కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wtsbr 4/1 పేజీలు 21-25
  • లోకమునకు వెలుగైయున్న వానిని అనుసరించుడి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • లోకమునకు వెలుగైయున్న వానిని అనుసరించుడి
  • కావలికోట అధ్యయన ఆర్టికల్‌ల బ్రోషుర్‌
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మరో విధమైన వెలుగు
  • లోకం ఆత్మీయ అంధకారంలో ఉంది
  • “ఒక గొప్ప వెలుగు”
  • “ఆయనలో జీవముండెను”
  • యెహోవా నుండి బహుమానాలు
  • దేవుని వెలుగు చీకటిని పారద్రోలుతుంది!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • వెలుగు ప్రకాశకులు—ఎందుకొరకు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • లోకానికి వెలుగైయున్న వానిని ఎవరు అనుసరిస్తున్నారు?
    కావలికోట అధ్యయన ఆర్టికల్‌ల బ్రోషుర్‌
  • ‘మీ వెలుగు ప్రకాశించనివ్వండి’
    మన రాజ్య పరిచర్య—2011
మరిన్ని
కావలికోట అధ్యయన ఆర్టికల్‌ల బ్రోషుర్‌
wtsbr 4/1 పేజీలు 21-25

లోకమునకు వెలుగైయున్న వానిని అనుసరించుడి

“నన్ను వెంబడించువాడు . . . జీవపు వెలుగుగలిగి యుండును.”—యోహాను 8:12.

1. వెలుగు ఎంత అవశ్యము?

వెలుగు లేకుండా మనమేమి చేయగలం? సంవత్సరమంతా ప్రతిరోజూ 24 గంటలూ చీకటిగానే ఉంటే ఎలా వుంటుందో ఊహించండి. రంగులేని ప్రపంచాన్ని ఊహించండి. ఎందుకంటె వెలుగు లేకుంటే రంగు ఉండదు. నిజానికి, వెలుగే లేకపోతే మనమూ ఉండము! ఎందుకు? ఎందుకంటే, మనం తినే ధాన్యం, కూరగాయలు, పండ్లు వంటి ఆహారాన్ని తయారుచేయటానికి చెట్లు కిరణజన్య సంయోగ క్రియలో వెలుగు నుపయోగించుకుంటాయి. నిజమే, మనం కొన్నిసార్లు జంతువుల మాంసం తింటాము. కాని ఆ జంతువులు చెట్లను లేదా చెట్లను తినే ఇతర జంతువులను తింటాయి. ఆ విధంగా మన భౌతిక జీవితాలు వెలుగుపైనే పూర్తిగా ఆధారపడి ఉన్నాయి.

2. వెలుగుకు శక్తివంతమైన మూలములేవి, మరియు ఇది మనకు యెహోవాను గూర్చి ఏం చెబుతుంది?

2 నక్షత్రమైన సూర్యుని నుండి మనకు వెలుగు వస్తుంది. మన సూర్యుడు బ్రహ్మాండమైన వెలుగునిచ్చినప్పటికీ, అది కేవలం మధ్యరకం పరిమాణం గల నక్షత్రం మాత్రమే. అంతకంటె ఇంకా పెద్ద నక్షత్రాలెన్నో ఉన్నాయి. మనం జీవించే పాలపుంత అనబడే నక్షత్రవీధిలో పదివేల కోట్లకంటే ఎక్కువ నక్షత్రాలున్నాయి. దీనికితోడు, విశ్వంలో కోటానుకోట్ల అసంఖ్యాక నక్షత్రవీధులున్నాయి. ఎంత బ్రహ్మాండమైన నక్షత్రవిన్యాసమో గదా! వాటినుండి ఎంత అపరిమితమైన వెలుగు ఉత్పత్తవుతుందో గదా! వాటన్నింటినీ సృష్టించిన యెహోవా, వెలుగుకు ఎంతటి శక్తివంతమైన మూలమో! యెషయా 40:26 ఇలా అంటోంది: “మీ కన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తి చేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు.”

మరో విధమైన వెలుగు

3. యెహోవానుండి వచ్చే ఆత్మీయవెలుగు ఎంత ప్రాముఖ్యము?

3 మనం ఆత్మీయ దృష్టిని, ఆత్మీయజ్ఞానాన్నీ కలిగివుండటానికి సహాయంచేసే మరో విధమైన వెలుగుకు కూడ యెహోవాయే మూలం. ఒక నిఘంటువు, “వెలిగించుట” అనే మాటను ఇలా నిర్వచించింది: “జ్ఞానాన్ని ఇచ్చుట; నేర్పుట; ఆత్మీయ వివేచననిచ్చుట.” “వెలిగించబడిన” అనే పదాన్ని “అజ్ఞానం నుండి, తప్పుడు సమాచారం నుండి విడుదల పొందిన” అని అది నిర్వచించింది. యెహోవా నుండి వచ్చే ఆత్మీయవికాసము తన వాక్యమైన బైబిలులోని కచ్చితమైన జ్ఞానం ద్వారా అందజేయబడుతుంది. దేవుడెవరో, ఆయన సంకల్పాలేమిటో తెలుసుకొనుటకు అదే మనకు సహాయం చేస్తుంది. “అంధకారములోనుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.” (2 కొరింథీయులు 4:6) అలా, దేవుని వాక్యంలోని సత్యాలు మనల్ని అజ్ఞానం నుండి, తప్పుడు సమాచారం నుండి స్వతంత్రులనుగా చేస్తాయి. అందుకే యేసు ఇలా అన్నాడు: “అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.”—యోహాను 8:32.

4, 5. యెహోవా నుండి వచ్చే జ్ఞానం వెలుగుగా మన జీవితాలలో ఎలా పనిచేస్తుంది?

4 నిజమైన ఆత్మీయజ్ఞానానికి మూలమైన యెహోవా “పరిపూర్ణజ్ఞానము గలవాడు.” (యోబు 37:16) కీర్తన 119:105 కూడ దేవున్ని గూర్చి ఇలా చెబుతోంది: “నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.” గనుక ఆయన మన జీవితంలో తదుపరి అడుగునే కాక ముందున్న జీవిత మార్గాన్నంతటిని ఆత్మీయంగా వెలిగించగలడు. అది లేకుండా జీవితం, మలుపులు తిరిగిన పర్వతమార్గంలో చీకటి రాత్రి కారుకుగాని, దారిలో మరెక్కడగాని లైట్లు లేకుండా దాన్ని నడుపుతున్నట్లుగా ఉంటుంది. దేవుని నుండి వచ్చే ఆత్మీయవెలుగును కారుహెడ్‌లైట్ల నుండి వెలువడే కాంతితో పోల్చవచ్చును. మనమెక్కడి కెళ్తున్నామో సరిగ్గా చూడగలిగేలా ఆకాంతి మార్గాన్ని ప్రకాశవంతం చేస్తుంది.

5 మనకాలంలో, సత్యారాధనను నేర్చుకొని పాటించుటకు ఆత్మీయజ్ఞానం కావాలనుకునే వారిని దేవుడు అన్యజనులలో నుండి సమకూరుస్తున్నాడని యెషయా 2:2-5 నందలి ప్రవచనం చూపిస్తోంది. మూడవ వచనం ఇలా చెప్తున్నది: “ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము.” ఐదవ వచనం సత్యాన్ని వెదికేవారినిలా ఆహ్వానిస్తోంది: “రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకొందము.”

6. యెహోవా నుండి వచ్చే వెలుగు మనలను చివరికి ఎక్కడికి నడిపిస్తుంది?

6 ఆవిధంగా, యెహోవాయే జీవానికి ఆవశ్యకమైన రెండు విధాలైన అంటే, భౌతిక మరియు ఆత్మీయ వెలుగులకు మూలం. భౌతిక వెలుగు, మన భౌతిక శరీరాలు ఇప్పుడు షుమారు 70 లేక 80 ఏళ్లు లేదా మరికొంత కాలం జీవించటానికి సహాయం చేస్తుంది. కాని ఆత్మీయవెలుగు పరదైసు భూమిలో నిత్యజీవానికి నడిపిస్తుంది. యేసు దేవునికి ప్రార్థనలో చెప్పినట్లుగా: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.”—యోహాను 17:3.

