కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 10/15 పేజీలు 4-7
  • మరణం తరువాత జీవితం—ఎలా, ఎక్కడ, ఎప్పుడు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మరణం తరువాత జీవితం—ఎలా, ఎక్కడ, ఎప్పుడు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అమర్త్యత జవాబా?
  • మృతుల స్థితి
  • పూర్తి వ్యక్తి మరణిస్తాడు
  • పునరుత్థానం—ఒక సంతోషకరమైన సమయం
  • అదెప్పుడు జరుగుతుంది?
  • పునరుత్థాన నిరీక్షణ ప్రభావం
  • మరణించిన మన ప్రియమైనవారికి ఏమి సంభవిస్తుంది?
    నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
  • మరణానంతర జీవితం—బైబిలేమి చెప్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఏకైక పరిష్కారం!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • పునరుత్థానంలో మీ విశ్వాసం ఎంత దృఢంగా ఉంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 10/15 పేజీలు 4-7

మరణం తరువాత జీవితం—ఎలా, ఎక్కడ, ఎప్పుడు?

మానవ మరణం జీవితాన్ని శాశ్వతంగా అంతం చేయనవసరంలేదని మానవుని సృష్టికర్త మరియు జీవదాత తన వ్యక్తిగత హామీని ఇస్తున్నాడు. అంతేగాకుండా, మరికొంత పరిమిత జీవిత కాలనిడివి వరకు మరల జీవించడం సాధ్యమని మాత్రమే కాకుండా, మరింకెన్నడూ మరణాన్ని ఎదుర్కోనవసరంలేని ఉత్తరాపేక్షతో జీవించను సాధ్యమని దేవుడు మనకు హామీ ఇస్తున్నాడు. అపొస్తలుడైన పౌలు దాన్ని స్పష్టంగా, అయితే ప్రగాఢ విశ్వాసంతో ఇలా చెప్పాడు: “మృతులలోనుండి ఆయనను [యేసుక్రీస్తును] లేపినందున దీని నమ్ముటకు [దేవుడు] అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.”—అపొస్తలుల కార్యములు 17:31, ఇటాలిక్కులు మావి.

నిజమే, ఇది ఇంకా జవాబివ్వబడని మూడు ప్రాథమిక ప్రశ్నలను విడిచిపెడుతుంది: మరణించిన ఒక వ్యక్తి మరల జీవానికి తిరిగి ఎలా రాగలడు? ఇదెప్పుడు జరుగుతుంది? ఆ నూతన జీవితం ఎక్కడ ఉంటుంది? ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రశ్నలకు, వైవిధ్యభరితమైన జవాబులు ఇవ్వబడ్డాయి, కానీ ఈ విషయంలో సత్యాన్ని నిర్ధారించడానికి మానవులు మరణించినప్పుడు వారికి ఏమి సంభవిస్తుందన్నది కచ్చితంగా అర్థం చేసుకోవడం ప్రముఖ కీలకాంశము.

అమర్త్యత జవాబా?

మనుష్యులందరిలోనూ ఒక భాగం అమర్త్యమైనదన్నది, వారి శరీరాలు మాత్రమే మరణిస్తాయన్నది బహుళ ప్రచారంలో ఉన్న ఒక నమ్మకం. అటువంటి వాదనను మీరు నిశ్చయంగా వినేవుంటారు. అమర్త్యమైనదని వాదించే ఈ భాగం “ప్రాణము” లేక “ఆత్మ” అని నానా విధాలుగా సూచించబడుతుంది. అది శరీర మరణాన్ని తప్పించుకుంటుందని, మరెక్కడో జీవిస్తుందని చెప్పబడుతుంది. నిజంగా, అటువంటి నమ్మకం బైబిలు నుండి కల్గినది కాదు. నిజమే, ప్రాచీన హెబ్రీ బైబిలులోని వ్యక్తులు మరణం తరువాతి జీవితం కొరకు ఎదురు చూశారు, కానీ వారిలోని ఏదో అమర్త్యమైన భాగం తప్పించుకుంటుందని కాదు. వారు పునరుత్థానం అనే అద్భుతం ద్వారా భవిష్యత్తులో తిరిగి భూమిపై జీవించే కాలం కొరకు నమ్మకంగా ఎదురు చూశారు.

మృతుల భవిష్యత్‌ పునరుత్థానమందు విశ్వాసం కలిగివున్న వారిలో పితరుడైన అబ్రాహాము ఒక ఉత్కృష్టమైన ఉదాహరణ. తన కుమారుడైన ఇస్సాకును బలి అర్పించడానికి అబ్రాహాము చూపిన సుముఖతను వర్ణిస్తూ హెబ్రీయులు 11:17-19 మనకు ఇలా చెబుతుంది: “అబ్రాహాము శోధింపబడి విశ్వాసమునుబట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. . . . మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యెంచినవాడై, . . . ఉపమానరూపముగా అతనిని మృతులలోనుండి మరల పొందెను,” ఎందుకంటే ఇస్సాకు బలిగా అర్పించబడాలని దేవుడు కోరలేదు. (ఒక ఆత్మ సామ్రాజ్యంలో జీవితాన్ని తక్షణమే కొనసాగిస్తామని కాదుగాని) కొంతకాలం గడిచిన తరువాత తాము జీవానికి తిరిగి వస్తామన్న తొలి నమ్మకం ఇశ్రాయేలీయులలో ఉందనడానికి మరో ప్రమాణంగా, ప్రవక్తైన హోషేయ ఇలా వ్రాశాడు: “పాతాళవశములో [మానవజాతి యొక్క సామాన్య సమాధి] నుండి నేను వారిని విమోచింతును; మృత్యువు నుండి వారిని రక్షింతును.”—హోషేయ 13:14.

కాబట్టి స్వతస్సిద్ధ మానవ అమర్త్యతను గురించిన ఆలోచన యూదా దృక్పథాలలోకి, నమ్మకాలలోకి ఎలా ప్రవేశించింది? “బహుశ గ్రీకుల ప్రభావం మూలంగా, ప్రాణము యొక్క అమర్త్యత అనే సిద్ధాంతం యూదా మతంలోనికి ప్రవేశించివుండవచ్చు” అని ఎన్‌సైక్లోపీడియా జూడైకా ఒప్పుకుంటుంది. అయినప్పటికీ, క్రీస్తు కాలం వరకు నిష్ఠగల యూదులు ఇంకా భవిష్యత్తులో జరగబోయే పునరుత్థానమందు నమ్మకం ఉంచి, దాని కొరకు ఎదురు చూశారు. ఆమె సహోదరుడైన లాజరు మరణించినప్పుడు యేసు మార్తతో జరిపిన సంభాషణ ద్వారా మనం దీనిని స్పష్టంగా చూడగలము: ‘మార్త యేసుతో—ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండునని అన్నది. . . . అందుకు యేసు—నీ సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో—అంత్యదినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదుననెను.’—యోహాను 11:21-24.

మృతుల స్థితి

మరలా ఇక్కడ సంగతేమిటో ఊహించనవసరం లేదు. సరళమైన బైబిలు సత్యమేమిటంటే మృతులు స్పృహ లేకుండా, భావాలు లేక జ్ఞానం ఏమాత్రం లేకుండా “నిద్రిస్తున్నారు.” అటువంటి సత్యాన్ని సంక్లిష్టమైన, గ్రహించడానికి కష్టమైన పద్ధతిలో బైబిలు అందించలేదు. అర్థం చేసుకోవడానికి సులభంగా ఉన్న ఈ లేఖనాలను పరిశీలించండి: “బ్రతికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; . . . చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.” (ప్రసంగి 9:5, 10) “రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును.”—కీర్తన 146:3, 4.

అందువలన మరణాన్ని యేసుక్రీస్తు నిద్ర అని ఎందుకు సంబోధించాడో అర్థం చేసుకోదగినదే. యేసు ఆయన శిష్యుల మధ్య జరిగిన ఒక సంభాషణను అపొస్తలుడైన యోహాను నమోదు చేశాడు: “ఆయన యీ మాటలు చెప్పిన తరువాత—మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలుకొలుప వెళ్లుచున్నానని వారితో చెప్పగా శిష్యులు—ప్రభువా, అతడు నిద్రించినయెడల బాగుపడుననిరి. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి. కావున యేసు—లాజరు చనిపోయెను . . . [అని] స్పష్టముగా వారితో చెప్పెను.”—యోహాను 11:11-14

పూర్తి వ్యక్తి మరణిస్తాడు

మానవ మరణ ప్రక్రియలో పూర్తి వ్యక్తి ఇమిడివున్నాడు, కేవలం శరీరం యొక్క మరణం మాత్రమే కాదు. స్పష్టమైన బైబిలు మాటల ప్రకారం, ఆతని శరీరాన్ని తప్పించుకోగలిగే అమర్త్య ప్రాణమును మానవుడు కలిగివుండడు అని మనం నిర్ధారించాలి. ప్రాణము మరణించగలదని లేఖనాలు స్పష్టంగా సూచిస్తున్నాయి. “మనుష్యులందరు నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరును నా వశములో ఉన్నారు; పాపము చేయువాడెవడో వాడే [“ప్రాణము,” NW] మరణము నొందును.” (యెహెజ్కేలు 18:4) “అమర్త్యము” లేక “అమర్త్యత” అనేవి మానవజాతిలో స్వతస్సిద్ధంగా ఉన్నట్లు ఎక్కడా పేర్కొనబడలేదు.

న్యూ కాథోలిక్‌ ఎన్‌సైక్లోపీడియా “ప్రాణము” అని అనువదింపబడిన హెబ్రీ, గ్రీకు పదాల ఆసక్తికరమైన పూర్వరంగాన్ని అందజేస్తుంది: “పాత నిబంధనలో ప్రాణము నెపెస్‌, క్రొత్త నిబంధనలో అది [సై·కే]. . . . బహుశ ఊపిరి పీల్చు అని అర్థమిచ్చే ప్రాథమిక మూల పదం నుండి నెపెస్‌ వస్తుంది, ఆ విధంగా . . . మరణించిన వారి నుండి జీవించిన వారిని ఊపిరి వేర్పరుస్తుంది గనుక, నెపెస్‌ అంటే జీవం లేక వ్యక్తి లేక కేవలం వ్యక్తిగత జీవం అని అర్థం వహించనారంభించింది. . . . శరీరము, ప్రాణములలో వర్గద్వయ విభజన [రెండు భాగాలుగా విభజించడం] పాత నిబంధనలో లేదు. ఒక ఇశ్రాయేలీయుడు విషయాలను వాటి మొత్తంలో, వస్తుతః చూశాడు, తద్వారా ఆయన మనుష్యులను వ్యక్తులుగా చూశాడు కానీ సంయుక్త భాగాలుగా చూడలేదు. నెపెస్‌ అనే పదం, మన పదమైన ప్రాణముగా అనువదించబడినా, ఎన్నటికీ అది శరీరము లేక ఒక ప్రత్యేక వ్యక్తి నుండి వేరుగా ఉండే ప్రాణము అని అర్థం కాదు. . . . [సై·కే] అనే క్రొత్త నిబంధన పదం నెపెస్‌తో జతచేయగలిగే పదం. అది జీవం యొక్క ప్రధాన మూలం అని, జీవం అని, లేక జీవించు వ్యక్తి అని అర్థమివ్వగలదు.”

అందువలన మరణించినప్పుడు ఇంతకుముందు జీవించిన వ్యక్తి, లేక జీవించు ప్రాణము ఉనికిలో లేకుండాపోతుందని మీరు గమనించగలరు. పూడ్చిపెట్టడం, తరువాత కృశించిపోవడం ద్వారా నెమ్మదిగాను లేక దహనం చేయడం ద్వారా త్వరగాను శరీరం ‘మంటి’లో లేక భూమిలోని మూలకాలలో కలిసిపోతుంది. యెహోవా ఆదాముతో “నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.” (ఆదికాండము 3:19) అట్లైతే, మరణం తరువాత జీవితం ఎలా సాధ్యం? ఎలాగంటే మరణించిన వ్యక్తిని గురించి దేవుడు తన స్వంత స్మృతిని కలిగివున్నాడు కాబట్టి. మానవులను సృష్టించే శక్తి మరియు సామర్థ్యం యెహోవాకు ఉన్నాయి, అందువలన ఆయన తన స్మృతిలో ఆ వ్యక్తి యొక్క జీవిత నమూనా గురించిన రికార్డును దాచివుంచగలడన్నది ఆశ్చర్యకరంగా ఉండకూడదు. అవును, ఆ వ్యక్తి మరల జీవించే అవకాశాలన్నీ దేవుని వద్ద ఉంటాయి.

దాని దయచేసిన సత్య దేవుని వద్దకు తిరిగి వెళ్లిపోతుందని చెప్పబడిన “ఆత్మ” అనే పదం యొక్క భావం ఇదే. ఈ పరిణామాన్ని వర్ణిస్తూ ప్రసంగి పుస్తక ప్రేరేపిత రచయిత ఇలా వివరిస్తున్నాడు: “మన్నయినది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవునియొద్దకు మరల పోవును.”—ప్రసంగి 12:7.

దేవుడు మాత్రమే ఎవరినైనా సజీవునిగా చేయగలడు. ఏదెనులో దేవుడు మనుష్యుని సృష్టించి, ఆయన నాసికారంధ్రములలో “జీవవాయువును” ఊదినప్పుడు, ఆదాము ఊపిరితిత్తులను గాలితో నింపడమే కాకుండా, ఆ జీవ-శక్తి ఆయన శరీరంలోని కణాలన్నింటికీ శక్తినిచ్చేలా యెహోవా చేశాడు. (ఆదికాండము 2:7) గర్భధారణ మరియు పుట్టుక ప్రక్రియల ద్వారా ఈ జీవ-శక్తి తలిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమింపజేయబడగలదు గనుక, మానవ జీవం తలిదండ్రుల ద్వారా వచ్చినదే అయినప్పటికీ అది సరియైన విధంగానే దేవునికి ఆపాదించబడగలదు.

పునరుత్థానం—ఒక సంతోషకరమైన సమయం

పరిశుద్ధ లేఖనాల్లో ఏమాత్రం ఆధారం లేని పునర్జన్మతో పునరుత్థానాన్ని కలిపి గలిబిలి చేయకూడదు. ఒక వ్యక్తి మరణించిన తరువాత, ఆయన ఒకటి లేక క్రమానుసారమైన మరిన్ని జీవితాలను అనుభవించడానికి తిరిగి జన్మిస్తాడనే నమ్మకమే పునర్జన్మ. ఆ పూర్వ జన్మలో నిర్మించుకున్నారని చెప్పబడే రికార్డు ఆధారంగా ఇది ఒకరి పూర్వ జన్మతో పోలిస్తే, అటు ఉన్నత శ్రేణికి చెందిన జీవితం కావచ్చు లేక అధమ శ్రేణికి చెందిన జీవితం కావచ్చు అని చెప్పబడుతుంది. ఈ నమ్మకం ప్రకారం, ఒకరు మానవునిగా లేక జంతువుగా “పునర్జన్మ”ను పొందవచ్చు. బైబిలు బోధించే దానికి అది పూర్తి విరుద్ధంగా ఉంది.

“పునరుత్థానం” అనే పదం గ్రీకు పదమైన అ·నాస్టా·సిస్‌ నుండి అనువదించబడింది, దీనికి అక్షరార్థంగా “మరలా నిలువబడడం” అని అర్థం. (గ్రీకు నుండి హెబ్రీకి అనువాదం చేసేవారు అ·నాస్టా·సిస్‌ను “మృతుల పునరుజ్జీవనం” అని అర్థంగల టెకి·యాథ్‌ హమ్‌·మె·థిమ్‌ అనే హెబ్రీ పదాలతో అనువదించారు.) పునరుత్థానంలో దేవుడు తన స్మృతిలో ఉంచుకొనిన ఆ వ్యక్తి యొక్క జీవిత నమూనాను తిరిగి పూర్వ స్థితికి తేవడం ఇమిడివుంటుంది. ఆ వ్యక్తి ఎడల దేవునికిగల చిత్తం ప్రకారం, ఆ వ్యక్తి మానవ శరీరంలోనికి లేక ఆత్మ శరీరంలోనికి పునరుద్ధరించబడతాడు; అయినా తాను మరణించినప్పుడున్న అదే వ్యక్తిత్వంతో, జ్ఞాపకాలతో తన వ్యక్తిగత గుర్తింపును నిలుపుకుంటాడు.

అవును, బైబిలు రెండు రకాల పునరుత్థానాల గురించి మాట్లాడుతుంది. ఆత్మ శరీరంతో పరలోకానికి పునరుత్థానం చేయబడేది ఒకటి; ఇది సాపేక్షికంగా కొద్దిమందికి మాత్రమే. యేసుక్రీస్తు అటువంటి పునరుత్థానాన్ని పొందాడు. (1 పేతురు 3:18) విశ్వసనీయులైన తన అపొస్తలులు మొదలుకొని తన అడుగుజాడల్లో నడిచే అనుచరులలో నుండి ఎంపిక చేయబడిన వారు అటువంటిదానిని అనుభవిస్తారని ఆయన సూచించాడు, ఆయన వారికి ఈ వాగ్దానం చేశాడు: “మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. . . . నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.” (యోహాను 14:2, 3) ఇది కాలంలోను, శ్రేణిలోను మొదటిది గనుక బైబిలు దీనిని “మొదటి పునరుత్థానము” అని సూచిస్తుంది. ఆ విధంగా పరలోకానికి పునరుత్థానం చేయబడిన వారు దేవునికి యాజకులుగా ఉంటారని, క్రీస్తు యేసుతో రాజులుగా పరిపాలిస్తారని లేఖనాలు వర్ణిస్తున్నాయి. (ప్రకటన 20:6) ఈ “మొదటి పునరుత్థానము” కేవలం పరిమిత సంఖ్యకు మాత్రమే, మరి విశ్వాసులైన స్త్రీపురుషులలో నుండి కేవలం 1,44,000 మంది మాత్రమే తీసుకొనబడతారని లేఖనాలే వెల్లడిచేస్తున్నాయి. తమ విశ్వాసాన్ని గురించి ఇతరులకు సాక్ష్యాన్నివ్వడంలో క్రియాశీలంగా ఉంటూ, వారు యెహోవా దేవునికి మరియు యేసుకు మరణం వరకు తమ యథార్థతను రుజువు చేసుకుని ఉంటారు.—ప్రకటన 14:1, 3, 4.

నిస్సందేహంగా, పరలోక జీవానికి పునరుత్థానం చేయబడిన వారికి మృతుల పునరుత్థానం అవధుల్లేని సంతోషకర సమయంగా ఉంటుంది. కానీ సంతోషం అంతటితో అంతం కాదు, ఎందుకంటే ఇక్కడే ఇదే భూమిపైన జీవించేందుకు పునరుత్థానం ఉంటుందని కూడా వాగ్దానం చేయబడింది. పునరుత్థానమైన వారు ప్రస్తుత దుష్ట విధానాంతాన్ని తప్పించుకునే అపరిమితమైన సంఖ్యలోగల ప్రజలతో చేరతారు. పరలోక పునరుత్థానానికి అర్హులయ్యే చిన్న సంఖ్యను దృష్టించిన తరువాత, అపొస్తలుడైన యోహానుకు “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలోనుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్పసమూహము”ను గురించిన ఒక దర్శనం ఇవ్వబడింది. కోట్లాదిమంది, బహుశ వందల కోట్ల ప్రజలు ఇదే భూమిపై తిరిగి జీవానికి వచ్చినప్పుడు అదెంతటి సంతోషకరమైన సమయంగా ఉంటుందో కదా!—ప్రకటన 7:9, 16, 17.

అదెప్పుడు జరుగుతుంది?

పరిస్థితి నేడున్న విధంగానే, అంటే కలహాలు, రక్తపాతం, కాలుష్యం, హింసలతో నిండివున్న భూమిపైకే మృతులు తిరిగి వస్తే ఎట్టి ఆనందమైనా, సంతోషమైనా స్వల్పకాలమే ఉంటుంది. లేదు, పునరుత్థానమనేది ఒక “క్రొత్త భూమి” స్థాపించబడడం కొరకు వేచివుండాల్సిందే. దాని నివాసులపైకి తెచ్చిన చెప్పనలవికాని దుర్దశకు తోడు, ఇప్పటివరకు భూమిని నాశనం చేయడానికి, దాని నిర్మలమైన సౌందర్యాన్ని పాడుచేయడానికి నిశ్చయించుకున్న ప్రజల నుండి, సంస్థల నుండి పరిశుభ్రం చేయబడిన భూమి ఎలా ఉంటుందో ఊహించుకోండి.—2 పేతురు 3:13; ప్రకటన 11:18.

స్పష్టంగా, మానవజాతి సాధారణ పునరుత్థానం కొరకు సమయం ఇంకా ముందుంది. అయినా శుభ వార్త ఏమిటంటే అది ఎంతో దూరంలో లేదు. నిజమే, అది ప్రస్తుత దుష్ట విధానం అంతం కొరకు వేచివుండాలి. అయినప్పటికీ, “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధము”తో—సామాన్యంగా అర్మగిద్దోను అని పిలువబడే దానితో చరమాంకానికి చేరుకునే “[మహా] శ్రమ” అకస్మాత్తుగా వచ్చిపడడానికి సమయం ఆసన్నమైందనడానికి పుష్కలమైన సాక్ష్యాధారం ఉంది. (మత్తయి. 24:3-14, 21; ప్రకటన 16:14, 16) ఇది ఈ ఆహ్లాదకరమైన గ్రహమైన భూమి మీది నుండి దుష్టత్వాన్నంతటినీ తీసివేస్తుంది. అటు తరువాత క్రీస్తు యేసు వేయి సంవత్సరాల పరిపాలన వస్తుంది, ఆ కాలంలో భూమి క్రమేణ ఒక పరదైసు స్థితికి తేబడుతుంది.

వెయ్యి సంవత్సరాల పరిపాలన కాలంలో మృతుల పునరుత్థానం జరుగుతుందని బైబిలు వెల్లడిస్తుంది. అప్పుడు యేసు భూమిపై ఉన్నప్పుడు చేసిన వాగ్దానం నెరవేరుతుంది: ‘దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆకాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని పునరుత్థానమునకు బయటికి వచ్చెదరు.’—యోహాను 5:28, 29.

పునరుత్థాన నిరీక్షణ ప్రభావం

పునరుత్థానమనే ఈ ఉత్తరాపేక్ష భవిష్యత్తు కొరకు ఎంతటి అద్భుతమైన నిరీక్షణయై ఉంది—మృతులు మరలా జీవానికి తిరిగి వచ్చే సమయం అది! పెరుగుతున్న వయస్సు, అస్వస్థత, అనూహ్య విపత్తులూ, విచారం, అనుదిన వత్తిడులూ జీవిత సమస్యలు వంటి నిష్ఠూరములను మనం ఎదుర్కొంటుండగా అది మనకు ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుందో కదా! మరణపు ముల్లును అది తీసివేస్తుంది—దుఃఖాన్ని పూర్తిగా తీసివేయదు కానీ భవిష్యత్తు కొరకు నిరీక్షణ లేని వారి నుండి మనలను వేరు చేస్తుంది. అపొస్తలుడైన పౌలు పునరుత్థాన నిరీక్షణ యొక్క ఈ ఓదార్పుకరమైన ప్రభావాన్ని ఈ మాటల్లో గుర్తించాడు: “సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును.”—1 థెస్సలొనీకయులు 4:13, 14.

ప్రాచ్య దేశపువాడైన యోబుచే గమనించబడిన మరొక విషయం యొక్క సత్యసంధతను మనం ఇప్పటికే అనుభవించివుంటాము: “మురిగి క్షీణించుచున్నవాని చుట్టు చిమ్మటకొట్టిన వస్త్రమువంటివానిచుట్టు గిఱిగీసి వానిని కనిపెట్టుచున్నావు. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును.” (యోబు 13:28-14:2) జీవితపు అనిశ్చితి గురించి, మనలో ఎవరికైనా ‘అదృష్టవశముచేతను [“అనూహ్యమైన సంఘటన,” NW] కాలవశముచేతను’ జరిగే సంఘటనలు సంభవించవచ్చనే కఠోర వాస్తవం గురించి మనమందరం కూడా ఎరుగుదుము. (ప్రసంగి 9:11) నిశ్చయంగా మరణ ప్రక్రియను ఎదుర్కోవాలనే ఆలోచననుబట్టి మనలో ఎవ్వరమూ ఆనందించము. అయినప్పటికీ, నిశ్చయమైన పునరుత్థాన నిరీక్షణ మరణాన్ని గురించిన ప్రబలమైన భయాన్ని తీసివేయడానికి సహాయం చేస్తుంది.

కావున ధైర్యం తెచ్చుకోండి! మరణంలో సంభావ్య నిద్రకు బదులుగా పునరుత్థాన అద్భుతం ద్వారా మరల జీవానికి తిరిగి వచ్చేదానివైపు చూడండి. భవిష్యత్తులో అంతం లేని జీవిత ఉత్తరాపేక్ష కొరకు నమ్మకంతో ఎదురుచూడండి, తరువాత దీన్ని, అటువంటి ఆశీర్వాదకర సమయం సమీప భవిష్యత్తులో ఉందని తెలుసుకోవడం ద్వారా వచ్చే ఆనందానికి జతచేయండి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి