నిర్ణయించుకున్నా, ఆయన కీర్తనలో స్వార్థంతో ఇతరులకు స్థానం లేకుండా చేయలేదు. “నీ కటాక్షముచొప్పున సీయోనుకు మేలుచేయుము; యెరూషలేముయొక్క గోడలను కట్టించుము” అని యెహోవాకు మొరపెట్టుకొనడం అందులో ఇమిడి ఉంది.—కీర్తన 51:18.
18. పశ్చాత్తాపం చెందిన దావీదు సీయోను కొరకు ఎందుకు ప్రార్థించాడు?
18 అవును, దైవానుగ్రహం కొరకు దావీదు ఎదురుచూశాడు. అయిననూ, తాను దేవుని ఆలయాన్ని నిర్మించాలని నిరీక్షించిన ఇశ్రాయేలు రాజధాని యెరూషలేము యెడల దేవుని ‘కటాక్షముచొప్పున సీయోనుకు మేలుచేయవలెనని’ దీనుడైన దావీదు ప్రార్థించాడు. దావీదు చేసిన ఘోరపాపాలు జనాంగమంతటికి ముప్పు తెచ్చినవి, ఎందుకంటే రాజు చేసిన తప్పిదం వల్ల ప్రజలందరూ కూడా కష్టపడుండే వారు. (2 సమూయేలు, 24 వ అధ్యాయాన్ని పోల్చండి.) తద్వారా, అతని పాపాలు “యెరూషలేము యొక్క గోడలను,” ఎంతగా బలహీన పరచాయంటే, వాటిని మళ్లీ నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది.
19. మనం పాపంచేసి, క్షమింపబడితే, దేని కొరకు మనం ప్రార్థించుట సమంజసంగా ఉంటుంది?
19 ఒకవేళ మనం ఘోరమైన పాపం చేసిననూ దేవుని క్షమాపణ పొందినట్లైతే, మన ప్రవర్తన వల్ల జరిగిన ఏ లోపాన్నైనా సరిదిద్దమని ప్రార్థించడం సమంజసంగా ఉంటుంది. మనం ఆయన పరిశుద్ధ నామంపై నింద తెచ్చుండ వచ్చు, సంఘాన్ని బలహీన పరచుండవచ్చు, మన కుటుంబానికి దుఃఖం కల్గియుండవచ్చు. మన ప్రేమగల పరలోకపు తండ్రి తన నామంపై వచ్చిన నిందను తీసివేయగలడు, సంఘాన్ని పరిశుద్ధాత్మ వలన తిరిగి కట్టగలడు, తనను ప్రేమించి, గౌరవించే మన ప్రియుల మనస్సులకు ఊరట కలిగించగలడు. అందులో పాపం ఇమిడియున్నా, లేకపోయినా, యెహోవా నామ ఘనత, ఆయన ప్రజల క్షేమం మన ముఖ్య శ్రద్ధయై ఉండాలి.—మత్తయి 6:9.
20. ఏ పరిస్థితులలో ఇశ్రాయేలీయుల బలులను, నైవేద్యాలను బట్టి యెహోవా సంతోషించేవాడు?
20 ఒకవేళ, యెహోవాయే సీయోను గోడలను తిరిగి నిర్మించియుంటే, ఇంకేం జరుగుతుంది? దావీదు ఇలా పాడాడు: “అప్పుడు నీతియుక్తములైన బలులును, దహనబలులును సర్వాంగ హోమములును నీకు [యెహోవా] అంగీకృతములగును, అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెల నర్పించెదరు.” (కీర్తన 51:19) తానూ తన ప్రజలూ ఆయన అంగీకరించే విధంగా ఆయన్ని ఆరాధించడానికి యెహోవా అనుగ్రహాన్ని పొందాలని దావీదు మనస్ఫూర్తిగా కోరుకున్నాడు. అప్పుడు యెహోవా వారి దహనబలులను, సర్వాంగ హోమాలను బట్టి ఆనందించేవాడు. దేవుని అనుగ్రహాన్ని అందుకుని ఆయనకు సమర్పించుకుని, యథార్థవంతులై పశ్చాత్తాపం చెందిన ప్రజలు అర్పించిన నీతియుక్తములైన బలులు కనుక ఆయన అలా ఆనందించేవాడు. యెహోవా కృపపట్ల కృతజ్ఞత గలవారై, వారు చాలా శ్రేష్ఠమైన విలువగల బలులను అనగా, కోడెలను ఆయన బలిపీఠం మీద అర్పించేవారు. నేడు, మనకున్న వాటిలో విలువైన వాటిని యెహోవాకు అర్పించడం ద్వారా మనం ఆయన్ని ఘనపరుస్తాము. కనికరంగల మన దేవుడైన యెహోవాకు స్తుతియాగములు అనగా, “ఎడ్లకు బదులుగా (నీకు మా) పెదవులు” కూడా మన అర్పణలలో ఇమిడి ఉన్నాయి.—హోషేయ 14:2; హెబ్రీయులు 13:15.
యెహోవా మన మొరలను వింటాడు
21, 22. మన మేలు నిమిత్తం 51 వ కీర్తనలో ఏ పాఠాలున్నాయి?
21 మన పాపం విషయంలో నిజమైన పశ్చాత్తాప స్వభావాన్ని మనం కనపరచాలని, 51 వ కీర్తనలో వ్రాయబడిన దావీదు మనఃపూర్వక ప్రార్థన తెలియజేస్తుంది. మన మేలు నిమిత్తమై, సూచించబడిన పాఠాలు కూడా యీ కీర్తనలో ఉన్నాయి. ఉదాహరణకు, మనం పాపంచేసి మరలా పశ్చాత్తాపం చెందినట్లైతే, దేవుని కృపయందు మనం నమ్మకముంచ వచ్చు. అయినను, ప్రాముఖ్యంగా యెహోవా నామానికి ఏదైనా నింద మనం తెచ్చుంటే దాని విషయమై జాగ్రత్తవహించాలి. (1-4 వచనాలు) దావీదు వలె మనం సంతరించుకున్న పాపం ఆధారంగా మన పరలోక తండ్రి కృపకొరకు మనం కూడా విన్నపం చేయవచ్చు. (5 వ వచనం) మనం యథార్థపరులంగా ఉండాలి, అంతేకాకుండా మనం దేవుని నుండి జ్ఞానాన్ని కోరవలసిన అవసరం ఉంది. (6 వ వచనం) ఒకవేళ మనం పాపం చేసినట్లైతే, దాని పరిహారం కొరకు, శుద్ధ హృదయం కొరకు, దృఢమైన మనస్సు కొరకు యెహోవాను వేడుకోవాలి.—7-10 వచనాలు.
22 పాపంలో కూరుకు పోకుండా మనల్ని మనం కాపాడుకోవాలని 51 వ కీర్తన నుండి మనం నేర్చుకుంటాము. ఒకవేళ మనమలా కూరుకుపోతే యెహోవా మననుండి తన పరిశుద్ధాత్మను, లేక చురుకైన శక్తిని తీసివేస్తాడు. దేవుని ఆత్మ మనపైన ఉంటే, మనం ఇతరులకు ఆయన మార్గాలను విజయవంతంగా బోధించగలం. (11-13 వచనాలు) మనం తప్పుచేసినా పశ్చాత్తాపం చెందితే, విరిగి నలిగిన హృదయాన్ని ఆయన ఎన్నడూ తృణీకరించడు గనుక తనను స్తుతించడానికి యెహోవా మనల్ని అనుమతిస్తాడు. (14-17 వచనాలు) మన ప్రార్థనలు కేవలం మనపై మాత్రమే కేంద్రీకరింపబడి ఉండకూడదని కూడా ఈ కీర్తన తెలియజేస్తుంది. బదులుగా, మనం యెహోవా పరిశుద్ధ ఆరాధనలో నిమగ్నమైయున్న వారందరి ఆత్మీయక్షేమం, దీవెనల కొరకు ప్రార్థించాలి.—18, 19 వచనాలు.
23. ధైర్యంగా, ఆశాపూరిత దృక్పథంతో ఉండాలని 51 వ కీర్తన మనల్ని ఎందుకు పురికొల్పాలి?
23 మనం ధైర్యంగా, ఆశాపూరిత దృక్పథంతో ఉండాలని ఈ కీర్తన మనల్ని పురికొల్పాలి. ఒకవేళ మనం పాపంచేసినా, ఇక అంతా అయిపోయిందని నిరాశ చెందాల్సిన అవసరం లేదని మనం గ్రహించడానికి ఇది సహాయపడుతుంది. ఎందుకు? ఎందుకంటే ఒకవేళ మనం పశ్చాత్తాపపడితే, యెహోవా కృప మనలను నిరాశ నుండి రక్షించగలదు. మనం పశ్చాత్తాపపడి మన పరలోక తండ్రికి సంపూర్ణంగా సమర్పించుకుంటే, కృపకొరకైన మన మొరను ఆయన వింటాడు. యెహోవా విరిగిన హృదయాన్ని తృణీకరించడని తెలిసికొనడం ఎంతగా ఊరట కలిగిస్తుంది! (w93 3/15)
మీరెలా జవాబిస్తారు?
▫ క్రైస్తవులకు దేవుని పరిశుద్ధాత్మ, శుద్ధహృదయం ఎందుకు అవసరం?
▫ యెహోవా శాసనాలను అతిక్రమించిన వారికి పశ్చాత్తాపం చెందిన ఒక వ్యక్తి ఏమి బోధించగలడు?
▫ విరిగి నలిగిన హృదయాన్ని యెహోవా ఎలా దృష్టిస్తాడు?
▫ కీర్తన 51 లో ఏ పాఠాలున్నాయి?
[బాక్సు]
మీరు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించి, దాన్ని దుఃఖపరచకుండా ఉండడానికి జాగ్రత్తపడుతున్నారా?
[బాక్సు]
యెహోవా సత్యాలను ప్రకటించడం ద్వారా ఆయన కృపాతిశయం యెడల మెప్పును కనపర్చండి