“ప్రతిదినము” మన సమర్పణకు తగినట్లు జీవించుట
“ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను.”—లూకా 9:23.
1. క్రైస్తవులుగా మనం మన విజయాన్ని కొలవడానికి ఒక మార్గం ఏది?
“మనం నిజంగా సమర్పించుకున్నవారమా?” అమెరికా 35వ అధ్యక్షుడైన జాన్ ఎఫ్. కెనడీ ప్రకారం, ఈ ప్రశ్నకు సమాధానం ప్రభుత్వాధికార బాధ్యతలున్న వారి విజయాన్ని కొలవడంలో ఒక అంశంగా ఉంది. క్రైస్తవ పరిచారకులముగా మన విజయానికి, ఒక పరీక్షగా ఈ ప్రశ్న మరింత లోతైన ప్రాముఖ్యతను కలిగివుండగలదు.
2. “సమర్పణ” అనే పదాన్ని ఒక నిఘంటువు ఎలా నిర్వచించింది?
2 అయితే సమర్పణ అంటే ఏమిటి? వెబ్స్టర్స్ నైన్త్ న్యూ కాలేజియేట్ డిక్షనరీ దాన్ని “దేవునికి లేక పరిశుద్ధ ఉపయోగం కొరకు సమర్పించే ఒక చర్య లేక ఆచారం,” “ఒక ఫలానా సంకల్పం కొరకు సమర్పించడం లేక ప్రత్యేకించడం,” “స్వయం త్యాగ సమర్పణ” అని నిర్వచిస్తున్నది. బహుశా జాన్ ఎఫ్. కెనడీ “స్వయం త్యాగ సమర్పణ” అనే భావం కొరకు ఆ పదాన్ని ఉపయోగించి ఉండవచ్చు. ఒక క్రైస్తవునికి, సమర్పణంటే అంతకంటే ఎక్కువే.
3. క్రైస్తవ సమర్పణ అంటే ఏమిటి?
3 యేసుక్రీస్తు తన శిష్యులకు ఇలా చెప్పాడు: “ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను.” (మత్తయి 16:24) దైవిక పని కొరకు ప్రత్యేకింపబడడమంటే, కేవలం ఆదివారం నాడు లేక ఏదైనా ఆరాధనా స్థలాన్ని దర్శిస్తున్నప్పుడు ఆరాధనా క్రియను చేయడం మాత్రమే కాదు. ఒకరి మొత్తం జీవిత విధానం అందులో ఇమిడి ఉంటుంది. క్రైస్తవునిగా ఉండడమంటే, ఒకరు యేసుక్రీస్తు సేవించిన దేవున్ని సేవిస్తూ, తనను తాను ఉపేక్షించుకోవడం లేక తనను తాను నిరాకరించుకోవడమని భావం. అంతేగాక, ఒక క్రైస్తవుడు, క్రీస్తు అనుచరునిగా ఉన్నందున వచ్చే ఏ శ్రమనైనా సహించడం ద్వారా ‘తన హింసా కొయ్యను’ తాను ఎత్తికొంటాడు.
పరిపూర్ణమైన మాదిరి
4. యేసు బాప్తిస్మం దేన్ని సూచిస్తుంది?
4 భూమిపైనున్నప్పుడు యేసు, ఒకరు యెహోవాకు సమర్పించుకోవడంలో ఏమి ఇమిడి ఉందో చూపించాడు. ఆయన అభిప్రాయాలు ఇలా ఉండేవి: “బలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి.” తర్వాత ఆయనిలా జతచేశాడు: “(గ్రంథపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము) దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నాను.” (హెబ్రీయులు 10:5-7) సమర్పిత జనాంగ సభ్యునిగా, ఆయన జననమందే యెహోవాకు సమర్పించబడ్డాడు. అయినప్పటికీ, ఆయన తన భూపరిచర్య ప్రారంభమందు, యెహోవా చిత్తం చేయడానికి తనను తాను అంకితం చేసుకోడానికి సూచనగా ఆయన తన్ను తాను బాప్తిస్మం కొరకు సమర్పించుకున్నాడు, ఆయన తన జీవితాన్ని విమోచనా బలిగా అర్పించుకోవడం కూడా అందులో ఇమిడి ఉంది. అలా, యెహోవా కోరే దేన్నయినా చేయడంలో ఆయన క్రైస్తవులకు ఒక మాదిరినుంచాడు.
5. వస్తుసంబంధమైన వాటిని గూర్చి యేసు ఒక మాదిరికరమైన దృక్పథాన్నెలా చూపించాడు?
5 యేసు తన బాప్తిస్మం తర్వాత, చివరికి బలిగా మరణించడానికి నడిపిన జీవన విధానాన్ని అనుసరించాడు. ఆయన డబ్బు చేసుకోవడంలో లేక సుఖవంతమైన జీవితాన్ని గడపడంలో ఆసక్తి కలిగి ఉండేవాడు కాదు. బదులుగా, ఆయన జీవితం ఆయన పరిచర్య చుట్టూ పరిభ్రమించింది. “ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి” అని ఆయన తన శిష్యులకు ఉపదేశించాడు, ఆయన ఈ మాటలకు అనుగుణంగా జీవించాడు. (మత్తయి 6:33) అంతెందుకు, ఒకసారి ఆయన, “నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదని” కూడా చెప్పాడు. (మత్తయి 8:20) తన అనుచరుల నుండి డబ్బు రాబట్టడానికి ఆయన తన బోధలను అందుకు తగినట్లుగా మలచి ఉండగలిగేవాడే. ఒక వడ్రంగివానిగా ఆయన, ఒక అందమైన వస్తువును చేసి, అమ్మి కొన్ని అదనపు వెండి నాణాలను పొందగలిగేలా, దాన్ని చేయడానికి సమయం తీసుకొనగలిగేవాడే. కాని ఆయన వస్తుదాయక సమృద్ధిని పొందడానికి తన నైపుణ్యాలను ఉపయోగించుకోలేదు. దేవుని సమర్పిత సేవకులుగా, వస్తుదాయకమైనవాటిని గూర్చిన సరైన దృక్పథాన్ని కలిగివుండడంలో మనం యేసును అనుకరిస్తున్నామా?—మత్తయి 6:24-34.
6. స్వయంత్యాగ, సమర్పిత దేవుని సేవకులుగా ఉండడంలో మనం యేసును ఎలా అనుకరించగలము?
6 దేవునికి తాను చేసే సేవను మొదట ఉంచడంలో, యేసు తన స్వంత ఆసక్తుల కొరకు ప్రయత్నించలేదు. మూడున్నర సంవత్సరాల బహిరంగ పరిచర్య సమయంలోని ఆయన జీవితం స్వయంత్యాగంతో కూడినది. ఒక సందర్భంలో రోజంతా ఎక్కువ పని చేసిన తర్వాత, భోజనం చేయడానికి కూడా సమయం తీసుకోకుండా, “కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్న” ప్రజలకు బోధించడానికి యేసు ఇష్టపడ్డాడు. (మత్తయి 9:36; మార్కు 6:31-34) “ప్రయాణమువలన అలసి” ఉన్నప్పటికీ, సుఖారు వద్ద యాకోబు బావికి వచ్చిన సమరయ స్త్రీతో మాట్లాడడానికి ఆయన చొరవ తీసుకున్నాడు. (యోహాను 4:6, 7, 13-15) ఆయన ఎప్పుడూ తన స్వంత క్షేమంకంటే ముందు ఇతరుల క్షేమాన్ని గూర్చి శ్రద్ధ వహించాడు. (యోహాను 11:5-15) దేవున్ని, ఇతరులను సేవించడానికి మన స్వంత ఆసక్తులను ఉదారంగా త్యాగం చేయడం ద్వారా మనం యేసును అనుకరించవచ్చు. (యోహాను 6:38) కనీసమవసరమైనంత మాత్రమే చేయడానికి బదులు, దేవున్ని నిజంగా ఎలా ప్రీతిపర్చగలమనే ఉద్దేశంతో ఆలోచించడం ద్వారా, మనం మన సమర్పణకు తగినట్లు జీవించగలము.
7. యెహోవాకు ఎల్లప్పుడు ఘనతనివ్వడంలో మనం యేసునెలా అనుకరించగలము?
7 ప్రజలకు సహాయం చేయడం ద్వారా యేసు వారిని తనవైపు ఆకర్షించుకోవాలని ఏ విధంగాను ప్రయత్నించలేదు. ఆయన దేవుని చిత్తాన్ని చేయడానికి దేవునికి సమర్పించుకున్నాడు. గనుక, ఆయన ఎల్లప్పుడూ తాను సాధించిన దాన్ని బట్టి మహిమంతా తన తండ్రియైన యెహోవాయే పొందేలా చూశాడు. ఒక అధికారి ‘సత్’ (మంచి) అనే పదాన్ని ఒక బిరుదుగా ఉపయోగిస్తూ, ఆయనను “సద్బోధకుడా” అని పిలిచినప్పుడు, యేసు ఇలా చెప్పి అతడ్ని సరిచేశాడు: “దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు.” (లూకా 18:18, 19; యోహాను 5:19, 30) యేసు వలె మనం, ఘనతను మనవైపు నుండి యెహోవావైపుకు మళ్లించే స్వభావాన్ని కల్గివున్నామా?
8. (ఎ) సమర్పించుకున్న వ్యక్తిగా, యేసు ఎలా తనను తాను లోకం నుండి వేరుగా ఉంచుకున్నాడు? (బి) మనం ఆయననెలా అనుకరించాలి?
8 భూమిపై తన సమర్పిత జీవన విధానమంతటిలో, యేసు తాను దేవుని సేవ కొరకు తనను తాను ప్రత్యేకించుకున్నానని చూపించాడు. విమోచన బలిగా ఉండేందుకు, ఆయన తనను తాను “నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్ల”వలె అర్పించు కొనగలిగేలా ఆయన తనను తాను పరిశుద్ధంగా ఉంచుకున్నాడు. (1 పేతురు 1:19; హెబ్రీయులు 7:26) ఆయన మోషే ధర్మశాస్త్ర సూత్రాలన్నిటిని పాటించడం ద్వారా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. (మత్తయి 5:17; 2 కొరింథీయులు 1:20) ఆయన నైతికతలను గూర్చిన తన స్వంత బోధకు తగినట్లు జీవించాడు. (మత్తయి 5:27, 28) ఆయనను ఎవరూ కూడా చెడు దృక్పథాల గురించి న్యాయంగా నిందించలేరు. వాస్తవానికి, ఆయన “దుర్నీతిని ద్వేషించెను.” (హెబ్రీయులు 1:9) దేవుని దాసులుగా, మన జీవితాలను, చివరికి మన ఉద్దేశాలను యెహోవా దృష్టిలో శుభ్రంగా ఉంచుకోవడమందు యేసును అనుకరిద్దాము.
హెచ్చరికా ఉదాహరణలు
9. ఏ హెచ్చరికా మాదిరిని పౌలు సూచిస్తున్నాడు, మనమెందుకు ఈ మాదిరిని పరిశీలించాలి?
9 యేసు మాదిరికి వ్యతిరేకంగా, మనకు ఇశ్రాయేలీయుల హెచ్చరికతో కూడిన మాదిరి ఉంది. యెహోవా చేయమని తమకు చెప్పినదంతా చేస్తామని వారు ప్రకటించిన తర్వాత కూడా, వారు ఆయన చిత్తాన్ని చేయడంలో విఫలమయ్యారు. (దానియేలు 9:11) ఇశ్రాయేలీయులకు సంభవించిన దానినుండి నేర్చుకోమని అపొస్తలుడైన పౌలు క్రైస్తవులను ప్రోత్సహించాడు. పౌలు తాను కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రికలో ఉదాహరించిన కొన్ని సంఘటనలను పరిశీలించి, మన కాలంలో సమర్పిత దేవుని సేవకులు ఏ అవాంతరాలను నివారించవలసిన అవసరత ఉందో చూద్దాము.—1 కొరింథీయులు 10:1-6, 11.
