కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w22 ఆగస్టు పేజీలు 14-19
  • ‘సత్యంలో నడుస్తూ ఉండండి’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘సత్యంలో నడుస్తూ ఉండండి’
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మనం సత్యాన్ని ఎందుకు ప్రేమిస్తాం?
  • మనం సత్యాన్ని ప్రేమిస్తున్నామని ఎలా చూపిస్తాం?
  • ‘నేను నీ సత్యంలో నడుస్తాను’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • సత్యంకొరకు ఎందుకు అన్వేషించాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • క్రైస్తవులు ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • సత్యదేవుని అనుకరించడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
w22 ఆగస్టు పేజీలు 14-19

అధ్యయన ఆర్టికల్‌ 34

‘సత్యంలో నడుస్తూ ఉండండి’

“నా పిల్లలు సత్యంలో నడుస్తున్నారని వినడం కన్నా నాకు సంతోషకరమైన విషయం ఇంకొకటి లేదు.” —3 యోహా. 4.

పాట 111 మన సంతోషానికి కారణాలు

ఈ ఆర్టికల్‌లో. . .a

1. మనం సత్యంలోకి ఎలా వచ్చామనే విషయం గురించి మాట్లాడుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి?

“మీరు సత్యంలోకి ఎలా వచ్చారు?” ఈ ప్రశ్నకు మీరు చాలాసార్లు జవాబు ఇచ్చివుంటారు. మనం సాధారణంగా, ఎవరైనా సహోదర సహోదరీల్ని కొత్తగా కలిసినప్పుడు ఈ ప్రశ్న అడుగుతాం. వాళ్లు యెహోవాను ఎలా తెలుసుకున్నారో, ఆయన్ని ప్రేమించడం ఎలా మొదలుపెట్టారో వినడాన్ని మనం ఇష్టపడతాం. అలాగే మనం కూడా సత్యాన్ని ఎందుకు ప్రేమిస్తున్నామో చెప్పాలనుకుంటాం. (రోమా. 1:11) అలా మాట్లాడుకోవడం వల్ల, సత్యం ఎంత విలువైనదో మనం గుర్తుచేసుకుంటాం. అంతేకాదు ‘సత్యంలో నడుస్తూ ఉండాలి’ అనే మన నిర్ణయాన్ని, అంటే యెహోవా దీవెనలు, ఆమోదం పొందేలా జీవిస్తూ ఉండాలి అనే నిర్ణయాన్ని బలపర్చుకుంటాం.—3 యోహా. 4.

2. ఈ ఆర్టికల్‌లో మనం ఏం చూస్తాం?

2 ఈ ఆర్టికల్‌లో, మనం సత్యాన్ని ఎందుకు ప్రేమిస్తున్నామో గుర్తుచేసుకుంటాం. అలాగే ఈ అమూల్యమైన బహుమతి మీద మనకున్న ప్రేమను ఎలా చూపిస్తూ ఉండాలో పరిశీలిస్తాం. దానివల్ల యెహోవా మనల్ని సత్యం వైపు ఆకర్షించినందుకు మన కృతజ్ఞత పెరుగుతుంది. (యోహా. 6:44) అంతేకాదు సత్యం గురించి ఇతరులకు చెప్పాలనే కోరిక కూడా బలపడుతుంది.

మనం సత్యాన్ని ఎందుకు ప్రేమిస్తాం?

3. మనం సత్యాన్ని ప్రేమించడానికి ముఖ్యమైన కారణం ఏంటి?

3 మనం సత్యానికి మూలమైన యెహోవా దేవున్ని ప్రేమిస్తాం. మనం సత్యాన్ని ప్రేమించడానికి అదే ముఖ్యమైన కారణం. యెహోవా భూమి, ఆకాశాల్ని సృష్టించిన శక్తివంతమైన దేవుడు అనేకాదు, మనల్ని ఎంతో ప్రేమించే పరలోక తండ్రి అని కూడా బైబిలు ద్వారా తెలుసుకున్నాం. (1 పేతు. 5:7) యెహోవా “కరుణ, కనికరం గల దేవుడు; ఓర్పును, అపారమైన విశ్వసనీయ ప్రేమను చూపించే దేవుడు; ఎంతో సత్యవంతుడు” అని మనకు తెలుసు. (నిర్గ. 34:6) ఆయన న్యాయాన్ని ప్రేమిస్తాడు. (యెష. 61:8) మనం బాధలుపడడాన్ని ఆయన చూడలేడు. అంతేకాదు, సరైన సమయంలో మన కష్టాలన్నీ తీసేయాలని ఆయన ఎంతో ఎదురుచూస్తున్నాడు. ఆ సమయం కోసం మనం కూడా ఎదురుచూస్తున్నాం. (యిర్మీ. 29:11) ఈ కారణాల్ని బట్టి కూడా మనం యెహోవాను ఎంతో ప్రేమిస్తాం.

చిత్రాలు: ఇన్‌సెట్‌లో లంగరు. 1. పర్వతాలు, పచ్చని లోయలు, ప్రవహిస్తున్న నది ఉన్న పరదైసు భూమి. 2. ఒక సహోదరి ఒకామెకు ప్రకటిస్తోంది.

బైబిలు సత్యం . . . లంగరు లాంటిది

అలల తాకిడికి పడవ కొట్టుకుపోకుండా లంగరు ఎలాగైతే కాపాడుతుందో, నిరీక్షణ కూడా కష్టాలు వచ్చినప్పుడు మన ప్రశాంతతను కాపాడుతుంది. అలాగే భవిష్యత్తు విషయంలో మనకున్న నిరీక్షణను ఇతరులకు చెప్పేలా బైబిలు సత్యం మనల్ని కదిలిస్తుంది (4-7 పేరాలు చూడండి)

4-5. అపొస్తలుడైన పౌలు మన నిరీక్షణను ఒక లంగరుతో ఎందుకు పోల్చాడు?

4 మనం సత్యాన్ని ప్రేమించడానికి ఇంకో కారణం ఏంటంటే, సత్యం వల్ల మనం ఎన్నో ప్రయోజనాల్ని పొందుతాం. ఒక ఉదాహరణ చూద్దాం. బైబిలు సత్యాల్లో భవిష్యత్తు గురించిన మన నిరీక్షణ కూడా ఒకటి. అది ఎంత విలువైనదో చెప్తూ, అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “నిశ్చయమైన, స్థిరమైన ఈ నిరీక్షణ మన ప్రాణాలకు లంగరులా ఉంది.” (హెబ్రీ. 6:19) అలల తాకిడికి పడవ కొట్టుకుపోకుండా లంగరు ఎలాగైతే కాపాడుతుందో, నిరీక్షణ కూడా కష్టాలొచ్చినప్పుడు మన ప్రశాంతతను కాపాడుతుంది.

5 ఈ మాటల్ని రాస్తున్నప్పుడు పౌలు అభిషిక్త క్రైస్తవులకున్న పరలోక నిరీక్షణ గురించి చెప్తున్నాడు. కానీ, పరదైసు భూమ్మీద శాశ్వతంగా జీవించే అవకాశమున్న మనకు కూడా ఆ మాటలు ఉపయోగపడతాయి. (యోహా. 3:16) శాశ్వత జీవితం అనే నిరీక్షణ గురించి తెలుసుకోవడం, మన జీవితానికి ఎంతో అర్థాన్ని ఇచ్చిందని మనందరం ఒప్పుకుంటాం.

6-7. భవిష్యత్తు గురించి సత్యం తెలుసుకుని ఇవాన్‌ ఎలా ప్రయోజనం పొందింది?

6 ఇవాన్‌ అనే సహోదరి అనుభవాన్ని చూడండి. ఆమె యెహోవాసాక్షుల కుటుంబంలో పెరగలేదు. చిన్నప్పటి నుండి ఆమెకు చావు అంటే, చాలా భయం. “ఏదోకరోజు మనం చనిపోవాల్సిందే” అనేమాట ఆమె మనసును ఎంతో కలవరపెట్టేది. ఆమె ఇలా అంటుంది: “ఆ మాటల గురించి ఆలోచించినప్పుడు నాకు రాత్రుళ్లు నిద్రపట్టేది కాదు. ‘జీవితమంటే ఇంతేనా? నేను అసలు ఎందుకు పుట్టాను?’ అనే ప్రశ్నలు నాలో మొదలయ్యాయి. నాకు చనిపోవాలని లేదు.”

7 అయితే ఇవాన్‌ టీనేజీలో సత్యం తెలుసుకుంది. ఆమె ఇలా అంటుంది: “పరదైసు భూమ్మీద శాశ్వతంగా జీవించే నిరీక్షణ నాకుందని నేను నమ్మడం మొదలుపెట్టాను.” సత్యం తెలుసుకోవడం వల్ల ఆమె ఎలా ప్రయోజనం పొందింది? ఆమె ఇలా చెప్తుంది: “నేను ఇప్పుడు నా భవిష్యత్తు గురించి లేదా చావు గురించి కంగారు పడుతూ రాత్రులు నిద్రపోకుండా ఉండట్లేదు.” ఇవాన్‌ సత్యాన్ని ఎంతో విలువైనదిగా చూస్తుందని ఆమె మాటల్నిబట్టి అర్థమౌతుంది. అలాగే భవిష్యత్తు విషయంలో తనకున్న నిరీక్షణ గురించి ఆమె ఇతరులకు సంతోషంగా చెప్తుంది.—1 తిమో. 4:16.

చిత్రాలు: ఇన్‌సెట్‌లో వజ్రం. 1. పర్వతాలు, పచ్చని లోయలు, ప్రవహిస్తున్న నది ఉన్న పరదైసు భూమి. 2. ట్రోఫీలు, అవార్డులతో నిండిన బాక్సును ఒకతను పక్కన పెట్టేస్తున్నాడు.

బైబిలు సత్యం . . . నిధి లాంటిది

యెహోవాను ఇప్పుడు, అలాగే ఆయన రాజ్యం కింద ఎల్లప్పుడు సేవించే అవకాశం ఒక నిధి లాంటిది. దానికోసం మనం దేన్నైనా త్యాగం చేయవచ్చు (8-11 పేరాలు చూడండి)

8-9. (ఎ) యేసు చెప్పిన ఉదాహరణలో ఒకతను తనకు దొరికిన నిధిని ఎంత విలువైనదిగా చూశాడు? (బి) సత్యాన్ని మీరెంత విలువైనదిగా చూస్తున్నారు?

8 బైబిలు సత్యాల్లో మరొకటి దేవుని రాజ్యం గురించిన మంచివార్త. యేసు ఆ రాజ్యం గురించిన సత్యాన్ని దాచబడిన నిధితో పోల్చాడు. మత్తయి 13:44 లో ఆయన ఇలా అన్నాడు: “పరలోక రాజ్యం, పొలంలో దాచబడిన నిధి లాంటిది; ఒకతను దాన్ని కనుగొని, మళ్లీ దాచిపెట్టి, సంతోషంగా వెళ్లి తనకున్నదంతా అమ్మేసి ఆ పొలాన్ని కొన్నాడు.” ఆ వ్యక్తి ఆ నిధి కోసం వెదకలేదు గానీ దాన్ని అనుకోకుండా కనుగొన్నాడని గమనించండి. అయితే అది దొరికినప్పుడు దాన్ని సొంతం చేసుకోవడానికి పెద్దపెద్ద త్యాగాలు చేశాడు. దానికోసం తనకున్నవన్నీ అమ్మేశాడు. ఎందుకంటే, అది ఎంత అమూల్యమైనదో ఆయనకు తెలుసు. ఆయన వదులుకున్న వాటన్నిటికన్నా అది చాలా విలువైనది.

9 ఖచ్చితంగా మీకు కూడా సత్యం గురించి అలానే అనిపిస్తుంది. ఈ లోకంలో ఉన్నవేవీ ఇప్పుడు మనం యెహోవా సేవలో పొందుతున్న ఆనందానికి, దేవుని రాజ్యంలో పొందబోయే శాశ్వత జీవితానికి సాటిరావు. యెహోవాతో ఉన్న స్నేహం కోసం మనం దేన్నైనా త్యాగం చేస్తాం. యెహోవాను ‘పూర్తిగా సంతోషపెట్టడంలోనే’ మనకు ఎంతో ఆనందం ఉంది.—కొలొ. 1:10.

10-11. మైఖేల్‌ తన జీవితంలో పెద్దపెద్ద మార్పులు ఎందుకు చేసుకున్నాడు?

10 యెహోవా ఆమోదాన్ని పొందడానికి మనలో చాలామందిమి పెద్దపెద్ద త్యాగాలు చేశాం. కొంతమంది మంచి కెరీర్‌ని వదులుకున్నారు. ఇంకొంతమంది బాగా డబ్బు సంపాదించాలనే కోరికను విడిచిపెట్టారు. మరికొంతమందేమో యెహోవాను తెలుసుకున్న తర్వాత, వాళ్ల జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకున్నారు. మైఖేల్‌ కూడా అదే చేశాడు. ఆయన యెహోవాసాక్షుల కుటుంబంలో పెరగలేదు. ఆయన చిన్నప్పటి నుండి కరాటే నేర్చుకున్నాడు. మైఖేల్‌ ఇలా చెప్తున్నాడు: “బలంగా, ఫిట్‌గా ఉండే విషయంలో నేను ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాను. కొన్నిసార్లయితే నన్ను ఎవ్వరూ ఓడించలేరని అనిపించేది.” కానీ బైబిలు స్టడీ మొదలుపెట్టాక, హింస విషయంలో యెహోవా అభిప్రాయం ఏంటో ఆయన తెలుసుకున్నాడు. (కీర్త. 11:5) తనకు స్టడీ ఇచ్చిన జంట గురించి మైఖేల్‌ ఇలా అంటున్నాడు: “కరాటే మానేయమని వాళ్లు నాకు ఎప్పుడూ చెప్పలేదు, బదులుగా నాకు బైబిలు సత్యాల్ని నేర్పిస్తూ ఉండేవాళ్లు.”

11 యెహోవా గురించి నేర్చుకునే కొద్దీ మైఖేల్‌కు ఆయన మీదున్న ప్రేమ పెరిగింది. తన సేవకుల మీద యెహోవాకున్న కనికరం మైఖేల్‌కు బాగా నచ్చింది. తన జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మైఖేల్‌ కొంతకాలానికే అర్థంచేసుకున్నాడు. ఆయన ఇలా అంటున్నాడు: “నేను కరాటే వదులుకోవడం చాలా పెద్ద త్యాగమని నాకు తెలుసు. కానీ అది యెహోవాను సంతోషపెడుతుందని, ఆయన్ని సేవించడానికి దేన్నైనా త్యాగం చేయవచ్చని నేను అర్థం చేసుకున్నాను.” మైఖేల్‌ తాను కనుగొన్న సత్యాన్ని ఎంతో విలువైనదిగా చూశాడు. అందుకే దానికోసం తన జీవితంలో పెద్దపెద్ద మార్పులు చేసుకున్నాడు.—యాకో. 1:25.

చిత్రాలు: ఇన్‌సెట్‌లో దీపం. 1. పర్వతాలు, పచ్చని లోయలు, ప్రవహిస్తున్న నది ఉన్న పరదైసు భూమి. 2. ఒక యువతి, బైబిల్లో చదివిన దాన్ని ధ్యానిస్తోంది.

బైబిలు సత్యం . . . దీపం లాంటిది

బాగా వెలుగిచ్చే ఒక దీపం, చీకట్లో దారిని తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది. అలాగే సాతాను చీకటి లోకంలో దేవుని వాక్యం మనకు సరైన దారిని చూపిస్తుంది (12-13 పేరాలు చూడండి)

12-13. బైబిలు సత్యం మైలీకి ఎలా సహాయం చేసింది?

12 సత్యం ఎంత విలువైనదో చెప్పడానికి, బైబిలు దాన్ని చీకట్లో వెలుగిచ్చే దీపంతో పోల్చింది. (కీర్త. 119:105; ఎఫె. 5:8) అజర్‌బైజాన్‌లో ఉంటున్న మైలీ దేవుని వాక్యం తనకు ఎంతో సహాయం చేసిందని చెప్తుంది. ఆమె కూడా సత్యంలో పెరగలేదు. వాళ్ల నాన్న ముస్లిం, అమ్మ యూదురాలు. ఆమె ఇలా అంటుంది: “దేవుడు ఉన్నాడా లేడా అనే సందేహం నాకు ఎప్పుడూ లేదు. కానీ నేను ఇలాంటి ప్రశ్నల గురించి ఆలోచించేదాన్ని: ‘దేవుడు మనుషుల్ని ఎందుకు సృష్టించాడు? జీవితాంతం కష్టాలుపడి చనిపోయి, ఆ తర్వాత మళ్లీ నరకంలో శాశ్వతంగా హింసలు అనుభవించడంలో అర్థం ఏముంది?’ ఏది జరిగినా దేవుడు అలా రాసిపెట్టాడని చాలామంది అంటుంటారు. అది విన్నప్పుడు, దేవుడు మనుషుల్ని తోలుబొమ్మల్లా ఆడిస్తూ వాళ్ల బాధల్ని చూసి ఆనందిస్తాడని నేను అనుకునేదాన్ని.”

13 మైలీ తన ప్రశ్నలకు జవాబుల కోసం వెతుకుతూ ఉంది. కొంతకాలానికి ఆమె బైబిలు స్టడీ తీసుకుని సత్యంలోకి వచ్చింది. ఆమె ఇలా అంటుంది: “బైబిల్లో ఉన్న విషయాలు నమ్మేలా ఉన్నాయి. దానివల్ల జీవితం మీద నాకున్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. బైబిల్లో ఉన్న మంచి విషయాలు నాకు మనశ్శాంతిని ఇచ్చాయి.” మైలీలానే మనందరం కూడా, “చీకటిలో నుండి అద్భుతమైన తన వెలుగులోకి” తీసుకొచ్చిన యెహోవాను స్తుతిస్తాం.—1 పేతు. 2:9.

14. సత్యం మీద మనకున్న ప్రేమను ఎలా పెంచుకోవచ్చు? (“ఇంకొన్ని పోలికలు” అనే బాక్సు కూడా చూడండి.)

14 సత్యం ఎంత విలువైనదో చూపించడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. బహుశా ఇలాంటి చాలా ఉదాహరణలు మీకు తెలిసుండవచ్చు. కావాలంటే, మీ వ్యక్తిగత అధ్యయనంలో సత్యాన్ని ప్రేమించడానికి గల వేరే కారణాల్ని కూడా మీరు పరిశీలించవచ్చు. మనం సత్యాన్ని ఎంత ఎక్కువ ప్రేమిస్తే, దానిమీద అంత ఎక్కువ ప్రేమ చూపిస్తాం.

తెరిచి ఉన్న బైబిలు.

ఇంకొన్ని పోలికలు

ఈ ఆర్టికల్‌లో “సత్యాన్ని” ఒక లంగరుతో, నిధితో, దీపంతో పోల్చడం చూశాం. అయితే దాన్ని వేరే వాటితో కూడా పోల్చవచ్చు. ఉదాహరణకు:

  • అద్దం.

    బైబిలు సత్యం ఒక అద్దం లాంటిది. దానిలో చూసినప్పుడు మన అసలు వ్యక్తిత్వం ఏంటో, మనం ఎక్కడెక్కడ మార్పులు చేసుకోవాలో తెలుసుకుంటాం.—యాకో. 1:22-25

  • నీటి చుక్కలు.

    బాగా ఎండగా ఉన్నప్పుడు నీళ్లు ఎలాగైతే మనకు సేదదీర్పును ఇస్తాయో, బైబిలు సత్యం కూడా దేవునికి దూరమైపోయిన ఈ లోకంలో మనకు సేదదీర్పును ఇస్తుంది.—కీర్త. 23:2, 3

మనం సత్యాన్ని ప్రేమిస్తున్నామని ఎలా చూపిస్తాం?

15. మనం సత్యాన్ని ప్రేమిస్తున్నామని చూపించే ఒక విధానం ఏంటి?

15 బైబిల్ని రోజూ చదువుతూ, బైబిలు ప్రచురణల్ని క్రమంగా అధ్యయనం చేస్తూ ఉంటే మనం సత్యాన్ని ప్రేమిస్తున్నామని చూపిస్తాం. మనం చాలా సంవత్సరాలుగా సత్యంలో ఉన్నా సరే, నేర్చుకోవాల్సినవి ఇంకా ఎన్నో ఉంటాయి. కావలికోట మొట్టమొదటి సంచిక ఇలా చెప్పింది: ‘సత్యం ఎన్నో కలుపు మొక్కల మధ్య దాగివున్న ఒక చిన్న పువ్వు లాంటిది. అలాంటి పువ్వు దొరకాలంటే జాగ్రత్తగా వెతకాలి. అయితే అది దొరికాక అంతటితో తృప్తి పడకుండా, అలాంటి మరిన్ని పువ్వుల కోసం వెతుకుతూ ఉండాలి. అదేవిధంగా మనం ఒక సత్యాన్ని తెలుసుకోగానే తృప్తి పడకూడదు. ఇంకా ఎక్కువ సత్యాల్ని తెలుసుకోవాలనే ఆసక్తితో జాగ్రత్తగా పరిశీలించాలి.’ అలా అధ్యయనం చేయడానికి కష్టపడాల్సి ఉంటుంది, కానీ దానివల్ల ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి.

16. అధ్యయనం చేసేటప్పుడు, మీకు ఏ పద్ధతి బాగా ఉపయోగపడింది? (సామెతలు 2:4-6)

16 మనలో ప్రతీఒక్కరికి చదవడం, అధ్యయనం చేయడం అంతగా ఇష్టం ఉండకపోవచ్చు. కానీ సత్యాన్ని “వెదుకుతూ,” దాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోమని యెహోవా చెప్తున్నాడు. (సామెతలు 2:4-6 చదవండి.) మనమలా చేయడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా ప్రయోజనం పొందుతాం. కోరీ అనే సహోదరుడు, బైబిలు చదివేటప్పుడు ప్రతీ వచనం మీద మనసుపెడతాను అని చెప్తున్నాడు. ఆయన ఇంకా ఇలా చెప్తున్నాడు: ‘ఆ లేఖనంలో ఉన్న ప్రతీ ఫుట్‌నోట్‌ని, క్రాస్‌ రెఫరెన్సును చదువుతాను. ఇంకా దానికి సంబంధించి పరిశోధన కూడా చేస్తాను. ఆ విధంగా నేను చదివేటప్పుడు ఎన్నో కొత్త విషయాల్ని నేర్చుకుంటున్నాను.’ చదివేటప్పుడు మనం ఎలాంటి పద్ధతిని ఉపయోగించినా సరే, అలా సమయం తీసుకుని అధ్యయనం చేయడానికి కష్టపడినప్పుడు సత్యం మనకెంతో విలువైనదని చూపిస్తాం.—కీర్త. 1:1-3.

17. సత్యానికి తగ్గట్టు జీవించడం అంటే ఏంటి? (యాకోబు 1:25)

17 అయితే సత్యాన్ని అధ్యయనం చేయడం ఒక్కటే సరిపోదని మనకు తెలుసు. దాన్నుండి పూర్తిగా ప్రయోజనం పొందాలంటే మనం సత్యానికి తగ్గట్టు జీవించాలి, అంటే మనం నేర్చుకున్న వాటిని పాటించాలి. అప్పుడే నిజమైన సంతోషాన్ని పొందుతాం. (యాకోబు 1:25 చదవండి.) మరి మనం సత్యానికి తగ్గట్టు జీవిస్తున్నామో లేదో ఎలా తెలుసుకోవచ్చు? మనం ఏ విషయాల్లో నేర్చుకున్న వాటిని పాటిస్తున్నామో, ఏ విషయాల్లో మార్పులు చేసుకోవాలో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలని ఒక సహోదరుడు చెప్తున్నాడు. దీని గురించి అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “మనం ప్రగతి సాధించినమేరకు ఇదే పద్ధతిలో ముందుకు సాగిపోతూ ఉందాం.”—ఫిలి. 3:16.

18. ‘సత్యంలో నడుస్తూ’ ఉండడానికి మనం ఎందుకు చేయగలిగినదంతా చేస్తాం?

18 మనం ‘సత్యంలో నడుస్తూ’ ఉండడానికి చేయగలిగినదంతా చేసినప్పుడు వచ్చే ప్రయోజనాల గురించి ఆలోచించండి. మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. అలాగే సంతోషాన్ని కూడా పొందుతాం. అంతేకాదు మనం యెహోవాను, మన సహోదర సహోదరీల్ని కూడా సంతోషపెడతాం. (సామె. 27:11; 3 యోహా. 4) సత్యాన్ని ప్రేమించడానికి, దానికి తగ్గట్టు జీవించడానికి ఇవి నిజంగా చాలా మంచి కారణాలు.

మీరెలా జవాబిస్తారు?

  • మనం సత్యాన్ని ఎందుకు ప్రేమిస్తాం?

  • సత్యం మీద ప్రేమను ఎలా పెంచుకోవచ్చు?

  • మనం సత్యాన్ని ప్రేమిస్తున్నామని ఎలా చూపించవచ్చు?

పాట 144 మీ దృష్టి లక్ష్యంపై ఉంచండి!

a సాధారణంగా మన నమ్మకాల్ని, మనం జీవించే విధానాన్ని “సత్యం” అని పిలుస్తూ ఉంటాం. మనం ఈమధ్యే సత్యంలోకి వచ్చినా, లేదా ఎన్నో సంవత్సరాలుగా సత్యంలో ఉన్నా, మనం సత్యాన్ని ఎందుకు ప్రేమిస్తున్నామో సమయం తీసుకుని ఆలోచించడం మంచిది. అలాచేస్తే, యెహోవాను సంతోషపెట్టాలనే మన నిర్ణయం మరింత బలపడుతుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి