కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 9/15 పేజీలు 9-14
  • సహనము—క్రైస్తవులకు ఆవశ్యకము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సహనము—క్రైస్తవులకు ఆవశ్యకము
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సహనం—దాని భావమేమిటి
  • సహనం—ఎందుకు?
  • అంతము వరకు సహించుట—ఎట్లు?
  • ‘సహనం తన పనిని పూర్తి చేయనివ్వండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • యెహోవా సంస్థను అంటిపెట్టుకుని ఉండండి
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • ‘సహించిన వారు ధన్యులు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • సహనంతో యెహోవా దినంకోసం ఎదురుచూడడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 9/15 పేజీలు 9-14

సహనము—క్రైస్తవులకు ఆవశ్యకము

“మీ విశ్వాసమునందు . . . సహనమును . . . అమర్చుకొనుడి.”—2 పేతురు 1:5, 6.

1, 2. మనమందరము అంతము వరకు ఎందుకు సహించాలి?

ఒక ప్రయాణకాపరి తన భార్యతో కలిసి తొంభై సంవత్సరాలు దాటిన తోటి క్రైస్తవున్ని సందర్శించారు. ఆయన దశాబ్దాలపాటు పూర్తికాల సేవచేశారు. వారు మాట్లాడుతుండగా, ఆ వృద్ధ సహోదరుడు అనేక సంవత్సరాలపాటు తాను పొందిన ఆధిక్యతలను గుర్తుతెచ్చుకుంటూ, కంటతడిపెట్టి ఆయనిలా అన్నాడు: “కానీ నేనిప్పుడయితే ఏమి చేయలేకపోతున్నాను.” ఆ ప్రయాణకాపరి తన బైబిలు తెరచి మత్తయి 24:13 నందు యేసు చెప్పిన మాటలు ప్రస్తావిస్తూ యిలా అన్నాడు: “అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును.” ఆ తర్వాత, ఈ అధ్యక్షుడు ఆ ప్రియ సహోదరునివైపు చూసి యిలా అన్నాడు: “మనకు నియమింపబడిన చివరిపని యేమంటే, సేవ ఎంత ఎక్కువచేసినను, ఎంత తక్కువచేసిననూ మనము అంతము వరకు సహించుటే.”

2 ఔను, క్రైస్తవులుగా మనమందరము ఈ విధానాంతము వరకు లేదా మన జీవితాలు ముగిసేవరకు సహించాలి. రక్షణ కొరకు యెహోవా అంగీకారం పొందడానికి మరో మార్గంలేదు. మనం జీవపు పరుగు పందెమందు ఉన్నాము, కావున మనం తుది రేఖ చేరువరకు “ఓపికతో” పరుగెత్తాలి. (హెబ్రీయులు 12:1) తన తోటి క్రైస్తవులకిలా ఉద్బోధించినప్పుడు అపొస్తలుడైన పేతురు ఈ లక్షణంయొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పాడు: “మీ విశ్వాసమునందు . . . సహనమును . . . అమర్చుకొనుడి.” (2 పేతురు 1:5, 6) అయితే కచ్చితంగా ఈ సహనమంటే ఏమిటి?

సహనం—దాని భావమేమిటి

3, 4. సహించుట అంటే దానిభావమేమి?

3 సహించడమంటే ఏమిటి? “సహనం” అనేదానికి ఉపయోగింపబడిన గ్రీకు పదానికి (హైపొమెనొ) అక్షరార్థంగా “నిలుచుట లేదా ఓర్చుకొనుట” అని భావము. బైబిల్లో ఈ పదం 17 సార్లు వస్తుంది. నైఘంటికులైన డబ్ల్యు. బాయెర్‌, ఎఫ్‌. డబ్ల్యు. గింగ్‌రిచ్‌, ఎఫ్‌. డేంకర్‌ చెప్పిన ప్రకారం, దానికి “పారిపోకుండా నిలిచియుండుట . . . , స్థిరంగా నిలబడుట, గట్టిగా హత్తుకొనుట” అని భావము. “సహనం” అనే మాటకు ఉపయోగింపబడిన గ్రీకు నామవాచకం (హెపొమోనె) బైబిల్లో 30 సార్లు వస్తుంది. దీన్నిగూర్చి విలియమ్‌ బార్‌క్లే వ్రాసిన ఎ న్యూ టెస్ట్‌మెంట్‌ వర్డ్‌బుక్‌ యిలా చెబుతున్నది: “పోనీ వదిలేద్దాంలే అనికాకుండ గట్టి నిరీక్షణతో సమస్తాన్ని భరించే స్ఫూర్తిని ఇది కలిగియుంది . . . ఇది ఒక వ్యక్తి తన పాదాలు కదలకుండా గాలికి ఎదురుగా నిలబడేట్లు చేస్తుంది. కలిగే ఏ నొప్పిని లెక్కచేయక గమ్యాన్నే చూస్తుంది గనుక, అది అత్యంత కఠినమైన పరీక్షను సహితం ఒక మహిమగా మార్చగల సద్గుణమైయుంది.”

