17వ అధ్యాయం
యెహోవా సంస్థను అంటిపెట్టుకుని ఉండండి
శిష్యుడైన యాకోబు ఇలా రాశాడు: “దేవునికి దగ్గరవ్వండి, అప్పుడు ఆయన మీకు దగ్గరౌతాడు.” (యాకో. 4:8) అవును, మనం అపరిపూర్ణులమైనప్పటికీ, యెహోవా మన ప్రార్థనల్ని వినలేనంత ఎత్తులో లేదా దూరంలో లేడు. (అపొ. 17:27) మనం దేవునికి ఎలా దగ్గరవ్వవచ్చు? యెహోవా ముందు మన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థిస్తూ ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోవడం ద్వారా మనం దగ్గరవ్వవచ్చు. (కీర్త. 39:12) తన వాక్యమైన బైబిల్ని క్రమంగా అధ్యయనం చేయడం ద్వారా కూడా మనం ఆయనకు సన్నిహితం అవ్వవచ్చు. అలా చేయడం ద్వారా, మనం యెహోవా దేవున్ని, ఆయన సంకల్పాల్ని, మన విషయంలో ఆయన ఇష్టాన్ని తెలుసుకుంటాం. (2 తిమో. 3:16, 17) ఆ విధంగా, దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుంటాం, ఆయన్ని బాధపెట్టకూడదనే భక్తిపూర్వక భయాన్ని పెంపొందించుకుంటాం.—కీర్త. 25:14.
2 అయితే, తన కుమారుడైన యేసు ద్వారా మాత్రమే మనం యెహోవాకు దగ్గరవ్వగలం. (యోహా. 17:3; రోమా. 5:10) యెహోవా మనసు గురించి యేసుకన్నా బాగా ఎవ్వరూ తెలియజేయలేరు. యేసుకు తన తండ్రితో దగ్గరి సంబంధం ఉండబట్టే ఇలా అనగలిగాడు: “కుమారుడు ఎవరో తండ్రికి తప్ప ఎవరికీ తెలీదు. అలాగే తండ్రి ఎవరో కుమారుడికీ, ఆ కుమారుడు తండ్రిని ఎవరికి బయల్పర్చడానికి ఇష్టపడతాడో వాళ్లకూ తప్ప ఇంకెవరికీ తెలీదు.” (లూకా 10:22) కాబట్టి యేసు ఆలోచనల్ని, భావాల్ని తెలుసుకోవడానికి సువార్త పుస్తకాల్ని అధ్యయనం చేస్తున్నప్పుడు, ఒక విధంగా, మనం యెహోవా ఆలోచనల్ని, భావాల్ని తెలుసుకుంటున్నట్టే. ఆ జ్ఞానం వల్ల మనం యెహోవాకు ఇంకా దగ్గరౌతాం.
3 తన కుమారుని శిరస్సత్వం కింద, తన ఇష్టం చేయడాన్ని నేర్పిస్తున్న దృశ్య సంస్థను అంటిపెట్టుకుని ఉండడం ద్వారా మనం యెహోవాకు దగ్గరౌతాం. మత్తయి 24:45-47 లో ముందే చెప్పినట్లు, విశ్వాస గృహంలోని వాళ్ల కోసం యజమానియైన యేసుక్రీస్తు ‘తగిన సమయంలో ఆహారం పెట్టేలా నమ్మకమైన, బుద్ధిగల దాసుణ్ణి’ నియమించాడు. నేడు ఆ నమ్మకమైన దాసుడు, మనకు సమృద్ధిగా ఆధ్యాత్మిక ఆహారాన్ని అందిస్తున్నాడు. యెహోవా ఈ దాసుని ద్వారా, రోజూ బైబిలు చదవమని, క్రమంగా క్రైస్తవ కూటాలకు హాజరవ్వమని, “రాజ్య సువార్త” ప్రకటించడంలో ఉత్సాహంగా పాల్గొనమని మనకు ఉపదేశిస్తున్నాడు. (మత్త. 24:14; 28:19, 20; యెహో. 1:8; కీర్త. 1:1-3) నమ్మకమైన దాసుడు అపరిపూర్ణుడు అయినప్పటికీ, ఆ దాసుణ్ణి దేవుడు నిర్దేశిస్తున్నాడని మనకు తెలుసు. మనం యెహోవా దృశ్య సంస్థను అంటిపెట్టుకుని ఉంటూ, దాని నిర్దేశాన్ని పాటించడానికి కృషి చేయాలి. అలా చేస్తే మనం యెహోవా దేవునికి దగ్గరౌతాం, కష్టాలు వచ్చినా బలంగా, సురక్షితంగా ఉండగలుగుతాం.
కష్టాలు ఎందుకు ఎక్కువౌతున్నాయి?
4 బహుశా మీరు చాలా సంవత్సరాల నుండి సత్యంలో ఉండి ఉంటారు. కాబట్టి, మీ యథార్థతకు ఎదురయ్యే పరీక్షల్ని సహించడం అంటే ఏమిటో మీకు ఖచ్చితంగా తెలిసేవుంటుంది. ఒకవేళ మీరు ఈ మధ్యే యెహోవాను తెలుసుకుని, ఆయన ప్రజలతో సహవసిస్తుంటే, యెహోవా సర్వాధిపత్యానికి లోబడే ప్రతీఒక్కరిని సాతాను వ్యతిరేకిస్తాడని మీకు తెలుసు. (2 తిమో. 3:12) కాబట్టి, మీరు ఎన్నో కష్టాల్ని సహించినా లేదా కొన్నిటినే సహించినా, మీరు భయపడాల్సిన, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిమ్మల్ని కాపాడతానని, మీకు విడుదలను, శాశ్వత జీవాన్ని ఇస్తానని యెహోవా మాటిస్తున్నాడు.—హెబ్రీ. 13:5, 6; ప్రక. 2:10.
5 అయితే, సాతాను వ్యవస్థకు మిగిలివున్న ఈ రోజుల్లో మనం మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. 1914 లో దేవుని రాజ్యం స్థాపించబడినప్పటి నుండి సాతానుకు పరలోకంలో చోటు లేదు. అతను, అతని చెడ్డ దూతలు భూమ్మీదకు పడద్రోయబడ్డారు, అప్పటి నుండి వాళ్లు ఈ భూమికే పరిమితం చేయబడ్డారు. భూమ్మీద శ్రమలు ఎక్కువ అవ్వడం అలాగే యెహోవా సమర్పిత సేవకులకు హింసలు ఎక్కువ అవ్వడం సాతాను కోపానికి, అతడి చెడ్డ పరిపాలన ముగింపులో జీవిస్తున్నాం అనడానికి రుజువుగా ఉన్నాయి.—ప్రక. 12:1-12.
6 తన హీన స్థితిని బట్టి సాతాను కోపంతో రగిలిపోతున్నాడు. తనకు మిగిలివున్న సమయం కొంచెమే అని అతనికి తెలుసు. అందుకే, ప్రకటనా పనికి అడ్డుతగలాలని, యెహోవా సేవకుల ఐక్యతను పాడుచేయాలని అతను, అతని చెడ్డదూతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దానివల్ల మనం ఆధ్యాత్మిక యుద్ధ భూమిలో ఉన్నాం. దాన్ని బైబిలు ఇలా వర్ణిస్తుంది: “మనం పోరాడుతున్నది మనుషులతో కాదు; మనం ప్రభుత్వాలతో, అధికారాలతో, ఈ చీకటి ప్రపంచ పాలకులతో, అంటే పరలోకంలోని చెడ్డదూతల సైన్యంతో పోరాడుతున్నాం.” మనం యెహోవా పక్షాన విజయం సాధించాలంటే, మన పోరాటాన్ని ఆపకూడదు. అలాగే మన ఆధ్యాత్మిక కవచాన్ని వదిలిపెట్టకూడదు. “అపవాది పన్నాగాలకు పడిపోకుండా స్థిరంగా” నిలబడాలి. (ఎఫె. 6:10-17) అలా చేయాలంటే మనకు సహనం అవసరం.
సహనాన్ని అలవర్చుకోవడం
7 “కష్టాల్ని లేదా తీవ్రమైన సమస్యల్ని తట్టుకుని నిలబడే సామర్థ్యమే” సహనం. ఆధ్యాత్మిక భావంలో సహనం అంటే తీవ్రమైన కష్టాలు, వ్యతిరేకత, హింస ఎదురైనా లేదా మన యథార్థతను పాడుచేసే ప్రయత్నాలు జరిగినా, సరైనది చేయడానికి స్థిరంగా ఉండడాన్ని సూచిస్తుంది. క్రైస్తవ సహనాన్ని అలవర్చుకోవాలి; దానికి సమయం పడుతుంది. మనం ఆధ్యాత్మిక ప్రగతి సాధించేకొద్దీ, సహనం చూపించే సామర్థ్యం పెరుగుతుంది. మన క్రైస్తవ జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు మన విశ్వాసానికి ఎదురయ్యే చిన్నచిన్న పరీక్షల్ని సహిస్తే మనం బలంగా తయారౌతాం. అంతేకాదు, ముందుముందు తప్పకుండా వచ్చే మరింత తీవ్రమైన కష్టాల్ని కూడా సహించగలుగుతాం. (లూకా 16:10) విశ్వాసంలో స్థిరంగా నిలబడాలని నిశ్చయించుకోవడానికి పెద్దపెద్ద కష్టాలు వచ్చేంతవరకు మనం ఆగాలని చూడం. పరీక్షలు రాకముందే, మనం స్థిరమైన నిర్ణయాన్ని తీసుకోవాలి. ఇతర దైవిక లక్షణాలతో పాటు సహనాన్ని కూడా అలవర్చుకోవాలని చెప్తూ అపొస్తలుడైన పేతురు ఇలా రాశాడు: “మీరు శాయశక్తులా కృషిచేస్తూ మీ విశ్వాసానికి మంచితనాన్ని, మీ మంచితనానికి జ్ఞానాన్ని, మీ జ్ఞానానికి ఆత్మనిగ్రహాన్ని, మీ ఆత్మనిగ్రహానికి సహనాన్ని, మీ సహనానికి దైవభక్తిని, మీ దైవభక్తికి సహోదర అనురాగాన్ని, మీ సహోదర అనురాగానికి ప్రేమను జోడించండి.”—2 పేతు. 1:5-7; 1 తిమో. 6:11.
కష్టాల్ని ఎదుర్కొంటూ వాటిని అధిగమిస్తుండగా, రోజురోజుకీ మన సహనం బలపడుతుంది.
8 సహనాన్ని అలవర్చుకోవడంలో ఉన్న ప్రాముఖ్యతను మన దృష్టికి తీసుకొస్తూ, యాకోబు తన ఉత్తరంలో ఇలా రాశాడు: “నా సహోదరులారా, మీకు రకరకాల కష్టాలు ఎదురైనప్పుడు సంతోషించండి. ఎందుకంటే, ఈ విధంగా పరీక్షించబడిన మీ విశ్వాసం మీలో సహనాన్ని పుట్టిస్తుందని మీకు తెలుసు. అయితే సహనం తన పనిని పూర్తిచేయనివ్వండి. అప్పుడు మీరు అన్ని విషయాల్లో సంపూర్ణులుగా, నిర్దోషులుగా, దేనిలోనూ లోపంలేని వాళ్లుగా ఉండగలుగుతారు.” (యాకో. 1:2-4) కష్టాలు మనలో సహనాన్ని పుట్టిస్తాయి కాబట్టి క్రైస్తవులు కష్టాల్ని స్వాగతించాలని, వాటి విషయంలో సంతోషించాలని యాకోబు చెప్తున్నాడు. మీరెప్పుడైనా కష్టాల విషయంలో అలా ఆలోచించారా? మన క్రైస్తవ వ్యక్తిత్వాన్ని పరిపూర్ణం చేయడానికి, అలాగే దేవుడు మనల్ని అంగీకరించే విధంగా తయారుచేయడానికి సహనం తన పని చేసుకుంటూ పోతుందని యాకోబు చెప్పాడు. అవును, కష్టాల్ని ఎదుర్కొంటూ వాటిని అధిగమిస్తుండగా, రోజురోజుకీ మన సహనం బలపడుతుంది. ఆ సహనం, మనకు కావాల్సిన ఇతర మంచి లక్షణాల్ని పుట్టిస్తుంది.
9 మనం చూపించే సహనాన్ని బట్టి యెహోవా సంతోషిస్తాడు; మనకు శాశ్వత జీవం అనే బహుమతి ఇచ్చేలా అది ఆయన్ని కదిలిస్తుంది. యాకోబు ఇంకా ఇలా చెప్పాడు: “కష్టాన్ని సహిస్తూ ఉండే వ్యక్తి సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే అతను దేవుని ఆమోదం పొందిన తర్వాత అతనికి జీవకిరీటం ఇవ్వబడుతుంది. యెహోవా తనను ప్రేమిస్తూ ఉండేవాళ్లకు ఆ కిరీటం ఇస్తానని వాగ్దానం చేశాడు.” (యాకో. 1:12) అవును, మనం ఆ జీవాన్ని మనసులో ఉంచుకుని కష్టాల్ని సహిస్తాం. సహనం చూపించకపోతే మనం సత్యంలో నిలదొక్కుకోలేం. ఈ లోక ఒత్తిళ్లకు లొంగిపోతే, అవి మనల్ని తిరిగి లోకంలోకి లాగేస్తాయి. సహనం చూపించకపోతే, యెహోవా పవిత్రశక్తి మనపై ఇక పని చేయదు. అప్పుడు ఇక మనం పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్ని పెంపొందించుకోలేం.
10 ఈ కష్ట కాలాల్లో, మనం సహిస్తూనే ఉండాలంటే, క్రైస్తవులముగా కష్టాల విషయంలో సరైన వైఖరి అలవర్చుకోవాలి. యాకోబు ఏం రాశాడో మళ్లీ గుర్తుచేసుకోండి: “సంతోషించండి.” అది అంత సులభం కాదు, ఎందుకంటే ఆ కష్టాల్లో బాధలు, శారీరక లేదా మానసిక ఆందోళనలు ఉంటాయి. కానీ భవిష్యత్తు జీవితం ప్రమాదంలో ఉందని గుర్తుంచుకోండి. కష్టాలొచ్చినప్పుడు కూడా ఎలా సంతోషించవచ్చో అపొస్తలులకు ఎదురైన అనుభవం బట్టి తెలుస్తుంది. అపొస్తలుల కార్యాల పుస్తకంలో ఆ వృత్తాంతం ఉంది. అక్కడ ఇలా ఉంది: “వాళ్లు . . . అపొస్తలుల్ని పిలిపించి, వాళ్లను కొట్టించి, ఇకమీదట యేసు పేరున మాట్లాడవద్దని ఆజ్ఞాపించి వాళ్లను వదిలేశారు. వాళ్లు యేసు పేరు కోసం అవమానించబడే గొప్ప అవకాశం తమకు దక్కిందని సంతోషిస్తూ మహాసభ నుండి వెళ్లిపోయారు.” (అపొ. 5:40, 41) తాము యేసు ఆజ్ఞకు లోబడుతున్నాం అనడానికి, తమకు యెహోవా ఆమోదం ఉందనడానికి ఆ కష్టాలు రుజువని అపొస్తలులు అర్థం చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత, పేతురు తన మొదటి ప్రేరేపిత ఉత్తరం రాస్తూ, నీతి కోసం అలాంటి బాధలు అనుభవించడంలో ఉన్న విలువ గురించి మాట్లాడాడు.—1 పేతు. 4:12-16.
11 మరో అనుభవం పౌలు, సీలలది. ఫిలిప్పీలో మిషనరీ సేవ చేస్తున్నప్పుడు, వాళ్లు నగరంలో చాలా అలజడి రేపుతున్నారని, పాటించలేని ఆచారాల్ని బోధిస్తున్నారనే నింద మోపి, వాళ్లను బంధించారు. ఆ తర్వాత వాళ్లను బాగా కొట్టి, చెరసాలలో వేశారు. వాళ్లు గాయాలపాలై చెరసాలలో ఉండగా, “దాదాపు మధ్యరాత్రి సమయంలో పౌలు, సీల ప్రార్థిస్తూ పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఖైదీలు అది వింటున్నారు.” (అపొ. 16:16-25) క్రీస్తు కోసం తాము అనుభవిస్తున్న శ్రమల్ని పౌలు, సీల సరైన దృష్టితో చూశారు. ఆ శ్రమలు, తాము దేవునికి యథార్థంగా ఉన్నామనడానికి రుజువని మాత్రమే కాకుండా, అవి మంచివార్త వినడానికి ఇష్టపడే ప్రజలకు సాక్ష్యమిచ్చే అవకాశాలని వాళ్లు భావించారు. ఇతరుల జీవితాలు కూడా ముడిపడి ఉన్నాయి. ఆ రాత్రే చెరసాల అధికారి, అతని కుటుంబ సభ్యులు మంచివార్తను అంగీకరించి, శిష్యులయ్యారు. (అపొ. 16:26-34) పౌలు, సీలలు యెహోవా మీద నమ్మకం ఉంచారు. తమను కాపాడే శక్తి, కాపాడాలనే కోరిక ఆయనకు ఉన్నాయని వాళ్లు నమ్మారు. అందుకే వాళ్లు నిరుత్సాహపడలేదు.
12 నేడు కూడా, కష్టాల్ని సహించడానికి కావాల్సిన వాటన్నిటినీ యెహోవా మనకు ఇస్తున్నాడు. ఎందుకంటే, మనం కష్టాల్ని సహించాలని ఆయన కోరుకుంటున్నాడు. తన సంకల్పానికి సంబంధించిన ఖచ్చితమైన జ్ఞానంతో మనల్ని సంసిద్ధుల్ని చేయడానికి ఆయన తన వాక్యమైన బైబిల్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. అంతేకాదు, తోటి విశ్వాసులతో సహవసిస్తూ, యెహోవాకు పవిత్ర సేవచేసే అవకాశం మనకు ఉంది. ప్రార్థన ద్వారా యెహోవాతో దగ్గరి సంబంధాన్ని కాపాడుకునే అమూల్యమైన అవకాశం కూడా మనకు ఉంది. మన స్తుతుల్ని, యెహోవా ముందు మంచి స్థానాన్ని కాపాడుకోవడం కోసం మనం చేసే హృదయపూర్వక విన్నపాల్ని ఆయన వింటాడు. (ఫిలి. 4:13) వీటన్నిటితోపాటు, మన ముందున్న నిరీక్షణ గురించి ఆలోచించడం వల్ల మనం పొందే బలాన్ని తక్కువ అంచనా వేయకుండా ఉందాం.—మత్త. 24:13; హెబ్రీ. 6:18; ప్రక. 21:1-4.
వేర్వేరు కష్టాల్ని సహించడం
13 నేడు మనం ఎదుర్కొంటున్న కష్టాలు చాలావరకు, యేసుక్రీస్తు తొలి శిష్యులు ఎదుర్కొన్నలాంటివే. ఆధునిక కాలాల్లో, యెహోవాసాక్షుల్ని తప్పుగా అర్థం చేసుకున్న వ్యతిరేకులు వాళ్లను దూషిస్తున్నారు, హింసి స్తున్నారు. అపొస్తలుల కాలంలోలాగే నేడు కూడా, చాలావరకు మనం ఎదుర్కొంటున్న వ్యతిరేకతకు కారణం మతోన్మాదులే, వాళ్ల అబద్ధ బోధల్ని, ఆచారాల్ని దేవుని వాక్యం బట్టబయలు చేస్తుంది. (అపొ. 17:5-9, 13) కొన్నిసార్లు యెహోవా ప్రజలు, ప్రభుత్వం ఆమోదించిన చట్టపరమైన హక్కుల్ని ఉపయోగించుకొని ఆ వ్యతిరేకత నుండి ఉపశమనం పొందుతున్నారు. (అపొ. 22:25; 25:11) అయితే, పాలకులు మన పనిపై అధికారిక నిషేధాలు విధించి, మన క్రైస్తవ పరిచర్యను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. (కీర్త. 2:1-3) అలాంటి పరిస్థితుల్లో, “మేము లోబడాల్సిన పరిపాలకుడు దేవుడే కానీ మనుషులు కాదు” అని చెప్పిన నమ్మకమైన అపొస్తలుల ఆదర్శాన్ని మనం ధైర్యంగా పాటిస్తాం.—అపొ. 5:29.
14 భూవ్యాప్తంగా జాతీయతా భావాలు ఎక్కువౌతుండగా, మంచివార్త ప్రచారకులకు దేవుడు ఇచ్చిన పరిచర్యను ఆపేయాలనే ఒత్తిళ్లు తీవ్రతరం అవుతున్నాయి. అయితే “క్రూరమృగాన్ని, దాని ప్రతిమను” ఆరాధించడానికి సంబంధించి, ప్రకటన 14:9-12 లో ఉన్న హెచ్చరికను దేవుని సేవకులందరూ చాలా బాగా అర్థం చేసుకుంటారు. అంతేకాదు, యోహాను చెప్పిన ఈ మాటల ప్రాముఖ్యతను మనం గుర్తిస్తాం: “అందుకే పవిత్రులకు, అంటే దేవుని ఆజ్ఞలు పాటిస్తూ యేసు మీదున్న విశ్వాసానికి కట్టుబడి ఉండేవాళ్లకు సహనం అవసరం.”
15 యుద్ధాలు, తిరుగుబాట్లు లేదా హింస అలాగే అధికారిక నిషేధాలు వంటివాటి వల్ల మనం క్రైస్తవ ఆరాధనను బహిరంగంగా చేసుకోలేని పరిస్థితులు రావచ్చు. మీరు సంఘంగా సమకూడడం సాధ్యం కాకపోవచ్చు. బ్రాంచి కార్యాలయంతో ఎలాంటి సంప్రదింపులు జరపలేకపోవచ్చు. ప్రాంతీయ పర్యవేక్షకుల సందర్శనాలకు అంతరాయం ఏర్పడవచ్చు. ప్రచురణలు అందకపోవచ్చు. అలాంటి పరిస్థితులు ఏమైనా ఎదురైనప్పుడు, మీరేమి చేయాలి?
16 అలాంటి పరిస్థితుల్లో, మీరు ఏది చేయగలరో అది చేయండి, ఎంత చేయగలరో అంత చేయండి. బహుశా, వ్యక్తిగత అధ్యయనం చేసుకోవడం మీకు వీలవ్వవచ్చు. అలాగే, అధ్యయనం చేయడం కోసం సహోదరుల ఇళ్లల్లో చిన్నచిన్న గుంపులుగా కలుసుకోవడం వీలవ్వవచ్చు. గతంలో అధ్యయనం చేసిన ప్రచురణల్ని లేదా కేవలం బైబిల్నే ఉపయోగించి కూటాలు జరుపుకోవచ్చు. భయపడకండి, కంగారుపడకండి. అలాంటి పరిస్థితుల్లో, పరిపాలక సభ సాధారణంగా చాలా తక్కువ సమయంలోనే బాధ్యతగల సహోదరులకు నిర్దేశాలు అందేలా చూస్తుంది.
17 మీకు సహోదరులందరూ దూరంగా ఉన్నప్పటికీ యెహోవా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మాత్రం మీకు దూరంగా లేరని గుర్తుంచుకోండి. మీ నిరీక్షణను స్థిరంగా ఉంచుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా యెహోవా మీ ప్రార్థనల్ని వినగలడు, పవిత్రశక్తితో మిమ్మల్ని బలపర్చగలడు. కాబట్టి నడిపింపు కోసం ఆయనపై ఆధారపడండి. మీరు యెహోవా సేవకులని, యేసుక్రీస్తు శిష్యులని గుర్తుంచుకోండి. అందుకే సాక్ష్యమిచ్చే అవకాశాల్ని చక్కగా ఉపయోగించుకోండి. అప్పుడు, యెహోవా మీ ప్రయత్నాల్ని ఆశీర్వదించి, కొంతకాలానికి ఇతరులు మీతోపాటు సత్యారాధనలో భాగమయ్యేలా సహాయం చేస్తాడు.—అపొ. 4:13-31; 5:27-42; ఫిలి. 1:27-30; 4:6, 7; 2 తిమో. 4:16-18.
18 అయితే అపొస్తలుల్ని, ఇతరుల్ని బెదిరించినట్టే ఒకవేళ మిమ్మల్ని కూడా చంపేస్తామని బెదిరిస్తే, “చనిపోయినవాళ్లను బ్రతికించే దేవుని మీద నమ్మకం” పెట్టుకోండి. (2 కొరిం. 1:8-10) దేవుడు మిమ్మల్ని పునరుత్థానం చేయగలడని మీరు విశ్వసిస్తే, అత్యంత తీవ్రమైన వ్యతిరేకతను కూడా మీరు సహించగలుగుతారు. (లూకా 21:19) ఈ విషయంలో క్రీస్తుయేసు మనకు చక్కని ఆదర్శం ఉంచాడు; కష్టాల్లో తాను దేవునికి నమ్మకంగా ఉండడం చూసి, ఇతరులు కష్టాల్ని సహించేలా బలపర్చబడతారని ఆయనకు తెలుసు. అదేవిధంగా, మీరు కూడా కష్టాల్ని సహిస్తే, మిమ్మల్ని చూసి మీ సహోదరులు కూడా బలపర్చబడతారు.—యోహా. 16:33; హెబ్రీ. 12:2, 3; 1 పేతు. 2:21.
19 హింస, వ్యతిరేకత వంటివే కాకుండా మీరు ఇతర కష్టమైన పరిస్థితుల్ని కూడా సహించాల్సి రావచ్చు. ఉదాహరణకు, క్షేత్రంలోని ప్రజలు మంచివార్త పట్ల ఆసక్తి చూపించకపోవడం వల్ల కొందరు నిరుత్సాహపడతారు. ఇంకొందరు అనారోగ్య సమస్యల్ని, మానసిక సమస్యల్ని, అపరిపూర్ణతవల్ల వచ్చే పరిమితుల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. అపొస్తలుడైన పౌలు కూడా ఓ కష్టాన్ని సహించాల్సి వచ్చింది. అది ఆయన సేవకు ఆటంకం కలిగించింది, కొన్నిసార్లయితే దానివల్ల పరిచర్య చేయడం ఆయనకు కష్టమైంది. (2 కొరిం. 12:7) అలాగే, మొదటి శతాబ్దంలో ఫిలిప్పీకి చెందిన ఎపఫ్రొదితు కూడా ఓ సందర్భంలో చాలా కృంగిపోయాడు. “అతనికి జబ్బుచేసిన సంగతి [తన స్నేహితులకు] తెలిసిందని” కృంగిపోయాడు. (ఫిలి. 2:25-27) వీటన్నిటితోపాటు, మన అపరిపూర్ణతలవల్ల అలాగే ఇతరుల అపరిపూర్ణతలవల్ల వచ్చే సమస్యలు కూడా మనం సహించడాన్ని కష్టతరం చేయవచ్చు. తోటి సహోదరసహోదరీల, కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాల్లో తేడాలు ఉండడం వల్ల సమస్యలు తలెత్తవచ్చు. కానీ, యెహోవా వాక్యంలోని సలహాల్ని అంటిపెట్టుకునే వాళ్లు అలాంటి ఆటంకాల్ని విజయవంతంగా సహించి, అధిగమించవచ్చు.—యెహె. 2:3-5; 1 కొరిం. 9:27; 13:8; కొలొ. 3:12-14; 1 పేతు. 4:8.
నమ్మకంగా ఉండాలని నిశ్చయించుకోండి
20 యెహోవా సంఘ శిరస్సుగా నియమించిన యేసుక్రీస్తుకు మనం అంటిపెట్టుకొని ఉండాలి. (కొలొ. 2:18, 19) అంతేకాదు, ‘నమ్మకమైన, బుద్ధిగల దాసునితో’ అలాగే నియమిత పర్యవేక్షకులతో సన్నిహితంగా పనిచేయాలి. (హెబ్రీ. 13:7, 17) అలా మనం దైవపరిపాలనా ఏర్పాట్లకు దగ్గరగా అంటిపెట్టుకొని ఉండడం ద్వారా, నాయకత్వం వహిస్తున్నవాళ్లకు సహకరించడం ద్వారా యెహోవా ఇష్టాన్ని చేయడానికి సంస్థీకరించబడతాం. మనం ప్రార్థన అనే అమూల్యమైన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. జైల్లో ఉన్నా లేదా ఒంటరిగా నిర్బంధించబడినా, మన ప్రేమగల పరలోక తండ్రితో మాట్లాడకుండా ఎవ్వరూ మనల్ని ఆపలేరనీ, తోటి సహోదరసహోదరీలతో మనకున్న ఐక్యతను పాడుచేయలేరనీ గుర్తుంచుకోండి.
21 మనం దృఢ నిశ్చయంతో, సహనంతో మనకు అప్పగించబడిన ప్రకటనా పనిలో చేయగలిగినదంతా చేద్దాం. పునరుత్థానమైన యేసుక్రీస్తు తన అనుచరులకు అప్పగించిన ఈ పనిని పట్టుదలగా చేద్దాం: “కాబట్టి, మీరు వెళ్లి అన్నిదేశాల ప్రజల్ని శిష్యుల్ని చేయండి; తండ్రి పేరున, కుమారుడి పేరున, పవిత్రశక్తి పేరున వాళ్లకు బాప్తిస్మం ఇవ్వండి; నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ పాటించడం వాళ్లకు నేర్పించండి. ఇదిగో! ఈ వ్యవస్థ ముగింపు వరకు నేను ఎప్పుడూ మీతో ఉంటాను.” (మత్త. 28:19, 20) యేసులాగే మనం కూడా సహనం చూపిద్దాం. రాజ్య నిరీక్షణను, శాశ్వత జీవం అనే నిరీక్షణను ఎప్పుడూ మన కళ్లముందే ఉంచుకుందాం. (హెబ్రీ. 12:2) బాప్తిస్మం తీసుకున్న క్రీస్తు శిష్యులుగా, “ఈ వ్యవస్థ ముగింపుకు” సంబంధించిన ప్రవచన నెరవేర్పులో భాగం వహించే గొప్ప అవకాశం మనకుంది. యేసు ఇలా చెప్పాడు: “అన్నిదేశాల ప్రజలకు సాక్ష్యంగా ఉండేలా, ఈ రాజ్య సువార్త భూమంతటా ప్రకటించబడుతుంది. ఆ తర్వాత అంతం వస్తుంది.” (మత్త. 24:3, 14) మనం ఇప్పుడు ఆ పనిని హృదయపూర్వకంగా చేస్తే, యెహోవా నీతియుక్త కొత్త లోకంలో నిత్యజీవాన్ని పొందుతాం!