యేసు రాకడ లేక యేసు ప్రత్యక్షత—ఏది?
“నీ ప్రత్యక్షతకు మరియు విధానాంతానికి సూచనలేవి?”—మత్తయి 24:3, NW.
1. యేసు పరిచర్యలో ప్రశ్నలు ఏ పాత్రను కలిగి ఉండినవి?
యేసు ప్రశ్నలను సమర్థవంతంగా ఉపయోగించడం, ఆయన శ్రోతలు ఆలోచించేలా చేసింది, వారు విషయాలను సరిక్రొత్త దృక్కోణంతో పరిశీలించేలా కూడా చేసింది. (మార్కు 12:35-37; లూకా 6:9; 9:20; 20:3, 4) ఆయన ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పినందుకు మనం సంతోషించవచ్చు. వేరేలా అయితే మనం తెలుసుకుని ఉండలేని లేక అర్థం చేసుకుని ఉండలేని సత్యాలను ఆయన సమాధానాలు స్పష్టపరిచాయి.—మార్కు 7:17-23; 9:11-13; 10:10-12; 12:18-27.
2. మనం ఇప్పుడు ఏ ప్రశ్నపై అవధానాన్ని నిలపాలి?
2 మత్తయి 24:3నందు, యేసు జవాబిచ్చిన అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్నల్లో ఒకదాన్ని మనం కనుగొంటాము. ఆయన భూ జీవితం యొక్క అంతం సమీపిస్తుండగా, యూదా విధానాంతాన్ని సూచిస్తూ యెరూషలేము దేవాలయం నాశనంచేయబడుతుందని యేసు ఇంతక్రితమే హెచ్చరించాడు. మత్తయి వ్రాసిన వృత్తాంతం ఇలా జతచేస్తుంది: “ఆయన ఒలీవ కొండమీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులాయన దగ్గరికి ఏకాంతంగా వచ్చి ఇలా అడిగారు: ‘ఈ విషయాలు మాతో చెప్పు, ఇవి ఎప్పుడు జరుగుతాయి? నీ ప్రత్యక్షతకు [“రాకడ,” కింగ్ జేమ్స్ వర్షన్] మరియు విధానాంతానికి సూచనలేవి?’”—మత్తయి 24:3, NW.
3, 4. మత్తయి 24:3 నందలి ఒక కీలక పదాన్ని బైబిళ్లు అనువదిస్తున్న పద్ధతిలో ఏ గణనీయమైన వ్యత్యాసం ఉంది?
3 కోట్లాదిమంది బైబిలు పాఠకులు ఇలా ఆలోచించారు: ‘శిష్యులు ఆ ప్రశ్నను ఎందుకు అడిగారు మరియు యేసు ఇచ్చిన సమాధానం నన్ను ఎలా ప్రభావితం చేయాలి?’ యేసు తాను చెప్పిన సమాధానంలో, వసంతకాలం “సమీపముగా ఉన్నదని” తెలియజేసే కొమ్మ చిగురించడాన్ని గురించి మాట్లాడాడు. (మత్తయి 24:32, 33) కాబట్టి, అపొస్తలులు యేసు “రాకడ” గురించిన సూచనను, అంటే ఆయన చాలా త్వరగా తిరిగి వస్తాడని నిరూపించే సూచనను అడిగారని అనేక చర్చీలు బోధిస్తాయి. “రాకడ” అనేది, ఆయన క్రైస్తవులను పరలోకానికి తీసుకువెళ్లి ఆ తర్వాత ప్రపంచ నాశనం తెచ్చే సమయమై ఉంటుందని వారు విశ్వసిస్తున్నారు. ఇది సరియని మీరు విశ్వసిస్తున్నారా?
4 “రాకడ” అనే పదానికి బదులు, పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదముతో సహా కొన్ని బైబిలు అనువాదాలు, “ప్రత్యక్షత” అనే పదాన్ని ఉపయోగిస్తున్నాయి. శిష్యులు దేని గురించి అడిగారో మరియు దానికి సమాధానంగా యేసు ఏమి చెప్పాడో ఆ విషయం, చర్చీల్లో బోధింపబడుతున్న దానినుండి భిన్నంగా ఉందా? వాస్తవంగా ఏమి అడుగబడింది? మరి యేసు ఏ సమాధానమిచ్చాడు?
వారేమి అడుగుచుండిరి?
5, 6. మత్తయి 24:3 నందు మనం చదివే ప్రశ్నను అపొస్తలులు అడిగినప్పుడు వారు కలిగి వున్న ఆలోచనా విధానాన్ని గురించి మనమేమి తేల్చి చెప్పవచ్చు?
5 దేవాలయాన్ని గురించి యేసు చెప్పిన దాని దృష్ట్యా, శిష్యులు ‘ఆయన ప్రత్యక్షతకు [లేక, “రాకడ”] మరియు విధానాంతానికి [అక్షరార్థంగా, “యుగం”] గల సూచనలను’ గురించి అడిగినప్పుడు వారు బహుశ యూదా విధానాన్ని గురించి ఆలోచిస్తుండవచ్చు.—1 కొరింథీయులు 10:11 మరియు గలతీయులు 1:4, KJ నందలి “ప్రపంచం”తో పోల్చండి.
6 ఆ సమయంలో అపొస్తలులకు యేసు బోధల గురించి కేవలం కొంత అవగాహనే ఉంది. “దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు” ఇంతకు మునుపు తలంచారు. (లూకా 19:11; మత్తయి 16:21-23; మార్కు 10:35-40) ఒలీవ కొండమీద జరిగిన చర్చ తర్వాత కూడా, అయితే పరిశుద్ధాత్మచేత అభిషేకింపబడక ముందు, ఇశ్రాయేలుకు రాజ్యాన్ని ఇప్పుడు అనుగ్రహిస్తావా అని వారు యేసును అడిగారు.—అపొస్తలుల కార్యములు 1:6.
7. యేసు భవిష్యత్ పాత్రను గురించి అపొస్తలులు ఆయనను ఎందుకు అడుగుతారు?
7 అయినప్పటికీ, ఆయన వెళ్లిపోతాడని వారికి తెలుసు, ఎందుకంటే ఆయన దానికి కొంత పూర్వమే ఇలా చెప్పాడు: “ఇంక కొంతకాలము వెలుగు మీమధ్య ఉండును; . . . మీకు వెలుగు ఉండగనే నడువుడి.” (యోహాను 12:35; లూకా 19:12-27) కాబట్టి వారు తప్పకుండా ఇలా ఆలోచించి ఉంటారు, ‘ఒకవేళ యేసు వెళ్లిపోబోతుంటే, ఆయన తిరిగి రావడాన్ని మనమెలా గుర్తించగలం?’ ఆయన మెస్సీయగా కనిపించినప్పుడు, అనేకులు ఆయనను గుర్తించలేదు. ఒక సంవత్సరం పైగా అయిన తర్వాత కూడా, మెస్సీయ చేయవలసినవన్నీ ఈయన నెరవేర్చుతాడా లేదా అనే దాని గురించి ప్రశ్నలు ఇంకా ఉండినవి. (మత్తయి 11:2, 3) కాబట్టి భవిష్యత్తును గురించి అడిగేందుకు అపొస్తలులకు కారణముంది. అయితే, మరలా, వారు ఆయన త్వరగా వస్తాడనే దానికి సూచన అడుగుతున్నారా లేక వేరే విషయాన్ని అడుగుతున్నారా?
8. అపొస్తలులు యేసుతో బహుశా ఏ భాషలో మాట్లాడి ఉంటారు?
8 ఒలీవ కొండ మీద జరిగిన ఈ సంభాషణను వింటున్న ఒక పక్షిగా మిమ్మల్ని మీరు ఊహించుకోండి. (ప్రసంగి 10:20 పోల్చండి.) యేసు, ఆయన అపొస్తలులు హెబ్రీలో మాట్లాడుకోవడాన్ని బహుశ మీరు వినుండేవారు. (మార్కు 14:70; యోహాను 5:2; 19:17, 20; అపొస్తలుల కార్యములు 21:40) అయినప్పటికీ, వారికి గ్రీకు భాష కూడా వచ్చేవుంటుంది.
మత్తయి గ్రీకులో వ్రాసినది
9. మత్తయి యొక్క అనేక ఆధునిక అనువాదాలు దేనిపై ఆధారపడి ఉన్నాయి?
9 మత్తయి తన సువార్తను మొదట హెబ్రీలో వ్రాశాడని సా.శ. రెండవ శతాబ్దానికి చెందిన నివేదికలు సూచిస్తున్నాయి. ఆయన దాన్ని తర్వాత గ్రీకులో వ్రాశాడని స్పష్టమౌతుంది. గ్రీకులోని అనేక వ్రాత ప్రతులు మన కాలం వరకూ నిలిచి ఉన్నాయి, మరియు ఆయన సువార్తను నేటి భాషల్లోకి అనువదించేందుకు అవి ఆధారాలుగా పని చేశాయి. ఒలీవ కొండ మీది ఆ సంభాషణను గురించి మత్తయి ఏమి వ్రాశాడు? శిష్యులు అడిగిన మరియు యేసు వ్యాఖ్యానం చేసిన ఆ “రాకడ” లేక “ప్రత్యక్షత” గురించి ఆయన ఏమి వ్రాశాడు?
10. (ఎ) ‘వచ్చు’ అనే పదానికి మత్తయి ఏ గ్రీకు పదాన్ని తరచూ ఉపయోగించాడు, అది ఏ అర్థాలను ఇవ్వగలదు? (బి) ఏ ఇతర గ్రీకు పదం ఆసక్తిదాయకంగా ఉంది?
10 మత్తయి యొక్క మొదటి 23 అధ్యాయాల్లో, “వచ్చు” అనే పదానికున్న ఎర్ʹక్హో·మై అనే సాధారణ గ్రీకు క్రియాపదాన్ని మనం 80 కంటే ఎక్కువసార్లు కనుగొంటాము. ‘యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచెను’ అని చెబుతున్న యోహాను 1:47 నందున్న విధంగా, అది తరచూ, సమీపించడం లేక దగ్గరికి రావడం అనే భావాన్నిస్తుంది. వాడుకను బట్టి, ఎర్ʹక్హో·మై అనే క్రియాపదం “చేరుకొను,” “వెళ్లు,” “వచ్చి” “చేరు,” లేక “తన దారిలో పోవు” అనే అర్థాలను కూడా ఇవ్వగలవు. (మత్తయి 2:8, 11; 8:28; యోహాను 4:25, 27, 45; 20:4, 8; అపొస్తలుల కార్యములు 8:40; 13:51) కాని మత్తయి 24:3, 27, 37, 39 నందు మత్తయి వేరే పదాన్ని ఉపయోగించాడు, ప·రౌ·సిʹయా అనే ఆ సర్వనామం అక్కడ తప్ప సువార్తల్లో మరెక్కడా కనిపించదు. బైబిలు వ్రాయబడటాన్ని దేవుడే ప్రేరేపించాడు గనుక, మత్తయి తన సువార్తను గ్రీకులో వ్రాస్తున్నప్పుడు ఆ వచనాల్లో ఆ గ్రీకు పదాన్నే ఉపయోగించేలా ఆయన మత్తయిని ఎందుకు ప్రేరేపించాడు? దాని అర్థం ఏమిటి, మరి మనం ఎందుకు తెలుసుకోవలసి ఉంది?
11. (ఎ) ప·రౌ·సిʹయా యొక్క భావం ఏమిటి? (బి) జోసీఫస్ యొక్క వ్రాతలనుండి తీసుకొనబడిన ఉదాహరణలు ప·రౌ·సిʹయాను మనం అర్థం చేసుకునే విషయంలో ఎలా దోహదపడతాయి? (అధసూచి చూడండి.)
11 సూటిగా చెప్పాలంటే, ప·రౌ·సిʹయా అంటే “ప్రత్యక్షత” అని అర్థం. వైన్ రచించిన క్రొత్తనిబంధన పదముల యొక్క వివరమైన నిఘంటువు (ఆంగ్లం) ఇలా చెబుతోంది: “పరౌసియా అంటే, . . . అక్ష[రార్థంగా], ప్రత్యక్షత, పర అంటే తోపాటు మరియు ఔసియా అంటే ఉండటం (అది ఈమి, అంటే ఉండు నుండి వచ్చింది), ఇది చేరుకోవడాన్ని అలాగే దానితోపాటు ప్రత్యక్షతను కలిగివుండటాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు, ఒక పపైరస్ లేఖలో ఓ స్త్రీ, తన ఆస్తికి సంబంధించిన విషయాలను చూసుకునేందుకు ఫలానా ప్రాంతంలో తన పరౌసియా అవసరమైన విషయాన్ని గురించి చెబుతోంది.” ప·రౌ·సిʹయా ‘ఓ పరిపాలకుని సందర్శనాన్ని’ సూచిస్తుందని ఇతర నిఘంటువులు వివరిస్తున్నాయి. కాబట్టి, అది కేవలం చేరుకునే సమయం మాత్రమే కాదుగాని చేరుకున్నప్పటినుండి ఉండే ప్రత్యక్షత. ఆసక్తికరంగా, అపొస్తలుల సమకాలీనుడైన, యూదా చరిత్రకారుడగు జోసీఫస్ ప·రౌ·సిʹయాను ఆ విధంగానే ఉపయోగించాడు.a
12. ప·రౌ·సిʹయా యొక్క అర్థాన్ని ధృవపర్చేందుకు బైబిలే మనకు ఎలా సహాయం చేస్తుంది?
12 “ప్రత్యక్షత” అనే అర్థం ప్రాచీన సాహిత్యంలో స్పష్టంగా రూఢిచేయబడింది, అయినప్పటికీ దేవుని వాక్యం ప·రౌ·సిʹయాను ఎలా ఉపయోగిస్తుందనే విషయంలో క్రైస్తవులు ప్రాముఖ్యంగా ఆసక్తి కలిగి వున్నారు. జవాబు అదే—ప్రత్యక్షత. పౌలు వ్రాసిన లేఖల్లోని ఉదాహరణల నుండి మనం దాన్ని చూడవచ్చు. ఉదాహరణకు, ఆయన ఫిలిప్పీయులకు ఇలా వ్రాశాడు: “మీరెల్లప్పుడును విధేయులైయున్న ప్రకారము, నా ప్రత్యక్షత సమయమందు మాత్రమే గాక మరి యెక్కువగా నా పరోక్షత సమయమందు, . . . మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి.” ఆయన “[వారితో] కూడా మరల [తన] ప్రత్యక్షత [ప·రౌ·సిʹయా] ద్వారా” వారు ఆనందించేలా వారితోపాటు ఉండటాన్ని గురించి కూడా మాట్లాడాడు. (ఫిలిప్పీయులు 1:25, 26; 2:12, NW) ఇతర అనువాదాలు “నేను మళ్లీ మీతో ఉండునప్పుడు” (వేమౌత్; న్యూ ఇంటర్నేషనల్ వర్షన్); “నేను మళ్లీ మీతో ఉన్నప్పుడు” (జెరూసలేమ్ బైబిల్; న్యూ ఇంగ్లీష్ బైబిల్); మరియు “మీరు మళ్లీ నన్ను మీ మధ్య కలిగి ఉన్నప్పుడు” (ట్వెంటియత్ సెంచరీ న్యూ టెస్టమెంట్) అని చదువబడుతున్నాయి. 2 కొరింథీయులు 10:10, 11, NW, నందు పౌలు “తాను వ్యక్తిగా ప్రత్యక్షంగా” ఉన్నప్పటి దాన్ని “పరోక్షత”తో వ్యతిరేకపరిచాడు. ఈ ఉదాహరణల్లో ఆయన తాను సమీపించడాన్ని లేక చేరుకోవడాన్ని గురించి మాట్లాడటం లేదన్నది స్పష్టమౌతుంది; ఆయన ప·రౌ·సిʹయాను ప్రత్యక్షంగా ఉండటం అనే భావంలో ఉపయోగించాడు.b (1 కొరింథీయులు 16:17 పోల్చండి.) అయితే, యేసు యొక్క ప·రౌ·సిʹయాకు సంబంధించిన ఉదాహరణల విషయమేమిటి? ఆయన “రాకడ” అనే భావంతో అవి ఉన్నాయా లేక అవి పొడిగింపబడిన ప్రత్యక్షతను సూచిస్తున్నాయా?
13, 14. (ఎ) ప·రౌ·సిʹయా కొంత కాలం వరకూ ఉంటుందని మనం ఎందుకు నిర్ధారించాలి? (బి) యేసు ప·రౌ·సిʹయా యొక్క కాల నిడివిని గురించి ఏమి చెప్పవచ్చు?
13 పౌలు కాలంలోని ఆత్మాభిషిక్త క్రైస్తవులు యేసు యొక్క ప·రౌ·సిʹయా ఎడల ఆసక్తి కలిగి ఉన్నారు. అయితే తమ ‘సహేతుకత నుండి తొలగింపబడ’ వద్దని పౌలు వారిని హెచ్చరించాడు. మొదట “పాపపురుషుడు” కనిపించాలి, అది క్రైస్తవమత సామ్రాజ్యపు మతనాయకులని నిరూపించబడింది. “వాని [ప్రత్యక్షత, NW] అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచకక్రియలతో . . . సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును” అని పౌలు వ్రాశాడు. (2 థెస్సలొనీకయులు 2:1-3, 9, 10) ‘పాపపురుషుని’ ప·రౌ·సిʹయా లేక ప్రత్యక్షత, ఆ క్షణంలో చేరుకోవడం అనే భావాన్ని మాత్రమే కలిగిలేదు; అది కొంత సమయం ఉంటుంది, ఆ సమయంలో అబద్ధ సూచనలు ఉత్పన్నం చేయబడతాయన్నది స్పష్టమౌతుంది. ఇది ఎందుకు గణనీయమైన విషయం?
14 ఆ వచనానికి ముందున్న వచనాన్ని పరిశీలించండి: “ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటియూపిరి చేత వానిని సంహరించి తన ఆగమన [ప్రత్యక్షత, NW] ప్రకాశముచేత నాశనముచేయును.” ‘పాపపురుషుని’ ప్రత్యక్షత కొంత సమయం వరకు ఎలా ఉంటుందో, యేసు ప్రత్యక్షత కూడా కొంత సమయం ఉండి “నాశనపుత్రుడగు” ఆ ధర్మవిరోధి యొక్క నాశనంతో ముగింపుకొస్తుంది.—2 థెస్సలొనీకయులు 2:8, అధసూచి.
హెబ్రీ భాష యొక్క అంశాలు
15, 16. (ఎ) హెబ్రీలోకి అనువదింపబడిన మత్తయి సువార్త యొక్క అనేక అనువాదాల్లో ఏ ప్రత్యేక పదం ఉపయోగింపబడింది? (బి) లేఖనాల్లో బోహ్’ ఎలా ఉపయోగింపబడింది?
15 పేర్కొనబడిన విధంగా, మత్తయి తన సువార్తను మొదట హెబ్రీ భాషలో వ్రాశాడని స్పష్టమౌతుంది. కాబట్టి, మత్తయి 24:3, 27, 37, 39లో ఆయన ఏ హెబ్రీ పదాన్ని ఉపయోగించాడు? ఆధునిక హెబ్రీలోకి అనువదింపబడిన మత్తయి యొక్క అనువాదాలు, అపొస్తలుల ప్రశ్నలో మరియు యేసు సమాధానంలో కూడా బోహ్’ అనే క్రియాపదం యొక్క ఒక రూపాన్ని కలిగి ఉన్నాయి. ఈ విధంగా చదివేందుకు అది కారణం కాగలదు: “నీ [బోహ్’]కు మరియు విధానాంతానికి సూచనలేవి?” మరియు “నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని [బోహ్’] కూడా ఆలాగే ఉండును.” బోహ్’ యొక్క భావమేమిటి?
16 హెబ్రీ క్రియాపదమైన బోహ్’కు విభిన్నమైన భావాలు ఉన్నప్పటికీ అది ప్రాథమికంగా “వచ్చు” అనే అర్థాన్నే కలిగి ఉంది. పాత నిబంధన యొక్క వేదాంత నిఘంటువు ఇలా చెబుతుంది: ‘2,532 సార్లు ఉన్న బోహ్’ హెబ్రీ లేఖనాల్లో అత్యంత విరివిగా ఉపయోగింపబడే క్రియాపదాల్లో ఒకటి, అది గమనాన్ని వ్యక్తపరిచే క్రియాపదాల్లో ప్రాముఖ్యమైనది.’ (ఆదికాండము 7:1, 13; నిర్గమకాండము 12:25; 28:35; 2 సమూయేలు 19:30; 2 రాజులు 10:21; కీర్తన 65:2; యెషయా 1:23; యెహెజ్కేలు 11:16; దానియేలు 9:13; ఆమోసు 8:11) అంత విస్తృత శ్రేణిలో అర్థాలను కలిగివున్న పదాన్ని యేసు మరియు అపొస్తలులు ఉపయోగించి ఉంటే, దాని భావమే వివాదాస్పద విషయమయ్యేది. వారు ఉపయోగించారా?
17. (ఎ) హెబ్రీలోకి అనువదింపబడిన మత్తయి సువార్త యొక్క అనేక ఆధునిక అనువాదాలు, యేసు మరియు అపొస్తలులు చెప్పిన దాన్ని ఎందుకు కచ్చితంగా సూచించకపోవచ్చు? (బి) యేసు మరియు అపొస్తలులు ఏ పదాన్ని ఉపయోగించి ఉంటారనేందుకు ఆధారాన్ని మనం ఇంకా ఎక్కడ కనుగొనవచ్చు మరియు మరితర ఏ కారణాన్నిబట్టి ఇది ఆసక్తిదాయకంగా ఉంటుంది? (అధసూచి చూడండి.)
17 ఆధునిక హెబ్రీ అనువాదాలు, హెబ్రీలో మత్తయి ఏమి వ్రాశాడో కచ్చితంగా దాన్నే అందించలేని అనువాదాలనే విషయాన్ని మనస్సులో ఉంచుకోండి. యేసు బోహ్’ అనే పదాన్ని కాక మరో పదాన్ని అంటే, ప·రౌ·సిʹయా యొక్క భావానికి సమానమైన పదాన్ని ఉపయోగించి ఉంటాడన్నదే వాస్తవం. పండితుడైన జార్జ్ హోవర్డ్ వ్రాసిన హెబ్రీలో మత్తయి వ్రాసిన సువార్త అనే 1995 పుస్తకంలో మనం దీన్ని చూస్తాము. యూదా వైద్యుడైన షెమ్-టోబ్ బెన్ ఐసిక్ ఇబ్న్ షాప్రూట్, క్రైస్తవత్వానికి వ్యతిరేకంగా వ్రాసిన 14వ శతాబ్దపు వాదగ్రంథంపై ఆ పుస్తకం అవధానం నిలిపింది. ఆ డాక్యుమెంటు మత్తయి సువార్త యొక్క హెబ్రీ పాఠ్యభాగాన్ని అందించింది. షెమ్-టోబ్ యొక్క కాలంలో లాటిన్ లేక గ్రీకు నుండి అనువదింపబడే బదులు, మత్తయి యొక్క ఈ పాఠ్యభాగం ఎంతో పాతదని మరియు మొదట్లో కూడా హెబ్రీలోనే సమకూర్చబడిందని రుజువులున్నాయి.c అది అలా, ఒలీవ కొండపై చెప్పబడిన సంగతికి మనల్ని చేరువ చేయవచ్చు.
18. షెమ్-టోబ్ ఏ ఆసక్తికరమైన హెబ్రీ పదాన్ని ఉపయోగించాడు, దాని అర్థం ఏమిటి?
18 మత్తయి 24:3, 27, 39 నందు షెమ్-టోబ్ యొక్క మత్తయి పాఠ్యభాగం బోహ్’ అనే క్రియాపదాన్ని ఉపయోగించడంలేదు. బదులుగా, అది బి·’ఆహ్ʹ అనే సంబంధిత సర్వనామాన్ని ఉపయోగిస్తుంది. ఆ సర్వనామం హెబ్రీ లేఖనాల్లో కేవలం యెహెజ్కేలు 8:5 నందు మాత్రమే కనిపిస్తుంది, అక్కడ అది “గుమ్మము” అనే అర్థాన్నిస్తుంది. అక్కడ బి·’ఆహ్ʹ రావడం అనే క్రియను వ్యక్తం చేసే బదులు, ఓ భవనం యొక్క ద్వారాన్ని సూచిస్తుంది; మీరు గుమ్మంలో లేక గడపపై ఉంటే మీరు ఆ భవనంలో ఉన్నారన్నమాట. ఇంకా, మృత సముద్ర గ్రంథపు చుట్టల్లోని బైబిలేతర మతపర డాక్యుమెంట్‌లు యాజకసేవల ప్రారంభాన్ని లేక ఉపక్రమమును గురించి తరచూ బి·’ఆహ్ʹ అనే పదాన్నే ఉపయోగిస్తాయి. (1 దినవృత్తాంతములు 24:3-19; లూకా 1:5, 8, 23 చూడండి.) మరియు 1986 అనువాదమైన ప్రాచీన సిరియాక్ హెబ్రీలోని (లేక అరామిక్) పెషిట్టా, మత్తయి 24:3, 27, 37, 39 నందు బి·’ఆహ్ʹ అనే పదాన్నే ఉపయోగిస్తుంది. కాబట్టి, ప్రాచీన కాలాల్లో బి·’ఆహ్ʹ అనే సర్వనామం బైబిలులో బోహ్’ అనే క్రియాపదం ఉపయోగింపబడిన విధానం నుండి కొంత భిన్నమైన భావాన్ని కలిగి ఉండేదనే రుజువులు ఉన్నాయి. ఇది ఎందుకు ఆసక్తికరమైన విషయమై ఉంది?
19. ఒకవేళ యేసు మరియు అపొస్తలులు బి·’ఆహ్ʹను ఉపయోగించి ఉంటే, మనమేమి నిర్ధారించవచ్చు?
19 అపొస్తలులు తమ ప్రశ్నలోను యేసు తన సమాధానంలోను, బి·’ఆహ్ʹ అనే ఈ సర్వనామాన్నే ఉపయోగించి ఉంటారు. ఒకవేళ అపొస్తలుల మనస్సులో యేసు యొక్క భవిష్యత్ రాక గురించిన తలంపు మాత్రమే ఉన్నా, వారు ఆలోచిస్తున్న దానికంటే ఎక్కువ విషయాలను ఇమడ్చడానికి క్రీస్తు బి·’ఆహ్ʹను ఉపయోగించి ఉంటాడు. తన రాకడ ఒక క్రొత్త బాధ్యతను ప్రారంభిస్తుందని యేసు సూచిస్తుండవచ్చు; ఆయన రావడం ఆయన క్రొత్త పాత్రను ప్రారంభిస్తుంది. మత్తయి పిమ్మట ఉపయోగించిన ప·రౌ·సిʹయా యొక్క భావంతో ఇది సరిపోతుంది. బి·’ఆహ్ʹ యొక్క ఆ ఉపయోగం, యేసు ఇచ్చిన సంయుక్త “సూచన,” ఆయన ఉన్నాడని ప్రతిబింబించాలి అని యోహోవాసాక్షులు ఎంతో కాలంగా బోధిస్తున్న దానికి మద్దతును ఇవ్వాలనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఆయన ప్రత్యక్షత యొక్క ముగింపు కొరకు ఎదురు చూడటం
20, 21. నోవహు దినాలను గురించిన యేసు వ్యాఖ్యానం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
20 యేసు ప్రత్యక్షతను గురించిన మన అధ్యయనం మన జీవితంపై మరియు మన అపేక్షలపై సూటైన ప్రభావాన్ని కలిగి ఉండాలి. చురుకుగా ఉండాలని యేసు తన అనుచరులను పురికొల్పాడు. తన ప్రత్యక్షతను అనేకులు గమనించకపోయినప్పటికీ, దాన్ని గుర్తించగలిగేలా ఆయన ఒక సూచనను అందించాడు: “నోవహు దినములు ఎలా ఉండెనో మనుష్యకుమారుని ప్రత్యక్షత ఆలాగే ఉంటుంది. జలప్రళయమునకు మునుపటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు, వారు తింటూ త్రాగుతూ పెండ్లి చేసికొంటూ పెండ్లికిచ్చుచు ఉండి జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోయే వరకు గమనించక పోయారు; ఆలాగే మనుష్యకుమారుని ప్రత్యక్షత ఉంటుంది.”—మత్తయి 24:37-39, NW.
21 నోవహు దినాల్లో, ఆ తరంలోని అనేకమంది ప్రజలు తమ మామూలు కార్యకలాపాల్లో కొనసాగారు. “మనుష్యకుమారుని ప్రత్యక్షత” విషయంలో కూడా అలాగే ఉంటుందని యేసు ప్రవచించాడు. నోవహు చుట్టూ ఉన్న ప్రజలు ఏమీ జరగదని భావించి ఉండవచ్చు. అయితే ఏమి జరిగిందో మీకు తెలుసు. కొంత సమయం వరకు విస్తరించిన ఆ దినాలు ఒక ముగింపుకు దారి తీశాయి, “జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొని” పోయింది. యేసు ‘నోవహు దినములను’ ‘మనుష్యకుమారుని దినములతో’ పోల్చిన ఇదే విధమైన మరొక వృత్తాంతాన్ని లూకా అందిస్తున్నాడు. యేసు ఇలా సలహా ఇచ్చాడు: “ఆ ప్రకారమే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును.”—లూకా 17:26-30.
22. మత్తయి 24వ అధ్యాయంలోని యేసు ప్రవచనంలో మనం ప్రాముఖ్యంగా ఎందుకు ఆసక్తి కలిగి ఉండాలి?
22 ఇదంతా కూడా మన కొరకు ఎంతో ప్రత్యేక భావాన్ని సంతరించుకుంటుంది, ఎందుకంటే యేసు ముందే ప్రవచించిన యుద్ధాలు, భూకంపాలు, తెగుళ్లు, కరవులు మరియు తన శిష్యులు హింసింపబడటం వంటి సంఘటనలను మనం గుర్తించే సమయంలో మనం జీవిస్తున్నాము. (మత్తయి 24:7-9; లూకా 21:10-12) మొదటి ప్రపంచ యుద్ధం అని ప్రత్యేకంగా పిలువబడిన, చరిత్రను మార్చిన పోరాటాలు జరిగినప్పటినుండి అలాంటివి ఉన్నాయి, వాటిని అనేకమంది ప్రజలు చరిత్రలోని మామూలు విషయాలుగా చూసినప్పటికీ అది వాస్తవమే. అయితే, అంజూరపు చెట్టు చిగురించడాన్ని చూసి వసంతకాలం సమీపించిందని చురుకైన ప్రజలు అర్థం చేసుకోగలిగినట్లే, నిజ క్రైస్తవులు ఈ ఆవశ్యకమైన సంఘటనల అర్థాన్ని గ్రహిస్తారు. యేసు ఇలా సలహా ఇచ్చాడు: “అటువలె మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయెనని తెలిసికొనుడి.”—లూకా 21:31.
23. మత్తయి 24వ అధ్యాయంలోని యేసు మాటలు ఎవరి కొరకు ప్రత్యేక అర్థాన్ని కలిగి ఉన్నాయి మరియు ఎందుకు?
23 ఒలీవ కొండపైన యేసు ఇచ్చిన సమాధానంలో అధికభాగాన్ని ఆయన తన అనుచరులను ఉద్దేశించి ఇచ్చాడు. అంతం రాకముందు భూవ్యాప్తంగా, జీవాన్ని కాపాడే పని అయిన సువార్త ప్రకటనలో భాగంవహించేది వారే. “నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట”ను గుర్తించగలిగేది వారే. మహాశ్రమ రాకముందు ‘పారిపోవడం’ ద్వారా ప్రతిస్పందించేది కూడా వారే. “ఆ దినములు తక్కువ చేయబడక పోయినయెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును” అని చెప్పబడిన మాటల ద్వారా ప్రభావితం చెందేది కూడా ప్రాముఖ్యంగా వారే. (మత్తయి 24:9, 14-22) అయితే ఈ గంభీరమైన పదాలు ఏ భావాన్ని కలిగి ఉన్నాయి, మనం ఇప్పుడు అత్యధిక సంతోషాన్ని, నమ్మకాన్ని మరియు ఆసక్తిని కలిగి ఉండేందుకు అవి ఆధారాన్ని అందిస్తాయని ఎందుకు చెప్పవచ్చు? మత్తయి 24:22 యొక్క ఈ తదుపరి అధ్యయనం సమాధానాలను అందిస్తుంది.
[అధస్సూచీలు]
a జోసీఫస్ నుండి ఉదాహరణలు: సీనాయి పర్వతంపై కలిగిన మెరుపులు మరియు ఉరుములు “దేవుని ప్రత్యక్షతను [ప·రౌ·సిʹయా] సూచించాయి.” గుడారంలోని అద్భుతమైన దృశ్యం “దేవుని ప్రత్యక్షతను [ప·రౌ·సిʹయా] చూపింది.” చుట్టూ ఉన్న రథాలను ఎలీషా సేవకునికి చూపడం ద్వారా, దేవుడు “తన సేవకునికి తన శక్తిని మరియు ప్రత్యక్షతను [ప·రౌ·సిʹయా] కనుపరిచాడు.” రోమా అధికారియైన పెట్రోనియస్ యూదులను శాంతపరిచేందుకు ప్రయత్నించినప్పుడు, వర్షాన్ని పంపడం ద్వారా ‘దేవుడు తన ప్రత్యక్షతను [ప·రౌ·సిʹయా] పెట్రోనియస్‌కు చూపించాడని’ జోసీఫస్ పేర్కొన్నాడు. జోసీఫస్ ప·రౌ·సిʹయాను కేవలం సమీపించడంతో లేక ఆ తరుణంలో చేరుకోవడంతో అన్వయించలేదు. ఎడతెగని, చివరకు అదృశ్యమైన ప్రత్యక్షత అని దాని భావం. (నిర్గమకాండము 20:18-21; 25:22; లేవీయకాండము 16:2; 2 రాజులు 6:15-17)—యూదుల పురాతన గ్రంథాలు, (ఆంగ్లం) పుస్తకం 3, అధ్యాయం 5, పేరా 2 [80]; అధ్యాయం 8, పేరా 5 [202]; పుస్తకం 9, అధ్యాయం 4, పేరా 3 [55]; పుస్తకం 18, అధ్యాయం 8, పేరా 6 [284] పోల్చండి.
b ప·రౌ·సిʹయా అంటే, ‘ఉనికిలో ఉండటం లేక ప్రత్యక్షంగా ఉండటం, కాబట్టి, ప్రత్యక్షత, చేరుకోవడం అయ్యుంది; అలా రావడమనేది వచ్చినప్పటినుండి శాశ్వతంగా ఉండటమనే ఆలోచనను కలిగివుందని’ ఆంగ్లం మరియు గ్రీకు క్రొత్త నిబంధన యొక్క విమర్శణాత్మక నిఘంటువు మరియు ఆకారాధి సూచికలో ఈ. డబ్ల్యూ. బుల్లింగర్ సూచిస్తున్నాడు.
c ఒక రుజువు ఏమంటే, అది “పేరు” అనే హెబ్రీ పదాన్ని 19 సార్లు వ్రాతపూర్వకంగానో లేక సంక్షిప్తంగానో కలిగి ఉంది. పండితుడైన హోవర్డ్ ఇలా వ్రాశాడు: “ఓ యూదా తార్కికుని ద్వారా ఉదాహరింపబడిన క్రైస్తవ డాక్యుమెంట్‌లో దైవిక నామాన్ని కనుగొనడం ఎంతో గణనీయం. ఇది గ్రీకు లేక లాటిన్ క్రైస్తవ డాక్యుమెంట్ యొక్క హెబ్రీ అనువాదమై ఉంటే, ఆ పాఠ్యభాగంలో, అనిర్వచనీయమైన దైవిక నామమైన యహ్‌వహ్‌కుగల చిహ్నం కాక అదోనాయ్ [ప్రభువు] అనే పదం ఉంటుందని ఒకరు ఎదురుచూడవచ్చు. . . . అతను అనిర్వచనీయమైన నామాన్ని జతచేయడం అనిర్వాచ్యమైన విషయం. షెమ్-టోబ్ వద్ద ఉన్న మత్తయి ప్రతిలో దైవిక నామం ముందే ఉందని మరియు దాన్ని తొలగించాడనే అపరాధాన్ని ఆపాదించుకునేందుకు బదులు అతను దాన్ని అందులోనే భద్రపరిచి ఉండవచ్చునని రుజువులు దృఢంగా సూచిస్తున్నాయి.” క్రైస్తవ గ్రీకు లేఖనాలలో దైవిక నామమును ఉపయోగించేందుకు పరిశుద్ధ లేఖనముల నూతన లోక అనువాదము—రెఫరెన్సులతో (ఆంగ్లం), షెమ్-టోబ్ యొక్క మత్తయి పాఠ్యభాగాన్ని (J2) ఆధారంగా ఉపయోగిస్తుంది.
మీరు ఎలా సమాధానమిస్తారు?
◻ మత్తయి 24:3ను బైబిళ్లు అనువదించే విధానంలోని వ్యత్యాసాన్ని చూడటం ఎందుకు ప్రాముఖ్యం?
◻ ప·రౌ·సిʹయా యొక్క అర్థం ఏమిటి, ఇది ఎందుకు ఆసక్తికరమైన విషయం?
◻ మత్తయి 24:3 నందు గ్రీకు మరియు హెబ్రీలో ఏ సంభావ్య సమాంతరం ఉండగలదు?
◻ మత్తయి 24వ అధ్యాయాన్ని అర్థం చేసుకునేందుకు, సమయాన్ని గురించిన ఏ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోవడం అవసరం?
[10వ పేజీలోని చిత్రం]
ఒలీవ కొండ, సుదూరాన క్రింద యెరూషలేము కనిపిస్తుంది