4 కాబట్టి, ఎన్ని అడ్డంకులు, కష్టాలున్ననూ సహనం మనం నిరీక్షణ పోగొట్టుకొనకుండా స్థిరంగా నిలబడేటట్లు చేస్తుంది. (రోమీయులు 5:3-5) అది ప్రస్తుతం కలిగే నొప్పిని కాదుగాని, గమ్యాన్ని అనగా పరలోకమందేగాని భూమియందేగాని నిత్యజీవమనే ఆ బహుమతిని లేదా వరాన్నే చూస్తుంది.—యాకోబు 1:12.

సహనం—ఎందుకు?

5. (ఎ) క్రైస్తవులందరికి ఎందుకు “ఓరిమి అవసరమై యున్నది”? (బి) మన శ్రమల్ని ఏ రెండు వర్గాలుగా విభజించవచ్చును?

5 క్రైస్తవులుగా మనందరికి “ఓరిమి అవసరమై యున్నది.” (హెబ్రీయులు 10:36) ఎందుకు? ఎందుకంటే మనం ‘నానా విధములైన శ్రమలను’ ఎదుర్కొంటాము. ఒక వ్యక్తికి బందిపోటు దొంగ ఎదురైనట్లుగా, అనుకోని లేదా ఊహించని సంఘటన ఎదురగునని యాకోబు 1:2 నందలి గ్రీకు పదం సూచిస్తున్నది. (లూకా 10:30 పోల్చండి.) మనమెదుర్కొనే శ్రమల్ని, వారసత్వంగా పొందిన పాపం ఫలితంగా మనుష్యులందరికి కలిగేవని, మన దైవభక్తి కారణంగా ఉత్పన్నమయ్యేవనే రెండు వర్గాలుగా విభజించవచ్చును. (1 కొరింథీయులు 10:13; 2 తిమోతి 3:12) ఈ శ్రమల్లో కొన్ని ఏమిటి?

6. బహు వేదనగల అస్వస్థత నెదుర్కొన్నప్పుడు ఒక సాక్షి ఎలా దానిని సహించాడు?

6 తీవ్ర అస్వస్థతలు. తిమోతివలె కొందరు క్రైస్తవులు “తరచుగా వచ్చు బలహీనతలను” భరించాల్సి ఉంటుంది. (1 తిమోతి 5:23) ప్రత్యేకంగా తీవ్రమైన, బహుశ బహు బాధాపూరితమైన అస్వస్థతకు గురైనప్పుడు దేవుని సహాయంతో, మన క్రైస్తవ నిరీక్షణా దృష్టిని కోల్పోకుండా మనం సహనం చూపాలి, స్థిరంగా నిలబడాలి. కడుపులో వేగంగా పెరుగుతున్న ప్రమాదకరమైన కణితితో దీర్ఘకాలం గట్టిగా పోరాడిన 50 సంవత్సరాలు పైబడిన ఒక సాక్షి ఉదాహరణే తీసుకోండి. రెండు శస్త్రచికిత్సల్లోను రక్తమార్పిడికి అంగీకరించకుండా ఆయన స్థిరంగా ఉన్నాడు. (అపొస్తలుల కార్యములు 15:28, 29) అయితే కడుపులో ఆ కణితి మరలా కనబడి ఆయన వెన్నుపూస వరకు పెరగనారంభించింది. దానితో ఏ మందు దానిని తగ్గించలేనంత భరింపరాని నొప్పిని ఆయన అనుభవించాడు. అయిననూ, అనుభవించే నొప్పికంటే నూతన లోకంలోని జీవ బహుమానంపై ఆయన ఎక్కువగా దృష్టినిల్పాడు. తనకున్న తేజోవంతమైన నిరీక్షణను వైద్యులతో, నర్సులతో, తన్ను సందర్శించవచ్చిన వారితో పంచుకోసాగాడు. అంతము వరకు—తన జీవితపు చివరి క్షణంవరకు ఆయన సహించాడు. మీకున్న ఆరోగ్య సమస్య మన ఆ ప్రియసహోదరుని పోలి ప్రాణభయం కల్గించేది లేదా బహు బాధాకరమైనది కాకపోయినను, అది సహనాన్ని తీవ్రంగా పరీక్షించేదై యుండవచ్చు.

7. మన ఆత్మీయ సహోదర, సహోదరీలలో కొంతమందికి సహనంలో ఏ విధమైన వేదన ఇమిడివుంటుంది?

7 భావావేశపు వేదన. ఆయాసమయాల్లో, యెహోవా ప్రజల్లో కొందరు ‘ఆత్మ నలిగిపోవునట్లు’ చేయు “మనో దుఃఖము” నెదుర్కొందురు. (సామెతలు 15:13) ఈ ‘అపాయకరమైన కాలాల్లో’ తీవ్ర వ్యాకులత అసాధారణమేమీ కాదు. (2 తిమోతి 3:1) డిశంబరు 5, 1992 సైన్స్‌ న్యూస్‌ యిలా రిపోర్టు చేస్తున్నది: “తరచు అత్యంత బలహీనపరచే వ్యాకులత స్థాయి, 1915 నుండి జన్మిస్తున్న ప్రతి తరమువారిలో పెరుగుతున్నది.” శారీరక కారణాలవల్ల, మిక్కిలి బాధపెట్టే ఇతర కారణాలవల్ల అట్టి వ్యాకులత కలుగుచున్నది. భావావేశపు వేదనను ఎదుర్కొనుటలో స్థిరంగా నిలబడుట కొంతమంది క్రైస్తవులకు ప్రతిదిన పోరాటమైయుంది. అయినను, వారా పోరాటాన్ని వదిలివేయడం లేదు. కన్నీళ్లున్ననూ వారు యెహోవా యెడల నమ్మకంగా ఉంటున్నారు.—కీర్తన 126:5, 6 పోల్చండి.

8. మనమెలాంటి ఆర్థిక శ్రమ నెదుర్కోవచ్చును?

8 మనమెదుర్కొనే వివిధ శ్రమల్లో గంభీరమైన ఆర్థిక ఇబ్బంది కూడ ఇమిడియుండవచ్చు. అమెరికా, న్యూజెర్సీలో ఒక సహోదరుడు అకస్మికంగా నిరుద్యోగయ్యాడు, కాబట్టి ఆయన సహజంగానే తన ఇంటినిగూర్చి, కుటుంబాన్ని పోషించడాన్ని గూర్చి చింతించాడు. అయితే ఆయన తన రాజ్య నిరీక్షణ విషయమై పరధ్యాసలో పడిపోలేదు. మరో ఉదోగ్యంకొరకు వెదకుచునే, తనకున్న అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటూ సహాయ పయినీర్‌ సేవ చేపట్టాడు. చివరకు ఆయనకొక ఉద్యోగం లభించింది.—మత్తయి 6:25-34.

9. (ఎ) ప్రియమైన వారు మరణించినప్పుడు సహనం ఎందుకు అవసరం కావచ్చును? (బి) దుఃఖంతో కన్నీళ్లు విడుచుట తప్పుకాదని ఏ లేఖనం చూపుతున్నది?

9 మీకు ప్రియమైన వారెవరైనా మరణిస్తే, మీ చుట్టూవున్న వారు మామూలు స్థితికి చేరుకొన్ననూ ఆ పిదప చాలాకాలం వరకు మీకు సహనం అవసరం. ప్రతి సంవత్సరం మీరు ప్రేమించిన ఆ వ్యక్తి చనిపోయిన రోజు వచ్చేటప్పటికి అది మీకు చాలా కష్టంగా ఉండవచ్చు. అట్టి నష్టాన్ని సహించుట అంటే దుఃఖంతో కన్నీళ్లు విడుచుట తప్పని దానర్థం కాదు. మనం ప్రేమించిన వ్యక్తి ఎవరైనా మరణిస్తే దుఃఖించడం సహజం, కాబట్టి ఇది పునరుత్థాన నిరీక్షణయందు విశ్వాసం లేకపోవడాన్ని ఎంతమాత్రం సూచించదు. (ఆదికాండము 23:2; హెబ్రీయులు 11:19 పోల్చండి.) మార్తతో “నీ సహోదరుడు మరలా లేచునని” నమ్మకంగా చెప్పిననూ, లాజరు మరణించినప్పుడు యేసు “కన్నీళ్లు విడిచెను.” అటుతరువాత లాజరు నిజంగానే లేచాడు.—యోహాను 11:23, 32-35, 41-44.

10. సహించాల్సిన విశేష అవసరత యెహోవా ప్రజలకు ఎందుకుంది?

10 మనుష్యులకు సాధారణంగా కలిగే శ్రమలను సహించుటకు తోడుగా, యెహోవా ప్రజలు సహించాల్సిన మరో ప్రత్యేక అవసరతవుంది. “జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు” అని యేసు హెచ్చరించాడు. (మత్తయి 24:9) ఆయనింకను యిలా చెప్పాడు: “లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు.” (యోహాను 15:20) ఎందుకా ద్వేషం మరియు హింస? ఎందుకంటె దేవుని సేవకులుగా మనమీ భూమిపై ఎక్కడ నివసించిననూ, యెహోవా యెడల మన యథార్థతను పాడుచేయుటకు సాతాను ప్రయత్నిస్తాడు. (1 పేతురు 5:8; ప్రకటన 12:17 పోల్చండి.) దీనికిగాను సాతాను మన సహనాన్ని తీవ్రమైన శ్రమకు గురిచేస్తూ తరచు హింసాగ్నిని ప్రజ్వరిల్లజేస్తున్నాడు.

11, 12. (ఎ) యెహోవాసాక్షులు, వారి పిల్లలు 1930 దశాబ్దంలో మరియు 1940 దశాబ్దపు ప్రథమార్థంలో సహనం విషయంలో ఎలాంటి పరీక్షనెదుర్కొన్నారు? (బి) జాతీయ చిహ్నానికి యెహోవాసాక్షులు ఎందుకు వందనం చేయరు?

11 ఉదాహరణకు, 1930 దశాబ్దం మరియు 1940 దశాబ్దపు ప్రథమార్థంలో అమెరికా, కెనడాలలోని యెహోవాసాక్షుల పిల్లలు తమ మనస్సాక్షినిబట్టి జాతీయ చిహ్నానికి వందనం చేయనందున హింసకు గురయ్యారు. యెహోవాసాక్షులు తాము నివసించే దేశపు చిహ్నాన్ని గౌరవిస్తారు, అయితే “పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను” అని నిర్గమకాండము 20:4, 5 నందు దేవుని ధర్మశాస్త్రము చెప్పిన నియమానికి కట్టుబడియుంటారు. యెహోవా దేవునికి మాత్రమే తమ ఆరాధన చెల్లించాలని కోరినందున, పాఠశాలల్లోని యెహోవాసాక్షుల పిల్లలు వెళ్లగొట్టబడినప్పుడు, వారి బోధన కొరకు యెహోవాసాక్షులు రాజ్య పాఠశాలలను నెలకొల్పారు. నేడు ఈ విషయ పరిజ్ఞానం కలిగిన దేశాలు చేసినట్లే, అమెరికా సుప్రీంకోర్టు వారి మత స్థానాన్ని గుర్తించినప్పుడు ఆ విద్యార్థులు తిరిగి పాఠశాలల్లో చేరారు. అయితే, ధైర్యంతోకూడిన ఈ యౌవనుల సహనం, ప్రత్యేకంగా బైబిలు నియమాల్నిబట్టి జీవించుటకు ప్రయత్నిస్తున్నందున అపహాస్యాన్ని ఎదుర్కొనే క్రైస్తవ యౌవనులకు ఒక ఉత్తేజకరమైన మాదిరిగా పనిచేస్తుంది.—1 యోహాను 5:21.

12 మనమెదుర్కొనే వివిధ శ్రమలు అనగా సాధారణంగా మనుష్యులు ఎదుర్కొనే శ్రమలు, మన క్రైస్తవ విశ్వాసాన్నిబట్టి ఎదుర్కొనే శ్రమలు మనకెందుకు సహనం అవసరమో సూచిస్తున్నాయి. అయితే మనమెలా సహించగలము?

అంతము వరకు సహించుట—ఎట్లు?

13. యెహోవా ఎలా సహనాన్ని సమకూర్చును?

13 యెహోవాను ఆరాధించని ప్రజలకంటే దేవుని ప్రజలు నిశ్చయముగా మరెంతో ప్రయోజనాన్ని కలిగివున్నారు. సహాయం కొరకు మనం ‘ఓర్పునకు . . . కర్తయగు దేవునికి’ మనం విన్నపం చేయగలము. (రోమీయులు 15:5) అయితే యెహోవా ఈ సహనాన్ని ఎలా అందించును? తనవాక్యమగు బైబిలునందు వ్రాయబడినట్లు సహనం చూపిన వారి మాదిరుల ద్వారా ఆయనలా చేస్తాడనేది ఒక మార్గం. (రోమీయులు 15:4) వీటిని మనం తలపోస్తుండగా, సహించుటకు మనం ప్రోత్సహింపబడుటే గాకుండ, ఎలా సహించాలో కూడ మనం ఎక్కువగా నేర్చుకుంటాము. అసాధారణమైన రెండు ఉదాహరణలను అనగా ధైర్యంతో సహనాన్ని ప్రదర్శించిన యోబు, నిర్దోషమైన సహనాన్ని కనబరచిన యేసుక్రీస్తు ఉదాహరణలను ఆలోచించండి.—హెబ్రీయులు 12:1-3; యాకోబు 5:11.

14, 15. (ఎ) యోబు ఎట్టి శ్రమలను సహించాడు? (బి) తానెదుర్కొన్న శ్రమల్ని యోబు ఎలా సహించగల్గాడు?

14 ఎలాంటి పరిస్థితులు యోబు సహనాన్ని పరీక్షించాయి? తన ఆస్తిలో అధికభాగం కోల్పోవుటతో ఆయన ఆర్థికంగా ఎంతో కష్టం అనుభవించాడు. (యోబు 1:14-17; మరియు యోబు 1:3 పోల్చండి.) తన పదిమంది పిల్లలు సుడిగాలి వాతపడి మరణించినప్పుడు యోబు ఎంతో బాధననుభవించాడు. (యోబు 1:18-21) ఆయనెంతో తీవ్రమైన, బహు వేదనకరమైన అస్వస్థతను అనుభవించాడు. (యోబు 2:7, 8; 7:4, 5) ఆయన భార్యే దేవునినుండి వైదొలగుమని వత్తిడిచేసింది. (యోబు 2:9) సన్నిహిత స్నేహితులు గాయపర్చే, నిర్దయగల, అసత్యపు మాటలు మాట్లాడారు. (యోబు 16:1-3; మరియు యోబు 42:7 పోల్చండి.) అయితే ఇంత జరిగినను, యోబు స్థిరంగా నిలబడి తన యథార్థతను కాపాడుకున్నాడు. (యోబు 27:5) నేడు యెహోవా ప్రజలు ఎదుర్కొంటున్న శ్రమలవంటి వాటినే యోబు ఎదుర్కొన్నాడు.

15 ఆ శ్రమలన్నింటిని యోబు ఎలా ఎదుర్కోగల్గాడు? ప్రత్యేకంగా ఆయనకున్న నిరీక్షణే యోబును బలపరచింది. “వృక్షము నరకబడినయెడల అది తిరిగి చిగుర్చుననియు, దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు” అని ఆయన ప్రకటించాడు. (యోబు 14:7) యోబుకున్న నిరీక్షణ ఏమిటి? ఆ తర్వాతగల కొన్నివచనాల్లో వ్రాయబడినట్లుగా, ఆయనిట్లన్నాడు: “మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? . . . నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను. నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును.” (యోబు 14:14, 15) ఔను, యోబు తనకుండిన ప్రస్తుత బాధకంటే మరెంతో ముందున్న దానిని చూశాడు. తన శ్రమలు శాశ్వతకాలం ఉండవని ఆయనకు తెలుసు. అవి ఎంత తీవ్రంగావున్నా ఆయన వాటిని మరణం వరకు మాత్రమే సహించాలి. చనిపోయిన వారిని పునరుత్థానం చేయాలని ప్రేమతో కోరే యెహోవా తనను మరలా జీవానికి తెస్తాడనే నిరీక్షణతో ఆయన ఎదురుచూశాడు.—అపొస్తలుల కార్యములు 24:15.

16. (ఎ) యోబు మాదిరినుండి సహనాన్ని గూర్చి మనమే పాఠం నేర్చుకుంటున్నాము? (బి) రాజ్య నిరీక్షణ మనకెంత వాస్తవంగా ఉండాలి, ఎందుకు?

16 యోబు సహనం నుండి మనమేం నేర్చుకొందుము? తుదివరకు సహించాలంటే, మన నిరీక్షణా దృష్టిని మనమెన్నటికి కోల్పోకూడదు. అంతేకాకుండ, నిశ్చయమైన రాజ్య నిరీక్షణ అంటే మనమెదుర్కొనే ఎటువంటి బాధయైననూ ఇంచుమించు ‘క్షణమాత్రమేనని’ కూడ దాని భావమని గుర్తుంచుకోండి. (2 కొరింథీయులు 4:16-18) “ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను” ఇక ఉండవని యెహోవా వాగ్దానం చేసిన సమీప భవిష్యత్తుపై మన అమూల్యమైన నిరీక్షణ గట్టిగా ఆధారపడివుంది. (ప్రకటన 21:3, 4) “మనలను సిగ్గుపరచని” ఆ నిరీక్షణ మన తలంపులను సంరక్షించాలి. (రోమీయులు 5:4, 5; 1 థెస్సలొనీకయులు 5:8) అది మనకు నిజమైనదిగా ఉండాలి, అదెంత నిజమైనదిగా ఉంటుందంటే, మనం విశ్వాసమనే నేత్రాల ద్వారా నూతనలోకంలో మనల్నిమనం దృశ్యీకరించుకొని యిలా చూడగల్గుతాము—పోరాడాల్సిన అస్వస్థత, వ్యాకులత లేకుండా ప్రతిదినం మంచి ఆరోగ్యంతో నిర్మలమైన మనస్సుతో చలించగలము; గంభీరమైన ఆర్థిక వత్తిడులనుబట్టి ఏమాత్రం ఇబ్బంది పడకుండా క్షేమంగా జీవిస్తాము; ప్రియమగువారి మరణాన్నిబట్టి దుఃఖపడుటకు బదులు వారు పునరుత్థానమై రావడాన్నిచూసి పులకించిపోతాము. (హెబ్రీయులు 11:1) అట్టి నిరీక్షణ లేకుంటే మనమెంతో తల్లడిల్లి మనకు కలిగే ప్రస్తుత శ్రమలకు లొంగిపోగలము. మన నిరీక్షణనుబట్టి తుదివరకు సహించునట్లు ఎడతెగక పోరాటం సల్పుటకు మనకెంత గొప్ప ప్రోత్సాహం లభిస్తున్నది!

17. (ఎ) యేసు ఎలాంటి శ్రమలు సహించాడు? (బి) యేసు సహించినది అత్యంత కష్టమైన హింసని ఏ వాస్తవిక విషయాన్నిబట్టి చూడవచ్చును? (అథఃస్సూచి చూడండి.)

17 యేసువైపు “చూచుచు” ఆయనను ‘అత్యంత సన్నిహితంగా తలంచుకొనుడని’ బైబిలు మనకు ఉద్బోధిస్తున్నది. ఆయనెటువంటి శ్రమల్ని సహించాడు? వాటిలో కొన్ని ఇతరుల పాపం మరియు అసంపూర్ణత కారణంగా కలిగాయి. యేసు ‘పాపులు భిన్నంగా మాట్లాడటాన్నే’ కాదు తమలో గొప్ప ఎవరనే విషయమై చాలాసార్లు తగాదాపడటంతో సహా, తన శిష్యుల మధ్య చెలరేగిన అనేక సమస్యల్ని సహితం ఆయన సహించాడు. అంతకంటే ఎక్కువగా, ఆయన అసమానమైన విశ్వాస పరీక్ష నెదుర్కొన్నాడు. ‘ఆయన సిలువను సహించాడు.’ (హెబ్రీయులు 12:1-3; లూకా 9:46; 22:24) వ్రేలాడదీయబడి, దైవదూషకుడని అవమానకరంగా మరణశిక్ష ననుభవించే వేదనలో చేరియున్న మానసిక, శారీరక బాధ ఊహించడమే కష్టం.a

18. అపొస్తలుడైన పౌలు చెప్పిన ప్రకారం, ఏ రెండు సంగతులు యేసును బలపర్చాయి?

18 అంతం వరకు సహించులాగున యేసును ఏది బలపర్చింది? యేసును బలపరచిన, ‘ప్రార్థనలు, యాచనలు’ ఆలాగే “తనయెదుట ఉంచబడిన ఆనందము” అనే రెండు సంగతులను అపొస్తలుడైన పౌలు ప్రస్తావిస్తున్నాడు. దేవుని పరిపూర్ణ కుమారుడైన యేసు సహాయం కొరకు అర్థించడానికి సిగ్గుపడలేదు. ఆయన “మహా రోదనముతోను కన్నీళ్లతోను” ప్రార్థించాడు. (హెబ్రీయులు 5:7; 12:2) ప్రత్యేకంగా మహాగొప్ప శ్రమ తనకు సమీపిస్తుండగా బలంకొరకు విడువక, యథార్థంగా ప్రార్థించే అవసరతను ఆయన గ్రహించాడు. (లూకా 22:39-44) యేసు విజ్ఞాపనలకు ప్రత్యుత్తరంగా, యెహోవా ఆయనకు కలిగిన శ్రమను తీసివేయలేదు, అయితే యేసు దానిని సహించడానికి కావల్సిన బలాన్ని సమకూర్చాడు. అంతేకాకుండ, హింసాకొయ్యకంటే మిన్నగా తనకివ్వబడే బహుమతిని అనగా యెహోవా నామాన్ని పరిశుద్ధపరచడానికి దోహదపడటంలో, మరణాన్నుండి మానవ కుటుంబాన్ని విమోచించడంలో తనకు కలిగే ఆనందాన్ని యేసు దృష్టించాడు.—మత్తయి 6:9; 20:28.

19, 20. సహనమందు ఇమిడియున్న దానియెడల వాస్తవిక దృష్టి కలిగియుండుటకు యేసు మాదిరి మనకెలా సహాయం చేస్తుంది?

19 యేసు మాదిరినుండి, సహనమందు ఇమిడియున్న దానియెడల వాస్తవిక దృష్టి కలిగియుండటానికి మనకు సహాయపడు అనేక సంగతులను మనం నేర్చుకుంటాము. సహన మార్గం అంత సులభమైనదేం కాదు. ఒకానొక శ్రమ సహించడానికి కష్టంగా ఉన్నట్లు మనకుతోస్తే, యేసు విషయంలోకూడ అది నిజమైయుండెనని తెలిసికొనుటలో ఓదార్పు కలదు. అంతము వరకు సహించుటకు, బలమిమ్మని మనం పదేపదే ప్రార్థించాలి. శ్రమ ననుభవించేటప్పుడు ప్రార్థించడం అనుచితమని మనం కొన్నిసార్లు భావించవచ్చు. అయితే యెహోవా తనయెదుట మన హృదయాల్ని కుమ్మరించుడని ఆహ్వానిస్తున్నాడు ‘ఎందుకంటే ఆయన మనల్నిగూర్చి చింతిస్తున్నాడు.’ (1 పేతురు 5:7) ఆలాగే యెహోవా తన వాక్యమందు వాగ్దానం చేసాడు గనుక, విశ్వాసంతో తనను ప్రార్థించేవారికి ‘అసాధారణ శక్తినిచ్చే’ బాధ్యత ఆయన తీసుకున్నాడు.—2 కొరింథీయులు 4:7-9 NW.

20 కొన్నిసార్లు మనం కన్నీళ్లతో సహించాల్సి ఉంటుంది. హింసాకొయ్యపై కలిగిన వేదన యేసు ఆనందానికి కారణం కాదు. బదులుగా, అది ఆయన యెదుట ఉంచబడిన బహుమానాన్ని గూర్చిన ఆనందమైయుండెను. శ్రమలు అనుభవించేటప్పుడు మనమన్ని సమయాల్లో సంతోషంతో ఉప్పొంగిపోతామని ఎదురుచూడ్డం వాస్తవికమై ఉండదు. (హెబ్రీయులు 12:11 పోల్చండి.) అయితే మనకు లభించబోయే బహుమతిని చూడటంద్వారా, అత్యంత కష్టభరితమైన పరిస్థితి ఎదురైనను “అది మహానందమని” యెంచుకొనగలవారమై యుండవచ్చును. (యాకోబు 1:2-4; అపొస్తలుల కార్యములు 5:41) కన్నీళ్లతో దానిని భరించాల్సి వచ్చిననూ మనం స్థిరంగా నిలిచియుండుట ప్రాముఖ్యము. ‘అతితక్కువ కన్నీళ్లు కార్చు వారు రక్షింపబడుదురని కాదుగాని,’ “అంతమువరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును” అని యేసు చెప్పెను.—మత్తయి 24:13.

21. (ఎ) రెండవ పేతురు 1:5, 6 నందు సహనానికి దేనిని అమర్చవలెనని మనం ఉద్బోధించబడ్డాము? (బి) తర్వాతి శీర్షికలో ఏ ప్రశ్నలు చర్చించబడతాయి?

21 కాబట్టి రక్షణకు సహనం చూపుట ఆవశ్యకము. అయితే, 2 పేతురు 1:5, 6లో మనం మన సహనానికి దైవభక్తిని అమర్చుకొనవలెనని ఉద్బోధించబడ్డాము. మరి దైవభక్తి అంటే ఏమిటి? సహనానికి దానికి ఏమి సంబంధం, దానిని మీరెలా పొందగలరు? తర్వాతి శీర్షిక ఈ ప్రశ్నల్ని చర్చిస్తుంది.

[అధస్సూచీలు]

a యేసు సహించిన ఆ భయంకరమైన వేదనను, మ్రానుపై వ్రేలాడదీయబడిన కొద్దిగంటల్లోనే ఆయన పరిపూర్ణ జీవకణ సముదాయము నిర్జీవమైపోవడమందు గమనించవచ్చును. అయితే ఆయనతో వ్రేలాడదీయబడిన నేరస్థులు మరణించేలా చేయడానికి వారి కాళ్లను విరగగొట్టాల్సి వచ్చింది. (యోహాను 19:31-33) తన హింసాకొయ్యను స్వయంగా మోయలేనంతగా బలహీనపడునట్లు, వ్రేలాడదీయబడటానికి ముందురాత్రి నిద్రలేకుండా యేసు అనుభవించిన మానసిక, శారీరక హింసను వారు అనుభవించలేదు.—మార్కు 15:15, 21.

మీరెలా జవాబిస్తారు?

◻ సహించుట అంటే అర్థమేమి?

◻ సహించాల్సిన ఉన్నతమైన అవసరత యెహోవా ప్రజలకు ఎందుకుంది?

◻ సహించుటకు యోబునేది బలపర్చింది?

◻ సహనం విషయంలో వాస్తవిక దృష్టి కలిగియుండుటకు యేసు మాదిరి మనకెలా సహాయం చేస్తుంది?

[10వ పేజీలోని చిత్రం]

యెహోవాకు మాత్రమే తమ ఆరాధన చెల్లించినందున పాఠశాలనుండి బహిష్కరింపబడిన క్రైస్తవ పిల్లలకు బోధించుటకు రాజ్య పాఠశాలలు నెలకొల్పబడ్డాయి

[12వ పేజీలోని చిత్రం]

తన తండ్రిని ఘనపర్చవలెనని తీర్మానించుకొన్నవాడై, యేసు సహించుటకు కావల్సిన బలం కొరకు ప్రార్థించాడు

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి