యెహోవా—సంకల్పంగల దేవుడు
“నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును.”—యెషయా 14:24.
1, 2. అనేకులు జీవిత సంకల్పాన్ని గూర్చి ఏమి చెబుతుంటారు?
ఎక్కడ చూసినా ప్రజలు యిలా అడుగుతారు: “జీవిత సంకల్పమేమిటి?” ఓ పాశ్చాత్య రాజకీయ నాయకుడు యిలా పేర్కొన్నాడు: “మునుపెన్నటికంటే అనేక మంది ప్రజలు ‘మేం ఎవరం? మా సంకల్పం ఏంటి?’ అని ప్రశ్నిస్తున్నారు.” జీవిత సంకల్పం ఏమిటి అని యువతకు ఓ వార్తాపత్రిక వేసిన ప్రశ్నకు వారి విలక్షణ జవాబులు యిలా ఉన్నాయి: “మీ హృదయం కోరిన వాటిని చేయడం.” “ప్రతిక్షణాన్ని పూర్తిగా ఉపయోగించుకొని జీవించడం.” “ఉల్లాసవంతంగా, యిష్టానుసారంగా జీవించడం.” “పిల్లలను కనడం, సంతోషంగా ఉండడం ఆపై చనిపోవడం.” ఈ జీవితంలో ఉన్న యావత్తు యిదేనని అనేకులు భావించారు. భూమిపై దీర్ఘకాల జీవిత సంకల్పాన్ని గూర్చి ఎవ్వరూ మాట్లాడలేదు.
2 “చివరికి జీవితానికి అర్థం మన సహజ, మానవ జీవనంలో కనిపిస్తోంది” అని ఒక కన్‌ఫ్యూజియన్ విద్వాంసుడు అన్నారు. దీని ప్రకారంగా ప్రజలు పుడుతూనే ఉంటారు, 70 లేక 80 సంవత్సరాల వరకు కష్టాలుపడి, చనిపోయి, తర్వాత శాశ్వతంగా యిక ఉనికిలోనే లేకుండపోతారు. ఓ పరిణామ సిద్ధాంత వైజ్ఞానికుడు యిలా అన్నాడు: “మనం యింతకంటే ‘గొప్ప’ జవాబును పొందాలని అనుకుంటాం—కానీ అలాంటిది లేనేలేదు.” ఈ పరిణామ సిద్ధాంతులకు జీవితం అంటే మనగల్గడానికి ఉన్న పోరాటమే, మరణమే దాని అంతం. అటువంటి తత్వాలు నిరీక్షణలేని జీవిత దృక్పథాన్ని అందిస్తాయి.
3, 4. అనేకులు జీవితాన్ని దృష్టించే విధానాన్ని ప్రపంచ పరిస్థితులు ఎలా ప్రభావితం చేస్తాయి?
3 మానవ జీవితం ఎంతో బాధలో మునిగి ఉండడం చూసి, అనేకులు జీవిత సంకల్పం ఏమిటా అని అనుమానిస్తూ ఉంటారు. మానవుడు అత్యధిక స్థాయిలో పారిశ్రామిక, వైజ్ఞానిక సాఫల్యాన్ని సాధించిన మనకాలంలో, సుమారు నూరు కోట్ల మంది ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర అస్వస్థతకు లేక కుపోషణకు లోనైవున్నారు. ప్రతి సంవత్సరమూ లక్షలాది మంది పిల్లలు అటువంటి కారణాలవల్ల మరణిస్తున్నారు. దానికితోడు, ఈ 20వ శతాబ్దానికి ముందున్న నాలుగు వందల సంవత్సరాలన్నిటిలో సంభవించిన యుద్ధ మరణాలకు నాలుగు రెట్లు అధికంగా ఈ శతాబ్దంలో సంభవించాయి. నేరం, దౌర్జన్యం, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, కుటుంబ విచ్ఛిన్నాలు, ఎయిడ్స్, యితర లైంగికపరంగా సంక్రమించే వ్యాధులు—అలా ప్రతికూల విషయాల సంఖ్య పెరిగిపోతోంది. ప్రపంచ నాయకుల దగ్గర వీటికి పరిష్కారాలు లేవు.
4 అటువంటి పరిస్థితుల దృష్ట్యా, అనేకులు నమ్ముతున్న విషయాన్ని ఓ మహిళ యిలా వ్యక్తపర్చింది: “జీవితానికి ఓ సంకల్పమంటూ ఏమీ లేదు. ఈ చెడు విషయాలన్నీ జరుగుతూనే ఉంటే, అప్పుడిక జీవితానికి పెద్ద అర్థమంటూ ఏమీ ఉండదు.” ఓ పెద్ద మనిషి యిలా అన్నాడు: “నా జీవితంలోని ఎక్కువ భాగం, నేను యిక్కడ ఎందుకు జీవిస్తున్నానా అని నేను ప్రశ్నిస్తూ వచ్చాను. దానికో సంకల్పం ఉన్నా దాన్ని నేను యిక ఏమాత్రం పట్టించుకోను.” కాబట్టి, దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడో అనేకులకు తెలియదు గనుక ఈ లోకపు దురవస్థ, వారు తమ భవిష్యత్తు కొరకు ఓ నిజమైన నిరీక్షణను కల్గివుండకుండా చేస్తోంది.
5. జీవిత సంకల్పం గూర్చిన గందరగోళాన్ని ప్రపంచ మతాలు ఎందుకు మరింత ఎక్కువ చేస్తుంటాయి?
5 జీవిత సంకల్పం విషయమై మతనాయకులు సహితం విరుద్ధాభిప్రాయాలతో, అనిశ్చయంగా ఉన్నారు. లండన్ నందలి సెయింట్. పాల్స్ కాథడ్రల్‌లోని ఓ మాజీ మతనాయకుడు యిలా చెప్పాడు: “నా జీవితమంతా జీవన సంకల్పాన్ని కనుగొనడానికి నేనెంతో ప్రయత్నించాను. . . . నేను విఫలుడనయ్యాను.” నిజమే, చనిపోయిన తర్వాత మంచివారు పరలోకానికి, చెడ్డవారు మండే నరకంలోకి శాశ్వతంగా వెళతారని అనేక మంది మతనాయకులు బోధిస్తూ ఉంటారు. అయితే ఈ ఆలోచన, భూమిపై జీవించే మానవజాతిని హింసాయుత పరిస్థితుల్లోనే విడిచిపెడుతుంది. మరి మనుష్యులు పరలోకంలో జీవించాలన్నది దేవుని సంకల్పమైతే, దూతలను చేసినట్లుగా వీరిని కూడా పరలోక ప్రాణులుగా చేయకపోయాడా, అలా మానవులను యింత బాధ నుండి తప్పించవచ్చుగా? కాబట్టి భూమిపై జీవిత సంకల్పం గూర్చిన గందరగోళం, లేక ఏదైనా సంకల్పం ఉందన్న విషయాన్ని నమ్మడానికి నిరాకరించడం సహజమే.
సంకల్పంగల దేవుడు
6, 7. విశ్వ సర్వాధిపతిని గూర్చి బైబిలు మనకు ఏం చెబుతోంది?
6 అయితే, చరిత్రలోనే అతి విస్తారంగా అందించబడిన పరిశుద్ధ బైబిలు, విశ్వ సర్వాధిపతియైన యెహోవా సంకల్పంగల దేవుడని చెబుతోంది. భూమిపై జీవించే మానవుల యెడల ఆయనకు దీర్ఘకాలీన లేక వాస్తవానికి ఓ నిరంతర సంకల్పం ఉందని చూపిస్తోంది. యెహోవా దేన్నైనా ఉద్దేశిస్తే, అది తప్పనిసరిగా జరుగుతుంది. వర్షం విత్తనాన్ని ఎలాగైతే మొలకెత్తిస్తుందో, “అలాగే నా నోటనుండి వచ్చువచనమును ఉండును. నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును” అని దేవుడు చెబుతున్నాడు. (యెషయా 55:10, 11) యెహోవా తాను దేన్నైనా సాధిస్తానని చెప్పినప్పుడు అది “నిశ్చయముగా జరుగును.”—యెషయా 14:24.
7 దేవుడు “అబద్ధమాడనేరని”వాడు గనుక, ఆ సర్వశక్తిమంతుడు తన వాగ్దానాన్ని నిలుపుకుంటాడని మానవులమైన మనము నమ్మగలం. (తీతు 1:2; హెబ్రీయులు 6:18) ఆయన ఒక కార్యాన్ని చేస్తానని అన్నప్పుడు, అది తప్పకుండా జరుగుతుందని ఆయన వాక్కు హామీనిస్తోంది. అది జరిగినట్లే లెక్క. ఆయన యిలా అంటున్నాడు: “దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదననియు చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను. . . . నేను చెప్పియున్నాను దాని నెరవేర్చెదను, ఉద్దేశించియున్నాను సఫలపరచెదను.”—యెషయా 46:9-11.
8. యథార్థంగా దేవున్ని తెలుసుకోవాలనుకునే వారు ఆయన్ను కనుగొనగలరా?
8 అంతేకాకుండా, యెహోవా “యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు”న్నాడు. (2 పేతురు 3:9) ఈ కారణంగా, ఎవరికీ ఆయన్ను గూర్చి తెలియకుండా ఉండకూడదని ఆయన కోరుతున్నాడు. అజర్యా అనే ఓ ప్రవక్త యిలా చెప్పాడు: “మీరు ఆయనయొద్ద విచారణచేసినయెడల ఆయన [దేవుడు] మీకు ప్రత్యక్షమగును; మీరు ఆయనను విసర్జించినయెడల ఆయన మిమ్మును విసర్జించును.” (2 దినవృత్తాంతములు 15:1, 2) కాబట్టి, యథార్థంగా దేవున్ని, ఆయన సంకల్పాలనూ తెలుసుకోవాలనేవారు, ఆయన్ను వెదికే ప్రయత్నం చేసినట్లయితే అలా తప్పకుండా తెలుసుకోగలరు.
9, 10. (ఎ) దేవున్ని తెలుసుకోవాలనుకునే వారికి ఏమి అందించబడింది? (బి) దేవుని వాక్యాన్ని వెదకడం మనకు ఎలా సహాయపడుతుంది?
9 ఎక్కడ వెదకాలి? నిజంగా దేవుని వెదికేవారి కొరకు ఆయన తన వాక్యమైన బైబిలును అందించాడు. విశ్వాన్ని సృజించడానికి ఉపయోగించిన తన చురుకైన శక్తిని అంటే అదే పరిశుద్ధాత్మను ఉపయోగించి, ఆయన తన సంకల్పాలను గూర్చి మనం ఏమి తెలుసుకోవాలో వాటన్నిటినీ నమ్మకమైన వ్యక్తుల ద్వారా రాయించాడు. ఉదాహరణకు, బైబిలు ప్రవచనం గూర్చి అపొస్తలుడైన పేతురు యిలా అన్నాడు: “ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.” (2 పేతురు 1:21) అదే విధంగా, అపొస్తలుడైన పౌలు యిలా అన్నాడు: “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.”—2 తిమోతి 3:16, 17; 1 థెస్సలొనీకయులు 2:13.
10 మనం ఏదో కొంత మట్టుకు లేదా అసంపూర్ణంగా కాదుగానీ ‘సన్నద్ధమై, పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు’ దేవుని వాక్యం మనకు సహాయపడుతుందన్న విషయాన్ని గమనించండి. దేవుడెవరు, ఆయన సంకల్పాలు ఏమిటి, తన సేవకులనుండి ఆయన ఏం కోరుతున్నాడన్న విషయాలను గూర్చి నిశ్చయతను కల్గి ఉండడానికి అది సహాయపడుతుంది. దేవుడే గ్రంథకర్తగా ఉన్న పుస్తకం నుండి మనం దీనిని అపేక్షించవచ్చు. దేవుని గూర్చిన సరైన జ్ఞానాన్ని వెతకడానికి అదే మూలం. (సామెతలు 2:1-5; యోహాను 17:3) అది చేయడం వల్ల, “మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయోపాయములచేత వంచనతోను, తప్పుడు మార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడినవారమైనట్లుండము.” (ఎఫెసీయులు 4:13, 14) కీర్తనల గ్రంథకర్త సరైన దృక్పథాన్ని వ్యక్తపర్చాడు: “నీ [దేవుని] వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై యున్నది.”—కీర్తన 119:105.
దేవుని సంకల్పాలు క్రమంగా బయల్పర్చబడ్డాయి
11. యెహోవా తన సంకల్పాలను మానవజాతికి ఎలా బయల్పర్చాడు?
11 మానవ కుటుంబం ప్రారంభ దశలో ఉన్నప్పుడే, ఈ భూమి యెడల దానిలోని మానవుల యెడల తనకున్న సంకల్పాలను యెహోవా బయల్పర్చాడు. (ఆదికాండము 1:26-30) అయితే మన మొదటి తలిదండ్రులు దేవుని సర్వాధిపత్యాన్ని నిరాకరించినపుడు మానవజాతి ఆత్మీయ అంధకారంలోను, మరణంలోను చిక్కుకు పోయింది. (రోమీయులు 5:12) అయినప్పటికి, తన్ను ఆరాధించాలని కోరుకునేవారుంటారని యెహోవాకు తెలుసు. కాబట్టి, శతాబ్దాలుగా తన నమ్మకమైన సేవకులకు ఆయన తన సంకల్పాలను ఒక్కొక్కటే బయల్పరుస్తూవచ్చాడు. ఆయన మాట్లాడిన కొందరిలో, హనోకు (ఆదికాండము 5:24; యూదా 14, 15), నోవహు (ఆదికాండము 6:9, 13), అబ్రాహాము (ఆదికాండము 12:1-3), మోషే (నిర్గమకాండము 31:18; 34:27, 28) ఉన్నారు. దేవుని ప్రవక్తయైన ఆమోసు యిలా రాశాడు: “తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలుపరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు.”—ఆమోసు 3:7; దానియేలు 2:27, 28.
12. దేవుని సంకల్పాలపై యేసు మరింత వివరణను ఎలా అందించాడు?
12 ఏదెనులో తిరుగుబాటు జరిగిన దాదాపు 4,000 సంవత్సరాల తర్వాత దేవుని కుమారుడైన యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు, యెహోవా సంకల్పాలను గూర్చిన మరిన్ని వివరాలు బయల్పర్చబడ్డాయి. ప్రత్యేకంగా, భూమిని పరిపాలించడానికి పరలోక రాజ్యాన్ని స్థాపించాలన్న దేవుని సంకల్పం విషయంలో అది జరిగింది. (దానియేలు 2:44) రాజ్యాన్ని యేసు తన బోధనాంశంగా చేసుకున్నాడు. (మత్తయి 4:17; 6:10) భూమి యెడల మానవజాతి యెడల దేవునికున్న ఆది సంకల్పం, ఆ రాజ్యం క్రింద నెరవేరుతుందని ఆయన, ఆయన శిష్యులు బోధించారు. భూమి, నిరంతరం జీవించే పరిపూర్ణ మానవుల నివాసమైన పరదైసుగా మార్చబడుతుంది. (కీర్తన 37:29; మత్తయి 5:5; లూకా 23:43; 2 పేతురు 3:13; ప్రకటన 21:4) అంతేకాకుండా యేసు, ఆయన శిష్యులు, ఆ నూతన లోకంలో ఏమి జరుగుతుందో, దేవుడు తమకు అనుగ్రహించిన శక్తివల్ల వారు చేసిన అద్భుతాల ద్వారా కనపర్చారు.—మత్తయి 10:1, 8; 15:30, 31; యోహాను 11:25-44.
13. మానవులతో దేవుని వ్యవహారమందు సా.శ. 33 పెంతెకొస్తు నాడు ఏ మార్పు సంభవించింది?
13 యేసు పునరుత్థానమైన 50 రోజుల తర్వాత అంటే సా.శ. 33 పెంతెకొస్తునాడు, క్రీస్తు అనుచరుల సంఘంపై దేవుని ఆత్మ కుమ్మరించబడింది. అది యెహోవా నిబంధన ప్రజలుగా ఇశ్రాయేలీయుల స్థానే నెలకొల్పబడింది. (మత్తయి 21:43; 27:51; అపొస్తలుల కార్యములు 2:1-4) ఆ సందర్భంలో పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డం, ఆనాటి నుండి తన సంకల్పాలను గూర్చిన సత్యాలను దేవుడు తన నూతన ప్రతినిధి వర్గం ద్వారా బయల్పరుస్తాడని రుజువు చేసింది. (ఎఫెసీయులు 3:10) మొదటి శతాబ్ద కాలంలో, అసలైన క్రైస్తవ సంఘం యొక్క సంస్థీకరణ పని ప్రారంభమైంది.—1 కొరింథీయులు 12:27-31; ఎఫెసీయులు 4:11, 12.
14. సత్యాన్వేషకులు నిజ క్రైస్తవ సంఘాన్ని ఎలా గుర్తించగలరు?
14 ఈనాడు, ఏదైతే దేవుని ప్రధాన లక్షణమైన ప్రేమను ఎడతెగక కనపరుస్తుందో అదే నిజక్రైస్తవ సంఘమని సత్యాన్వేషకులు గుర్తించగలరు. (1 యోహాను 4:8, 16) నిజమే, సహోదర ప్రేమ యథార్థ క్రైస్తవులకు ఒక గుర్తింపు చిహ్నం. యేసు యిలా అన్నాడు: “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనినిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.” “నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీ రొకని నొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ.” (యోహాను 13:35; 15:12) తన శ్రోతలకు యేసు యిలా జ్ఞాపకం చేశాడు: “నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు.” (యోహాను 15:14) కాబట్టి, ప్రేమ సూత్రాన్ని బట్టి జీవించువారే దేవుని నిజ సేవకులు. వారు దాన్ని గూర్చి మాటలు మాత్రమే మాట్లాడరు, ఎందుకంటే ‘క్రియలు లేని విశ్వాసము మృతము.’—యాకోబు 2:26.
జ్ఞానాభివృద్ధి
15. ఏ విషయమై దేవుని సేవకులు అభయాన్ని కల్గివుండగలరు?
15 సమయం గడిచేకొలది, నిజ క్రైస్తవ సంఘం దేవుని సంకల్పాలను గూర్చి యింకా అధికంగా జ్ఞానాన్ని సంపాదిస్తుందని యేసు ముందుగానే చెప్పాడు. తన అనుచరులకు ఆయనిలా వాగ్దానం చేశాడు: “ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.” (యోహాను 14:26) యేసు యింకా యిలా అన్నాడు: “ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను.” (మత్తయి 28:20) అలా, దేవుని గూర్చి ఆయన సంకల్పాలను గూర్చిన జ్ఞానం దేవుని సేవకులకు పెరుగుతుంది. అవును, “పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును.”—సామెతలు 4:18.
16. ఆత్మీయంగా జ్ఞానాభివృద్ధి చెందడం, దేవుని సంకల్పాల విషయంలో మనం ఎక్కడున్నామని చెబుతుంది?
16 ఈనాడు, అట్టి ఆత్మీయ వెలుగు మునుపెన్నటి కంటే ఎక్కువ ప్రకాశవంతమౌతోంది, కారణం బైబిలు ప్రవచనాలు నెరవేరుతున్న లేదా త్వరలో నెరవేరబోయే కాలమందు మనం జీవిస్తున్నాం. ఈ దుష్ట విధానం యొక్క “అంత్యదినములలో” మనం జీవిస్తున్నామని యివి చూపిస్తున్నాయి. “యుగసమాప్తి” అంటే ఈ కాలమే; దీని తర్వాత దేవుని నూతన లోకం వస్తుంది. (2 తిమోతి 3:1-5, 13; మత్తయి 24:3-13) దానియేలు ప్రవచించినట్లుగా, దేవుని పరలోక రాజ్యం త్వరలోనే “[ఇప్పుడున్న] రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయునుగాని అది యుగముల వరకు నిలుచును.”—దానియేలు 2:44.
17, 18. ఏ గొప్ప ప్రవచనాలు యిప్పుడు నెరవేరుతున్నాయి?
17 ఇప్పుడు నెరవేరుతున్న ప్రవచనాల్లో మత్తయి 24వ అధ్యాయం 14వ వచనంలోనిది ఒకటుంది. అక్కడ యేసు యిలా అన్నాడు. “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” భూవ్యాప్తంగా, రాజ్య ప్రచార పనిని లక్షలాది మంది యెహోవాసాక్షులు చేస్తున్నారు. అంతేకాదు, ప్రతి సంవత్సరమూ లక్షలాది మంది ప్రజలు వారితో చేరుతున్నారు. ఇది యెషయా 2:2, 3లోని ప్రవచనంతో పొందికగావుంది. ఈ దుష్ట లోకపు “అంత్యదినములలో,” యెహోవా నిజ ఆరాధన కొరకు అనేక దేశాలనుండి ప్రజలు వస్తారు, అంతేగాక ‘ఆయన తన మార్గము విషయమై వారికి బోధిస్తాడు, వారు ఆయన త్రోవలలో నడుస్తారు’ అని అక్కడ చెప్పబడుతోంది.
18 యెషయా 60వ అధ్యాయం 8వ వచనం చెప్పినట్లుగా ఈ క్రొత్తవారు యెహోవా ఆరాధనకు “మేఘమువలె” వస్తున్నారు. ఇరవై రెండవ వచనం యింకనూ యిలా చెబుతోంది: “వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును.” రుజువులు చూపుతునట్లుగా ఆ సమయం యిదే. క్రొత్తవారు యెహోవాసాక్షులతో సహవసించడం ద్వారా, వారు నిజమైన క్రైస్తవ సంఘంతో సంబంధం కల్గివున్నారని దృఢంగా నమ్మవచ్చు.
19. యెహోవాసాక్షులతో సహవసించే క్రొత్తవారు నిజక్రైస్తవ సంఘంలోనికి వచ్చారని మనం ఎందుకు చెప్పగలం?
19 దాన్ని నిశ్చయతతో మనం ఎందుకు చెప్పగలం? ఎందుకంటే, యెహోవా సంస్థలో ముందే ఉన్న లక్షలాది మందితో చేరిన ఈ క్రొత్తవారు, తమ్మును తాము దేవునికి సమర్పించుకొని ఆయన చిత్తాన్ని చేస్తున్నారు. దైవిక ప్రేమ సూత్రానికి అనుగుణంగా జీవించడం దీనిలో యిమిడివుంది. దీనికి రుజువుగా ఈ క్రైస్తవులు ‘తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుకున్నారు.’ “యుద్ధముచేయ నేర్చుకొనుట” ఇక మానివేశారు. (యెషయా 2:4) దేవుని ప్రజలు ప్రేమను క్రియల్లోకనపరస్తారు గనుక ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు దీన్ని చేశారు. అనగా వారు ఒకరి మీద ఒకరు గానీ లేక మరొకరిపై గానీ ఎన్నడూ యుద్ధ ఆయుధాలను ఉపయోగించజాలరు. ఇతర లోక మతాల్లాకాక—ఈ విషయంలో వారు ప్రత్యేకంగా ఉన్నారు. (యోహాను 13:34, 35; 1 యోహాను 3:10-12, 15) “పరిపూర్ణతకు అనుబంధమైన” ప్రేమ గట్టిగా నిర్మించిన ప్రపంచవ్యాప్త సహోదరత్వాన్ని వారు ఏర్పర్చుకుంటారు గనుక, విభాగిత జాతీయతలో వారు పాల్గొనరు.—కొలొస్సయులు 3:14; మత్తయి 23:8; 1 యోహాను 4:20, 21.
అనేకులు తెలుసుకోకుండా ఉండడానికి ఎన్నుకున్నారు
20, 21. మానవజాతిలోని అధిక శాతం మంది ఆత్మీయ అంధకారంలో ఎందుకు ఉన్నారు? (2 కొరింథీయులు 4:4; 1 యోహాను 5:19)
20 దేవుని ప్రజల్లో ఉన్న ఆత్మీయ వెలుగు అంతకంతకు ప్రకాశిస్తూవుంటే, భూమిమీద మిగతా జనాబా ఆత్మీయ ఘోరాంధకారంలోకి దిగజారిపోతోంది. వారికి యెహోవా గానీ ఆయన సంకల్పాలు గానీ తెలియవు. “చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను కమ్ముచున్నది” అని దేవుని ప్రవక్త చెప్పినప్పుడు ఆయన ఈ కాలాన్ని గూర్చి వివరించాడు. (యెషయా 60:2) ఇది యిలా జరగడానికి కారణం, అటు వారు దేవున్ని గూర్చి తెలుసుకోవాలనే యథార్థమైన ఆసక్తిని కనపర్చకపోవడమూ యిటు ఆయన్ని ప్రీతిపర్చే ప్రయత్నం చేయకపోవడం. యేసు యిలా అన్నాడు: “ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్‌క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు.”—యోహాను 3:19, 20.
21 అటువంటి వ్యక్తులకు దేవుని చిత్తం ఏమిటన్నది తెలుసుకోవడంలో నిజమైన ఆసక్తి ఉండదు. బదులుగా, వారు తమ జీవితాన్ని తమ స్వంత చిత్తాన్ని చేయడానికే కేంద్రీకరిస్తారు. దేవుని చిత్తాన్ని అలక్ష్యం చేయడం వల్ల వారు తమ్మును తాము ప్రమాదకర పరిస్థితుల్లో ఉంచుకుంటున్నారు. కారణం దేవుని వాక్యం యిలా అంటోంది: “ధర్మశాస్త్రము వినబడకుండ చెవిని తొలగించుకొనువాని ప్రార్థన హేయము.” (సామెతలు 28:9) తామెన్నుకున్న మార్గం వల్ల కలిగే పరిణామాలను వారు అనుభవిస్తారు. అపొస్తలుడైన పౌలు యిలా రాశాడు: “మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.”—గలతీయులు 6:7.
22. దేవున్ని తెలుసుకోవాలనుకునే అనేకులు యిప్పుడు ఏమి చేస్తున్నారు?
22 అయితే, దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవాలనుకునే వారు, ఆయన్ను యథార్థంగా వెదికేవారు, ఆయన దరికి చేరేవారు గొప్ప సంఖ్యలో ఉన్నారు. “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును” అని యాకోబు 4:8 చెబుతోంది. అటువంటి వారిని గూర్చి యేసు యిలా చెప్పాడు: “సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్షపరచబడునట్లు వెలుగునొద్దకు వచ్చును.” (యోహాను 3:21) ఆ వెలుగు వద్దకు వచ్చేవారికి దేవుడు ఎంత అద్భుతమైన భవిష్యత్తును సంకల్పించాడో కదా! మన తదుపరి శీర్షిక ఈ ఉప్పొంగజేసే ఉత్తరాపేక్షలను చర్చిస్తుంది.
మీరు ఎలా జవాబిస్తారు?
◻ జీవిత సంకల్పం గూర్చి అనేకులు ఏమి చెబుతారు?
◻ యెహోవా తాను సంకల్పం గల దేవుడని ఎలా బయల్పర్చుకుంటాడు?
◻ సా.శ. మొదటి శతాబ్దంలో ఏ గొప్ప జ్ఞానాభివృద్ధి కలిగింది?
◻ నిజక్రైస్తవ సంఘం ఈనాడు ఎలా గుర్తించబడగలదు?