ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు పురికొల్పుట—ఎట్లు?
‘ఒకనియందొకడు శ్రద్ధకలిగి, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.’—హెబ్రీయులు 10:24, 25.
1, 2. (ఎ) తాము కలిసి సమావేశమవ్వడంలో తొలి క్రైస్తవులు ఆదరణను, ప్రోత్సాహాన్ని పొందడం ఎందుకు ప్రాముఖ్యమై ఉండెను? (బి) పౌలు యొక్క ఏ ఉపదేశం కలిసి సమావేశం కావడం యొక్క అవసరతను తెలియజేసింది?
వారు రహస్యంగా కలిశారు, గడియ వేసివున్న తలుపుల వెనుక కలిసి సమావేశమయ్యారు. బయట, ప్రతి చోట ప్రమాదం పొంచి ఉంది. వారి నాయకుడైన యేసు ఇంత క్రితమే బహిరంగంగా చంపబడ్డాడు, ఆయన తన అనుచరులు అంతకంటే మంచిగా ఏమీ వ్యవహరించబడరని వారిని ముందే హెచ్చరించాడు. (యోహాను 15:20; 20:19) కాని వారు తమ ప్రియమైన యేసును గురించి మెల్లని స్వరంతో మాట్లాడుకుంటుండగా, కలిసి ఉండడం కనీసం తాము సురక్షితంగా ఉన్నామన్న భావనను కలిగించి ఉండవచ్చు.
2 సంవత్సరాలు గడుస్తుండగా, క్రైస్తవులు అన్ని రకాలైన పరీక్షలను, హింసను ఎదుర్కొన్నారు. ఆ తొలి శిష్యులవలె, కలిసి సమావేశమవ్వడం ద్వారా వారు ఆదరణను, ప్రోత్సాహాన్ని పొందారు. హెబ్రీయులు 10:24, 25 నందు అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: ‘కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనియందొకడు శ్రద్ధకలిగి, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.’
3. హెబ్రీయులు 10:24, 25 నందు చెప్పబడిన, క్రైస్తవులు కలిసి సమావేశమవ్వాలనేది కేవలం ఆజ్ఞ కంటే ఎక్కువైనదని మీరెందుకు చెబుతారు?
3 ఆ మాటలు, కలిసి సమావేశం కావడంలో కొనసాగమని ఇవ్వబడిన ఆజ్ఞ కంటే ఎక్కువైనవే. క్రైస్తవ కూటాలన్నిటికీ—నిజంగా, క్రైస్తవులు కలిసి సమావేశమయ్యే ఏ సందర్భానికైనా అవి దైవ ప్రేరిత ప్రమాణాన్నిస్తాయి. మునుపెన్నటికంటే నేడు, యెహోవా దినం సమీపిస్తుండడాన్ని మనం స్పష్టంగా చూస్తుండగా, ఈ దుష్ట విధానం యొక్క ఒత్తిళ్లు, ప్రమాదాలు మన కూటాలు ఒక సురక్షితమైన ఆశ్రయంగా, అందరికీ బలాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చే మూలముగా ఉండడాన్ని తప్పనిసరి చేస్తున్నాయి. దీన్ని తప్పకుండా పొందడానికి మనమేమి చేయగలము? మనల్ని మనం ఈ మూడు ప్రశ్నలు వేసుకుంటూ పౌలు మాటలను జాగ్రత్తగా పరిశీలిద్దాము: ‘ఒకరియందొకరు శ్రద్ధ కలిగివుండడం’ అంటే ఏమిటి? ‘ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకరు పురికొల్పడం’ అంటే ఏమిటి? చివరగా, ఈ కష్టసమయాల్లో మనం ‘ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం’ ఎలా చేయవచ్చు?
‘ఒకరియందొకరు శ్రద్ధ కలిగివుండుట’
4. ‘ఒకరియందొకరు శ్రద్ధ కలిగివుండడం‘ అంటే దాని భావమేమిటి?
4 ‘ఒకరియందొకరు శ్రద్ధ కలిగివుండమని’ పౌలు క్రైస్తవులను కోరినప్పుడు, “గ్రహించుట” అనే సాధారణ పదం యొక్క తీవ్ర రూపమైన కా·టా·నో·యి అనే గ్రీకు క్రియాపదాన్ని ఆయన ఉపయోగించాడు. దాని భావం “ఒక వస్తువు వైపుకు ఒకరి పూర్తి మనస్సును త్రిప్పడం” అని థియోలాజికల్ డిక్షనరి ఆఫ్ ది న్యూ టెస్ట్‌మెంట్ చెబుతుంది. డబ్ల్యూ. ఇ. వైన్ ప్రకారం దాని భావం “పూర్తిగా గ్రహించడం, సన్నిహితంగా పరిశీలించడం” అని కూడా కాగలదు. కాబట్టి క్రైస్తవులు ‘ఒకరియందొకరు శ్రద్ధ కలిగివున్నప్పుడు,’ వారు దాన్ని విశేషంగా గ్రహించడమే కాదు, వారు తమ పూర్తి మానసిక సామర్థ్యాలను ఉపయోగించి, ఇంకా లోతుగా పరిశీలించాలని ప్రయత్నిస్తారు.—హెబ్రీయులు 3:1 పోల్చండి.
5. ఒక వ్యక్తి యొక్క వెంటనే కనిపించని గుణాలు ఏమిటి, మనమెందుకు వాటిని పరిగణలోకి తీసుకోవాలి?
5 ఒక వ్యక్తి రూపం, పనులు, లేక వ్యక్తిత్వాన్ని ఒకసారి పైపైన చూడడం ద్వారా తెలిసేదానికన్నా అతనిలో లేక ఆమెలో మరెంతో ఉంటుందని మనం గుర్తుంచుకోవలసిన అవసరం ఉంది. (1 సమూయేలు 16:7) తరచూ లోతైన భావాలను లేక చక్కని హాస్య భావాన్ని శాంతమైన పైరూపం కప్పివేయవచ్చు. అప్పుడు కూడా గతచరిత్రలు చాలా వేరుగా ఉంటాయి. కొందరు తమ జీవితాల్లో తీవ్రమైన పరీక్షలను ఎదుర్కొని ఉండవచ్చు; మనకు ఊహించడానికి కూడా కష్టమనిపించే పరిస్థితులను కొందరు ప్రస్తుతం సహిస్తుండవచ్చు. ఒక సహోదరుడు లేక సహోదరి యొక్క ఏదైనా ఒక లక్షణాన్ని బట్టి మనకు కలిగే చిరాకు, మనం వారి వ్యక్తిగత గత చరిత్రను గూర్చి లేక వారి పరిస్థితులను గూర్చి తెలుసుకున్నప్పుడు మాయమైపోవడం తరచుగా జరుగుతుంటుంది.—సామెతలు 19:11.
6. మనం ఒకరినొకరం ఎక్కువగా తెలుసుకోవడానికి కొన్ని మార్గాలేమిటి, దానివల్ల ఏ మంచి చేకూరగలదు?
6 అయితే, పిలవక ముందే ఒకరి వ్యక్తిగత విషయాల్లో మనం జోక్యం చేసుకోవాలని దీని భావం కాదు. (1 థెస్సలొనీకయులు 4:11) అయినప్పటికీ, మనం తప్పకుండా ఒకరియందొకరము వ్యక్తిగత శ్రద్ధను చూపించవచ్చు. దీనిలో రాజ్యమందిరం వద్ద కేవలం పలకరించుకోవడం కంటే ఎక్కువే ఇమిడి ఉంటుంది. మీరు మరింత ఎక్కువగా తెలుసుకోవాలని ఇష్టపడేవారిని ఎన్నుకుని కూటానికి ముందు లేక ఆ తర్వాత వారితో కొన్ని నిమిషాలు గడపడానికి ఎందుకు నిశ్చయించుకోకూడదు? మీ స్నేహితులను ఒకరినో, ఇద్దరినో స్వల్ప అల్పాహారం కొరకు మీ ఇంటికి ఆహ్వానించడం ద్వారా “శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుట” మరీ మంచిది. (రోమీయులు 12:13) ఆసక్తి కనపర్చండి. వినండి. కేవలం ఒక వ్యక్తి యెహోవాను ఎలా తెలుసుకుని, ప్రేమిస్తున్నాడన్నది అడగడమే ఎంతో తెలియజేయవచ్చు. అయితే, ఇంటింటి పరిచర్యలో కలిసి పనిచేయడం ద్వారా మీరు మరి ఎక్కువ తెలుసుకోవచ్చు. ఆ విధాలుగా ఒకరినొకరం హెచ్చరించుకోవడం నిజమైన శ్రద్ధను లేక సానుభూతిని పెంపొందింప జేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది.—ఫిలిప్పీయులు 2:4; 1 పేతురు 3:8.
‘ఒకరినొకరు పురికొల్పుకొనుడి’
7. (ఎ) యేసు బోధ ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపింది? (బి) ఆయన బోధను ఏది అంత శక్తివంతమైనదిగా చేసింది?
7 మనం ఒకరియందొకరం శ్రద్ధ కలిగివున్నప్పుడు, మనం ఒకరినొకరు పురికొల్పుకోవడానికి, చర్యలు గైకొనేందుకు ప్రోత్సహించుకోవడానికి మనం సంసిద్ధంగా ఉంటాము. ఈ విషయంలో క్రైస్తవ పెద్దలు ప్రాముఖ్యంగా కీలకమైన పాత్ర నిర్వహిస్తారు. యేసు బహిరంగంగా మాట్లాడిన ఒక సందర్భాన్ని గూర్చి మనమిలా చదువుతాము: “జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి.” (మత్తయి 7:28) మరో సందర్భంలో ఆయనను నిర్బంధించమని పంపబడిన సైనికులు సహితం ఇలా చెబుతూ తిరిగి వచ్చారు: “ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదు.” (యోహాను 7:46) యేసు బోధ అంత శక్తివంతంగా ఉండేలా చేసినదేమిటి? భావావేశ ప్రదర్శనలా? కాదు; యేసు హూందాగా మాట్లాడాడు. అయినప్పటికీ, ఆయన ఎల్లప్పుడూ తన శ్రోతల హృదయాలను చేరటానికి ప్రయత్నించాడు. ఆయన ప్రజల యెడల శ్రద్ధకలిగి ఉన్నాడు గనుక, వారిని కచ్చితంగా ఎలా పురికొల్పవచ్చో ఆయనకు తెలుసు. అనుదిన జీవిత వాస్తవాలను ప్రతిబింబించిన వివిధ, సులభమైన ఉపమానాలను ఆయన ఉపయోగించాడు. (మత్తయి 13:34) అలాగే, మన కూటాల్లో ప్రసంగాలిచ్చేవారు పురికొల్పునిచ్చే ప్రేమపూర్వకమైన, ఉత్సాహవంతమైన ప్రసంగాలనివ్వడం ద్వారా యేసును అనుకరించాలి. మన శ్రోతలకు తగిన, వారి హృదయాలను చేరే ఉపమానాలను కనుగొనడానికి యేసు వలె మనం ప్రయాసపడవచ్చు.
8. యేసు మాదిరి ద్వారా ఎలా పురికొల్పాడు, ఈ విషయంలో మనం ఆయననెలా అనుకరించగలము?
8 మన దేవున్ని సేవించడంలో, మాదిరి ఉంచడం ద్వారా మనమందరం ఒకరినొకరం పురికొల్పుకోవచ్చు. యేసు కచ్చితంగా తన శ్రోతలను పురికొల్పాడు. ఆయన క్రైస్తవ పరిచర్య పనిని ప్రేమించాడు, పరిచర్యను ఉన్నతపర్చాడు. అది తనకు ఆహారం వంటిదని ఆయన చెప్పాడు. (యోహాను 4:34; రోమీయులు 11:13) అలాంటి ఉత్సాహం, సోకే స్వభావాన్ని కల్గివుండగలదు. మీరు కూడా అలాగే పరిచర్య యందలి మీ ఆనందాన్ని ఇతరులకు చూపించగలరా? గొప్పలు చెప్పుకుంటున్నట్లుండే ధోరణి రాకుండా ఉండడానికి జాగ్రత్తపడుతూ, మీ మంచి అనుభవాలను సంఘంలోని ఇతరులతో పంచుకోండి. మీతో పనిచేయడానికి ఇతరులను ఆహ్వానించేటప్పుడు, మన గొప్ప సృష్టికర్తయైన యెహోవాను గూర్చి ఇతరులతో మాట్లాడడంలో నిజమైన ఆనందాన్ని పొందడానికి వారికి సహాయం చేయగలరేమో చూడండి.—సామెతలు 25:25.
9. (ఎ) ఇతరులను పురికొల్పడంలో మనం నివారించవలసిన కొన్ని పద్ధతులు ఏవి మరియు ఎందుకు? (బి) యెహోవా సేవలో మనల్ని మనం అర్పించుకోవడానికి ఏది మనల్ని పురికొల్పాలి?
9 అయితే, ఇతరులను తప్పు దోవలో పురికొల్పకుండా ఉండేందుకు జాగ్రత్త వహించండి. ఉదాహరణకు, మనం అనుకోనిరీతిగానే, ఇంకా ఎక్కువ చేయడంలేదని వారు అపరాధులవలె భావించేలా చేయవచ్చు. ఎక్కువ ఆసక్తిగల వారివలె ఉన్నవారితో వారిని పోల్చడం ద్వారా మనం అనుకోనిరీతిగా వారిని సిగ్గుపరచవచ్చు, లేక మనం కఠినమైన కట్టడలను స్థాపించి వాటిని చేరుకోలేకపోయినవారిని నిందించవచ్చు. వీటిలో ఏవైనా కొందరిని కొంతవరకు చర్యలు గైకొనడానికి పురికొల్పవచ్చు, కాని పౌలు ‘అపరాధ భావం కలుగుటకు, సత్కార్యములు చేయుటకు పురికొల్పమని’ వ్రాయలేదు. లేదు, మనం ప్రేమ చూపుటకు పురికొల్పవలెను, అప్పుడు మంచి దృక్పథంతో చర్యలు గైకొనడం జరుగుతుంది. ఎవరూ కూడా ప్రాముఖ్యంగా, తాను కోరబడిన వాటిని చేరుకోలేకపోతే తన గురించి సంఘంలోని ఇతరులు ఏమనుకుంటారోననేదాన్ని పరిగణలోకి తీసుకోవడం ద్వారా ప్రేరేపించబడకూడదు.—2 కొరింథీయులు 9:6, 7 పోల్చండి.
10. ఇతరుల విశ్వాసంపై మనం ప్రభువులం కాదని మనం ఎందుకు గుర్తుంచుకోవాలి?
10 ఒకరినొకరు పురికొల్పుకోవడమంటే ఒకరినొకరు అదుపు చేసుకోవడమని భావం కాదు. తనకు దేవుడిచ్చిన అధికారం ఉన్నప్పటికీ, అపొస్తలుడైన పౌలు కొరింథు సంఘానికి వినయంగా ఇలా గుర్తుచేశాడు: ‘మేము మీ విశ్వాసము మీద ప్రభువులము కాదు.’ (2 కొరింథీయులు 1:24) యెహోవాకు చేసే సేవలో ఇతరులు ఎంత చేయాలనేది నిర్ణయించడం మరియు ఇతరవ్యక్తిగత నిర్ణయాల్లో వారి మనస్సాక్షులను అదుపు చేయడం మన పని కాదని ఆయనవలె మనం గుర్తిస్తే, మనం “అధికంగా నీతిమంతులు” కావడం, ఆనందం లేక పోవడం, కఠినత్వం, ప్రతికూలంగా ఉండడం, లేక సూత్ర నిర్ణయబద్ధంగా ఉండడం వంటివి చేయము. (ప్రసంగి 7:16) అలాంటి లక్షణాలు పురికొల్పవు; అణిచివేస్తాయి.
11. ఇశ్రాయేలీయుల గుడార నిర్మాణ కాలంలోని విరాళాలను ఇవ్వడానికి ఏది పురికొల్పింది, అది మన కాలంలో ఎలా నిజమై ఉండగలదు?
11 ప్రాచీన ఇశ్రాయేలులో గుడారాన్ని నిర్మించడానికి విరాళాలు అవసరమైనప్పుడు ఎలాంటి స్ఫూర్తి చూపించబడిందో అలాంటి స్ఫూర్తితోనే యెహోవా సేవయందలి అన్ని ప్రయత్నాలు చేయబడాలని మనం కోరుకుంటాము. నిర్గమకాండము 35:21 నందు ఇలా చదువుతాము: “ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరు . . . యెహోవాకు అర్పణను తెచ్చిరి.” వారు బయటి శక్తుల ద్వారా ప్రేరేపించబడలేదు, కాని వారు అంతర్గతంగా, హృదయంలో నుండి కదిలింపబడ్డారు. వాస్తవానికి, ఇక్కడ హెబ్రీ భాష అక్షరార్థంగా ‘ఎవని హృదయం వాని పురికొల్పిందో’ వారు అలాంటి అర్పణలు తెచ్చారు అని చదువబడుతుంది. (ఐటాలిక్కులు మావి.) కాబట్టి మనం కలిసి ఉన్నప్పుడల్లా ఒకరి హృదయాలను ఒకరు పురికొల్పడానికి మనం ప్రయాసపడదాము. అవసరమైన మిగిలినది యెహోవా ఆత్మ చేయగలదు.
‘ఒకరినొకరు ప్రోత్సహించండి’
12. (ఎ) “ప్రోత్సాహం” అని అనువదించబడిన గ్రీకు పదం యొక్క కొన్ని భావాలేమిటి? (బి) యోబు సహచరులు ఆయనను ప్రోత్సహించడంలో ఎలా విఫలమయ్యారు? (సి) మనం ఒకరినొకరం తీర్పు తీర్చుకోవడం ఎందుకు చేయకూడదు?
12 పౌలు మనం ‘ఒకరినొకరు ప్రోత్సహించు’ కోవాలని వ్రాసినప్పుడు, ఆయన ‘బలపర్చడం, ఓదార్చడం’ అనే భావం కూడా ఉన్న పా·రా·కా·లోʹయ్ అనే ఒక విధమైన గ్రీకు పదాన్ని ఉపయోగించాడు. గ్రీకు సెప్టాజంట్ వర్షన్ నందు, ఇదే పదం యోబు దుఃఖించేవారిని ఓదార్చేవాడని వర్ణించబడుతున్న సందర్భంలో, యోబు 29:25 నందు ఉపయోగించబడింది. అపహాస్యమైన విధంగా, యోబు తానే తీవ్రమైన శ్రమ ననుభవిస్తున్నప్పుడు, అలాంటి ప్రోత్సాహాన్ని పొందలేదు. అతని ముగ్గురు ‘ఆదరణకర్తలు’ ఆయనకు తీర్పుతీర్చి, ఆయనకు ప్రసంగాలివ్వడంలో నిమగ్నమై ఉండి, ఆయనను అర్థం చేసుకోవడంలో లేక ఆయన యెడల సానుభూతి కలిగి ఉండడంలో వారు విఫలమయ్యారు. వాస్తవానికి, వారు మాట్లాడిన మాటలంతటిలో, వారు ఒక్కసారి కూడా యోబును పేరుతో సంబోధించలేదు. (యోబు 33:1, 31 వ్యత్యాసం చూడండి.) సాక్ష్యాధారంగా వారు ఆయనను ఒక వ్యక్తిగా కంటే ఒక సమస్యగా దృష్టించారు. “నా స్థితిలో మీరుండినయెడల” అని యోబు వేదనతో అనడంలో ఆశ్చర్యంలేదు. (యోబు 16:4) అలాగే నేడు, మీరు ఎవరినైనా ప్రోత్సహించాలనుకుంటే, సానుభూతి చూపించండి! తీర్పుతీర్చకండి. రోమీయులు 14:4 చెబుతున్నట్లుగా, “పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండుటయైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తిగలవాడు.”
13, 14. (ఎ) మన సహోదర సహోదరీలను ఆదరించడానికి ఏ ప్రాథమిక సత్యాన్ని గూర్చి మనం వారిని ఒప్పించవలసిన అవసరం ఉంటుంది? (బి) దానియేలు ఒక దూత ద్వారా ఎలా బలపర్చబడ్డాడు?
13 రెండవ థెస్సలొనీకయులు 2:16, 17 నందు ఒక విధమైన పా·రా·కా·లోʹయ్ మరియు దాని సంబంధిత నామవాచకం “ఓదార్పు” అని అనువదించబడ్డాయి: “మన ప్రభువైన యేసుక్రీస్తును, మనలను ప్రేమించి, కృపచేత నిత్యమైన ఆదరణయు, శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రియైన దేవుడును, మీ హృదయములను ఆదరించి, ప్రతి సత్కార్యమందును ప్రతిసద్వాక్యమందును మిమ్మును స్థిరపరచును గాక.” పౌలు, యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడనే ప్రాథమిక సత్యంతో, మన హృదయాలు ఆదరింపబడ్డాయనే తలంపును జతచేయడాన్ని గమనించండి. కాబట్టి ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని ధ్రువపర్చడం ద్వారా మనం ఒకరినొకరం ప్రోత్సహించుకొని, ఆదరించుకుందాము.
14 ఒక సందర్భంలో ప్రవక్తయైన దానియేలు ఒక భయానకమైన దర్శనాన్ని చూసిన తర్వాత ఎంతగా కలత చెందాడంటే, ఆయనిలా చెప్పాడు: “నా సొగసు వికారమాయెను, బలము నా యందు నిలువలేదు.” యెహోవా ఒక దూతను పంపగా అతడు, దేవుని దృష్టిలో “నీవు బహు ప్రియుడవు” అని దానియేలుకు అనేకసార్లు గుర్తుచేశాడు. దాని ఫలితం? దానియేలు దూతతో ఇలా చెప్పాడు: “నీవు నన్ను ధైర్యపరచితివి.”—దానియేలు 10:8, 11, 19.
15. పెద్దలు మరియు ప్రయాణ కాపరులు సరిదిద్దడంతో మెప్పును ఎలా సమతూకం చేయాలి?
15 కాబట్టి, ఇతరులను ప్రోత్సహించడానికి ఇక్కడ మరో మార్గం ఉంది. వారిని మెచ్చుకోండి! క్లిష్టమైన, కఠినమైన దృక్పథాన్ని అలవర్చుకోవడం చాలా సులభమే. ప్రాముఖ్యంగా పెద్దలు మరియు ప్రయాణకాపరులు సరిదిద్దడం అవసరమైన సమయాలుంటాయన్నది వాస్తవమే. తమ తీర్పుతీర్చే దృక్పథాన్ని బట్టిగాక తామిచ్చే ఉత్సాహపూరితమైన ప్రోత్సాహాన్ని బట్టి వారు జ్ఞాపకం చేసుకొనబడుతున్నట్లయితే అది వారికి మంచిది.
16. (ఎ) కృంగిన వారిని ప్రోత్సహించేటప్పుడు, వారిని కేవలం యెహోవా సేవలో మరింత చేయమని చెప్పడం మాత్రమే ఎందుకు సరిపోదు? (బి) ఏలీయా కృంగియున్నప్పుడు యెహోవా ఎలా ఆయనకు సహాయం చేశాడు?
16 ప్రాముఖ్యంగా, బాధపడేవారికి ప్రోత్సాహం అవసరం, తోటి క్రైస్తవులముగా—ప్రాముఖ్యంగా మనం పెద్దలమైతే—మనం సహాయానికి మూలమై ఉండాలని యెహోవా మన నుండి నిరీక్షిస్తాడు. (సామెతలు 21:13) మనమేమి చేయవచ్చు? దానికి సమాధానం, యెహోవా సేవలో మరింత చేయమని చెప్పడమంత సుళువై ఉండకపోవచ్చు. ఎందుకు? ఎందుకుంటే అది తాము తగినంత చేయలేకపోతున్నందు వలన వచ్చే వారి మానసిక కృంగుదలను సూచిస్తుండవచ్చును. కాని సాధారణంగా పరిస్థితి అది కాదు. ప్రవక్తయైన ఏలీయా ఒకసారి ఎంతగా కృంగిపోయాడంటే ఆయన తాను మరణించాలని కోరుకున్నాడు; అయితే, యెహోవాకు తాను చేస్తున్న సేవలో ఆయన ఎంతో నిమగ్నమై ఉన్న సమయంలో ఇది సంభవించింది. యెహోవా ఆయనతో ఎలా వ్యవహరించాడు? ఆచరణ యోగ్యమైన సహాయం అందించేందుకు ఆయన ఒక దూతను పంపించాడు. తాను మృతులైన తన పితరులంత వ్యర్థమైనవాడనని, తన పనంతా వ్యర్థమై పోయిందని, తాను పూర్తిగా ఒంటరినై పోయినట్లు భావిస్తున్నానని తెలియజేస్తూ, ఏలీయా తన హృదయాన్ని యెహోవా యెదుట కుమ్మరించాడు. యెహోవా అతడు చెప్పింది విని, తన శక్తి యొక్క సంభ్రమాశ్చర్యం గొల్పే ప్రదర్శనలతో, అతడు కచ్చితంగా ఒంటిరివాడు కాదని, ఆయన ప్రారంభించిన పని పూర్తి చేయబడుతుందనే ధైర్యవచనాలతో ఆయనను ఓదార్చాడు. అతని తర్వాత అతని వారసుడయ్యే ఒక వ్యక్తికి తర్ఫీదివ్వడానికి ఏలీయాకు ఒక సహచరున్ని ఇస్తానని కూడా యెహోవా వాగ్దానం చేశాడు.—1 రాజులు 19:1-21.
17. తన యెడల తాను అతి కఠినంగా ఉన్న వ్యక్తిని ఒక పెద్ద ఎలా ప్రోత్సహించగలడు?
17 ఎంత ప్రోత్సాహకరం! మన మధ్యనున్న మానసికంగా కష్టాలనుభవిస్తున్న వారిని మనం కూడా అలాగే ప్రోత్సహిద్దాము. వినడం ద్వారా వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి! (యాకోబు 1:19) వారి వ్యక్తిగత అవసరతల కొరకు తగినట్లు సిద్ధం చేయబడిన లేఖనాధార ఓదార్పు నివ్వండి. (సామెతలు 25:11; 1 థెస్సలొనీకయులు 5:14) తమ యెడల తాము అతి కఠినంగా ఉండేవారిని ప్రోత్సహించడానికి, యెహోవా వారిని ప్రేమిస్తాడని, వారిని విలువైనవారిగా పరిగణిస్తాడని చూపించే లేఖనాధార రుజువును పెద్దలు దయాపూర్వకంగా అందజేయవచ్చు.a నిష్ప్రయోజకులమని భావించేవారితో విమోచన బలి గురించి చర్చించడం ప్రోత్సహించడానికి శక్తివంతమైన మూలం కాగలదు. ఏదైనా గత పాపం గురించి బాధపడేవారికి, నిజంగా అతడు పశ్చాత్తాపపడి, అలాంటి ఏ విధమైన అలవాటునైనా పూర్తిగా నిరాకరించి ఉంటే, విమోచన అతన్ని శుద్ధి చేసిందని చూపించడం అవసరం కావచ్చు.—యెషయా 1:18.
18. మరొకరిచే బాధింపబడిన, అంటే అత్యాచారం చేయబడిన వారిని ప్రోత్సహించడానికి విమోచన క్రయధనాన్ని గూర్చిన బోధను ఎలా ఉపయోగించవచ్చు?
18 అయితే, ఆ బోధను సరైన విధంగా ఉపయోగించేందుకై ఒక పెద్ద ప్రత్యేకమైన విషయానికి శ్రద్ధనివ్వవచ్చు. ఒక ఉదాహరణను పరిశీలించండి: పాపాలన్నిటికీ పరిహారం కొరకు అవసరమైన మోషే ధర్మశాస్త్రంలోని జంతు బలులు క్రీస్తు విమోచనా బలికి ముంగుర్తుగా పనిచేశాయి. (లేవీయకాండము 4:27, 28) అయితే, అత్యాచారం చేయబడిన ఒక స్త్రీ అలాంటి పాపపరిహారార్థ బలిని అర్పించాలన్న నియమమేమీ లేదు. ఆమెను శిక్షించడానికి వారు “ఏమియు చేయకూడదు” అని ధర్మశాస్త్రం తెలియజేసింది. (ద్వితీయోపదేశకాండము 22:25-27) గనుక నేడు, ఒక సహోదరి దౌర్జన్యం చేయబడి, అత్యాచారం చేయబడితే, దాన్ని బట్టి ఆమె తనను తాను అసహ్యించుకొనేలా, తాను వ్యర్థమైన దాన్నని భావించేలా చేయబడినట్లయితే ఆ పాపం నుండి తనను తాను శుద్ధి చేసుకోవడానికి ఆమెకు విమోచన క్రయధనం అవసరమని నొక్కిచెప్పడం సమంజసంగా ఉంటుందా? కచ్చితంగా ఉండదు. అలా దౌర్జన్యం చేయబడినందుకు ఆమె పాపం చేయలేదు. అత్యాచారం చేసినవాడు పాపం చేశాడు, అతడికి శుద్ధీకరణ అవసరం. అయితే, ఎవరో చేసిన పాపం వల్ల ఆమె దేవుని దృష్టిలో కళంకితం కాలేదు, కాని ఆమె యెహోవా దృష్టిలో అమూల్యమైనదని, ఆమె ఆయన ప్రేమలో కొనసాగ గలదనడానికి విమోచన క్రయధనాన్ని అందజేయడంలో యెహోవా మరియు క్రీస్తు చూపించిన ప్రేమను, ఒక రుజువుగా ఉపయోగించవచ్చు.—మార్కు 7:18-23; 1 యోహాను 4:16 పోల్చండి.
19. మన సహోదర సహోదరీలతో చేసే సహవాసమంతా ప్రోత్సాహకరంగానే ఉండగలదని మనం ఎందుకు ఎదురుచూడకూడదు, కాని మన తీర్మానమేమై ఉండాలి?
19 అవును, జీవితంలో ఒక వ్యక్తి యొక్క పరిస్థితి ఏదైనప్పటికీ, అతని గతాన్ని ఏ బాధాకరమైన పరిస్థితులు అంధకారం చేసినప్పటికీ, అతడు యెహోవా ప్రజల సంఘంలో ప్రోత్సాహాన్ని పొందగలగాలి. మనమందరం కలిసి సమావేశమైనప్పుడల్లా, ఒకరియందొకరు శ్రద్ధ కలిగివుండడానికి, ఒకరినొకరు పురికొల్పుకోవడానికి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి మనం వ్యక్తిగతంగా ప్రయాసపడితే, అతడు తప్పకుండా అలా పొందగలడు. అయితే, అపరిపూర్ణులమైన మనమందరం కొన్నిసార్లు అలా చేయడానికి తప్పిపోతాము. అనుకోకుండా మనం ఒకరినొకరం నిరుత్సాహపరుస్తాము, అప్పుడప్పుడూ చివరికి ఒకరినొకరం నొప్పించుకుంటాము కూడా. ఈ విషయంలో, ఇతరుల వైఫల్యాలపై దృష్టి కేంద్రీకరించకుండా ఉండడానికి ప్రయత్నించండి. మీరు పొరపాట్లపైనే దృష్టి నిల్పినట్లయితే, మీరు సంఘాన్ని అమితంగా విమర్శించేవారై, చివరికి మనం దేనిలో పడిపోవడాన్ని నివారించడానికి మనకు సహాయం చేయడానికి పౌలు ఆసక్తి కలిగివుండెనో ఆ ఉరిలో, అంటే కలిసి సమావేశమగుటను నిర్లక్ష్యం చేయడమనే ఉరిలో పడిపోగలము. ఎన్నడూ అది జరుగకుండును గాక! ఈ పాత విధానం మరింత ప్రమాదకరమైనదిగా, బాధించేదిగా తయారవుతుండగా, కూటాలలో మన సహవాసాన్ని ప్రోత్సాహకరమైనదిగా చేయడానికి—అన్నిటికంటే ప్రాముఖ్యంగా యెహోవా దినం సమీపిస్తుండడాన్ని మనం చూస్తుండగా—మనం చేయగలిగినదంతా చేయడానికి మనం గట్టిగా నిర్ణయించుకుందాము!
[అధస్సూచీలు]
a ఒక పెద్ద అలాంటి వ్యక్తితో ప్రోత్సాహకరమైన కావలికోట మరియు తేజరిల్లు! శీర్షికలను పఠించడానికి ఎంపిక చేసుకోవచ్చు—ఉదాహరణకు, “కృపాబాహుళ్యం నుండి మీరు ప్రయోజనం పొందుతారా?” మరియు “కృంగుదలకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో విజయం సాధించుట.”—కావలికోట (ఆంగ్లం) ఫిబ్రవరి 15 మరియు మార్చి 1, 1990.
మీరెలా సమాధానమిస్తారు?
◻ ఈ అంత్య దినాల్లో మన కూటాలు మరియు సహవాసం ప్రోత్సాహకరంగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యము?
◻ ఒకరియందొకరం శ్రద్ధ కలిగివుండడమంటే దాని భావమేమిటి?
◻ ఒకరినొకరు పురికొల్పుకోవడమంటే దాని భావమేమిటి?
◻ ఒకరినొకరు ప్రోత్సహించుకోవడంలో ఏమి ఇమిడి ఉంది?
◻ కృంగినవారు, కలతచెందిన హృదయంగలవారు ఎలా ప్రోత్సహించబడగలరు?
[16వ పేజీలోని చిత్రం]
మనం ఒకరినొకరం ఎక్కువగా తెలుసుకోవడానికి ఆతిథ్యం మనకు సహాయం చేస్తుంది
[18వ పేజీలోని చిత్రం]
ఏలీయా కృంగియున్నప్పుడు, యెహోవా దయతో ఆయనను ఆదరించాడు