మతాలన్నీ దేవున్ని ప్రీతిపర్చుతాయా?
మతాలన్నీ దేవున్ని ప్రీతిపర్చుతాయని మీరు భావిస్తున్నారా? బహుశ మీకు తెలిసిన ఏ ఆరాధనా విధానమైనా మంచి ప్రవర్తనను, కనీసం కొంత మేరకైనా ప్రోత్సహిస్తుంటుంది. అయితే దేవున్ని ప్రీతిపర్చేందుకు అది మాత్రమే చాలా?
‘మీ ఆరాధనలో యథార్థంగా ఉండండి, దేవుడు సంతోషిస్తాడు. అన్ని మతాల్లోనూ మంచి ఉంది’ అని కొందరంటారు. ఉదాహరణకు, బహాయ్ మతం తన నమ్మకాల్లో ప్రపంచంలోని తొమ్మిది ముఖ్య మతాలను కలుపుకునేంతగా ఈ దృక్పథాన్ని విలీనం చేసుకుంది. ఈ మతాలన్నీ కూడా దైవిక ప్రారంభాన్ని కలిగివున్నాయని, ఒకే సత్యం యొక్క వివిధ ఆకృతులని ఈ మత గుంపు నమ్ముతుంది. అదెలా సాధ్యం?
అంతేకాక, అనేకమంది ప్రజలను చంపగల అవకాశమున్న నర్వ్ వాయువును ప్రజా స్థలాల్లో ఉంచమని ఒక మతం తన సభ్యులకు బోధిస్తున్నప్పుడు, అది దేవున్ని ఎలా ప్రీతిపర్చగలదని ఆలోచించడానికి మీకు హేతువున్నది. జపాన్‌లోని ఒక మత గుంపుపై ఆ నేరం మోపబడింది. లేక తన సభ్యులను ఆత్మహత్య చేసుకునేందుకు పురికొల్పే మతాన్నిబట్టి దేవుడు సంతోషిస్తాడా? కొన్ని సంవత్సరాల క్రితం, జిమ్ జోన్స్ అనే మత నాయకుని అనుచరులకు అదే సంభవించింది.
మునుపటి కాలాల వైపు తిరిగి చూస్తూ, 1618 నుండి 1648 వరకూ జరిగిన ముప్పై సంవత్సరాల యుద్ధం వంటి యుద్ధాలను మతాలు పురికొల్పినప్పుడు అవి దేవున్ని ప్రీతిపరచగలవా అని మనం తప్పకుండా అడుగవచ్చు. ప్రపంచం యొక్క విశ్వ చరిత్ర (ఆంగ్లం) ప్రకారం, కాథోలిక్‌లకు ప్రొటెస్టెంటులకు మధ్య జరిగిన ఆ మతపర పోరాటం “యూరప్ చరిత్రంతటిలో జరిగిన అత్యంత భీకర యుద్ధాల్లో ఒకటి.”
11వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకూ జరిగిన మత క్రూసేడ్‌లు కూడా భయంకరమైన రక్తపాతాన్ని తీసుకువచ్చాయి. ఉదాహరణకు, మొదటి క్రూసేడ్‌లో క్రైస్తవ క్రూసేడ్‌లనబడేవారు జెరూసలేమ్‌నందలి ముస్లిం మరియు యూదా నివాసులను పాశవికంగా హతమార్చారు.
13వ శతాబ్దంలో ప్రారంభమై 600 సంవత్సరాలుగా కొనసాగిన ఇంక్విజీషన్ సమయంలో ఏమి సంభవించిందో కూడా పరిశీలించండి. మత నాయకుల ఆజ్ఞపై వేలాదిమంది హింసింపబడి, కాల్చి చంపబడ్డారు. వికార్స్ ఆఫ్ క్రైస్ట్—ద డార్క్ సైడ్ ఆఫ్ ద పాపసి, అనే తన పుస్తకంలో పీటర్ డే రోజ్ ఇలా పేర్కొన్నాడు: “పోప్ ద్వారా అధికారాన్ని పొంది, [మానవ] జాతి చరిత్రలో మానవ ఔచిత్యంపై జరిగిన అత్యంత క్రూరమైన మరియు ఎడతెగని దాడికి [ఇంక్విజిటర్‌లు] కారకులయ్యారు.” స్పెయిన్‌కు చెందిన డొమినికన్ ఇంక్విజిటరైన టార్‌క్యుమాడా గురించి పీటర్ డే రోజ్ ఇలా చెబుతున్నాడు: “1483లో నియమింపబడిన ఇతను పదిహేను సంవత్సరాలు నిరంకుశంగా పరిపాలించాడు. అతని చేతుల్లో బలైన వారి సంఖ్య 1,14,000, వారిలో 10,220 మంది దహించబడ్డారు.”
కేవలం క్రైస్తవమత సామ్రాజ్యపు మతాలు మాత్రమే రక్తాపరాధులు కాదన్నది నిజం. పాన్‌సే [“తలంపులు”] అనే తన గ్రంథంలో, ఫ్రెంచి తాత్వికుడైన బ్లాజ్ పాస్కల్ ఇలా గమనించి చెప్పాడు: “మనుష్యులు దుష్టత్వాన్ని మతపర విశ్వాసాలతో చేసినప్పుడు ఎంత సంపూర్ణంగా, ఎంత ఆనందంగా చేస్తారో అలా మరెప్పుడూ చేయరు.”
వారి ఫలముల ద్వారా గుర్తింపబడటం
దేవుని దృక్కోణం నుండి చూస్తే, ఒక మతం అంగీకరించబడటం అనేది కేవలం ఒక అంశంపై మాత్రమే ఆధారపడదు. ఆయన ఒక మతాన్ని అంగీకరించాలంటే, దాని బోధలు, కార్యకలాపాలు ఆయన వ్రాతపూర్వక సత్య వాక్యమైన బైబిలుకు తగినట్టు ఉండాలి. (కీర్తన 119:160; యోహాను 17:17) దేవుడు అంగీకరించిన ఆరాధన యొక్క ఫలం యెహోవా దేవుని ప్రమాణాలకు తగినట్టు ఉండాలి.
దేవునికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని బూటకంగా చెప్పుకునే ప్రవక్తలు ఉంటారని యేసుక్రీస్తు తన కొండమీది ప్రసంగంలో సూచించాడు. యేసు ఇలా చెప్పాడు: “అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో ద్రాక్షపండ్లనైనను, పల్లేరుచెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా? ఆలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కానిఫలములు ఫలించును. మంచి చెట్టు కానిఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు.” (మత్తయి 7:15-20) మనం ఆత్మీయంగా మెలుకువగా ఉండాల్సిన అవసరత ఉందని ఈ మాటలు చూపుతున్నాయి. ఓ మత నాయకుడు లేక గుంపు దేవునికి మరియు క్రీస్తుకు అంగీకారమైన వారిగా ఉన్నారని మనం తలంచవచ్చు, అయితే మనం పొరబడే అవకాశముంది.
అప్రమత్తంగా ఉండాల్సిన అవసరత
తనకు దేవుని అంగీకారం ఉందని ఒక మతం చెప్పుకుంటున్నప్పటికీ, దాని పరిచారకులు బైబిలు నుండి కొన్ని వాక్యాలు చదివినప్పటికీ, అది దేవున్ని ప్రీతిపర్చే ఆరాధనని దాని అర్థం కాదు. దేవుడు వారి ద్వారా పని చేస్తున్నాడేమో అని అనిపించే పనులను కూడా దాని నాయకులు చేయవచ్చు. అయినప్పటికీ, దేవునికి అంగీకృతమైన ఫలాలను ఫలింపకుండా ఉంటే ఆ మతం అబద్ధమైనదే. మోషే కాలంనాటి ఐగుప్తు శకునగాండ్రు మహత్కార్యాలు చేయగలిగారు, అయితే వారికి దేవుని అంగీకారం ఎంతమాత్రం లేదు.—నిర్గమకాండము 7:8-22.
గతంలో వలె నేడు కూడా అనేక మతాలు, ఏది సత్యమని దేవుడు ప్రకటించాడో దానికి హత్తుకునే బదులు మానవ తలంపులను మరియు తత్వాలను ప్రోత్సహిస్తున్నాయి. అప్పుడు ఈ బైబిలు హెచ్చరిక ప్రాముఖ్యంగా సముచితంగా ఉంటుంది: “ఆయనను (క్రీస్తును) అనుసరింపక మనష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.”—కొలొస్సయులు 2:8.
మంచి, చెడు ఫలాల గురించి మాట్లాడిన తర్వాత, యేసు ఇలా చెప్పాడు: “ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి—ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు—నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయు వారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.”—మత్తయి 7:21-23.
ఫలములను పరిశీలించండి
స్పష్టంగా, ఒక మతం దేవునికి అంగీకారమైనదని ముగించి చెప్పే ముందు దాని ఫలాలను చూడటం ఎంతో ఆవశ్యకం మరి. ఉదాహరణకు, మతం రాజకీయాల్లో భాగం వహిస్తుందా? యాకోబు 4:4 నందు నివేదింపబడిన ఈ మాటలను గమనించండి: “యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.” అంతేకాకుండా, యేసు తన నిజ అనుచరులను గురించి ఇలా చెప్పాడు: “నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.” (యోహాను 17:16) దేవుని దృష్టిలో మంచిదైయున్న మతం, అదృశ్య ఆత్మీయ జీవియైన అపవాదియగు సాతాను అనబడే “దుష్టుని యందున్న” ఈ ప్రపంచపు రాజకీయాల్లో జోక్యము కల్గియుండదు. (1 యోహాను 5:19) బదులుగా, దేవుడు అంగీకరించే మతం యేసుక్రీస్తు పరిపాలించే దేవుని రాజ్యానికి నమ్మకంగా మద్దతునిస్తుంది మరియు ఆ పరలోక ప్రభుత్వాన్ని గురించిన సువార్తను ప్రకటిస్తుంది.—మార్కు 13:10.
ఒక మతం శాసనోల్లంఘనను పురికొల్పితే అది దేవునికి అంగీకారయోగ్యమైనదేనా? అపొస్తలుడైన పౌలు సలహాకు మనం చెవి యొగ్గితే దాని జవాబు స్పష్టమౌతుంది: “అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడియుండవలెననియు, మనుష్యులందరియెడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు . . . యుండవలెననియు, వారికి జ్ఞాపకము చేయుము.” (తీతు 3:1) తన అనుచరులు “కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని” చెల్లించాలని యేసు చూపాడన్నది వాస్తవమే.—మార్కు 12:17.
ఒకవేళ దేశాల యుద్ధాల్లో పాల్పంచుకోవడాన్ని ఒక మతం ప్రోత్సహిస్తే. “మేలుచేయవలెను” మరియు “సమాధానమును వెదకి దాని వెంటాడవలెను” అని 1 పేతురు 3:11 మనలను పురికొల్పుతుంది. ఒక మతం యొక్క సభ్యులు మరొక దేశంలో ఉన్న తోటి ఆరాధికులను యుద్ధంలో చంపేందుకు సుముఖంగా ఉంటే అది దేవున్ని ఎలా ప్రీతిపరచగలదు? దేవుడు అంగీకరించే మతంలోని సభ్యులు ఆయన ప్రముఖ లక్షణమైన ప్రేమను ప్రతిబింబిస్తారు. యేసు, “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను.” (యోహాను 13:35) దేశాల యుద్ధాల్లో పురికొల్పబడే దౌర్జన్యపూరిత ద్వేషంతో ఆ ప్రేమకు ఎలాంటి పొంతనలేదు.
నిజమైన మతం యుద్ధాన్ని ప్రేమించే ప్రజలను శాంతికాముకులుగా మార్చుతుంది. ఇది ఈ మాటల్లో ముందే చెప్పబడింది: “వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.” (యెషయా 2:4) ద్వేషపూరిత మాటలను విసిరే బదులు, సత్యారాధనను అనుసరించే వారు ఈ ఆజ్ఞకు అనుగుణంగా జీవిస్తారు: ‘నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను.’—మత్తయి 22:39.
సత్యారాధనను అనుసరించే వారు అనైతిక జీవిత విధానాన్ని అలవరచుకునేందుకు నిరాకరిస్తూ, యెహోవా దేవుని ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా జీవించేందుకు కృషి చేస్తారు. దేవుని వాక్యం ఇలా చెబుతుంది: “అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుషసంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని, ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడితిరి.”—1 కొరింథీయులు 6:9-11.
నిర్ణయాత్మక చర్యకు సమయం
అబద్ధ ఆరాధన మరియు సత్యమైన మతానికి మధ్యగల వ్యత్యాసాన్ని గుర్తించడం ఎంతో ఆవశ్యకం. బైబిలు పుస్తకమైన ప్రకటన గ్రంథంలో, ‘భూరాజులు’ ఎవరితో ‘వ్యభిచరించారో’ ఆ సూచనార్థక వేశ్యయైన “మహా బబులోను” అని ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యం గుర్తించబడింది. ఆమె రక్తాపరాధియై “ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచారసంబంధమైన అపవిత్రకార్యములతోను నిండిన” బంగారు పాత్రను పట్టుకునివుంది. (ప్రకటన 17:1-6) ఆమెను గురించినది ఏది కూడా దేవునికి అంగీకారంగా లేదు.
నిర్ణయాత్మక చర్య తీసుకునేందుకు ఇదే సమయం. ఇంకా మహా బబులోనులో ఉన్న యథార్థపరులైన ప్రజలకు ప్రేమగల మన సృష్టికర్త ఇలాంటి పిలుపునిస్తున్నాడు: “నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారుకాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి.”—ప్రకటన 18:4.
దేవున్ని ప్రీతిపర్చే మతాన్ని మీరు అవలంబించాలని అనుకుంటుంటే, యెహోవాసాక్షులతో ఎక్కువ పరిచయం ఎందుకు పెంచుకోకూడదు? వారి విశ్వాసాల్లో కొన్నింటిని మరియు వాటికిగల లేఖనాధార సూత్రాలను కూడా చార్టు వరుసగా చూపుతుంది. సాక్షుల విశ్వాసాలు దేవుని వాక్యానికి అనుగుణంగా ఉన్నాయో లేదో చూసేందుకు మీ బైబిలును తెరిచి చూడండి. సత్యారాధననుండి మీరు అపేక్షించే ఫలాలను వారి మతం ఫలిస్తుందో లేదో కనుగొనేందుకు పరిశోధన చేయండి. అది ఫలిస్తుందని మీరు కనుగొంటే, దేవున్ని ప్రీతిపరిచే మతాన్ని మీరు కనుగొని ఉంటారు.
[5వ పేజీలోని బాక్సు]
యెహోవాసాక్షులు ఏమి నమ్ముతారు
నమ్మకం — బైబిలు ఆధారం
దేవుని పేరు యెహోవా నిర్గమకాండము 6:3; కీర్తన 83:18
బైబిలు దేవుని వాక్యము యోహాను 17:17; 2 తిమోతి 3:16, 17
యేసుక్రీస్తు దేవుని కుమారుడు మత్తయి 3:16, 17; యోహాను 14:28
మానవజాతి పరిణామం చెందలేదు కానీ సృష్టింపబడింది ఆదికాండము 1:27; 2:7
మొదటి మానవుని పాపం వలననే మానవులు మరణిస్తున్నారు రోమీయులు 5:12
మరణమందు ప్రాణము ప్రసంగి 9:5, 10;
ఉనికిలో ఉండకుండా పోతుంది యెహెజ్కేలు 18:4
నరకము మానవజాతి యొక్క సామాన్య సమాధి యోబు 14:13; ప్రకటన 20:13
పునరుత్థానం మృతులకుగల నిరీక్షణ అపొస్తలుల యోహాను 5:28, 29; 11:25; కార్యములు 24:15
క్రీస్తు తన భూజీవితాన్ని విధేయులైన మత్తయి 20:28; 1 పేతురు 2:24;
మానవులకు విమోచన క్రయధనంగా అర్పించాడు 1 యోహాను 2:1, 2
ప్రార్థనలను కేవలం యెహోవాకు మాత్రమే క్రీస్తు ద్వారా చేయాలి మత్తయి 6:9; యోహాను 14:6, 13, 14
నైతికతలను గురించిన బైబిలు నియమాలకు విధేయత చూపాలి 1 కొరింథీయులు 6:9, 10
ఆరాధనలో విగ్రహాలను ఉపయోగించకూడదు నిర్గమకాండము 20:4-6; 1 కొరింథీయులు 10:14
అభిచారాన్ని తప్పక విసర్జించాలి ద్వితీయోపదేశకాండము 18:10-12; గలతీయులు 5:19-21
రక్తాన్ని తన శరీరంలోకి ఎక్కించుకోకూడదు ఆదికాండము 9:3, 4; అపొస్తలుల కార్యములు 15:28, 29
యేసు యొక్క నిజమైన అనుచరులు యోహాను 15:19; 17:16;
ఈ లోకం నుండి వేరుగా ఉంటారు యాకోబు 1:27; 4:4
క్రైస్తవులు సాక్ష్యమిచ్చి యెషయా 43:10-12;
సువార్తను ప్రకటిస్తారు మత్తయి 24:14; 28:19, 20
పూర్తిగా నీటిలో ముంచడం ద్వారా మార్కు 1:9, 10;
ఇవ్వబడే బాప్తిస్మము అపొస్తలుల యోహాను 3:22; కార్యములు 19:4, 5
మతపర బిరుదులు లేఖన రహితమైనవి యోబు 32:21, 22; మత్తయి 23:8-12
మనం “అంత్యకాలము”లో జీవిస్తున్నాము దానియేలు 12:4; మత్తయి 24:3-14; 2 తిమోతి 3:1-5
క్రీస్తు ప్రత్యక్షత అదృశ్యమైనది మత్తయి 24:3; యోహాను 14:19; 1 పేతురు 3:18
సాతాను ఈ లోకం యొక్క అదృశ్య పరిపాలకుడు యోహాను 12:31; 1 యోహాను 5:19
దేవుడు ప్రస్తుతమున్న దానియేలు 2:44;
దుష్ట విధానాన్ని నాశనం చేస్తాడు ప్రకటన 16:14, 15; 18:1-8
క్రీస్తు ఆధ్వర్యములో యెషయా 9:6, 7; దానియేలు 7:13, 14;
దేవుని రాజ్యం ఈ భూమిని నీతితో పరిపాలిస్తుంది మత్తయి 6:10
ఒక ‘చిన్న మంద’ క్రీస్తుతోపాటు లూకా 12:32;
పరలోకంలో పరిపాలిస్తుంది ప్రకటన 14:1-4; 20:4
దేవుడు అంగీకరించే ఇతరులు లూకా 23:43; యోహాను 3:16;
ఓ పరదైసు భూమిపై నిత్యజీవాన్ని పొందుతారు ప్రకటన 21:1-4
[4వ పేజీలోని చిత్రం]
ఇంక్విజిషన్‌ల సమయంలో వేలాదిమంది హత్యచేయబడ్డారు
[6వ పేజీలోని చిత్రం]
క్రూసేడ్‌లు దారుణమైన రక్తపాతానికి దారితీశాయి
[7వ పేజీలోని చిత్రం]
నిజమైన మతం దాని మంచి ఫలాలనుబట్టి గుర్తింపబడుతుంది
[2వ పేజీలోని చిత్రసౌజన్యం]
Cover: Garo Nalbandian