10. (ఎ) ఇశ్రాయేలీయులు ఎలా ‘చెడ్డవాటిని ఆశించారు’? (బి) రెండవసారి ఇశ్రాయేలీయులు ఆహారం గురించి సణిగినప్పుడు వారు ఎందుకు మరింత జవాబుదారులయ్యారు, ఈ హెచ్చరికా మాదిరి నుండి మనమేమి నేర్చుకోగలము?
10 మొదట, మనం “చెడ్డవాటిని ఆశించ” కూడదని పౌలు హెచ్చరించాడు. (1 కొరింథీయులు 10:6) తినటానికి కేవలం మన్నా మాత్రమే ఉందని ఇశ్రాయేలీయులు ఫిర్యాదు చేసిన సందర్భాన్ని గూర్చి అది మీకు గుర్తుచేయవచ్చు. యెహోవా వారి కొరకు పూరేడులు కురిపించాడు. సీను అరణ్యంలో ఒక సంవత్సరం ముందు, అంటే ఇశ్రాయేలీయులు తమ సమర్పణను యెహోవాకు ప్రకటించుకోడానికి కొంచెం ముందు అలాంటిదే ఒక సంఘటన జరిగింది. (నిర్గమకాండము 16:1-3, 12, 13) కాని పరిస్థితి పూర్తిగా అలాగే లేదు. యెహోవా మొదటిసారి పూరేడులు ఇచ్చినప్పుడు, వారి సణుగుడు గురించి ఆయన ఇశ్రాయేలీయులను జవాబు అడుగలేదు. అయితే, ఈసారి, విషయం వేరుగా ఉంది. “ఆ మాంసము ఇంక వారి పండ్ల సందున నుండగానే, అది నమలక మునుపే, యెహోవా కోపము జనులమీద రగులుకొనెను; యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను.” (సంఖ్యాకాండము 11:4-6, 31-34) ఏది మారింది? సమర్పిత జనాంగంగా, ఇప్పుడు వారు జవాబుదారులుగా పరిగణింపబడ్డారు. వారు యెహోవా చెప్పినదంతా చేస్తామని వాగ్దానం చేసినప్పటికీ, యెహోవా ఏర్పాట్ల యెడల వారికి మెప్పు లేకపోవడం వారు యెహోవాకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి నడిపించింది! నేడు యెహోవా బల్లను గూర్చి ఫిర్యాదు చేయడం అటువంటిదే. “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” ద్వారా యెహోవా అందజేస్తున్న ఆత్మీయ ఏర్పాట్లను మెచ్చుకోవడంలో కొందరు విఫలమౌతారు. (మత్తయి 24:45-47) అయితే, యెహోవా మన కొరకు ఏం చేశాడో దాన్ని కృతజ్ఞతాపూర్వకంగా మనస్సులో ఉంచుకొని, యెహోవా అందజేసే ఆత్మీయాహారాన్ని అంగీకరించడం కూడా మన సమర్పణకు అవసరమని గుర్తుంచుకోండి.
11. (ఎ) ఇశ్రాయేలీయులు విగ్రహారాధనతో యెహోవాకు తాము చేసే ఆరాధననెలా కలుషితం చేసుకున్నారు? (బి) ఒక విధమైన విగ్రహారాధనతో మనమెలా ప్రభావితం కాగలము?
11 తర్వాత పౌలు ఇలా హెచ్చరించాడు: “వారిలో కొందరివలె మీరు విగ్రహారాధికులై యుండకుడి.” (1 కొరింథీయులు 10:7) సాక్ష్యాధారంగా, ఇక్కడ అపొస్తలుడు, సీనాయి పర్వతం వద్ద ఇశ్రాయేలీయులు యెహోవాతో చేసిన నిబంధనను ముగించిన వెంటనే జరిగిన దూడ ఆరాధనను సూచిస్తున్నాడు. మీరిలా చెప్పవచ్చు, ‘యెహోవా సమర్పిత సేవకునిగా, నేనెన్నడూ విగ్రహారాధనలో భాగం వహించను.’ అయితే గమనించండి, ఇశ్రాయేలీయుల దృక్కోణం నుండి చూస్తే వారు యెహోవా ఆరాధనను విడిచిపెట్టలేదు; అయినా, దేవునికి అసహ్యమైనదైన దూడ ఆరాధనా ఆచారాన్ని వారు మొదలుపెట్టారు. ఈ విధమైన ఆరాధనా విధానంలో ఏమి ఇమిడి ఉంది? ప్రజలు దూడ యెదుట బలులు అర్పించి, ఆ తర్వాత వారు “తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి.” (నిర్గమకాండము 32:4-6) నేడు, కొందరు తాము యెహోవాను ఆరాధిస్తున్నామని చెప్పవచ్చు. కాని వారి జీవితాలు యెహోవా ఆరాధనపై కాదుగాని, ఈ లోక విషయాల ఆనందంపై కేంద్రీకరింపబడి ఉండవచ్చు, వారు యెహోవాకు తాము చేసే సేవను వీటి చుట్టూ అమర్చుకోడానికి ప్రయత్నిస్తారు. నిజమే, ఇది బంగారు దూడకు మోకరించడమంత విపరీతమైంది కాదు, కాని సూత్రానుసారంగా దానిలో ఎంతో తేడా లేదు. ఒకరి స్వంత కోరికను దేవునిగా చేసుకోవడం, యెహోవాకు ఒకరు చేసుకున్న సమర్పణకు తగినట్లు జీవించడం నుండి ఎంతో వేరు.—ఫిలిప్పీయులు 3:19.
12. బయెల్పెయోరుతో ఇశ్రాయేలీయులకు కలిగిన అనుభవం నుండి, మనల్ని మనం ఉపేక్షించుకోడాన్ని గూర్చి మనమేమి నేర్చుకుంటాము?
12 పౌలు తెలియజేసిన తర్వాతి హెచ్చరికా ఉదాహరణలో ఒక విధమైన వినోదం కూడా చేరివుంది. “వారివలె మనము వ్యభిచరింపక యుందము; వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్కదినముననే యిరువది మూడువేలమంది కూలిరి.” (1 కొరింథీయులు 10:8) మోయాబురాండ్రు అందజేసిన అవినీతికరమైన ఆనందాలచే మోసగింపబడి ఇశ్రాయేలీయులు షిత్తీములో బయల్పెయోరును ఆరాధించడానికి నడిపించబడ్డారు. (సంఖ్యాకాండము 25:1-3, 9) యెహోవా చిత్తాన్ని చేయడానికి మనల్ని మనం ఉపేక్షించుకోవడంలో నైతిక పరిశుభ్రతను గూర్చిన ఆయన ప్రమాణాలను అంగీకరించడం ఇమిడి ఉంది. (మత్తయి 5:27-30) ప్రమాణాలు దిగజారిపోతున్న ఈ కాలంలో, ఏది మంచిదో ఏది చెడ్డదో నిర్ణయించే యెహోవా అధికారానికి లోబడుతూ, అన్ని విధాలైన అవినీతి ప్రవర్తన నుండి మనల్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవలసిన అవసరతను గూర్చి మనకు గుర్తుచేయబడుతుంది.—1 కొరింథీయులు 6:9-11.
13. యెహోవాకు సమర్పించుకోవడంలో ఏమి ఇమిడి ఉందో గ్రహించడానికి ఫీనెహాసు మాదిరి మనకెలా సహాయం చేస్తుంది?
13 షిత్తీములో అనేకులు వ్యభిచార సంబంధమైన ఉరిలో పడిపోయినప్పటికీ, యెహోవాకు చేసుకున్న జాతీయ సమర్పణకు తగినట్లు కొందరు జీవించారు. వారిలో, ఆసక్తి విషయంలో ఫీనెహాసు విశేషమైనవాడు. ఒక ఇశ్రాయేలీయుడు ఒక మిద్యాను స్త్రీని తన గుడారంలోకి తీసుకొని రావడాన్ని చూసినప్పుడు, ఫీనెహాసు వెంటనే తన చేతిలోకి ఒక యీటె తీసుకుని వారిని పొడిచాడు. యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: “ఫీనెహాసు, వారి మధ్యను నేను ఓర్వలేనిదానిని తాను ఓర్వలేకపోవుటవలన ఇశ్రాయేలీయుల మీదనుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు.” (సంఖ్యాకాండము 25:11) సమర్పణ అంటే, యెహోవా యెడల వైరుధ్యాన్ని ఎంతమాత్రం సహించలేకపోవడం. మన హృదయాల్లో యెహోవాకు చేసుకునే సమర్పణ వహించవలసిన స్థానాన్ని మరేది తీసుకోడానికి మనం అనుమతించలేము. గంభీరమైన అవినీతిని సహించకుండా, దాన్ని గూర్చి పెద్దలకు ఫిర్యాదు చేయడం ద్వారా సంఘాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి కూడా యెహోవా యెడల మనకు గల ఆసక్తి మనల్ని పురికొల్పుతుంది.
14. (ఎ) ఇశ్రాయేలీయులు యెహోవాను ఎలా శోధించారు? (బి) యెహోవాకు మన పూర్ణ సమర్పణ, మనం ‘సొమ్మసిల్లకుండా’ ఉండడానికి మనకెలా సహాయం చేయగలదు?
14 పౌలు మరో హెచ్చరికా ఉదాహరణను సూచించాడు: “మనము ప్రభువును శోధింపక యుందము; వారిలో కొందరు శోధించి సర్పములవలన నశించిరి.” (1 కొరింథీయులు 10:9) పౌలు ఇక్కడ, ఇశ్రాయేలీయులు ‘మార్గాయాసముచేత సొమ్మసిల్లుతుండగా’ దేవునికి వ్యతిరేకంగా వారు మోషేతో ఫిర్యాదు చేసిన సమయాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు. (సంఖ్యాకాండము 21:4) మీరెప్పుడైనా ఆ పొరపాటు చేస్తారా? మిమ్మల్ని మీరు యెహోవాకు సమర్పించుకున్నప్పుడు, మీరు అర్మగిద్దోను సమీపంలోనే ఉందని తలంచారా? యెహోవా సహనం మీరు ఎదురు చూసినదానికంటే ఎక్కువగా ఉందా? మనం కేవలం కొంత కాలపరిమితి వరకే లేక కేవలం అర్మగిద్దోను వరకే యెహోవాకు మనల్ని మనం సమర్పించుకోలేదని గుర్తుంచుకోండి. మన సమర్పణ నిరంతరం కొనసాగుతుంది. కాబట్టి, “మనము మేలుచేయుట యందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంటకోతుము.”—గలతీయులు 6:9.
15. (ఎ) ఇశ్రాయేలీయులు ఎవరికి వ్యతిరేకంగా సణిగారు? (బి) దైవిక అధికారం యెడల గౌరవం కలిగివుండడానికి యెహోవాకు మనం చేసుకునే సమర్పణ మనల్ని ఎలా కదిలిస్తుంది?
15 చివరికి, యెహోవా నియమిత సేవకులకు వ్యతిరేకంగా ‘సణిగేవారిగా’ తయారవ్వడం గురించి పౌలు హెచ్చరించాడు. (1 కొరింథీయులు 10:10) కనాను దేశాన్ని వేగుచూడమని పంపబడిన 12 మందిలో 10 మంది చెడ్డ నివేదికలను తెచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు మోషే, అహరోనులకు వ్యతిరేకంగా తీవ్రంగా సణిగారు. చివరికి మోషేను తమ నాయకునిగా తీసివేసి, ఐగుప్తుకు తిరిగి వెళ్లడాన్ని గూర్చి కూడా వారు మాట్లాడారు. (సంఖ్యాకాండము 14:1-4) నేడు, యెహోవా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనకివ్వబడుతున్న నాయకత్వాన్ని మనం అంగీకరిస్తామా? నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుడు అందజేస్తున్న పుష్కలమైన ఆత్మీయ భోజనాన్ని చూడడం ద్వారా, యేసు “తగిన వేళ ఆహారం” అందజేయడానికి ఎవరిని ఉపయోగించుకుంటున్నాడన్నది స్పష్టం. (మత్తయి 24:45) యెహోవా యెడల పూర్ణాత్మతో కూడిన సమర్పణకు మనం ఆయన నియమించిన సేవకుల యెడల గౌరవం చూపించడం అవసరం. సూచనార్థకంగా చెప్పాలంటే, మనమెన్నడూ, తమను మళ్లీ లోకంలోకి నడిపించడానికి క్రొత్త నాయకునివైపు మరలిన కొంతమంది ఆధునిక దిన సణిగేవారివలె కాకుండా ఉందాము.
అది నేను చేయగలిగినదంతానా?
16. దేవుని సమర్పిత సేవకులు తమకు తాము ఏ ప్రశ్నలు వేసుకోడానికి ఇష్టపడవచ్చు?
16 తాము యెహోవాకు చేసుకున్న సమర్పణ షరతుతో కూడినది కాదన్న విషయాన్ని ఇశ్రాయేలీయులు గుర్తు చేసుకుని ఉంటే వారు అలాంటి ఘోరమైన తప్పులలో పడిపోయి ఉండేవారు కాదు. విశ్వాసంలేని ఆ ఇశ్రాయేలీయులవలె కాకుండా, యేసుక్రీస్తు చివరి వరకు తన సమర్పణకు తగినట్లు జీవించాడు. క్రీస్తు అనుచరులుగా మనం మన జీవితాలను ‘ఇకమీదట మనుజాశలను అనుసరించడానికి కాక, దేవుని చిత్తం కొరకే’ జీవిస్తూ, ఆయన సంపూర్ణ సమర్పణా మాదిరిని అనుకరిద్దాము. (1 పేతురు 4:2; 2 కొరింథీయులు 5:15 పోల్చండి.) “మనుష్యులందరు రక్షణపొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండ”వలెనన్నది నేడు యెహోవా చిత్తమైయ్యుంది. (1 తిమోతి 2:4) ఆ ఉద్దేశంతో, మనం అంతం రాకముందే “ఈ రాజ్యసువార్తను” ప్రకటించాలి. (మత్తయి 24:14) ఈ సేవలో మనమెంత ప్రయాసపడుతున్నాము? మనల్ని మనమిలా ప్రశ్నించుకోడానికి ఇష్టపడవచ్చు: ‘అది నేను చేయగలిగినదంతానా?’ (2 తిమోతి 2:15) పరిస్థితులు వేరుగా ఉంటాయి. ‘ఒక వ్యక్తి శక్తికి మించి కాదు గాని అతనికున్న దాన్ని బట్టియే’ సేవించబడడానికి యెహోవా ఇష్టపడుతున్నాడు. (2 కొరింథీయులు 8:12; లూకా 21:1-4) ఎవరూ కూడా మరొకరి సమర్పణ యొక్క లోతును, యథార్థతను గూర్చి తీర్పుతీర్చకూడదు. యెహోవాకు తన స్వంత సమర్పణ యొక్క విస్తృతిని ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా బేరీజు వేసుకోవాలి. (గలతీయులు 6:4) యెహోవా యెడల మనకు గల ప్రేమ మనమిలా ప్రశ్నించుకోడానికి కదిలించాలి, ‘నేను యెహోవాను ఎలా సంతోషపరచగలను?’
17. సమర్పణకు, మెప్పుదలకు మధ్యనున్న సంబంధమేమిటి? వివరించండి.
17 యెహోవా యెడల మన మెప్పు పెరుగుతున్న కొలది ఆయన యెడల మన ఆరాధన అధికమౌతుంది. జపానునందలి 14 సంవత్సరాల ఒక బాలుడు తనను తాను యెహోవాకు సమర్పించుకుని, తన సమర్పణను నీటి బాప్తిస్మం ద్వారా సూచించాడు. తర్వాత, ఆయన ఉన్నత విద్యనభ్యసించి, శాస్త్రవేత్త కావాలనుకున్నాడు. ఆయన ఎన్నడూ పూర్తికాల పరిచర్య గురించి తలంచలేదు, కాని సమర్పిత సేవకునిగా యెహోవాను, ఆయన దృశ్య సంస్థను విడిచిపెట్టడం అతనికి ఇష్టంలేదు. తన విద్యాగమ్యాన్ని చేరుకోడానికి అతడు ఒక విశ్వవిద్యాలయంలో చేరాడు. తమ కంపెనీలకు లేక తమ అధ్యయనాలకు వారి పూర్తి జీవితాలను సమర్పించమని విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైనవారు బలవంతపెట్టబడడాన్ని అతడు చూశాడు. అతడిలా ఆశ్చర్యపోయాడు, ‘నేనిక్కడేం చేస్తున్నాను? నేను నిజంగా వారి జీవిత విధానాన్ని చేపట్టి లౌకిక పని కొరకు నన్ను నేను సమర్పించుకోగలనా? నేను ఇప్పటికే యెహోవాకు సమర్పించుకొనిలేనా?’ పునర్నూతనం చేయబడిన మెప్పుదలతో, ఆయన క్రమ పయినీరయ్యాడు. తన సమర్పణను గూర్చిన గ్రహింపు హెచ్చింపబడింది, తాను ఎక్కడ అవసరమైతే అక్కడికి వెళ్లడానికి తన హృదయంలో నిశ్చయించుకోడానికి అది అతన్ని కదిలించింది. అతడు పరిచారకుల శిక్షణా పాఠశాలకు హాజరై, విదేశాల్లో మిషనరీ సేవ చేయడానికి నియామకాన్ని అందుకున్నాడు.
18. (ఎ) యెహోవాకు మన సమర్పణలో ఏమి ఇమిడి ఉన్నాయి? (బి) యెహోవాకు మనం చేసుకునే సమర్పణ నుండి మనం ఏ ప్రతిఫలాన్ని పొందగలము?
18 సమర్పణలో మన పూర్తి జీవితం ఇమిడి ఉంటుంది. మనం, మనల్ని మనం ఉపేక్షించుకొని “ప్రతిదినము” యేసు యొక్క మంచి మాదిరిని అనుసరించాలి. (లూకా 9:23) మనల్ని మనం ఉపేక్షించుకొన్నవారమై మనం, యెహోవాను సెలవు కొరకు అడగము. మన జీవితాలు యెహోవా తన సేవకుల కొరకు నియమించే సూత్రాలతో పొందిక కల్గివుంటాయి. మనం వ్యక్తిగత ఎంపిక చేసుకోగల విషయాల్లో కూడా, యెహోవాకు సమర్పించుకున్న జీవితాన్ని గడపడానికి మనం చేయగలిగిన శ్రేష్ఠమైనది చేస్తున్నామా అని పరిశీలించుకోవడం ప్రయోజనకరము. మనం ఆయనను ప్రతిదినము సేవిస్తుండగా, ఆయనను ప్రీతిపర్చడానికి మనం చేయగలిగినదంతా చేస్తూవుంటే, మనం క్రైస్తవులుగా విజయవంతులమౌతాము, మన పూర్ణాత్మతో కూడిన సమర్పణను పొందనర్హుడైన యెహోవా నుండి అంగీకారాన్ని పొందుతాము.
మీరు వివరించగలరా?
◻ యేసుక్రీస్తుకు, సమర్పణలో ఏమి ఇమిడి ఉంది?
◻ యెహోవాకు వ్యతిరేకంగా సణగడాన్ని మనమెందుకు నివారించాలి?
◻ విగ్రహారాధన మన జీవితాల్లోకి మెల్లిగా ప్రవేశించడాన్ని మనం ఏ విధంగా నివారించవచ్చు?
◻ దేవుని చిత్తాన్ని చేయడంలో ‘సొమ్మసిల్లకుండా’ ఉండడానికి ఏది గుర్తుంచుకోవడం మనకు సహాయం చేస్తుంది?
[17వ పేజీలోని చిత్రం]
సమర్పిత క్రైస్తవులు “మేలు చేయుటయందు విసుగుచెందరు”