అనుకరించదగు సాత్వికముగలవారి ఉదాహరణలు
“నీ సాత్వికము నన్ను గొప్పచేసెను.”—కీర్తన 18:35.
1. మునుపటి వాచ్‌టవర్ ప్రెసిడెంట్‌లో సాత్వికానికి ఆధారమైన ఏ రుజువును చూడగలము?
జోసెఫ్ ఎఫ్. రూథర్‌ఫోర్డ్, ఆరు అడుగుల కంటే ఎత్తుగా 90 కిలోల కంటే ఎక్కువ బరువుగా చాలా ఠీవైన రూపాన్ని కల్గివున్నాడు. ఆయనకు ఎంతో శక్తివంతమైన స్వరం ఉంది. దాన్ని యెహోవా నామాన్ని మునుపెన్నడూ తెలియపర్చనంతగా తెలియపర్చడానికే గాక క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకుల వేషధారణను వారి మతాన్ని “ఒక ఉరిగా ఒక తంత్రంగా” వ్యక్తపర్చడానికి కూడా ఉపయోగించాడు. అయితే అతని ప్రసంగాలు అంత శక్తివంతంగా ఉన్నప్పటికీ, ఆయన ప్రధాన కార్యాలయంలో బేతేలు కుటుంబంతో ప్రార్థించినప్పుడు మాత్రం ఒక చిన్న పిల్లవాడు తన నాన్నతో మాట్లాడినట్లు ఉండేది. అది తన సృష్టికర్తతో ఆయనకున్న సన్నిహిత సంబంధానికి, ఆయన సాత్వికానికి నిదర్శనంగా ఉంది. అవును, ఆయన ఒక చిన్న పిల్లవాడంతటి సాత్వికుడు.—మత్తయి 18:3, 4.
2. ఏ ప్రత్యేక విషయంలో యెహోవా సేవకులు లోకంలోని వ్యక్తులకు పూర్తి భిన్నంగా ఉన్నారు?
2 నిస్సందేహంగా, యెహోవా దేవుని నిజమైన సేవకులందరూ సాత్వికులే. ఈ విషయంలో వారు, మునుపెన్నటికన్నా యిప్పుడు ఎక్కువగా గర్విష్ఠులైన ప్రజలతో నిండివున్న యీ లోకపు ప్రజలకు ఎంతో భిన్నంగా ఉన్నారు. గొప్ప స్థానాల్లో ఉన్నవారు, శక్తివంతులూ ధనవంతులూ చదువుకున్నవారూ, అంతేకాక బీదలు, యితరత్రా అప్రయోజకులైన వారిలో కూడా అనేకులు గర్విష్ఠులు ఉన్నారు.
3. గర్వపు ఫలితాలను గూర్చి ఏమి చెప్పవచ్చు?
3 గర్వం ఎంతో కలహాన్నీ బాధను రేపుతుంది. వాస్తవానికి, ఈ విశ్వంలోని శ్రమలన్నీ ఒక దూత గర్వపడిన కారణంగానే కలిగాయి. అతను యెహోవా దేవుడిలా ఆరాధించబడాలని కోరుకున్నాడు. (మత్తయి 4:9, 10) అంతేకాకుండా, తన్ను తాను అపవాదియైన సాతానుగా చేసుకున్న వాడు హవ్వ గర్వాన్ని పెంచుతూ ఆమె ఆ పండు తింటే దేవుడంతటిదై మంచి చెడులను తెలుసుకోగల్గుతుందని వాగ్దానంచేసి, ఆమెను మోసగించడంలో విజయం సాధించాడు. ఆమె సాత్వికురాలై ఉంటే, ‘నేను దేవుడంతటిదాన్ని ఎందుకు కావాలి?’ అని అని వుండేది. (ఆదికాండము 3:4, 5) మానవజాతి శారీరకంగా, మానసికంగా, నైతికంగా నలిగిన స్థితిని మనం పరిశీలించినప్పుడు, మానవుడు గర్వపడటం ఎంత క్షమించరానిది! యెహోవాకు “గర్వము అహంకారము . . . అసహ్యములు” అని మనం తప్పక చదువుతాము. (సామెతలు 8:13) గర్విష్ఠులందరికీ పూర్తి భిన్నంగా సాత్వికం గలవారి ఉదాహరణలు దేవుని వాక్యమైన బైబిలులో ఉన్నాయి.
యెహోవా దేవుడు సాత్వికుడు
4. యెహోవా సాత్వికుడని ఏ లేఖనాలు చూపుతున్నాయి?
4 మహోన్నతుడు, సర్వోన్నతుడు, సకల యుగములకు రాజైన యెహోవా దేవుడు—సాత్వికుడు. (ఆదికాండము 14:22) అది వాస్తవమేనా? అవును, వాస్తవమే! కీర్తన 18:35 నందు వ్రాయబడినట్లు దావీదు రాజు యిలా అన్నాడు: “నీ రక్షణ కేడెమును నీవు నాకందించుచున్నావు నీ కుడిచెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్పచేసెను.” స్పష్టంగా, రాజైన దావీదు, తాను గొప్పవాడైనందుకు కారణం యెహోవా సాత్వికమని గుర్తించాడు. తర్వాత మరలా కీర్తన 113:6లో మనమిలా చదువుతాం, యెహోవా ‘భూమ్యాకాశములను చూచుటకు తన్ను తాను తగ్గించుకొనెను.’ ఇతర అనువాదాల్లో “చూచుటకు ఆయన వంగుతున్నాడనీ” (న్యూ ఇంటర్నేష్నల్ వర్ష్‌న్) “యింత క్రిందకు చూడడానికి ఆయన వంగుతున్నాడు” అని ఉంది.—న్యూ ఇంగ్లీష్ బైబిల్.
5. యెహోవా కున్న సాత్వికానికి ఏ సంఘటనలు నిదర్శనగా ఉన్నాయి?
5 యెహోవా సొదొమ గొమొర్రాలను నాశనం చేయబూనుకున్న సమయంలో, అబ్రాహాము తన నీతిని ప్రశ్నించినప్పుడు అబ్రాహాముతో వ్యవహరించే విధానంలో ఆయన నిజంగానే తన్నుతాను తగ్గించుకున్నాడు.a (ఆదికాండము 18:23-32) అంతేకాకుండా రెండుసార్లు యెహోవా ఇశ్రాయేలీయులను—ఒకసారి విగ్రహారాధనకు, మరో సారి తిరుగుబాటుకు—నాశనం చేస్తానని వ్యక్తపర్చినప్పుడు, మోషే ప్రతి సందర్భంలోనూ మరో మనిషితో మాట్లాడుతున్నట్లుగా యెహోవాతో తర్కించాడు. అందుకు యెహోవా అనుకూలంగా ప్రతిస్పందించాడు. ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులను గూర్చి మోషే చేసిన విన్నపాలను అనుగ్రహించడంలో ఆయన సాత్వికం కనబడుతుంది. (నిర్గమకాండము 32:9-14; సంఖ్యాకాండము 14:11-20) యెహోవా ఒక్కో వ్యక్తితో వ్యవహరించిన విధానంలో సాత్వికాన్ని ప్రదర్శించడం, న్యాయాధిపతులు 6:36-40, యోనా 4:9-11లో వ్రాయబడినట్లు ఆయనకు గిద్యోను యోనాలతో ఉన్న సంబంధమందు కనబడుతుంది.
6. యెహోవా ఏ యితర లక్షణం ఆయన సాత్వికుడని మరింతగా రుజువుపర్చుతున్నాయి?
6 వాస్తవానికి, యెహోవా “దీర్ఘశాంతుడు”b అని కనీసం తొమ్మిదిసార్లు చెప్పబడుతోంది. యెహోవా వేల సంవత్సరాలుగా అపరిపూర్ణ మానవులతో వ్యవహరించడంలో దీర్ఘశాంతుడు, కోపపడడానికి నిదానించువానిగా ఉండటం ఆయన సాత్వికానికి మరో నిదర్శనం. దీర్ఘశాంతానికి పూర్తి భిన్నంగా, గర్విష్ఠులకు సహనం ఉండదు, తమ కోపాన్ని త్వరగా వ్యక్తపరుస్తుంటారు. యెహోవా వినయం, మానవుల గర్వాన్ని ఎంత హాస్యాస్పదం చేస్తుంది! మనలను ‘ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి’ అని కోరారు గనుక ఆయన ఎలాంటి సాత్వికుడో మనమూ అలాంటి సాత్వికంనే కనపర్చాలి.—ఎఫెసీయులు 5:1.
సాత్వికంలో క్రీస్తు మాదిరి
7, 8. లేఖనాలు యేసుక్రీస్తు సాత్వికాన్ని గూర్చి ఏమి చెబుతున్నాయి?
7 మనం అనుకరించడానికి గల రెండవ చక్కటి మాదిరి 1 పేతురు 2:21లో ఉదహరించబడింది: “క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరియుంచిపోయెను.” మనిషిగా ఆయన భూమి మీదికి రాకమునుపే జెకర్యా 9:9 నందు ఆయన్ని గురించి యిలా ప్రవచించబడింది: “సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు.” యేసు గర్విష్ఠుడైవుంటే అపవాది కోరినట్లు నమస్కరించి, అతను యివ్వజూపిన రాజ్యాలన్నింటినీ చక్కగా పుచ్చుకునేవాడే. (మత్తయి 4:9, 10) “మీరు మనుష్యకుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే యేమియుచేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు” అని అంటూ తన బోధకు ఘనతనంతటినీ యెహోవాకు చెందనిచ్చి, యేసు తన సాత్వికాన్ని ప్రదర్శించాడు.—యోహాను 8:28.
8 అందుకే యేసు తన బోధను వినేవారికి యిలా యుక్తంగా చెప్పగల్గాడు: “నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అపుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.” (మత్తయి 11:29) మరి యేసు మానవునిగా తన చివరి సాయంకాల సమయంలో తన అపొస్తలులతో ఉన్న చివరి రాత్రి వారి పాదాలు కడిగి సాత్వికానికి ఎంత చక్కటి మాదిరినుంచాడు! (యోహాను 13:3-15) తగినట్లుగా, ఫిలిప్పీయులు 2:3-8లో అపొస్తలుడైన పౌలు, క్రైస్తవులు “వినయమైన మనస్సుగలవారై” ఉండాలని, యేసును మాదిరిగా చూపుతూ యిలా ఒక సలహా యిచ్చాడు: “క్రీస్తుయేసుకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదుగాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్ను తాను తగ్గించుకొనెను.” తన జీవితంలోకెల్లా అతి క్లిష్టమైన పరిస్థితి నెదుర్కొన్నప్పుడు తన తండ్రికి యిలా ప్రార్థించాడు: “నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్ము.” (మత్తయి 26:39) నిస్సందేహంగా, మనం యేసుక్రీస్తును అనుకరించి, ఆయన అడుగుజాడలను సన్నిహితంగా అనుసరించాలంటే మనం సాత్వికులం కావాలి.
అపొస్తలుడైన పౌలు, సాత్వికానికి ఒక చక్కని మాదిరి
9-12. ఏ యే విధాలుగా అపొస్తలుడైన పౌలు సాత్వికానికి చక్కటి మాదిరినుంచాడు?
9 అపొస్తలుడైన పౌలు యిలా వ్రాశాడు: “నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి.” (1 కొరింథీయులు 11:1) అపొస్తలుడైన పౌలు దీనమనస్సుగలవాడై యేసును అనుకరించడం ద్వారా మనం అనుకరించడానికి మరో మాదిరిని ఉంచాడా? నిశ్చయంగా ఆయన అలాగే చేశాడు. అసలు చెప్పాలంటే, ఆయన తాను యేసుకు దాసుడని వినయంగా ఒప్పుకున్నాడు. (ఫిలిప్పీయులు 1:1) ‘యూదుల కుట్రలవలన శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో ప్రభువునకు దాసునిగా ఉండుటను గూర్చి’ ఎఫెసులోని పెద్దలకు చెప్పాడు. (అపొస్తలుల కార్యములు 20:17-19) అతను సాత్వికుడు కాకపోయినట్లైతే రోమీయులు 7:18, 19లో ఉన్న మాటలను ఎన్నడూ రాయకపోయి ఉండేవాడు: “నాశరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. . . . నేను చేయగోరు మేలుచేయక, చేయగోరని కీడు చేయుచున్నాను.”
10 మొదటి కొరింథీయులు 2:3 లో వ్రాయబడినట్లు, పౌలు కొరింథులోని క్రైస్తవులకు రాసింది ఆయన సాత్వికానికి మరో సూచనగా ఉంది: “బలహీనతతోను భయముతోను ఎంతో వణకుతోను మీయొద్ద నుంటిని.” అతను క్రైస్తవుడు కాకమునుపు తన ధోరణి గూర్చి ఎంతో సాత్వికంతో యిలా రాశాడు: ‘పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనై యుంటిని. . . పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెను . . . అట్టి వారిలో నేను ప్రథముడను.’—1 తిమోతి 1:13, 15.
11 ఇంకా తన ప్రయాసాలన్నిటిలో పొందిన విజయానికి యెహోవా దేవునికే పూర్తి ఘనతనివ్వడం తన సాత్వికానికి మరో నిదర్శనం. తన పరిచర్యను గూర్చి యిలా రాశాడు: “నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసినవాడు దేవుడే కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనేగాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు.” (1 కొరింథీయులు 3:6, 7) ఎఫెసీయులు 6:18-20 నందు మనం చదివేట్లుగా, తాను మంచి సాక్ష్యమివ్వటానికిగాను తన సహోదరులను ప్రార్థించమని కోరాడు: “ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరచునప్పుడు దానినిగూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్ఛక్తి నాకు అనుగ్రహింపబడునట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు . . . ఉండుడి.”
12 పౌలు యితర అపొస్తలులతో సహకరించే పద్ధతిలో కూడా సాత్వికాన్ని ప్రదర్శించాడు: “యాకోబు కేఫా యోహాను . . . మేము అన్యజనులకును తాము సున్నతిపొందినవారికిని అపొస్తలులుగా ఉండవలెనని చెప్పి, తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడిచేతిని ఇచ్చిరి.” (గలతీయులు 2:9) ఇంకా పౌలు, ఒక మ్రొక్కుబడిని చెల్లించడానికిగాను నలుగురు యువకులతో వారి ఖర్చులను తానే భరించి దేవాలయానికి తీసుకువెళ్లడానికి అంగీకరించడం ద్వారా యెరూషలేము సంఘంలోని పెద్దలతో సహకరించడానికి సుముఖతను చూపాడు.—అపొస్తలుల కార్యములు 21:23-26.
13. పౌలు సాత్వికం అంత మెప్పునొందడానికి ఏది కారణమైంది?
13 పౌలును యెహోవా దేవుడు ఎంతో గొప్పగా ఉపయోగించుకోవడాన్ని మనం గమనిస్తే, అతని సాత్వికం మరింత ప్రసంశయోగ్యంగా కనబడుతుంది. ఉదాహరణకు, మనం యిలా చదువుతాం: “దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను.” (అపొస్తలుల కార్యములు 19:11, 12) అంతేకాకుండ, అతనికి మానవాతీత దర్శనాలూ ప్రకటనలూ అందించబడ్డాయి. (2 కొరింథీయులు 12:1-7) క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోని 27 పుస్తకాల్లో 14 పుస్తకాలను (అంటే పత్రికలను) రాయడానికి పౌలు ప్రేరేపించబడ్డాడన్న సంగతిని మనం గమనించాలి. చెప్పాలంటే, అదంతా అతనిని అహంకారునిగా తయారు చేయలేదు. అతను సాత్వికునిగానే ఉన్నాడు.
ఆధునిక దిన మాదిరి
14-16. (ఎ) వాచ్‌టవర్ సొసైటి మొదటి ప్రెసిడెంటు సాత్వికానికి ఎలా చక్కటి మాదిరినుంచాడు? (బి) ఆయన మాదిరి ఎవరికి పూర్తి విరుద్ధంగా ఉంది?
14 హెబ్రీయులు 13:7 నందు అపొస్తలుడైన పౌలు సలహాను మనం యిలా చదువుతాం: “మీకు దేవుని వాక్యము బోధించి, మీపైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసికొని, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి.” ఈ సూత్రాన్ని అనుసరించి, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి మొదటి ప్రెసిడెంట్ చార్లెన్ తేజ్ రస్సల్‌ను మనం ఆధునిక దిన మాదిరిగా తీసుకోవచ్చు, ఆయన విశ్వాసాన్ని మనం అనుకరించవచ్చు. ఆయన సాత్వికుడేనా? అవును ఆయన సాత్వికుడే! నిశితంగా పరిశీలించినా గమనించినా, ఆయన రాసిన స్టడీస్ ఇన్ ది స్క్రిప్చ్‌ర్స్ భాగంలో ఆరు వాల్యుమ్‌లలో అంటే దాదాపు 3,000 పేజీ లందు ఎన్నడూ తనను గూర్చి తాను మాట మాత్రమైనా చెప్పుకున్నట్టు లేదు. అలాగే ఈనాడు వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి కూడ తమ శీర్షిక రచయితలను గుర్తించి మనుష్యులపైకి దృష్టిని మళ్లించకుండా అదే సూత్రాన్ని అవలంభిస్తోంది.
15 ఒకనాడు వాచ్‌టవర్‌లో రస్సల్, తన వ్యతిరేకులు ఉపయోగించిన “రస్సలిజమ్,” “రస్సలైట్స్” అనే పదాలు తనకు తెలియవని రాశాడు దానిని స్పష్టంగా నిరాకరించాడు. ఆయన యిలా రాశాడు: “మన పని . . . చెదరిపోయిన సత్యాలను దగ్గరకు చేర్చి వాటిని ప్రభువు ప్రజలకు అందించడమే. అది ఏదో క్రొత్తది, మన స్వంతది కాదుగానీ, అది ప్రభువుదే. . . . మన వినయ సామర్థ్యాన్ని ప్రభువు ఉపయోగించుకోడానికి ఎంతో సంతోషపడి చేసే ఈ పని ఒకరితో ప్రారంభమైనది కాదు, అది పునఃస్థాపించబడిన, సవరించబడిన, పొందికగల పనే.” నిజానికి, ఆయన 1 కొరింథీయులు 3:5-7లోనున్న అపొస్తలుడైన పౌలు అభిప్రాయాలనే వ్యక్తపర్చాడు.
16 ఆయన ప్రవర్తన చార్లెస్ డార్విన్‌కు ఎంతో భిన్నంగా ఉంది. డార్విన్, 1859 నందు విడుదలైన తన మొదటి ప్రతి, ది ఆరిజన్ ఆఫ్ స్పిసీస్‌లో తనకంటే ముందున్న వారు పరిణామ సిద్ధాంతాన్ని గూర్చి ఏం చెప్పారన్నది విడిచిపెట్టి, అనేకసార్లు “నా” సిద్ధాంతం అని అన్నాడు. అదే శతాబ్దానికి చెందిన పేరుగాంచిన రచయిత, సామ్యుల్ బట్లర్, పరిణామ సిద్ధాంతాన్ని అంతకుముందే అనేకులు ప్రబోధించారని చూపించి డార్విన్‌కు ఒక గట్టి దెబ్బకొట్టాడు; అది ఎంత మాత్రమూ డార్విన్‌తో ప్రారంభమైంది కాదు.
17. సహోదరుడైన రూథర్‌ఫోర్డ్ సాత్వికానికి యింకా ఏ ఉదాహరణలున్నాయి?
17 ఆధునిక కాలాల్లో యెహోవా దేవుడు ఎంతో గొప్పగా ఉపయోగించుకున్న మరో నమ్మకమైన సేవకుడు ఈ శీర్షిక ఆరంభంలో పేర్కొనబడిన జోసెఫ్ ఎఫ్. రూథర్‌ఫోర్డ్. ఆయన బైబిలు సత్యాలను బహిరంగంగా ధైర్యంగా అందించేవాడు, ప్రత్యేకంగా యెహోవా నామాన్ని. జడ్జ్ రూథర్‌ఫోర్డ్ అని ఎంతో ప్రఖ్యాతిగాంచినప్పటికి, హృదయ మందు ఆయన ఎంతో సాత్వికుడు. ఉదాహరణకు, ఒకసారి ఆయన క్రైస్తవులు 1925లో ఏమి ఎదురుచూడగలరో అన్న విషయంపై హేతుబద్దముకాని ఒక వ్యాఖ్యానం చేశాడు. తన నిరీక్షణకు తగినట్లుగా సంఘటనలన్నీ విఫలమైనప్పుడు, ఎంతో సాత్వికంతో ఆయన బ్రూక్లిన్ బేతేలు కుటుంబంతో, తాను సరైన అభిప్రాయాన్ని కనపర్చ లేకపోయానని ఒప్పుకున్నాడు. తోటి క్రైస్తవుని మెచ్చుకోదగని మాటతో బాధపెట్టినందుకు, మత్తయి 5:23, 24లో చూపబడిన ఆ మనోభావంతో ఆయన ఒంటరిగాను బహిరంగముగాను కూడా ఎన్నోసార్లు క్షమాపణ కోరాడని ఆయనకు బహు సన్నిహితుడైన ఒక అభిషక్త క్రైస్తవుడు, సాక్ష్యమిచ్చాడు. అధికారంలో ఉన్న వారు తమ క్రింద పనిచేసే వారిని క్షమాపణ అర్థించడానికి ఎంతో సాత్వికం అవసరం. సహోదరుడైన రూథర్‌ఫోర్డ్, సంఘంలోగానీ, ప్రయాణ కాపరి పనిలోగానీ, లేక ఒకానొక సొసైటి బ్రాంచి కార్యాలయాల్లో గానీ పనిచేసే పైవిచారణకర్తలందరికి ఒక చక్కటి మాదిరినుంచాడు.
18. వినయాన్ని కనపర్చే ఏ భావాన్ని సొసైటి మూడవ ప్రెసిడెంటు వ్యక్తపర్చాడు?
18 వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి మూడవ ప్రెసిడెంటైన నేథన్ హెచ్ నార్ కూడ యెహోవా ప్రజల్లో ఎంతో పేరుగాంచిన వ్యక్తైనప్పటికి, తన స్థానాన్ని బట్టి ఆయన గర్వించడంలేదని చూపాడు. ఆయన సంస్థీకరణలో, బహిరంగంగా మాట్లాడడంలో నిష్ణాతుడైనప్పటికి, యితరులు చేసే పనిని అతనెంతో గౌరవించే వాడు. అలా, ఆయన ఒకనాడు రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లోని ఒక సభ్యుడ్ని ఆయన కార్యాలయంలో సందర్శించి యిలా పేర్కొన్నాడు: “ఇక్కడ ఈ రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లోనే అతి ప్రాముఖ్యమైన అలాగే అతి క్లిష్టమైన పని జరుగుతుంది. అందుకనే నేను దానిలో ఎక్కువ పనిచేయను.” అవును, ఆయన ‘వినయమైన మనస్సుగలవారై ఒకడు తనకంటె యోగ్యుడని యెంచవలెను’ అని ఫిలిప్పీయులు 2:3 నందున్న సలహాను సాత్వికంగా అన్వయించాడు. సొసైటి ప్రెసిడెంటుగా సేవచేయడాన్ని ఆయన గుణగ్రహించినప్పటికీ, యితరుల పనులు కూడా ప్రాముఖ్యమైనవేనని ఆయన భావించాడు. ఆయన అలా భావించడానికి దానిని అంత స్పష్టంగా వ్యక్తపర్చడానికి ఆయనకు సాత్వికం అవసరమైంది. అందరూ అనుకరించడానికి ఆయన మరో మంచి మాదిరిగా ఉన్నాడు, ముఖ్యంగా పర్యవేక్షించే ప్రాముఖ్యమైన స్థానాల్లో ఉన్న వారికి ఒక మాదిరిగావున్నాడు.
19, 20. (ఎ) సాత్వికానికి ఏ మాదిరిని సొసైటి నాల్గవ ప్రెసిడెంటు ఉంచాడు? (బి) మనం సాత్వికాన్ని ప్రదర్శించడానికి తదుపరి శీర్షిక ఏ సహాయాన్ని యిస్తుంది?
19 సొసైటి నాల్గవ ప్రెసిడెంటైన ఫ్రెడ్రిక్ డబ్లు. ఫ్రాంజ్ కూడ సాత్వికంలో ఒక చక్కటి మాదిరి. సొసైటి వైస్ ప్రెసిడెంట్‌గా 32 సంవత్సరాలు పనిచేసి, పత్రికలకూ సమావేశ కార్యక్రమాల కొరకు వ్రాయడంలో ఎక్కువ భాగం వహించేవాడు; అయినా ఈ విషయంలో ఆయన మరుగున ఉండి, ఎన్నడూ వెలుగులోకి రావాలని కోరుకోలేదు. ఈ విషయంలో పోల్చదగిన ఒక ప్రాచీనకాల మాదిరిని మనం పేర్కొనవచ్చు. యోవాబు అమ్మోనీయులను రబ్బాలో ఓడించినప్పుడు, విజయంపొందిన ఘనతను రాజైన దావీదు పొందేలా చేశాడు.—2 సమూయేలు 12:26-28.
20 నిజమే, ఎన్నో చక్కటి మాదిరి గతంలోను నేడుకూడ ఉన్నాయి. మరి అవి మనం కూడ సాత్వికులుగా ఉండడానికి గల శక్తివంతమైన కారణాలను యిస్తున్నాయి. అయితే, మనం సాత్వికులుగా ఉండడానికి మనకు మరిన్ని కారణాలున్నాయి, అంతేకాకుండ వీటితోపాటు మనం సాత్వికంగా ఉండటానికి గల సహాయకాలూ తదుపరి శీర్షికలో పరిశీలించబడతాయి.
[అధస్సూచీలు]
a “తగ్గించుకొనుట” అనే పదం తరచూ “అధికార భావంతో కల్పించడం” అన్న అర్థంలో ఉపయోగించబడుతోంది. అయితే, దాని అసలు భావం—న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్‌లో, “కఠినత్వమును సడలించడం,” “హోదాలో ఉన్న ఆధిక్యతను త్యజించడం” అని ఉంది.—వెబస్టర్స్ నైన్త్ న్యూ కాలెజీయేట్ డిక్షనరీ చూడండి.
b నిర్గమకాండము 34:6; సంఖ్యాకాండము 14:18; నెహెమ్యా 9:17; కీర్తన 86:15; 103:8; 145:8; యోవేలు 2:13; యోనా 4:2; నహూము 1:3.
మీకు జ్ఞాపకమున్నాయా?
◻ గర్వపు పరిణామాలేమిటి?
◻ సాత్వికంలో ఎవరు అతి శ్రేష్ఠమైన మాదిరిని కనపర్చారు?
◻ సాత్వికానికి రెండవ గొప్పమాదిరి ఎవరని ఏది చూపిస్తున్నది?
◻ అపొస్తలుడైన పౌలు సాత్వికం విషయమై ఏ చక్కటి మాదిరినుంచాడు?
◻ ఏ ప్రాముఖ్యమైన ఆధునిక దిన మాదిరి మనకు ఉన్నాయి?
[15వ పేజీలోని చిత్రం]
యేసు సాత్వికాన్ని చక్కగా ప్రదర్శించాడు
[16వ పేజీలోని చిత్రం]
పౌలు సాత్వికానికి మంచి మాదిరినుంచాడు
[17వ పేజీలోని చిత్రం]
సహోదరుడైన రస్సల్ తాను వ్రాసిన వాటికి తాను ఘనత పొందగోరలేదు