లోకం ఆత్మీయ అంధకారంలో ఉంది

7. మునుపెన్నటికంటే ఇప్పుడు మనకు ఆత్మీయజ్ఞానం ఎందుకు అవసరం?

7 మునుపెన్నటికంటెను ఇప్పుడు మనకు ఆత్మీయవెలుగు అవసరం. మత్తయి 24, 2 తిమోతి 3 అధ్యాయాలలోని ప్రవచనాలు మనం యీ విధానాంతమునకు సమీపంగా ఉన్నామని తెలియజేస్తున్నాయి. మనం “అంత్యదినములలో” ఉన్నామని తెలుసుకొనేలా ఇవి, మరితర ప్రవచనాలు మనకాలంలో జరిగిన భయానకమైన సంగతులను గూర్చి ప్రవచించాయి. ఆ ప్రవచనాల ప్రకారం, ఈ శతాబ్దం విపత్తు వెంబడి విపత్తును ఎదుర్కొంటోంది. నేరము, దౌర్జన్యము భయంకరంగా పెరుగుతున్నాయి. యుద్ధాలు పదికోట్లకంటే ఎక్కువ మంది ప్రాణాలను బలిగొన్నాయి. భయంకరమైన ఎయిడ్స్‌ వంటి వ్యాధులు, లక్షలాది మందిని బలిగొంటున్నవి, ఒక్క అమెరికాలోనే ఇప్పటికే 1,60,000 మంది ఎయిడ్స్‌తో మరణించారు. కుటుంబజీవితం విచ్ఛినమైపోయింది, లైంగిక నైతికత పాత సాంప్రదాయంగా పరిగణించబడుతోంది.

8. మానవజాతి ఇప్పుడు ఏ పరిస్థితి నెదుర్కొంటున్నది, ఎందుకు?

8 ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధానకార్యదర్శి అయిన జేవియర్‌ పెరెజ్‌ డె క్యుయార్‌ ఇలా అన్నాడు: “పేదరికం సమాజాన్ని పీడిస్తుందనుటకు ప్రపంచపరిస్థితే ప్రబలసాక్ష్యం ఇస్తోంది.” “వందకోట్లకంటే ఎక్కువమంది ఇప్పుడు పూర్తి పేదరికంలో జీవిస్తున్నారు. ఇది హింసాత్మక పోరాటశక్తులకు బలం చేకూర్చింది. ఈ తీవ్ర వేదనలు ప్రభుత్వాలు తీసుకొనగల నివారణ చర్యలను వ్యతిరేకిస్తున్నాయి” అని ఆయన అన్నాడు. ఒక పలుకుబడిగల సంస్థ యజమాని ఇలా ధ్రువపరిచాడు: “సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యేమంటే, అది పరిపాలింప సాధ్యంకానిదిగా తయారైంది.” కీర్తన 146:3 లోని “రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి” అనే మాటలెంత నిజమైయున్నవి.

9. మానవజాతిని ఆవరిస్తున్న అంధకారానికి ఎవరు ముఖ్యకారకులు, యీ ప్రభావం నుండి మనల్ని ఎవరు తప్పించగలరు?

9 యెషయా 60:2 లో ప్రవచింపబడినట్లుగా ఉంది ఈనాటి పరిస్థితి: “చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది.” యెహోవా నుండి ఆత్మీయవెలుగును తీసుకోవడం లేదు గనుకనే భూనివాసులలో చాలమందిని ఈ అంధకారం కప్పుతోంది. ఆత్మీయ అంధకారానికి మూలకారణం, జ్యోతిర్మయుడగు దేవుని ముఖ్య శత్రువులైన అపవాదియగు సాతాను, అతని దయ్యములే. వారు “అంధకార సంబంధులగు లోక నాధులు.” (ఎఫెసీయులు 6:12) రెండవ కొరింథీయులు 4:4 లో చెప్పినట్లుగా అపవాదే “ఈ యుగ సంబంధమైన దేవత,” అతడు “దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, . . . అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.” ఏ మానవ పరిపాలన కూడ లోకాన్ని సాతాను ప్రభావం నుండి తప్పించలేదు. దేవుడు మాత్రమే తప్పించగలడు.

“ఒక గొప్ప వెలుగు”

10. మన దినాలలో మానవజాతిపై వెలుగు ప్రసరింపబడునని యెషయా ఎలా ప్రవచించాడు?

10 మానవజాతిని గాఢాంధకారం కమ్ముతున్నప్పటికీ యెషయా 60:2, 3 లో కూడ దేవుని వాక్యం ఇలా ప్రవచిస్తోంది: “యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది జనములు నీ వెలుగునకు వచ్చెదరు.” ఈ అంత్యదినములలో యెహోవా వెలుగించబడిన సత్యారాధన నెలకొల్పబడుతుందని వాగ్దానం చేస్తున్న యెషయా 2 వ అధ్యాయంతో ఇది పొందిక కలిగివుంది. మరి 2, 3 వచనాలు చెప్తున్నట్లు, ఆయన మహోన్నత సత్యారాధనకు “ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు . . . యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి, . . . అని చెప్పుకొందురు” గనుక, లోకం సాతాను ఆధీనమందున్ననూ, దేవుని వెలుగు ప్రసరించి, అనేకులను అంధకారం నుండి విడుదల చేస్తూనేవుంది.

11. యెహోవా వెలుగును ముఖ్యంగా ఎవరు ప్రతిబింబిస్తారు, సుమోయోను ఆయనను ఎలా గుర్తించాడు?

11 యెషయా 9:2 లోని ప్రవచనం దేవుడు తన వెలుగును ప్రతిబింబింప జేయుటకు ఎవరినైనా పంపిస్తాడని తెలియజేస్తోంది. “చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణచ్ఛాయగల దేశనివాసుల మీద వెలుగు ప్రకాశించును.” ఈ “గొప్ప వెలుగు” ఎవరంటే యెహోవా ప్రతినిధియైన యేసుక్రీస్తే. యేసు ఇలా చెప్పాడు: “నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండును.” (యోహాను 8:12) యేసు బాలుడై యున్నప్పుడే యీ విషయం కొందరికి తెలుసు. సుమోయోను అనే పేరుగల ఒక వ్యక్తి, “నీతిమంతుడు, భక్తిపరుడు” మరియు “పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను.” అని లూకా 2:25 చెప్తున్నది. సుమోయోను పసివాడైన యేసును చూసినప్పుడు ప్రార్థనలో దేవునితో ఇలా అన్నాడు: “జనములను కప్పివున్న తెరను తీసివేసే వెలుగుగా . . . నీవు సకల ప్రజల యెదుట సిద్ధపరచిన నీ రక్షణాధారాన్ని నేను కన్నులార చూచితిని.”—లూకా 2:30-32, NW.

12. జనులపై కప్పబడివున్న అంధకార ముసుగును తీసివేయడం యేసు ఎప్పుడు, ఎలా ప్రారంభించాడు?

12 యేసు, తాను బాప్తిస్మం తీసుకున్న వెంటనే మానవజాతిపైనుండి అంధకార తెరను తీసివేయడం మొదలుపెట్టాడు. ఆత్మీయ అంధకారంలో నడుస్తున్న ప్రజలపై ప్రసరింపబడే “గొప్ప వెలుగును” గూర్చి మాట్లాడుతున్న యెషయా 9:1, 2 నందున్న మాటలను ఇది నెరవేర్చిందని మత్తయి 4:12-16 మనకు తెలియజేస్తోంది. మత్తయి 4:17 ఇలా చెప్తున్నది: “అప్పటినుండి యేసు—పరలోకరాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను.” దేవుని రాజ్యసువార్తను ప్రకటించడం ద్వారా యేసు దేవుని సంకల్పాలను గూర్చి ప్రజలకు తెలియజేశాడు. ఆయన “జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను.”—2 తిమోతి 1:10.

13. యేసు తనను తాను ఎలా వర్ణించుకున్నాడు, ఆయన దాన్ని అంత కచ్చితంగా ఎలా చేయగలిగాడు?

13 యేసు నమ్మకంగా దేవుని వెలుగును ప్రతిబింబించాడు. ఆయనిలా అన్నాడు: “నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచియుండ కుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను. . . . ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు. నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానినిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ యిచ్చియున్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేనెరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రినాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను.”—యోహాను 12:44-50.

“ఆయనలో జీవముండెను”

14. యోహాను 1:1, 2 నందు యేసు ఎలా సూచించబడ్డాడు?

14 అవును, జనులకు నిత్యజీవ మార్గాన్ని చూపే వెలుగుగా ఉండమని యెహోవా తన కుమారున్ని భూమి మీదికి పంపించాడు. యోహాను 1:1-16 నందు ఇదెలా వివరించబడిందో గమనించండి. అందులోని 1, 2 వచనాల్లో ఇలా ఉంది: “ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను.” ఇక్కడ యోహాను, మానవునిగా రాకముందున్న యేసును “వాక్యము” అనే పేరుతో పిలుస్తున్నాడు. ఈ పేరు యెహోవా దేవుని ప్రతినిధిగా ఆయన నెరవేర్చిన పనిని సూచిస్తోంది. “ఆదియందు వాక్యముండెను,” అని యోహాను చెప్పినప్పుడు, యెహోవా సృష్టికార్యాలలో ఆ వాక్యము “దేవుని సృష్టికి ఆది,” మొదటిదని దాని భావము. (ప్రకటన 3:14) దేవుడు సృష్టించినవారిలో ఆయన కలిగియున్న అత్యున్నత స్థానాన్ని బట్టి, ఆయన బలవంతుడైన “ఒక దేవుడు” (NW) అని పిలవబడడానికి నిజమైన ఆధారాన్నిస్తున్నది. యెషయా 9:6 ఆయనను సర్వశక్తిగల దేవుడని పిలవడం లేదుగానీ “బలవంతుడైన దేవుడు” అని పిలుస్తోంది.

15. యేసును గూర్చి యోహాను 1:3-5 మనకు ఏ అదనపు సమాచారాన్నిస్తున్నది?

15 యోహాను 1:2, 3 ఇలా తెలుపుతుంది: “సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.” కొలొస్సయులు 1:16 ఇలా చెప్తున్నది: “ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు . . . ఆయన ద్వారా సృజింపబడెను.” యోహాను 1:4, “ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను” అని తెలియజేస్తోంది. గనుక వాక్యము ద్వారా, సమస్త ప్రాణులు సృష్టించబడ్డాయి; మరియు దేవుడు తన కుమారుని ద్వారా పాపులై, మృతతుల్యమైన మానవజాతి నిత్యజీవాన్ని పొందే వీలుకలిగించాడు. యెషయా 9:2 “గొప్ప వెలుగు” అని పిలిచే యేసు నిశ్చయంగా బలవంతుడే. యోహాను 1:5 ఇలా చెబుతోంది: “ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను.” అవినీతికి, అబద్దానికి అంధకారమెలా సూచనో అలాగే వెలుగు సత్యానికి, నీతికి గుర్తు. అందుకే అంధకారం వెలుగును గెలవలేదని యోహాను చూపిస్తున్నాడు.

16. యేసు పని యొక్క ప్రయోజనాన్ని బాప్తిస్మమిచ్చు యోహాను ఎలా సూచించాడు?

16 ఇప్పుడు 6 నుండి 9 వచనాలలో యోహాను ఇలా తర్కిస్తున్నాడు: “దేవునియొద్దనుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను; అతని పేరు యోహాను [బాప్తిస్మమిచ్చు]. అతని మూలముగా అందరు విశ్వసించునట్లు అతడు ఆ వెలుగునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు [యోహాను] ఆ వెలుగైయుండలేదు గాని ఆ వెలుగును [యేసు] గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది.” యోహాను, రాబోయే మెస్సీయను సూచిస్తూ తన అనుచరులను ఆయన వైపుకు మరల్చాడు. తగిన కాలంలో, జనులందరికీ ఆ వెలుగును అంగీకరించే అవకాశం ఇవ్వబడింది. కాబట్టి, యేసు కేవలం యూదుల మేలు కొరకే కాదు, బీదలైనా ధనికులైనా ఏ జాతివారైనా మానవజాతంతటి మేలు కొరకు వచ్చాడు.

17. యేసు కాలంనాటి యూదుల ఆత్మీయ పరిస్థితిని గూర్చి యోహాను 1:10, 11 ఏమి తెలియజేస్తున్నది?

17 “ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు. ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు” అని 10, 11 వచనాలు చెప్తున్నాయి. మానవుడు కాక ముందు ఉనికిలోనున్న యేసు ద్వారానే మానవ ప్రపంచం సృష్టించబడింది. భూమిపైనున్నప్పుడు తన స్వంతప్రజలైన యూదులు ఆయనను నిరాకరించారు. వారి చెడుతనం, వేషధారణ బహిర్గతం చేయబడడం వారికి ఇష్టంలేదు. వారు వెలుగు కంటె చీకటినే కోరుకున్నారు.

18. ప్రత్యేక వారసత్వపు హక్కుతో కొంతమంది దేవుని పిల్లలు కాగలరని యోహాను 1:12, 13 ఎలా చూపిస్తున్నది?

18 యోహాను 12, 13 వచనాలలో ఇలా చెప్తున్నాడు: “తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారుకారు.” మొదటిగా చెప్పాలంటే, యేసు అనుచరులు దేవునికుమారులు కాదని ఈ వచనాలు చూపిస్తున్నాయి. యేసు భూమికి రాకముందు, మానవులకొరకు అలాంటి కుమారత్వంగాని లేక పరలోక నిరీక్షణగాని తెరవబడలేదు. అయితే వారు విశ్వాసముంచిన క్రీస్తు విమోచనబలి ద్వారా కొంతమంది మానవులు కుమారులుగా స్వీకరింపబడి, దేవుని పరలోక రాజ్యంలో క్రీస్తుతో రాజులుగా జీవించే నిరీక్షణకలిగి ఉండగలిగారు.

19. యోహాను 1:14 నందు చూపబడినట్లు యేసు దేవుని వెలుగును, ప్రతిబింబించుటకు ఎందుకు సరైన స్థానంలో ఉన్నాడు?

19 “ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి” అని 14 వచనం తర్కిస్తోంది. యేసు భూమిమీద ఉన్నపుడు దేవుని మహిమను ప్రతిబింబించాడు, దేవుని ఆదిసంభూతుడైన కుమారునిగా ఆయన మాత్రమే అలా చేయగల్గెను. గనుక ఓ విశేషమైన పద్ధతిలో ప్రజలకు దేవున్ని, ఆయన సంకల్పాలను తెలియజేయటానికి ఆయన అత్యంత శ్రేష్ఠమైన అర్హత కల్గియుండెను.

20. యోహాను 1:15 నందు వ్రాయబడినట్లు బాప్తిస్మమిచ్చు యోహాను యేసు గురించి మనకేం చెబుతున్నాడు?

20 ఆ తరువాత, అపొస్తలుడైన యోహాను 15 వ వచనంలో ఇలా వ్రాస్తున్నాడు: “[బాప్తిస్మమిచ్చు] యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు—నా వెనుక వచ్చువాడు నాకంటె ప్రముఖుడు గనుక ఆయన నాకంటె ముందటి వాడాయెననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను.” యేసు కంటె షుమారు ఆరునెలల ముందు బాప్తిస్మమిచ్చు యోహాను జన్మించాడు. కాని, యేసు యోహానుకంటె ఎన్నో పనులు ఎక్కువ చేశాడు గనుకనే, ఆయన అన్ని విషయాల్లో యోహాను కంటె ముందుండ గలిగాడు. యేసు మానవజన్మ కంటె ముందే ఉనికిలో ఉన్నందున తనకంటె ముందు ఉన్నాడని యోహాను అంగీకరించాడు.

యెహోవా నుండి బహుమానాలు

21. మనము “కృప వెంబడి కృపను” పొందితిమని యోహాను 1:16 ఎందుకు చెబుతోంది?

21 “ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి” అని యోహాను 1:16 తర్కిస్తుంది. ఆదాము నుండి సంతరించుకున్న పాపంలో మానవులు జన్మించినప్పటికీ, ఈ దుష్టవిధానాన్ని నాశనం చేసి, కోట్లాది మందిని నూతనలోకంలోనికి కాపాడి, మృతులను పునరుత్థానం చేసి, పాపమరణాలను తీసివేసి, పరదైసుభూమిపై నిత్యజీవం కలిగేటట్లు చేయాలని యెహోవా సంకల్పించాడు. ఈ ఆశీర్వాదాలన్నీ పాపులైన మానవులు ఆయన కృపనుబట్టి, తాము కష్టపడకుండ పొందేవే. అవి క్రీస్తు ద్వారా యెహోవా ఇచ్చే బహుమానాలు.

22. (ఎ) దేవుని అత్యంతగొప్ప బహుమానం దేనిని సాధ్యపరచింది? (బి) బైబిలు చివరి పుస్తకంలో మనకు ఏ ఆహ్వానం ఇవ్వబడింది?

22 ఇదంతా సాధ్యమయ్యేలా చేసే అత్యంత గొప్ప బహుమానం ఏది? “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను 3:16) ఆవిధంగా దేవున్ని గూర్చిన, “జీవాధిపతియైన” ఆయన కుమారున్ని గూర్చిన సరియైన జ్ఞానం ఆత్మీయవెలుగు, నిత్యజీవం కావాలనుకునే వారికి ఆవశ్యకం. (అపొస్తలుల కార్యములు 3:15) అందుకే బైబిలునందలి చివరి పుస్తకం, సత్యాన్ని ప్రేమించేవారికి జీవం కావాలనుకునేవారికి యీ ఆహ్వానాన్నిస్తున్నది: “వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.”—ప్రకటన 22:17.

23. వెలుగునొద్దకు వచ్చినప్పుడు గొర్రెలవంటి ప్రజలు ఏం చేస్తారు?

23 సాత్వీకులైన గొర్రెవంటి ప్రజలు, లోకానికి వెలుగైయున్నవాని యొద్దకు రావడమే కాక, ఆ వెలుగును వెంబడిస్తారు: “గొర్రెలు అతని స్వరమెరుగును [తన స్వరం నుండి ప్రతిధ్వనించే సత్యం] గనుక అవి అతనిని వెంబడించును.” (యోహాను 10:4) వాస్తవానికి, అలా చేయడం వల్ల నిత్యజీవాన్ని పొందగలమని వారికి తెలుసు గనుక వారు ఆయన “అడుగుజాడల యందు నడుచు” టకు ఆనందిస్తారు.—1 పేతురు 2:21. (w93 4/1)

మీరెలా జవాబిస్తారు?

▫ యెహోవా నుండి ఏ రెండు రకాల వెలుగులు వస్తున్నాయి?

▫ ఆత్మీయవెలుగు ఎందుకంత ప్రాముఖ్యం?

▫ యేసు ఏ విధంగా ఓ “గొప్ప వెలుగై” యుండెను?

▫ యోహాను 1 వ అధ్యాయం యేసును గూర్చి ఏమి చెప్తున్నది?

▫ లోకమునకు వెలుగైయున్న వానిని అనుసరించేవారికి ఏ దీవెనలు వస్తాయి?

[బాక్సు]

సుమెయోను యేసును, “జనములను కప్పివున్న తెరను తీసివేసే వెలుగు” అని పిలిచాడు

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి