యేసు ప్రత్యక్షతపై దృష్టిని కేంద్రీకరించుట
“తన మహిమతో మనుష్యకుమారుడు వచ్చునప్పుడు . . . ఆయన వారిని [ప్రజలను] వేరుపరచును.”—మత్తయి 25:31, 32.
1. మత్తయి 24:3 లోని మాటలకు క్రైస్తవ మతాధికారులు ఎటువంటి భావం ఉన్నదని చెప్పారు?
యేసు మరణించుటకు మూడు రోజుల ముందు, ఆయన శిష్యులలో నలుగురు ఆయన యొద్దకు వచ్చి మనస్ఫూర్తిగా యిలా అడిగారు: “ఇవన్నియు ఎప్పుడు జరుగును? నీ రాకడకును [గ్రీకులో, పరోసియా], ఈ యుగసమాప్తికి సూచనలేవి? అని మాతో చెప్పుమనిరి.” మత్తయి 24:3 (కింగ్ జేమ్స్ వర్షన్) లో యేసు పలికిన మాటలను బట్టి ఆయన తిరిగి రావడమనేది దృశ్యంగా శరీరముతో మానవులందరికి కనబడునట్లు ప్రత్యక్షమౌతాడనే దీని భావమని కొన్ని శతాబ్దాలుగా క్రైస్తవమత సామ్రాజ్య మతగురువులు, రచయితలు బాష్యం చెప్తూ వచ్చారు. కాబట్టి, క్రీస్తు గొప్ప ఆర్భాటంతోను, దృశ్యమైన ఆడంబరంతోను తిరిగి వచ్చునని వారు నేర్పించారు. వారు దీనిని క్రీస్తు రెండవ ఆగమనంగా సూచించారు. కాని వారి ఊహలు సరియైనవేనా?
2, 3. (ఎ) స్టడీస్ ఇన్ ది స్క్రిప్చర్స్ వాల్యూమ్ 2 “రాకడ,” “ప్రతక్ష్యత” అనే రెండు పదాలకు మధ్య ఎటువంటి తేడాను చూపెట్టింది? (బి) క్రీస్తుయొక్క పరోసియా అనేదాని భావం ఏమని యెహోవా ప్రజలు గ్రహించారు?
2 యెహోవా అభిషక్త జనము 19 వ శతాబ్దపు వెలుగు ప్రకాశకులుగా, 1889 వ సంవత్సరం నాటికే, క్రీస్తు తిరిగి వచ్చే విషయాన్నిగూర్చి సరిదిద్దబడ్డారు. వాల్యూమ్ 2 స్టడీస్ ఆఫ్ ది స్క్రిప్చర్స్, 158 నుండి 161 పేజీలలో, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ తొలి అధ్యక్షుడైన చార్లెస్ తేజ్ రసల్ ఈవిధంగా వ్రాశాడు: “పరోసియా అనేది . . . ప్రత్యక్షతను సూచిస్తుంది, సాధారణ ఇంగ్లీష్ బైబిలు నందున్నట్లు వచ్చుట అని ఎప్పుడూ అనువదించకూడదు, క్రొత్తనిబంధన యొక్క ఒక అమూల్య అనువాదమైన ‘ఎంఫటిక్ డయొగ్లాట్,’ పరోసియాను సరియైన విధంగా, ప్రయాణమార్గంలో వున్నట్లు రాకడ అనికాకుండా . . . ప్రత్యక్షత అని అనువదించింది, అయితే ప్రత్యక్షత అనేది, ‘నోవహు దినముల వలె, మనుష్యకుమారుని పరోసియా [ప్రత్యక్షత] అనేది [యేసు] వచ్చిన తరువాత అన్నట్లుగా ఉంటుంది. గమనించండి, ఇది నోవహు రాకడ మరియు మన ప్రభువు రాకడ మధ్య తేడా ఇక్కడ పోల్చబడలేదు . . . అయితే, ‘జలప్రళయానికి ముందు,’ నోవహు ప్రజల మధ్యనున్నప్పటి కాలానికి, మరియు క్రీస్తు రెండవ రాకడ, ‘అగ్నికి ముందు’—అనగా ప్రభువు [యెహోవా] దినము యొక్క రాకడతో యీతరం అంతంకాకముందు లోకంలో క్రీస్తు ప్రత్యక్షత కాలానికి పోల్చబడింది.”—మత్తయి 24:37.
3 కాబట్టి 19 వ శతాబ్దపు యెహోవా ప్రజలు, క్రీస్తు పరోసియా అనేది అదృశ్యమైనదిగా ఉంటుందని సరిగ్గా గ్రహించారు. వారు 1914 శరదృతువులో అన్యరాజుల కాలములు అంతమగునని కూడా తెలుసుకున్నారు. ఆత్మీయ వెలుతురు ప్రకాశించేకొలది, అదే సంవత్సరం అనగా 1914 లో పరలోక రాజ్యమునకు యేసు రాజయ్యాడని యెహోవా ప్రజలు తరువాత తెలుసుకున్నారు.—సామెతలు 4:18; దానియేలు 713, 14; లూకా 21:24; ప్రకటన 11:15.
“మన ప్రభువు ప్రత్యక్షత”
4. “మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత,” దేనిని సూచిస్తుంది?
4 అయితే, “మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత” అని బైబిలు చెప్పే మాటయొక్క మనకాలానికున్న భావమేమి? (1 థెస్సలొనీకయులు 5:23) ఒక అధికారి వ్యాఖ్యానించిన విధంగా “ప్రత్యక్షత,” పరోసియా, “అనే పదం ఉన్నతస్థానంలోనున్న ఒక వ్యక్తి, ప్రాముఖ్యంగా రాజులు చక్రవర్తులు ఓ ప్రాంతాన్ని పర్యటించుటకు సంబంధించిన అధికారిక పదమైయుంది.” కాబట్టి ఈ పదభావం పరలోకంలో రాజుగా సింహాసనాసీనుడైన తదుపరి, 1914 నుండి, ఆ తర్వాత నుండి ఉన్న యేసు క్రీస్తు ప్రభువు గొప్ప ప్రత్యక్షతను సూచిస్తుంది. ప్రవచనార్థకమైన ఆజ్ఞను నెరవేర్చడం కొరకు ఇప్పుడు ఆయన అదృశ్యంగా ‘శత్రువుల మధ్య’ రాజుగా పరిపాలిస్తున్నాడు. (కీర్తన 110:2) భూమి మీదనున్న మానవులు, క్రీస్తు అదృశ్య రాజు ప్రత్యక్షతా పరిణామాలను 79 సంవత్సరాలుగా అనుభవిస్తున్నారు.
5. పరోసియా సమయంలో జరిగే ఏ కార్యక్రమాలను గూర్చి ఈ పత్రికలోని మూడు అధ్యాయాలలో చర్చించబడును?
5 ఈ ధారావాహికలోని మూడు శీర్షికలలో, ఈ కాలములో క్రీస్తు రాజ్యం నెరవేర్చుతున్న ఆశ్చర్యకరమైన సాక్ష్యాధారాలను గూర్చి మనం పునర్విమర్శ చేద్దాం. మొదటిగా, ఇంతకు క్రితమే జరిగిన లేదా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలను గూర్చి ముందుగా తెలిపిన అనేక బైబిలు ప్రవచనములను మనం పరిశీలిస్తాం. రెండవదిగా, రాజవైభవంతోకూడిన యేసు ప్రత్యక్షతలో ఈ కాలమందు ఉపయోగిస్తున్న నమ్మకమును బుద్ధిమంతుడైన దాసుని తరగతిచే చేయబడుచున్న గొప్పపనిని గూర్చి మనం వివరంగా తెలుసుకుందాం. (మత్తయి 24:45-47) మూడవ శీర్షిక, “మహాశ్రమలను,” లోకాంతాన్ని గూర్చి మనకు వివరించును. ఆ సమయంలోనే యేసు యెహోవా మధ్యవర్తిగా నీతిమంతులను విడిపించుటకు అవినీతిపరులైన మానవులను నాశనము చేయుటకు వస్తాడు. (మత్తయి 24:21, 29-31) “మీలో శ్రమ పొందుచున్నవారు, ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, దేవునిని ఎరుగని వారికిని మన ప్రభువైన యేసుసువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు, మిమ్మును శ్రమ పరచువారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు కలుగును” అని నాశనకర సమయాన్ని గూర్చి అపొస్తలుడైన పౌలు వివరించెను.—2 థెస్సలొనీకయులు 1:7, 8.
సూచన
6. మత్తయి 24, 25 అధ్యాయాలలోని ఎటువంటి సంయుక్త సూచన వర్ణించబడింది?
6 వెలుగు ప్రకాశకులైన యేసు శిష్యులు 1900 సం.ల క్రితమే రాజ్యాధికారములో ఆయన భవిష్యత్ ప్రత్యక్షతను గూర్చిన సాక్ష్యములను, లేదా గుర్తులను గూర్చి అడిగారు. మత్తయి 24, 25 అధ్యాయములలో వ్రాయబడిన ఆయన సమాధానం, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో నెరవేరుతున్న అన్ని సంఘటనలు, ఓ సంయుక్త సూచనను అందజేశాయి. ఆ సూచన నెరవేర్పు వేదనలకు, గొప్పశ్రమలకు గుర్తు. యేసు ఇట్లు హెచ్చరించాడు: “ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి; అనేకులు నా పేరట వచ్చి, నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధసమాచారములను గూర్చియు వినబోదురు; మీరు కలవరపడకుండ చూచుకొనుడి. ఇవి జరుగవలసియున్నవి, గాని అంతము వెంటనే రాదు.”—మత్తయి 24:4-6.
7. మనము 1914 నుండి నెరవేరుతున్న సూచనయొక్క ఏయే భాగాలను చూశాము?
7 ఎన్నడూ సంభవించని రీతిలో యుద్ధములు జరుగునని యేసు ఇంకను ప్రవచించాడు. ఈ నెరవేర్పులో, 1914 నుండి 1918 వరకు మొదటిదిగాను, 1939 నుండి 1945 వరకు రెండవదిగాను, ఇవి రెండు ప్రపంచ యుద్ధాలుగా వర్గీకరించబడినవి. ఇంకనూ, అక్కడక్కడ కరువులును, భూకంపములును కలుగునని ఆయన చెప్పాడు. నిజక్రైస్తవులు తీవ్రంగా హింసింపబడతారు. ఈ ప్రవచన వాస్తవాన్నిబట్టి, ఆధునిక వెలుగు ప్రకాశకులైన యెహోవాసాక్షులు, దేవుని రాజ్యసువార్తను “సకల జనములకు సాక్ష్యార్థమై లోకమంతటను” ప్రకటిస్తూ గత ఎనిమిది దశాబ్దాలుగా హింసను అనుభవించారు. (మత్తయి 24:7-14) ఇయర్ బుక్ ఆఫ్ జెహోవాస్ విట్నెసెస్ ప్రతి వార్షికపుస్తకం సూచనలోని యీ భాగాలు నెరవేరుచున్నాయనే సాక్ష్యాధారానికి బలం చేకూర్చుతుంది.
8, 9. (ఎ) యేసుక్రీస్తు రాజ్య ప్రత్యక్షతలో యిమిడియున్నదేమి? (బి) అబద్ధక్రీస్తులను గూర్చిన యేసుక్రీస్తు ప్రవచనం, తన ప్రత్యక్షతవిధము, స్థలమును గూర్చి ఏమి తెలియజేస్తుంది?
8 యేసు రాజ్యాధికారం భూమియంతటను యిమిడియుంది గనుక, సత్యారాధన అన్ని ఖండాలకు వ్యాపిస్తున్నది. ఆయన రాజ్యాధికార ప్రత్యక్షత (పరోసియా) భూవ్యాప్త తనిఖీకి సమయమై యుంది. (1 పేతురు 2:12) కాని యేసును సంప్రదించుటకు ఏదైనా ఒక ముఖ్యపట్టణంగాని లేదా ఓ కేంద్రంగాని ఉందా? యేసు ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ తన ప్రత్యక్షతను గూర్చి ఎదురుచూచుటలో అబద్ధ క్రీస్తులు బయలుదేరుదురని చెప్పాడు. ఆయన యిలా హెచ్చరించాడు: “కాబట్టి ఎవరైనను—ఇదిగో [క్రీస్తు] అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్లకుడి—ఇదిగో అంతఃపురములో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఏలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని రాకడయు [పరోసియా] ఉండును.”—మత్తయి 24:24, 26, 27.
9 తన ప్రత్యక్షత నిజంగా ప్రారంభమైనప్పుడు ఆయన ఉండే స్థలాన్నిగూర్చి భూమిపైనున్న వారందరికంటే “మనుష్యకుమారుడైన” యేసుకే బాగా తెలుసు. ఆయన యిక్కడ అక్కడ లేదా భూమిపై ఏదైనా ఒక ప్రత్యేక ప్రదేశంలో కనిపించడు. మెస్సీయ కొరకు ఎదురుచూచేవారు, రాజకీయంగా దెబ్బతీసి ఆయనను ఈ ప్రపంచానికే మెస్సీయగా రాజ్యాభిషేకం చేయుటకు, ఏ ప్రదేశంలోనైతే తన నాయకత్వంక్రింద శిష్యులకు శిక్షణనివ్వగలడో, ఆ దేశంలోని ప్రభుత్వాధికారుల కంటబడకుండా ఆయనతో సంప్రదించగలిగే ఒక సుదూరమైన “అరణ్యంలో” ఆయన ప్రత్యక్షంకాడు. ఇంకనూ, ఎన్నుకొన్న ఏకొందరికి మాత్రమే తెలిసేలా ఆయన ఏవో “లోపలి గదులలో” దాగుకొనడు, అక్కడ ఎవరికిని కన్పించకుండా, ఆచూకీ తెలియకుండా లోక ప్రభుత్వాలను పడగొట్టి, వాగ్దానం చేసిన మెస్సీయగా తనకుతానే అభిషేకించుకొనుటకు ఆయన తన తోడుదొంగలతో కలసి కుట్రపన్నడం, రహస్యంగా పథకాలు వేయడంలాంటివి చేయడు. లేదు అలాచేయడు!
10. బైబిలు సత్యానికి సంబంధించిన మెరుపులు ప్రపంచవ్యాప్తంగా యేవిధంగా మెరుస్తున్నాయి?
10 అయితే, యేసు ప్రత్యక్షత ఆరంభమున రాజుగా వస్తాడనే విషయంలో దాపరికమేమీ లేదు. యేసు ప్రవచించినట్లుగా, భూవ్యాప్తంగా బైబిలు సత్యాల మెరుపులు సుదూరప్రాంతాలకు అనగా తూర్పునుండి పడమటి దేశాల వరకు ఎడతెగకుండా కాంతులను వెదజల్లుతున్నాయి. నిజముగా, “భూదిగంతముల వరకు . . . [యెహోవా] కలుగజేయు రక్షణకు సాధనమగుటకై, అన్యజనులకు వెలుగైయుండునట్లు” యెహోవా సాక్షులు ఆధునిక వెలుగు ప్రకాశకులుగా రుజువుచేసుకుంటున్నారు.—యెషయా 49:6.
దేవదూతల కార్యకలాపం
11. (ఎ) ఏరీతిలో దేవదూతలసమూహములు రాజ్య సంబంధ వెలుగును ప్రకాశింపచేయుటలో ఉపయోగించబడిరి? (బి) గోధుమల తరగతి సభ్యులు ఎప్పుడు, ఏ గుంపులోకి సమకూర్చబడిరి?
11 యేసు ప్రత్యక్షతకు సంబంధించిన యితర లేఖనాలు ఆయన దేవదూతలతో కూడా రాబోవుచున్నాడని, లేదా ‘దూతల సమూహంతో వస్తాడని’ వర్ణిస్తున్నవి. (మత్తయి 16:27; 24:31) గోధుమలు గురుగుల ఉపమానంలో, యేసు “పొలము ప్రపంచము,” “కోత ఈ యుగ సమాప్తి,” “కోతకోసే వారు దేవదూతలని” వివరించాడు. అయినప్పటికిని, రాజ్యాధికార మహిమగల తన ప్రత్యక్షతాకాలంలో యేసు భూసంబంధమైన పనుల కొరకు కేవలము దేవదూతలను వాడుకుంటాడని దీని భావము కాదు. మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగిన సంఘటనలవల్ల భూమిమీద చెదరిపోయిన, ఆత్మాభిషేక గోధుమల తరగతిని 1919 నుండి దేవదూతలు యేసుక్రీస్తు ఆధ్వర్యంలో వేరుచేయడం ప్రారంభించారు, మరి వీరు రాజు నామములో కార్యకలాపాలను వృద్ధిచేయుటకు సిద్ధపడ్డారు. (మత్తయి 13:38-43) పందొమ్మిది వందల యిరవై దశాబ్దంలో యింకా వేలాదిమంది మానవులు, స్థాపించబడిన దేవుని రాజ్యం పక్షాన నిలబడి, దేవుని ఆత్మచేత అభిషేకించబడ్డారు. ఈ అభిషక్తులు అసలు అభిషక్త తరగతికి చేర్చబడ్డారు. వీరంతా కలిసి మన కాలములో నమ్మకమును బుద్ధిమంతుడైన దాసుని తరగతిగా తయారయ్యారు.
12. దేవదూతలు ఎలాంటి శుద్ధిచేసే పనిలో భాగం వహించారు, అది భూమికి తెచ్చిన ఫలితమేమి?
12 యేసు క్రీస్తు 1914 లో సింహాసనాసీనుడైన అనంతరం తన ప్రత్యక్షత సమయంలో దేవదూతలు మరొకసారి యిట్టిపనులలో పాల్గొనుటను గూర్చి ప్రకటన 12:7-9 లో వ్రాయబడింది: “మిఖాయేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా, ఆ ఘటసర్పము దాని దూతలు యుద్ధము చేసిరి గాని గెలువలేక పోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘటసర్పము పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను; దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి.” ఆవిధంగా, పైనున్న ఆకాశములు ప్రస్తుతం శుద్ధిచేయబడినవి, కాని ఒక్క భూలోకరాజ్యము మాత్రము యెహోవా నామమహిమార్థమై పూర్తిగా శుద్ధి చేయబడుటకు సిద్ధంగా వుంది. “భూమి మీకు శ్రమ . . . అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహుక్రోధము గలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడు” అనే దైవీక హెచ్చరిక ఈ 1993 వ సంవత్సరములో వర్తిస్తూనేవుంది.—ప్రకటన 12:12.
పరలోక పునరుత్థానము
13, 14. (ఎ) లేఖనాలు, 1918 నుండి ఏమి సంభవిస్తుందని తెలియజేస్తున్నాయి? (బి) ఈనాటి అభిషక్తశేషమునుగూర్చి పౌలు, యోహానులు ఏమి తెలియజేశారు?
13 మరొక విస్మయం గొలిపే విషయమేమనగా క్రీస్తు ప్రత్యక్షత సమయంలో పరలోక సంబంధమైన పునరుత్థానము మొదలైంది. చాలాకాలం క్రిందట సమాధులలో నిద్రించిన అభిషక్తులైన క్రైస్తవులు ప్రధమంగా లేపబడి క్రీస్తుతోపాటు ఆత్మీయరాజ్యంలో జీవించెదరని అపొస్తలుడైన పౌలు సూచించాడు. ఇది 1918 నుండి జరుగుతున్నట్లుగా, సంవత్సరాల తరబడి కనబడుతున్న ఆధారం రుజువుచేస్తుంది. “క్రీస్తునందు అందరును బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును; ప్రథమఫలము క్రీస్తు; తరువాతనే క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రతికింపబడుదురు,” అని పౌలు వ్రాస్తున్నాడు. (1 కొరింథీయులు 15:22, 23) యేసుక్రీస్తు ప్రత్యక్షత [పరోసియా] సమయంలో అభిషక్తుల పునరుత్థానం జరుగుతుందని 1 థెస్సలొనీకయులు 4:15-17 లో నిర్థారిస్తుంది: “మేము ప్రభువు మాటనుబట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు ఆగమన పర్యంతము సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా (ఆయన సన్నిధి) చేరము . . క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము.” యేసుక్రీస్తుకు చెందిన 1,44,000 మంది అభిషక్తులు చివరకు ఈ అద్భుతమైన బహుమానాన్ని అందుకొంటారు.—ప్రకటన 14:1.
14 పౌలు చూపిస్తున్నట్లుగా, ముందుగానే మృతిపొందిన (బలిగావించబడిన) విశ్వాసులైన అభిషక్త క్రైస్తవ హతసాక్షులైన శిష్యులకంటే ముందు ఈనాడు జీవించియున్న అభిషక్తశేషం ఆ రాజ్యంలో ప్రవేశించరు. ఈనాడు చనిపోతున్న అభిషక్తులను గూర్చి అపొస్తలుడైన యోహాను ఇంకా ఇలా వర్ణిస్తున్నాడు: “ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని. నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారివెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు.” అంటే వారి పునరుత్థానముతోపాటు అలా జరుగుతుంది. (ప్రకటన 14:13) పౌలు యిలా చెబుతున్నాడు: “ఇదిగో మీకొక మర్మము తెలుపుచున్నాను; మనమందరము నిద్రించముగాని నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము.” (1 కొరింథీయులకు 15:51, 52) ఎంత ఆశ్చర్యమునుగొల్పే అద్భుతము!
15, 16. (ఎ) యేసుక్రీస్తు లూకా 19:11-15 లో ఏ ఉపమానమును ఇచ్చాడు ఎందుకు? (బి) ఈ ప్రవచన నెరవేర్పు ఏవిధంగా కొనసాగుతుంది?
15 ఒకసారి యేసుక్రీస్తు తనతోటి అనుచరులతో, దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించేసమయంలో, వారి తప్పుడు ఆలోచనలను సరిదిద్దుకొనుటకు ఒక ఉపమానమును ఉపయోగించాడు. ఆ వృత్తాంతము ఇలా చదువబడుతుంది: “దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుటవలనను, ఆయన మరియొక ఉపమానము చెప్పెను. ఏమనగా, రాజకుమారుడొక రాజ్యము సంపాదించుకొని మరల రావలెనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను పదిమందిని పిలిచి వారికి పది మీనాలనిచ్చి—నేను వచ్చువరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను. . . . అతడా రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు, ప్రతివాడును వ్యాపారమువలన ఏమేమి సంపాదించెనో తెలిసికొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తనయొద్దకు పిలువుమని ఆజ్ఞాపించెను.”—లూకా 19:11-15.
16 ఆయన ఒక రాజ్యాన్ని సంపాదించుకొనుటకు అనగా “సుదూర ప్రాంతమైన” పరలోకమునకు వెళ్లిన ఆ “మానవుడు” యేసే. ఆ రాజ్యాన్ని ఆయన 1914 లో పొందాడు. ఆ వెంటనే, క్రీస్తు రాజుగా, తన అనుచరులని చెప్పుకొనే వారు తమకిచ్చిన రాజ్య పనులను నెరవేర్చుటలో వారు చేసినదానిని తెలుసుకొనుటకు ఆరాతీశాడు. నమ్మకస్థులైన కొద్దిమంది యజమానినుండి మెప్పును పొందుటకు ఎన్నుకొనబడ్డారు: “భళా, మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారివై యుండుమని వానితో చెప్పెను.” (లూకా 19:17) ఈ క్రీస్తు ప్రత్యక్షతాకాలంలో, దుష్టులకు దేవుని తీర్పును ప్రకటించుటతోపాటు ఉధృత్తంగా రాజ్యసువార్త ప్రకటనాపని కొనసాగించుటయు, “మంచిదాసునికి” అప్పగించిన అధికారంలో యీపనిని పర్యవేక్షించుటయు ఇమిడియున్నవి.
ప్రపంచవ్యాప్త సువార్తప్రచారం
17. పరోసియా సమయంలో ఏ సంతోషం కల్గుతుంది?
17 పరోసియా సమయంలో ఇంకా ఏమి జరుగవలసియున్నది? సువార్త ప్రచారపనిలో గొప్ప సంతోషాన్ని అనుభవించుటకు, మరియు రానైయున్న మహాశ్రమలనుండి తప్పించుకొనుటకు సిద్ధపడేలా క్రొత్తవారికి సహాయపడుటకు ఇది సమయమైయుంది. శేషించబడినవారికి సహకరిస్తున్న “గొప్పసమూహముకు” చెందిన వీరు “సిఫారసు పత్రికలు” అవుతారు. (ప్రకటన 7:9; 2 కొరింథీయులు 3:1-3) “ఏలయనగా మా నిరీక్షణయైనను ఆనందమైనను అతిశయకిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసుయొక్క ఆగమన [పరోసియా] సమయమున ఆయన యెదుట మీరే గదా” అని చెబుతున్నప్పుడు పౌలు కోతపనిలోని ఆనందాన్ని వివరిస్తున్నాడు.—1 థెస్సలొనీకయులు 2:19.
పవిత్రంగాను అనింద్యులుగాను ఉండుడి
18. (ఎ) పౌలు చేసిన ఏ ప్రార్థన పరోసియాను సూచిస్తుంది? (బి) ఈ సమయంలో మనమందరము ఏస్ఫూర్తిని ప్రదర్శించాలి, ఏఏ విధాలుగా?
18 క్రీస్తు ప్రత్యక్షత కాలంలో జీవించియున్న వారి పవిత్రత కొరకు కూడా పౌలు ప్రార్థించాడు: “సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడయందు [పరోసియా] నిందారహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక.” (1 థెస్సలొనీకయులకు 5:23) ఔను, ఈనాడు మనము గొప్పగుంపులోని వేరేగొఱ్ఱెలమైనా లేదా శేషించిన అభిషక్తులమైనా, ఈ ప్రత్యేక సమయంలో ఒకరికొకరము సహకరించుట అనేది మనం పవిత్రంగాను, నిందారహితంగాను నమ్మకంగా కలసి ఉండుటకు సహకరిస్తుంది. అదేవిధంగా, సహనమును కనపర్చాలి. “సహోదరులారా ప్రభువు రాకడవరకు ఓపిక కలిగి యుండుడి. . . . ప్రభువు రాకడ [పరోసియా] సమీపించుచున్నది గనుక మీ హృదయములను స్థిరపరుచుకొనుడి” అని యాకోబు వ్రాశాడు.—యాకోబు 5:7, 8.
19. పరోసియాను గూర్చి పేతురు ఏ హెచ్చరికనిచ్చాడు, మనం ఎలా ప్రతిస్పందించాలి?
19 ప్రస్తుత కాలములో జీవించియున్న మనకు అపొస్తలుడైన పేతురు కూడ ఏదో చెప్పాలనుకున్నాడు. ఈ భువ్యాప్తంగానున్న అనేకులైన అపహాసకులనుగూర్చి మనలను హెచ్చరించాడు. పేతురు యిలా చెబుతున్నాడు: “అంత్యదినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయదురాశల చొప్పున నడుచుకొనుచు, ఆయన రాకడను [పరోసియా] గూర్చిన వాగ్దానమేమాయెను? పితరులు నిద్రించునది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి యున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను.” (2 పేతురు 3:3, 4) క్రీస్తు ప్రత్యక్షత సమయంలో అనేకమంది అపహాసకులు ఉన్నప్పటికిని, చాలామంది రక్షణార్థమై, యెహోవా ప్రజలు ఈ లోకమునకు వెలుగుగా ప్రకాశిస్తూ ఉన్నారు. (w93 5/1)
ప్రశ్నావళి
▫ యెహోవా ప్రజలు పరోసియాను గూర్చిన జ్ఞానాన్ని క్రమేపి ఎలా తెలుసుకున్నారు?
▫ మత్తయి 24:4-8 లోని నెరవేర్పు ఏవిధంగా కొనసాగుతుంది?
▫ సింహాసనాసీనుడైన క్రీస్తుతో దేవదూతలు ఏవిధంగా సహకరిస్తున్నారు?
▫ పరోసియాతో పాటు ఏ అద్భుతమైన సూచక క్రియ జరుగుతున్నట్టు కనబడుతుంది?
▫ ఈ సమయంలో ఏ సంతోషాన్ని అనుభవిస్తారు? మరియు దీనిలో ఎవరు భాగము వహిస్తారు?