ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ, ప్రోత్సహించుకోండి
“ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.” —హెబ్రీ. 10:24, 25.
1, 2. రెండవ ప్రపంచయుద్ధం చివర్లో జరిగిన మరణయాత్రల నుండి బ్రతికి బయటపడడానికి 230 మంది యెహోవాసాక్షులకు ఏమి సహాయం చేసింది?
రెండవ ప్రపంచయుద్ధం చివర్లో నాజీ పరిపాలన అంతమౌతుందనగా, నిర్బంధ శిబిరాల్లో మిగిలివున్న వేలమందిని చంపమని ఓ ఆజ్ఞ జారీ అయ్యింది. సాక్సన్‌హౌజన్ నిర్బంధ శిబిరంలోని వాళ్లందర్నీ ఓడరేవులకు తీసుకెళ్లి, అక్కడ ఓడల్లోకి ఎక్కించి, నడిసంద్రంలో జలసమాధి చేయాలని కుట్రపన్నారు. ఆ కుట్రలనే తర్వాత మరణయాత్రలు (డెత్మార్చ్స్) అని పిలిచారు.
2 సాక్సన్‌హౌజన్ నిర్బంధ శిబిరంలోని 33,000 మంది బందీలను 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న జర్మనీలోని లూబెక్ అనే రేవు పట్టణానికి బలవంతంగా నడిపించారు. ఆ బందీల్లో ఆరు దేశాలకు చెందిన 230 మంది యెహోవాసాక్షులు ఉన్నారు; సాక్షులందర్నీ ఒకే గుంపుగా నడవమని ఆజ్ఞాపించారు. వాళ్లందరూ తిండి లేకపోవడంవల్ల, జబ్బుపడడం వల్ల నీరసించిపోయి ఉన్నారు. ఆ సమయంలో మన సహోదరులు ఎలా బ్రతికి బయటపడ్డారు? “అలా నడుస్తూ ఉండడానికి మేము ఒకరినొకరం ఎప్పటికప్పుడు ప్రోత్సహించుకున్నాం” అని వాళ్లలో ఒక సహోదరుడు అన్నాడు. దేవుడిచ్చిన ‘బలాధిక్యముతో’ పాటు ఒకరిపట్ల ఒకరికి ఉన్న ప్రేమ వల్ల వాళ్లు ఆ కఠిన పరీక్షను తట్టుకోగలిగారు.—2 కొరిం. 4:7.
3. మనం ఎందుకు ఒకరినొకరం ప్రోత్సహించుకోవాలి?
3 నేడు మనం అలాంటి మరణయాత్రలో లేము, కానీ మనకు కూడా ఎన్నో సవాళ్లు ఎదురౌతుంటాయి. 1914లో దేవుని రాజ్యం స్థాపితమైన తర్వాత సాతాను పరలోకం నుండి గెంటివేయబడి, భూమికే పరిమితం చేయబడ్డాడు. సాతాను “తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధముగలవాడై” ఉన్నాడు. (ప్రక. 12:7-9, 12) హార్‌మెగిద్దోను దగ్గరపడుతుండగా, సాతాను మన ఆధ్యాత్మికతను బలహీనపర్చడానికి పరీక్షలను, ఒత్తిళ్లను తీసుకొస్తున్నాడు. దానికితోడు మనకు రోజువారీ ఆందోళనలు కూడా ఉండనే ఉన్నాయి. (యోబు 14:1; ప్రసం. 2:23) కొన్నిసార్లు మన సమస్యలన్నీ కలిసి ఎంతగా కృంగదీస్తాయంటే, మనం అప్పటివరకు కూడగట్టుకున్న భావోద్వేగ, ఆధ్యాత్మిక బలం ఆ నిరుత్సాహాన్ని తట్టుకోవడానికి సరిపోకపోవచ్చు. ఓ సహోదరుడు దశాబ్దాల కాలంలో, చాలామందికి ఆధ్యాత్మికంగా సహాయం చేశాడు. అయితే వృద్ధాప్యంలో తాను, తన భార్య అనారోగ్యం పాలవ్వడంతో ఆయన ఎంతో నిరుత్సాహానికి లోనయ్యాడు. ఆ సహోదరునికి అవసరమైనట్లే మనందరికీ యెహోవా ఇచ్చే “బలాధిక్యము,” తోటివాళ్ల ప్రోత్సాహం అవసరం.
4. ఇతరులను ప్రోత్సహించే వ్యక్తులుగా ఉండాలంటే, అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఏ ఉపదేశాన్ని మనం పాటించాలి?
4 ఇతరులను ప్రోత్సహించే వ్యక్తులుగా ఉండాలంటే, మనం అపొస్తలుడైన పౌలు హెబ్రీ క్రైస్తవులకు ఇచ్చిన ఉపదేశాన్ని పాటించాలి. ఆయన ఇలా చెప్పాడు: “కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.” (హెబ్రీ. 10:24, 25) ఈ ఉపదేశాన్ని మనం ఎలా పాటించవచ్చు?
ఒకరి గురించి ఒకరు ఆలోచించుకోండి
5. ఒకరి గురించి ఒకరు ఆలోచించడం అంటే ఏమిటి? అదెలా సాధ్యమౌతుంది?
5 ఒకరి గురించి ఒకరు ఆలోచించడం అంటే ఇతరుల అవసరాలను పరిగణనలోకి తీసుకోవడం అని అర్థం. రాజ్యమందిరంలో మన సంభాషణల్ని కేవలం హలో, హాయ్ వంటి పలకరింపులకో, చిన్నాచితకా విషయాలకో పరిమితం చేసుకుంటే మనం ఇతరుల అవసరాల గురించి ఆలోచించడం వీలౌతుందా? అవ్వకపోవచ్చు. నిజమే, మనం “పరుల” విషయాల్లో తలదూర్చకుండా మన “సొంత కార్యములను” చూసుకోవడానికి జాగ్రత్తపడాలి. (1 థెస్స. 4:10, 11; 1 తిమో. 5:13) అయినప్పటికీ, మనం మన సహోదరులను ప్రోత్సహించాలనుకుంటే, మనం వాళ్ల జీవన పరిస్థితులను, లక్షణాలను, ఆధ్యాత్మికతను, బలాలను, బలహీనతలను తెలుసుకొని ఉండాలి. మనం తమ స్నేహితులమని వాళ్లకు అనిపించాలి, తమను ప్రేమిస్తున్నామనే నమ్మకం వాళ్లకు కుదరాలి. అందుకోసం మనం వాళ్లతో సమయం గడపాలి, కేవలం వాళ్లు సమస్యల్లో ఉన్నప్పుడే కాక ఇతర సందర్భాల్లో కూడా అలా చేయాలి.—రోమా. 12:13.
6. తమ సంరక్షణలోని గొర్రెల అవసరాల గురించి ‘ఆలోచించడానికి’ సంఘపెద్దలకు ఏది సహాయం చేస్తుంది?
6 సంఘపెద్దలు తమ సంరక్షణలో ఉన్న “దేవుని మందను” సిద్ధమనస్సుతో ఇష్టపూర్వకంగా ‘కాయాలి’ అని బైబిలు ఉపదేశిస్తోంది. (1 పేతు. 5:1-3) అయితే తమ సంరక్షణలో ఉన్న గొర్రెల గురించి నిజంగా తెలియకుండా వాళ్లు సమర్థవంతంగా ఎలా కాయగలరు? (సామెతలు 27:23 చదవండి.) సంఘపెద్దలు తోటి సహోదరులకు అందుబాటులో ఉంటూ వాళ్లతో సంతోషంగా సమయం గడిపితే, అవసరమైనప్పుడు వాళ్లు పెద్దల సహాయాన్ని కోరడానికి సంకోచించరు. అంతేగాక సహోదరసహోదరీలు తమ మనసులోని భావాల్ని, చింతల్ని పెద్దలకు చెప్పుకోవడానికి సుముఖంగా ఉంటారు. దానివల్ల, పెద్దలు తమ సంరక్షణలోని గొర్రెల అవసరాల గురించి ‘ఆలోచించి,’ కావాల్సిన సహాయాన్ని అందించగలుగుతారు.
7. నిరుత్సాహంలో ఉన్నవాళ్ల “నిరర్థకమైన” మాటల్ని మనం ఎలా పరిగణించాలి?
7 థెస్సలొనీక సంఘానికి రాస్తూ, “బలహీనులకు ఊత నియ్యుడి” అని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (1 థెస్సలొనీకయులు 5:14 చదవండి.) “ధైర్యము చెడినవారు” ఒక విధంగా బలహీనులే. నిరుత్సాహంలో ఉన్నవాళ్లు కూడా అంతే. సామెతలు 24:10 ఇలా చెబుతోంది: “శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు.” తీవ్రమైన నిరుత్సాహంలో ఉన్న వ్యక్తి ‘నిరర్థకంగా’ మాట్లాడే అవకాశం ఉంది. (యోబు 6:2, 3) అలాంటి వాళ్లతో వ్యవహరిస్తున్నప్పుడు, వాళ్ల మాటల్ని బట్టి వాళ్ల నిజమైన వ్యక్తిత్వం అదేనన్న నిర్ధారణకు రాకూడదని మనం గుర్తుంచుకోవాలి. ఆ విషయాన్నే రషెల్ అనే సహోదరి తన సొంత అనుభవం నుండి నేర్చుకుంది. వాళ్ల అమ్మ తీవ్రమైన కృంగుదలతో బాధపడుతోంది. రషెల్ ఇలా అంటోంది: “చాలాసార్లు మా అమ్మ ఎంతో ఏవగింపు పుట్టించే మాటలు అంటుంది. అలాంటి సందర్భాల్లో, మా అమ్మ నిజమైన వ్యక్తిత్వాన్ని అంటే ప్రేమ, దయ, ఔదార్యం గల వ్యక్తిత్వాన్ని గుర్తుచేసుకోవడానికి ప్రయత్నించాను. కృంగుదలలో ఉన్నవాళ్లు ఏవేవో మాట్లాడినా వాళ్ల అసలు ఉద్దేశం అది కాదని నేను నేర్చుకున్నాను. అలాంటి సందర్భాల్లో వాళ్లను తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తే, అంతకన్నా ఘోరమైన విషయం మరొకటి ఉండదు.” సామెతలు 19:11 ఇలా చెబుతోంది: “ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును, తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును.”
8. ముఖ్యంగా ఎవరి పట్ల మన ప్రేమను స్థిరపరచాలి? ఎందుకు?
8 గతంలో చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి తగిన చర్యలు తీసుకున్నా, ఇంకా అవమాన భారంతో సతమతమౌతూ కృంగిపోతున్న వ్యక్తికి మనమెలా సహాయం చేయవచ్చు? కొరింథు సంఘంలో పశ్చాత్తాపపడిన ఓ పాపి గురించి పౌలు ఇలా రాశాడు: “మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేనియెడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. కావున వాని యెడల మీ ప్రేమను స్థిరపరచవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.” (2 కొరిం. 2:7, 8) “స్థిరపరచు” అని అనువాదమైన పదానికి, “అధికారికం చేయు, ధ్రువీకరించు, చట్టబద్ధం చేయు” అనే అర్థాలున్నాయని ఒక నిఘంటువు పేర్కొంటోంది. తన మీద మనకున్న ప్రేమను, శ్రద్ధను పశ్చాత్తాపపడిన వ్యక్తి అర్థంచేసుకుంటాడని మనం ఊరికే అనుకోలేం. ఆయన పట్ల మనకున్న ప్రేమను, శ్రద్ధను మన వైఖరిలో, చేతల్లో చూపించాలి.
‘ప్రేమ చూపించడానికి, సత్కార్యాలు చేయడానికి పురికొల్పాలి’
9. ‘ప్రేమ చూపించడానికి, సత్కార్యాలు చేయడానికి పురికొల్పాలంటే’ మనమేమి చేయాలి?
9 “ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము” అని పౌలు రాశాడు. మనం ప్రేమ చూపించడానికి, సత్కార్యాలు చేయడానికి తోటి విశ్వాసులను పురికొల్పాలి. సాధారణంగా, మంట ఆరిపోయేలా ఉన్నప్పుడు నిప్పులను కదిలించి, గాలి ఊదాలి. (2 తిమో. 1:6) అదే విధంగా దేవుని పట్ల, పొరుగువాళ్ల పట్ల ప్రేమ చూపించేలా మన తోటి సహోదరులను ప్రేమతో పురికొల్పాలి. సత్కార్యాలు చేసేలా ఇతరుల్ని పురికొల్పాలంటే వాళ్లను తగిన విధంగా మెచ్చుకోవడం ప్రాముఖ్యం.
ఇతరులతో కలిసి పరిచర్యలో పాల్గొనండి
10, 11. (ఎ) మన మధ్యనున్న ఎవరెవరికి మెప్పుకోలు అవసరం? (బి) ‘తప్పిదములో చిక్కుకున్న వ్యక్తికి’ మెప్పుకోలు ఎలా సహాయం చేస్తుందో ఉదహరించండి.
10 మనం నిరుత్సాహపడిన వాళ్లమైనా, కాకపోయినా మనలో ప్రతీ ఒక్కరికి మెప్పుకోలు అవసరం. ఓ సంఘపెద్ద ఇలా రాశాడు: “‘ఫలానాది నువ్వు బాగా చేశావు’ అని మానాన్న ఒక్కసారి కూడా నన్ను మెచ్చుకోలేదు. అందుకే నేను ఆత్మగౌరవం అనేదే లేకుండా పెరిగాను. నాకు ఇప్పుడు 50 ఏళ్లొచ్చినా, ఒక సంఘపెద్దగా నేను చేసే పనిని నా స్నేహితులు మెచ్చుకున్నప్పుడు నాకెంతో మంచిగా అనిపిస్తుంది . . . ఇతరులను ప్రోత్సహించడం ఎంత ప్రాముఖ్యమో నేను నా సొంత అనుభవం నుండి నేర్చుకున్నాను, అందుకే నేను చొరవ తీసుకుని మరీ ప్రోత్సహిస్తాను.” మెప్పుకోలు అనేది పయినీర్లు, వృద్ధులు, నిరుత్సాహానికి గురైన వాళ్లతో సహా ప్రతీ ఒక్కరికీ ప్రోత్సాహాన్ని ఇవ్వగలదు.—రోమా. 12:10.
11 ‘తప్పిదములో చిక్కుకున్న వాణ్ణి మంచి దారికి తీసుకురావడానికి’ ప్రయత్నిస్తున్నప్పుడు, ఆధ్యాత్మిక అర్హతలుగల పెద్దలు ప్రేమతో ఉపదేశం ఇచ్చి, తగిన విధంగా మెచ్చుకుంటే పాపి తిరిగి మంచి మార్గంలో నడవాలనే ప్రేరణను పొందవచ్చు. (గల. 6:1) అది మిరీయమ్ అనే సహోదరి విషయంలో నిజమైంది. ఆమె ఇలా రాసింది: “ఒకే సమయంలో, నా సన్నిహిత స్నేహితుల్లో కొందరు సంఘాన్ని వదిలివెళ్లిపోవడం, మా నాన్న మెదడుకు సంబంధించిన ఒక వ్యాధితో (బ్రెయిన్ హెమరేజ్) బాధపడడం జరిగినప్పుడు నేను ఎంతో వేదనను అనుభవించాను. ఆ రోజులే నా జీవితంలో అత్యంత దుఃఖకరమైన రోజులు. నేను చాలా కృంగిపోయాను. ఆ పరిస్థితి నుండి బయటపడడానికి నేను ఓ అవిశ్వాసితో డేటింగ్ మొదలుపెట్టాను.” దానివల్ల ఇక యెహోవా ప్రేమను పొందడానికి తాను అనర్హురాలినని భావించి, సత్యాన్ని విడిచి వెళ్లాలని ఆమె అనుకుంది. అయితే గతంలో ఆమె నమ్మకంగా చేసిన సేవను ఒక సంఘపెద్ద గుర్తుచేసినప్పుడు ఆమె ఎంతగానో చలించిపోయింది. యెహోవా తనను ప్రేమిస్తున్నాడనే భరోసాను ఇచ్చేందుకు పెద్దలు చేసిన సహాయాన్ని ఆమె స్వీకరించింది. దానివల్ల యెహోవా పట్ల ఆమె ప్రేమ పునరుత్తేజితమైంది. ఆమె తన బాయ్ ఫ్రెండ్‌తో స్నేహాన్ని మానుకుని, యెహోవా సేవలో కొనసాగింది.
‘ప్రేమ చూపించడానికి, సత్కార్యాలు చేయడానికి పురికొల్పండి’
12. ఇతరుల్ని పురికొల్పడానికి కించపర్చడం, విమర్శించడం, అవమానించడం వంటివి చేస్తే ఫలితం ఎలా ఉంటుంది?
12 అనవసరంగా ఇతరులతో పోల్చి కించపర్చడం, కఠినమైన ప్రమాణాలను విధించి విమర్శించడం, ఎంత చేసినా ‘ఇంతేనా మీరు చేసేది’ అని అవమానించడం వంటివి చేస్తే ఓ వ్యక్తి వెంటనే విజృంభించి పనిచేయవచ్చు కానీ, ఆ ఫలితాలు కేవలం కొంతకాలమే ఉంటాయి. మరోవైపున, తోటి విశ్వాసిని మెచ్చుకుని యెహోవా పట్ల ఆయనకున్న ప్రేమను గుర్తుచేయడం వల్ల వచ్చే సత్ఫలితాలు చిరకాలం నిలుస్తాయి.—ఫిలిప్పీయులు 2:1-4 చదవండి.
‘ఒకరినొకరు ప్రోత్సహించుకోండి’
13. ఇతరుల్ని ప్రోత్సహించడంలో భాగంగా మనం ఏమి చేయాలి? (ఈ ఆర్టికల్ ప్రారంభ చిత్రం చూడండి.)
13 ‘ఆ దినము సమీపిస్తున్న కొద్దీ మనం మరి ఎక్కువగా ఒకనినొకడు హెచ్చరించుకుంటూ [“ప్రోత్సహించుకుంటూ,” NW] ఉండాలి.’ దేవుని సేవలో ముందుకు సాగుతూ ఉండమని ఇతరుల్ని పురికొల్పడం కూడా ప్రోత్సహించడంలో భాగమే. ప్రేమ చూపించడానికి, సత్కార్యాలు చేయడానికి ఇతరులను పురికొల్పడాన్ని, ఆరిపోనున్న మంటను తిరిగి జ్వలింపజేయడంతో పోల్చవచ్చు. ఇతరులను ప్రోత్సహించడాన్ని, మంట అలాగే మండుతూ ఉండేందుకు లేదా మరింత బాగా మండేటట్లు చేసేందుకు ఇంధనాన్ని పోయడంతో పోల్చవచ్చు. నిరుత్సాహానికి లోనైనవాళ్లను బలపర్చి, సాంత్వనను ఇవ్వడం ద్వారా మనం వాళ్లను ప్రోత్సహించగలుగుతాం. అలాంటి వాళ్లను ప్రోత్సహించే అవకాశం దొరికినప్పుడు మనం ఆప్యాయంగా, మృదువుగా మాట్లాడాలి. (సామె. 12:18) అంతేకాక, మనం ‘వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి.’ (యాకో. 1:19) తోటి క్రైస్తవులు మాట్లాడుతున్నప్పుడు మనం సహానుభూతితో వింటే, వాళ్లను నిరుత్సాహానికి గురిచేసిన పరిస్థితుల్ని అర్థంచేసుకొని, ఆ పరిస్థితితులతో వ్యవహరించడానికి సహాయం చేసే విధంగా మాట్లాడగలుగుతాం.
మంచి సహవాసాన్ని ఆస్వాదించండి
14. నిరుత్సాహానికి లోనైన ఓ సహోదరునికి ఎలాంటి సహాయం అందింది?
14 కొన్నేళ్లుగా నిష్క్రియునిగా ఉన్న సహోదరునికి కనికరంగల ఓ సంఘపెద్ద ఎలా సహాయం చేశాడో చూడండి. ఆ సహోదరుడు చెప్పేది వింటున్నప్పుడు ఆయనింకా యెహోవాను ప్రగాఢంగా ప్రేమిస్తున్నాడని ఆ పెద్దకు అర్థమైంది. ఆ సహోదరుడు ప్రతీ కావలికోట సంచికను శ్రద్ధగా చదువుతున్నాడని, కూటాలకు క్రమంగా హాజరయ్యేందుకు కృషి చేస్తున్నాడని అర్థమైంది. అయితే, సంఘంలో కొందరి పనులను చూసి ఆయనకు నిరాశ కలిగిందని, కాస్త కోపమొచ్చిందని తెలిసింది. ఆయన గురించి వెంటనే ఓ అభిప్రాయం ఏర్పర్చుకోకుండా ఆయన చెప్పేదంతా ఆ పెద్ద సహానుభూతితో విన్నాడు. అంతేకాక ఆ సహోదరుని పట్ల, ఆయన కుటుంబం పట్ల ప్రేమపూర్వక శ్రద్ధను వ్యక్తం చేశాడు. గతంలోని చేదు అనుభవాల గురించి అదేపనిగా ఆలోచించడం వల్ల తాను ప్రేమించిన దేవుణ్ణి సేవించలేకపోతున్నానని ఆ సహోదరుడు మెల్లమెల్లగా గుర్తించాడు. తనతో పరిచర్యకు రమ్మని ఆ సహోదరుణ్ణి సంఘ పెద్ద ఆహ్వానించాడు. ఆ పెద్ద చేసిన సహాయం వల్ల, ఆ సహోదరుడు తన పరిచర్యను తిరిగి ఆరంభించి, కొంతకాలానికి మళ్లీ అర్హతలు సాధించి సంఘ పెద్దయ్యాడు.
ప్రోత్సాహం అవసరమైన వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఓపిగ్గా వినండి (14, 15 పేరాలు చూడండి)
15. కృంగినవాళ్లను ప్రోత్సహించే విషయంలో మనం యెహోవా నుండి ఏమి నేర్చుకోవచ్చు?
15 నిరుత్సాహంలో ఉన్న వ్యక్తికి వెంటనే ఊరట కలగకపోవచ్చు లేదా మనం అందించే సహాయానికి ఆయన వెంటనే స్పందించకపోవచ్చు. అందుకే, మనం ఆయనకు సహాయాన్ని అందిస్తూనే ఉండాల్సి రావచ్చు. పౌలు ఇలా అన్నాడు: “బలహీనులకు ఊత నియ్యుడి, అందరియెడల దీర్ఘశాంతముగలవారై యుండుడి.” (1 థెస్స. 5:14) మనం బలహీనులకు ఊతమిచ్చే ప్రయత్నాల్ని వెంటనే విరమించుకునే బదులు వాళ్లను బలపరుస్తూనే ఉండాలి. గతంలో కొన్నిసార్లు నిరుత్సాహానికి లోనైన తన సేవకులతో యెహోవా ఓపిగ్గా వ్యవహరించాడు. ఉదాహరణకు, ఏలీయా మనోభావాల్ని పరిగణనలోకి తీసుకుంటూ యెహోవా ఆయనతో చాలా కనికరంగా వ్యవహరించాడు. తన సేవలో ముందుకు సాగడానికి అవసరమైన సహాయాన్ని యెహోవా ఏలీయాకు ఇచ్చాడు. (1 రాజు. 19:1-18) దావీదు నిజమైన పశ్చాత్తాపాన్ని చూపించినందుకు యెహోవా దయతో ఆయనను క్షమించాడు. (కీర్త. 51:7, 17) తన సేవను మానేసే పరిస్థితి దాకా వచ్చిన 73వ కీర్తన రచయితకు కూడా దేవుడు సహాయం చేశాడు. (కీర్త. 73:13, 16, 17) యెహోవా మనపట్ల కూడా కనికరాన్ని, దయను చూపిస్తాడు. ముఖ్యంగా మనం కృంగిపోయినప్పుడు, నిరుత్సాహానికి లోనైనప్పుడు యెహోవా మనతో అలా వ్యవహరిస్తాడు. (నిర్గ. 34:6) “ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది . . . అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది.” (విలా. 3:22, 23) మనం తనను అనుకరిస్తూ, కృంగినవాళ్లతో తనలాగే మృదువుగా వ్యవహరించాలని యెహోవా ఆశిస్తున్నాడు.
జీవమార్గంలో నిలిచి ఉండమని ఒకరినొకరు ప్రోత్సహించుకోండి
16, 17. ఈ విధానాంతం సమీపిస్తుండగా, మనం ఏమిచేయాలనే కృత నిశ్చయంతో ఉండాలి? ఎందుకు?
16 సాక్సన్‌హౌజన్ నిర్బంధ శిబిరం నుండి బయల్దేరిన 33,000 మంది బందీల్లో వేలమంది చనిపోయారు. అయితే, వాళ్లలో ఉన్న 230 మంది సాక్షుల్లో ప్రతీ ఒక్కరు బ్రతికారు. ముఖ్యంగా పరస్పర ప్రోత్సాహం వల్లే వాళ్లంతా ఆ మరణయాత్ర నుండి సురక్షితంగా బయటపడగలిగారు.
17 నేడు, మనం “జీవమునకు పోవు” మార్గంలో ఉన్నాం. (మత్త. 7:13, 14) త్వరలోనే, యెహోవా సేవకులందరూ ఐక్యంగా నీతి నివసించే నూతనలోకంలోకి అడుగుపెడతారు. (2 పేతు. 3:13) నిత్యజీవానికి నడిపించే మార్గంలో మనమందరం ఒకరికొకరం సహాయం చేసుకుంటూ ఉండాలనే కృతనిశ్చయంతో ఉందాం.