కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 6/1 పేజీలు 8-12
  • మీరు సరియైన మతాన్ని కనుగొన్నారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు సరియైన మతాన్ని కనుగొన్నారా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని దృక్పథాన్ని మనమెలా తెలుసుకోవచ్చు?
  • బైబిలును ఉపయోగించే వారంతా సరైన మతాన్నే బోధిస్తున్నారా?
  • నిజమైన మత గుర్తింపు చిహ్నాలు
  • దేవుడు ఆమోదించే ఆరాధన
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • నిజమైన మతం ఏదో నేనెలా తెలుసుకోవాలి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • మతాలన్నీ దేవున్ని ప్రీతిపర్చుతాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • మతం పేరిట జరుగుతున్న దుష్క్రియలు అంతమౌతాయా?
    మతం పేరిట జరుగుతున్న దుష్క్రియలు అంతమౌతాయా?
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 6/1 పేజీలు 8-12

మీరు సరియైన మతాన్ని కనుగొన్నారా?

“తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా.”—యాకోబు 1:27.

1, 2. (ఎ) అనేకమంది ఆలోచన ప్రకారం, వారిది సరియైన మతం అని ఏది నిర్ణయిస్తుంది? (బి) మతాన్ని నిర్ణయించడంలో దేన్ని గంభీరంగా పరిగణించాలి?

మతానికి తమ జీవితాల్లో చాలా తక్కువ భాగాన్ని కేటాయించేవారు అనేకమంది ఉన్న శకంలో మనం జీవిస్తున్నాము. వారు ఏవో కొన్ని మతసంబంధమైన ఆరాధనలకు హాజరౌతుండవచ్చు, కాని వారిలో కొద్దిమంది మాత్రమే అలా క్రమంగా చేస్తారు. తమ మతమే సరైందని, ఇతర మతాలన్నీ తప్పని ఎక్కువమంది ప్రజలు భావించరు. తమ దృష్టికి మాత్రమే తమ మతం సరైందని వారు భావిస్తుండవచ్చు.

2 దీని దృష్ట్యా, మీరు సరైన మతాన్ని కనుగొన్నారా? అనే ప్రశ్నకు కేవలం, మీరు ఇష్టపడే మతాన్ని మీరు కనుగొన్నారా అనియేనా దాని భావం? మీకేది ఇష్టమో ఏది నిర్ణయిస్తుంది? మీ కుటుంబమా? మీ సహవాసులా? మీ స్వంత భావాలా? ఈ విషయంలో దేవుని ఉద్దేశాన్ని మీరు ఎంత గంభీరంగా తీసుకున్నారు?

దేవుని దృక్పథాన్ని మనమెలా తెలుసుకోవచ్చు?

3. (ఎ) మనం దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవాలంటే, మనకు ఏది అందుబాటులో ఉండాలి? (బి) బైబిలు దేవుని నుండి వచ్చిందని మనం వ్యక్తిగతంగా ఎందుకు నమ్ముతున్నామనే దాని గురించి మనం ఏ ప్రశ్నలు వేసుకోవాలి?

3 దేవుడు తానే ఏమి తలస్తున్నాడో మనం తెలుసుకోవాలంటే, ఆయన నుండి ఏదైనా ప్రకటన ఉండాలి. దేవునిచే ప్రేరేపించబడినదని చెప్పబడుతున్న అతి ప్రాచీన పుస్తకం బైబిలే. (2 తిమోతి 3:16, 17) ఇతర వాటన్నింటితో పోల్చితే దీనిలోనే మానవజాతి కొరకు దేవుని సందేశం ఉందని నిజంగా చెప్పవచ్చా? ఆ ప్రశ్నకు మీరెలా జవాబిస్తారు, ఎందుకు? మీ తలిదండ్రులు ఆ దృష్టిని కలిగివున్నందుకా? మీ సహవాసుల దృక్పథం అలా ఉన్నందుకా? మీరు స్వయంగా సాక్ష్యాధారాన్ని పరీక్షించారా? క్రింద ఇవ్వబడిన నాలుగు సాక్ష్యాలను ఉపయోగిస్తూ, ఇప్పుడలా ఎందుకు చేయకూడదు?

4. అందుబాటుకు సంబంధించి, ఇతర పుస్తకాలు కాదుగాని బైబిలు మాత్రమే దేవుని యొద్ద నుండి వచ్చిందని ఏది సూచిస్తుంది?

4 అందుబాటు: ఒక సమాచారం నిజంగా దేవుని నుండి వచ్చినదైతే, అది మానవ కుటుంబమంతటి కొరకైతే, అది వారికి అందుబాటులో ఉండాలి. బైబిలు విషయంలో అది వాస్తవమా? దీన్ని పరిశీలించండి: ఇప్పుడు బైబిలు మొత్తంగా, లేక భాగాలుగా 2,000 కంటే ఎక్కువ భాషల్లో ప్రచురింపబడుతున్నది. అమెరికన్‌ బైబిల్‌ సొసైటీ ప్రకారం, దాదాపు పది సంవత్సరాల క్రితం బైబిలు ముద్రించబడిన భాషలను బట్టి అది ప్రపంచ జనాబాలోని దాదాపు 98 శాతానికి లభ్యమయ్యింది. గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ చెప్పినట్లు బైబిలు సాటిలేని విధంగా “ప్రపంచంలో విస్తృతంగా పంచిపెట్టబడిన పుస్తకము.” సమస్త జాతి, దేశ, భాషల ప్రజల కొరకు ఇవ్వబడిన దేవుని సందేశం విషయంలో మనం అదే ఎదురుచూస్తాము. (ప్రకటన 14:6ను పోల్చండి.) ప్రపంచంలో ఇలాంటి రికార్డు కలిగిన పుస్తకం మరొకటి లేదు.

5. బైబిలు యొక్క చారిత్రక పునాది ఎందుకు ప్రాముఖ్యమైనది?

5 చారిత్రకత: బైబిలు సంబంధ వృత్తాంతాలను జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా పరిశుద్ధమైనవిగా చెప్పబడుతున్న ఇతర పుస్తకాల నుండి బైబిలును ప్రత్యేకపర్చే మరో విధానం వెల్లడైంది. బైబిల్లో నిరూపించలేని పురాణాలు కాదుగాని, చారిత్రాత్మక వాస్తవాలున్నాయి. న్యాయస్థానంలో సాక్ష్యమునకు అవసరమైన వాటిని చూపించడానికి అలవాటుపడిన ఎర్‌వెన్‌ లిన్‌టెన్‌ ఇలా వ్రాశాడు: “ప్రణయ గాథలు, పురాణాలు, అబద్ధ సాక్ష్యాలు ఏదో దూర ప్రాంతంలో, ఏదో అనిర్ణీత సమయంలో జరిగినట్లుగా ఉంటాయి, . . . బైబిలు వృత్తాంతాలు మనకు చెప్పబడిన విషయాల యొక్క సాధ్యమైనంత కచ్చితమైన తేదీని, స్థలాన్ని తెలియజేస్తాయి.” (ఉదాహరణల కొరకు, 1 రాజులు 14:25; యెషయా 36:1; లూకా 3:1, 2 చూడండి.) వాస్తవం నుండి తప్పించుకోడానికి గాక, సత్యం కొరకు బైబిలు వైపు తిరిగేవారికి, ఇది ప్రాముఖ్యమైన విషయము.

6. (ఎ) జీవిత సమస్యలకు సంబంధించి బైబిలు నిజంగా ఒక వ్యక్తికి ఎలా సహాయం చేస్తుంది? (బి) కఠోర సత్యాలను ఎదుర్కోడానికి ఒక వ్యక్తికి బైబిలు ఏ మూడు విధాలుగా సహాయం చేస్తుంది?

6 ఆచరణాత్మకత: బైబిలును గంభీరంగా పరిశీలించేవారు, దానిలోని ఆజ్ఞలు, సూత్రాలు స్వలాభం కొరకు ఉపయోగించడానికి రూపొందించబడినవి కావని వెంటనే తెలుసుకుంటారు. దానికి బదులుగా, వాటిని సన్నిహితంగా హత్తుకొని ఉండేవారికి మేలు కలుగజేసేలాంటి జీవనవిధానాన్ని ఇవి అందజేస్తాయి. (యెషయా 48:17, 18) దుఃఖంలో ఉన్నవారికి అది ఇచ్చేది శూన్యమైన వేదాంతాలపై ఆధారపడిన ప్రయోజనంలేని ఓదార్పు కాదు. బదులుగా, ప్రజలు కఠోర జీవిత సత్యాలను ఎదుర్కోడానికి అది వారికి సహాయం చేస్తుంది. ఎలా? మూడు విధాలుగా: (1) కష్టాలనెలా ఎదుర్కోవాలి అనే విషయంపై తగిన సలహాలివ్వడం ద్వారా, (2) ఇప్పుడు తన సేవకులకు దేవుడు ఇచ్చే ప్రేమ పూర్వక మద్దతును ఎలా పొందవచ్చో వివరించడం ద్వారా, (3) దేవున్ని సేవించేవారికి ఆయన ఇవ్వనైయున్న అద్భుతమైన భవిష్యత్తును గూర్చి తెలియజేసి, ఆయన వాగ్దానాలందు నమ్మకముంచడానికి వారికి తగిన కారణాలివ్వడం ద్వారా సహాయం చేస్తుంది.

7. (ఎ) అథఃస్సూచి నందివ్వబడిన లేఖనాలను ఉపయోగిస్తూ, నేడు ప్రజలకు ఆసక్తి గల ప్రముఖ విషయాల్లో ఒకదానికి బైబిలు యిచ్చే సమాధానాన్ని వివరించండి. (బి) బైబిలు ఉపదేశం ఒక దుఃఖభరితమైన పరిస్థితి నుండి మనల్ని ఎలా కాపాడుతుందో లేక దాన్ని ఎదుర్కోడానికి మనకెలా సహాయం చేస్తుందో చూపించండి.

7 అధికారాన్ని నిరాకరిస్తూ, స్వయం నిమగ్న జీవన విధానాన్ని కలిగి ఉండేవారిలో తరచూ బైబిలు సలహా అంత ప్రసిద్ధి చెందక పోయినప్పటికీ, అలాంటి జీవితం తమకు నిజమైన సంతోషాన్ని తీసుకురాలేదని అనేకులు గ్రహించారు. (గలతీయులు 6:7, 8) గర్భస్రావము, విడాకులు, సలింగ సంయోగము వంటి వాటిని గూర్చిన ప్రశ్నలకు బైబిలు సూటియైన సమాధానాలిస్తుంది. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, కలుషితమైన రక్తం లేక వ్యభిచారం ద్వారా ఎయిడ్స్‌ సోకడం, వంటి వాటి నుండి దాని ఉపదేశం కాపాడుతుంది. సంతోషభరితమైన కుటుంబాలను ఎలా కలిగివుండవచ్చో అది మనకు చూపిస్తుంది. సన్నిహిత కుటుంబ సభ్యుల నిరాకరణ, తీవ్ర అస్వస్థత, ప్రియులైన వారి మరణం వంటి జీవితంలోని అత్యంత వేదనకర పరిస్థితులను ఎదుర్కోడానికి ఒక వ్యక్తికి దోహదపడే సమాధానాలను అది అందజేస్తుంది. విచారానికి బదులు మన జీవితాలు అర్థం కలిగివుండేలా మనం మన ప్రాధాన్యతలను తెలుసుకోడానికి అది మనకు సహాయం చేస్తుంది.a

8, 9. (ఎ) బైబిలు యొక్క ప్రేరణకు రుజువుగా ఏ ప్రవచనం మిమ్మల్ని వ్యక్తిగతంగా ప్రభావితం చేస్తుంది? (బి) బైబిలు నందలి ప్రవచనాలు, వాటి మూలాన్ని గురించి ఏమి నిరూపిస్తున్నాయి?

8 ప్రవచనం: ప్రవచనాల పుస్తకంగా, భవిష్యత్తులో ఏం జరుగుతుందనే విషయాన్ని వివరంగా తెలియజేసే పుస్తకంగా, బైబిలు అసాధారణమైనది. అది ప్రాచీన తూరు నాశనాన్ని, బబులోను పతనాన్ని, యెరూషలేము తిరిగి కట్టబడటాన్ని, మాదీయ-పారసీక, గ్రీసు రాజులు ఏలి కూలడాన్ని, యేసుక్రీస్తు జీవితంలో అనేక సంఘటనలను అది ముందే తెలియజేసింది. ఈ శతాబ్దంలో చెలరేగిన ప్రపంచ పరిస్థితుల గురించి కూడా అది విపులంగా ముందే తెలియజేసింది, వాటి ప్రాముఖ్యతను కూడా వర్ణిస్తుంది. మానవ పరిపాలకులను కలతపెడుతున్న సమస్యలు ఎలా పరిష్కరింపబడతాయో అది చూపిస్తుంది, మానవజాతికి నిత్య శాంతిని, నిజమైన భద్రతను తీసుకువచ్చే పరిపాలకుడెవరో అది చూపిస్తున్నది.b—యెషయా 9:6, 7; 11:1-5, 9; 53:4-6.

9 విశేషంగా, భవిష్యత్తును కచ్చితంగా ప్రవచించే సామర్థ్యాన్ని దేవత్వానికి రుజువని బైబిలు తెలియజేస్తుంది. (యెషయా 41:1–46:13) దాన్ని చేయగలవాడు, ఇతరులు దాన్ని చేసేలా పురికొల్పేవాడు కేవలం జీవంలేని విగ్రహం కాదు. ఆయన కేవలం భక్తిగల మానవుడు కాదు. ఆయన నిజమైన దేవుడు, మరి అలాంటి ప్రవచనాలున్న పుస్తకం ఆయన వాక్యమే.—1 థెస్సలొనీకయులు 2:13.

బైబిలును ఉపయోగించే వారంతా సరైన మతాన్నే బోధిస్తున్నారా?

10, 11. యేసు చూపించినట్లుగా, ఒక మతనాయకుడు బైబిలును ఉపయోగిస్తున్నప్పటికీ, తానవలంభించే మతాన్ని ఏది విలువలేనిదిగా చేస్తుంది?

10 అయితే బైబిలును ఉపయోగిస్తామని చెప్పుకుంటున్న మతసంబంధ గుంపులన్నీ, నిజమైన మతాన్ని బోధిస్తాయనే ముగింపుకు రావడం కారణసహితమేనా, ప్రాముఖ్యంగా, లేఖనాధారమైనదేనా? బైబిలును కలిగివున్న వాళ్లు, లేక దాన్ని ఉదహరించే ప్రతిఒక్కరు సరైన మతాన్ని అవలంభిస్తున్నారా?

11 అనేకమంది మతనాయకులు బైబిలును కలిగివున్నప్పటికీ, తమను తాము మహిమపర్చుకోడానికి మతాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకుంటారు. వారు స్వచ్ఛమైన సత్యాలను ఆచారాలు, మానవ తత్వాలతో పలుచన చేస్తారు. వారి ఆరాధన దేవునికి అంగీకారమైనదా? “ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది; మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు” అని చెబుతూ, ప్రవక్తయైన యెషయా ద్వారా ఇవ్వబడిన దేవుని ప్రకటనను, మొదటి శతాబ్దపు యెరూషలేములో ఉన్న మతనాయకులకు యేసుక్రీస్తు తగినరీతిగా అన్వయించాడు. (మత్తయి 15:8, 9; 23:5-10) స్పష్టంగా, ఆ విధమైన మతం నిజమైన మతం కాదు.

12, 13. (ఎ) వారి మతం సరైందో కాదో నిర్ణయించుకోడానికి ఒక వ్యక్తికి చర్చి సభ్యుల ప్రవర్తన ఎలా సహాయం చేయగలదు? (బి) ఆయన నిరాకరించే వారిని మనం మన సహవాసులుగా ఎంచుకుంటే దేవుడు మన ఆరాధనను ఎలా దృష్టిస్తాడు? (2 దినవృత్తాంతములు 19:2)

12 మంచి స్థానాల్లో ఉంటూ, వారి సభ్యులైయున్న కొంతమంది జీవితాల్లో కనిపిస్తున్నట్లుగా, అలాంటి కొన్ని మతాల బోధల వల్ల ఉత్పన్నమైన ఫలాలు కుళ్లిపోయినవైతే, అప్పుడేమిటి? తన కొండమీది ప్రసంగంలో యేసు ఇలా హెచ్చరించాడు: “అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. . . . వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. . . . ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును.” (మత్తయి 7:15-17) వ్యక్తులు తప్పు చేయవచ్చునన్నది, వారికి దిద్దుబాటు అవసరం కావచ్చునన్నది వాస్తవమే. కాని, చర్చీ సభ్యులు, చివరికి మతనాయకులు కూడా వ్యభిచారం, జారత్వం, కొట్లాట, త్రాగుబోతుతనం, అత్యాశ, అబద్ధం, అభిచారం, విగ్రహారాధన వీటన్నిటిలో, లేక వీటిలో వేటిలోనైనా మునిగి ఉంటే, అయినా ఏవిధమైన క్రమశిక్షణా చర్యలు తీసుకొనబడకపోతే, వారు వాటిలో అలాగే కొనసాగుతూ ఉండి కూడా సంఘంలో నుండి తీసివేయబడకపోతే అప్పుడు పరిస్థితి వేరు. అలాంటి వాటిని అవలంభించేవారిని సంఘం నుండి బహిష్కరించాలని బైబిలు స్పష్టంగా తెలియజేస్తుంది; వారికి దేవుని రాజ్యంలో స్థానం ఉండదు. (గలతీయులు 5:19-21) వారి ఆరాధన దేవునికి ప్రీతికరమైంది కాదు, ఆయన నిరాకరించే వారిని మనం మన సహవాసులుగా ఎంచుకుంటే మన ఆరాధన కూడా దేవున్ని ప్రీతిపర్చదు.—1 కొరింథీయులు 5:11-13; 6:9, 10; ప్రకటన 21:8.

13 బైబిలును ఉపయోగిస్తామని చెప్పుకునే గుంపులన్నీ నిజమైన మతాన్ని అవలంభించడం లేదన్నది సుస్పష్టము. మరైతే, నిజమైన మత గుర్తింపు చిహ్నాలుగా బైబిలు వేటిని నిర్ణయిస్తుంది?

నిజమైన మత గుర్తింపు చిహ్నాలు

14. (ఎ) నిజమైన మతం యొక్క బోధలన్నీ దేనిపై ఆధారపడి ఉంటాయి? (బి) దేవుడు, ఆత్మ, వీటికి సంబంధించిన క్రైస్తవమత సామ్రాజ్య బోధలు ఈ పరీక్షకు ఎంతవరకు తాళుకోగలవు?

14 దాని బోధలు ప్రేరేపిత లేఖనాలపై దృఢంగా ఆధారపడి ఉంటాయి. “దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.” (2 తిమోతి 3:16) అయితే క్రైస్తవమత సామ్రాజ్యపు త్రిత్వాన్ని గూర్చి పరిశుద్ధ బైబిలు ఎక్కడ తెల్పుతుంది? మతనాయకులు చెబుతున్నట్లు, భౌతిక శరీరం మరణించినా యింకనూ జీవించివుండే ఆత్మ మానవులకు ఉందని బైబిలు ఎక్కడ బోధిస్తున్నది? మీ బైబిలులో ఆ బోధలు ఎక్కడ ఉన్నాయో చూపించమని మీరు ఎప్పుడైనా మతనాయకున్ని అడిగారా? ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఇలా తెలియజేస్తుంది: “క్రొత్త నిబంధనలో ఎక్కడా త్రిత్వం అనే పదంగాని, స్పష్టమైన సిద్ధాంతంగాని కనిపించవు.” (1992, మైక్రోపీడియా, సంపుటి II, 928వ పేజీ) న్యూ కాథలిక్‌ ఎన్‌సైక్లోపీడియా ఇలా అంగీకరిస్తున్నది: “నైసియా సభను వ్యతిరేకించిన ఫాదర్లలో అటువంటి తలంపు లేక అటువంటి మనస్థత్వమే కాని ఉండి ఉండలేదు.” (1967, 14సంపుటి, 299 పేజీ) మరణమప్పుడు ఆత్మ శరీరాన్ని విడిచిపోతుందనే క్రైస్తవమత సామ్రాజ్యపు సిద్ధాంతాన్ని గ్రీకు తత్వసిద్ధాంతం నుండి అరువు తెచ్చుకున్నట్లు చర్చీ పండితులే అంగీకరించారు. అయినా, నిజమైన మతం, మానవ తత్వసిద్ధాంతం కొరకు బైబిలు సత్యాన్ని అలక్ష్యం చేయదు.—ఆదికాండము 2:7; ద్వితీయోపదేశకాండము 6:4; యెహెజ్కేలు 18:4; యోహాను 14:28.

15. (ఎ) ఆరాధింప బడవలసిన ఏకైక వ్యక్తిని బైబిలు ఎలా గుర్తిస్తున్నది? (బి) యెహోవాకు సన్నిహితమవ్వడాన్ని గురించి సత్యారాధికులు ఎలా భావిస్తారు?

15 ఏకైక సత్య దేవుడైన యెహోవాను మాత్రమే ఆరాధించడాన్ని నిజమైన మతం సమర్థిస్తుంది. (ద్వితీయోపదేశకాండము 4:35; యోహాను 17:3) ద్వితీయోపదేశకాండము 5:9 మరియు 6:13పై వ్యాఖ్యానిస్తూ, యేసుక్రీస్తు దృఢంగా ఇలా చెప్పాడు: “ప్రభువైన (యెహోవా NW) నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను.” (మత్తయి 4:10) దానికి అనుగుణంగా, యేసు తన శిష్యులకు తన తండ్రి నామాన్ని తెలియజేశాడు. (యోహాను 17:26) యెహోవాను ఆరాధించడం మీ మతం మీకు నేర్పిందా? ఆయనకు మీరు నమ్మకంగా సన్నిహితమవ్వవచ్చునని మీరు భావించేలా, ఆ పేరుచే గుర్తింపబడే వ్యక్తిని, ఆయన సంకల్పాలను, ఆయన క్రియలను, ఆయన లక్షణాలను గురించి మీరు తెలుసుకున్నారా? మీది నిజమైన మతమైతే, దానికి సమాధానం అవును అనే ఉంటుంది.—లూకా 10:22; 1 యోహాను 5:14.

16. నిజమైన మతాన్ని అవలంభించే వారికి క్రీస్తు నందు విశ్వసించడం అంటే అర్థమేమిటి?

16 దేవున్ని ప్రీతిపర్చే ఆరాధన యొక్క ఒక ప్రాముఖ్యమైన భాగం ఏమిటంటే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచడము. (యోహాను 3:36; అపొస్తలుల కార్యములు 4:12) దీనికి, ఆయన జీవించాడని లేక ఆయన విశేషమైన వ్యక్తిగా ఉండెనని నమ్మడం మాత్రమే సరిపోదు. యేసు పరిపూర్ణ మానవ జీవిత బలి విలువ గురించి బైబిలు బోధిస్తున్న దాని యెడల మెప్పు, నేడు పరలోక రాజుగా ఆయన స్థానాన్ని గుర్తించడం యిమిడివున్నాయి. (కీర్తన 2:6-8; యోహాను 3:16; ప్రకటన 12:10) నిజమైన మతాన్ని అవలంభించే వారితో మీరు సహవసిస్తుంటే, యేసుకు విధేయులగుటకు, ఆయన మాదిరిని అనుకరించుటకు, ఆయన తన శిష్యులకు అప్పగించిన పనిలో ఆసక్తిగా, వ్యక్తిగతంగా భాగం వహించడం వంటివి చేయడానికి వారు తమ ప్రతిదిన జీవితంలో మనస్సాక్షిపూర్వక ప్రయత్నాన్ని చేస్తారని మీకు తెలిసే ఉండవచ్చు. (మత్తయి 28:19, 20; యోహాను 15:14; 1 పేతురు 2:21) మీరు కలిసి ఆరాధించే వారి విషయంలో ఇది వాస్తవం కాకుంటే, మీరు మరో చోట వెదకవలసి ఉంటుంది.

17. లోకంచే కళంకం కాకుండా ఉండడానికి సత్యారాధికులు ఎందుకు జాగ్రత్త వహిస్తారు, దానిలో ఏమి ఇమిడి ఉంది?

17 సత్యారాధన రాజకీయాల్లో, లోకసంబంధ పోరాటాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా కళంకం కాదు. (యాకోబు 1:27) ఎందుకు? ఎందుకంటే యేసు తన అనుచరుల గురించి ఇలా చెప్పాడు: “నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.” (యోహాను 17:16) యేసు రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు, ఆయన తన అనుచరులు ఆయుధాల నుపయోగించకుండ నిరోధించాడు. (మత్తయి 26:52) దేవుని వాక్యం చెప్పేదాన్ని గంభీరంగా తీసుకునేవారు ‘ఇక యుద్ధం చేయడం నేర్చుకోరు’ (యెషయా 2:2-4) మీరు కేవలం పేరుకు మాత్రం సభ్యత్వాన్ని కలిగివున్న ఏ మతమైనా ఆ వివరణకు సరిపోకపోతే, దానితో సంబంధం తెంచుకోవలసిన సమయం ఇదే.—యాకోబు 4:4; ప్రకటన 18:4, 5.

18. (ఎ) యోహాను 13:35 నిజమైన మతం యొక్క విశేషమైన గుణంగా దేన్ని గుర్తిస్తుంది? (బి) యోహాను 13:35కు ఏ గుంపు నిజంగా సరిపోతుందో నిర్ణయించుకోడానికి మీరు ఎవరికైనా ఎలా సహాయం చేస్తారు?

18 నిజమైన మతం నిస్వార్థమైన ప్రేమను బోధిస్తుంది, అవలంభిస్తుంది. (యోహాను 13:35; 1 యోహాను 3:10-12) అలాంటి ప్రేమ గురించి కేవలం ప్రసంగాలలో మాట్లాడితే సరిపోదు. అన్ని జాతుల వారిని, అన్ని ఆర్థికస్థాయిల గుంపులను, అన్ని భాషల వారిని, అన్ని దేశాల ప్రజలను అసలైన సహోదరత్వంలో అది నిజంగా ఐక్యపరుస్తుంది. (ప్రకటన 7:9, 10) అది నిజ క్రైస్తవులను లోకం నుండి వేరుగా ఉంచుతుంది. మీరు ఇప్పటికే అలా చేయనట్లైతే, యెహోవాసాక్షుల రాజ్యమందిరంలో జరిగే కూటాలకు, అలాగే పెద్ద పెద్ద సమావేశాలకు హాజరుకండి. వారి రాజ్యమందిరాల్లో ఒకదాన్ని నిర్మించడానికి వారు కలిసి పనిచేస్తుండగా వారిని గమనించండి. వృద్ధులతో (విధవరాండ్రతో కూడా), యౌవనులతో (కేవలం తల్లి లేక తండ్రి మాత్రమే ఉన్నవారు లేక తలిదండ్రులు లేనివారితో కూడా) వారు ఎలా మెలుగుతారో గమనించండి. (యాకోబు 1:27) మీరు గమనించినదాన్ని ఇతర మతంలో మీరు చూసినదానితో పోల్చిచూడండి. తర్వాత మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి, ‘ఎవరు నిజమైన మతాన్ని అవలంభిస్తున్నారు?’

19. (ఎ) నిజమైన మతం మానవజాతి సమస్యలకు ఏ పరిష్కారాన్ని చూపిస్తుంది? (బి) నిజమైన మతాన్ని అవలంభించే గుంపు యొక్క సభ్యులు ఏమి చేస్తుండాలి?

19 మానవజాతి సమస్యలకు దేవుని రాజ్యమే శాశ్వత పరిష్కారమని నిజమైన మతం బోధిస్తుంది. (దానియేలు 2:44; 7:13, 14; 2 పేతురు 3:13; ప్రకటన 21:4, 5) క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలు ఏవైనా అలా చేస్తున్నాయా? దేవుని రాజ్యం గురించి, అది ఏమి సాధిస్తుందనే విషయం గురించి లేఖనాలు ఏమి చూపిస్తున్నాయో ఓ మతనాయకుడు వివరిస్తుండడం చివరిసారిగా మీరు ఎప్పుడు విన్నారు? మీరు ఏ సంస్థకు చెందుతారో ఆ సంస్థ దేవుని రాజ్యం గురించి ఇతరులతో మాట్లాడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తుందా, అలాగైతే, దాన్ని చేయడంలో సంఘంలోని సభ్యులందరూ భాగంవహిస్తారా? యేసు అలాంటి సాక్ష్యమిచ్చే పని చేశాడు; ఆయన తొలి శిష్యులు చేశారు; ఈ పనిలో పాల్గొనే ఆధిక్యతను మీరు కూడా పొందవచ్చు. అది, నేడు భూమిపై జరుగుతున్న అత్యంత ప్రాముఖ్యమైన పని.—మత్తయి 24:14.

20. నిజమైన మతాన్ని కనుగొనడమే కాకుండా, మనం ఇంకా ఏమి చేయాలి?

20 వేలాది మతాలు ఉన్నప్పటికీ, నిజమైన మతాన్ని గుర్తించడంలో ఉన్న గందరగోళాన్ని తీసివేయడానికి బైబిలు మనకు త్వరగా సహాయం చేస్తుంది. దాన్ని గుర్తించడం కంటే మనం ఎక్కువే చేయవలసి ఉంది. దాన్ని మనం ఆచరించడం ప్రాముఖ్యం. దానిలో ఏమి ఇమిడి ఉందో మా తర్వాతి శీర్షికలో యింకా విపులంగా వివరించబడుతుంది.

[అధస్సూచీలు]

a గర్భస్రావం: అపొస్తలుల కార్యములు 17:28; కీర్తన 139:1, 16; నిర్గమకాండము 21:22, 23. విడాకులు: మత్తయి 19:8, 9; రోమీయులు 7:2, 3. సలింగ సంయోగం: రోమీయులు 1:24-27; 1 కొరింథీయులు 6:9-11. మాదక ద్రవ్య, మత్తు పానీయాల దుర్వినియోగం: 2 కొరింథీయులు 7:1; లూకా 10:25-27; సామెతలు 23:20, 21; గలతీయులు 5:19-21. రక్తం, వ్యభిచారం: అపొస్తలుల కార్యములు 15:28, 29; సామెతలు 5:15-23; యిర్మీయా 5:7-9. కుటుంబం: ఎఫెసీయులు 5:22–6:4; కొలొస్సయులు 3:18-21. నిరాకరణ: కీర్తన 27:10; మలాకీ 2:13-16; రోమీయులు 8:35-39. రోగం: ప్రకటన 21:4, 5; 22:1, 2; తీతు 1:2; కీర్తన 23:1-4. మరణం: యెషయా 25:8; అపొస్తలుల కార్యములు 24:15. ప్రాధాన్యతలు: మత్తయి 6:19-34; లూకా 12:16-21; 1 తిమోతి 6:6-12.

b అలాంటి ప్రవచనాల ఉదాహరణల కొరకు, వాటి నెరవేర్పు కొరకు 1989 ఆగస్టు నుండి నవంబర్‌ వరకు గల కావలికోటలను, మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకంలో 150-53 పేజీలను చూడండి. ఇవి వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా వారు ప్రచురించినవి.

మీరెలా జవాబిస్తారు?

◻ సరియైన మతాన్ని గుర్తించడంలో ఎవరి ఉద్దేశం అత్యంత ప్రాముఖ్యము?

◻ బైబిలు దేవుని వాక్యమని ఏ నాలుగు విషయాలు సాక్ష్యాధారం చూపిస్తున్నాయి?

◻ బైబిలును ఉపయోగించే మతాలన్నీ ఎందుకు దేవునికి అంగీకారమైనవి కావు?

◻ ఏకైక నిజమైన మతం యొక్క ఆరు గుర్తింపు చిహ్నాలు ఏవి?

[10వ పేజీలోని బాక్సు]

యెహోవాసాక్షులు . . .

◆ తమ బోధలన్నీ బైబిలు ఆధారంగా చేస్తారు.

◆ ఏకైక సత్య దేవుడైన యెహోవాను ఆరాధిస్తారు.

◆ యేసుక్రీస్తు నందు వారికున్న విశ్వాసానికి అనుగుణంగా జీవిస్తారు.

◆ రాజకీయాల్లో, లోకసంబంధ పోరాటాల్లో జోక్యం చేసుకోరు.

◆ ప్రతిదిన జీవితంలో నిస్వార్థ ప్రేమను కనపర్చడానికి ప్రయత్నిస్తారు.

◆ మానవజాతి సమస్యలకు శాశ్వత పరిష్కారం దేవుని రాజ్యమని ప్రబోధిస్తారు.

[9వ పేజీలోని చిత్రం]

బైబిలు—మానవజాతంతటి కొరకు దేవుని సమాచారాన్ని కలిగివుందని ఏది సూచిస్తుంది?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి