సత్యంకొరకు ఎందుకు అన్వేషించాలి?
అనేక మత సంస్థలు తమ వద్ద సత్యముందని చెప్పుకుంటున్నాయి మరియు అవి దాన్ని ఇతరులకు ఆసక్తితో అందిస్తాయి. అయితే, వాటి మధ్య గందరగోళంతోకూడిన “సత్యాలను” ఇచ్చిపుచ్చుకుంటాయి. సత్యాలు నిరపేక్షమైనవని, సంపూర్ణ సత్యాలు లేవనేందుకు ఇది మరొక రుజువా? కాదు.
ఆలోచనా సామర్థ్యం (ఆంగ్లం) అనే తన పుస్తకంలో ప్రొఫెసర్ వి. ఆర్. రుజీరొ, జ్ఞానవంతులైన ప్రజలు సహితం కొన్నిసార్లు సత్యం నిరపేక్షమైనదని అంటారని తన ఆశ్చర్యాన్ని వెలిబుచ్చుతున్నాడు. ఆయన ఇలా తర్కిస్తున్నాడు: “సత్యమంటే ఇది అని ఎవరికి వారే నిర్ణయించుకున్నట్లైతే, ఏ వ్యక్తి అభిప్రాయమూ మరొకరికంటే శ్రేష్ఠంగా ఉండదు. అందరూ సమంగా ఉండాలి. మరి అందరి ఆలోచనలూ ఒకటే అయినప్పుడు, ఏ విషయాన్నైనా ఎందుకు పరిశోధించాలి? భూగర్భశాస్త్ర ప్రశ్నలకు జవాబులను కనుగొనేందుకు భూమిని ఎందుకు తవ్వాలి? మధ్యప్రాచ్యమందలి ఉద్రిక్తస్థితికిగల కారణాన్ని ఎందుకు పరిశీలించాలి? క్యాన్స్‌రు నివారణకు ఎందుకు అన్వేషించాలి? నక్షత్రవీధిని ఎందుకు పరిశోధించాలి? కొన్ని జవాబులు ఇతర జవాబులకన్నా శ్రేష్ఠమైనప్పుడు మాత్రమే, సత్యం వ్యక్తిగత అభిప్రాయాలవల్ల ప్రభావితం చెందకుండ మరియు వాటినుండి విడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ కార్యాలు చేయడంలో అర్థం ఉంటుంది.”
వాస్తవానికి, సత్యం లేదని నిజంగా ఎవ్వరూ నమ్మరు. గణితం లేక భౌతిక శాస్త్ర నియమాలవంటి భౌతిక వాస్తవాల విషయానికి వచ్చినప్పుడు, ఎంతగట్టి నిరపేక్షతావాది అయినప్పటికీ, కొన్ని విషయాలు సత్యమని నమ్ముతారు. వైమానిక గతిశీల నియమాలు సంపూర్ణ సత్యాలని మనం అనుకుని ఉండకపోతే మనలో ఎంతమంది విమానంలో ప్రయాణించడానికి ధైర్యం చేస్తాము? సంపూర్ణ సత్యాలనేవి ఉన్నాయి; అవి మనచుట్టూ ఉన్నాయి మరియు సందేహించకుండానే మనం మన జీవితాలను వాటికి అప్పగిస్తాము.
నిరపేక్షతావాదపు మూల్యం
అయితే, నైతిక లోకంలోనే నిరపేక్షతావాదంలోని తప్పులు చాలా ఎక్కువగా కనిపిస్తాయి, ఎందుకంటే ఇందులోనే అలాంటి ఆలోచనా విధానం ఎంతో హానిని కలుగజేసింది. ది ఎన్‌సైక్లోపీడియా అమెరికానా ఈ విషయాన్ని ఇలా చెబుతోంది: “జ్ఞానం, లేక తెలిసిన సత్యం మానవులకు అందుతుందో లేదో అని ఎంతగానో సందేహించబడేది. . . . అయితే, జ్ఞానసత్యములనే ద్వంద్వ అభిప్రాయాలు ఊహాజనితమని లేక హానికరమైనవని తృణీకరించబడినప్పుడు మానవ సమాజం క్షీణిస్తుంది.”
బహుశ మీరు అలాంటి పతనాన్ని చూసి ఉండవచ్చు. ఉదాహరణకు, లైంగిక అనైతికత తప్పని స్పష్టంగా చెప్పే బైబిలు నైతిక బోధలు, సత్యాలని అరుదుగా పరిగణించబడుతున్నాయి. నైతిక విలువలకు సంబంధించిన సత్యం—“అంటే ఏది సరైనదో మీకై మీరే నిర్ణయించుకోవడమన్నది” నేడు ప్రబలంగా ఉన్న దృక్పథం. ఈ నిరపేక్ష వైఖరి ఫలితంగా సంఘం కృశించిపోవడం లేదు అని ఎవరైన వాదించగలరా? కచ్చితంగా లైంగికత వల్ల సోకిన వ్యాధులూ విడిపోయిన కుటుంబాలు మరియు తొలి ప్రాయంలోనే గర్భం ధరించడం వంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోగాలు వాటంతటవే దీన్ని రుజువుచేస్తున్నాయి.
సత్యమంటే ఏమిటి?
కనుక నిరపేక్షతా వాదపు మురికి నీటిని విడిచిపెట్టి, సత్యమనే స్వచ్ఛమైన నీరు అని బైబిలు వర్ణించే వాటిని కొద్దిగా పరిశీలిద్దాం. (యోహాను 4:14; ప్రకటన 22:17) బైబిలునందు “సత్యం” అన్నది, తత్వవేత్తలు వాదించుకునే గూఢమైన, అగ్రాహ్యమైన సిద్ధాంతం కానే కాదు.
తన జీవిత ఉద్దేశమంతా సత్యాన్ని గూర్చి మాట్లాడమేనని యేసు చెప్పినప్పుడు, నమ్మకమైన యూదులు శతాబ్దాలవరకూ విలువైనదిగా ఎంచిన విషయాన్ని గూర్చి ఆయన మాట్లాడుతున్నాడన్నమాట. వారి పరిశుద్ధ లేఖనాల్లో, “సత్యం” అన్నదాన్ని వాస్తవికమైనదిగానే చదివేవారుకానీ తాత్వికమైనదిగా చదువలేదు. బైబిలునందు, “సత్యం” అని అనువదించబడిన హెబ్రీ పదం “ఎమెత్.” అది, దృఢమైన, గట్టిదైన మరియు బహుశ అన్నిటికంటే ప్రాముఖ్యంగా నమ్మదగినదని సూచిస్తోంది.
యూదులు సత్యాన్ని ఆ విధంగా పరిగణించేందుకు మంచి కారణముంది. వారు తమ దేవుడైన యెహోవాను “సత్యదేవా” అని పిలిచేవారు. (కీర్తన 31:5) దానికి గల కారణం తాను చెప్పిన ప్రతిదానిని యెహోవా చేసేవాడు, అలా చేశాడు కూడా. ఆయన మాట ఇచ్చినప్పుడు, వాటిని నిలబెట్టుకున్నాడు. ఆయన ప్రవచనాలను ప్రేరేపించినప్పుడు, అవి నెరవేర్చబడ్డాయి. ఆయన తుది తీర్పులను పలికినప్పుడు, అవి అమలుపర్చబడ్డాయి. ఈ వాస్తవాలకు లక్షలమంది ఇశ్రాయేలీయులు ప్రత్యక్షసాక్షులు. బైబిలు యొక్క ప్రేరేపిత రచయితలు వాటిని చారిత్రాత్మక నిర్వివాద వాస్తవాలుగా లిఖించారు. పరిశుద్ధమైనవిగా దృష్టించబడే ఇతర పుస్తకాల్లా కాకుండ, బైబిలు కట్టుకథలు కల్పితగాథలతో సంబంధంలేదు. అది నిరూపించదగ్గ వాస్తవాల్లో—చారిత్ర, భౌగోళిక, వైజ్ఞానిక మరియు సాంఘిక నిజాలవంటి వాటితో అది స్థిరంగా ఉంది. కీర్తన రచయిత యెహోవాను గూర్చి ఇలా చెప్పడంలో ఏ ఆశ్చర్యమూలేదు: “నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. . . . నీ ఆజ్ఞలన్నియు సత్యమైనవి . . . నీ వాక్య సారాంశము సత్యము.”—కీర్తన 119:142, 151, 160.
యేసుక్రీస్తు ఆ కీర్తనలోని మాటలను తాను యెహోవాకు చేసిన ప్రార్థనలో ఇలా ప్రతిధ్వనింపజేశాడు: “నీ వాక్యమే సత్యము.” (యోహాను 17:17) తన తండ్రి చెప్పే ప్రతిదీ కచ్చితమైనదని, నమ్మదగినదని యేసుకు తెలుసు. అదే విధంగా, యేసు “సత్య సంపూర్ణుడు.” (యోహాను 1:14) ఆయన చెప్పినవన్నీ నమ్మదగినవని, సత్యమనిa ఆయన అనుచరులు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు, మరి వాటిని ముందు తరాలవారి కొరకు వ్రాసివుంచారు.
అయితే, సత్యాన్ని గూర్చి మాట్లాడేందుకే తాను భూమిమీదికి వచ్చానని యేసు పిలాతుతో అన్నప్పుడు, తన మనస్సులో ఓ నిర్దిష్టమైన సత్యముంది. “నీవు రాజువా?” అని పిలాతు అడిగిన ప్రశ్నకు సమాధానంగా యేసు ఆ మాట అన్నాడు. (యోహాను 18:37) దేవుని రాజ్యము మరియు దానిలో స్వయంగా రాజుగా ఆయన పాత్రే, యేసు భూమిమీద ఉన్నప్పుడు ఆయన బోధల్లోని అసలు అంశం, అంటే దాని సారంగా ఉండేవి. (లూకా 4:43) ఈ రాజ్యము యెహోవా నామాన్ని పరిశుద్ధపరుస్తుందని, ఆయన సర్వాధిపత్యాన్ని నిరూపించి, నమ్మకస్థులైన మానవజాతిని నిరంతర ఆనందమయ జీవనానికి తిరిగి తీసుకురావడమన్నదే “సత్యం.” దానియందే యథార్థవంతులైన క్రైస్తవులందరూ నిరీక్షిస్తున్నారు. దేవుని వాగ్దానాల నెరవేర్పులో యేసు నిర్వహించే పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది కనుక, దేవుని ప్రవచనాలన్నీ ఆయన వల్లే “ఆమేన్” అవుతాయి లేక నిజమౌతాయి కనుక, యేసు ఇలా చెప్పగలిగాడు: “నేనే మార్గమును, సత్యమును, జీవమును.”—యోహాను 14:6; 2 కొరింథీయులు 1:20; ప్రకటన 3:14.
ఈ సత్యం పూర్తిగా నమ్మదగినదని గ్రహించడం నేడు క్రైస్తవులకు గొప్ప అర్థాన్నిస్తుంది. అంటే, దేవునియందు వారి విశ్వాసం మరియు ఆయన వాగ్దానాల్లో వారి నిరీక్షణా వాస్తవాలపైనను, నిజాలపైనను ఆధారపడివున్నాయన్నమాట.
క్రియలో సత్యం
బైబిలు, సత్యాలను క్రియతో ముడిపెట్టడంలో ఆశ్చర్యంలేదు. (1 సమూయేలు 12:24; 1 యోహాను 3:18) దైవభయంగల యూదులకు, సత్యమంటే తత్వశాస్త్రైక విషయం కాదు; అది ఓ జీవన విధానం. “సత్యం” అని ఉపయోగించబడిన హెబ్రీ పదానికి “నమ్మకత్వం” అనే అర్థం కూడా ఉంది మరియు ఒక వ్యక్తి తాను చెప్పినదాని ప్రకారం చేస్తాడని, నమ్మదగినవాడని వర్ణించేందుకు ఉపయోగించబడేది. సత్యాన్ని అదే దృష్టితో చూడమని యేసు తన అనుచరులకు నేర్పించాడు. పరిసయ్యుల స్వనీతిపరమైన మాటలకూ మరియు వారి అవినీతి క్రియలకు మధ్యనున్న తేడాను, అంటే వారి వేషధారణను యేసు తీవ్రంగా నిందించాడు. మరియు ఆయన బోధించిన సత్యాలకు అనుగుణంగా జీవించడం ద్వారా ఆయన మనకు మాదిరినుంచాడు.
కనుక అది క్రీస్తు అనుచరులందరికీ సంబంధించినదై ఉండాలి. వారికి, దేవుని వాక్యసత్యము, అంటే యేసుక్రీస్తు పరిపాలన క్రింద ఉత్సాహభరితమైన దేవుని రాజ్యసువార్త కేవలం ఒక సమాచారం కాదు. ఆ సత్యం వారు క్రియలు చేసేందుకు వారిని కదిలిస్తుంది, దానికి అనుగుణ్యంగా వారు జీవించేందుకు మరియు దాన్ని ఇతరులతో పంచుకునేందుకు వారిని పురికొల్పుతుంది. (యిర్మీయా 20:9 పోల్చండి.) మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘానికి, క్రీస్తు అనుచరులుగా వారు గైకొన్న జీవితవిధానం కొన్ని సార్లు కేవలం “సత్యము” అని లేక “సత్యమార్గము” అని పేర్కొనబడింది.—2 యోహాను 4; 3 యోహాను 4, 8; 2 పేతురు 2:2.
ఎంత మూల్యమైనా చెల్లించగల్గేంత విలువైన సంపద
నిజమే, దేవుని వాక్య సత్యాలను అంగీకరించడమంటే ఓ మూల్యాన్ని కోరినట్లే. మొదటిగా, సత్యాన్ని నేర్చుకోవడమే మనలను గందరగోళపర్చే అనుభవం కాగలదు. ది ఎన్‌సైక్లోపీడియా అమెరికానా ఇలా చెబుతోంది: “సత్యం పక్షపాతానికి లేక కట్టుకథలకు మద్దతునివ్వదు కనుక అది తరచూ అంగీకృతంకాదు.” మన నమ్మకాలు అసత్యమైనవని బట్టబయలుకావడం భ్రమను పోగొట్టేదిగా ఉండవచ్చు, ప్రత్యేకంగా నమ్మకమైన మత నాయకులు మనకు బోధించినప్పుడు అది మరీ వాస్తవంగా ఉంటుంది. విశ్వాసపాత్రులైన తలిదండ్రులు వాస్తవానికి రహస్య నేరస్థులని కనుగొన్నప్పుడు ఒకరు అనుభవించే దానితో, కొందరు దాన్ని పోలుస్తున్నారు. అయితే భ్రమలో ఉండేకన్నా మతపర సత్యాన్ని కనుక్కోవడమే శ్రేష్ఠం కాదా? అబద్ధాల ఊబిలో ఉండడం కన్నా వాస్తవాలను తెలుసుకోవడం శ్రేష్ఠం కాదా?b—యోహాను 8:32; రోమీయులు 3:4 పోల్చండి.
రెండవదిగా, మతపర సత్యాలకనుగుణంగా జీవించడమంటే మునుపు మనకు స్నేహితులుగా ఉన్నవారు ఇప్పుడు మనలను అంగీకరించకపోవచ్చు. “దేవుని సత్యమును అసత్యమునకు మార్చి”న వారనేకులున్న లోకంలో, దేవుని వాక్యమునకు హత్తుకుని ఉండేవారు వింతగా కనిపిస్తారు, మరి కొన్నిసార్లు వారు తృణీకరించబడతారు, అపార్థం చేసుకోబడతారు.—రోమీయులు 1:25; 1 పేతురు 4:4.
అయితే సత్యం ఈ రెండువిధాలైన మూల్యాలకు తగినదే. సత్యాన్ని తెలుసుకోవడం అబద్ధాలు, భ్రమలూ మరియు మూఢత్వాలనుండి మనలను విడుదల చేస్తుంది. మరియు మనం దానికి అనుగుణంగా నడుచుకున్నప్పుడు, కష్టాలను సహించేందుకు సత్యం మనలను బలపరుస్తుంది. దేవుని సత్యం ఎంత నమ్మదగినది, స్థిరంగా స్థాపించబడినది మరియు నిరీక్షణతో మనలను ఎంతగా పురికొల్పుతుందంటే, ఏ పరీక్షలోనైనా మనం నిలదొక్కుకునేందుకు అది మనకు సహాయపడుతుంది. అపొస్తలుడైన పౌలు, సత్యాన్ని యుద్ధంలోకి వెళ్లేటప్పుడు సైనికుడు వేసుకునే వెడల్పైన గట్టి తోలు బెల్టు లేక దట్టితో పోల్చడంలో ఆశ్చర్యమే లేదు!—ఎఫెసీయులు 6:13, 14.
బైబిలు సామెత ఇలా చెబుతోంది: “సత్యమును అమ్మివేయక దాని కొని యుంచుకొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనియుంచుకొనుము.” (సామెతలు 23:23) సత్యాన్ని నిరపేక్షమైనదిగా లేక ఉనికిలో లేనిదానిగా కొట్టివేయడం, జీవితం అందించే అత్యంత ఉప్పొగింపజేసే ప్రయోజనకరమైన అన్వేషణను పోగొట్టుకోవడమే అవుతుంది. దాన్ని కనుగొనడమంటే నిరీక్షణను కనుగొన్నట్లే; దాన్ని తెలుసుకుని ప్రేమించడమంటే, విశ్వ సృష్టికర్తను, ఆయన ఏకైక కుమారున్ని తెలుసుకోవడం ప్రేమించడమే; దాని ప్రకారంగా జీవించడమంటే నేడు మరియు భవిష్యత్తులోను ఒక సంకల్పంతోను సమాధానకరమైన మనస్సుతోను జీవించడమని భావం.—సామెతలు 2:1-5; జెకర్యా 8:19; యోహాను 17:3.
[అధస్సూచీలు]
a యేసు తన మాటల సత్య సంధతను నొక్కి చెప్పేందుకు ఒక విశేషమైన పదాన్ని ఉపయోగించినట్లుగా సువార్తలందు 70 కంటే ఎక్కువ చోట్ల వ్రాయబడివుంది. ఒక వాక్యాన్ని చెప్పేముందు ఆయన ఎల్లప్పుడు “ఆమేన్” (“సత్యం,” NW) అని అనేవాడు. దానికి సంబంధించిన హెబ్రీ పదం భావం “నిశ్చయం, సత్యం.” క్రొత్త నిబంధనా వేదాంతపు క్రొత్త అంతర్జాతీయ నిఘంటువు ఇలా చెబుతోంది: “తన మాటలను ఆమేన్‌తో ప్రారంభించడం ద్వారా, నిశ్చయమైనవిగానూ నమ్మదగినవిగానూ ఆయన వాటిని ముద్రను వేశాడు. ఆయన తన మాటల ప్రకారం ప్రవర్తిస్తూ, అవి తన మీద ఇతరుల మీద ప్రభావం చూపేలా చేశాడు. అవి ఆయన ఔన్నత్యాన్ని అధికారాన్ని వ్యక్తపర్చేవే.”
b “సత్య”మునకు ఉపయోగించిన గ్రీకు పదమైన అలిథియా అక్షరార్థ భావం, “దాగనిది” అనే పద భావంనుండి వచ్చింది, కనుక మునుపు దాగివున్నదాన్ని బహిర్గతం చేయడమే సత్యం తరచూ చేసేపని.—లూకా 12:2 పోల్చండి.
[6వ పేజీలోని బాక్సు]
సత్యం ఎన్నడైనా మారుతుందా?
ఆ ప్రశ్నను వి. ఆర్. రుజిరో ఆలోచనా సామర్థ్యం (ఆంగ్లం) అనే తన పుస్తకంలో లేవదీశాడు. ఆయన దానికి మారదు అని సమాధానమిచ్చాడు. దాన్ని ఆయన ఇంకా ఇలా వివరించాడు: “కొన్నిసార్లు అది మారినట్లనిపిస్తుంది కానీ దాన్ని దగ్గిరగా పరిశీలించినప్పుడు అది మారలేదని కనిపిస్తుంది.”
“బైబిలులోని మొదటి పుస్తకమైన ఆదికాండము యొక్క గ్రంథకర్తృత్వాన్ని పరిశీలించండి. శతాబ్దాలుగా క్రైస్తవులు మరియు యూదులు ఆ పుస్తకాన్ని కేవలం ఒక్క వ్యక్తే రచించాడని నమ్మేవారు. కొద్ది కాలానికి ఈ దృక్పథం సవాలు చేయబడింది, మరి చివరికి దాని స్థానంలో ఆదికాండమును ఇంచుమించు అయిదుగురు రచయితలు రచించారనే నమ్మకం చోటుచేసుకుంది. తర్వాత 1981లో, మొదట భావించినట్లుగా దాన్ని ఒక్కరే రచించారనేందుకు 82 శాతం సాధ్యత ఉందని చెబుతూ, 5 సంవత్సరాల పాటు ఆదికాండముపై జరిపిన భాషా పరిశీలన ఫలితాలు ప్రచురించబడ్డాయి.
“ఆదికాండము గ్రంథకర్తృత్వాన్ని గూర్చిన సత్యం మారిందా? లేదు. మన నమ్మకం మారింది . . . మన జ్ఞానాన్ని బట్టి లేక మనకు తెలియకపోవడాన్ని బట్టి సత్యం మారదు.”
[7వ పేజీలోని బాక్సు]
సత్యం ఎడల భక్తిశ్రద్ధలు
“సత్యం ఎడల భక్తిశ్రద్ధలు మన యుగానికి చెందిన కృత్రిమ నిర్లిప్తతావాదం మాత్రం కాదు. అది, తమ వద్ద సత్యముందని యథార్థంగా ఎవ్వరూ చెప్పలేరనే నమ్మకంకలిగి, ప్రతి విషయపు ‘తెరను తొలగించేందుకు’ ప్రయత్నిస్తుంది. సత్యం తప్పకుండా కనుగొనబడగలదనే ఆనందంతోకూడిన విశ్వాసంతో సహా, ఆ సత్యం ఎక్కడ ఉద్భవించినా లేక ఎప్పుడు ఉద్భవించినా దానికి వినయంగా లోబడి ఉండే వైఖరిని కల్గివుండడమే సత్యం ఎడల భక్తిశ్రద్ధలు కల్గివుండడం. దేవున్ని సత్యంతో ఆరాధించేవారికి, సత్యం విషయంలో అలాంటి విశాల మనస్తత్వం ఉండాలి; అయితే ఒక మానవుడు తన పొరుగువారితో, అటు మాటలతోనూ ఇటు క్రియలతోనూ వ్యవహారించేటప్పుడు సత్యం ఎడల సరైన భక్తిశ్రద్ధలు, నిజాయితీని కల్గివుంటాడనే హామీనిస్తాయి. పాతనిబంధనకు మరియు క్రొత్తనిబంధనకూ సాక్ష్యంగా నిలిచిన ఆ వైఖరిని మనం చూశాము.”—క్రొత్త నిబంధనా వేదాంతపు క్రొత్త అంతర్జాతీయ నిఘంటువు, (ఆంగ్లం) 3వ సంపుటి, 901వ పేజీ.
[7వ పేజీలోని చిత్రాలు]
వైజ్ఞానిక పురోగతి వైజ్ఞానిక సత్యాలను వెలికితీయడంపై ఆధారపడివుంటుంది
[8వ పేజీలోని చిత్రం]
సత్యంలో రాజ్యం, దాని ఆశీర్వాదాలు చేరివున్నాయి