మరణించిన మీ ప్రియమైనవారు—వారిని మీరు మరలా చూడగలరా?
జాన్ తల్లి మరణించినప్పుడు ఆయన కేవలం తొమ్మిదేండ్లవాడే. శవాన్ని సిద్ధంచేసే గదిలో సంభవించిన దాన్ని ఆయన ఆ తర్వాత జ్ఞాపకం చేసుకున్నాడు: “నేను ఆమె కొరకు ఒక బొమ్మను గీసి, మా అందరికొరకు పరలోకంలో వేచివుండమని కోరుతూ ఓ చిన్న నోటును రాశాను. ఆమెతో పాటు శవపేటికలో పెట్టడానికి దాన్ని మా నాన్నగారి చేతికిచ్చాను, ఆమె మరణించినప్పటికీ నా నుండి నా చివరి సమాచారం ఆమెకు అందిందని తలంచడం నాకు యిష్టం.”—జిల్ క్రెమెంట్స్ వ్రాసిన హౌ యిట్ ఫీల్స్ వెన్ ఎ పేరెంట్ డైస్.
జాన్ తన తల్లిని గాఢంగా ప్రేమించాడనడంలో ఏ సందేహమూ లేదు. ఆమె మంచి లక్షణాలను వివరించిన తర్వాత అతను యిలా అన్నారు: “బహుశ నేను చెడు విషయాలను జ్ఞాపకంచేసుకోవడం లేదు, అయినా ఆమెను గూర్చి నేను చెడుగా తలంచలేకపోతున్నాను. నా జీవితమంతటిలోను నేను చూసిన వారందరిలోనూ ఆమెయే అతి శ్రేష్ఠమైన స్త్రీ.”
జాన్ వలెనే అనేకమంది, మరణించిన తమ ప్రియమైన వారిని గూర్చి మధురమైన జ్ఞాపకాలు గల్గి, వారిని చూడాలనే భావోద్రేకమైన అవసరత ఉందని అంగీకరిస్తున్నారు. తన 26 ఏండ్ల కొడుకు క్యాన్సర్తో చనిపోయిన ఎడిత్ యిలా చెప్పారు: “నా కొడుకు ఎక్కడో ఉన్నాడని నమ్మడం నాకు అవసరం, అయితే అది ఎక్కడన్నది నాకు తెలీదు. నేను వాడ్ని మరలా చూస్తానా? నాకు తెలియదు గానీ నేను మాత్రం చూస్తానని నిరీక్షిస్తున్నాను.”
నిజంగా, మానవుని ప్రేమగల సృష్టికర్త, ఈ మానవసహజ కోరికను తెలియనివాడు కాడు. అందుకొరకే లక్షలాది మంది ప్రజలు మరణించిన తమ ప్రియమైన వారిని తిరిగి కలుసుకునే సమయం వస్తుందని ఆయన వాగ్దానం చేశాడు.—యెషయా 26:19; దానియేలు 12:2, 13; హోషేయ 13:14; యోహాను 5:28, 29; ప్రకటన 20:12, 13.
పరలోకానికి ఎవరు పునరుత్థానమౌతారు?
తన ప్రియమైన తల్లి తన కొరకు పరలోకంలో ఎదురుచూస్తుందనే జాన్ యొక్క నిరీక్షణను మనం పరిశీలిద్దాం. చర్చీకి వెళ్లే అనేకమందికి ఈ నిరీక్షణ లేదా నమ్మకం ఉంది. అలాంటి అభిప్రాయాలకు మద్దతునిచ్చే ప్రయత్నంలో, మతనాయకులూ యితర సంఘ సంస్కర్తలూ బైబిలు వచనాలను తప్పుగా అన్వయిస్తుంటారు.
ఉదాహరణకు, తమ ప్రియమైనవారు మరణించిన బాధలో ఉన్న వారికి సహాయం చేసే నిపుణురాలైన డా. ఎలిజబెత్ క్యూబ్లర్-రాస్, ఆన్ చిల్డ్రన్ అండ్ డెత్ అనే తన పుస్తకంలో యిలా వ్రాశారు: “చనిపోవడమంటే, పాతదై చిరిగిపోయిన ఓ కోటును తీసేసినట్లుగా, లేక ఒక గదిలో నుండి మరో గదిలోకి అడుగిడినట్లుగా మనం మన శరీరాన్ని విడిచిపెట్టడమే. ప్రసంగి 12:7లో మనం యిలా చదువుతాము: ‘అప్పుడు మునుపున్నట్లు, మట్టి భూమిలో కలిసిపోతుంది; ఆత్మ దాన్నిచ్చిన దేవుని వద్దకు మరలివెళుతుంది.’ యేసు యిలా అన్నాడు: ‘నేను ఎక్కడవుంటే మీరునూ అక్కడే ఉండులాగున నేను వెళ్లి మీకొరకు చోటు సిద్ధపరుస్తాను.’ అంతేకాకుండా సిలువపైన దొంగతో యిలా అన్నాడు: ‘నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు.’”
పై వచనాల నిజమైన భావం, మరణించిన మన ప్రియమైనవారు జీవించివుండి మన కొరకు పరలోకంలో ఎదురుచూస్తున్నారనా? ప్రసంగి 12:7తో ప్రారంభిస్తూ ఈ వచనాలను మనం మరింత జాగ్రత్తగా పరిశీలిద్దాం. “బ్రతికి ఉండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు,” అని అంతకుముందే అదే బైబిలు పుస్తకంలో పేర్కొన్న ఆ జ్ఞాని తన స్వంత వ్యాఖ్యానంతో అసంగతంగా ఉండేలా తలంచివుండడన్నది స్పష్టం. (ప్రసంగి 9:5) ఆయన పూర్తి మానవజాతి మరణం గూర్చి చర్చించాడు. తాము నాస్తికులమని బహిరంగంగా చెప్పుకునేవారు, కరుడుగట్టిన నేరస్థులందరూ చనిపోయిన తర్వాత దేవుని దగ్గరకు మరలుతారని నమ్మడం సమంజసమేనా? కానే కాదు. వాస్తవానికి, మనలను మనం మంచివారిగా లేక చెడ్డవారిగా ఎంచుకున్నా మనలో ఎవ్వరమూ దేవుని దగ్గరకు వెళతామని చెప్పలేము. మనలో ఎవ్వరమూ దేవునితో పరలోకంలో ఉండలేదు గనుక, మనం ఆయన దగ్గరకు మరలుతామని ఎలా చెప్పవచ్చు?
మరి చనిపోయినప్పుడు ‘ఆత్మ సత్య దేవుని వద్దకు మరలుతుంది’ అని బైబిలు రచయిత చెప్పినదాని భావమేమిటి? “ఆత్మ” అని అనువదించిన హెబ్రీ పదాన్ని ఉపయోగించడంలో, ఓ మానవుని నుండి మానవునికి వేరుగావుండే ఒక ప్రత్యేకమైనదాన్ని సూచించడంలేదు. బదులుగా, ప్రసంగి 3:19లో అదే ప్రేరేపిత బైబిలు గ్రంథకర్త మానవునికీ జంతువులకూ “ఒక్కటే ప్రాణము” అని వివరించాడు. మానవుని యొక్క, జంతువుల యొక్క భౌతిక శరీరాలు తయారు కావడానికి కారణమైన కణాల్లోని జీవ శక్తే ఈ “ఆత్మ” అని ఆయన స్పష్టమైన భావం. ఈ ఆత్మను దేవున్నుండి మనం నేరుగా పొందలేదు. మనం గర్భంలో ఉండి, తర్వాత పుట్టినప్పుడు మన మానవ తలిదండ్రులు దాన్ని మనకు పంచియిచ్చారు. అంతేకాకుండా, చనిపోయినప్పుడు ఈ ఆత్మ అక్షరార్థంగా అంతరిక్షం గుండా ప్రయాణించి దేవుని దగ్గరకు మరలదు. ‘ఆత్మ సత్య దేవుని వద్దకు మరలుతుంది’ అనే ఈ పదం, మరణించిన వ్యక్తి భవిష్యత్ నిరీక్షణ దేవునితో ఉంటుందన్న భావానికి అలంకార రూపకం. ఆయన ఎవరిని జ్ఞాపకం చేసుకుని పునరుత్థానం చేస్తాడన్నది ఆయనే నిర్ణయిస్తాడు. కీర్తన 104:29, 30లో, దీన్ని బైబిలు ఎంత స్పష్టంగా చెబుతోందో మీకైమీరే గమనించండి.
యేసు నమ్మకమైన అనుచరుల్లో మొత్తం 1,44,000 మంది నిర్దిష్ట సంఖ్య మాత్రమే, దేవుని ఆత్మీయ కుమారులుగా పరలోక పునరుత్థానాన్ని పొందుతారని యెహోవా దేవుడు సంకల్పించాడు. (ప్రకటన 14:1, 3) వీరు భూమిపైని మానవజాతి ఆశీర్వాదం కొరకు క్రీస్తుతో పరలోక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు.
దీన్ని గూర్చి మొట్ట మొదట నేర్చుకున్నది యేసు నమ్మకమైన అపొస్తలులే, వారితో ఆయన యిలా అన్నారు: “నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.” (యోహాను 14:2, 3) ఆ అపొస్తలులూ యితర తొలి క్రైస్తవులూ మరణించారు అంతేకాకుండా పరలోక పునరుత్థానాన్ని తమకు పారితోషికంగా యిచ్చే యేసు రాకడ వచ్చేంతవరకూ మరణంలో స్పృహ లేకుండా ఎదురుచూడాలి. అందుకే మొదటి క్రైస్తవ హతసాక్షియైన స్తెఫను ‘మరణమందు నిద్రించెను’ అని మనం చదువుతాము.—అపొస్తలుల కార్యములు 7:60; 1 థెస్సలొనీకయులు 4:13.
భూమ్మీద జీవించడానికి పునరుత్థానం
మరి తనతో మరణించిన నేరస్థునికి యేసు చేసిన వాగ్దానం విషయమేమిటి? ఆ కాలంలోని అనేక యూదుల్లాగే యితను కూడా, ఒక రాజ్యాన్ని స్థాపించి, యూదా జనాంగానికి భూమ్మీద శాంతి భద్రతలను పునఃస్థాపించే, ఓ మెస్సీయను దేవుడు పంపిస్తాడని నమ్మాడు. (1 రాజులు 4:20-25ను లూకా 19:11; 24:21, అపొస్తలుల కార్యములు 1:6 పోల్చండి.) అంతేకాకుండా, రాజుగా ఉండడానికి దేవుడు ఎన్నుకున్న వ్యక్తి యేసేనన్న విశ్వాసాన్ని ఆ తప్పిదస్థుడు వ్యక్తపర్చాడు. అయినప్పటికీ, ఆ సమయంలో నిందితునిగా యేసుకు సంభవించబోయే మరణం దీన్ని అనుచితమైందిగా కనబడేటట్లు చేసింది. అందుకనే యీ మాటలతో తన వాగ్దానాన్ని ప్రవేశపెడుతూ యేసు ఆ నేరస్థునికి అభయమిచ్చాడు: “నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నేను నేడు నీతో చెప్పు చున్నాను.”—లూకా 23:42, 43, NW.
“నేడు” అనే పదం ముందు కామా చేర్చిన బైబిలు అనువాదాలు, యేసు మాటలను అర్థంచేసుకోవాలనుకునే ప్రజలకు సమస్యను ఉత్పన్నం చేస్తాయి. అదే రోజున యేసు ఏ పరదైసుకూ వెళ్లలేదు. బదులుగా, దేవుడు మరలా అతన్ని పునరుత్థానం చేసేంతవరకూ ఏమీ ఎరుగకుండా మరణంలో మూడు రోజుల పాటు ఉన్నాడు. యేసు పునరుత్థానమై పరలోకానికి ఆరోహణమైన తర్వాత కూడా మానవ జాతిపై ఆయన రాజుగా ఏలే సమయం వచ్చేంతవరకూ తన తండ్రి కుడి పార్శ్వమున వేచివుండాల్సి వచ్చింది. (హెబ్రీయులు 10:12, 13) త్వరలోనే, యేసు రాజ్య పరిపాలన మానవ జాతికి ఉపశమనాన్ని తీసుకువస్తుంది, అంతేకాకుండా అది భూమినంతటిని పరదైసుగా మారుస్తుంది. (లూకా 21:10, 11, 25-31) అప్పుడు ఆయన ఆ నేరస్థున్ని పునరుత్థానం చేయడం ద్వారా అతనికిచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అంతేకాకుండా యేసు ఆ మనిషితో ఉంటాడంటే, అతని జీవిత విధానాన్ని దేవుని నీతియుక్త కట్టడలకు అనుగుణంగా మరల్చుకోడంతో సహా అతని అవసరతలన్నిటిలోనూ అతనికి సహాయం చేస్తాడని భావము.
అనేకుల పునరుత్థానం
పశ్చాత్తాపపడిన ఆ నేరస్థునికి జరిగినట్లే, భూమ్మీద అనేకమంది మానవులకు పునరుత్థానం జరుగుతుంది. మానవుని సృజించడంలో దేవునికిగల ఉద్దేశంతో యిది పొందిక కల్గి ఉంటుంది. మొదటి స్త్రీపురుషులు పరదైసు వనంలో ఉంచబడి, భూమిని ఏలుడని ఆజ్ఞాపించబడ్డారు. వారు దేవునికి విధేయులై ఉండివుంటే, వారు ఎన్నడూ వృద్ధులై, మరణించియుండేవారు కాదు. దేవుని యుక్త సమయంలో, భూమి అంతట వశపరుచుకోబడివుండేది, ఆదాము అతని పరిపూర్ణ వారసులు దాన్ని భూవ్యాప్తంగా ఉన్న పరదైసుగా తయారు చేసివుండేవారు.—ఆదికాండము 1:28; 2:8, 9.
అయితే ఆదాము హవ్వలు బుద్ధిపూర్వకంగా పాపం చేశారు గనుక, వారు తమపై అలాగే తమ బావి సంతానంపై కూడా మృత్యువును తెచ్చిపెట్టుకున్నారు. (ఆదికాండము 2:16, 17; 3:17-19) అందుకనే బైబిలు యిలా పేర్కొంటోంది: “ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా [ఆదాము] పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.”—రోమీయులు 5:12.
సంప్రాప్తమైన పాపం నుండి స్వతంత్రునిగా ఒకే ఒక వ్యక్తి జన్మించాడు. ఆయన ఎవరంటే, పరలోకం నుండి యూదా కన్యకైన మరియ గర్భంలోకి తన జీవం మార్చబడిన దేవుని పరిపూర్ణ కుమారుడైన యేసుక్రీస్తు. యేసు పాపరహితునిగా ఉన్నాడు గనుక మరణ శిక్షకు పాత్రుడు కాలేదు. కాబట్టి, “లోకపాపము” నిమిత్తము తన మరణము విమోచన విలువను కల్గివుంది. (యోహాను 1:29; మత్తయి 20:28) అందుచేతనే యేసు యిలా అనగల్గాడు: “పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును.”—యోహాను 11:25.
కనుక, మరణించిన మీ ప్రియమైన వారిని తిరిగి కలిసే ఉత్తరాపేక్షను మీరు తప్పకుండా కల్గివుండవచ్చు, అయితే దాని కొరకు మీరు యేసు విమోచకుడని ఆయన యందు విశ్వసించి దేవుని అభిషక్త రాజుగా ఆయనకు విధేయులుగా ఉండడం అవసరం. త్వరలోనే దేవుని రాజ్యం ఈ భూమ్మీదనున్న చెడుతనాన్ని తుడిచివేస్తుంది. దాని పరిపాలనకు విధేయులుకావడానికి నిరాకరించిన మానవులందరూ నాశనమౌతారు. అయితే, దేవుని రాజ్య పౌరులు తప్పించుకుని, ఈ భూమిని ఓ పరదైసుగా మార్చే పనిలో వారు హడావుడిగా ఉంటారు.—కీర్తన 37:10, 11; ప్రకటన 21:3-5.
తర్వాత పునరుత్థానం ప్రారంభమయ్యే పులకరింపజేసే సమయం వస్తుంది. మరణించిన వారిని ఆహ్వానించడానికి మీరు అక్కడ ఉంటారా? అదంతా యిప్పుడు మీరు చేసే దానిపైన ఆధారపడివుంటుంది. తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా యెహోవా రాజ్య పరిపాలనకు యిప్పుడు విధేయులైనవారందరికీ అద్భుతమైన ఆశీర్వాదాలు వేచివున్నాయి.